కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“దేవుడిచ్చు సర్వాంగకవచమును ధరించుకొనుడి”

“దేవుడిచ్చు సర్వాంగకవచమును ధరించుకొనుడి”

“దేవుడిచ్చు సర్వాంగకవచమును ధరించుకొనుడి”

“మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగకవచమును ధరించుకొనుడి.”​—⁠ఎఫెసీయులు 6:​11.

సా.శ. మొదటి శతాబ్దంలో రోమా పరిపాలన ఉచ్ఛస్థాయిలో ఉంది. అప్పటి ప్రపంచంలోని చాలా భాగం రోమా ఆధీనంలో ఉండడానికి, రోమా సైనిక దళాల బలమే చాలా తోడ్పడింది. ఆ సైనిక దళాన్ని ఒక చరిత్రకారుడు “చరిత్రలో అత్యంత విజయవంతమైన సైనిక వ్యవస్థ” అని వర్ణించాడు. మంచి క్రమశిక్షణ, కఠినమైన శిక్షణ పొందిన సైనికులతో రోమా సైనిక దళం ఏర్పడింది. అయితే వారి విజయం వారు ధరించే కవచం మీద కూడా ఆధారపడి ఉండేది. క్రైస్తవులు అపవాదితో విజయవంతంగా యుద్ధం చేసేందుకు అవసరమైన ఆధ్యాత్మిక కవచాన్ని వివరించడానికి, అపొస్తలుడైన పౌలు రోమా సైనికుని కవచాన్ని ఉపయోగించాడు.

2 ఆ ఆధ్యాత్మిక కవచం గురించిన వర్ణన మనకు ఎఫెసీయులు 6:​14-17లో కనబడుతుంది. పౌలు ఇలా వ్రాశాడు: “మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్తవలననైన సిద్ధమనస్సను జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నియుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి; దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి.” మానవ దృక్కోణం నుండి చూస్తే, పౌలు వర్ణించిన కవచం రోమా సైనికునికి చాలా మట్టుకు రక్షణనిచ్చేది. అయినప్పటికీ, అతను పోరాటంలో ఉపయోగించే ప్రాథమిక ఆయుధంగా ఖడ్గమును చేత పట్టేవాడు.

3 రోమా సైనికుల విజయం వారి ఆయుధాలు, వారికివ్వబడే శిక్షణ పైనేకాక వారు తమ సైన్యాధిపతికి చూపించే విధేయతపైన కూడా ఆధారపడి ఉండేది. అదేవిధంగా క్రైస్తవులు యేసుక్రీస్తుకు విధేయులుగా ఉండాలి, బైబిలు ఆయనను “జనములకు రాజుగాను అధిపతిగాను” వర్ణిస్తోంది. (యెషయా 55:⁠4) ఆయన “సంఘమునకు శిరస్సు” కూడా. (ఎఫెసీయులు 5:​23) యేసు మన ఆధ్యాత్మిక యుద్ధం కోసం సూచనలిచ్చాడు, ఆధ్యాత్మిక కవచాన్ని ఎలా ధరించాలో తెలిపేందుకు చక్కని మాదిరి కూడా ఉంచాడు. (1 పేతురు 2:​21) క్రీస్తులాంటి వ్యక్తిత్వానికి, మనం ధరించాల్సిన ఆధ్యాత్మిక కవచానికి మధ్య చాలా సారూప్యత ఉంది. కాబట్టే, క్రీస్తులాంటి మనస్సును “ఆయుధముగా ధరించుకొనుడి” అని లేఖనాలు మనకు సిఫార్సు చేస్తున్నాయి. (1 పేతురు 4:⁠1) మనం ఆధ్యాత్మిక కవచంలోని ఒక్కో భాగాన్ని విశ్లేషిస్తూ, దాని ప్రాముఖ్యతను, సమర్థతను ప్రదర్శించడానికి యేసు మాదిరిని వినియోగిద్దాం.

నడుము, వక్షస్థలము, పాదములను కాపాడుకోవడం

4నడుమునకు సత్యమను దట్టి. బైబిలు కాలాల్లో సైనికులు 2 నుండి 6 అంగుళాల వెడల్పు ఉండే తోలు పట్టీ లేదా పటకాను ధరించేవారు. కొందరు అనువాదకులు ఆ వచనం ఇలా ఉండాలని సూచిస్తారు: “మీ నడుము చుట్టూ సత్యమును ఒక పటకాలాగ గట్టిగా కట్టుకోండి.” సైనికుని పటకా అతని నడుమును కాపాడుతుంది, కత్తి వేలాడదీయడానికి అనువైన ఆధారంగా కూడా ఉంటుంది. ఒక సైనికుడు పటకాతో తన నడుము బిగించాడంటే, అతను యుద్ధానికి సిద్ధపడుతున్నాడని అర్థం. లేఖనాల్లోని సత్యం మన జీవితాలను ఎంత మేరకు ప్రభావితం చేయాలో వివరించడానికి పౌలు సైనికుని పటకాను ఉపయోగించాడు. అది మన చుట్టూ గట్టిగా చుట్టబడినట్లు ఉండాలి, అప్పుడే మనం సత్యానికి అనుగుణంగా జీవిస్తూ ఏ సందర్భంలోనైనా దాన్ని సమర్థించగలుగుతాం. (కీర్తన 43:⁠3; 1 పేతురు 3:​15) ఆ లక్ష్య సాధనకు, మనం శ్రద్ధగా బైబిలు అధ్యయనం చేయాలి, దానిలోని విషయాలను ధ్యానించాలి. యేసు, దేవుని ధర్మశాస్త్రమును తన “ఆంతర్యములో” ఉంచుకున్నాడు. (కీర్తన 40:⁠8) అందుకే ఆయన, తనను వ్యతిరేకులు ప్రశ్నించినప్పుడు లేఖనాలను జ్ఞప్తికి తెచ్చుకొని వాటిని ఉటంకిస్తూ వారికి జవాబివ్వగలిగాడు.​—⁠మత్తయి 19:​3-6; 22:​23-32.

5 మనల్ని నిర్దేశించడానికి బైబిలు సత్యాన్ని అనుమతించినప్పుడు, అది మనల్ని తప్పుడు తర్కం నుండి కాపాడి, జ్ఞానవంతమైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. శోధన లేక పరీక్షా సమయాల్లో, సరైనది చేయాలనే మన నిర్ణయాన్ని బైబిలు నిర్దేశాలు బలోపేతం చేస్తాయి. మన మహోపదేశకుడైన యెహోవా మన వెనుక నుండి “ఇదే త్రోవ దీనిలో నడువుడి” అని చెబుతున్నట్లు గ్రహిస్తాము.​—⁠యెషయా 30:​20, 21.

6నీతియను మైమరువు. సైనికుడు ధరించే మైమరువు అతి ముఖ్య అవయవమైన గుండెను కాపాడుతుంది. మన సూచనార్థక గుండె అంటే హృదయం చెడు చేయడానికే మొగ్గు చూపుతుంది కాబట్టి దానికి ప్రత్యేక రక్షణ కావాలి. (ఆదికాండము 8:​21) కనుక మనం యెహోవా నీతియుక్తమైన ప్రమాణాలను తెలుసుకొని, వాటిని ప్రేమించాలి. (కీర్తన 119:​97, 105) స్పష్టమైన యెహోవా మార్గనిర్దేశాలను నిర్లక్ష్యం చేసే లేదా నిర్వీర్యం చేసే లౌకిక ఆలోచనను తిరస్కరించేలా, నీతి పట్ల మనకున్న ప్రేమ మనల్ని నడిపిస్తుంది. అంతేకాదు, మనం మంచిని ప్రేమించి చెడును ద్వేషించినప్పుడు, మన జీవితాలను నాశనం చేసే జీవిత విధానాన్ని నిరోధిస్తాము. (కీర్తన 119:​99-101; ఆమోసు 5:​15) ఈ విషయంలో యేసు ఆదర్శప్రాయంగా ఉన్నాడు, అందుకే ఆయన గురించి లేఖనాలు ఇలా చెబుతున్నాయి: “నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి.”​—⁠హెబ్రీయులు 1:⁠9. *

7పాదములకు సమాధాన సువార్తవలననైన సిద్ధమనస్సను జోడు. రోమా సైనికులకు దృఢంగా ఉండే కాలిజోళ్ళు అవసరమయ్యేవి. ఎందుకంటే దండయాత్ర సమయంలో వారు దాదాపు 27 కిలోల బరువుండే కవచాన్ని, ఆయుధాలను ధరించి లేదా వాటిని మోసుకుంటూ ప్రతిరోజు 30 కిలోమీటర్ల దూరం నడిచేవారు. వినే ప్రతి ఒక్కరికి రాజ్య సందేశాన్ని ప్రకటించాలనే మన సంసిద్ధతను సూచించడానికి, పౌలు పాదరక్షలను ఉపయోగించడం సమంజసంగానే ఉంది. ఇది చాలా ప్రాముఖ్యం, ఎందుకంటే మనం ప్రకటించడానికి సిద్ధంగా, సంసిద్ధతతో లేకపోతే ప్రజలు యెహోవా గురించి ఎలా తెలుసుకుంటారు?​—⁠రోమీయులు 10:​13-15.

8 యేసు జీవితంలో అత్యంత ముఖ్యమైన కార్యం ఏమిటి? ఆయన రోమా అధిపతి అయిన పొంతి పిలాతుతో, ‘సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను ఈ లోకమునకు వచ్చితిని’ అని అన్నాడు. వినడానికి ఇష్టపడేవారు తారసపడినప్పుడల్లా యేసు ప్రకటించాడు, ఆయన తన భౌతికావసరాల కంటే తన పరిచర్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేంతగా దాన్ని ఆస్వాదించాడు. (యోహాను 4:​5-34; 18:​37) యేసులాగే మనం కూడా సువార్తను ప్రకటించడానికి సంసిద్ధంగా ఉంటే, దాన్ని ఇతరులతో పంచుకోవడానికి మనకు ఎన్నో అవకాశాలు లభిస్తాయి. అంతేకాక మనం మన పరిచర్యలో ఎక్కువగా లీనమైతే అది, మనం ఆధ్యాత్మికంగా బలంగా ఉండేందుకు తోడ్పడుతుంది.​—⁠అపొస్తలుల కార్యములు 18:⁠5.

డాలు, శిరస్త్రాణము, ఖడ్గము

9విశ్వాసమను డాలు. “డాలు” అని అనువదించబడిన గ్రీకు మూలపదం, శరీరంలో చాలా భాగాన్ని కాపాడగల విశాలమైన డాలును సూచిస్తుంది. అది ఎఫెసీయులు 6:16లో ప్రస్తావించబడిన “అగ్నిబాణముల” నుండి కాపాడుతుంది. బైబిలు కాలాల్లో, సైనికులు గొట్టంలా ఉండే వెదురు కొయ్యలతో చేసిన బాణాలను ఉపయోగించేవారు, అందులో చిన్న ఇనుప రేణువులతోపాటు గంధకమును నింపి విసిరేవారు. ఆ బాణముల గురించి ఒక పండితుడు “ప్రాచీన యుద్ధాల్లో ఉపయోగించిన అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలు” అని వర్ణిస్తున్నాడు. అలాంటి ఆయుధాల నుండి తనను తాను కాపాడుకోవడానికి ఒక సైనికుని వద్ద విశాలమైన డాలు లేనట్లయితే, అతను తీవ్రంగా గాయపడవచ్చు లేదా మరణించవచ్చు కూడా.

10 మన విశ్వాసాన్ని బలహీనపరిచేందుకు సాతాను ఎలాంటి “అగ్నిబాణములను” ఉపయోగిస్తాడు? అతడు మన కుటుంబంలో, ఉద్యోగ స్థలంలో, పాఠశాలలో హింసను లేదా వ్యతిరేకతను తీసుకురావచ్చు. భౌతిక సంపదలపై అత్యాశ, అనైతికతా ప్రలోభం వంటివి కూడా కొందరి విషయంలో ఆధ్యాత్మిక క్షీణతకు దారి తీశాయి. అలాంటి ప్రమాదాల నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే, అన్నింటికంటే ముఖ్యంగా ‘విశ్వాసమను డాలు పట్టుకోవాలి.’ యెహోవా గురించి తెలుసుకోవడం ద్వారా, ప్రార్థనలో ఆయనతో క్రమంగా సంభాషించడం ద్వారా, ఆయన మనల్ని ఎలా కాపాడతాడో ఎలా ఆశీర్వదిస్తాడో గ్రహించడం ద్వారా విశ్వాసం కలుగుతుంది.​—⁠యెహోషువ 23:​14; లూకా 17:⁠5; రోమీయులు 10:​17.

11 యేసు భూమ్మీద ఉన్నప్పుడు, కష్ట సమయాల్లో ప్రగాఢ విశ్వాసంతో ఉండడం ప్రాముఖ్యం అని చూపించాడు. ఆయన తన తండ్రి నిర్ణయాలపై సంపూర్ణ నమ్మకం ఉంచాడు, దేవుని చిత్తం చేయడానికి ఎంతో ఆనందించాడు. (మత్తయి 26:​42, 53, 54; యోహాను 6:​38) చివరకు గెత్సేమనే తోటలో తీవ్రమైన దుఃఖంలో ఉన్నప్పుడు కూడా, యేసు తన తండ్రితో ఇలా అన్నాడు: “నా యిష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము.” (మత్తయి 26:​39) యేసు తన యథార్థతను కాపాడుకోవడాన్ని, తన తండ్రిని సంతోషపరచడాన్ని అన్ని సమయాల్లో ప్రాముఖ్యమైనదిగా భావించాడు. (సామెతలు 27:​11) యెహోవాపై మనకూ అలాంటి ప్రగాఢ విశ్వాసమే ఉంటే, విమర్శ లేక వ్యతిరేకత వల్ల మన విశ్వాసాన్ని బలహీనపడనీయము. దానికి బదులుగా, మనం దేవుని మీద ఆధారపడి, ఆయనను ప్రేమిస్తూ, ఆయన ఆజ్ఞలను పాటిస్తుంటే మన విశ్వాసం బలపడుతుంది. (కీర్తన 19:​7-11; 1 యోహాను 5:⁠3) యెహోవా తనను ప్రేమించేవారి కోసం ఉంచిన ఆశీర్వాదాలతో, ఎలాంటి భౌతికపరమైన ప్రతిఫలాలు గానీ క్షణికమైన భోగేఛ్చ గానీ సరితూగలేవు.​—⁠సామెతలు 10:​22.

12రక్షణయను శిరస్త్రాణము. శిరస్త్రాణము సైనికుని మేధకు నిలయమైన తలను, మెదడును కాపాడేది. మన క్రైస్తవ నిరీక్షణ మన మనస్సును కాపాడుతుంది కాబట్టి అది శిరస్త్రాణముతో పోల్చబడింది. (1 థెస్సలొనీకయులు 5:⁠8) మన మనస్సును దేవుని వాక్య పరిజ్ఞానంతో నింపుకున్నప్పటికీ మనం ఇంకా బలహీనులమే, అపరిపూర్ణ మానవులమే. మన మనస్సు సులభంగా కలుషితం కాగలదు. ఈ విధానపు లక్ష్యాలు మనల్ని దారి మళ్లించవచ్చు లేదా దేవుడిచ్చిన నిరీక్షణ స్థానాన్ని ఆక్రమించుకోవచ్చు. (రోమీయులు 7:​18; 12:⁠2) అపవాది యేసుకు “లోకరాజ్యములన్నిటిని, వాటి మహిమను” ఇవ్వజూపి ఆయనను తప్పుదారి పట్టించేందుకు విఫలయత్నం చేశాడు. (మత్తయి 4:⁠8) అయినా యేసు వాటిని స్థిరంగా నిరాకరించాడు, పౌలు ఆయన గురించి ఇలా అన్నాడు: “ఆయన [యేసు] తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడిపార్శ్వమున ఆసీనుడైయున్నాడు.”​—⁠హెబ్రీయులు 12:⁠1, 2.

13 యేసుకు ఉన్నటువంటి ప్రగాఢ విశ్వాసం యాదృచ్ఛికంగా వచ్చేదికాదు. మనం మన మనస్సును భావి నిరీక్షణపై పెట్టకుండా, దాన్ని ఈ విధానపు కలలతో, లక్ష్యాలతో నింపుకుంటే, దేవుని వాగ్దానాలపై మనకున్న విశ్వాసం బలహీనమవుతుంది. చివరకు మనం మన నిరీక్షణను పూర్తిగా కోల్పోవచ్చు కూడా. అలా కాకుండా, మనం దేవుని వాగ్దానాలను క్రమంగా ధ్యానించినట్లయితే మన ఎదుట ఉన్న నిరీక్షణలో ఎల్లప్పుడూ సంతోషిస్తాం.​—⁠రోమీయులు 12:​12.

14ఆత్మ ఖడ్గము. బైబిల్లో వ్రాయబడిన దేవుని వాక్యం లేక సందేశం రెండంచులుగల బలమైన ఖడ్గముకంటే వాడియైనది, అది మతపరమైన అబద్ధాన్ని ఖండించి యథార్థ హృదయులు ఆధ్యాత్మిక స్వేచ్ఛ పొందేందుకు సహాయపడుతుంది. (యోహాను 8:32; హెబ్రీయులు 4:​12) ఈ ఆధ్యాత్మిక ఖడ్గము, శోధనల నుండి లేక మన విశ్వాసాన్ని నాశనం చేసే మతభ్రష్టుల దాడుల నుండి కూడా మనల్ని కాపాడుతుంది. (2 కొరింథీయులు 10:​4, 5) ‘ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు ప్రతిలేఖనము దైవావేశమువలన కలిగినందుకు’ మనమెంత కృతజ్ఞులమో కదా!​—⁠2 తిమోతి 3:​16, 17.

15 యేసు అరణ్యములో సాతాను చేత శోధించబడినప్పుడు తప్పుడు తర్కాన్ని, మోసపూరితమైన శోధనలను అడ్డుకునేందుకు ఆత్మ ఖడ్గమును సమర్థంగా ఉపయోగించాడు. సాతాను చేసిన ప్రతి సవాలుకు, “వ్రాయబడియున్నది” అంటూ ఆయన జవాబిచ్చాడు. (మత్తయి 4:​1-11) స్పెయిన్‌లోని యెహోవాసాక్షుల్లో ఒకరైన డేవిడ్‌ కూడా శోధనను అధిగమించడానికి లేఖనాలు తనకు సహాయపడ్డాయని తెలుసుకున్నాడు. ఆయనకు 19 ఏండ్లున్నప్పుడు, ఆయన పని చేస్తున్న క్లీనింగ్‌ కంపెనీలోనే పని చేస్తున్న అందమైన ఒక అమ్మాయి “సరదాగా గడుపుదాం” అని ఆహ్వానించింది. డేవిడ్‌ ఆమె ప్రతిపాదనలను నిరాకరించి, అటువంటి పరిస్థితి మళ్ళీ ఎదురు కాకుండా ఉండేందుకు, ఆయన తన పని స్థలాన్ని మార్చమని సూపర్‌వైజర్‌ను కోరాడు. డేవిడ్‌ ఇలా చెబుతున్నాడు: “నేను యోసేపు ఉదాహరణను గుర్తు చేసుకున్నాను. ఆయన అనైతికతను తిరస్కరించి, వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నేనూ అలాగే చేశాను.”​—⁠ఆదికాండము 39:​10-12.

16 యేసు, సాతాను ఆధీనంలో నుండి ఇతరులు తప్పించుకోవడానికి సహాయం చేసేందుకు కూడా ఆత్మ ఖడ్గమును ఉపయోగించాడు. “నేను చేయు బోధ నాది కాదు; నన్ను పంపినవానిదే” అని యేసు అన్నాడు. (యోహాను 7:​16) సమర్థవంతమైన యేసు బోధను అనుకరించాలంటే మనకు శిక్షణ అవసరం. రోమా సైనికుల గురించి యూదా చరిత్రకారుడైన జోసీఫస్‌ ఇలా వ్రాశాడు: “సైనికులందరు ప్రతి రోజు అభ్యాసం చేసేవారు, నిజంగా యుద్ధం చేస్తున్నట్లే చాలా కష్టపడి చేసేవారు, అందుకే వారు యుద్ధం వల్ల కలిగే అలసటను సునాయాసంగా తట్టుకోగలిగేవారు.” మనం మన ఆధ్యాత్మిక యుద్ధంలో బైబిల్ని ఉపయోగించాల్సిన అవసరముంది. అంతేకాదు మనం ‘దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను మనల్ని మనం దేవునికి కనుపరచుకొనుటకు జాగ్రత్తపడాలి.’ (2 తిమోతి 2:​15) ఆసక్తి గల ఒక వ్యక్తి అడిగే యథార్థమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి లేఖనాలను ఉపయోగించినప్పుడు మనకు ఎంతో సంతృప్తి కలుగుతుంది.

ప్రతి సందర్భంలో ప్రార్థించండి

17 పౌలు సర్వాంగ ఆధ్యాత్మిక కవచము గురించి చర్చించిన తర్వాత, మరో ముఖ్యమైన సలహాను చేరుస్తున్నాడు. సాతానును నిరోధించేటప్పుడు క్రైస్తవులు “ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను” చేయాలి. ఎంత తరచుగా చేయాలి? “ఆత్మవలన ప్రతి సమయమునందు” అని పౌలు వ్రాశాడు. (ఎఫెసీయులు 6:​18) మనం శోధనలను, పరీక్షలను లేదా నిరుత్సాహాన్ని ఎదుర్కొన్నప్పుడు, ప్రార్థన మనకు ఎంతో బలాన్ని ఇస్తుంది. (మత్తయి 26:​41) యేసు “మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి, భయభక్తులు కలిగి యున్నందున ఆయన అంగీకరింపబడెను.”​—⁠హెబ్రీయులు 5:⁠7.

18 తీవ్ర అనారోగ్యంతో ఉన్న తన భర్తను 15 ఏండ్లకు పైగా శ్రద్ధగా చూసుకున్న మిలాగ్రోస్‌ ఇలా అంటోంది: “నాకు నిరుత్సాహంగా అనిపించినప్పుడు, నేను యెహోవాకు ప్రార్థిస్తాను. ఆయనకంటే ఎక్కువగా నాకు ఎవ్వరూ సహాయం చేయలేరు. ఇక నేను ఏమాత్రం భరించలేను అని అనిపించే కొన్ని సందర్భాలు కూడా వచ్చాయి. కానీ పదే పదే యెహోవాకు ప్రార్థించిన తర్వాత, నూతన శక్తి పొందినట్లుగా నా మనస్సు ఉత్తేజం పొందినట్లుగా అనిపించేది.”

19 తనకింకా కొద్దికాలమే ఉందని అపవాదికి తెలుసు, అందుకే మనల్ని జయించడానికి తన ప్రయత్నాలను తీవ్రతరం చేస్తున్నాడు. (ప్రకటన 12:​12, 17) బలవంతుడైన ఈ శత్రువును మనం ఎదిరించాలి, “విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడాలి.” (1 తిమోతి 6:​12) అందుకు మనకు మామూలు బలంకంటే గొప్ప బలం కావాలి. (2 కొరింథీయులు 4:⁠7) మనకు దేవుని పరిశుద్ధాత్మ సహాయం కూడా కావాలి, కాబట్టి దాని కోసం మనం ప్రార్థించాలి. యేసు ఇలా అన్నాడు: ‘మీరు చెడ్డవారైయుండియు, మీ పిల్లలకు మంచి యీవులనియ్య నెరిగియుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును.’​—⁠లూకా 11:​13.

20 దీన్నిబట్టి, యెహోవా అందించే సర్వాంగ కవచాన్ని మనం ధరించడం చాలా ప్రాముఖ్యమన్నది స్పష్టమవుతోంది. ఈ ఆధ్యాత్మిక కవచాన్ని ధరించాలంటే మనం విశ్వాసం, నీతి వంటి దైవిక లక్షణాలను వృద్ధి చేసుకోవాలి. అందుకు మనం సత్యాన్ని మన నడుము చుట్టూ చుట్టుకొన్నట్లుగా దాన్ని ప్రేమించాలి, ప్రతి సందర్భంలో సువార్తను వ్యాపింపజేయడానికి సిద్ధంగా ఉండాలి, భావి నిరీక్షణను మనస్సులో ఉంచుకోవాలి. ఆత్మ ఖడ్గమును సమర్థవంతంగా ఉపయోగించడం నేర్చుకోవాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించడం ద్వారా, మనం దురాత్మలతో చేసే పోరాటంలో గెలుపొందగలము, తద్వారా యెహోవా పవిత్ర నామానికి మహిమను తేగలము.​—⁠రోమీయులు 8:​37-39.

[అధస్సూచి]

^ పేరా 9 యెషయా ప్రవచనంలో, యెహోవా ‘నీతిని కవచముగా ధరించుకున్నట్లు’ వర్ణించబడ్డాడు. అందుకే సంఘ పైవిచారణకర్తలు న్యాయాన్ని పాటిస్తూ, నీతియుక్తంగా ప్రవర్తించాలని ఆయన కోరుతున్నాడు.​—⁠యెషయా 59:​14, 15, 17.

మీరు ఏమని జవాబిస్తారు?

ఆధ్యాత్మిక కవచాన్ని ధరించడంలో చక్కని ఉదాహరణగా ఎవరున్నారు, మనం ఆయన ఉదాహరణను జాగ్రత్తగా ఎందుకు పరిశీలించాలి?

మనం మన మనస్సును, సూచనార్థక హృదయాన్ని ఎలా కాపాడుకోవచ్చు?

ఆత్మ ఖడ్గమును ఉపయోగించడంలో మనం నైపుణ్యతను ఎలా సంపాదించుకోవచ్చు?

మనం ప్రతి సందర్భంలో ఎందుకు ప్రార్థన చేయాలి?

[అధ్యయన ప్రశ్నలు]

1,2.క్రైస్తవులు ధరించవలసిన ఆధ్యాత్మిక కవచాన్ని మీ సొంత మాటల్లో వర్ణించండి.

3.మనం యేసుక్రీస్తు సూచనలకు విధేయులుగా ఎందుకు ఉండాలి, ఆయన మాదిరిని ఎందుకు అనుసరించాలి?

4.సైనికుని కవచంలోని పటకా ఎలా ఉపయోగపడుతుంది, అది దేన్ని సూచిస్తోంది?

5.పరీక్ష లేక శోధన సమయాల్లో లేఖనాల సలహా ఎలా సహాయపడగలదో వివరించండి.

6.మన సూచనార్థక హృదయానికి రక్షణ ఎందుకు అవసరం, దాన్ని నీతి సమర్థవంతంగా ఎలా కాపాడగలదు?

7.ఒక రోమా సైనికునికి మంచి పాదరక్షలు ఎందుకు అవసరం, అవి దేన్ని సూచిస్తున్నాయి?

8.సువార్త ప్రకటించేవారిగా మనం యేసు మాదిరిని ఎలా అనుకరించవచ్చు?

9.రోమా సైనికునికి డాలు ఎలాంటి రక్షణనిచ్చేది?

10,11.(ఎ)సాతాను ఉపయోగించే ఎలాంటి “అగ్నిబాణములు” మన విశ్వాసాన్ని బలహీనపరచవచ్చు? (బి) కష్ట సమయాల్లో ప్రగాఢ విశ్వాసంతో ఉండడం ప్రాముఖ్యమని యేసు మాదిరి ఎలా చూపిస్తోంది?

12.సూచనార్థక శిరస్త్రాణము మనలోని ఏ ప్రాముఖ్యమైన భాగాన్ని కాపాడుతుంది, అలాంటి రక్షణ ఎందుకు ఆవశ్యకం?

13.మన భావి నిరీక్షణపై మనకున్న ప్రగాఢ విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవచ్చు?

14,15.(ఎ)మన సూచనార్థక ఖడ్గము ఏమిటి, దాన్ని ఎలా ఉపయోగించవచ్చు? (బి) శోధనలను అడ్డుకునేందుకు ఆత్మ ఖడ్గము మనకు ఎలా సహాయపడుతుందో వివరించండి.

16.‘సత్యవాక్యమును సరిగా ఉపదేశించడానికి’ మనకు శిక్షణ ఎందుకు అవసరమో వివరించండి.

17,18.(ఎ)సాతానును నిరోధించడంలో ప్రార్థన ఎలాంటి పాత్ర వహిస్తుంది? (బి) ప్రార్థన విలువను స్పష్టం చేసేందుకు ఒక ఉదాహరణ ఇవ్వండి.

19,20.సాతానుతో చేసే పోరాటంలో మనం విజయం సాధించాలంటే మనకు కావలసిందేమిటి?

[17వ పేజీలోని చిత్రాలు]

కృషితో కూడిన బైబిలు అధ్యయనం, మనం ప్రతి సందర్భంలో సువార్తను ప్రకటించేలా మనల్ని పురికొల్పగలదు

[18వ పేజీలోని చిత్రాలు]

మన ఖచ్చితమైన నిరీక్షణ మనం పరీక్షలను ఎదుర్కొనేందుకు సహాయపడుతుంది

[19వ పేజీలోని చిత్రాలు]

మీరు పరిచర్యలో “ఆత్మ ఖడ్గమును” ఉపయోగిస్తారా?