కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ద్వితీయోపదేశకాండము నుండి ముఖ్యాంశాలు

ద్వితీయోపదేశకాండము నుండి ముఖ్యాంశాలు

యెహోవా వాక్యము సజీవమైనది

ద్వితీయోపదేశకాండము నుండి ముఖ్యాంశాలు

అది సా.శ.పూ. 1473వ సంవత్సరం. యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల చేసి అప్పటికి నలభై సంవత్సరాలు గడిచాయి. ఆ సంవత్సరాలన్నింటినీ అరణ్యంలోనే గడిపిన ఇశ్రాయేలీయులు ఇంకా స్వంత దేశములేని జనాంగంగానే ఉన్నారు. అయితే చివరకు వాళ్ళు వాగ్దాన దేశపు సరిహద్దుకు చేరుకున్నారు. దాన్ని స్వాధీనం చేసుకునేటప్పుడు వాళ్ళకు ఏమి జరగబోతోంది? వాళ్ళకు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి, వాళ్ళు ఆ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి?

ఇశ్రాయేలీయులు యొర్దాను నది దాటి కనాను దేశంలోకి ప్రవేశించే ముందు మోషే వాళ్ళను తమ ఎదుట ఉన్న ఆ గొప్ప పనికి సిద్ధం చేశాడు. ఎలా? ప్రోత్సహించే, బోధించే, ఆదేశించే, హెచ్చరించే కొన్ని ప్రసంగాలు ఇవ్వడం ద్వారా ఆయన వాళ్ళను సిద్ధం చేశాడు. యెహోవా దేవుడు అవిభాగిత భక్తికి అర్హుడని, వాళ్ళు తమ చుట్టూవున్న దేశ ప్రజల మార్గాలను అనుకరించకూడదని ఆయన ఇశ్రాయేలీయులకు గుర్తుచేశాడు. బైబిలు పుస్తకమైన ద్వితీయోపదేశకాండములోని ముఖ్య భాగం మోషే ఇచ్చిన ప్రసంగాలే. వాటిలో ఇవ్వబడిన ఉపదేశం నేడు మనకు ఎంతో అవసరం. ఎందుకంటే మనం కూడా యెహోవాకు అవిభాగిత భక్తి చూపించడాన్ని కష్టతరం చేసే లోకంలో జీవిస్తున్నాము.​—⁠హెబ్రీయులు 4:12.

ద్వితీయోపదేశకాండములోని ఆఖరి అధ్యాయం తప్ప మిగతా భాగాన్నంతా మోషే వ్రాశాడు, ఆ పుస్తకం రెండు నెలల కంటే కాస్త ఎక్కువ సమయంలో జరిగిన విషయాలను చెబుతోంది. * (ద్వితీయోపదేశకాండము 1:3; యెహోషువ 4:​19) ఆ పుస్తకంలో చెప్పబడిన విషయాలు, మనం యెహోవా దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించి ఆయనకు నమ్మకంగా సేవ చేయడానికి ఎలా సహాయం చేయగలవో మనం ఇప్పుడు చూద్దాము.

‘మీరు కన్నులార చూసినవాటిని మరచిపోకండి’

(ద్వితీయోపదేశకాండము 1:1-4:49)

మొదటి ప్రసంగంలో మోషే అరణ్యంలో జరిగిన సంఘటనల్లో కొన్నింటిని వివరంగా చెప్పాడు. ప్రత్యేకించి వాగ్దాన దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇశ్రాయేలీయులను సిద్ధం చేసేందుకు సహాయపడే విషయాలను ఆయన చెప్పాడు. యెహోవా తన ప్రజలకు ప్రేమపూర్వకమైన శ్రద్ధ లభించేలా వారిని వ్యవస్థీకరిస్తాడని, న్యాయాధిపతులను నియమించడానికి సంబంధించిన వృత్తాంతం వారికి గుర్తు చేసివుండవచ్చు. పదిమంది వేగులవారు తెచ్చిన చెడ్డ నివేదిక వల్ల తమ ముందు తరంవారు వాగ్దాన దేశంలోకి ప్రవేశించలేకపోయిన విషయం కూడా మోషే వివరించాడు. వాగ్దాన దేశం కళ్ళెదుట ఉండగా మోషే మాటలను విన్నవారిపై ఆ హెచ్చరికా మాదిరులు ఎంతగా ప్రభావం చూపి ఉంటాయో ఆలోచించండి.

యొర్దాను దాటక ముందు యెహోవా ఇశ్రాయేలు కుమారులకు ఇచ్చిన విజయాలను గుర్తు చేసుకోవడం, నది అవతల ఉన్న దేశాన్ని ఆక్రమించుకోవడానికి సిద్ధంగా ఉన్న ఆ ప్రజలను ధైర్యంతో నింపి ఉంటుంది. వాళ్ళు ఆక్రమించుకోబోయే దేశం విగ్రహారాధనతో నిండిపోయివుంది. విగ్రహారాధన విషయంలో మోషే ఖచ్చితమైన హెచ్చరిక ఇవ్వడం ఎంత సముచితమో కదా!

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

2:4-6, 9, 19, 24, 31-35; 3:1-6​—⁠ఇశ్రాయేలీయులు యొర్దాను నదికి తూర్పువైపున ఉన్న కొన్ని జనాంగాలను నాశనం చేసి, కొన్నింటిని ఎందుకు నాశనం చేయలేదు? ఏశావు కుమారులతో కలహం పెట్టుకోవద్దని యెహోవా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించాడు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు యాకోబు సహోదరుని కుమారులు. ఇశ్రాయేలీయులు మోయాబీయులను, అమ్మోనీయులను బాధించకూడదు, వాళ్ళతో యుద్ధం చేయకూడదు ఎందుకంటే వాళ్ళు అబ్రాహాము సహోదరుని కుమారుడైన లోతు వంశానికి చెందినవారు. అయితే అమోరీయుల రాజులైన సీహోనుకు గానీ ఓగుకు గానీ ఇశ్రాయేలుతో సంబంధం లేదు కాబట్టి వాళ్ళు పరిపాలిస్తున్న దేశంపై నిజానికి వాళ్ళకు ఎలాంటి హక్కు లేదు. ఇశ్రాయేలీయులు తన దేశంగుండా వెళ్ళడానికి అనుమతించేందుకు సీహోను నిరాకరించినప్పుడు, ఓగు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ పట్టణాలను నాశనం చేసి ఎవ్వరినీ ప్రాణాలతో వదలవద్దని యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు.

4:15-20, 23, 24​—⁠ప్రతిమలు చేసుకోవద్దని ఇవ్వబడిన ఆజ్ఞ, కళాత్మకమైన అలంకరణ వస్తువులుగా ఉంచుకోవడానికి కూడా ప్రతిమలను చేసుకోవద్దని సూచిస్తోందా? లేదు. ఆ ఆజ్ఞ ఆరాధన కోసం ప్రతిమలు చేసుకోవడానికి, ‘విగ్రహాలకు నమస్కరించి వాటిని పూజించడానికి’ విరుద్ధంగా ఇవ్వబడింది. కళాత్మకమైన అలంకరణ వస్తువులుగా పెట్టుకోవడానికి ప్రతిమలు చేసుకోవడాన్ని గానీ చిత్రాలు చేసుకోవడాన్ని గానీ లేఖనాలు నిషేధించడం లేదు.​—⁠1 రాజులు 7:18, 25.

మనకు పాఠాలు:

1:​2, 19. కాదేషు బర్నేయకు వెళ్ళడానికి ‘హోరేబునుండి [సీనాయి పర్వతం చుట్టూవున్న కొండ ప్రాంతం, ఈ ప్రాంతంలోనే పది ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి] శేయీరు మన్నెపు మార్గముగుండా పదకొండు దినముల ప్రయాణమే’ అయినా ఇశ్రాయేలు కుమారులు అరణ్య ప్రాంతంలో దాదాపు 38 సంవత్సరాలపాటు సంచరించారు. యెహోవా దేవునికి అవిధేయులైనందుకు ఎంతటి ఘోరమైన పర్యవసానాలు అనుభవించాల్సి వచ్చిందో కదా!​—⁠సంఖ్యాకాండము 14:26-34.

1:​16, 17. యెహోవా తీర్పు తీర్చే ప్రమాణాలు మారలేదు. న్యాయనిర్ణయ కమిటీలో పనిచేసే బాధ్యత ఇవ్వబడినవారు పక్షపాతం వల్ల లేదా మనుష్య భయం వల్ల తమ నిర్ణయం ప్రభావితం కాకుండా చూసుకోవాలి.

4:⁠9. ఇశ్రాయేలీయులు విజయం సాధించాలంటే వాళ్ళు ‘కన్నులార చూసినవాటిని మరచిపోకుండా’ ఉండడం ఆవశ్యకం. వాగ్దానం చేయబడిన నూతనలోకం సమీపిస్తుండగా మనం యెహోవా వాక్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేస్తూ ఆయన అద్భుత కార్యాలపై దృష్టి నిలపడం ఆవశ్యకం.

యెహోవాను ప్రేమించండి, ఆయన ఆజ్ఞలకు విధేయులవ్వండి

(ద్వితీయోపదేశకాండము 5:1-26:19)

రెండవ ప్రసంగంలో మోషే, సీనాయి పర్వతం వద్ద ధర్మశాస్త్రం ఇవ్వబడడం గురించి చెప్పి పది ఆజ్ఞలను మళ్ళీ చెప్పాడు. ఏడు జనాంగాలు పూర్తిగా నాశనం చేయబడాలని స్పష్టంగా చెప్పబడింది. ఇశ్రాయేలీయులు అరణ్యంలో నేర్చుకున్న ప్రాముఖ్యమైన పాఠం వాళ్ళకు గుర్తు చేయబడింది: “ఆహారమువలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతిమాట వలన నరులు బ్రదుకుదురు.” వాళ్ళు అప్పుడున్న పరిస్థితుల్లో, దేవుడు ‘ఆజ్ఞాపించిన ఆజ్ఞలనన్నిటిని గైకొనాలి.’​—⁠ద్వితీయోపదేశకాండము 8:3; 11:​8, 9.

ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలో నివాసం ఏర్పరచుకునే సమయంలో వాళ్ళకు ఆరాధనకు సంబంధించే కాక తీర్పుకు, ప్రభుత్వానికి, యుద్ధానికి, దైనందిన సామాజిక జీవితానికి, వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా నియమాలు అవసరమవుతాయి. కాబట్టి మోషే ఆ నియమాలను సమీక్షించి, యెహోవాను ప్రేమించి ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించవలసిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

8:​3, 4​—⁠అరణ్య ప్రాంతంలో ప్రయాణించేటప్పుడు ఏ విధంగా ఇశ్రాయేలీయుల బట్టలు పాతగిలలేదు, ఏ విధంగా వాళ్ళ కాళ్ళు వాయలేదు? దేవుడు ప్రతిరోజు మన్నా కురిపించినట్లే ఇది కూడా ఒక అద్భుతమే. ఇశ్రాయేలీయులు తమ ప్రయాణం ప్రారంభించినప్పుడు వేసుకున్న బట్టలను, చెప్పులను ప్రయాణం ముగిసే వరకూ వాడారు. పిల్లలు పెరిగినప్పుడు, పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళు బహుశా ఆ బట్టలను చెప్పులను ఇతరులకు ఇచ్చివుండవచ్చు. మొదట్లో తీసుకోబడిన జనాభా లెక్క, ప్రయాణం ముగిసిన తర్వాత తీసుకోబడిన జనాభా లెక్క ఇశ్రాయేలీయుల సంఖ్య పెరగలేదని చూపించాయి కాబట్టి, మొదట్లో వాళ్ళ దగ్గర ఉండిన బట్టలు, చెప్పులు చివరి వరకు సరిపోయి ఉంటాయి.​—⁠సంఖ్యాకాండము 2:32; 26:51.

14:​21​—⁠ఇశ్రాయేలీయులు రక్తం కార్చబడని చనిపోయిన జంతువును తాము తినకపోయినప్పటికీ, పరదేశికి ఎందుకు ఇవ్వవచ్చు లేదా అన్యునికి ఎందుకు అమ్మవచ్చు? బైబిలులో “పరదేశి” అనే పదం, యూదామత ప్రవిష్టులను లేదా యెహోవా ఆరాధకులు కాకుండానే ఇశ్రాయేలీయులు అనుసరించే ప్రాథమిక నియమాలకు కట్టుబడి ఉండే వ్యక్తులను సూచించవచ్చు. అన్యులు మరియు యూదామత ప్రవిష్టులు కాని పరదేశులు ధర్మశాస్త్రం క్రింద లేరు కాబట్టి వాళ్ళు రక్తం కార్చబడని చనిపోయిన జంతువులను వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి అలాంటి జంతువులను వాళ్ళకు ఇచ్చేందుకు లేదా అమ్మేందుకు ఇశ్రాయేలీయులు అనుమతించబడ్డారు. అయితే మరో వైపున యూదామత ప్రవిష్టులు ధర్మశాస్త్ర నిబంధనకు కట్టుబడి ఉండాలి. లేవీయకాండము 17:10లో సూచించబడినట్లు వాళ్ళు జంతువుల రక్తం తినకూడదు.

24:6—“తిరుగటినైనను తిరగటిమీద దిమ్మనైనను” తాకట్టు పట్టడం, “జీవనాధారమును” తాకట్టు పట్టినట్లే అని ఎందుకు చెప్పబడింది? ఎందుకంటే తిరుగలి, తిరుగటిమీదదిమ్మ ఒక వ్యక్తి “జీవనాధారము”ను అంటే ఆయన జీవిత కనీసావసరాలను తీర్చుకోవడానికి తోడ్పడే సాధనాలను సూచిస్తాయి. ఈ రెండింటిలో దేన్ని తాకట్టు పట్టినా ఆ వ్యక్తి కుటుంబమంతటికీ అనుదినాహారం లేకుండా పోతుంది.

25:​9​—⁠దేవరధర్మము చేయడానికి నిరాకరించిన వ్యక్తి కాలినుండి చెప్పు ఊడదీసి అతని ముఖము ఎదుట ఉమ్మివేయడం దేన్ని సూచిస్తోంది? “ఇశ్రాయేలీయులలో బంధు ధర్మమునుగూర్చి . . . పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా, ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువాని కిచ్చుటయే.” (రూతు 4:⁠7) కాబట్టి దేవర ధర్మము చేయడానికి నిరాకరించిన వ్యక్తి కాలినుండి చెప్పు తీయడం, అతను చనిపోయిన తన సహోదరుని కోసం సంతానం కలుగజేసే తన స్థానాన్నీ తన హక్కునూ వదులుకున్నాడని ధృవీకరిస్తుంది. అతను అలా నిరాకరించడం సిగ్గుకరమైన విషయం. (ద్వితీయోపదేశకాండము 25:​10) అతని ముఖం ఎదుట ఉమ్మివేయడం అతన్ని అవమానపరచడానికి చేయబడే పని.​—⁠సంఖ్యాకాండము 12:14.

మనకు పాఠాలు:

6:​6-9. ధర్మశాస్త్రాన్ని తెలుసుకొని ఉండాలి అని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించబడింది కాబట్టి మనం కూడా దేవుని ఆజ్ఞలను తెలుసుకొని ఉండాలి, వాటిని ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండాలి, మన పిల్లలకు వాటిని నేర్పించాలి. మనం ‘సూచనగా వాటిని మన చేతికి కట్టుకోవాలి’ అంటే మన చేతుల ద్వారా సూచించబడే మన కార్యాలు మనం యెహోవాకు విధేయులుగా ఉన్నామని చూపించాలి. మన విధేయత ‘కన్నుల నడుమ బాసికమువలె’ అందరికీ కనిపించేలా ఉండాలి.

6:⁠16. ఇశ్రాయేలీయులు మస్సా వద్ద నీళ్ళు లేనందుకు సణుగుతూ విశ్వాసరహితంగా యెహోవాను శోధించినట్టు మనం ఎన్నడూ యెహోవాను శోధించకుండా ఉందాము.​—⁠నిర్గమకాండము 17:1-7.

8:​11-18. ఐశ్వర్యాసక్తి మనం యెహోవాను మరచిపోయేలా చేయగలదు.

9:​4-6. మనం స్వనీతిపరులుగా కాకుండా జాగ్రత్తగా ఉండాలి.

13:⁠6. మనల్ని యెహోవా ఆరాధననుండి దూరం చేయడానికి మనం ఎవ్వరినీ అనుమతించకూడదు.

14:⁠1. స్వయంగా శరీరాన్ని గాయపరచుకోవడం మానవ శరీరం పట్ల అగౌరవాన్ని చూపిస్తుంది, అది అబద్ధ మతంతో కూడా సంబంధం కలిగివుండవచ్చు కాబట్టి మనం దానికి దూరంగా ఉండాలి. (1 రాజులు 18:​25-28) మనకు పునరుత్థాన నిరీక్షణ ఉంది కాబట్టి చనిపోయినవారి గురించి ఇలా విపరీతంగా దుఃఖించడం సముచితం కాదు.

20:​5-7; 24:⁠5. మీరు చేస్తున్న పని ప్రాముఖ్యమైనదే అయినా ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నవారి పరిస్థితిని అర్థం చేసుకోవాలి.

22:​23-27. ఒక స్త్రీపై అత్యాచార ప్రయత్నం జరిగినప్పుడు ఆమె తనను తాను రక్షించుకోవడానికి చేయగల ఉత్తమమైన పని అరవడమే.

“జీవమును కోరుకొనుడి”

(ద్వితీయోపదేశకాండము 27:1-34:12)

మోషే తన మూడవ ప్రసంగంలో, ఇశ్రాయేలీయులు యొర్దాను నదిని దాటిన తర్వాత పెద్ద రాళ్ళపై ధర్మశాస్త్ర వాక్యాలను వ్రాయాలని, అలాగే అవిధేయులైన వారి కోసం శాపవచనములను మరియు విధేయులైన వారి కోసం దీవెన వచనములను పలకాలని చెప్పాడు. నాలుగవ ప్రసంగాన్ని ఆయన యెహోవాకు ఇశ్రాయేలుకు మధ్యవున్న నిబంధనను పునరుచ్ఛరించడం ద్వారా ప్రారంభించాడు. మోషే మళ్ళీ ప్రజలను అవిధేయులు కాకుండా ఉండమని హెచ్చరించి “జీవమును కోరుకొనుడి” అని ప్రోత్సహించాడు.​—⁠ద్వితీయోపదేశకాండము 30:19.

ఈ నాలుగు ప్రసంగాలు ఇవ్వడంతోపాటు మోషే నాయకత్వంలో వచ్చిన మార్పు గురించి చర్చించి, యెహోవాను స్తుతిస్తూ అవిశ్వాసం వల్ల కలిగే పర్యవసానాల గురించి హెచ్చరించే ఒక చక్కని పాటను ఇశ్రాయేలీయులకు నేర్పించాడు. గోత్రాలను ఆశీర్వదించిన తర్వాత, 120 సంవత్సరాల వయసులో మోషే చనిపోయి పాతిపెట్టబడ్డాడు. దుఃఖించే సమయం 30 రోజులపాటు కొనసాగింది. ద్వితీయోపదేశకాండములో చెప్పబడిన సంఘటనలు జరిగిన కాలంలోని దాదాపు సగభాగం అంటే 30 రోజులపాటు వారు దుఃఖించారు.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

32:​13, 14​—⁠ఇశ్రాయేలీయులకు క్రొవ్వు తినకూడదని ఆజ్ఞాపించబడింది కాబట్టి, వారు “గొఱ్ఱెపిల్లల క్రొవ్వు” తినడం అంటే అర్థమేమిటి? ఈ పదం ఇక్కడ సూచనార్థకంగా ఉపయోగించబడింది, అది మందలోని అత్యుత్తమమైన జంతువులను సూచిస్తోంది.

33:​1-29​—⁠మోషే ఇశ్రాయేలు కుమారులను ఆశీర్వదించినప్పుడు షిమ్యోను పేరు ఎందుకు ప్రస్తావించలేదు? ఎందుకంటే షిమ్యోను మరియు లేవీ ‘కఠినంగా’ ప్రవర్తించారు, వాళ్ళ కోపం “వేండ్రమైనది.” (ఆదికాండము 34:13-31; 49:​5-7) వాళ్ళ స్వాస్థ్యము ఇతర గోత్రాలకు ఇవ్వబడిన స్వాస్థ్యానికి సమానము కాదు. లేవీకి 48 నగరాలు ఇవ్వబడ్డాయి, షిమ్యోనుకు ఇవ్వబడిన భాగం యూదా క్షేత్రంలో ఉంది. (యెహోషువ 19:9; 21:​41, 42) కాబట్టి మోషే షిమ్యోనును ప్రత్యేకించి ప్రస్తావించలేదు. అయితే ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన ఆశీర్వాదంలో షిమ్యోను భాగం కూడా ఇమిడివుంది.

మనకు పాఠాలు:

31:​12. చిన్నపిల్లలు సంఘ కూటాల్లో పెద్దవాళ్ళతో కలిసి కూర్చొని, విని నేర్చుకోవడానికి కృషి చేయాలి.

32:⁠4. యెహోవా కార్యాలన్నీ సంపూర్ణమైనవి ఎందుకంటే ఆయన తన ప్రధాన లక్షణాలైన న్యాయము, జ్ఞానము, ప్రేమ, శక్తిని సంపూర్ణమైన సమతుల్యతతో ప్రదర్శిస్తాడు.

మనకు ఎంతో విలువైనది

ద్వితీయోపదేశకాండము యెహోవాను “అద్వితీయుడగు యెహోవా” అని పేర్కొంటుంది. (ద్వితీయోపదేశకాండము 6:⁠4) అది దేవునితో ప్రత్యేకమైన సంబంధం గల ప్రజల గురించి చెప్పే పుస్తకం. ద్వితీయోపదేశకాండము విగ్రహారాధన గురించి కూడా హెచ్చరిస్తుంది, దేవునికి అవిభాగిత భక్తి ఇవ్వవలసిన అవసరాన్ని అది నొక్కి చెబుతుంది.

నిజమే ద్వితీయోపదేశకాండము మనకు ఎంతో విలువైనది! మనం ధర్మశాస్త్రం క్రింద లేకపోయినప్పటికీ, ‘పూర్ణహృదయముతోను, పూర్ణాత్మతోను, పూర్ణశక్తితోను మన దేవుడైన యెహోవాను ప్రేమించడానికి’ సహాయం చేసే ఎన్నో విషయాలను మనం దానినుండి నేర్చుకోవచ్చు.​—⁠ద్వితీయోపదేశకాండము 6:⁠5.

[అధస్సూచి]

^ పేరా 5 మోషే మరణించినప్పటి వృత్తాంతాన్ని చెప్పే ఆఖరి అధ్యాయాన్ని యెహోషువ లేదా ప్రధాన యాజకుడైన ఎలియాజరు వ్రాసి ఉండవచ్చు.

[24వ పేజీలోని మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

శేయీరు

కాదేషు బర్నేయ

సీనాయి పర్వతం (హోరేబు)

ఎర్ర సముద్రం

[చిత్రసౌజన్యం]

Based on maps copyrighted by Pictorial Archive (Near Eastern History) Est. and Survey of Israel

[24వ పేజీలోని చిత్రం]

ద్వితీయోపదేశకాండములోని ముఖ్య భాగం మోషే ఇచ్చిన ప్రసంగాలే

[26వ పేజీలోని చిత్రం]

యెహోవా మన్నాను కురిపించడం ఎలాంటి పాఠాన్ని నేర్పించింది?

[26వ పేజీలోని చిత్రం]

తిరుగటిని, తిరగటిమీద దిమ్మను తాకట్టు పట్టడం, “జీవనాధారమును” తాకట్టు పట్టడమేనని చెప్పబడింది