కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పరలోక ప్రార్థన దాని అర్థం

పరలోక ప్రార్థన దాని అర్థం

పరలోక ప్రార్థన దాని అర్థం

యేసుక్రీస్తు కొండమీది ప్రసంగంలో పేర్కొన్న పరలోక ప్రార్థన, బైబిలులో మత్తయి 6వ అధ్యాయంలో 9 నుండి 13 వచనాల్లో కనబడుతుంది. ఈ ప్రార్థనను పేర్కొనడానికి కాస్త ముందు యేసు ఇలా అన్నాడు: “మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనులవలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు; విస్తరించి మాటలాడుటవలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు.”​—⁠మత్తయి 6:⁠7.

దీన్నిబట్టి, పరలోక ప్రార్థనను ఉన్నదున్నట్లు కంఠస్థం చేసి చెప్పాలని యేసు ఉద్దేశించలేదని స్పష్టమవుతోంది. ఆయన ఈ ప్రార్థనను మరొక శ్రోతల గుంపు ప్రయోజనం కోసం మళ్ళీ చెప్పిన మాట నిజమే. (లూకా 11:​2-4) కానీ మత్తయి, లూకా సువార్తల వృత్తాంతాల్లో ఆ ప్రార్థనలోని మాటలు చూస్తే కాస్త భిన్నంగా ఉంటాయి. అంతేకాదు, ఆ తర్వాత యేసూ ఆయన శిష్యులూ ప్రార్థన చేసినప్పుడు వారు ఖచ్చితంగా పరలోక ప్రార్థనలో ఉన్న పదాలనే ఉపయోగించలేదు.

మరి పరలోక ప్రార్థన బైబిలులో ఎందుకు నమోదు చేయబడింది? యేసు, మన ప్రార్థనలు దేవునికి అంగీకారయోగ్యం ఎలా కాగలవో పరలోక ప్రార్థన ద్వారా మనకు బోధిస్తున్నాడు. ఈ ప్రార్థనలో, మన జీవితంలోని ప్రధానమైన కొన్ని ప్రశ్నలకు జవాబు కూడా లభిస్తుంది. కాబట్టి మనం పరలోక ప్రార్థనలోని ప్రతి భాగాన్ని పరిశీలిద్దాం.

దేవుని పేరు ఏమిటి?

“పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక.” (మత్తయి 6:⁠9, 10) పరలోక ప్రార్థనలోని ఈ ఆరంభపు మాటలు, మనం దేవుణ్ణి “మా తండ్రీ” అని సంబోధిస్తూ ఆయనకు సన్నిహితమవడానికి సహాయపడతాయి. ప్రేమ చూపిస్తూ, అర్థం చేసుకునే తల్లికి లేక తండ్రికి సహజంగా సన్నిహితమయ్యే పసిపిల్లల్లా, మన పరలోకపు తండ్రి మనం చెప్పేది వినాలని కోరుకుంటున్నాడనే దృఢ నమ్మకంతో ఆయనను సమీపించవచ్చు. అందుకే దావీదు రాజు, “ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీయొద్దకు వచ్చెదరు” అని పాడాడు.​—⁠కీర్తన 65:⁠2.

దేవుని పేరు పరిశుద్ధపరచబడేందుకు లేదా పవిత్రమైనదిగా ప్రతిష్ఠించబడేందుకు ప్రార్థించమని యేసు మనకు ఉపదేశించాడు. అయితే దేవుని పేరు ఏమిటి? బైబిలు ఇలా సమాధానమిస్తోంది: “యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవు.” (కీర్తన 83:​18) మీరు బైబిలులో యెహోవా అనే పేరు ఎప్పుడైనా చదివారా?

వాస్తవానికి ప్రాచీన బైబిలు రాతప్రతుల్లో, యెహోవా అనే దేవుని పేరు దాదాపు 7,000 సార్లు కనబడుతుంది. అయితే కొందరు అనువాదకులు తాము చేసిన బైబిలు అనువాదాల్లో ఆ పేరే లేకుండా చేశారు. కాబట్టి మనం, మన సృష్టికర్త తన పేరును పరిశుద్ధపరచాలనీ లేదా పవిత్రమైనదిగా ప్రతిష్ఠించాలనీ ప్రార్థించడం సరైనదే. (యెహెజ్కేలు 36:​23) మనం ఆ ప్రార్థనకు అనుగుణంగా ప్రవర్తించడానికి ఒక మార్గమేమిటంటే, మనం దేవునికి ప్రార్థించేటప్పుడు యెహోవా పేరు ఉపయోగించాలి.

క్యాథలిక్‌ కుటుంబంలో పెరిగిన పాట్రీషియా అనే ఒక మహిళకు పరలోక ప్రార్థన బాగా తెలుసు. ఆమెకు ఒక యెహోవాసాక్షి బైబిలులో దేవుని పేరు చూపించినప్పుడు, ఆమె ఎలా స్పందించింది? ఆమె ఇలా వివరిస్తోంది: “నేనది నమ్మలేకపోయాను! కాబట్టి నేను నా సొంత బైబిలులో ఆ పేరు ఉందేమో చూశాను, అందులో కూడా ఉంది. ఆ తర్వాత ఆ సాక్షి నాకు మత్తయి 6:​9, 10 వచనాలు చూపించి, దేవుని పేరు పరలోక ప్రార్థనతో అనుసంధానమై ఉందని వివరించింది. నేను ఎంతో ఉద్వేగంతో, నాతో బైబిలు అధ్యయనం చేయమని ఆమెను కోరాను.”

భూమిపై నెరవేరవలసిన దేవుని చిత్తం

“నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక.” (మత్తయి 6:⁠9, 10) యేసు మాదిరి ప్రార్థనలోని ఈ భాగం ఎలా నెరవేరుతుంది? చాలామంది పరలోకం అనగానే అదొక శాంతిప్రశాంతతలున్న లోకంగా ఊహిస్తారు. లేఖనాలు, పరలోకాన్ని యెహోవా యొక్క ‘మహిమోన్నతమైన పరిశుద్ధ నివాసస్థలము’గా సూచిస్తున్నాయి. (యెషయా 63:​15) కాబట్టి మనం దేవుని చిత్తం “పరలోకమందు నెరవేరుచున్నట్లు” భూమిపై నెరవేరాలని ప్రార్థించడంలో ఆశ్చర్యమేమీ లేదు! కానీ ఇది ఎన్నటికైనా నెరవేరుతుందా?

యెహోవా ప్రవక్త అయిన దానియేలు ఇలా ప్రవచించాడు: “ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన [భూలోకపు] రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును.” (దానియేలు 2:​44) ఈ పరలోక రాజ్యం లేక ప్రభుత్వం, త్వరలోనే నీతియుక్తమైన పాలనతో విశ్వవ్యాప్తంగా శాంతిని నెలకొల్పేందుకు చర్య తీసుకుంటుంది.​—⁠2 పేతురు 3:​13.

దేవుని రాజ్యం రావాలనీ, ఆయన చిత్తం భూమిపై నెరవేరాలనీ ప్రార్థించడమంటే మనం మన విశ్వాసాన్ని మాటల్లో వ్యక్తం చేయడమే, ఆ విశ్వాసం మనల్ని ఎన్నడూ నిరాశపరచదు. క్రైస్తవ అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “అప్పుడు​—⁠ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.” ఆ తర్వాత యోహాను ఇంకా ఇలా అన్నాడు: “అప్పుడు సింహాసనాసీనుడైయున్నవాడు, . . . ఈ మాటలు నమ్మకమును నిజమునై యున్నవి గనుక వ్రాయుమని . . . చెప్పుచున్నాడు.”​—⁠ప్రకటన 21:​3-5.

ప్రార్థన, మన భౌతికావసరాలు

మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని నామానికి, ఆయన చిత్తానికి సంబంధించిన విషయాలు మన ప్రధాన అంశాలుగా ఉండాలని, యేసు మాదిరి ప్రార్థనలో పేర్కొన్న మాటల ద్వారా తెలిపాడు. అంతేగాక వ్యక్తిగత కోరికలను సరైన రీతిలో యెహోవాకు విన్నవించుకోవడంతో ఆ మాదిరి ప్రార్థన కొనసాగుతుంది.

వాటిలో మొదటిది: “మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము.” (మత్తయి 6:​11) ఇది భౌతిక సంపదను ఇవ్వమని చేసే విజ్ఞప్తి కాదు. మనకు “కావలసిన అనుదినాహారము” కోసం ప్రార్థించాలని యేసు మనల్ని ప్రోత్సహించాడు. (లూకా 11:⁠3) పరలోక ప్రార్థనకు అనుగుణంగా, మనం దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయనకు విధేయత చూపిస్తే ఆయన మన అనుదిన అవసరాలకు తగినట్లు సమకూరుస్తాడనే విశ్వాసంతో ప్రార్థించవచ్చు.

ఆర్థిక సమస్యల గురించి అధికంగా చింతించడం, మనం మన ఆధ్యాత్మిక అవసరాలను నిర్లక్ష్యం చేసేందుకు దారితీయవచ్చు, తత్ఫలితంగా దేవుడు మన నుండి ఆశించే వాటిని చేయలేకపోతాం. కానీ మనం దేవుని ఆరాధనను మన జీవితంలో అగ్ర స్థానంలో ఉంచితే ఆహారవస్త్రాల వంటి భౌతికావసరాల కోసం చేసే మన విన్నపాలను ఆయన సానుకూలంగా వింటాడని ధీమాగా ఉండవచ్చు. యేసు ఇలా అన్నాడు: “మీరు ఆయన [దేవుని] రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.” (మత్తయి 6:​26-33) మనమందరం పాపులం, క్షమాపణ అవసరమున్న వాళ్ళం కాబట్టి దేవుని నీతిని వెదకడం అంత సులభం కాదు. (రోమీయులు 5:​12) ఈ విషయం కూడా పరలోక ప్రార్థనలో ప్రస్తావించబడింది.

మన ప్రార్థనలు, క్షమాపణ

“మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము.” (మత్తయి 6:​12) ఈ “ఋణములు,” లూకా వృత్తాంతంలోని పరలోక ప్రార్థనలో “పాపములు” అని సూచించబడ్డాయి. (లూకా 11:⁠4) యెహోవా దేవుడు మన పాపములను నిజంగా క్షమిస్తాడా?

ప్రాచీన ఇశ్రాయేలు రాజైన దావీదు గంభీరమైన పాపములు చేసినప్పటికీ, ఆయన పశ్చాత్తాపపడి దృఢ నమ్మకంతో ఇలా ప్రార్థించాడు: “ప్రభువా, నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడవు; నీకు మొఱ్ఱపెట్టు వారందరియెడల కృపాతిశయము గలవాడవు.” (కీర్తన 86:⁠5) అదెంత ఓదార్పుకరమైన తలంపో కదా! మన పరలోకపు తండ్రి, తనను పశ్చాత్తాపంతో వేడుకునే వారి పాపములను ‘క్షమించడానికి సిద్ధంగా’ ఉన్నాడు. ఏ విధంగానైతే ఋణాలు పూర్తిగా రద్దు చేయబడతాయో అదేవిధంగా యెహోవా దేవుడు మన పాపములను పూర్తిగా క్షమిస్తాడు.

అయితే యేసు ఒక షరతు గురించి ప్రస్తావించాడు: దేవుని చేత క్షమించబడాలంటే మనం ఇతరులను క్షమించాలి. (మత్తయి 6:​14, 15) నీతిమంతుడైన యోబు, తన ముగ్గురు స్నేహితులు తనను ఆదరించకుండా చెడుగా చూసినప్పటికీ, వారిని క్షమించడమే కాక వారి కోసం ప్రార్థించాడు కూడా. (యోబు 42:​10) మనకు విరుద్ధంగా పాపం చేసిన వారిని మనం క్షమించినట్లయితే, మనం దేవుణ్ణి సంతోషపరచి ఆయన కరుణను పొందే స్థానంలో ఉంటాం.

దేవుడు మన విన్నపాలను వినడానికి చూపిస్తున్న సంసిద్ధత, మనం ఆయన ఆమోదాన్ని పొందేందుకు ప్రయత్నించేలా మనల్ని పురికొల్పాలి. మనం అపరిపూర్ణులమే అయినా ఆయన ఆమోదం పొందవచ్చు. (మత్తయి 26:​41) యేసు మాదిరి ప్రార్థనను ఒక ప్రాముఖ్యమైన విన్నపంతో ముగించడం ద్వారా చూపించినట్లు, ఈ విషయంలో కూడా యెహోవా మనకు సహాయం చేయగలడు.

నీతి మార్గంలో నడిచేందుకు సహాయం

“మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి మమ్మును తప్పించుము.” (మత్తయి 6:​13) మనం శోధనలో పడేలా లేదా పాపం చేసేలా యెహోవా మనల్ని విడిచిపెట్టడు. ఆయన వాక్యం ఇలా చెబుతోంది: “దేవుడు కీడువిషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు.” (యాకోబు 1:​13) మనం శోధింపబడేందుకు దేవుడు అనుమతించినప్పటికీ, అపవాదియైన సాతాను అని పేరుగాంచిన ‘దుష్టుడు’ అయిన ప్రధాన శోధకుడి నుండి ఆయన మనల్ని విముక్తి చేయగలడు.

అపొస్తలుడైన పేతురు తన తోటి క్రైస్తవులకు ఇలా ఉద్బోధించాడు: “నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.” (1 పేతురు 5:⁠8) అంతెందుకు, సాతాను పరిపూర్ణ మానవుడైన యేసుక్రీస్తును సహితం శోధించాడు! అపవాది లక్ష్యం ఏమిటి? యేసును యెహోవా దేవుని సత్యారాధన నుండి దూరం చేయాలన్నదే అతని లక్ష్యం. (మత్తయి 4:​1-11) మీరు దేవుణ్ణి సేవించడానికి ప్రయత్నిస్తున్నట్లయితే, మిమ్మల్ని మ్రింగడం కూడా సాతాను లక్ష్యమే!

మనం దేవుడు ఆమోదించని అభ్యాసాల్లో పాల్గొనేలా, అపవాది తన ఆధీనంలో ఉన్న లోకం ద్వారా మనల్ని శోధించవచ్చు. (1 యోహాను 5:​19) కాబట్టి మనం సహాయం కోసం, ప్రత్యేకించి మనం పదే పదే శోధనకు గురవుతున్నప్పుడు క్రమంగా దేవుని వైపు తిరగడం చాలా ముఖ్యం. మనం యెహోవా ప్రేరేపిత వాక్యమైన బైబిలుకు అనుగుణంగా ఆయనను ఆరాధిస్తే, మనం అపవాదిని తిరస్కరించేందుకు కావలసిన సహాయం చేయడం ద్వారా ఆయన మనల్ని విడుదల చేస్తాడు. బైబిలు మనకిలా చెబుతోంది: “దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింపగలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు.”​—⁠1 కొరింథీయులు 10:​13.

దేవునిపై విశ్వాసం అత్యావశ్యకం

మన పరలోకపు తండ్రికి మనందరి పట్ల ఆసక్తి ఉందని తెలుసుకోవడం ఎంత ఆహ్లాదకరమైన విషయమో కదా! ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా, ఎలా ప్రార్థించాలో మనకు నేర్పించాడు. ఈ వాస్తవమే మనం యెహోవా దేవుణ్ణి సంతోషపెట్టాలని కోరుకునేలా చేస్తుంది. మనం దేవుణ్ణి ఎలా సంతోషపెట్టవచ్చు?

బైబిలు ఇలా చెబుతోంది: “విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట [“దేవుణ్ణి సంతోషపెట్టడం,” NW] అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను.” (హెబ్రీయులు 11:⁠6) అలాంటి విశ్వాసాన్ని ఎలా పొందవచ్చు? “వినుట వలన విశ్వాసము కలుగును” అని బైబిలు చెబుతోంది. (రోమీయులు 10:​17) విశ్వాసంతో దేవుని సేవ చేయడానికి కృషి చేసే వారందరితో, లేఖనాధార విషయాల గురించి మాట్లాడడానికి యెహోవాసాక్షులు ఎంతో ఆనందిస్తారు.

పరలోక ప్రార్థనపై చేసిన ఈ చర్చ, దాని భావంపై మీకు మరింత అవగాహన కలిగించిందనే మేము ఆశిస్తున్నాం. యెహోవా గురించి, ‘ఆయనను వెదికేవారికి’ ఆయనిచ్చే ఆశీర్వాదాల గురించీ ఇంకా ఎక్కువ తెలుసుకోవడం ద్వారా, దేవునిపై మీ విశ్వాసాన్ని బలోపేతం చేసుకోవచ్చు. మీరు మీ పరలోకపు తండ్రితో నిరంతరం సన్నిహిత సంబంధం కలిగి ఉండడానికి, ఆయన గురించీ ఆయన సంకల్పాల గురించీ మరింత తెలుసుకొందురు గాక.​—⁠యోహాను 17:⁠3.

[5వ పేజీలోని బ్లర్బ్‌]

“పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక; నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక, మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము. మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము. మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి మమ్మును తప్పించుము.”​—⁠మత్తయి 6:​9-13.

[7వ పేజీలోని చిత్రం]

యెహోవా తనను ప్రేమించే వారికి అవసరమైన వాటిని సమకూరుస్తాడు

[7వ పేజీలోని చిత్రం]

మనం అపవాదిని ఎదిరించడానికి కూడా దేవుడు సహాయం చేస్తాడు

[7వ పేజీలోని చిత్రం]

మనం మనకు విరుద్ధంగా పాపం చేసిన వారిని యోబులాగే క్షమిస్తే, దేవుని కరుణ నుండి మనం ప్రయోజనం పొందవచ్చు