కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

కొందరు అన్యులతో వియ్యమందకూడదు అని మోషే ధర్మశాస్త్రం చెబుతుంటే, ఇశ్రాయేలు పురుషులు తాము చెరపట్టిన అన్య స్త్రీలను పెళ్ళి చేసుకోవడానికి ఎందుకు అనుమతించబడ్డారు?​—ద్వితీయోపదేశకాండము 7:⁠1-3; 21:​10, 11.

అలా అనుమతించడానికి కారణం అప్పుడు ఏర్పడ్డ ప్రత్యేక పరిస్థితులే. కనాను దేశములోని ఏడు జనాంగాల పట్టణాలను నాశనం చేయమని, వాటిలోని నివాసులను అందరినీ హతమార్చమని యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు. (ద్వితీయోపదేశకాండము 20:​15-18) ఇతర జనాంగాల విషయంలోనైతే, బహుశా వారిలో బ్రతికి బయటపడే పెద్దవాళ్ళు చెరపట్టబడిన కన్యలు మాత్రమే. (సంఖ్యాకాండము 31:​17, 18; ద్వితీయోపదేశకాండము 20:​14) అలాంటి యువతిని ఒక ఇశ్రాయేలీయుడు పెళ్ళి చేసుకోవచ్చు, అయితే ఆమె కొన్ని నిర్దిష్ట చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే.

అలాంటి యువతి తీసుకోవలసిన చర్యల గురించి, బైబిలు ఇలా చెబుతోంది: “నీ యింట ఆమెను చేర్చుకొనిన తరువాత ఆమె తల క్షౌరము చేయించుకొని గోళ్లను తీయించుకొని తన చెరబట్టలు తీసివేసి నీ యింట నివసించి యొక నెలదినములు తన తండ్రులనుగూర్చి ప్రలాపన చేయుటకు నీవు ఆమెకు సెలవియ్యవలెను. తరువాత నీవు ఆమెయొద్దకు పోయి ఆమెను పెండ్లి చేసికొనవచ్చును; ఆమె నీకు భార్యయగును.”​—⁠ద్వితీయోపదేశకాండము 21:​12, 13.

ఒక ఇశ్రాయేలీయుడు పెళ్ళి చేసుకోవాలనుకునే చెరపట్టబడిన కన్య తన తల క్షౌరము చేయించుకోవాలి. అలా తల వెంట్రుకలు కత్తిరించుకోవడం దుఃఖాన్ని లేక ప్రలాపనను సూచిస్తుంది. (యెషయా 3:​24) ఉదాహరణకు, పూర్వీకుడైన యోబు తన పిల్లలను, ఆస్తిని కోల్పోయినప్పుడు దుఃఖానికి సూచనగా ఆయన తన తల వెంట్రుకలు కత్తిరించుకున్నాడు. (యోబు 1:​20) అన్య స్త్రీ తన గోళ్ళు కూడా కత్తిరించుకోవాలి, బహుశా ఆమె తన ‘గోళ్ళు తీయించుకొనడం’ వల్ల వాటికి రంగు వేసినా ఆమె చేతులు ఆకర్షణీయంగా కనబడకూడదని కావచ్చు. (ద్వితీయోపదేశకాండము 21:​12, 13) చెరపట్టబడిన స్త్రీ తీసివేయవలసిన “చెరబట్టలు” ఏమిటి? తమ పట్టణాలు ఇతరుల వశం కాబోతున్నప్పుడు మంచి బట్టలు ధరించడం కనాను స్త్రీల ఆచారం. తమను చెరపట్టేవారి అనుగ్రహం పొందాలనే ఆశతో వాళ్ళలా చేసేవారు. చెరపట్టబడిన స్త్రీ దుఃఖిస్తున్నప్పుడు అటువంటి దుస్తులను తీసివేయాలి.

ఇశ్రాయేలీయునికి భార్య కాబోయే చెరపట్టబడిన స్త్రీ, మరణించిన తన బంధువుల కోసం ఒక నెలరోజుల పాటు దుఃఖ కాలం పాటించాలి. కనాను పట్టణాలు పూర్తిగా నాశనం చేయబడేవి కాబట్టి, పూర్వం ఆమెకున్న కుటుంబ బంధాలు, సామాజిక బంధాలు పూర్తిగా సమసిపోతాయి. ఇశ్రాయేలు సైనికులు ఆమె దేవతా ప్రతిమలను నాశనం చేసివుంటారు కాబట్టి ఆమె ఆరాధనా వస్తువులేవీ ఉండవు. దుఃఖం పాటించబడే నెల శుద్ధిపరచబడే కాలంగా కూడా ఉపయోగపడేది, చెరపట్టబడిన స్త్రీ ఆ సమయంలో తన పూర్వపు మతారాధనకు సంబంధించిన అన్ని అలవాట్లను మానుకుంటుంది.

అయితే, సాధారణ అన్య స్త్రీ విషయంలో పరిస్థితి భిన్నంగా ఉండేది. ఆ విషయం గురించి యెహోవా ఇలా ఆజ్ఞాపించాడు: “నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తె నియ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు.” (ద్వితీయోపదేశకాండము 7:⁠3) ఈ కట్టుబాటుకు కారణం ఏమిటి? “నన్ను అనుసరింపకుండ ఇతర దేవతలను పూజించునట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు” అని ద్వితీయోపదేశకాండము 7:⁠4 చెబుతోంది. అంటే, మతపరంగా కలుషితం కాకుండా ఇశ్రాయేలీయులను కాపాడడమే ఆ నిషేధాజ్ఞ ఉద్దేశం. అయితే, ద్వితీయోపదేశకాండము 21:​10-13లో వర్ణించబడిన పరిస్థితుల్లో ఉన్న అన్య స్త్రీ అలాంటి ప్రమాదం తీసుకురాదు. ఆమె బంధువులందరూ చనిపోయారు, ఆమె దేవతలను సూచించే ప్రతిమలన్నీ నాశనం చేయబడ్డాయి. అబద్ధ ఆరాధన చేసేవారితో ఆమెకిక ఏ సంబంధమూ లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న అన్య స్త్రీలను మాత్రమే పెళ్ళి చేసుకోవడానికి ఇశ్రాయేలు పురుషులు అనుమతించబడ్డారు.