కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘ప్రభువునందు బలవంతులై యుండుడి’

‘ప్రభువునందు బలవంతులై యుండుడి’

‘ప్రభువునందు బలవంతులై యుండుడి’

“ప్రభువుయొక్క మహా శక్తినిబట్టి ఆయనయందు బలవంతులై యుండుడి.”​—⁠ఎఫెసీయులు 6:​10.

సుమారు 3,000 సంవత్సరాల క్రితం, రణ రంగంలోని ఇరు పక్షాల శత్రు సైన్యాలు చూస్తుండగా ఇద్దరు యోధులు ఒకరినొకరు ఎదుర్కొన్నారు. వారిలో చిన్న వయస్కుడు గొఱ్ఱెలు కాసే ఒక బాలుడు, అతని పేరు దావీదు. అతని ఎదుట నిలుచున్నది భీకరమైన స్వరూపమూ అసాధారణమైన శక్తీ గల గొల్యాతు అనే భారీకాయుడు. అతడు ధరించిన కవచపు బరువే దాదాపు 57 కిలోలు ఉంటుంది, అతని చేతుల్లో చాలా బరువైన ఒక పెద్ద ఈటె, పొడవైన ఒక ఖడ్గము ఉన్నాయి. దావీదు కవచము వంటిది ఏదీ ధరించలేదు, ఆయన దగ్గరున్న ఏకైక ఆయుధం ఒక మామూలు వడిసెల. ఫిలిష్తీయుడైన గొల్యాతు, భారీకాయుడైన తనతో పోటీపడుతున్నది కేవలం ఒక బాలుడని తెలిసి అది తనకు అవమానకరమన్నట్లు భావించాడు. (1 సమూయేలు 17:​42-44) ఇరువైపుల నుండి వీక్షిస్తున్న వారికి, ఆ పోరాటంలో ఎవరు గెలుస్తారో ముందే తెలిసిపోయినట్లు అనిపించి ఉండవచ్చు. కానీ పోరాటంలో ఎల్లప్పుడూ శక్తి గలవారే గెలవరు. (ప్రసంగి 9:​11) ఆ పోరాటంలో దావీదు విజయం సాధించాడు, ఎందుకంటే ఆయన యెహోవా బలంతో పోరాడాడు. ఆయన “యుద్ధము యెహోవాదే” అని అన్నాడు. “వడిసెలతోను రాతితోను” పోరాడిన “దావీదు ఫిలిష్తీయునికంటె బలాఢ్యుడు” అని బైబిలు వృత్తాంతం తెలుపుతోంది.​—⁠1 సమూయేలు 17:​47, 50.

2 క్రైస్తవులు అక్షరార్థ యుద్ధంలో పాల్గొనరు. వారు అందరితో శాంతియుతంగా మెలిగే ప్రజలే అయినా, వారు చాలా శక్తివంతమైన విరోధులతో చేసే ఆధ్యాత్మిక యుద్ధంలో పోరాడతారు. (రోమీయులు 12:​18) పౌలు ఎఫెసీయులకు వ్రాసిన పత్రికలోని చివరి అధ్యాయంలో, ప్రతి క్రైస్తవుడు పాల్గొనవలసిన పోరాటాన్ని వర్ణించాడు. ఆయనిలా వ్రాశాడు: “మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోకనాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.”​—⁠ఎఫెసీయులు 6:​12.

3 ఆ “దురాత్మల సమూహములు,” యెహోవా దేవునితో మన సంబంధాన్ని నాశనం చేయాలని కోరుకునే సాతాను, అతని దయ్యాలే. వాళ్ళు మనకంటే ఎంతో బలమైనవారు కాబట్టి, మనం ఉన్న స్థితి దావీదు ఉన్నటువంటిదే, మనం బలం కోసం దేవుని మీద ఆధారపడితే తప్ప విజయం సాధించలేము. నిజానికి పౌలు, “ప్రభువుయొక్క మహా శక్తినిబట్టి ఆయనయందు బలవంతులై యుండుడి” అని మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. (ఎఫెసీయులు 6:​10) అపొస్తలుడు ఆ హితవు చెప్పిన తర్వాత, మనం పోరాటంలో విజయం సాధించేందుకు దోహదపడే ఆధ్యాత్మిక సహాయకాలను, క్రైస్తవ లక్షణాలను వివరిస్తున్నాడు.​—⁠ఎఫెసీయులు 6:​11-17.

4 ఇప్పుడు మనం మన శత్రువు యొక్క బలం గురించి, పథకాల గురించి లేఖనాలు ఏమి చెబుతున్నాయో విశ్లేషిద్దాం. ఆ తర్వాత మనల్ని మనం కాపాడుకోవడానికి ఉపయోగించవలసిన భద్రతా వ్యూహాలను పరిశీలిద్దాం. మనం యెహోవా సూచనలను పాటించినట్లయితే, మన శత్రువులు మనపై విజయం సాధించలేరని ధీమాగా ఉండవచ్చు.

దురాత్మల సమూహములతో పోరాటం

5 “మనము . . . ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము” అని పౌలు వివరిస్తున్నాడు. అపవాదియైన సాతానే ప్రధాన దురాత్మ, అతడే “దయ్యములకు అధిపతి.” (మత్తయి 12:​24-26) బైబిలు మన పోరాటాన్ని “కుస్తీ”గా లేక మల్లయుద్ధంగా వర్ణిస్తోంది. ప్రాచీన గ్రీసులోని కుస్తీ పోటీల్లో, పాల్గొనే ప్రతి ఒక్కరు తమ ప్రత్యర్థిని చిత్తు చేసేందుకు అతని సమతుల్యతను చెదరగొట్టడానికి ప్రయత్నించేవారు. అదేవిధంగా అపవాది కూడా మనం మన ఆధ్యాత్మిక సమతుల్యతను కోల్పోవాలని కోరుకుంటున్నాడు. అందుకు అతను ఏమి చేస్తాడు?

6 అపవాది సర్పంలాగ, గర్జించు సింహంలాగ, చివరకు వెలుగు దూతలాగ కూడా నటించవచ్చు. (2 కొరింథీయులు 11:​3, 14; 1 పేతురు 5:⁠8) అతడు మనల్ని హింసించడానికి లేక నిరుత్సాహపరచడానికి మానవులను ఉపయోగించవచ్చు. (ప్రకటన 2:​10) లోకమంతా సాతాను ఆధీనంలోనే ఉంది కాబట్టి, మనం వలలో ఇరుక్కుపోయేలా అతను ఆ లోకపు కోరికలను, ఆకర్షణలనూ ఉపయోగించవచ్చు. (2 తిమోతి 2:​26; 1 యోహాను 2:​16; 5:​19) అతను హవ్వను మోసపరచినట్లే మనలను కూడా తప్పుదారి పట్టించేందుకు లౌకిక లేక మతభ్రష్ట ఆలోచనా విధానాన్ని ఉపయోగించవచ్చు.​—⁠1 తిమోతి 2:​14.

7 సాతాను శక్తి, అతని ఆయుధాలు, అతని దయ్యాలు అసాధారణమైనవిగా అనిపించినా, వాటికీ పరిమితులు ఉన్నాయి. ఆ దురాత్మలు, మన పరలోకపు తండ్రికి అసంతృప్తి కలిగించే చెడు పనులు చేసేలా మనల్ని బలవంతపెట్టలేవు. మనం స్వేచ్ఛా జీవులం, మన ఆలోచనలను, చర్యలను నియంత్రించుకునే శక్తి మనకుంది. అంతేగాక మనం పోరాడుతున్నది ఒంటరిగా కాదు. ఎలీషా కాలంలో ఏమి జరిగిందో మన కాలంలోను అదే జరుగుతుంది: “మన పక్షమున నున్నవారు వారికంటె అధికులై యున్నారు.” (2 రాజులు 6:​16) దేవునికి లోబడి అపవాదిని ఎదిరిస్తే అతడు మన దగ్గర నుండి పారిపోతాడని బైబిలు మనకు హామీ ఇస్తోంది.​—⁠యాకోబు 4:⁠7.

సాతాను తంత్రాలను తెలుసుకోండి

8 సాతాను ప్రధాన తంత్రాలు ఏమిటో లేఖనాలు వెల్లడి చేస్తున్నాయి కాబట్టి అవి మనకు తెలియనివి కావు. (2 కొరింథీయులు 2:​11) అపవాది, నీతిమంతుడైన యోబుకు వ్యతిరేకంగా తీవ్రమైన ఆర్థిక సమస్యలను, ప్రియమైనవారి మరణాన్ని, కుటుంబ వ్యతిరేకతను, శారీరక బాధను, అబద్ధ స్నేహితుల నిరాధారిత విమర్శలను ఉపయోగించాడు. యోబు ఎంతో కృంగిపోయి, దేవుడు తనను విడిచి పెట్టాడని భావించాడు. (యోబు 10:​1, 2) నేడు అలాంటి సమస్యలను సాతాను నేరుగా కలిగించనప్పటికీ, అలాంటి కష్టాలు చాలామంది క్రైస్తవులపై ప్రభావం చూపించాయి, అపవాది వాటిని తన స్వలాభం కోసం ఉపయోగించుకోగలడు.

9 ఈ అంత్యకాలంలో ఆధ్యాత్మిక ప్రమాదాలు పెచ్చు పెరిగిపోయాయి. మనం ఆధ్యాత్మిక లక్ష్యాలను వెనక్కి నెట్టేసే భౌతిక లక్ష్యాలుగల లోకంలో జీవిస్తున్నాం. చట్టవిరుద్ధమైన శృంగారం మనోవేదన కలిగిస్తుందని చెప్పడానికి బదులు, సమాచార మాధ్యమం తరచూ దానిని ఆనందానికి ఒక మూలంగా చిత్రిస్తోంది. చాలామంది ‘దేవునికంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారి’ వలె అయ్యారు. (2 తిమోతి 3:​1-5) మనం “విశ్వాస సంబంధమైన మంచి పోరాటము” పోరాడకపోతే, అటువంటి ఆలోచన మన ఆధ్యాత్మిక సమతుల్యతకు ప్రమాదకరం కాగలదు.​—⁠1 తిమోతి 6:​12.

10 సాతానుకు అత్యధిక విజయాన్ని చేకూర్చే ఒక కుతంత్రం ఏమిటంటే, మనల్ని ఈ లోకంలో దాని భౌతికపరమైన లక్ష్యాలలో పూర్తిగా లీనమయ్యేలా చేయడమే. యేసు విత్తువాని గురించిన ఉపమానం చెబుతున్నప్పుడు, కొన్ని సందర్భాల్లో “ఐహికవిచారమును ధనమోసమును ఆ [రాజ్య] వాక్యమును అణచివేయును” అని హెచ్చరించాడు. (మత్తయి 13:​18, 22) “అణచివేయును” అని అనువదించబడిన గ్రీకు మూలపదానికి “ఊపిరాడకుండా చేయడం” అని అర్థం.

11 ఉష్ణమండల అడవుల్లో అలా ఊపిరాడకుండా చేసే అంజూరపు చెట్టు కనబడుతుంది. దాని తీగ ఒక చెట్టు కాండాన్ని ఆశ్రయించి నెమ్మదిగా దాని చుట్టూ ప్రాకుతుంది. అది కొద్ది కొద్దిగా తను ఆశ్రయించిన చెట్టు వేర్ల చుట్టూ ప్రాకి క్రమంగా బలపడుతుంది. చివరకు దాని వేర్లు ఆ చెట్టు మొదలుకి చేరి నేలలోని పోషకాలను చాలా మట్టుకు పీల్చుకుంటాయి. మరో ప్రక్క దాని ఆకులు తనకు ఆశ్రయమిచ్చిన చెట్టుకు వెలుతురు తగలకుండా చేస్తాయి. చివరకు ఆ చెట్టు చనిపోతుంది.

12 అదేవిధంగా ఈ విధానపు చింతలు, సంపదల కోసం సౌకర్యవంతమైన జీవితం కోసం మనం చేసే ప్రయత్నాలు క్రమంగా మన సమయాన్నీ, శక్తినీ హరించివేస్తాయి. మన ధ్యాస లోకంలోని విషయాల వైపు మళ్ళడంతో, మనం మన వ్యక్తిగత బైబిలు అధ్యయనాన్ని సులభంగా నిర్లక్ష్యం చేసి, ఆ తర్వాత క్రైస్తవ కూటాలకు వెళ్ళడం మానెయ్యడాన్ని అలవాటు చేసుకుంటాము, ఆ విధంగా మనం ఆధ్యాత్మిక పోషణ నుండి దూరమయ్యే అవకాశం ఉంది. అలా భౌతిక లక్ష్యాలు ఆధ్యాత్మిక లక్ష్యాల స్థానాన్ని ఆక్రమించుకుంటాయి, చివరకు మనం సాతానుకు సులభంగా ఎర అవుతాం.

మనం స్థిరంగా నిలబడాలి

13 పౌలు తన తోటి విశ్వాసులకు “అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులు” అవండి అంటే స్థిరంగా నిలబడండి అని ఉద్బోధించాడు. (ఎఫెసీయులు 6:​11) అపవాదిని, అతని దయ్యాలను మనం నాశనం చేయలేము. దేవుడు ఆ పనిని యేసుక్రీస్తుకు అప్పగించాడు. (ప్రకటన 20:​1, 2) అయితే సాతాను నిర్మూలించబడేంత వరకు, అతని దాడులు మనల్ని కృంగదీయకుండా మనం స్థిరంగా నిలబడాలి.

14 సాతానును ఎదిరించడానికి స్థిరంగా నిలబడవలసిన అవసరముందని అపొస్తలుడైన పేతురు కూడా నొక్కి చెప్పాడు. “నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని యెరిగి, విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి” అని ఆయన వ్రాశాడు. (1 పేతురు 5:​8, 9) వాస్తవానికి అపవాది గర్జించు సింహంలాగ దాడి చేసినప్పుడు మనం స్థిరంగా నిలబడేందుకు, మన ఆధ్యాత్మిక సహోదర సహోదరీలు ఇచ్చే మద్దతు సహాయపడుతుంది.

15 ఆఫ్రికాలోని అక్కడక్కడ చెట్లున్న పచ్చిక మైదానంలోని, దరిదాపుల్లో ఒక సింహం గర్జించినప్పుడు లేడివంటి జంతువు అపాయకర పరిస్థితికి దూరమయ్యేంత వరకు వేగంగా పరుగెడుతుండవచ్చు. కానీ ఏనుగులు పరస్పర మద్దతునిచ్చుకొనే విషయంలో మంచి ఉదాహరణగా ఉన్నాయి. ఎలిఫెంట్స్‌​—⁠జెంటిల్‌ జయంట్స్‌ ఆఫ్‌ ఆఫ్రికా అండ్‌ ఏషియా అనే పుస్తకం ఇలా వివరిస్తోంది: “సాధారణంగా ఏనుగుల గుంపు తమను తాము కాపాడుకోవడానికి ఉపయోగించే పద్ధతి ఏమిటంటే, వాటిలోని పెద్ద ఏనుగులు వెలుపలి వైపు ముఖాలు పెట్టి ఒక వలయంగా నిలబడతాయి, ఆ వలయం లోపల చిన్న ఏనుగులు సురక్షితంగా ఉంటాయి.” ఆ విధంగా అవి కనబరుస్తున్న బలాన్ని, పరస్పర మద్దతును చూసిన సింహాలు చివరకు పిల్ల ఏనుగులపై దాడి చేయడానికి కూడా వెనుకంజ వేస్తాయి.

16 సాతాను, అతని దయ్యాల వలన ప్రమాదం ఏర్పడినప్పుడు, మనం కూడా అలాగే విశ్వాసంలో స్థిరంగా ఉన్న మన సహోదరులతో ఐక్యంగా కలిసివుండాలి. పౌలు తాను రోములో నిర్బంధంలో ఉన్నప్పుడు కొందరు తోటి క్రైస్తవులు తనను “బలపరిచే సహాయకం” వలె ఉన్నారని అంగీకరించాడు. (కొలొస్సయులు 4:​10, 11 NW) “బలపరిచే సహాయకం” అని అనువదించబడిన గ్రీకు పదం క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో ఒక్కసారే కనబడుతుంది. వైన్‌ యొక్క ఎక్స్‌పోజిటరీ డిక్షనరీ ఆఫ్‌ న్యూ టెస్ట్‌మెంట్‌ వర్డ్స్‌ ప్రకారం, “క్రియార్థక రూపంలో ఉన్న ఆ పదం నొప్పిని ఉపశమింపజేసే మందులను సూచిస్తుంది.” బాధను తగ్గించే లేపనంలాగ, పరిణతి చెందిన యెహోవా ఆరాధకుల మద్దతు, మానసిక లేక శారీరక కష్టం మూలంగా కలిగిన బాధను తగ్గిస్తుంది.

17 నేడు మన తోటి క్రైస్తవుల నుండి పొందే ప్రోత్సాహం, దేవుణ్ణి నమ్మకంగా సేవించాలన్న మన దృఢ నిశ్చయాన్ని బలోపేతం చేస్తుంది. ప్రత్యేకించి క్రైస్తవ పెద్దలు ఆధ్యాత్మిక సహాయం అందించడానికి సంసిద్ధంగా ఉంటారు. (యాకోబు 5:​13-15) నమ్మకంగా సేవించేందుకు దోహదపడే సహాయకాల్లో క్రమంగా బైబిలు అధ్యయనం చేయడం, క్రైస్తవ కూటాలకు, సమావేశాలకు హాజరు కావడం కూడా ఉన్నాయి. దేవునితో మనకున్న సన్నిహిత సంబంధం మనం ఆయనను నమ్మకంగా సేవించేందుకు తోడ్పడుతుంది. మనం తింటున్నా, త్రాగుతున్నా లేక వేరే ఏమి చేస్తున్నా అన్నీ దేవుని మహిమ కొరకే చేయాలని కోరుకుంటాం. (1 కొరింథీయులు 10:​31) నిజానికి, యెహోవాను సంతోషపరిచే జీవిత విధానంలో కొనసాగాలంటే ప్రార్థనాపూర్వకంగా ఆయన మీద ఆధారపడడం చాలా ముఖ్యం.​—⁠కీర్తన 37:⁠5.

18 కొన్నిసార్లు మనం ఆధ్యాత్మికంగా బలంగా లేమని భావిస్తున్నప్పుడు సాతాను మనపై దాడి చేస్తాడు. సింహం బలహీనంగా ఉన్న జంతువుపై దాడి చేస్తుంది. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్యం వంటివి మన ఆధ్యాత్మిక బలాన్ని హరించివేయగలవు. అయినా దేవుణ్ణి సంతోషపరిచే వాటిని చేయడంలో వెనుకాడకుండా ఉందాము, ఎందుకంటే పౌలు ఇలా అన్నాడు: “నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను.” (2 కొరింథీయులు 12:​10; గలతీయులు 6:⁠9; 2 థెస్సలొనీకయులు 3:​13) ఆయన మాటల భావమేమిటి? మనం బలం కోసం యెహోవా దేవుని వైపు తిరిగితే, దేవుని శక్తి మానవ బలహీనతలను దూరం చేస్తుంది అని ఆయన భావం. గొల్యాతుపై దావీదు సాధించిన విజయం, దేవుడు తన ప్రజలను బలపరచగలడని, బలపరుస్తాడని చూపిస్తోంది. ఈ కాలంలోని యెహోవాసాక్షులు, క్లిష్ట పరిస్థితుల్లో బలపరిచే దేవుని హస్తాన్ని తాము చవి చూశామని సాక్ష్యమిస్తారు.​—⁠దానియేలు 10:​18, 19.

19 ఒక వివాహిత జంట, తమకు దేవుడు ఇచ్చిన మద్దతు గురించి ఇలా వ్రాశారు: “మేము భార్యాభర్తలుగా యెహోవాను అనేక సంవత్సరాల నుండి సేవిస్తున్నాం, ఎన్నో ఆశీర్వాదాలు పొందాము, అద్భుతమైన అనేకమందిని కలుసుకున్నాం. కష్టాలను విజయవంతంగా సహించడానికి యెహోవా మాకు శిక్షణనిచ్చాడు, బలపరిచాడు కూడా. యోబు అర్థం చేసుకోనట్లే, మేము కొన్ని విషయాలు అలా ఎందుకు జరిగాయో అన్ని సమయాల్లో అర్థం చేసుకోలేదు, అయినా యెహోవా ఎల్లప్పుడూ మాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడని మాకు తెలుసు.”

20 యెహోవా హస్తం నమ్మకస్తులైన తన ప్రజలకు మద్దతు ఇవ్వకుండా, బలపరచకుండా కురచకాదు. (యెషయా 59:⁠1) కీర్తనకర్త దావీదు ఇలా పాడాడు: “యెహోవా పడిపోవువారినందరిని ఉద్ధరించువాడు, క్రుంగిపోయిన వారినందరిని లేవనెత్తువాడు.” (కీర్తన 145:​14) నిజానికి మన పరలోకపు తండ్రి, ‘అనుదినము మన భారము భరించుచున్నాడు,’ మనకు నిజంగా అవసరమైన వాటిని సమకూరుస్తున్నాడు.​—⁠కీర్తన 68:​19.

మనకు “దేవుడిచ్చు సర్వాంగకవచము” అవసరం

21 మనం సాతాను తంత్రాలను కొన్నింటిని పరిశీలించాం, అతని దాడులను ఎదుర్కోవడానికి స్థిరంగా నిలబడవలసిన అవసరాన్నీ చూశాం. ఇప్పుడు మనం మన విశ్వాసాన్ని విజయవంతంగా కాపాడుకోవడానికి అవసరమైన, ప్రాముఖ్యమైన మరో ఏర్పాటును పరిశీలిద్దాం. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు వ్రాసిన పత్రికలో, సాతాను కుతంత్రాలకు వ్యతిరేకంగా స్థిరంగా నిలబడడానికి, దురాత్మల సమూహములతో మనం చేసే పోరాటంలో విజయమొందడానికి సంబంధించి ఒక ముఖ్యమైన విషయాన్ని రెండుసార్లు ప్రస్తావించాడు. పౌలు ఇలా వ్రాశాడు: “మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగకవచమును ధరించుకొనుడి. . . . మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చినవారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు సర్వాంగకవచమును ధరించుకొనుడి.”​—⁠ఎఫెసీయులు 6:​11, 13.

22 అవును, మనం ‘దేవుడిచ్చు సర్వాంగ కవచము’ ధరించవలసిన అవసరం ఉంది. పౌలు ఎఫెసీయులకు పత్రిక వ్రాసినప్పుడు, ఒక రోమా సైనికుడు ఆయనకు కాపలాగా ఉన్నాడు, అతడు అప్పుడప్పుడు సర్వాంగ కవచమును ధరించే ఉంటాడు. అయితే అపొస్తలుడు ఇక్కడ యెహోవాను సేవించే ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమైన ఆధ్యాత్మిక కవచం గురించి చర్చించేందుకు, దేవుని ప్రేరణతోనే పురికొల్పబడ్డాడు.

23 యెహోవా దేవుడిచ్చే కవచంలో, ఒక క్రైస్తవునిలో తప్పకుండా ఉండవలసిన లక్షణాలతోపాటు, దేవుడు చేసిన ఆధ్యాత్మిక ఏర్పాట్లు కూడా ఇమిడివున్నాయి. దీని తర్వాతి ఆర్టికల్‌లో, ఆ ఆధ్యాత్మిక కవచంలోని ఒక్కో భాగాన్ని పరిశీలిద్దాం. ఆధ్యాత్మిక యుద్ధం చేసేందుకు మనం ఎంత మేరకు సంసిద్ధంగా ఉన్నామో నిర్ణయించుకునేందుకు ఆ పరిశీలన దోహదపడుతుంది. అదే సమయంలో, యేసుక్రీస్తు అద్భుతమైన మాదిరి, అపవాదియైన సాతానును ఎదిరించడంలో సఫలమయ్యేందుకు మనకు ఎలా సహాయపడుతుందో చూద్దాం.

మీరెలా సమాధానం ఇస్తారు?

క్రైస్తవులందరూ ఎలాంటి పోరాటం పోరాడాలి?

సాతాను కుతంత్రాలను కొన్నింటిని వర్ణించండి.

తోటి విశ్వాసుల మద్దతు మనల్ని ఎలా బలపరచగలదు?

మనం ఎవరి బలంపై ఆధారపడాలి, ఎందుకు?

[అధ్యయన ప్రశ్నలు]

1. (ఎ) సుమారు 3,000 సంవత్సరాల క్రితం ఎలాంటి అసాధారణమైన యుద్ధం జరిగింది? (బి) ఏ కారణం వల్ల దావీదు విజయం సాధించగలిగాడు?

2. క్రైస్తవులు ఎటువంటి యుద్ధంలో పాల్గొంటారు?

3. మనం తప్పకుండా విజయం సాధించాలంటే, ఎఫెసీయులు 6:⁠10 ప్రకారం మనకు ఏమి కావాలి?

4. మనం ఈ ఆర్టికల్‌లో పరిశీలించే రెండు ముఖ్యాంశాలు ఏవి?

5. ఎఫెసీయులు 6:12లో ఉపయోగించబడిన ‘పోరాటం’ అనే పదం, మనం సాతాను వ్యూహాలను గ్రహించడానికి ఎలా దోహదపడుతుంది?

6. మన విశ్వాసాన్ని క్షీణింపజేసేందుకు అపవాది వివిధ కుయుక్తులను ఎలా ఉపయోగించగలడో లేఖనాల నుండి చూపించండి.

7. దయ్యాలకు ఎలాంటి పరిమితులు ఉన్నాయి, మనకు ఎలాంటి సదవకాశాలు ఉన్నాయి?

8, 9. యోబు యథార్థతను భంగం చేయడానికి సాతాను ఆయనపైకి ఎలాంటి శోధనలు తెచ్చాడు, నేడు మనం ఎలాంటి ఆధ్యాత్మిక ప్రమాదాలను ఎదుర్కొంటున్నాం?

10-12. (ఎ) విత్తువాని ఉపమానంలో యేసు ఏమని హెచ్చరించాడు? (బి) ఆధ్యాత్మిక విలువలకు ఊపిరాడకుండా ఎలా చేయబడుతుందో వివరించండి.

13, 14. మనపై సాతాను దాడిచేసినప్పుడు మనం ఎలా నిలబడాలి?

15, 16. స్థిరంగా నిలబడేందుకు తోటి విశ్వాసుల మద్దతు ఎలా సహాయపడగలదో ఒక లేఖనాధారిత ఉదాహరణ ఇవ్వండి.

17. మనం దేవుణ్ణి నమ్మకంగా సేవించేందుకు ఏమి సహాయం చేయగలదు?

18. కృంగదీసే పరిస్థితులు మన బలాన్ని హరించివేసినా మనం ఎందుకు నిరాశ చెందకూడదు?

19. యెహోవా తన సేవకులను ఎలా బలపరచగలడో చూపించే ఒక ఉదాహరణ ఇవ్వండి.

20. యెహోవా తన ప్రజలకు ఎల్లప్పుడూ మద్దతునిస్తాడని ఏ లేఖనాధారిత రుజువు చూపిస్తోంది?

21. ఆధ్యాత్మిక కవచపు అవసరాన్ని పౌలు ఏ విధంగా నొక్కిచెప్పాడు?

22, 23. (ఎ) మన ఆధ్యాత్మిక కవచంలో ఏమేమి ఉన్నాయి? (బి) దీని తర్వాతి ఆర్టికల్‌లో మనం ఏమి పరిశీలిస్తాం?

[11వ పేజీలోని చిత్రాలు]

క్రైస్తవులు ‘దురాత్మల సమూహములతో పోరాడాలి’

[12వ పేజీలోని చిత్రం]

ఈ విధానపు చింతలు రాజ్య వాక్యమును అణచివేయగలవు

[13వ పేజీలోని చిత్రం]

తోటి క్రైస్తవులు “బలపరిచే సహాయకం”గా ఉండగలరు

[14వ పేజీలోని చిత్రం]

బలం కోసం మీరు దేవుణ్ణి ప్రార్థిస్తారా?