కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘యోగ్యులైనవారి’ కోసం వెదకండి

‘యోగ్యులైనవారి’ కోసం వెదకండి

‘యోగ్యులైనవారి’ కోసం వెదకండి

మన సామాన్య శకంలోని మొదటి శతాబ్దంలో దమస్కు వర్ధిల్లుతున్న పట్టణంగా ఉండేది. చుట్టూ పండ్ల తోటలతో ఉండే ఆ పట్టణం, తూర్పు నుండి వచ్చే బిడారులకు సేదదీర్చే ఒయాసిస్‌లా ఉండేది. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత కొంతకాలానికే దమస్కులో ఒక క్రైస్తవ సంఘం స్థాపించబడింది. ఆ సంఘ సభ్యుల్లో యూదులు కూడా ఉండేవారు, వాళ్ళు బహుశా సా.శ. 33వ సంవత్సరంలో యెరూషలేములో పెంతెకొస్తు పండుగ సమయంలో యేసు అనుచరులుగా మారి ఉండవచ్చు. (అపొస్తలుల కార్యములు 2:​5, 41) స్తెఫను రాళ్ళతో కొట్టబడి చంపబడిన తర్వాత తలెత్తిన హింస కారణంగా కొంతమంది శిష్యులు యూదయ నుండి దమస్కుకు వెళ్ళి ఉండవచ్చు.​—⁠అపొస్తలుల కార్యములు 8:⁠1.

బహుశా సా.శ. 34వ సంవత్సరంలో, దమస్కుకు చెందిన క్రైస్తవుడైన అననీయ ఒక అసాధారణమైన పనికి నియమించబడ్డాడు. ప్రభువు ఆయనకు ఇలా చెప్పాడు: “నీవు లేచి, తిన్ననిదనబడిన వీధికి వెళ్లి, యూదా అను వాని యింట తార్సువాడైన సౌలు అనువానికొరకు విచారించుము; ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు.”​—⁠అపొస్తలుల కార్యములు 9:10-11.

తిన్ననిది అని పిలువబడే వీధి దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల పొడవు ఉండి దమస్కు మధ్య భాగంలో ఉండేది. 19వ శతాబ్దంలో చెక్కబడిన ఈ పక్కనున్న చిత్రం ప్రకారం, ప్రాచీన కాలంలో ఆ వీధి ఎలా ఉండేదో మనకు తెలుస్తుంది. ఆ వీధిని బట్టి చూస్తే, అననీయ యూదా ఇంటిని కనుగొనడానికి కొంతసేపు వెదికి ఉండవచ్చు. అయితే చివరకు అననీయ ఆ ఇంటిని కనుగొన్నాడు, ఆయన అక్కడకు వెళ్ళినందువల్ల సౌలు సువార్తను అత్యంతాసక్తితో ప్రకటించే అపొస్తలుడైన పౌలుగా మారాడు.​—⁠అపొస్తలుల కార్యములు 9:12-19.

యేసు తన శిష్యులను పంపించి, సువార్తను వినడానికి ‘యోగ్యులైనవారి’ కోసం వెదకమని వారికి చెప్పాడు. (మత్తయి 10:​11) అననీయ సౌలు కోసం అక్షరార్థంగా వెదికాడని తెలుస్తోంది. అననీయ వలె యెహోవాసాక్షులు కూడా యోగ్యులైనవారి కోసం సంతోషంగా వెదుకుతారు, ప్రజలు రాజ్య సువార్తను అంగీకరించినప్పుడు వాళ్ళు ఎంతగానో ఆనందిస్తారు. యోగ్యులైనవారిని కనుగొంటే, చేసిన కృషికి ఫలితం లభించినట్లే.​—⁠1 కొరింథీయులు 15:58.

[32వ పేజీలోని చిత్రం]

నేటి “తిన్ననిదనబడిన వీధి”

[32వ పేజీలోని చిత్రసౌజన్యం]

From the book La Tierra Santa, Volume II, 1830