కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

రొట్టెను అందించే తిరుగలి

రొట్టెను అందించే తిరుగలి

రొట్టెను అందించే తిరుగలి

రొట్టె “జీవానికి చాలా ముఖ్యమైనది,” “ఆహారాలన్నింటిలో ముఖ్యమైనది,” “అనాదిగా మానవునికి ఆసరాగా, దన్నుగా ఉంటున్న ఆహారం” అని చెబుతారు. అవును అనాదిగా రొట్టె ముఖ్యమైన ఆహారంగా ఉంటోంది. నిజానికి మనిషికి కావలసిన వాటిలో, తన అనుదినాహారాన్ని సంపాదించుకోవడం అత్యంత ప్రాముఖ్యమైనది.

రొట్టెకు కావలసిన ప్రధాన పదార్థం పిండి, లేదా ధాన్యాలను నూరి తీసే చూర్ణం. అంటే మరపట్టడం ఒక ప్రాచీన కళే. సౌకర్యవంతమైన యంత్రాలు లేకుండా ధాన్యాన్ని పిండిగా మార్చడమంటే ఎంత శ్రమతో కూడిన పనో కదా! బైబిలు కాలాల్లో, తిరుగలి ధ్వని వినిపిస్తే సాధారణ, శాంతిభరిత పరిస్థితులున్నట్లు, దాని ధ్వని వినబడకపోతే విషాదమున్నట్లు పరిగణించబడేది.​—⁠యిర్మీయా 25:​10, 11.

మానవ చరిత్రలో మరపట్టడానికి ఎలాంటి చరిత్ర ఉంది? మరపట్టడానికి ఉపయోగించిన కొన్ని పద్ధతులు, సాధనాలు ఏవి? ఈ కాలంలో ఎలాంటి తిరుగలి మీకు రొట్టెను అందిస్తోంది?

అవి ఎందుకవసరం?

మొదటి మానవ దంపతులైన ఆదాముహవ్వలతో, యెహోవా ఇలా అన్నాడు: “ఇదిగో భూమిమీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలముగల ప్రతి వృక్షమును మీ కిచ్చి యున్నాను; అవి మీ కాహారమగును.” (ఆదికాండము 1:​29) యెహోవా దేవుడు మానవాళికి ఇచ్చిన ఆహారాల్లో తృణధాన్యాలు కూడా ఉన్నాయి. గోధుమలు, బార్లీ, రై, యవలు, వరి, చిరు ధాన్యం, జొన్నలు, మొక్కజొన్నలు వంటి ధాన్యాలన్నింటిలో పిండి పదార్థాలు ఉన్నాయి కాబట్టి అవి మానవ మనుగడకు ఎంతో ముఖ్యమైనవి, వాటిని చక్కెరగా మార్చుకునే సామర్థ్యం మానవ శరీరానికి ఉంది, ఆ చక్కెరే మన శరీరానికి ప్రధాన ఇంధనం.

అయితే ఉన్నది ఉన్నట్లు, ముడి ధాన్యాలను జీర్ణం చేసుకునే శక్తి మానవునిలో లేదు. ముడి ధాన్యాలను పిండిగా చేసి వండినప్పుడు మాత్రమే మానవులకు తినడానికి సులభంగా ఉంటుంది. ధాన్యాన్ని పిండిగా మార్చే సులభమైన మార్గాలేమిటంటే రెండు రాళ్ళ మధ్య నూరడం, విసరడం లేదా రెండు పద్ధతులూ ఉపయోగించడం.

మనుష్యులు నడిపించే తిరుగలి

ప్రాచీన ఈజిప్టు సమాధుల్లో లభించిన చిన్న చిన్న విగ్రహాల ద్వారా, ప్రాచీన కాలంలో పుటాకారపు విసురురాయిని ధాన్యపు మరగా ఉపయోగించేవారని తెలుస్తోంది. దాని ఆకృతి పుటాకారంలో ఉండడం వల్ల అలా పిలువబడేది. ఈ విసురురాయిలో రెండు రాళ్ళు ఉంటాయి. కాస్త లోపలికి వంగి ఏటవాలుగా ఉండే రాయి కింద ఉంటుంది, కాస్త చిన్నగా ఉండే రాయి పైన ఉంటుంది. సాధారణంగా దీనిమీద పనిచేసే స్త్రీ, ఆ పరికరం ముందర మోకాళ్ళపై కూర్చొని పైన ఉండే రాయిని రెండు చేతులతో పట్టుకొని, తన పైభాగపు శరీర భారాన్ని ఆ రాయిపై మోపి, కిందున్న రాయిపైన దాన్ని ముందుకూ వెనక్కూ కదుపుతూ ఆ రెండు రాళ్ళ మధ్య ధాన్యాన్ని నూరేది. ఈ సాధనం చాలా సులభమైనదే అయినా సమర్థమైనది!

కానీ అలా గంటల కొద్దీ వంగి పనిచేయడం వల్ల హానికలిగేది. పైనుండే రాయిని కిందుండే రాయి అంచు వరకు నొక్కుకుంటూ పోయి అదే వేగంతో వెనక్కి లాగుతుండడం వల్ల వెన్నెముక, ముంజేతులు, తొడలు, మోకాళ్ళు, కాలి బొటన వ్రేళ్ళు చాలా ఒత్తిడికి గురయ్యేవి. ప్రాచీన సిరియాలోని అస్థి పంజరాల్లో కనబడ్డ ఎముకల అవకతవకలపై జరిపిన అధ్యయనాలను బట్టి, అలాంటి విసురురాళ్ళను ఉపయోగించడం వల్లనే స్త్రీలు పదే పదే ఒత్తిడికి గురై మోకాలి చిప్పలపై గంట్లు, వెన్నెముకలోని చివరి వెన్నుపూసకు హాని, కాలి బొటన వ్రేలి ఎముక చివర్లలో తీవ్రమైన వాపు వంటివి సంభవించాయని పురాజీవ శాస్త్రజ్ఞులు నమ్ముతున్నారు. ప్రాచీన ఈజిప్టులో తిరుగలిని ఎక్కువగా పనివాళ్ళే ఉపయోగించేవారని తెలుస్తోంది. (నిర్గమకాండము 11:⁠5) * ఇశ్రాయేలీయులు ఈజిప్టు వదిలి వెళ్ళేటప్పుడు పుటాకారపు విసురురాళ్ళ వంటి తిరుగల్లను తమతోపాటు తీసుకువెళ్ళారని కొందరు పండితులు విశ్వసిస్తున్నారు.

మరపట్టే సాధనాలలో తర్వాత జరిగిన అభివృద్ధి వల్ల రెండు రాళ్ళకు గాడి చేసి దాని సామర్థ్యాన్ని మెరుగుపరచడం జరిగింది. పైనుండే రాయికి శంఖువు ఆకారంలో ఒక రంధ్రం చేయడంతో, తిరుగలిని ఉపయోగించే వ్యక్తి దానిలో ధాన్యం పోయడానికి సులభమయ్యేది, ఆ ధాన్యం ఆ రంధ్రం గుండా రెండు రాళ్ళ మధ్యకు నెమ్మదిగా జాలువారేది. సా.శ.పూ. నాలుగవ లేక అయిదవ శతాబ్దానికల్లా గ్రీసులో, ఒక సులువైన మర యంత్రం రూపొందించబడింది. సమతలంగా ఉండే ఒక పిడికి లేక కడ్డీకి ఒక చివర చీల అమర్చి పైనుండే రాయికి బిగించేవారు. ఆ కడ్డీ మరో చివర పట్టుకొని కాస్త వంచినట్లు వెనక్కు, ముందుకు కదపడం వల్ల ధాన్యం నింపబడిన రాయి కిందున్న రాయితో రాసుకునేది.

పైన పేర్కొన్న మరపట్టే సాధనాలన్నిటికీ పరిమితులున్నాయి. అవన్నీ ముందుకు, వెనక్కు కదిపే చర్యపైనే ఆధారపడేవి, కాబట్టి ఆ పని చేయడానికి ఏ జంతువుకూ శిక్షణనివ్వడం అయ్యేది కాదు. అందుకే అవన్నీ మానవ శక్తిపైనే ఆధారపడాల్సి వచ్చేది. తర్వాతి కాలంలో కలిగిన సాంకేతిక విజ్ఞానాభివృద్ధితో గుండ్రంగా తిరిగే తిరుగలి ఉనికిలోకి వచ్చింది. వాటిని జంతువులతో నడిపించవచ్చు.

గుండ్రంగా తిరిగే తిరుగలి పనిని సులభం చేస్తుంది

గుండ్రంగా తిరిగే తిరుగలిని బహుశా మధ్యధరా చుట్టుపక్కల దేశాల్లో సా.శ.పూ. రెండవ శతాబ్దంలో కనిపెట్టి ఉండవచ్చు. సా.శ. మొదటి శతాబ్దానికల్లా పాలస్తీనాలోని యూదులకు ఆ తిరుగలి తెలుసు, అందుకే యేసు “పెద్ద [“గాడిద చేత తిప్పబడేంత,” NW] తిరుగటిరాయి” గురించి మాట్లాడాడు.​—⁠మార్కు 9:​42.

జంతువుల చేత నడిపించబడే తిరుగలి రోము నగరంలోనేకాక, రోమా సామ్రాజ్యంలోని చాలా ప్రాంతాల్లో ఉపయోగించబడింది. అలాంటి అనేక తిరుగల్లు పాంపేయీలో ఇప్పటికీ ఉన్నాయి. సమయాన్ని కొలిచే సాధనం ఆకారంలో ఉంటాయవి, ధాన్యమును నింపడానికి అనువుగా పైరాయి ఉంటుంది, ఒక కొన శంఖువు ఆకారంలో ఉండే రాయి కింద ఉంటుంది. పైనుండే రాయి కింది రాయి మీదుగా తిరుగుతున్నప్పుడు రెండు రాళ్ళ మధ్యలో ధాన్యపు గింజలు పోస్తూ విసిరేవారు. అలాంటి తిరుగల్ల పైభాగపు రాళ్ళు సైజులు 18 నుండి 36 అంగుళాల వ్యాసార్థంలో ఉండేవి. ఈ తిరుగల్లు ఆరు అడుగుల ఎత్తు వరకు ఉండేవి.

తేలికైన చేతి తిరుగల్లు, జంతువులు లాగే తిరుగల్ల నుండి వృద్ధి చెందాయా లేక జంతువులు లాగే తిరుగల్లు చేతి తిరుగల్ల నుండి వృద్ధి చెందాయా అన్నది స్పష్టంగా తెలియదు. ఏదేమైనా చేతితో తిప్పే తిరుగలి అయితే ఉపయోగించడానికైనా ఎక్కడికైనా తీసుకువెళ్ళడానికైనా అనుకూలంగా ఉండేది. ఇది దాదాపు 12 నుండి 24 అంగుళాల వ్యాసంగల గుండ్రని రెండు రాళ్లతో రూపొందించబడేది. పైరాయి కాస్త వంగినట్లు అడుగు భాగం లోపలికి నొక్కుకుపోయినట్లు ఉండేది, కింది రాయి కాస్త ఉబ్బెత్తుగా ఉండేది కాబట్టి కిందిరాయి మీద పైరాయి చక్కగా అమరుతుంది. మధ్యలో ఉండే ఉతక మీద పైరాయిని ఉంచి కర్ర పిడితో తిప్పేవారు. ఇద్దరు స్త్రీలు ఎదురెదురుగా కూర్చొని చెరొక చేయితో పిడిని పట్టుకొని మీది రాయిని తిప్పేవారు. (లూకా 17:​35) రెండవ చేత్తో ఒకరు పైనుండి కొద్ది కొద్దిగా ధాన్యం పోస్తే మరొకరు దాని కింద పరచిన పళ్ళెం లాంటి దానిలో లేదా గుడ్డపై పడే పిండిని సమకూర్చేవారు. ఇలాంటి తిరుగలి మర యంత్రాలకు దూరంగా నివసించే సైనికులకు, నావికులకు, చిన్న చిన్న కుటుంబాలకు ప్రయోజనకరంగా ఉండేది.

నీళ్ళు లేక గాలితో పనిచేసేవి

సుమారు సా.శ.పూ. 27లో రోమా ఇంజనీరు విట్రూవియస్‌, తన కాలంలోని నీటితో నడిపించబడే తిరుగలి ఎలా ఉండేదో తెలిపాడు. సమతలంగా ఉండే ఒక ఇరుసుకు వృత్తాకారంలో ఉండే ఒక చక్రమును బిగించేవారు, నీటి ప్రవాహం నుండి నీరు దాని రెక్కల మీద ధారగా పడినప్పుడు ఆ చక్రం తిరిగేది. చక్రంలోని ఆ కదలిక, గేర్లు లేక పళ్ళ చక్రాల ద్వారా సమతలంగా ఉన్న ఇరుసును తిరిగేలా చేసేది. ఆ ఇరుసు తిరుగలి పై భాగంలో ఉండే పెద్ద రాయిని తిప్పేది.

మిగతా తిరుగల్లతో పోలిస్తే నీటితో నడిపించబడే తిరుగలి వల్ల కలిగే ఫలితం ఎలా ఉండేది? చేతి తిరుగల్లు గంటకు 10 కిలోలకంటె తక్కువ ధాన్యమును పిండిచేస్తే, జంతువులతో నడిపించబడే అత్యంత సమర్థవంతమైన తిరుగల్లు 50 కిలోల వరకు పిండిచేసేవి. విట్రూవియస్‌ నీటి తిరుగలి విషయానికి వస్తే, అది గంటకు 150 నుండి 200 కిలోల వరకు పిండిచేయగలిగేది. విట్రూవియస్‌ వర్ణించిన ఈ ప్రాథమిక సూత్రమే అనేక మార్పులు చేర్పులతో, ఆ తర్వాత శతాబ్దాల వరకు సమర్థవంతులైన మర నిర్మాణకుల చేత ఉపయోగించబడింది.

శక్తితో నడిపించబడే తిరుగటి రాళ్ళ కోసం కేవలం ప్రవహించే నీళ్ళను మాత్రమే సహజ శక్తిగా ఉపయోగించలేదు. నీటితో తిరిగే చక్రాలకు బదులుగా గాలిమర రెక్కలు బిగించినా లక్ష్యం పూర్తయ్యేది. యూరపులో గాలిమరలు బహుశా సా.శ. 12వ శతాబ్దంలో వచ్చి ఉంటాయి. అవి బెల్జియం, జర్మనీ, హాలెండ్‌లలోనే కాక ఇతర ప్రాంతాల్లోనూ విస్తృతంగా ఉపయోగించబడ్డాయి. ఆవిరితో నడిపించబడే మరలు, ఆ తర్వాత ఇతర శక్తులతో నడిపించబడే మరలు వచ్చేంతవరకు అవి నడిపించబడ్డాయి.

‘మన అనుదినాహారము’

అభివృద్ధి జరిగినప్పటికీ, గతంలో ఉపయోగించబడిన అనేక రకాల తిరుగల్లు భూమి మీద ఏదో ఒక ప్రాంతంలో ఇప్పటికీ ఉపయోగంలో ఉన్నాయి. ఆఫ్రికా మరియు ఓషియేనియాలోని భాగాల్లో ఇప్పటికీ రోలు, రోకలి ఉపయోగిస్తారు. మెక్సికోలో, మధ్య అమెరికాలో టార్టిల్లాస్‌ అనబడే సన్నని కేకు కోసం మొక్కజొన్నల పిండి రుబ్బడానికి పుటాకారపు మరనే ఉపయోగిస్తారు. అనేక నీటిమరలు గాలిమరలు ఇప్పటికీ అక్కడక్కడ కనబడుతూనే ఉంటాయి.

అభివృద్ధి చెందిన దేశాల్లో రొట్టెలు చేయడానికి ఉపయోగించబడే పిండి, ఎక్కువమేరకు నేడు పూర్తిగా యంత్రాల సహాయంతో, స్వయంచాలక మరల సహాయంతో ఉత్పత్తి చేయబడుతోంది. జంటగా బిగించబడిన లోహపు గొట్టాలు వివిధ వేగాలతో తిరుగుతుండగా, అలాంటి పలు గొట్టాల మధ్య నుండి ధాన్యపు గింజలు జారుతూ క్రమంగా పిండిగా మారతాయి. ఈ పద్ధతి పలు రకాల పిండిని తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయడాన్ని సాధ్యం చేస్తుంది.

రొట్టెల కోసం పిండి కావాలంటే, నిస్సందేహంగా ఒకప్పుడు కష్టపడ్డట్లు ఇప్పుడు కష్టపడాల్సిన అవసరం లేదు. అయినా మనకు ధాన్యాలను ఇస్తున్నందుకూ, వాటిని ‘మన అనుదినాహారముగా’ చేసుకునేందుకు కావలసిన నైపుణ్యతను ఇచ్చినందుకూ మనం మన సృష్టికర్తకు ఎంతో కృతజ్ఞులం.​—⁠మత్తయి 6:​11.

[అధస్సూచి]

^ పేరా 10 బైబిలు కాలాల్లో బంధీలుగా చిక్కిన శత్రువులతో తిరుగలి విసిరే పని చేయించేవారు. సమ్సోను, ఇతర ఇశ్రాయేలీయులు వంటివారు దానికి ఉదాహరణ. (న్యాయాధిపతులు 16:​21, 22; విలాపవాక్యములు 5:​13) గృహిణులు తమ ఇంటి కోసం తామే ధాన్యం విసురుకునేవారు.​—⁠యోబు 31:​10.

[23వ పేజీలోని చిత్రం]

ఈజిప్టుల పుటాకారపు పొత్రము

[చిత్రసౌజన్యం]

Soprintendenza Archeologica per la Toscana, Firenze

[23వ పేజీలోని చిత్రం]

జంతువులతో నడిపించబడే తిరుగలిలో ఒలీవల నూనె తీసేవారు

[22వ పేజీలోని చిత్రసౌజన్యం]

From the Self-Pronouncing Edition of the Holy Bible, containing the King James and the Revised versions