కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“సముద్రముల సమృద్ధి”

“సముద్రముల సమృద్ధి”

యెహోవా సృష్టి వైభవాలు

“సముద్రముల సమృద్ధి”

సూర్యాస్తమయ సమయంలో పిల్లగాలి సముద్రాన్ని కదిలించినప్పుడు అలలు మృదువుగా తీరాన్ని తాకుతాయి. ప్రశాంతమైన ఆ అలల చప్పుడు, విశ్రాంతి కోసం ప్రశాంతత కోసం బీచ్‌కు వచ్చే చాలామందిని బలంగా ఆకర్షిస్తుంది. *

భూమిచుట్టూ ఉన్న వేలాది కిలోమీటర్ల తీరప్రాంతాల్లో అలాంటి పొడవైన బీచ్‌లు ఎన్నో ఉన్నాయి. ఇసుకను నీటిని వేరుచేసే ఈ సరిహద్దు రేఖ సముద్రపు పరిమితులను సూచిస్తుంది. సృష్టికర్త దానిని అలా ఉండాలనే రూపొందించాడు. దేవుడు తన గురించి మాట్లాడుతూ తాను ‘సముద్రానికి ఇసుకను సరిహద్దుగా నియమించానని’ చెబుతున్నాడు. అంతేకాక ‘దాని తరంగము లెంత పొర్లినను అవి ప్రబలలేవు, ఎంత ఘోషించినను దాని దాటలేవు’ అని కూడా ఆయన అంటున్నాడు.​—⁠యిర్మీయా 5:22; యోబు 38:8; కీర్తన 33:⁠7.

సౌర కుటుంబంలోని ఇతర గ్రహాలకు భిన్నంగా మన గ్రహం నీళ్ళతో నిండివుంది. 70 శాతం కంటే ఎక్కువ భూభాగం నీళ్ళతో నిండివుంది. భూమిని మానవుల నివాసంగా ఉండడానికి సిద్ధపరుస్తున్నప్పుడు యెహోవా ఇలా ఆజ్ఞాపించాడు: “ఆకాశము క్రిందనున్న జలము లొకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక.” అప్పుడు “ఆ ప్రకారమాయెను.” ఆ వృత్తాంతం ఇంకా ఇలా చెబుతోంది: “దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను.” (ఆదికాండము 1:​9, 10) సముద్రాల వల్ల ప్రయోజనం ఏమిటి?

సముద్రాల్లోని నీళ్ళు అనేక గమనార్హమైన విధానాల్లో జీవాన్ని కాపాడడానికి రూపొందించబడ్డాయి. ఉదాహరణకు, నీళ్ళకు వేడిని నిల్వచేసే సామర్థ్యం ఉంది. కాబట్టి సముద్రాలు ఎంతో పెద్ద మొత్తంలో వేడిని నిల్వ చేసుకొని, చలికాలపు చల్లదనాన్ని తగ్గించడానికి సహాయం చేస్తాయి.

నీళ్ళకు మరో విధంగా కూడా జీవాన్ని కాపాడే సామర్థ్యం ఉంది. ఇతర ద్రవాలు అన్నింటికన్నా ఎక్కువగా అది ఇతర పదార్థాలను కరిగించగలదు. జీవ ప్రక్రియలు రసాయన చర్యల వల్లనే సాధ్యమవుతాయి కాబట్టి, ప్రతిచర్య జరిగించే పదార్థాలను కరిగించి వాటి పరమాణువులు కలిసేలా చేయడానికి నీళ్ళు ఉండడం అవసరం. జీవంగల ధాతువుల్లో ఉండే అనేక రసాయన మిశ్రమాల్లో నీళ్ళు ఉంటాయి. ద సీ అనే పుస్తకం ఇలా వ్యాఖ్యానిస్తోంది: “జీవం ఏ రూపంలో ఉన్నా దానికి నీళ్ళు అవసరం, ఆ నీళ్ళు సముద్రాల నుంచే రావాలి, భూమిపై జీవించే మొక్కలకు జంతువులకు కూడా నీళ్ళు సముద్రాల నుండే వస్తాయి.”

భూమిపైనున్న సముద్రాలు వాతావరణాన్ని శుద్ధి చేయడంలో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తాయి. సముద్రాల్లో ఉండే ప్లాంక్‌టన్‌ అనే సూక్ష్మజీవులు కార్బన్‌ డయాక్సైడ్‌ను పీల్చుకుని ఆక్సిజన్‌ను వదులుతాయి. ఒక పరిశోధకుని ప్రకారం “ప్రతి సంవత్సరం వాతావరణానికి అందజేయబడే ఆక్సిజన్‌లో 70 శాతం సముద్రాల్లోని ప్లాంక్‌టన్‌ అనే సూక్ష్మజీవుల నుండే వస్తుంది.”

సముద్రాలు వ్యాధులను నయం చేయడానికి సహజమైన మందులను కూడా ఉత్పత్తి చేయగలవు. ఎన్నో శతాబ్దాలుగా చేపల నుండి సేకరించబడే ద్రావణాలు మందులుగా ఉపయోగించబడుతున్నాయి. కాడ్‌ లివర్‌ ఆయిల్‌ను మానవులు ఎంతోకాలంగా ఉపయోగిస్తున్నారు. ఇటీవలి కాలాల్లో చేపల నుండి మరియు సముద్రాల్లో ఉండే ఇతర ప్రాణుల నుండి తీయబడిన రసాయనాలు ఆస్తమాను నయం చేయడానికి, క్యాన్సర్‌తో మరియు వైరస్‌లతో పోరాడడానికి ఉపయోగించబడుతున్నాయి.

సముద్రాలు చేకూర్చే ప్రయోజనాల ఆర్థిక విలువను అంచనా వేయడానికి పరిశోధకులు కృషి చేశారు. దానిని ఖచ్చితంగా అంచనా వేయడం కష్టమే అయినా, భూ ఆవరణ వ్యవస్థ వల్ల కలిగే ప్రయోజనాల్లో దాదాపు మూడింట రెండు వంతుల ప్రయోజనం సముద్రాల నుండే కలుగుతోందని పరిశోధకులు అంచనా వేశారు. సముద్రాలు ఒక సంకల్పంతో సృష్టించబడ్డాయి అంటే జీవానికి అవసరమైన వాటిని అందజేయడానికి సృష్టించబడ్డాయి అనే వాస్తవాన్ని అది ధృవపరుస్తోంది. ఈ విషయం, “సముద్రముల సమృద్ధి” అని బైబిలు పిలుస్తున్న దానితో ఎంత పొందికగా ఉందో కదా!​—⁠ద్వితీయోపదేశకాండము 33:19.

ఈ సమృద్ధిని సృష్టించిన గొప్ప సృష్టికర్తగా యెహోవా మహిమపరచబడ్డాడు. నెహెమ్యా ఈ మాటల్లో ఆయనను స్తుతించడానికి కదిలించబడ్డాడు: “నీవే, అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును . . . సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటినన్నిటిని కాపాడువాడవు.”​—⁠నెహెమ్యా 9:⁠6.

[అధస్సూచి]

^ పేరా 3 యెహోవాసాక్షుల క్యాలెండర్‌​—⁠2004, సెప్టెంబరు/అక్టోబరు చూడండి.

[9వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

నీరు, గాలి, అలలు

నీళ్ళు గాలి కలిసి పెద్ద పెద్ద అలలను సృష్టిస్తాయి, ఆ అలలు అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ఇలాంటి రాళ్ళపై పెద్ద శబ్దం చేస్తూ కొట్టుకుంటాయి. అలలు ఎప్పుడూ సముద్రంలోని ఒక అద్భుతమైన భాగమే, అవి సముద్రాలకున్న అసాధారణమైన శక్తిని ప్రదర్శిస్తాయి. అవి మన సృష్టికర్తకున్న మహోన్నతమైన శక్తిని మనకు ఆశ్చర్యకరమైన విధంగా జ్ఞాపకం చేస్తాయి. యెహోవా ‘సముద్రతరంగముల మీద నడుస్తున్నాడు.’ “తన బలమువలన ఆయన సముద్రమును రేపును, తన వివేకమువలన రాహాబును పగులగొట్టును.” (యోబు 9:8; 26:​12) నిజమే, “విస్తారజలముల ఘోషలకంటెను బలమైన సముద్రతరంగముల ఘోషలకంటెను ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు.”​—⁠కీర్తన 93:⁠4.

ఇసుక శిల్పాలు

సముద్రతీరం అప్పుడప్పుడూ ఆకర్షణీయమైన ఇసుక శిల్పాలకు నెలవుగా తయారవుతుంది. దక్షిణాఫ్రికాకు చెందిన నమీబియా తీరంలోని ఈ గుట్టలు అలాంటివే. ఇసుకకు ఒక విశిష్టమైన రూపాన్ని ఇవ్వడంలో గాలి ప్రధాన పాత్ర పోషిస్తుంది. కొన్ని గుట్టలు కేవలం చిన్న దిబ్బల్లా కనిపిస్తే మరికొన్ని 400 మీటర్ల ఎత్తు వరకు చేరుకుంటాయి. ఇలా విస్తారంగా ఉండే ఇసుక, “సముద్రతీరమందలి యిసుకరేణువులు” అనే బైబిలు పదబంధాన్ని అర్థం చేసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. ఆ పదబంధం లెక్కించలేనిదాన్ని, కొలవడానికి కష్టమైనదానిని సూచించడానికి ఉపయోగించబడింది. (యెహోషువ 11:4) తుఫాను చెలరేగుతున్న సముద్రం చేసే దాడులను నియంత్రించడానికి యుక్తిగా ఈ ఇసుకను అడ్డుకట్టగా ఉంచిన సృష్టికర్త ముందు మనం భక్తిపూర్వక భయంతో నిలబడిపోతాము.

[9వ పేజీలోని చిత్రం]

సన్‌సెట్‌ కోస్ట్‌, బైట్‌ ఆఫ్‌ బయాఫ్రా, కామెరూన్‌