కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అలెకాండ్రా వ్రాసిన ఉత్తరం

అలెకాండ్రా వ్రాసిన ఉత్తరం

రాజ్య ప్రచారకుల నివేదిక

అలెకాండ్రా వ్రాసిన ఉత్తరం

ఉత్తరాలు వ్రాయడం ద్వారా సాక్ష్యమివ్వడం ఎంతోకాలంగా సత్ఫలితాలను సాధిస్తోంది. కొన్నిసార్లు దాని ఫలితాలు అనిశ్చితంగా అనిపించినా, ఈ పద్ధతిని ఉపయోగించడంలో పట్టుదలతో కొనసాగేవారు ఎంతగానో ఆశీర్వదించబడ్డారు. వాళ్ళు బైబిలు ఇచ్చిన ఈ జ్ఞానయుక్తమైన ఉపదేశాన్ని గుర్తుంచుకుంటారు: “ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందును నీ చేయి వెనుక తియ్యక విత్తుము, అది ఫలించునో యిది ఫలించునో లేక రెండును సరిసమానముగా ఎదుగునో నీవెరుగవు.”​—⁠ప్రసంగి 11:⁠6.

యెహోవాసాక్షుల మెక్సికో బ్రాంచి కార్యాలయంలో దాదాపు పది సంవత్సరాలుగా సేవ చేస్తున్న అలెకాండ్రా అనే యౌవన సాక్షి క్యాన్సర్‌కు కెమోథెరపీ చేయించుకుంటోంది. ఆమె పరిస్థితి క్షీణించడంవల్ల ఆమె తన దైనందిన కార్యకలాపాలను కొనసాగించలేనంతగా బలహీనమైపోయింది. అయితే తన పరిచర్యను నిర్లక్ష్యం చేయడం ఇష్టం లేక అలెకాండ్రా ఉత్తరాలు వ్రాయాలని నిర్ణయించుకుంది. ఆమె ఉచిత గృహ బైబిలు అధ్యయన ఏర్పాటు గురించి వ్రాసి తన తల్లి ఫోన్‌ నంబరు కూడా వ్రాసేది. ఆ తర్వాత ఆమె ఆ ఉత్తరాలను తన తల్లికి ఇచ్చేది, ఆమె ఇంటింటి పరిచర్య చేస్తున్నప్పుడు ఎవరైనా ఇంట్లో లేకపోతే ఆ ఉత్తరాలను వాళ్ళ కోసం ఆ ఇళ్ళలో వేసేది.

ఈలోపు, గ్వాటిమాలకు చెందిన డ్యోహానీ అనే యువతి మెక్సికోలోని కాన్కున్‌లో పనిమనిషిగా పని చేయడానికి వెళ్ళింది. అక్కడ ఆమెను యెహోవాసాక్షులు కలిశారు, వాళ్ళతో బైబిలు విషయాలపై జరిగే చర్చలను ఆమె ఆనందించేది. తర్వాత ఆమె యజమానులు మెక్సికో నగరానికి వెళ్ళాలని నిశ్చయించుకొని ఆమెను కూడా తమతోపాటు రమ్మన్నారు. వేరే ప్రాంతానికి వెళ్తే తనకు సాక్షులను కలుసుకునే అవకాశం ఉండదేమో అని డ్యోహానీ వాళ్ళతోపాటు వెళ్ళడానికి వెనుకాడింది.

“నువ్వేమీ బాధపడకు, సాక్షులు అన్ని ప్రాంతాల్లోను ఉంటారు. మనం అక్కడికి వెళ్ళిన వెంటనే మనం వాళ్ళను వెతికి పట్టుకుందాం” అని ఆమె యజమానులు ఆమెకు హామీ ఇచ్చారు. ఆ సంతోషకరమైన నిరీక్షణతో డ్యోహానీ వాళ్ళతోపాటు వెళ్ళడానికి అంగీకరించింది. మెక్సికో నగరానికి చేరుకున్న వెంటనే డ్యోహానీ యజమానులు సాక్షుల కోసం వెతకడం ప్రారంభించారు. ఆ నగరంలో 41,000 కంటే ఎక్కువమంది సాక్షులు, 730 సంఘాలు ఉన్నా ఏ కారణం చేతనో వాళ్ళు సాక్షులను కనుక్కోలేకపోయారు.

సాక్షులను వెతికి పట్టుకొని తన బైబిలు చర్చలను మళ్ళీ ప్రారంభించలేకపోయినందుకు డ్యోహానీ నిరుత్సాహపడడం ప్రారంభించింది. ఒకరోజు ఆమె యజమానురాలు ఆమె దగ్గరకు వచ్చి, “నీకో శుభవార్త! నీ దేవుడు నీ ప్రార్థనలను విన్నాడు” అని చెప్పింది. డ్యోహానీ చేతికి ఒక ఉత్తరం అందిస్తూ, “సాక్షులు నీ కోసం ఈ ఉత్తరం వదిలి వెళ్ళారు” అని ఆమె చెప్పింది. అది అలెకాండ్రా వ్రాసిన ఉత్తరం.

డ్యోహానీ అలెకాండ్రా తల్లిని, ఆమె చెల్లి బ్లాంకాను కలుసుకొని బైబిలు అధ్యయనం చేయడానికి ఒప్పుకుంది. కొన్ని వారాల తర్వాత ఆమె అలెకాండ్రాను కలుసుకుంది, వాళ్ళిద్దరూ ఒకరినొకరు కలుసుకున్నందుకు ఎంతో సంతోషించారు. ఆధ్యాత్మిక ప్రగతి సాధించేందుకు బైబిలు అధ్యయనాన్ని కొనసాగించమని అలెకాండ్రా డ్యోహానీని ప్రోత్సహించింది.

కొన్ని నెలల తర్వాత, 2003 జూలైలో అలెకాండ్రా మరణించింది. ఆమె తన తోటి విశ్వాసుల కోసం విశ్వాసధైర్యాలతో కూడిన చక్కని మాదిరిని వదిలి వెళ్ళింది. అంత్యక్రియలవద్ద డ్యోహానీని కలుసుకొని ఆమె అన్న ఈ మాటలు విన్నవారు చాలామంది ఎంతగానో కదిలించబడ్డారు: “అలెకాండ్రా, ఆమె కుటుంబం నాకు అద్భుతమైన మాదిరిని ఉంచారు. నేను యెహోవాకు సేవచేయాలని, త్వరలోనే బాప్తిస్మం తీసుకోవాలని తీర్మానించుకున్నాను. రానున్న పరదైసులో అలెకాండ్రాను తిరిగి చూడాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను.”

నిజమే ఒక ఉత్తరం చాలా చిన్నదే అయివుండవచ్చు. కానీ అది ఎంతటి అద్భుతమైన శాశ్వతమైన ప్రయోజనాలను చేకూర్చగలదో!