కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆమె తన నమ్మకాలను తన తోటి విద్యార్థులతో పంచుకుంది

ఆమె తన నమ్మకాలను తన తోటి విద్యార్థులతో పంచుకుంది

ఆమె తన నమ్మకాలను తన తోటి విద్యార్థులతో పంచుకుంది

మీ బైబిలు ఆధారిత నమ్మకాల విషయంలో మీ తోటి విద్యార్థులకు మంచి అవగాహన కలిగించేందుకు, మీరు వారికి సహాయపడాలని అనుకుంటున్నారా? పోలాండ్‌కు చెందిన మాగ్దాలేనా అనే 18 ఏండ్ల అమ్మాయి ఒక ఉన్నత పాఠశాల విద్యార్థిని, ఆమె ఒక యెహోవాసాక్షిగా తన నమ్మకాల గురించి తరచూ తన తోటి విద్యార్థులతో మాట్లాడేది. తత్ఫలితంగా, ‘ఒక యెహోవాసాక్షిగా ఉండడమంటే ఏమిటి? మీరు యేసుక్రీస్తును నమ్మరా?’ అనే ప్రశ్నలు ఆమెకు తరచూ ఎదురయ్యాయి. ఆమె తన తోటి విద్యార్థులకు ఎలా సహాయం చేయగలిగింది? మాగ్దాలేనా మార్గనిర్దేశం కోసం యెహోవాకు ప్రార్థన చేసి దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంది.​—⁠యాకోబు 1:⁠5.

ఒకరోజు మాగ్దాలేనా, తన నమ్మకాలను గౌరవించే ఉపాధ్యాయురాలిని, యెహోవాసాక్షులు​—⁠ఆ పేరు వెనుకనున్న సంస్థ (ఆంగ్లం) అనే వీడియోను తరగతికి చూపించడానికి అనుమతించమని కోరింది. * అందుకు ఆమె ఒప్పుకుంది. అప్పుడు మాగ్దాలేనా తన తోటి విద్యార్థులను ఇలా అడిగింది: “నేను ఒక స్నేహితుని ద్వారా మన తరగతికి 90 నిమిషాల ఒక కార్యక్రమాన్ని సమర్పించే ఏర్పాటు చేస్తున్నాను. అందులో వీడియో షో మరియు యెహోవాసాక్షుల గురించిన చర్చ ఉంటుంది. మీరు వస్తారా?” అందరూ వస్తామన్నారు. మాగ్దాలేనా, వాయ్‌త్సేఖ్‌ అనే అనుభవజ్ఞుడైన ఒక పూర్తికాల సువార్తికుడు కలిసి ఆ కార్యక్రమానికి సిద్ధపడడం ప్రారంభించారు.

ఆ కార్యక్రమం ప్రకారం, యెహోవాసాక్షులు​—⁠వారు ఎవరు? వారి నమ్మకాలు ఏమిటి?* అనే బ్రోషుర్‌ ఆధారంగా 20 నిమిషాల ప్రసంగంతో ప్రారంభించి, దాని తర్వాత ప్రశ్నలు జవాబుల చర్చ, ఆ తర్వాత పాఠశాల గ్రంథాలయంలో వీడియో చూపించాలని అనుకున్నారు. తరగతిలోని ప్రతీ విద్యార్థికి, కొన్ని బ్రోషుర్లు, యువత అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మకమైన సమాధానాలు (ఆంగ్లం) పుస్తకం,* కొన్ని కరపత్రాలు, పత్రికలు ఉన్న ఒక పెద్ద కవరు బహుమతిగా ఇవ్వబడతాయి.

ఆ ప్రదర్శనకు 14 మంది విద్యార్థులు హాజరయ్యారు, వారితో పాటు ఉపాధ్యాయురాలు, ఆ సమయంలో గ్రంథాలయంలో ఉన్న నలుగురు ఇతర విద్యార్థులు కూడా ఉన్నారు. వాయ్‌త్సేఖ్‌ మొదట కొందరు పోలిష్‌ కవులు తమ రచనల్లో యెహోవా అనే దేవుని నామము ఉపయోగించారని వివరించాడు. దేవుని నామము ఉపయోగించిన కొన్ని పాత క్యాథలిక్‌ బోధలను కూడా ఆయన ప్రస్తావించాడు. యెహోవాసాక్షుల ఆధునిక కార్యకలాపాలను వివరిస్తున్నప్పుడు, ఆయన వివిధ బ్రాంచి కార్యాలయాల బ్రోషుర్లను, కొన్ని సమావేశ హాళ్ళ ఫోటోలను చూపించాడు.

ఉత్సాహవంతమైన చర్చ జరిగింది. ప్రశ్నలకు జవాబులివ్వడానికి మాగ్దాలేనా, వాయ్‌త్సేఖ్‌లు బైబిలును ఉపయోగించారు. అది ప్రేక్షకులను ఆకట్టుకుంది, యెహోవాసాక్షులు తమ సొంత తలంపులను ప్రకటించడం లేదని వారికి నమ్మకం కలిగించింది. అప్పుడు అడగబడిన కొన్ని ప్రశ్నలు ఏవి, వాటికి జవాబులు ఎలా ఇవ్వబడ్డాయి?

ప్రశ్న: బైబిలంతా అనేక విధాలుగా అర్థాలు చెప్పగలిగే అస్పష్టమైన భాషతో, రూపకాలంకారాలతో ఉంది కదా, అలాంటప్పుడు బైబిలుకు అనుగుణంగా జీవించడం ఎలా సాధ్యమవుతుంది?

జవాబు: బైబిలు వయొలిన్‌ లాంటిది, దానితో మీరు మీకిష్టమైన ఏ రాగాన్నైనా పలికించవచ్చు అని కొందరంటారు. కానీ ఆలోచించండి: ఒక రచయిత చేసిన వ్యాఖ్యానాల భావమేమిటో తెలుసుకోవాలంటే, ఆయననే అడగడం మంచిది కాదా? పుస్తకాలు వ్రాసి మరణించిన రచయితల్లా కాక, బైబిలు గ్రంథకర్త అయిన యెహోవా దేవుడు సజీవంగా ఉన్నాడు. (రోమీయులు 1:​20; 1 కొరింథీయులు 8:​5, 6) ఒక లేఖన భావం తెలుసుకోవాలంటే, ఆ లేఖనమున్న భాగమే సరైన భావాన్ని సూచిస్తుంది. అంతేగాక, బైబిలు తరచుగా ఒకే విషయాన్ని అనేక చోట్ల చర్చిస్తుంది, కాబట్టి వాటిని పోల్చి చూడడం సహాయకరంగా ఉంటుంది. ఆ విధంగా మనం, దేవుడే మనకు ఆ లేఖనాన్ని వివరిస్తున్నట్లుగా మన ఆలోచనలకు ఆయన మార్గనిర్దేశాన్ని ఇచ్చేందుకు అనుమతించవచ్చు. అలా చేయడం ద్వారా, బైబిలులో వెల్లడి చేయబడిన ఆయన చిత్తాన్ని మనం తెలుసుకొని, దానికి అనుగుణంగా జీవించగలుగుతాం. కాదంటారా?

ప్రశ్న: క్రైస్తవులకు, యెహోవాసాక్షులకు మధ్యవున్న తేడా ఏమిటి?

జవాబు: మేము క్రైస్తవులం! అయితే యెహోవాసాక్షులు అలా చెప్పుకోవడమే కాక, తమ నమ్మకాలకు అనుగుణంగా, తమ ప్రయోజనం కోసం దేవుడు బోధిస్తున్న వాటికి అనుగుణంగా జీవించడానికి కృషి చేస్తారు. (యెషయా 48:​17, 18) వారి బోధలన్నీ బైబిలు ఆధారితమైనవే కాబట్టి, తమ దగ్గర సత్యమున్నదని వారికి తెలుసు.​—⁠మత్తయి 7:​13, 14, 21-23.

ప్రశ్న: మీకు ఏమాత్రం తెలియని అపరిచితులను కలిసి వారితో మాట్లాడాలని ఎందుకు పట్టుబడతారు? అలా చేయడం మీరు మీ విశ్వాసాన్ని ఇతరుల మీద రుద్దినట్లు కాదా?

జవాబు: వీధిలో వెళ్తున్న ఒక వ్యక్తి, ఒక విషయం గురించి మర్యాదపూర్వకంగా మీ అభిప్రాయాన్ని అడిగితే మీకు తప్పనిపిస్తుందా? (యిర్మీయా 5:⁠1; జెఫన్యా 2:​2, 3) (వాయ్‌త్సేఖ్‌, మాగ్దాలీనాలు ఇటీవల పోలాండ్‌లో వచ్చిన వరదల్లో కష్టాలు అనుభవించిన వారిపట్ల దేవునికి శ్రద్ధ ఉందా లేదా అనే అంశంపై వీధిలో వెళ్తున్న వారిని ఎలా అడిగారో ప్రదర్శించారు.) అవతలి వ్యక్తి అభిప్రాయం విన్న తర్వాత, మేము బైబిలు లేఖనం చూపిస్తాం. ఒకవేళ ఎవరైనా మాట్లాడడానికి ఇష్టపడకపోతే, ఫరవాలేదని మేము ముందుకుసాగిపోతాం. (మత్తయి 10:​11-14) అది సంభాషించమని ఇతరులను బలవంతం చేయడం అవుతుందా? లేక ప్రజలు ఇక ఎన్నడూ ఒకరితో ఒకరు మాట్లాడుకోకూడదా?

ప్రశ్న: మీరు పండుగలు ఎందుకు చేసుకోరు?

జవాబు: బైబిలు జ్ఞాపకం చేసుకొమ్మని ఆజ్ఞాపిస్తున్న ఒకే ఒక ఆచరణను మేము ఆచరిస్తాం, అదే యేసుక్రీస్తు మరణాన్ని జ్ఞాపకం చేసుకునే ఆచరణ. (1 కొరింథీయులు 11:​23-26) పండుగల విషయానికి వస్తే, ఎన్‌సైక్లోపీడియాలను, ఆధారపడదగిన ఇతర గ్రంథాలను పరిశీలిస్తే అవి ఎక్కడ నుండి పుట్టాయో మీకే తెలుస్తుంది. అది మీరు తెలుసుకుంటే, మేము అలాంటి పండుగలను ఎందుకు చేసుకోమో మీకు సులభంగా అర్థమవుతుంది.​—⁠2 కొరింథీయులు 6:​14-18.

ఇంకా అనేక ప్రశ్నలు అడగబడ్డాయి, జవాబులూ ఇవ్వబడ్డాయి. ఆ చర్చ ఎంతసేపు కొనసాగిందంటే చివరకు వీడియో ప్రదర్శన వాయిదా వేయవలసి వచ్చింది.

విద్యార్థులు ఎలా స్పందించారు? మాగ్దాలేనానే చెప్పనిద్దాం: “మామూలుగా ఇతరులతో మూర్ఖంగా, గేలిచేస్తూ ప్రవర్తించే కొందరు విద్యార్థులు గంభీరమైన ప్రశ్నలు అడగడం చూసి నేను విస్మయమొందాను. వారు తాము నాస్తికులమని చెప్పుకున్నప్పటికీ, చర్చ సమయంలో దేవునిపై విశ్వాసాన్ని వ్యక్తం చేశారు!” అక్కడ హాజరైనవారు మేమిచ్చిన బహుమతిని కృతజ్ఞతతో స్వీకరించారు​—⁠మొత్తం 35 పుస్తకాలు, 63 బ్రోషుర్లు, 34 పత్రికలు ఇవ్వబడ్డాయి.

ఆ పాఠశాల కార్యక్రమం వల్ల ఎంత అద్భుతమైన ఫలితాలు వచ్చాయో కదా! అది మాగ్దాలేనా తోటి విద్యార్థులు యెహోవాసాక్షుల గురించి సరైన అవగాహన ఏర్పరచుకోవడానికి తోడ్పడడమే కాక, ఇతర అనేకమంది యువతీయువకులు తమ జీవిత సంకల్పం గురించి ఆలోచించేలా వారిని పురికొల్పింది. మీరు కూడా మీ తోటి విద్యార్థులు మీ నమ్మకాల గురించి మరింత తెలుసుకోవడానికి సహాయం చేసేందుకు ఎందుకు కృషి చేయకూడదు?

[అధస్సూచి]

^ పేరా 3 యెహోవాసాక్షులు ప్రచురించినది.

[31వ పేజీలోని చిత్రం]

మాగ్దాలేనా, వాయ్‌త్సేఖ్‌లు చర్చ కోసం సిద్ధపడుతున్నారు