‘ఒకరిపట్ల ఒకరు అనురాగముగల వారై ఉండండి’
‘ఒకరిపట్ల ఒకరు అనురాగముగల వారై ఉండండి’
‘సహోదర ప్రేమ విషయములో ఒకరిపట్ల ఒకరు అనురాగముగల వారై ఉండండి.’—రోమీయులు 12:10.
ప్రాచ్య దేశాల్లో 43 సంవత్సరాలపాటు మిషనరీ సేవ చేసిన డాన్ ఇతరులతో ఎంతో వాత్సల్యపూరితంగా వ్యవహరిస్తాడని పేరు గాంచాడు. ఆయన తన అనారోగ్యంతో పోరాడుతూ ఆఖరి దశలో ఉన్నప్పుడు, ఆయనతో గతంలో బైబిలు అధ్యయనం చేసిన విద్యార్థులు కొంతమంది ఆయనకు “ఖమ్‌సామ్‌నిదా, ఖమ్‌సామ్‌నిదా!”—కొరియా భాషలో “ధన్యవాదాలు, ధన్యవాదాలు!” అని చెప్పడానికి ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చారు. డాన్ తమకు చూపించిన అనురాగం వాళ్ళ హృదయాలను స్పృశించింది.
2 డాన్ ఉదాహరణ అసాధారణమైనది కాదు. మొదటి శతాబ్దంలో అపొస్తలుడైన పౌలు తాను ఎవరికైతే సేవ చేశాడో వారిపట్ల గాఢమైన అనురాగాన్ని వ్యక్తం చేశాడు. పౌలు స్వయం త్యాగపూరిత స్వభావం చూపించాడు. ఆయన ఖచ్చితమైన అభిప్రాయాలుగల వ్యక్తే అయినా “స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించునట్లుగా” ఆప్యాయతానురాగాలతో వ్యవహరించేవాడు. ఆయన థెస్సలొనీక సంఘానికి ఇలా వ్రాశాడు: “మీరు మాకు బహు ప్రియులైయుంటిరి గనుక మీయందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములనుకూడ మీకిచ్చుటకు సిద్ధపడియుంటిమి.” (1 థెస్సలొనీకయులు 2:7, 8) ఆ తర్వాత పౌలు తాను వారిని మళ్ళీ కలవలేనని ఎఫెసులోని సహోదరులకు చెప్పినప్పుడు “వారందరు చాల ఏడ్చిరి . . . విశేషముగా దుఃఖించుచు పౌలు మెడమీద పడి అతనిని ముద్దుపెట్టుకొని[రి].” (అపొస్తలుల కార్యములు 20:25, 37-38) పౌలుకు ఆయన సహోదరులకు మధ్య ఉన్న సంబంధం, ఒకే విశ్వాసం కలిగివుండడం కంటే ఎక్కువ గాఢమైనది. వాళ్ళకు ఒకరిపట్ల ఒకరికి అనురాగం ఉంది.
అనురాగము మరియు ప్రేమ
3 లేఖనాల్లో అనురాగం, సహోదర ప్రేమ, వాత్సల్యం వంటి లక్షణాలకు క్రైస్తవ లక్షణాలన్నింటిలోకెల్లా ఉత్తమ లక్షణమైన ప్రేమకు ఎంతో సన్నిహిత సంబంధం ఉంది. (1 థెస్సలొనీకయులు 2:8; 2 పేతురు 1:7) అందమైన వజ్రానికి ఉండే పార్శ్వాల్లాగే ఈ దైవిక లక్షణాలన్ని ఒకదానినొకటి సమతుల్యపరుస్తూ ఒకదానికొకటి పూరకాలుగా పనిచేస్తాయి. అవి క్రైస్తవులు ఒకరికొకరే కాక తమ పరలోక తండ్రికి కూడా సన్నిహితమయ్యేలా చేస్తాయి. అందుకే అపొస్తలుడైన పౌలు తన తోటి విశ్వాసులను ఇలా ప్రోత్సహించాడు: “మీ ప్రేమ నిష్కపటమైనదై యుండవలెను. సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగల వారై [యుండుడి].”—రోమీయులు 12:9, 10.
4 “అనురాగము” అని అనువదించబడిన పదం కోసం పౌలు ఉపయోగించిన గ్రీకు పదం రెండు భాగాలతో రూపొందించబడింది. ఒక భాగానికి అర్థం స్నేహమైతే, మరో భాగానికి అర్థం సహజమైన అనురాగం. అంటే దానర్థం క్రైస్తవులు “ఒక ప్రేమపూర్వకమైన, సన్నిహితమైన, పరస్పరం మద్దతునిచ్చుకునే కుటుంబంలో విలక్షణంగా కనిపించే విశ్వసనీయత చేత గుర్తించబడాలి” అని ఒక బైబిలు విద్వాంసుడు వివరించాడు. మీ క్రైస్తవ సహోదరసహోదరీల గురించి మీరు అలాగే భావిస్తున్నారా? క్రైస్తవ సంఘంలో వాత్సల్యపూరితమైన వాతావరణం, రక్తసంబంధులమనే భావన నెలకొని ఉండాలి. (గలతీయులు 6:10) కాబట్టి జె. బి. ఫిలిప్స్ అనువదించిన ద న్యూ టెస్ట్‌మెంట్ ఇన్ మాడర్న్ ఇంగ్లీష్ బైబిలు రోమా 12:10ని ఇలా అనువదించింది: “సహోదరులవలే మనం ఒకరిపట్ల ఒకరం నిజమైన ఆప్యాయతతో ఉందాము.” ద న్యూ జెరూసలేమ్ బైబిల్‌లో ఆ వచనం ఇలా ఉంది: “సహోదరులు ఎంత ఎక్కువగా ప్రేమించాలో అంత ఎక్కువగా ఒకరినొకరు ప్రేమించండి.” అవును, క్రైస్తవులు ప్రేమించడం సమంజసమనో లేదా బాధ్యతనో భావించి ఒకరినొకరు ప్రేమించరు. “నిష్కపటమైన సహోదరప్రేమ”తో మనం ‘ఒకరినొకరం హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించాలి.’—1 పేతురు 1:22.
‘ఒకరినొకరు ప్రేమించడానికి దేవుని చేత నేర్పించబడ్డారు’
5 ఈ లోకంలో ‘అనేకుల ప్రేమ చల్లారిపోతున్నా’ యెహోవా తన ఆధునిక దిన ప్రజలకు ‘ఒకరినొకరు ప్రేమించడం’ నేర్పిస్తున్నాడు. (మత్తయి 24:12; 1 థెస్సలొనీకయులు 4:9) యెహోవాసాక్షుల అంతర్జాతీయ సమావేశాలు ఆ శిక్షణకు విశిష్టమైన సందర్భాలుగా పనిచేస్తాయి. ఆ సమావేశాల్లో స్థానిక సాక్షులు దూరదేశాల నుండి వచ్చే సహోదరులను కలుసుకుంటారు, విదేశీ ప్రతినిధుల కోసం అనేకులు తమ గృహాలను కూడా ఇచ్చారు. ఇటీవలే జరిగిన ఒక సమావేశానికి, తమ భావోద్వేగాలను వ్యక్తం చేయడానికి ఎక్కువగా సుముఖత చూపించని సంస్కృతిగల దేశాలనుండి కొంతమంది వచ్చారు. “ఆ ప్రతినిధులు వచ్చినప్పుడు మొదట్లో చాలా భయం భయంగా, ఎంతో బిడియంగా ఉన్నట్లు అనిపించారు” అని రూమింగ్ సంబంధంగా సహాయం చేసిన ఒక క్రైస్తవుడు చెబుతున్నాడు. “కానీ కేవలం ఆరు రోజుల తర్వాత వీడ్కోలు చెప్పే సమయంలో వాళ్ళు, వాళ్ళకు ఆతిథ్యం ఇచ్చినవారు ఒకరినొకరు కౌగిలించుకొని ఏడ్చారు. వాళ్ళు ఒక రకమైన క్రైస్తవ ప్రేమలో మునిగి తేలారు, వాళ్ళు దానినెప్పుడూ మరచిపోలేరు.” మన సహోదరుల నేపథ్యం ఏదైనప్పటికీ వాళ్ళకు ఆతిథ్యం ఇవ్వడంవల్ల అతిథుల్లోను ఆతిథేయుల్లోను ఉన్న మంచి లక్షణాలు బయటపడతాయి.—రోమీయులు 12:13.
6 సమావేశాలకు సంబంధించిన ఈ అనుభవాలు ఎంతో ఉత్తేజకరమైనవి, అయితే క్రైస్తవులు కొంతకాలంపాటు కలిసి యెహోవాకు సేవచేస్తే వారి మధ్య మరింత సన్నిహితమైన సంబంధం ఏర్పడుతుంది. మనకు మన సహోదరుల గురించి బాగా తెలిసివుంటే మనం వాళ్ళ ప్రియమైన లక్షణాలను అంటే వాళ్ళ నిజత్వాన్ని, నమ్మకత్వాన్ని, విశ్వసనీయతను, దయను, ఉదార స్వభావాన్ని, ఇతరులపట్ల వాళ్ళు చూపించే శ్రద్ధను, వాత్సల్యాన్ని, నిస్వార్థతను ఇంకా ఎక్కువగా ప్రశంసించవచ్చు. (కీర్తన 15:3-5; సామెతలు 19:22) తూర్పు ఆఫ్రికాలో మిషనరీగా సేవచేసిన మార్క్ ఇలా అన్నాడు: “సహోదరులతో కలిసి పనిచేయడంవల్ల విడదీయరాని బంధం ఏర్పడుతుంది.”
హెబ్రీయులు 10:24, 25) “నేను బాలునిగా ఉన్నప్పుడు మా కుటుంబం వీలైనంత ఎక్కువసేపు స్నేహపూర్వకమైన అర్థవంతమైన సంభాషణను ఆనందిస్తూ అందరికంటే ఆఖరున రాజ్యమందిరం నుండి వెళ్ళడం నాకు ఇంకా గుర్తుంది” అని అమెరికాకు చెందిన ఒక పెద్ద చెబుతున్నాడు.
7 సంఘంలో అలాంటి బంధాన్ని ఏర్పరచుకొని దానిని కాపాడుకోవడానికి సంఘ సభ్యులు ఒకరికొకరు సన్నిహితం కావాలి. మనం క్రైస్తవ కూటాలకు క్రమంగా హాజరవడం ద్వారా సహోదరసహోదరీలతో మనకున్న బంధాన్ని బలపరచుకుంటాము. కూటాల ముందూ కూటాల తర్వాతా సహోదరసహోదరీలతో సహవసించడం ద్వారా, కూటాల్లో భాగం వహించడం ద్వారా మనం ఒకరినొకరం “ప్రేమచూపుటకును సత్కార్యములు చేయుటకును” పురికొల్పుతాము. (మీరు ‘మీ హృదయాలను విశాలపరచుకోవాలా?’
8 అలాంటి అనురాగాన్ని సంపూర్ణంగా చూపించాలంటే మనం ‘మన హృదయాలను విశాలపరచుకోవాలి.’ కొరింథులోని సంఘానికి అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “మా హృదయము విశాలపరచబడియున్నది. మీ యెడల మా అంతఃకరణము సంకుచితమై యుండలేదు.” దానికి ప్రతిస్పందనగా వాళ్ళు కూడా తమ ‘హృదయాలను విశాలపరచుకోవాలి’ అని పౌలు వాళ్ళను ప్రోత్సహించాడు. (2 కొరింథీయులు 6:11-13) మీరు కూడా ఇతరులకు అనురాగం చూపించే విషయంలో ‘మీ హృదయాలను విశాలపరచుకోగలరా?’ ఇతరులు చొరవ తీసుకునేంత వరకూ మీరు వేచివుండవలసిన అవసరం లేదు. పౌలు రోమీయులకు వ్రాసిన లేఖలో అనురాగంతో ఉండవలసిన అవసరతను చెబుతూ ఈ సలహాను కూడా ఇచ్చాడు: “ఘనతవిషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి.” (రోమీయులు 12:10) ఇతరులకు గౌరవం చూపించడానికి కూటాలవద్ద మీరే చొరవ తీసుకొని వాళ్ళను పలకరించవచ్చు. మీతోపాటు క్షేత్ర పరిచర్యలో పాల్గొనమని లేదా మీతో కలిసి కూటాలకు సిద్ధపడమని కూడా మీరు వాళ్ళను ఆహ్వానించవచ్చు. అలా చేసినప్పుడు అనురాగం పెరగడానికి మార్గం సుగమం అవుతుంది.
9 సంఘంలోని వ్యక్తులు మరియు కుటుంబాలు ఒకరినొకరు సందర్శించుకోవడం ద్వారా, బహుశా కలిసి భోజనం చేయడం ద్వారా, ఆరోగ్యకరమైన కార్యకలాపాల్లో కలిసి పాల్గొనడం ద్వారా తమ ‘హృదయాలను విశాలపరచుకోవచ్చు.’ (లూకా 10:42; 14:12-14) హాకోప్ అప్పుడప్పుడూ చిన్న చిన్న గుంపుల కోసం విహారయాత్రలను ఏర్పాటు చేస్తాడు. “ఆ గుంపుల్లో అన్ని వయసులకు చెందినవారు, ఒంటరి తల్లులు, ఒంటరి తండ్రులు కూడా ఉంటారు. ప్రతి ఒక్కరూ మధురస్మృతులతో ఇంటికి వెళతారు, ఒకరికొకరు మరింత సన్నిహితమైనట్లు భావిస్తారు” అని ఆయన చెబుతున్నాడు. క్రైస్తవులమైన మనం కేవలం తోటి విశ్వాసులుగా ఉండకుండా నిజమైన స్నేహితులుగా ఉండడానికి కృషి చేయాలి.—3 యోహాను 14.
10 అయితే కొన్నిసార్లు స్నేహాన్ని, అనురాగాన్ని పెంపొందించుకోకుండా మన అపరిపూర్ణతలు అడ్డుపడవచ్చు. అప్పుడు మనమేమి చేయవచ్చు? మొదటిగా మనం మన సహోదరులతో మంచి సంబంధాలు కలిగివుండడానికి సహాయం కోరుతూ ప్రార్థన చేయాలి. తన సేవకులు ఒకరితో ఒకరు స్నేహపూర్వకంగా ఉండాలనేది దేవుని చిత్తం కాబట్టి ఆయన అలాంటి యథార్థమైన ప్రార్థనలకు జవాబిస్తాడు. (1 యోహాను 4:20, 21; 5:14, 15) మనం మన ప్రార్థనలకు అనుగుణంగా చర్యలు కూడా తీసుకోవాలి. తూర్పు ఆఫ్రికాలో ప్రయాణ పైవిచారణకర్తగా సేవ చేస్తున్న రిక్, ఇతరుల భావాలను పట్టించుకోకుండా కఠినంగా ప్రవర్తించే ఒక సహోదరునితో మంచి సంబంధం కలిగివుండడం కష్టమయ్యిందని గుర్తు చేసుకుంటున్నాడు. “ఆ సహోదరుణ్ణి తప్పించుకొని తిరిగే బదులు నేను ఆయన గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాను” అని రిక్ వివరిస్తున్నాడు. “ఆ సహోదరుని తండ్రి ఖచ్చితమైన క్రమశిక్షణను పాటించే కఠినమైన వ్యక్తిగా ఉండేవాడని నాకు తెలిసింది. ఆ సహోదరుడు తన తండ్రి తనపై చూపిన ప్రభావాన్ని అధిగమించడానికి ఎంతగా కృషి చేయవలసి వచ్చిందో, ఆయన అప్పటికే ఆ విషయంలో ఎంతగా అభివృద్ధి సాధించాడో నాకు అర్థమైన తర్వాత నేను ఆయనను మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాము” అని రిక్ చెప్పాడు.—1 పేతురు 4:8.
మీ భావాలను ఇతరులకు తెలియజేయండి!
11 నేడు చాలామంది ప్రజలు ఎవ్వరితోనూ సన్నిహిత స్నేహం పెంపొందించుకోకుండానే జీవిస్తుంటారు. ఎంత విచారకరమో కదా! అయితే క్రైస్తవ సంఘంలో పరిస్థితి అలా ఉండనవసరం లేదు, ఉండకూడదు. యథార్థమైన సహోదర ప్రేమంటే కేవలం మర్యాదపూర్వకంగా సంభాషించడం, సభ్యతగా ప్రవర్తించడం కాదు; మరోవైపున విపరీతమైన భావోద్వేగాలను నాటకీయంగా ప్రదర్శించడం కూడా కాదు. దానికి బదులుగా మనం పౌలు కొరింథీయులకు తన భావాలను తెలియజేసినట్లే మన భావాలను తెలియజేయడానికి సుముఖంగా ఉండి మనకు మన తోటి విశ్వాసుల సంక్షేమం గురించి నిజమైన చింత ఉందని చూపించాలి. ప్రతి ఒక్కరికి ఇతరులతో కలివిడిగా ఉండే లేదా మాటకారులుగా ఉండే స్వభావం ఉండదు, అయితే మరీ అందరికీ దూరంగా ఉండడం కూడా హానికరమైనది. “వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి” అని బైబిలు హెచ్చరిస్తోంది.—సామెతలు 18:1.
12 యథార్థంగా భావాలను వ్యక్తం చేయడం నిజమైన స్నేహానికి పునాదివంటిది. (యోహాను 15:15) మన లోతైన తలంపులను భావాలను తెలియజేయడానికి మనందరికి స్నేహితులు అవసరం. అంతేకాకుండా మనం ఒకరినొకరం ఎంత బాగా తెలుసుకుంటే, ఇతరుల అవసరాలను తీర్చడం అంత సులభంగా ఉంటుంది. మనం ఇతరుల అవసరాలపట్ల ఇలా శ్రద్ధ చూపిస్తే సంఘంలో అనురాగం పెరగడానికి సహాయం చేసినవారమౌతాము, అప్పుడు మనం యేసు చెప్పిన ఈ మాటల్లోని వాస్తవాన్ని అనుభవిస్తాము: “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము.”—అపొస్తలుల కార్యములు 20:35; ఫిలిప్పీయులు 2:1-4.
13 మన అనురాగం ప్రయోజనకరంగా ఉండాలంటే, మనం దానిని వ్యక్తం చేయాలి. (సామెతలు 27:5) మన అనురాగం నిజమైనదైనప్పుడు మన ముఖంలో అది కనిపిస్తుంది, ఇతరుల హృదయాలు దానికి ప్రతిస్పందించేలా వాళ్ళను పురికొల్పుతుంది. “కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము” అని ఒక బైబిలు సామెత చెబుతోంది. (సామెతలు 15:30) ఇతరుల అవసరాలను గ్రహించి చేసే చర్యలు కూడా అనురాగాన్ని పెంపొందిస్తాయి. నిజమైన అనురాగాన్ని ఎవ్వరూ డబ్బులతో కొనలేరు, అయితే హృదయపూర్వకంగా ఇచ్చిన బహుమానం ఎంతో మేలు చేస్తుంది. ఒక కార్డు, ఉత్తరం, “సమయోచితముగా పలకబడిన మాట,” ఇవన్నీ గాఢమైన అనురాగాన్ని వ్యక్తం చేయగలవు. (సామెతలు 25:11; 27:9) మనం ఇతరుల స్నేహాన్ని సంపాదించుకున్న తర్వాత, నిస్వార్థమైన అనురాగాన్ని చూపిస్తూ ఉండడం ద్వారా ఆ స్నేహాన్ని కాపాడుకోవాలి. ప్రత్యేకించి అవసరమైన సమయాల్లో మనం మన స్నేహితులకు సహాయం చేయాలని కోరుకుంటాము. “నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును” అని బైబిలు చెబుతోంది.—సామెతలు 17:17.
14 వాస్తవికంగా ఆలోచిస్తే, మనం సంఘంలోని సభ్యులందరితోను సన్నిహితంగా ఉండాలని ఆశించలేము. మనం కొందరితో, ఇతరులతో కంటే మరింత సన్నిహితంగా భావించడం సహజమే. కాబట్టి ఎవరైనా మీతో మీరు ఆశించినంత స్నేహపూర్వకంగా లేకపోతే, మీలో గానీ ఆ వ్యక్తిలో గానీ ఏదో సమస్య ఉందని వెంటనే ఒక ముగింపుకు వచ్చేయకండి. ఆ వ్యక్తి మీతో సన్నిహితంగా ఉండేలా బలవంతపెట్టకండి. ఆ వ్యక్తి అనుమతించినంత స్నేహాన్ని మాత్రమే అందిస్తే, భవిష్యత్తులో మీరు మరింత సన్నిహితమయ్యే అవకాశం ఉంటుంది.
“నీయందు నేనానందించుచున్నాను”
15 యేసు బాప్తిస్మం తీసుకున్న వెంటనే “నీయందు నేనానందించుచున్నాను” అనే మాటలు పరలోకంనుండి వినిపించినప్పుడు ఆయన ఎంత సంతోషించి వుంటాడో కదా! (మార్కు 1:11) దేవుడు తన అంగీకారాన్ని తెలుపుతూ అన్న ఆ మాటలు, తన తండ్రికి తనపట్ల అనురాగం ఉందని యేసుకున్న నమ్మకాన్ని మరింత బలపరచివుంటాయి. (యోహాను 5:20) అయితే విచారకరమైన విషయమేమిటంటే, కొందరికి తాము గౌరవించేవారినుండి, ప్రేమించేవారినుండి ఇలాంటి ప్రశంసలు ఎన్నడూ వినపడవు. ఆన్ ఇలా చెబుతోంది: “నాలాంటి చాలామంది యౌవనస్థులకు తమ క్రైస్తవ నమ్మకాలను అంగీకరించే కుటుంబ సభ్యులు లేరు. ఇంటివద్ద మేము కేవలం విమర్శలనే వింటాము. అది మాకు ఎంతో బాధ కలిగిస్తుంది.” అయితే వాళ్ళు సంఘంలో భాగమైనప్పుడు, విశ్వాసంలో తమకు తండ్రులు, తల్లులు, సహోదరులు, సహోదరీలు వంటివాళ్ళతో రూపొందించబడిన ఆధ్యాత్మిక కుటుంబపు వాత్సల్యాన్ని మద్దతును చవిచూస్తారు.—మార్కు 10:29, 30; గలతీయులు 6:10.
16 కొన్ని సంస్కృతుల్లో తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు, ఉపాధ్యాయులు చిన్నవారిని హృదయపూర్వకంగా ప్రశంసించడం చాలా అరుదు, అలా ప్రశంసిస్తే పిల్లలు పట్టింపులేకుండా అహంకారులుగా తయారవుతారని వాళ్ళు భావిస్తారు. అలాంటి ఆలోచనా విధానం క్రైస్తవ కుటుంబాలపై, సంఘంపై కూడా ప్రభావం చూపించవచ్చు. ఒక ప్రసంగం గురించో లేదా చేసిన మరో పని గురించో పెద్దవాళ్ళు ఇలా అంటుంటారు: “ఫర్వాలేదు బాగానే ఉంది, కానీ ఇంకా బాగా చేయవచ్చు!” లేదా వాళ్ళు మరో విధంగా పిల్లలపట్ల తమ అసంతృప్తిని కూడా సూచించవచ్చు. అలా చేస్తే పిల్లలు తమ నైపుణ్యాలను ఇంకా మెరుగుపరచుకోవడానికి పురికొల్పబడతారు అని చాలామంది అనుకుంటారు. కానీ ఇలా వ్యవహరించడం తరచూ ప్రతికూల ఫలితాలను తీసుకువస్తుంది, పిల్లలు ప్రయత్నం చేయడం మానేయవచ్చు లేదా తాము ఇతరుల ఆశలకు తగినట్లుగా ఉండలేకపోతున్నామని భావించవచ్చు.
17 అయితే ప్రశంసను కేవలం మందలింపుకు ముందుమాటగా కూడా ఉపయోగించకూడదు. యథార్థమైన ప్రశంస కుటుంబంలోను సంఘంలోను అనురాగం పెంపొందేలా చేసి అనుభవజ్ఞులైన సహోదరసహోదరీల నుండి సలహా తీసుకునేలా ఎఫెసీయులు 4:24.
యౌవనులను ప్రోత్సహిస్తుంది. కాబట్టి మనం ఇతరులతో ఎలా వ్యవహరించాలనేదాన్ని నిర్ణయించాల్సింది మన సంస్కృతి కాదు. మనం ‘నీతియు యథార్థమైన భక్తియుగలవారమై, దేవుని పోలికగా సృష్టించబడిన నవీనస్వభావమును ధరించుకోవాలి.’ యెహోవా ప్రశంసించినట్లే ప్రశంసించండి.—18 మరోవైపున యౌవనస్థులారా, పెద్దవాళ్ళు మిమ్మల్ని సరిదిద్దినప్పుడు లేదా సలహా ఇచ్చినప్పుడు, వాళ్ళకు మీరంటే ఇష్టం లేదనే ముగింపుకు రాకండి. (ప్రసంగి 7:9) దానికి బదులుగా వాళ్ళకు మీ గురించి ఉన్న చింత, మీపట్ల ఉన్న గాఢమైన అనురాగం కారణంగా వాళ్ళలా చేస్తారు. లేకపోతే ఆ విషయం గురించి మీతో వాళ్ళు మాట్లాడడానికి ఎందుకు ప్రయత్నిస్తారు? తమ మాటలు ఇతరులపై ఎంత ప్రభావం చూపగలవో తెలిసిన పెద్దవాళ్ళు, ప్రత్యేకించి సంఘ పెద్దలు, ఎవరికైనా ఉపదేశించే ముందు దాని గురించి ఆలోచించడానికి, దాని విషయమై ప్రార్థించడానికి తరచూ ఎంతో సమయం కేటాయిస్తారు, ఎందుకంటే వాళ్ళు కేవలం మంచే చేయాలనుకుంటారు.—1 పేతురు 5:5.
‘యెహోవా ఎంతో జాలి కనికరము గలవాడు’
19 అనురాగం చూపించిన తర్వాత చేదు అనుభవాలు ఎదురైనవారు, మళ్ళీ అనురాగం చూపిస్తే మరింత నిరుత్సాహానికి గురికావలసి వస్తుందని భావించవచ్చు. వాళ్ళు మళ్ళీ ఇతరుల కోసం తమ హృదయాలను తెరవడానికి ధైర్యం, బలమైన విశ్వాసం అవసరమవుతాయి. అయితే యెహోవా “మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు” అని వాళ్ళు ఎన్నడూ మరచిపోకూడదు. ఆయన మనల్ని తనకు సన్నిహితమవమని ఆహ్వానిస్తున్నాడు. (అపొస్తలుల కార్యములు 17:26; యాకోబు 4:8) బాధ కలుగుతుందేమోనని మనం భయపడుతున్నామని కూడా ఆయన అర్థం చేసుకుంటాడు, మనతో ఉండి మనకు మద్దతునిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. కీర్తనకర్త దావీదు మనకు ఇలా హామీ ఇస్తున్నాడు: “విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును.”—కీర్తన 34:18.
20 యెహోవాతో సన్నిహిత స్నేహబంధం, మనం పెంపొందించుకోగల సంబంధాలన్నింటిలోకి ప్రాముఖ్యమైనది. అయితే అలాంటి బంధం పెంపొందించుకోవడం నిజంగా సాధ్యమేనా? సాధ్యమే. నీతిమంతులైన స్త్రీపురుషులు మన పరలోక తండ్రికి ఎంత సన్నిహితంగా ఉండేవారో బైబిలు తెలియజేస్తోంది. వాళ్ళు వ్యక్తం చేసిన హృదయపూర్వకమైన భావాలు, మనం కూడా యెహోవాకు సన్నిహితం కావచ్చు అనే నమ్మకాన్ని కలిగించడానికి మనకోసం భద్రపరచబడ్డాయి.—కీర్తన 23, 34, 139 అధ్యాయాలు; యోహాను 16:27; రోమీయులు 15:4.
21 యెహోవాతో సన్నిహితంగా ఉండాలనుకునే ప్రజలనుండి ఆయన ఆశించేవి అందరూ చేరుకోదగినవే. “యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు?” అని దావీదు అడిగాడు. “యథార్థమైన ప్రవర్తన గలిగి నీతి ననుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే.” (కీర్తన 15:1, 2; 25:14) దేవుణ్ణి సేవించడం ద్వారా సత్ఫలితాలు లభిస్తాయని, ఆయన మార్గదర్శకం మరియు రక్షణ మనకు ఉంటుందని మనం గ్రహించినప్పుడు యెహోవా “ఎంతో జాలియు కనికరమును గలవాడు” అని మనం తెలుసుకుంటాము.—యాకోబు 5:11.
22 అపరిపూర్ణ మానవులతో ఇంత వ్యక్తిగతమైన సంబంధం కలిగివుండాలని యెహోవా కోరుకుంటున్నందుకు మనమెంత ధన్యులమో కదా! మరి మనం ఒకరిపట్ల ఒకరం అనురాగాన్ని ప్రదర్శించవద్దా? యెహోవా సహాయంతో మనలో ప్రతి ఒక్కరం క్రైస్తవ సహోదరత్వానికి విలక్షణమైన అనురాగాన్ని ఇచ్చిపుచ్చుకోవచ్చు. దేవుని రాజ్యంలో భూమిపై ఉన్నవారందరూ ఎల్లప్పుడూ ఈ అనురాగాన్ని అనుభవిస్తారు.
మీరు వివరించగలరా?
• క్రైస్తవ సంఘంలో ఎలాంటి వాతావరణం నెలకొని ఉండాలి?
• సంఘంలో అనురాగం ఉండేలా చూసేందుకు మనలో ప్రతి ఒక్కరం ఏమి చేయవచ్చు?
• యథార్థమైన ప్రశంస, క్రైస్తవ అనురాగాన్ని ఎలా పెంపొందిస్తుంది?
• యెహోవా అనురాగం మనకు ఎలా మద్దతునిస్తుంది, మనల్ని ఎలా కాపాడుతుంది?
[అధ్యయన ప్రశ్నలు]
1, 2. ఒక ఆధునిక దిన మిషనరీ, అలాగే అపొస్తలుడైన పౌలు తమ సహోదరులతో ఎలాంటి సంబంధం కలిగివుండేవారు?
3. అనురాగానికి, ప్రేమకు సంబంధించిన బైబిలు పదాలకు ఎలాంటి సంబంధం ఉంది?
4. “అనురాగము” అనే పదానికి అర్థమేమిటి?
5, 6. (ఎ) క్రైస్తవ అనురాగం గురించి తన ప్రజలకు నేర్పించడానికి యెహోవా అంతర్జాతీయ సమావేశాలను ఎలా ఉపయోగించాడు? (బి) కాలం గడుస్తున్న కొద్దీ సహోదరుల మధ్య ఉన్న బంధం ఎలా బలపడుతుంది?
7. మనం సంఘంలో క్రైస్తవ అనురాగాన్ని ఆస్వాదించాలంటే ఏమి చేయాలి?
8. (ఎ) కొరింథీయులను ‘హృదయాలు విశాలపరచుకొమ్మని’ ప్రోత్సహించినప్పుడు పౌలు ఉద్దేశమేమిటి? (బి) సంఘంలో అనురాగం చూపించడాన్ని ప్రోత్సహించేందుకు మనమేమి చేయవచ్చు?
9. తోటి క్రైస్తవులతో మరింత సన్నిహిత స్నేహితులుగా తయారవడానికి కొందరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? (ఏవైనా స్థానిక ఉదాహరణలను చేర్చండి.)
10. మన సహోదరసహోదరీలతో మనకు సమస్యలుంటే మనమేమి చేయవచ్చు?
11. (ఎ) సంఘంలో అనురాగం పెరగాలంటే ఏమి అవసరం? (బి) మన భావోద్వేగాలను ఇతరులతో పంచుకోకుండా ఉండడం ఎందుకు ఆధ్యాత్మికంగా హానికరమైనది కాగలదు?
12. సంఘంలో సన్నిహితమైన బంధాలు ఏర్పడడానికి యథార్థంగా భావాలను వ్యక్తం చేయడం ఎందుకు ప్రాముఖ్యం?
13. మనకు మన సహోదరులపట్ల నిజమైన అనురాగం ఉందని చూపించడానికి మనమేమి చేయవచ్చు?
14. ఎవరైనా మనం చూపించే అనురాగానికి ప్రతిస్పందించనట్లు కనిపిస్తే మనమేమి చేయవచ్చు?
15. ప్రశంసించడం లేదా ప్రశంసించకపోవడం ఇతరులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?
16. ఇతరులపట్ల విమర్శనాత్మక వైఖరిని ప్రదర్శించడం ఎందుకు సహాయకరమైనది కాదు?
17. మనం ఇతరులను ప్రశంసించడానికి అవకాశాల కోసం ఎందుకు వెదకాలి?
18. (ఎ) యౌవనస్థులారా, మీరు పెద్దవాళ్ళ ఉపదేశాన్ని ఎలా దృష్టించాలి? (బి) పెద్దవాళ్ళు తాము ఉపదేశం ఇచ్చే విధానం గురించి ఎందుకు జాగ్రత్తగా ఉంటారు?
19. చేదు అనుభవాలు ఎదురైనవారు మద్దతు కోసం యెహోవావైపు ఎందుకు చూడవచ్చు?
20, 21. (ఎ) మనం యెహోవాతో సన్నిహిత సంబంధం కలిగివుండవచ్చని మనకెలా తెలుసు? (బి) యెహోవాతో సన్నిహిత సంబంధం కలిగివుండడానికి అవసరమైనదేమిటి?
22. తన ప్రజలు ఎలాంటి సంబంధం కలిగివుండాలని యెహోవా కోరుకుంటున్నాడు?
[15వ పేజీలోని చిత్రం]
క్రైస్తవులు ప్రేమ చూపించడమనేది కేవలం ఒక బాధ్యత కాదు
[16, 17వ పేజీలోని చిత్రాలు]
మీరు అనురాగం చూపించేందుకు ‘మీ హృదయాలను విశాలపరచుకోగలరా?’
[18వ పేజీలోని చిత్రం]
మీరు విమర్శనాత్మకంగా ఉంటారా, ప్రోత్సాహకరంగా ఉంటారా?