కేవలం కాలక్షేపం కాదు
కేవలం కాలక్షేపం కాదు
పిల్లలకు ఆటలంటే చాలా ఇష్టం. అయితే “అవి వ్యర్థమైనవి లేక నిష్ప్రయోజనమైనవి కావు, పరిసరాల గురించి పిల్లవాడి అవగాహన పెరగడం అనేది అతడు ఆడే ఆటల మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది” అని ద డెవలపింగ్ చైల్డ్ అనే పుస్తకం వివరిస్తోంది. ఆటలాడడం ద్వారా పిల్లలు తమ జ్ఞానేంద్రియాలను ఉపయోగించడం నేర్చుకుంటారు, పరిసరాలను అర్థం చేసుకుంటారు, ఇతరులతో కలిసిమెలిసి ఉంటారు.
పిల్లలకు నాలుగయిదేండ్లు వచ్చేసరికి, వారు తమ ఆటలలో పెద్దవాళ్ళలా నటించడం ప్రారంభిస్తారు. యేసు ఒకసారి ఆటలాడుకుంటున్న పిల్లల గురించి మాట్లాడాడు. కొందరు “పెండ్లి” ఆట ఆడాలనుకుంటే మరికొందరు “అంత్యక్రియల” ఆట ఆడాలనుకున్నారు, తరచూ పిల్లలు చేసేలానే, కొందరు ఆడడానికి ఇష్టపడక పోయేసరికి వాళ్ళు తమలో తాము వాదులాడుకున్నారు. (మత్తయి 11:16, 17) ఇలా ఆటలు ఆడడం, ఎదుగుతున్న పిల్లవాడి మనస్సులో అర్థవంతమైన పాత్రలు ముద్రించుకుపోవడానికి దోహదపడుతుంది.
ఈ చిత్రాల్లో కనబడుతున్న పిల్లలు బైబిలు బోధకుడు, విద్యార్థి పాత్రలున్న ఆట ఆడుతున్నారు. వాళ్ళది నిజమైన బైబిలు అధ్యయనం కాకపోయినా, బైబిలు సందేశాన్ని ఇతరులతో పంచుకోవాలనే తలంపు వాళ్ళ మనస్సుల్లో స్పష్టంగా ఉంది. ఈ పాఠం చాలా ముఖ్యమైనది, ఎందుకంటే శిష్యులను చేయమనీ, తాను బోధించిన విషయాలన్నిటిని అనుసరించాలని ప్రజలకు బోధించమనీ యేసు తన అనుచరులందరికీ ఆజ్ఞాపించాడు.—మత్తయి 28:19, 20.
బైబిలు అధ్యయనాలు నిర్వహిస్తున్నట్లు, ప్రసంగాలు ఇస్తున్నట్లు లేదా ఇంటింటి సేవ చేస్తున్నట్లు నటించడానికి ఇష్టపడే పిల్లల తల్లిదండ్రులు, సముచితంగానే తమ పిల్లల పనులను తమకొక గర్వకారణంగా భావించవచ్చు. సహజంగా, పిల్లలు తమ చుట్టూ ఉన్న పెద్దవాళ్ళు చేసేదాన్ని గమనించి వారిని అనుకరిస్తారు. వాళ్ళ బైబిలు ఆధారిత ఆటలు, వాళ్ళు “ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను” పెంచబడుతున్నారనే విషయాన్ని సూచిస్తాయి.—ఎఫెసీయులు 6:4.
పిల్లలు సత్యారాధనలో పాల్గొనాలని యెహోవా కోరుకుంటున్నాడు. ధర్మశాస్త్రం చదివేటప్పుడు ‘పిల్లలను’ కూడా పోగుచేయమని ఆయన మోషేకు చెప్పాడు. (ద్వితీయోపదేశకాండము 31:12) ఒకవేళ చిన్నపిల్లలు సత్యారాధనలో తామూ ఒక భాగమేనని భావిస్తే, వాళ్ళ ఆటలు దాన్ని ప్రతిబింబిస్తాయి. దేవుని పరిచారకుడనన్నట్లు నటించే పిల్లవాడు, నిజంగా దేవుని పరిచారకుడు కావడానికి అతడు మొదటి అడుగు వేసినట్లే.