కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జీవితాంతం నిలిచిన విద్య

జీవితాంతం నిలిచిన విద్య

జీవిత కథ

జీవితాంతం నిలిచిన విద్య

హరాల్డ్‌ గ్లూయస్‌ చెప్పినది

నా బాల్యదశలోని ఒక దృశ్యం, 70 సంవత్సరాలు దాటినా నా స్మృతిపథం నుండి చెదరిపోలేదు. నేను వంటగదిలో కూర్చొని, “సిలోన్‌ టీ” అనే పేరున్న ఒక లేబుల్‌ వైపు చూస్తున్నాను. దాని మీద కొందరు పడతులు సిలోన్‌ (ఇప్పుడు శ్రీలంక)లోని పచ్చగా, ఏపుగా పెరిగిన తేయాకు తోటలో ఆకులు తెంపుతున్న చిత్రం కూడా ఉంది. దక్షిణ ఆస్ట్రేలియాలో మేముండే పైరుపచ్చలు లేని ప్రాంతం నుండి ఎంతో దూరాన ఉన్న ఆ దృశ్యం, నా ఊహా జగత్తును పురికొల్పింది. సిలోన్‌ దేశం ఎంత అందంగా, ఉత్తేజకరంగా ఉంటుందో కదా! అందమైన ఆ ద్వీపంలోనే నేను నా జీవితంలోని 45 సంవత్సరాలు, మిషనరీగా గడుపుతానని అప్పుడు నాకేమాత్రం తెలియదు.

నేటి లోకానికి చాలా భిన్నంగా ఉండే లోకంలో నేను 1922 ఏప్రిల్‌లో జన్మించాను. కింబ అనే మారుమూల నగరానికి సమీపంలో ఒంటరిగా ఉండే ఒక ఫామ్‌ (వసతి గృహం ఉండే పొలం)లో మా కుటుంబం పని చేసేది. ఆ నగరం విశాలమైన ఆస్ట్రేలియా ఖండానికి మధ్యభాగంలో ఉన్న పెద్ద ఎడారి ప్రాంతానికి దక్షిణపు అంచుల్లో ఉంది. అక్కడి జీవితం వర్షాభావం, కీటకాల వల్ల కలిగే రోగాలు, తీక్షణమైన వేడి వంటి వాటితో దినదిన గండంగా ఉండేది. మా అమ్మ, ఆరుగురు సంతానమైన మమ్మల్నీ మా నాన్ననూ చూసుకోవడానికి చాలా కష్టపడి పనిచేసేది. మేమొక చిన్న రేకుల గుడిసెలో ఉండేవాళ్ళం.

నాకయితే ఆ మారుమూల ప్రాంతం స్వేచ్ఛకు, ఉత్కంఠతకు నిలయంగా ఉండేది. నా చిన్నప్పుడు, ఎడ్లు మందగా వచ్చి చిన్న చిన్న పొదలను కుమ్మివేయడం చూస్తున్నప్పుడు నేను భయపడేవాడిని. లేదా రివ్వున వీచే గాలి దుమారాలతో ఆ ప్రాంతమంతా దట్టమైన దుమ్ముతో కమ్ముకుపోయేది. నిజానికి నా జీవితంలో విద్య అనేది, నేను పాఠశాలకు వెళ్ళడానికి చాలా ముందే ప్రారంభమైంది. ఆ పాఠశాల మా ఇంటి నుండి అయిదు కిలోమీటర్ల దూరంలో ఉండేది, దానికి ఒక్కడే ఉపాధ్యాయుడు.

మా తల్లిదండ్రులు చర్చికి ఎన్నడూ వెళ్ళకపోయినా వారు భక్తిగలవారే, మేము ఊరికి చాలా దూరంగా ఉండడమే చర్చికి వెళ్ళకపోవడానికి ముఖ్య కారణం. ఏదేమైనా 1930లలోని ప్రథమార్థంలో, అడిలైడ్‌ రేడియో స్టేషన్‌ నుండి ప్రతి వారం ప్రసారం అయ్యే జడ్జి రూథర్‌ఫోర్డ్‌ బైబిలు ప్రసంగాలను అమ్మ వినడం ప్రారంభించింది. జడ్జి రూథర్‌ఫోర్డ్‌ అంటే ఎవరో అడిలైడ్‌కు చెందిన మతబోధకుడు కావచ్చని అనుకున్నాను, అంతేగాక నాకంత ఆసక్తి కూడా ఉండేది కాదు. కానీ మా అమ్మ ప్రతి వారం రూథర్‌ఫోర్డ్‌ ప్రసంగాల కోసం ఆసక్తిగా ఎదురుచూసేది, బ్యాటరీలతో నడిచే మా పాత రేడియో చేసే గరగర శబ్దం మధ్య ఆయన గొంతు వినబడేసరికి శ్రద్ధగా వినేది.

వేడిగా, ధూళిమయంగా ఉన్న ఒక మధ్యాహ్నం, ఒక పాత మోటారు వాహనం వచ్చి మా ఇంటి ముందు ఆగింది, అందులో నుండి చక్కగా దుస్తులు ధరించిన ఇద్దరు వ్యక్తులు దిగారు. వారు యెహోవాసాక్షులు. మా అమ్మ వారు చెప్పిన సందేశాన్ని విని, వారికి విరాళం ఇచ్చి, వారి నుండి చాలా పుస్తకాలు తీసుకొని వాటిని వెంటనే చదవడం ప్రారంభించింది. ఆ పుస్తకాలు ఆమెను ఎంతగా ప్రభావితం చేశాయంటే, తను నేర్చుకుంటున్న వాటి గురించి పొరుగువారితో మాట్లాడేందుకు తనను తీసుకువెళ్ళమని నాన్నగారిని వెంటనే అడిగింది.

సానుకూల ప్రభావాల ప్రయోజనం

మేము ఆ తర్వాత కొద్దికాలానికే ఆ ప్రాంతంలోని కఠోరమయన పరిస్థితుల కారణంగా, 500 కిలోమీటర్ల దూరాన ఉన్న అడిలైడ్‌ పట్టణానికి వెళ్ళాల్సివచ్చింది. అక్కడ మా కుటుంబం అడిలైడ్‌లోని యెహోవాసాక్షుల సంఘంతో సహవసిస్తూ ఆధ్యాత్మికంగా ఎదగడం ప్రారంభించింది. మేము అలా వలస వెళ్ళడం వల్ల నా చదువు ఆగిపోయింది. నేను ఏడవ తరగతి పూర్తి చేశాక, నా 13వ ఏటనే పాఠశాలకు వెళ్ళడం మానేశాను. నేను కులాసాగా ఉండేవాడిని, చాలామంది మంచి సహోదరులు, పయినీర్లు, పూర్తికాల పరిచారకులు నాపై వ్యక్తిగత శ్రద్ధ చూపించి సహాయం చేయనట్లయితే ఆ స్వభావం నన్ను ఆధ్యాత్మిక విషయాలకు దూరం చేసేదే.

కాలం గడుస్తుండగా, ఆసక్తిగల ఈ సహోదరుల ప్రభావం నాలో నిద్రాణమై ఉన్న ఆధ్యాత్మికతను మేల్కొలిపింది. నేను వారి సహవాసాన్ని చాలా ఇష్టపడ్డాను, వారిలోని కష్టపడి పనిచేసే స్ఫూర్తికి ముగ్ధుడ్నయ్యాను. 1940లో అడిలైడ్‌లో జరిగిన సమావేశంలో, పూర్తికాల సేవను ప్రోత్సహిస్తూ ప్రకటన చేసినప్పుడు నేను అనుకోకుండానే నా పేరు ఇచ్చాను. నేను అప్పటికి ఇంకా బాప్తిస్మం కూడా తీసుకోలేదు, సాక్ష్యమివ్వడంలో అనుభవమూ అంతంతే. ఏమైతేనేం, కొన్ని రోజుల తర్వాత, వార్రంబూల్‌లోని ఒక చిన్న పయినీర్ల గుంపుతో చేరమని నాకు ఆహ్వానం వచ్చింది. అది అడిలైడ్‌ నుండి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న, పొరుగు రాష్ట్రమైన విక్టోరియాలోని ఒక పట్టణం.

అలాంటి అనిశ్చిత స్థితిలో ఆరంభించినప్పటికీ, నేను త్వరలోనే క్షేత్ర సేవ పట్ల ప్రేమను పెంచుకున్నాను, ఇన్ని సంవత్సరాలైనా ఆ ప్రేమ సన్నగిల్లలేదని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. నిజానికి, అది నా జీవితంలో ఒక మలుపురాయి, ఆ తర్వాత ఇక నేను వెనుదిరగకుండా ఆధ్యాత్మికంగా నిజమైన ప్రగతి సాధించాను. ఆధ్యాత్మిక విషయాల పట్ల ప్రేమగల వారికి సన్నిహితం కావడంలో ఉన్న విలువేమిటో నేను తెలుసుకున్నాను. వారి చక్కని ప్రభావం, మన చదువుతో సంబంధం లేకుండా మనలోని మంచిని ఎలా బయటకు తీయగలదో తెలుసుకున్నాను. అలా నేర్చుకున్న పాఠాలు మన జీవితమంతా ఎలా ప్రయోజనం చేకూర్చగలవో గ్రహించాను.

శోధనలతో బలపడ్డాను

ఆస్ట్రేలియాలో యెహోవాసాక్షుల సేవను నిషేధించడంతో నేను పయినీరు సేవలో కేవలం కొద్దికాలమే ఉండగలిగాను. ఏమి చేయాలో తెలియని స్థితిలో, సహోదరుల సలహా అడిగాను, బైబిలు గురించి ప్రజలతో మాట్లాడడంపై నిషేధం లేదని వారు సూచించారు. దానితో నేను ఇతర పయినీర్లతో కలిసి, ఇంటింటికి వెళ్ళి బైబిలు నుండి చిన్న సందేశాన్ని ఇవ్వడం ప్రారంభించాను. అది నేను త్వరలో ఎదుర్కోనున్న శోధనలకు నన్ను సిద్ధపరచింది.

ఆ తర్వాత నాలుగు నెలలకు నాకు 18 ఏండ్లు రావడంతో, సైనిక సేవకు హాజరుకమ్మని పిలుపు వచ్చింది. అది నేను పలు సైనికాధికారుల ఎదుట, న్యాయాధికారి ఎదుట నా విశ్వాసాన్ని సమర్థించుకునే అవకాశాన్ని ఇచ్చింది. ఆ సమయంలో అడిలైడ్‌లో దాదాపు 20 మంది సహోదరులు తమ తటస్థ వైఖరి కారణంగా జైలుపాలయ్యారు, త్వరలోనే నేనూ వారిలో చేరాను. రాళ్ళు కొట్టడం, రోడ్ల మరమ్మతు వంటి కష్టమైన పనులు చేయడానికి మమ్మల్ని నియమించారు. అది నేను ఓర్పు, నిబ్బరం వంటి లక్షణాలను పెంపొందించుకోవడానికి దోహదపడింది. మా మంచి ప్రవర్తన, నిశ్చలతల మూలంగా చివరకు మేము అనేకమంది జైలు కాపలాదారుల గౌరవాన్ని పొందగలిగాము.

కొన్ని నెలలు గడిచాక నేను విడుదల చేయబడి, మంచి భోజనం చేశాక మళ్ళీ పయినీరు సేవ చేపట్టాను. పయినీరు భాగస్వాములు చాలా తక్కువమంది ఉండడం వల్ల, దక్షిణ ఆస్ట్రేలియాలోని మారుమూల వ్యవసాయ క్షేత్రంలో ఒక్కడివే సేవ చేయగలవా అని నన్ను అడిగారు. దానికి నేను అంగీకరించి, కేవలం సాక్ష్యమిచ్చే సామగ్రి, సైకిలు మాత్రం తీసుకొని యార్క్‌ ద్వీపకల్పానికి ఓడలో బయల్దేరాను. నేను అక్కడకు చేరుకోగానే, ఆసక్తిగల ఒక కుటుంబం అక్కడున్న ఒక చిన్న విశ్రాంతి గృహాన్ని చూపించింది. అక్కడ ఉండే స్త్రీ నన్ను తన కొడుకులా చూసుకుంది. పగటిపూట నేను మట్టి రోడ్ల మీద సైకిలు తొక్కుకుంటూ, ద్వీపకల్పమంతటా చెల్లాచెదురుగా ఉన్న చిన్న చిన్న పట్టణాల్లో ప్రకటించాను. దూరంగా ఉన్న ప్రాంతాల్లో ప్రకటించడానికి నేను అప్పుడప్పుడు రాత్రిపూట చిన్న హోటళ్ళలో లేదా విశ్రాంతి గృహాల్లో ఉండిపోయేవాడిని. ఆ విధంగా నేను సైకిలు మీద వందల కిలోమీటర్లు ప్రయాణించాను, ఎన్నో మంచి అనుభవాలను చవిచూశాను. నేను సేవలో ఒంటరివాడనని ఎక్కువగా ఆలోచించలేదు, నేను యెహోవా సంరక్షణను చవిచూస్తూ ఆయనకు మరింత సన్నిహితం అయ్యాను.

అయోగ్యుడననే భావాలతో వ్యవహరించడం

1946లో బ్రదరెన్‌ సేవకునిగా (ఇప్పుడు ప్రయాణ పైవిచారణకర్త అని అంటారు) ప్రయాణ సేవను చేపట్టడానికి ఆహ్వానిస్తూ ఒక ఉత్తరం అందింది. ఆ సేవలో నియమిత ప్రాంతంలోని కొన్ని సంఘాలను సందర్శించడం ఉంటుంది. ఆ నియామకంలోని బాధ్యతలు నాకు నిజంగా సవాలుదాయకంగా అనిపించాయని నేను ఒప్పుకోవలసిందే. ఒకరోజు ఒక సహోదరుడు “హరాల్డ్‌ వేదిక మీద అంత బాగా చేయడు కానీ ఆయన క్షేత్రంలో బాగా చేస్తాడు” అని అంటుండగా వినబడింది. ఆ వ్యాఖ్యానం నాకెంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది. నేనెలా మాట్లాడతానో, సంస్థాగత పరిమితులు ఏమిటో నాకు బాగా తెలుసు. అయినా ప్రకటనా పనే క్రైస్తవుల ప్రధాన కార్యకలాపం అని నేను నమ్మాను.

1947లో బ్రూక్లిన్‌లోని యెహోవాసాక్షుల ప్రధాన కార్యాలయం నుండి సహోదరులు నాథన్‌ నార్‌ మరియు మిల్టన్‌ హెన్షెల్‌ల సందర్శనం గురించి ఎంతో ఉత్కంఠ ఏర్పడింది. 1938లో సహోదరుడు రూథర్‌ఫోర్డ్‌ వచ్చిన తర్వాత, ప్రధాన కార్యాలయం నుండి ఇది మొదటి సందర్శనం. దానితోపాటు సిడ్నీలో పెద్ద సమావేశం జరిగింది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని న్యూయార్క్‌లోని సౌత్‌ లాన్సింగ్‌లో, ఇటీవలే ఆరంభించిన వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌ ఇస్తున్న మిషనరీ శిక్షణ పట్ల ఇతర అనేక యువ పయినీర్లలాగే నాకూ ఆసక్తి కలిగింది. హాజరైన వారిలో చాలామందికి, ఆ స్కూల్లో పాల్గొనడానికి అర్హతగా పెద్ద పెద్ద చదువులు ఉండాలని అడుగుతారేమోననే సందేహం కలిగింది. అయితే మన కావలికోటలోని ఆర్టికల్‌ చదివి అందులోని ముఖ్యమైన అంశాలు గుర్తుంచుకోగలిగితే చాలు అని సహోదరుడు నార్‌ మాకు తెలిపారు.

నా తక్కువ చదువు నన్ను అనర్హుడ్ని చేస్తుందేమో అనుకున్నాను. ఆశ్చర్యకరంగా, కొన్ని నెలల తర్వాత గిలియడ్‌ శిక్షణకు దరఖాస్తు చేయమంటూ నాకు ఆహ్వానం వచ్చింది. ఆ తర్వాత, ఒక విద్యార్థిగా నాకు అనుమతి లభించింది. 1950లో జరిగిన 16వ తరగతికి నేను హాజరయ్యాను. అద్భుతమైన ఆ అనుభవం నాలో ధైర్యాన్ని అధికం చేసింది. జయప్రదం కావడానికి పైచదువులు ప్రాముఖ్యం కాదని అది నాకు రుజువు చేసింది. బదులుగా కృషి, విధేయతలు ముఖ్యంగా అవసరం. సాధ్యమైనదంతా చేయమని మా బోధకులు మమ్మల్ని ప్రోత్సహించారు. నేను వారి సలహాను పాటిస్తూ, క్రమంగా ప్రగతి సాధించి ఆ కోర్సులోని సలహాలను చాలా మట్టుకు బాగానే అనుసరించగలిగాను.

పైరుపచ్చలు లేని ఖండం నుండి రత్నం లాంటి ద్వీపానికి

పట్టభద్రులమైన తర్వాత, ఆస్ట్రేలియా నుండి ఇద్దరు సహోదరులు, నేనూ సిలోన్‌ (ఇప్పుడు శ్రీలంక)కు నియుక్తులమయ్యాం. మేము 1951 సెప్టెంబరులో, రాజధాని నగరమైన కొలంబోకు చేరుకున్నాం. వేడిగా, ఉక్కగా ఉంది, అపరిచితమైన దృశ్యాలు, చప్పుళ్ళు, వాసనలతో మేము ఉక్కిరిబిక్కిరి అయ్యాం. మేము ఓడలో నుండి బయటకు రాగానే, ఆ దేశంలో అప్పటికే సేవ చేస్తున్న ఒక మిషనరీ, రానున్న ఆదివారం ఆ నగర కూడలిలో ఇవ్వబడే బహిరంగ ప్రసంగం గురించి తెలిపే కరపత్రంతో నాకు స్వాగతం పలికాడు. ఆ కరపత్రంపై ప్రసంగీకునిగా నా పేరు చూసి నేను ఆశ్చర్యపోయాను! నాకు కలిగిన భయం గురించి మీరు ఊహించుకోవచ్చు. కానీ ఆస్ట్రేలియాలో నేను సంవత్సరాలపాటు పయినీరుగా చేసిన సేవ వల్ల, నాకు ఎలాంటి నియామకం ఇవ్వబడినా దాన్ని స్వీకరించాలని నేర్చుకున్నాను. కాబట్టి యెహోవా సహాయంతో నేను ఆ బహిరంగ ప్రసంగాన్ని విజయవంతంగా ఇచ్చాను. ఆ సమయంలో కొలంబోలోని మిషనరీ గృహంలో అప్పటికే ఉంటున్న నలుగురు అవివాహిత సహోదరులతోపాటు, మేము ముగ్గురం చేరి క్లిష్టమైన సింహళ భాషా సమస్యను ఎదుర్కొంటూ క్షేత్ర పరిచర్యలో పాల్గొనడం ప్రారంభించాం. చాలా వరకు మేము ఒంటరిగానే సేవ చేశాం, స్థానిక ప్రజలు గౌరవంగలవారు, ఆతిథ్యమిచ్చేవారు కావడం మాకు ఆనందం కలిగించింది. కొద్దికాలంలోనే కూటాలకు హాజరయ్యేవారి సంఖ్య పెరగడం ప్రారంభించింది.

కొద్దికాలం తర్వాత, ఆకర్షణీయంగా ఉండే ఒక పయినీరు సహోదరి గురించి నేను చాలా తీవ్రంగా ఆలోచించడం మొదలెట్టాను. నేను గిలియడ్‌ స్కూలుకు హాజరవడానికి ఓడలో వెళ్తున్నప్పుడు ఆమెను కలిశాను, ఆమె పేరు సిబిల్‌. అప్పుడు ఆమె న్యూయార్క్‌లో జరగనున్న అంతర్జాతీయ సమావేశానికి వెళ్తోంది. ఆ తర్వాత ఆమె గిలియడ్‌ స్కూల్‌ 21వ తరగతికి హాజరై, 1953లో హాంకాంగ్‌కు నియుక్తురాలైంది. నేను ఆమెకు ఉత్తరాలు వ్రాయాలని నిర్ణయించుకున్నాను, సిబిల్‌ 1955లో సిలోన్‌కు వచ్చేంత వరకు మేము అలా ఉత్తరాలు వ్రాసుకున్నాం, ఆమె అక్కడకు వచ్చాక మేము పెళ్ళి చేసుకున్నాం.

మిషనరీ దంపతులుగా మా మొదటి నియామకం జాఫ్నాలో, శ్రీలంక ఉత్తర భాగంలో ఉంటుందా పట్టణం. 1950వ దశాబ్దం మధ్యలో సింహళ, తమిళ ప్రజల్లో రాజకీయ విభేదాలు ఏర్పడడం ప్రారంభించాయి. తత్ఫలితంగా ఆ తర్వాతి దశాబ్దాల్లో జరిగిన ఆయుధ పోరాటాలకు పునాది పడింది. కష్టతరమైన ఆ సంవత్సరాల్లో సింహళ, తమిళ సాక్షులు ఒకరికొకరు ఆశ్రయమిచ్చుకోవడం, ఒక్కోసారి నెలలపాటు అలా ఆసరా ఇవ్వడం చూస్తే ఎంతో సంతోషం కలిగించేది! ఆ శోధనలు సహోదరుల విశ్వాసాన్ని శుద్ధిపరచి, బలపరచాయి.

శ్రీలంకలో ప్రకటించడం, బోధించడం

హిందూ, ముస్లిమ్‌ ప్రజలతో సర్దుకుపోవడానికి సహనం, పట్టుదల అవసరమయ్యాయి. అంతేగాక మేము ఆ రెండు సంస్కృతులను, వారిలోని ప్రియమైన లక్షణాలను బాగా అర్థం చేసుకోవడం ప్రారంభించాం. స్థానిక బస్సుల్లో విదేశీయులు ప్రయాణించడం అసాధారణమైన విషయం కావడం వల్ల, మేము బస్సుల్లో వెళ్తే మమ్మల్ని వింతగా చూసేవారు. వారికి స్పందనగా చిరునవ్వు చిందించాలని సిబిల్‌ నిర్ణయించుకుంది. ఆమె చిరునవ్వుకు ప్రతిస్పందనగా, ఉత్సుకతతో కూడిన వారి ముఖాల్లో చిరునవ్వులు చిగురించడం నిజంగా ఆనందకరమే!

ఒక సందర్భంలో, దారికడ్డంగా ఉన్న ఒక బారికేడ్‌ దగ్గర మమ్మల్ని ఆపారు. విధి నిర్వహణలో ఉన్న గార్డు మమ్మల్ని ఎక్కడి నుండి వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగిన తర్వాత వ్యక్తిగత ప్రశ్నలు అడగడం ప్రారంభించాడు.

“ఈ స్త్రీ ఎవరు?”

“నా భార్య,” నేను జవాబిచ్చాను.

“మీకు పెళ్ళై ఎంత కాలం అయింది?”

“ఎనిమిది సంవత్సరాలు.”

“మీకు పిల్లలున్నారా?”

“లేరు.”

“ఇంకా పుట్టలేదా! డాక్టరుతో పరీక్ష చేయించుకున్నారా?”

సహజమైన ఈ జిజ్ఞాస మొదట మాకు ఆశ్చర్యం కలిగించింది, కానీ అది స్థానిక ప్రజలకు ఇతరుల పట్ల ఉన్న యథార్థమైన వ్యక్తిగత శ్రద్ధ అని తర్వాత తెలుసుకున్నాం. వాస్తవానికి అది వారిలోని అత్యంత ప్రియమైన లక్షణాల్లో ఒకటి. ఒక వ్యక్తి బహిరంగ స్థలంలో కొద్దిసేపు నిలుచుంటే చాలు, ఎవరో ఒకరు వచ్చి మీకేమైనా సహాయం కావాలా అని స్నేహపూర్వకంగా అడుగుతారు.

మార్పులు, ప్రతిఫలాలు

సంవత్సరాల కాలంలో, మేము శ్రీలంకలో మిషనరీ సేవ చేస్తూనే పలురకాల నియామకాలను చేపట్టి ఆనందించాం. నేను ప్రాంతీయ, జిల్లా సేవ చేయడానికి నియమించబడ్డాను, బ్రాంచి కమిటీ సభ్యునిగా కూడా సేవ చేశాను. 1996 కల్లా నేను నా 70వ పడికి మధ్యలో ఉన్నాను. శ్రీలంకలో 45 సంవత్సరాలకు పైనే మిషనరీ సేవ చేసిన ఆనందం నాకు దక్కింది. నేను కొలంబోలో హాజరైన మొట్టమొదటి కూటంలో దాదాపు 20 మంది ఉన్నారు. ఆ సంఖ్య ఇప్పుడు 3,500కు మించి విస్తరించింది. వారిలో మాకెంతో ప్రియమైన చాలామందిని సిబిల్‌, నేనూ మా ఆధ్యాత్మిక పిల్లలుగా, మనవలు, మనవరాళ్ళుగా చూశాం. ఏదేమైనా దేశమంతటా చేయవలసిన పని ఇంకా చాలా ఉంది, ఆ పనికి మాకంటే చిన్న వయస్కుల శక్తిసామర్థ్యాలు అవసరం. దీన్ని దృష్టిలో పెట్టుకొని, మేము ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్ళాలని పరిపాలక సభ నుండి అందిన ఆహ్వానాన్ని స్వీకరించాం. ఆ విధంగా యోగ్యులైన యువ దంపతులు శ్రీలంకలో మిషనరీలుగా ప్రవేశించడానికి మా స్థానాన్ని తీసుకోవడానికి అవకాశం కలిగించింది.

ఇప్పుడు నాకు 83 ఏండ్లు, అడిలైడ్‌లో నేను నడచిన నేలపై ప్రత్యేక పయినీరు సేవ చేయడానికి కావలసిన ఆరోగ్యంతో ఉన్నందుకు సిబిల్‌, నేనూ ఆనందిస్తున్నాం. మా పరిచర్య మమ్మల్ని మానసికంగా అప్రమత్తంగా, ఎదురయ్యే పరిస్థితులకు సర్దుకుపోయేలా ఉంచుతోంది. అది మేము ఈ దేశంలోని పూర్తిగా భిన్నమైన జీవన శైలితో మళ్ళీ సర్దుకుపోయేందుకు కూడా తోడ్పడింది.

మా భౌతిక అవసరాలను అన్నిటినీ తీర్చడం ద్వారా యెహోవా నిరంతరం మా సంక్షేమాన్ని చూస్తున్నాడు, మా స్థానిక సంఘాల్లోని సహోదరసహోదరీలు మా పట్ల గొప్ప ప్రేమ చూపిస్తూ, మాకు మద్దతు ఇస్తున్నారు. నాకు ఇటీవలే ఒక కొత్త నియమాకం వచ్చింది. మా సంఘంలో నేను కార్యదర్శిగా సేవ చేయాలి. ఆ విధంగా, నేను యెహోవాను నమ్మకంగా సేవించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, నా శిక్షణ ఇంకా కొనసాగుతోందని నేను గ్రహించాను. గడచిన సంవత్సరాలను తిరిగి చూసుకుంటే, తుప్ప పొదల్లో కులాసాగా తిరిగే సాధారణమైన ఒక అబ్బాయికి ఇంతటి అమోఘమైన విద్య, అదీ జీవితాంతం నిలిచే విద్య లభించిందంటే నాకెప్పుడూ అద్భుతంగానే ఉంటుంది.

[26వ పేజీలోని చిత్రం]

1955లో మా పెళ్ళి రోజున

[27వ పేజీలోని చిత్రం]

1957లో, క్షేత్ర సేవలో స్థానిక సహోదరుడు రాజన్‌ కాదీర్గామార్‌తో

[28వ పేజీలోని చిత్రం]

సిబిల్‌తో ఇప్పుడు