కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నేడు దేవుణ్ణి ఎవరు మహిమపరుస్తున్నారు?

నేడు దేవుణ్ణి ఎవరు మహిమపరుస్తున్నారు?

నేడు దేవుణ్ణి ఎవరు మహిమపరుస్తున్నారు?

“ప్రభువా [యెహోవా], మా దేవా, . . . నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవు.”​—⁠ప్రకటన 4:​10, 11.

స్విట్జర్లాండ్‌కు చెందిన ఇంజనీరు జార్జ్‌ డి మెస్ట్రల్‌ 1940లలో ఒకరోజు తన కుక్కను వాహ్యాళికి తీసుకొని వెళ్ళాడు. ఇంటికి తిరిగివచ్చిన తర్వాత ఆయన తన బట్టలకే కాక తన కుక్క బొచ్చుకు కూడా మొక్కల విత్తనాలపై ఉండే ముళ్ళతో కూడిన ఊక అంటుకొని ఉండడం గమనించాడు. వాటి గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాసతో ఆయన వాటిని మైక్రోస్కోప్‌నుండి పరిశీలించాడు, వంపులుగల దేనికైనా అంటుకునే చిన్న కొక్కెలను చూసి ఆయన ఎంతో ఆశ్చర్యపోయాడు. చివరకు ఆయన దానిలానే ఉండే సింథెటిక్‌ వెల్క్రోను (ఏవైనా రెండు చివరలను ఒక దగ్గర చేర్చి అంటించడానికి ఉపయోగించే రెండు పట్టీలు, ఒక పట్టికి వంపులు ఉంటాయి మరో పట్టీకి కొక్కెలు ఉంటాయి) తయారుచేశాడు. అలా ప్రకృతిలోని నైపుణ్యాన్ని అనుకరించింది కేవలం డి మెస్ట్రల్‌ ఒక్కడే కాదు. అమెరికాకు చెందిన రైట్‌ సహోదరులు ఎగిరే పెద్ద పక్షులను అధ్యయనం చేసిన తర్వాత విమానాన్ని తయారు చేశారు. ఫ్రెంచి ఇంజనీరు అలెగ్జాండర్‌ గుస్టేవ్‌ ఐఫెల్‌, మానవ శరీర బరువును మోయడానికి తొడ ఎముకకు సహాయం చేసే ప్రాథమిక సూత్రాలను ఉపయోగించి ప్యారిస్‌లో తన పేరుతోవున్న టవర్‌ను నిర్మించాడు.

2 ఈ ఉదాహరణలు, మానవులు ప్రకృతిలో కనిపించే రూపకల్పనలను ఎంతగా అనుకరిస్తారో చక్కగా చూపిస్తున్నాయి. ఈ విషయాల గురించి తెలుసుకున్నప్పుడు, ఒక సహేతుకమైన ప్రశ్న తలెత్తుతుంది: వివిధ వస్తువులను కనుగొన్న వ్యక్తులు చిన్న ముళ్ళుగల ఊకను, పెద్ద పెద్ద పక్షులను, మానవ తొడ ఎముకను, ప్రకృతిలోని మిగతా అద్భుతాలను రూపొందించిన వ్యక్తికి ఘనతను ఇస్తున్నారా? విషాదకరమైన వాస్తవమేమిటంటే నేటి లోకంలో దేవునికి చెందవలసిన ఘనతను, మహిమను ఆయనకు ఇవ్వడం చాలా అరుదుగా జరుగుతుంది.

3 ‘దేవుణ్ణి మహిమపరచాల్సిన అవసరమేముంది? ఆయన ఇప్పటికే మహిమాన్వితుడు కాడా?’ అని కొందరు అనుకోవచ్చు. నిజమే యెహోవా ఈ విశ్వంలోనే అత్యంత మహిమాన్వితుడైన వ్యక్తి, అయితే దానర్థం మానవులందరూ ఆయనను మహిమాన్వితుడిగా దృష్టిస్తారని కాదు. బైబిలులో “మహిమ” అని అనువదించబడిన హీబ్రూ పదానికి “బరువైన” అనే ప్రాథమిక భావం ఉంది. ఆ పదం ఒక వ్యక్తిని గమనార్హమైనవాడిగా లేదా ఇతరులకు ప్రాముఖ్యమైనవాడిగా కనిపించేలా చేసే దేనినైనా సూచిస్తుంది. దేవునికి సంబంధించి ఆ పదం ఉపయోగించబడినప్పుడు అది దేవుణ్ణి మానవుల ఎదుట మహిమాన్వితుడిగా చేసేదానిని సూచిస్తుంది.

4 నేడు చాలామంది ప్రజలు దేవుణ్ణి మహిమాన్వితునిగా చేసేదానిని గమనించరు. (కీర్తన 10:4; 14:⁠1) నిజానికి సమాజంలోని ప్రముఖులు అసలు దేవుడు ఉన్నాడని నమ్మరు, ఒకవేళ నమ్మినా వాళ్ళు తరచూ ఈ మహిమాన్వితమైన విశ్వ సృష్టికర్తపట్ల అమర్యాదగా వ్యవహరించేలా ప్రజలను ప్రభావితం చేస్తారు. వాళ్ళు ఏయే విధాలుగా అలా చేశారు?

“వారు నిరుత్తరులై యున్నారు”

5 చాలామంది శాస్త్రజ్ఞులు దేవుడు లేడని వాదిస్తారు. మరి వాళ్ళ అభిప్రాయం ప్రకారం మానవులతోపాటు సృష్టిలోని మిగతా అద్భుతాలు ఎలా ఉనికిలోకి వచ్చాయి? సృష్టిలోని అద్భుతాలు నియంత్రణలేని ఒక శక్తివల్ల యాదృచ్ఛికంగా ఉనికిలోకి వచ్చాయని వాళ్ళు చెబుతారు. ఉదాహరణకు స్టీఫెన్‌ జే గౌల్డ్‌ అనే పరిణామవాది ఇలా వ్రాశాడు: “వింతైన చేపల వర్గం కారణంగా మనమిక్కడ ఉన్నాం, వాటికి విశిష్ఠమైన రెక్కలుండేవి అవి భూగోళ సంబంధ ప్రాణులకుండే కాళ్ళలా రూపాంతరం చెందాయి . . . మనం దీనికంటే ‘మంచి’ వివరణ ఉంటే బాగుంటుందని పరితపించవచ్చు​—⁠కానీ అలాంటి వివరణేదీ లేదు.” అదేవిధంగా రిచర్డ్‌ ఇ. లెకే మరియు రోజర్‌ లూయన్‌ ఇలా వ్రాశారు: “మానవజాతి బహుశా జీవశాస్త్రానికి సంబంధించిన ఒక భయంకరమైన పొరపాటు మాత్రమే కావచ్చు.” ప్రకృతి అందాలను దాని రూపకల్పనను ప్రశంసించే కొంతమంది శాస్త్రజ్ఞులు కూడా దేవునికి ఘనతనివ్వడంలో విఫలమవుతారు.

6 విద్యావంతులైన వ్యక్తులు పరిణామవాదం వాస్తవమేనని వాదించినప్పుడు, కేవలం తెలివితక్కువ వాళ్ళే దానిని నమ్మడానికి నిరాకరిస్తారని పరోక్షంగా చెబుతున్నారు. ఇలాంటి వాదనకు చాలామంది ఎలా ప్రతిస్పందిస్తారు? కొన్ని సంవత్సరాల క్రితం పరిణామవాదం గురించి ఎంతో జ్ఞానంగల వ్యక్తి దానిని అంగీకరించే వ్యక్తులను ఇంటర్వ్యూ చేశాడు. ఆయన ఇలా చెప్పాడు: “తెలివిగలవాళ్ళందరూ పరిణామవాదాన్ని నమ్ముతారు అని చెప్పబడినందువల్లనే చాలామంది దానిని నమ్మడం ప్రారంభించారు అని నేను కనుగొన్నాను.” అవును విద్యావంతులైన వ్యక్తులు దేవుడు లేడని వాదించినప్పుడు, సృష్టికర్తగా దేవునికి చెందవలసిన ఘనతను ఆయనకు ఇవ్వడానికి ఇతరులు కూడా వెనకాడతారు.​—⁠సామెతలు 14:15, 18.

7 వాస్తవాలు, రుజువులు ఉన్నాయి కాబట్టే శాస్త్రజ్ఞులు అలాంటి ముగింపులకు వచ్చారా? లేదు! సృష్టికర్త ఉన్నాడని నిరూపించే రుజువులు మన చుట్టూ ఉన్నాయి. ఆయన గురించి అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “ఆయన అదృశ్యలక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు [అవిశ్వాసులు] నిరుత్తరులై యున్నారు.” (రోమీయులు 1:​20) సృష్టికర్త చేసినవాటిలో మనం ఆయన ఉన్నాడనే రుజువులను స్పష్టంగా చూడవచ్చు. కాబట్టి మానవజాతి ఉనికిలోకి వచ్చినప్పటినుండి మానవులు తమకు కనిపిస్తున్న సృష్టి ద్వారా దేవుని ఉనికికి రుజువులను ‘ఆలోచించగలిగారు.’ ఈ రుజువులు ఎక్కడ ఉన్నాయి?

8 నక్షత్రాలతో నిండిన ఆకాశంలో మనం దేవుడున్నాడనడానికి రుజువును చూడవచ్చు. “ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి” అని కీర్తన 19:1 చెబుతోంది. “ఆకాశములు” అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు దేవుని శక్తికి జ్ఞానానికి నిదర్శనగా ఉన్నాయి. నక్షత్రాల సంఖ్యే మనల్ని భక్తిపూర్వక భయంతో నింపేస్తుంది. ఈ అంతరిక్ష గ్రహ సముదాయాలన్నీ ఎలాంటి గమ్యం లేకుండా కాదుగానీ, ఖచ్చితమైన భౌతిక నియమాల ప్రకారం విశ్వంలో పయనిస్తాయి. * (యెషయా 40:​26) ఈ క్రమపద్ధతి నియంత్రణలేని శక్తివల్ల యాదృచ్ఛికంగా కలిగిందని నమ్మడం సహేతుకమేనా? గమనార్హమైన విషయమేమిటంటే చాలామంది శాస్త్రజ్ఞులు ఈ విశ్వం అకస్మాత్తుగా ఉనికిలోకి వచ్చిందని అంటారు. దానిని వివరిస్తూ ఒక ప్రొఫెసర్‌ ఇలా వ్రాశాడు: “విశ్వం నిరంతరం ఉనికిలోనే ఉంది అనే అభిప్రాయం నాస్తికులకు లేదా అజ్ఞాతావాదులకు అంగీకారయోగ్యంగా ఉంటుంది. అదేవిధంగా విశ్వానికి ఒక ప్రారంభం ఉందనే అభిప్రాయం అది ఉనికిలోకి రావడానికి కారణమేమిటి అనే ప్రశ్నను లేవదీస్తుంది; ఎందుకంటే తగిన కారణం లేకుండానే ఇంతటి పరిణామం జరిగిందని ఎవరు అనుకుంటారు?”

9 దేవుడున్నాడనడానికి రుజువులు మనకు భూమిపై కూడా కనిపిస్తాయి. కీర్తనకర్త ఇలా అన్నాడు: “యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి! జ్ఞానముచేత నీవు వాటన్నిటిని నిర్మించితివి. నీవు కలుగజేసినవాటితో భూమి నిండియున్నది.” (కీర్తన 104:​24) జంతు ప్రపంచంతోపాటు యెహోవా “కలుగజేసినవి” ఆయన జ్ఞానానికి నిదర్శనంగా ఉన్నాయి. మనం ముందు చూసినట్లుగా జీవంగల ప్రాణుల రూపకల్పన ఎంత అద్భుతమైనదంటే శాస్త్రజ్ఞులు తరచూ దానిని అనుకరించడానికి ప్రయత్నిస్తారు. మరికొన్ని ఉదాహరణలను పరిశీలించండి. పరిశోధకులు మరింత బలమైన హెల్మెట్‌లను తయారుచేయడానికి దుప్పి లేదా లేడివంటి జంతువుల కొమ్ములను అధ్యయనం చేస్తున్నారు; వినికిడి సాధనాలను మెరుగుపరిచే ఉద్దేశంతో నిశితమైన వినికిడి శక్తిగల ఒక జాతి ఈగలను పరిశీలిస్తున్నారు; రహస్య విమానాలను (రాడారు కనిపెట్టలేని విమానాలు) వృద్ధి చేసేందుకు గుడ్లగూబ రెక్కల ఈకలను పరిశీలిస్తున్నారు. అయితే మానవుడు ఎంత ప్రయత్నించినా సరే ప్రకృతిలోని పరిపూర్ణమైన రూపకల్పనలను ఖచ్చితంగా నకలు చేయలేడు. బయోమిమిక్రీ​—⁠ఇన్నోవేషన్‌ ఇన్‌స్పైయర్డ్‌ బై నేచర్‌ అనే పుస్తకం ఇలా వ్యాఖ్యానించింది: “భూమినుండి తీసుకోబడిన ఇంధనాన్ని ఉపయోగించకుండా, భూమిని కలుషితం చేయకుండా, లేదా తమ భవిష్యత్తును ప్రమాదంలో పడవేసుకోకుండా జంతువులు మానవులు చేయాలనుకున్న పనులన్నింటిని చేశాయి.” ఎంతటి జ్ఞానమో కదా!

10 మీరు పైనున్న ఆకాశాన్ని చూసినా లేక ఇక్కడే భూమిపై ఉన్న సృష్టిని చూసినా, సృష్టికర్త ఉన్నాడనడానికి రుజువులు స్పష్టంగా కనిపిస్తాయి. (యిర్మీయా 10:​12) “ప్రభువా [యెహోవా], మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి . . . గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవు” అని ఎలుగెత్తి పాడే పరలోక ప్రాణులతో మనం హృదయపూర్వకంగా ఏకీభవించాలి. (ప్రకటన 4:​10, 11) అయితే చాలామంది శాస్త్రజ్ఞులు తమ కళ్ళతో చూసిన ప్రకృతి రూపకల్పనను బట్టి ఆశ్చర్యపడినా ‘తమ మనోనేత్రములతో’ సృష్టికర్త ఉన్నాడనే రుజువులను చూడడంలో విఫలమవుతారు. (ఎఫెసీయులు 1:​17) మనం దానిని ఇలా ఉదాహరించవచ్చు: సృష్టిలోని అందాలను దాని రూపకల్పనను చూసి ముగ్ధులై వాటిని తయారుచేసిన గొప్ప రూపకర్త లేడు అనడం, ఒక అద్భుతమైన చిత్రాన్ని మెచ్చుకొని అదే సమయంలో ఒక ఖాళీ కాగితాన్ని అందమైన కళాఖండంగా తీర్చిదిద్దిన చిత్రకారుడు లేడు అనడమంత మూర్ఖమైనది. దేవుడు ఉన్నాడని నమ్మడానికి నిరాకరించేవారు “నిరుత్తరులై యున్నారు” అనడంలో ఆశ్చర్యమేమీ లేదు!

“గ్రుడ్డి” మార్గదర్శకులు చాలామందిని తప్పుదోవ పట్టిస్తారు

11 చాలామంది మతపరమైన ప్రజలు తాము ఆరాధించే పద్ధతి దేవుణ్ణి మహిమపరుస్తుంది అని యథార్థంగా నమ్ముతారు. (రోమీయులు 10:​2, 3) అయితే నిజానికి కోట్లాదిమంది దేవుణ్ణి మహిమపరచకుండా అడ్డుకుంటున్న వాటిలో మతం కూడా ఒకటి. అదెలా? మనం రెండు విధానాలను పరిశీలిద్దాం.

12 మొదటిగా, అబద్ధ బోధల ద్వారా మతాలు దేవునికి రావలసిన మహిమను పక్కకు మళ్ళిస్తున్నాయి. ఉదాహరణకు విధి సిద్ధాంతాన్నే తీసుకోండి. ఆ సిద్ధాంతం, దేవునికి భవిష్యత్తు తెలుసుకునే శక్తి ఉంది కాబట్టి జరిగే ప్రతి సంఘటనకు సంబంధించిన ఫలితం ఆయనకు ముందే తెలిసివుండాలి అనే ఊహపై ఆధారపడి ఉంది. కాబట్టి దేవుడు ఎంతోకాలం క్రితమే ప్రతి వ్యక్తి భవిష్యత్తును మంచికో చెడుకో నిర్ణయించేశాడని విధి సిద్ధాంతం సూచిస్తుంది. ఈ సిద్ధాంతం ప్రకారం నేడు లోకంలోవున్న బాధలకు, దుష్టత్వానికి దేవుణ్ణే బాధ్యునిగా ఎంచాలి. అది దేవుణ్ణి ఏమాత్రం మహిమపరచదనడంలో సందేహం లేదు, ఎందుకంటే అది “ఈ లోకాధికారి” అని బైబిలు పిలుస్తున్న దేవుని ప్రధాన శత్రువైన సాతానుపై వేయాల్సిన నిందను దేవునిపై వేస్తుంది!​—⁠యోహాను 14:30; 1 యోహాను 5:19.

13 విధి సిద్ధాంతం దేవునిపై అపనింద వేసే లేఖన విరుద్ధమైన బోధన. అది దేవుడు నిజానికి ఏమి చేస్తాడు మరియు ఏమి చేయగలడు అనే దాని మధ్యనున్న తేడాను గ్రహించకుండా గందరగోళం సృష్టిస్తుంది. దేవుడు జరగబోయే సంఘటనలను ముందుగానే తెలుసుకోగలడు అని బైబిల్లో స్పష్టంగా తెలియజేయబడింది. (యెషయా 46:​9, 10) అయితే ఆయన భవిష్యత్తును తెలుసుకునే తన సామర్థ్యాన్ని అదుపు చేసుకోలేడని లేదా ప్రతి పర్యవసానానికి ఆయన బాధ్యుడని భావించడం నిర్హేతుకమైనది. ఉదాహరణకు: మీకు ఎంతో శారీరక బలం ఉందనుకోండి. అంతమాత్రాన మీరు కనిపించిన ప్రతి బరువైన వస్తువును ఎత్తడానికి ఇష్టపడతారా? లేదు! అదేవిధంగా భవిష్యత్తును తెలుసుకునే సామర్థ్యం ఉన్నంత మాత్రాన దేవుడు ఖచ్చితంగా ప్రతీ విషయాన్ని ముందుగానే తెలుసుకుంటాడని లేదా నిర్ణయిస్తాడని కాదు. ఆయన భవిష్యత్తు గురించి తనకున్న జ్ఞానాన్ని తన ఇష్టానుసారంగా మాత్రమే ఉపయోగిస్తాడు. * కాబట్టి విధి సిద్ధాంతంతోపాటు ఇతర అబద్ధ బోధలు దేవుణ్ణి మహిమపరచవు.

14 వ్యవస్థీకరించబడిన మతం దేవుణ్ణి అగౌరవపరిచే రెండవ విధానం, దాని అనుచరుల ప్రవర్తన. క్రైస్తవులు యేసు బోధలను అనుసరించాలి. యేసు తన అనుచరులకు ‘ఒకరినొకరు ప్రేమించాలి,’ మరియు ‘లోకసంబంధులు కాకుండా’ ఉండాలి వంటి సూత్రాలు నేర్పించాడు. (యోహాను 15:12; 17:​14-16) క్రైస్తవమత సామ్రాజ్యంలోని మతనాయకుల విషయమేమిటి? వాళ్ళు ఆ బోధలను నిజంగానే అనుసరించారా?

15 యుద్ధం విషయంలో మతనాయకుల చరిత్రను పరిశీలించండి. వాళ్ళు దేశాల మధ్య జరిగే అనేక యుద్ధాలకు మద్దతునిచ్చారు, చూసీ చూడనట్లు ఊరుకున్నారు, వాటిలో నాయకత్వం వహించారు కూడా. వాళ్ళు సైనిక దళాలను ఆశీర్వదించి, ఆ మారణకాండలో తప్పేమీ లేదన్నట్లు ప్రవర్తించారు. ‘అలాంటి మతనాయకులకు ప్రత్యర్థి వర్గంలో కూడా తమ మతానికి చెందిన మతనాయకులు ఉన్నారని, వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారని తెలియదా?’ అని మనం ప్రశ్నించకుండా ఉండలేము. (“దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడు?” అనే బాక్సు చూడండి.) రక్తపాతంతో నిండిన యుద్ధాలకు దేవుని మద్దతు ఉందని చెప్పే మతనాయకులు దేవుణ్ణి మహిమపరచడం లేదు; అలాగే వాళ్ళు బైబిలు ప్రమాణాలను పనికిరావని పక్కకు పడేసినప్పుడు, లైంగిక దుర్నీతిని అనుమతించినప్పుడు కూడా దేవుణ్ణి మహిమపరచడం లేదు. వాళ్ళు మనకు “అక్రమము చేయువారు” “గ్రుడ్డి” మార్గదర్శకులు అని యేసుక్రీస్తు పిలిచిన మతనాయకులను గుర్తు చేస్తారు. (మత్తయి 7:15-23; 15:​14) మతనాయకుల ప్రవర్తనవల్ల కోట్లాదిమందికి దేవునిపట్ల ఉన్న ప్రేమ తగ్గిపోయింది.​—⁠మత్తయి 24:12.

దేవుణ్ణి నిజంగా ఎవరు మహిమపరుస్తున్నారు?

16 లోకంలోని ప్రముఖులు, ప్రాబల్యంగలవాళ్ళు దేవుణ్ణి మహిమపరచడంలో విఫలమైతే మరి నేడు దేవుణ్ణి నిజంగా ఎవరు మహిమపరుస్తున్నారు? ఆ ప్రశ్నకు సమాధానం కనుక్కోవడానికి మనం బైబిలును చూడాలి. తాను ఎలా మహిమపర్చబడాలో చెప్పే హక్కు దేవునికి ఉంది, ఆయన తన వాక్యమైన బైబిలులో తన ప్రమాణాలను ఇచ్చాడు. (యెషయా 42:⁠8) మనం ఇప్పుడు దేవుణ్ణి మహిమపర్చడానికి మూడు మార్గాలను పరిశీలిద్దాం, ప్రతీ మార్గాన్ని పరిశీలించేటప్పుడు నేడు అలా ఎవరు చేస్తున్నారో కూడా చూద్దాం.

17 మొదటిగా మనం దేవుని నామాన్ని స్తుతించడం ద్వారా ఆయనను మహిమపర్చవచ్చు. దేవుని నామాన్ని స్తుతించడమనేది ఆయన చిత్తంలో ఆవశ్యకమైన అంశం అని యెహోవా యేసుకు చెప్పిన మాటల ద్వారా స్పష్టమవుతోంది. యేసు చనిపోవడానికి కొన్ని రోజుల ముందు “తండ్రీ, నీ నామము మహిమపరచుము” అని ప్రార్థించాడు. అప్పుడు “నేను దానిని మహిమపరచితిని, మరల మహిమపరతును” అని ఒక స్వరం సమాధానమిచ్చింది. (యోహాను 12:​28) అలా చెప్పింది స్వయంగా యెహోవాయే. ఆయన చెప్పినదాన్ని బట్టి ఆయనకు తన నామం మహిమపరచబడడం చాలా ప్రాముఖ్యమని స్పష్టమవుతోంది. మరి నేడు భూవ్యాప్తంగా యెహోవా నామాన్ని తెలియజేయడం ద్వారా దానిని స్తుతించడం ద్వారా ఆయనను ఎవరు మహిమపరుస్తున్నారు? యెహోవాసాక్షులు అలా చేస్తున్నారు, అదీ 235 దేశాల్లో!​—⁠కీర్తన 86:11, 12.

18 రెండవదిగా, మనం దేవుని గురించిన సత్యాన్ని బోధించడం ద్వారా ఆయనను మహిమపరచవచ్చు. సత్యారాధకులు ‘[దేవుణ్ణి] సత్యముతో ఆరాధిస్తారు’ అని యేసు చెప్పాడు. (యోహాను 4:​24) దేవుణ్ణి “సత్యముతో” ఆరాధించేవారిని మనం ఎలా గుర్తించవచ్చు? వాళ్ళు బైబిలుపై ఆధారపడని సిద్ధాంతాలను, దేవుణ్ణి ఆయన చిత్తాన్ని తప్పుగా చిత్రీకరించే సిద్ధాంతాలను విసర్జించాలి. దానికి బదులు వాళ్ళు దేవుని వాక్యపు స్వచ్ఛమైన సత్యాలను బోధించాలి, ఆ సత్యాల్లో కొన్ని ఇవి: యెహోవాయే మహోన్నతమైన దేవుడు, మహోన్నతునిగా ఆయనకు చెందవలసిన మహిమకు కేవలం ఆయన మాత్రమే అర్హుడు (కీర్తన 83:18); యేసు దేవుని కుమారుడు, ఆయన దేవుని మెస్సీయా రాజ్యానికి నియమించబడిన పరిపాలకుడు (1 కొరింథీయులు 15:27, 28); దేవుని రాజ్యం యెహోవా నామాన్ని మహిమపరుస్తుంది, ఈ భూమిపట్ల దానిపైనున్న మానవులపట్ల దేవునికున్న సంకల్పాన్ని నెరవేరుస్తుంది (మత్తయి 6:9, 10); ఈ రాజ్యం గురించిన సువార్త భూమంతటా ప్రకటించబడాలి. (మత్తయి 24:​14) ఒక శతాబ్దంకంటే ఎక్కువ కాలంగా కేవలం ఒక్క గుంపుకు చెందినవారు మాత్రమే ఇలాంటి విలువైన సత్యాలను బోధిస్తున్నారు​—⁠వాళ్ళే యెహోవాసాక్షులు!

19 మూడవదిగా, మనం దేవుని ప్రమాణాలకు అనుగుణంగా జీవించడం ద్వారా ఆయనను మహిమపరచవచ్చు. అపొస్తలుడైన పేతురు ఇలా వ్రాశాడు: “అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్‌క్రియలను చూచి, వాటినిబట్టి దర్శనదినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండం[డి].” (1 పేతురు 2:​12) ఒక క్రైస్తవుని ప్రవర్తన ఆయన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. చూపరులు ఆ విషయాన్ని గ్రహించినప్పుడు, అంటే ఒక క్రైస్తవుని చక్కని ప్రవర్తనకు ఆయన విశ్వాసమే కారణమని గ్రహించినప్పుడు, అది దేవునికి మహిమను తెస్తుంది.

20 నేడు మంచి ప్రవర్తన కలిగివుండడం ద్వారా దేవుణ్ణి ఎవరు మహిమపరుస్తున్నారు? చాలా ప్రభుత్వాలు శాంతియుతమైన ప్రజలుగా, పన్నులు కట్టి చట్టానికి కట్టుబడి ఉండేవారిగా ఏ మత గుంపుకు చెందిన ప్రజలను ప్రశంసిస్తున్నాయి? (రోమీయులు 13:1, 3, 6, 7) తోటి విశ్వాసులతోగల ఐక్యతకు, అంటే దేశ, జాతి, తెగలకు సంబంధించిన తేడాలకు అతీతమైన ఐక్యతకు ప్రసిద్ధి చెందిన ప్రజలు ఎవరు? (కీర్తన 133:1; అపొస్తలుల కార్యములు 10:​34, 35) చట్టంపట్ల గౌరవాన్ని, కుటుంబ విలువలను, బైబిలు నైతికతను ప్రోత్సహించే బైబిలు విద్యా పని చేస్తున్నందుకు ఏ గుంపు ప్రపంచవ్యాప్తంగా పేరు గాంచింది? ఈ రంగాల్లోనే కాక ఇతర రంగాల్లోను చక్కని ప్రవర్తనగల గుంపు కేవలం ఒక్కటే ఉంది​—⁠వాళ్ళే యెహోవాసాక్షులు!

మీరు దేవుణ్ణి మహిమపరుస్తున్నారా?

21 ‘నేను వ్యక్తిగతంగా యెహోవాను మహిమపరుస్తున్నానా?’ అని మనలో ప్రతి ఒక్కరం ప్రశ్నించుకోవాలి. కీర్తన 148 ప్రకారం సృష్టిలో అధికశాతం దేవుణ్ణి మహిమపరుస్తోంది. దేవదూతలు, భౌతిక ఆకాశములు, భూమి, జంతు ప్రపంచం​—⁠ఇవన్నీ యెహోవాను స్తుతిస్తున్నాయి. (1-10 వచనాలు) నేడు మానవుల్లో చాలామంది అలా చేయకపోవడం ఎంత విచారకరమో కదా! దేవుణ్ణి మహిమపరిచే విధంగా జీవించడం ద్వారా మీరు యెహోవాను స్తుతించడంలో మిగతా సృష్టితో సామరస్యం కలిగివుంటారు. (11-13 వచనాలు) మీరు జీవించడానికి ఇంతకంటే ఉత్తమమైన మార్గం మరొకటి లేదు.

22 యెహోవాను మహిమపరచడం ద్వారా మీరు ఎన్నో విధాలుగా ఆశీర్వదించబడతారు. క్రీస్తు విమోచన క్రయధన బలిపై విశ్వాసముంచడం ద్వారా మీరు దేవునితో సమాధానపర్చబడి, మీ పరలోక తండ్రితో శాంతియుతమైన ప్రతిఫలదాయకమైన సంబంధం కలిగివుంటారు. (రోమీయులు 5:​10) మీరు దేవుణ్ణి మహిమపరచడానికిగల కారణాల కోసం వెదికినప్పుడు మరింత అనుకూలమైన దృక్పథాన్ని పెంపొందించుకొని, మరింత కృతజ్ఞతగలవారిగా తయారవుతారు. (యిర్మీయా 31:​12) అప్పుడు మీరు సంతోషంగా, సంతృప్తిగా జీవించడానికి ఇతరులకు సహాయం చేయగలుగుతారు, తత్ఫలితంగా స్వయంగా మీరు మరింత ఆనందాన్ని పొందుతారు. (అపొస్తలుల కార్యములు 20:​35) ఇప్పుడు, ఎల్లప్పుడూ దేవుణ్ణి మహిమపరచాలని దృఢంగా తీర్మానించుకునేవారిలో మీరు కూడా ఉందురు గాక!

[అధస్సూచీలు]

^ పేరా 11 భౌతిక ఆకాశములు దేవుని జ్ఞానాన్ని శక్తిని ఎలా ప్రతిబింబిస్తాయి అనే విషయంపై మరిన్ని వివరాల కోసం, యెహోవాసాక్షులు ప్రచురించిన యెహోవాకు సన్నిహితమవండి పుస్తకంలోని 5, 17 అధ్యాయాలు చూడండి.

^ పేరా 17 యెహోవాసాక్షులు ప్రచురించిన లేఖనాలపై అంతర్దృష్టి (ఆంగ్లం) 1వ సంపుటి, 853వ పేజీ చూడండి.

మీకు గుర్తున్నాయా?

దేవుణ్ణి మహిమపరచడానికి శాస్త్రజ్ఞులు ప్రజలకు సహాయపడలేదని మనమెలా చెప్పవచ్చు?

వ్యవస్థీకరించబడిన మతం, ప్రజలు దేవుణ్ణి మహిమపరచకుండా ఏ రెండు విధాలుగా ఆటంకపరచింది?

మనం దేవుణ్ణి ఏయే విధాలుగా మహిమపరచవచ్చు?

మీరు వ్యక్తిగతంగా యెహోవాను మహిమపరుస్తున్నారా లేదా అని ఎందుకు పరిశీలించుకోవాలి?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. (ఎ) మానవులు ప్రకృతిని అనుకరిస్తారని ఏ ఉదాహరణలు చూపిస్తున్నాయి? (బి) ఏ ప్రశ్న తలెత్తుతుంది, దానికి సమాధానమేమిటి?

3, 4. “మహిమ” అని అనువదించబడిన హీబ్రూ పదానికి భావమేమిటి, యెహోవాకు సంబంధించి ఉపయోగించబడినప్పుడు అది దేనిని సూచించాలి?

5. సృష్టిలోని అద్భుతాల ఉనికిని చాలామంది శాస్త్రజ్ఞులు ఎలా వివరిస్తారు?

6. సృష్టికర్తగా దేవునికి చెందవలసిన ఘనతను ఆయనకు ఇవ్వడానికి ఎందుకు చాలామంది వెనకాడతారు?

7. రోమీయులు 1:⁠20 ప్రకారం, సృష్టి ద్వారా దేనిని స్పష్టంగా చూడవచ్చు, ఎందుకు?

8. (ఎ) భౌతిక ఆకాశములు దేవుని శక్తికి జ్ఞానానికి ఎలా నిదర్శనగా ఉన్నాయి? (బి) విశ్వం ఉనికిలోకి రావడానికి ఒక కారణముండాలని ఏది సూచిస్తోంది?

9. జంతు ప్రపంచంలో యెహోవా జ్ఞానం ఎలా స్పష్టమవుతోంది?

10. గొప్ప రూపకర్త ఉనికిని కాదనడం ఎందుకు మూర్ఖమైనది? ఉదహరించండి.

11, 12. విధి సిద్ధాంతం ఎలాంటి ఊహపై ఆధారపడి ఉంది, ఈ సిద్ధాంతం దేవుణ్ణి మహిమపరచదని ఏది చూపిస్తోంది?

13. దేవుడు భవిష్యత్తును తెలుసుకునే తన సామర్థ్యాన్ని అదుపు చేసుకోలేడని తలంచడం ఎందుకు అవివేకమైనది? ఉదహరించండి.

14. వ్యవస్థీకరించబడిన మతం దేవుణ్ణి ఏ విధంగా అగౌరవపరచింది?

15. (ఎ) దేశాల మధ్య జరిగే యుద్ధాల విషయానికి వస్తే మతనాయకుల చరిత్ర ఎలా ఉంది? (బి) మతనాయకుల ప్రవర్తన కోట్లాదిమందిపై ఎలాంటి ప్రభావం చూపించింది?

16. దేవుణ్ణి నిజంగా ఎవరు మహిమపరుస్తున్నారు అనే ప్రశ్నకు సమాధానం కనుక్కోవడానికి మనం బైబిలును ఎందుకు చూడాలి?

17. యెహోవా నామాన్ని స్తుతించడం ఆయన చిత్తంలో ఒక ఆవశ్యకమైన అంశమని స్వయంగా ఆయనే ఎలా సూచించాడు, నేడు భూవ్యాప్తంగా దేవుని నామాన్ని ఎవరు స్తుతిస్తున్నారు?

18. దేవుణ్ణి “సత్యముతో” ఆరాధించేవాళ్ళను మనం ఎలా గుర్తించవచ్చు, ఒక శతాబ్దంకంటే ఎక్కువ కాలంగా ఏ గుంపుకు చెందినవారు బైబిలు సత్యాన్ని బోధిస్తున్నారు?

19, 20. (ఎ) ఒక క్రైస్తవుని చక్కని ప్రవర్తన దేవునికి మహిమను ఎందుకు తేగలదు? (బి) చక్కని ప్రవర్తనను కాపాడుకోవడం ద్వారా నేడు దేవుణ్ణి ఎవరు మహిమపరుస్తున్నారో నిర్ణయించడానికి మనకు ఏ ప్రశ్నలు సహాయం చేస్తాయి?

21. మనం వ్యక్తిగతంగా యెహోవాను మహిమపరుస్తున్నామా లేదా అని మనం ఎందుకు పరిశీలించుకోవాలి?

22. యెహోవాను మహిమపరచడం ద్వారా మీరు ఏయే విధాలుగా ఆశీర్వదించబడతారు, మీ తీర్మానం ఏమై ఉండాలి?

[12వ పేజీలోని బాక్సు]

“దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడు?”

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్‌ వైమానిక దళంలో పనిచేసి, ఆ తర్వాత యెహోవాసాక్షిగా మారిన ఒక వ్యక్తి ఇలా గుర్తు చేసుకుంటున్నాడు:

“యుద్ధం జరుగుతోన్న ఆ సంవత్సరాల్లో నన్ను బాగా కలతపెట్టిన విషయమేమిటంటే . . . విమానాలు ప్రాణాంతకమైన బాంబులను పడవేయడానికి వెళ్ళబోయే ముందు అన్ని శాఖలకు చెందిన మతనాయకులు, అంటే క్యాథలిక్‌, లూథరన్‌, ఎపిస్కోపల్‌ తదితర శాఖలకు చెందిన మతనాయకులు విమానాలను, వాటి సిబ్బందిని ఆశీర్వదిస్తుండగా చూడడం. ‘దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడు?’ అని నేను తరచూ ఆలోచించేవాడిని.

“జర్మన్‌ సైనికులు ధరించే బెల్టుపై గాట్‌ మిట్‌ అన్స్‌ (దేవుడు మాతో ఉన్నాడు) అనే అక్షరాలు చెక్కబడి ఉండేవి. ‘అవతలివైపు అదే మతానికి చెందిన సైనికులు అదే దేవునికి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు వాళ్ళ పక్షాన ఎందుకు ఉండడు?’ అని నేను అనుకునేవాడిని.”

[10వ పేజీలోని చిత్రం]

భూవ్యాప్తంగా యెహోవాసాక్షులు నిజంగానే దేవుణ్ణి మహిమపరుస్తున్నారు