కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

అపొస్తలుడైన యోహాను, “పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్లగొట్టును” అని వ్రాసినప్పుడు “పరిపూర్ణ ప్రేమ” అంటే ఆయన భావమేమిటి, అది వెళ్ళగొట్టే “భయము” అంటే ఏమిటి?

“ప్రేమలో భయముండదు; అంతేకాదు; పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్లగొట్టును; భయము దండనతో కూడినది; భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు” అని అపొస్తలుడైన యోహాను వ్రాశాడు.​—⁠1 యోహాను 4:​18.

సందర్భాన్ని బట్టి చూస్తే యోహాను ఇక్కడ, ధైర్యంతో మాట్లాడడం గురించి ప్రత్యేకించి దేవుని ప్రేమకు, ఆయనతో మాట్లాడే ధైర్యానికీ మధ్య ఉండే సంబంధం గురించి చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అది మనం 17వ వచనం చదివినప్పుడు స్పష్టంగా కనబడుతుంది: “తీర్పుదినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి యున్నది.” ఒక క్రైస్తవుడు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నాడో, దేవునికి తన పట్ల ఉన్న ప్రేమ గురించి ఎంత గ్రహిస్తున్నాడో అది ఆయన దేవుణ్ణి ప్రార్థన ద్వారా సమీపించినప్పుడు ధైర్యంగా మాట్లాడడంపై లేదా మాట్లాడలేకపోవడంపై నేరుగా ప్రభావం చూపిస్తుంది.

“పరిపూర్ణ ప్రేమ” అనే మాటలు చాలా అర్థవంతమైనవి. బైబిలులో ఉపయోగించబడిన ప్రకారం, “పరిపూర్ణ” అనే పదం ఎల్లప్పుడూ, ఉన్నత స్థాయికి చెందిన లోపరహితమైన సంపూర్ణ పరిపూర్ణతను కాదుగానీ సాపేక్షిక పరిపూర్ణతనే ఎక్కువగా సూచిస్తుంది. ఉదాహరణకు, యేసు కొండమీద ఇచ్చిన ప్రసంగంలో, ‘మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండాలి’ అని అన్నాడు. తన అనుచరులు తమను ప్రేమించేవారినే ప్రేమిస్తే వారి ప్రేమ అసంపూర్ణమైనది, కొరతగలది, లోపముగలది అని యేసు చెబుతున్నాడు. వారు పరిపూర్ణులుగా ఉండాలి, అంటే తమ శత్రువులను కూడా ప్రేమిస్తూ తమ ప్రేమను పూర్తి స్థాయిలో చూపించాలి. అదేవిధంగా యోహాను “పరిపూర్ణ ప్రేమ” గురించి వ్రాసినప్పుడు, ఆయన దేవుని ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు అంటే పూర్ణ హృదయంతో, జీవితంలోని అన్ని రంగాల్లో కనబరచగల పూర్తి పరిణతి చెందిన ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు.​—⁠మత్తయి 5:​46-48; 19:​20, 21.

ఒక క్రైస్తవుడు ప్రార్థన ద్వారా దేవుణ్ణి సమీపిస్తున్నప్పుడు, తాను పాపభరితుడననీ, అపరిపూర్ణుడననీ అతనికి బాగా తెలుసు. అయినప్పటికీ, అతనికి దేవుని పట్ల ఉండే ప్రేమ, దేవునికి అతని పట్ల ఉన్న ప్రేమ గురించి సరైన అవగాహన ఉన్నట్లయితే, ఆయన తాను ఖండించబడతానేమో లేదా తిరస్కరించబడతానేమోనని భయపడడు. దానికి భిన్నంగా ఆయన తన మనసులోని మాటలను బహిర్గతం చేసేందుకు, దేవుడు యేసుక్రీస్తు ద్వారా ప్రేమతో ఏర్పాటు చేసిన విమోచన క్రయధనబలి ఆధారంగా క్షమాపణను అడిగేందుకు ధైర్యంతో మాట్లాడతాడు. తన విన్నపాలను దేవుడు సానుకూలంగా విన్నాడనే నమ్మకంతో ఉంటాడు.

ఒక వ్యక్తి తాను ఖండించబడతానేమో లేక తిరస్కరించబడతానేమో అనే భయాన్ని ‘వెళ్ళగొట్టే’ విధంగా “ప్రేమలో పరిపూర్ణుడు” ఎలా కాగలడు? “[దేవుని] వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను” అని అపొస్తలుడైన యోహాను అన్నాడు. (1 యోహాను 2:⁠5) ఆలోచించండి: పాపులుగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమించాడంటే, మనం నిజంగా పశ్చాత్తాపపడి ‘ఆయన వాక్యమును గైకొనడానికి’ కృషి చేస్తున్నప్పుడు ఆయన మనల్ని మరింత ఎక్కువగా ప్రేమించడా? (రోమీయులు 5:⁠8; 1 యోహాను 4:​10) నిజానికి మనం నమ్మకస్తులుగా ఉన్నంత కాలం, అపొస్తలుడైన పౌలు దేవుని గురించి ఈ విధంగా చెప్పినప్పుడు కలిగివున్న ధీమాను మనమూ కలిగి ఉండవచ్చు: “తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతోపాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు?”​—⁠రోమీయులు 8:​32.