కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు ఎలాంటి ఎదురుచూసే వైఖరి ఉంది?

మీకు ఎలాంటి ఎదురుచూసే వైఖరి ఉంది?

మీకు ఎలాంటి ఎదురుచూసే వైఖరి ఉంది?

ఈ కాలంలో ఎవరికోసమైనా లేక దేనికోసమైనా కనిపెట్టి ఉండడం లేదా ఎదురు చూడడం అంటే చాలామంది చిర్రుబుర్రులాడతారు. అది వారి ఓర్పును పరీక్షిస్తుంది. అయితే దేవుని ప్రజలు ‘కనిపెట్టివుండే’ లేదా ఎదురుచూసే వైఖరిని పెంపొందించుకోవాలని లేఖనాలు ప్రోత్సహిస్తున్నాయి. మీకా ప్రవక్త తన చుట్టుపక్కల ఉండే ప్రజలకు భిన్నంగా ఇలా ప్రకటించాడు: “రక్షణకర్తయగు నా దేవునికొరకు నేను కనిపెట్టియుందును.”​—⁠మీకా 7:⁠7; విలాపవాక్యములు 3:​26.

అయితే యెహోవా కొరకు ఎదురుచూడడం అంటే ఏమిటి? ఒక క్రైస్తవుడు దేవుని కొరకు ఎలా ఎదురుచూడాలి? అలా ఎదురుచూడడానికి సరైన పద్ధతులు లేదా తప్పుడు పద్ధతులు ఉన్నాయా? ఈ విషయంపై మనకు, సా.శ.పూ. తొమ్మిదవ శతాబ్దానికి చెందిన యోనా ప్రవక్త అనుభవం ఒక పాఠం నేర్పిస్తోంది.

తప్పుడు పద్ధతిలో ఎదురుచూసిన సందర్భం

అష్షూరు సామ్రాజ్యానికి రాజధాని అయిన నీనెవెకు వెళ్ళి, దాని పట్టణస్థులకు ప్రకటించమని యెహోవా దేవుడు యోనాకు నిర్దేశించాడు. నీనెవెలోని ఘోరమైన అమానుషత్వం, క్రూరత్వం కారణంగా అది “నరహత్య చేసిన పట్టణము”గా పేరుగాంచింది. ఆ విషయం వాస్తవమేనని చరిత్రకారులు, పురాతత్త్వ శాస్త్రజ్ఞులు ధృవీకరించారు. (నహూము 3:⁠1) యోనా ఈ నియామకాన్ని తప్పించుకోవాలని మొదట ప్రయత్నించాడు, కానీ యెహోవా ఆ ప్రవక్త నీనెవెకు వెళ్ళేలా చేశాడు.​—⁠యోనా 1:3-3:⁠2.

“యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంతదూరము సంచరించుచు​—⁠ఇక నలువది దినములకు నీనెవె పట్టణము నాశనమగునని ప్రకటనచే[శాడు].” (యోనా 3:⁠4) యోనా ప్రయత్నాలు గమనార్హమైన స్పందన కలిగించాయి: “నీనెవె పట్టణపువారు దేవునియందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి, ఘనులేమి అల్పులేమి అందరును గోనెపట్ట కట్టుకొనిరి.” (యోనా 3:⁠5) అది చూసి, ‘యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుకునే’ యెహోవా దేవుడు ఆ నగరాన్ని నాశనం చేయకుండా విడిచిపెట్టాడు.’​—⁠2 పేతురు 3:⁠9.

మరి యోనా ఎలా స్పందించాడు? ఆ వృత్తాంతం ఇలా చెబుతోంది: “యోనా దీనిచూచి బహు చింతాక్రాంతుడై కోపగించు[కున్నాడు.]” (యోనా 4:⁠1) ఎందుకు? యోనా బహుశా తాను ఫలానా తేదీకల్లా నాశనం అవుతుందని చేసిన ప్రకటన నెరవేరకపోవడం వల్ల, ప్రవక్తగా తన పరువు పోతుందని ఆయన భావించి ఉండవచ్చు. ఆయన ఇతరులను కాపాడడం, వారిపట్ల కనికరం చూపడం కంటే తన ప్రతిష్ఠ గురించే ఎక్కువగా చింతించాడని స్పష్టమవుతోంది.

అయితే యోనా తాను ప్రవక్తగా విరమించుకునేంత వరకు వెళ్ళలేదు. కానీ ఆయన ఆ “పట్టణమునకు ఏమి సంభవించునో చూచెదనని” వేచి చూశాడు. నిజానికి ఆయన ఒక విధమైన అసంతృప్తితో, ఏమి జరుగుతుందో చూద్దాం అనే వైఖరిని పెంచుకొన్నాడు. తాను ఎదురు చూసినట్లు జరగలేదని గ్రహించాక, ఒక పందిరి వేసుకొని నీడపట్టున కూర్చొని ఏమి జరుగుతుందో చూడాలన్నట్లు ముఖం ముడుచుకొని కాచుకొని చూశాడు. అయితే యెహోవా, యోనా వైఖరిని ఆమోదించలేదు, అందుకే ఆయన తన ప్రవక్త తప్పుడు ఆలోచనను సరిదిద్దాడు.​—⁠యోనా 4:​5, 9-11.

యెహోవా ఓపికకు కారణం

నీనెవె పశ్చాత్తాపపడి వదిలిపెట్టబడినా, ఆ తర్వాత అది మళ్ళీ చెడు మార్గాల్లోకే పోయింది. నహూము, జెఫన్యా ప్రవక్తల ద్వారా యెహోవా దాని నాశనం గురించి ముందే తెలిపాడు. “నరహత్య చేసిన పట్టణము” గురించి మాట్లాడుతూ, అష్షూరు దేశమును నాశనము చేస్తానని, నీనెవె పట్టణమును పాడుచేస్తానని యెహోవా ప్రకటించాడు. (నహూము 3:⁠1; జెఫన్యా 2:​13) సా.శ.పూ. 632లో నీనెవె శాశ్వతంగా నాశనం చేయబడింది.

అదే విధంగా, నేటి లోకం ప్రాచీన నీనెవె కంటే ఎక్కువగా ఇష్టానుసారంగా రక్తపాతం జరుపుతున్నందు వల్ల, అది అపరాధిగా నిలుస్తుంది. ఈ కారణంతోపాటు ఇతర కారణాల వల్ల, ప్రస్తుత దుష్ట విధానం ఇంతకుముందెన్నడూ కలగని “శ్రమ”లో పూర్తిగా నాశనమవుతుందని యెహోవా తీర్పు తీర్చాడు.​—⁠మత్తయి 24:​21, 22.

అయినప్పటికీ, నీనెవెలో పశ్చాత్తాపపడిన వారిలాగే, ఈ కాలంలోని యథార్థ ప్రజలు పశ్చాత్తాపపడి, నాశనం కాకుండా ఉండాలని యెహోవా తన వాగ్దాన విషయంలో ఓపిక పడుతున్నాడు. దేవుని ఓపికను సూచిస్తూ అపొస్తలుడైన పేతురు ఇలా అంటున్నాడు: “కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల దీర్ఘశాంతముగలవాడై యున్నాడు.”​—⁠2 పేతురు 3:​9, 10, 13.

సరైన పద్ధతిలో ఎదురుచూడడం

పేతురు ఇంకా ఇలా అంటున్నాడు: “ఇవన్నియు ఇట్లు లయమైపోవునవి గనుక, . . . దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను.” (2 పేతురు 3:​11, 12) యెహోవా దినము కొరకు ఎదురుచూస్తూ, మనం “పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను” ఉండాలన్న విషయం గమనించండి, అంటే నిష్క్రియులుగా మారకుండా క్రియాశీలురుగా ఉండడమే సరైన విధానం.

అవును సరైన ఎదురుచూసే వైఖరి, యెహోవా దినము యెహోవా సంకల్పించిన సమయానికే ఖచ్చితంగా వస్తుందనే దృఢ నమ్మకాన్ని కనబరుస్తుంది. అలాంటి విశ్వాసం పరిశుద్ధమైన క్రియలను, భక్తిపూర్వక కృత్యాలను చేయిస్తుంది. వాటిలో ప్రధానమైనది దేవుని రాజ్య సువార్తను ప్రకటించడం. ప్రకటించే విషయంలో యేసు చక్కని మాదిరి ఉంచాడు, ఆయన తన అభిషిక్త అనుచరులకు ఇలా ఉపదేశించాడు: “మీ నడుములు కట్టుకొనియుండుడి, మీ దీపములు వెలుగుచుండనియ్యుడి. తమ ప్రభువు పెండ్లివిందునుండి వచ్చి తట్టగానే అతనికి తలుపుతీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతనికొరకు ఎదురుచూచు మనుష్యులవలె ఉండుడి. ప్రభువు వచ్చి యే దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు.”​—⁠లూకా 12:​35-37.

మొదటి శతాబ్దపు దాసులు, శారీరకంగా కష్టపడి చేసే పనులు సులువుగా చేయడానికి, పైన ధరించే తమ ఉత్తరీయపు రెండు చివర్లను పట్టుకొని ‘నడుము కట్టుకొనే’వారు. ఆ విధంగా ఒక క్రైస్తవుడు సత్క్రియలు చేయడంలో చురుగ్గా, ఆసక్తితో ఉండాలి. ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో “మాంద్యత”కు దారితీసే ఎటువంటి ఉద్దేశమున్నా, అంటే తన శక్తిసామర్థ్యాలు భౌతిక సుఖాల వైపు లేదా భౌతిక సంపదల వైపు మళ్ళించేవి ఏవైనా ఉంటే వాటితో పోరాడాలి. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము కొరకు ఎదురుచూస్తూ, “ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తి”తో ఉండాలి.​—⁠రోమీయులు 12:​11; 1 కొరింథీయులు 15:​58.

ఎదురుచూస్తూ చురుగ్గా ఉండడం

యెహోవాసాక్షులు, యెహోవా దినము కొరకు ఎదురుచూస్తూ చురుగ్గా ఉన్నారు. ఉదాహరణకు, 2003 సేవా సంవత్సరంలో వారు యెహోవా వాక్యాన్ని ప్రకటించడంలో ప్రతిరోజు సరాసరి 33,83,000 గంటలు వెచ్చించారు. ఊహించండి, ఒక్కరోజులో జరిగిన దానిని ఒకే వ్యక్తి గనుక సాధించాలంటే, ఆయన నిర్విరామంగా 386 సంవత్సరాలు ప్రకటించాల్సి ఉంటుంది!

ఏదేమైనా, మనమిలా ప్రశ్నించుకోవడం మంచిది, ‘వ్యక్తిగతంగా నాకు ఎలాంటి ఎదురుచూసే వైఖరి ఉంది?’ యేసు ఒక ఉపమానాన్ని చెప్పాడు, అందులో ఆయన నమ్మకమైన అభిషిక్త క్రైస్తవులు కష్టపడి పనిచేయవలసిన అవసరతను చూపించాడు. ఆయన ముగ్గురు దాసుల గురించి చెప్పాడు: “అతడు [యజమాని] ఒకనికి అయిదు తలాంతులను ఒకనికి రెండు, ఒకనికి ఒకటియు ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి, వెంటనే దేశాంతరము పోయెను. అయిదు తలాంతులు తీసికొనినవాడు వెళ్లి వాటితో వ్యాపారము చేసి, మరి అయిదు తలాంతులు సంపాదించెను. ఆలాగుననే రెండు తీసికొనినవాడు మరి రెండు సంపాదించెను. అయితే ఒక తలాంతు తీసికొనినవాడు వెళ్లి, భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచి పెట్టెను. బహు కాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారియొద్ద లెక్క చూచుకొనెను.”​—⁠మత్తయి 25:​15-19.

ముగ్గురు దాసులూ తమ యజమాని రాకడ కోసం ఎదురుచూశారు. ఆ యజమాని తిరిగి వచ్చాక, తన కోసం ఎదురుచూస్తూ చురుగ్గా ఉన్న దాసులిద్దరితో “భళా, నమ్మకమైన మంచి దాసుడా” అని అన్నాడు. అయితే ఏమీ చేయకుండా కాలక్షేపం చేస్తూ ఎదురుచూసిన దాసుడ్ని, “వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి” అని అన్నాడు.​—⁠మత్తయి 25:​20-30.

ఈ ఉపమానం అభిషిక్త క్రైస్తవులకే వర్తించినప్పటికీ, మన నిరీక్షణతో సంబంధం లేకుండా మనందరికీ వర్తించే ఒక పాఠం ఇందులో ఉంది. యజమాని అయిన యేసుక్రీస్తు, మనలో ప్రతి ఒక్కరు యెహోవా మహాదినమున ఆయన రాకడ కొరకు ఎదురుచూస్తూ ఆయన పరిచర్యలో కష్టపడి పనిచేయాలని ఆశిస్తున్నాడు. ప్రతి ఒక్కరు తమ తమ “సామర్థ్యము చొప్పున,” తమ తమ పరిస్థితులను బట్టి చేసిన కష్టాన్ని ఆయన విలువైనదిగా ఎంచుతాడు. చివరకు ఎదురుచూసే సమయం ముగిసాక, తమ యజమాని నోట “భళా” అనే మాట వినడం ఎంత ఆనందకరమైన విషయమో కదా!

మన ప్రభువు ఓపిక రక్షణార్థమైనది

ఈ దుష్ట విధానం మనం ఒకప్పుడు అనుకున్న దానికంటే లేదా నిరీక్షించిన దానికంటే ఎక్కువ కాలం ఉంటే ఎలా? దానికి కారణం లేకపోలేదు. అపొస్తలుడైన పేతురు ఇలా వ్రాశాడు: “మన ప్రభువుయొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని యెంచుకొనుడి.” (2 పేతురు 3:​15) దేవుని సంకల్పం గురించిన ఖచ్చితమైన జ్ఞానం, అందులో మన అప్రధానమైన అల్ప స్థితి గురించిన అవగాహన, యెహోవా ఈ పాత విధానంతో ఎప్పటి వరకు ఓపికగా ఉండడం సబబైనదిగా భావిస్తాడో అప్పటి వరకు మనం ఓపికతో ఉండేలా చేస్తాయి.

క్రైస్తవులు ఓపికతో ఉండాలని ప్రోత్సహించడానికి, బైబిలు రచయిత యాకోబు ఒక ఉదాహరణ చెప్పాడు. ఆయనిలా వ్రాశాడు: “చూడుడి; వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దానికొరకు కనిపెట్టును గదా ప్రభువురాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగియుండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి.”​—⁠యాకోబు 5:⁠7, 8.

మనం ఎదురుచూస్తూ అలసిపోవాలని లేదా ఎదురుచూడడం మానెయ్యాలని యెహోవా దేవుడు కోరుకోవడం లేదు. మనం చేయవలసిన పని ఒకటి ఉంది. మనం ఆ పనిలో చురుగ్గా ఉండేందుకు మనం ఎదురు చూసే సమయాన్ని వినియోగిస్తే ఆయన సంతోషిస్తాడు. అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు వ్రాసిన పత్రికలో వర్ణిస్తున్నవారిలో మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు, అక్కడ పౌలు ఇలా వర్ణించాడు: “మీరు మందులు కాక, విశ్వాసము చేతను ఓర్పుచేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనునట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనుపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలెనని అపేక్షించుచున్నాము.”​—⁠హెబ్రీయులు 6:​11, 12.

కాబట్టి మనం విసుగు చెందకుండా ఉందాం. బదులుగా యెహోవా దేవునితో మన వ్యక్తిగత సంబంధం, యేసు విమోచనా క్రయధన బలిపై మన విశ్వాసం, నూతన విధానంలో సంతోషకరమైన జీవితం గురించిన మన నిరీక్షణ మన జీవితంలో మనల్ని ఉత్తేజపరిచే శక్తులుగా ఉండాలి. మనం మన దేవుణ్ణి స్తుతించడంలో నిమగ్నులమై ఉండడం ద్వారా, యేసు ఉపమానంలోని “నమ్మకమైన మంచి” దాసుల్లాగ మనమూ ప్రశంసకు, ప్రతిఫలానికి యోగ్యులమని నిరూపించుకుందాం. ఆ విధంగా నిరూపించుకున్న కీర్తనకర్త ఇలా అన్నాడు: “నేను ఎల్లప్పుడు నిరీక్షింతును, నేను మరి యెక్కువగా నిన్ను కీర్తింతును.”​—⁠కీర్తన 71:​14.

[21వ పేజీలోని చిత్రం]

నిరాశ చెందిన యోనా, నీనెవెకు ఏమి జరుగుతుందో చూడాలని ఎదురుచూశాడు

[22, 23వ పేజీలోని చిత్రాలు]

మనం యెహోవా దినము కొరకు ఎదురుచూస్తూ దైవ భక్తిని ప్రదర్శిద్దాం