మీరు ఆధారపడదగిన వారసత్వ సంపద
మీరు ఆధారపడదగిన వారసత్వ సంపద
“వారసులెవరూ లేని వారసత్వ సంపద మీ కోసం వేచివుందని చెబుతూ మీకెవరైనా ఉత్తరం వ్రాస్తే, తస్మాత్ జాగ్రత్త. మీరు ఒక తెలివైన మోసగాడి వలలో చిక్కుకునే ప్రమాదముంది.”
యునైటెడ్ స్టేట్స్ పోస్టల్ ఇన్‌స్పెక్షన్ సర్వీస్ వాళ్ళు తమ వెబ్ సైట్‌లో ఆ హెచ్చరికను ఉంచారు. ఎందుకు? ఎందుకంటే వేలాదిమంది ప్రజలకు ‘మీ బంధువుల్లో ఒకరు మరణించి మీకు వారసత్వంగా ఆస్తి వదిలి వెళ్ళారు’ అని తెలియజేసే ఉత్తరాలు అందాయి. తత్ఫలితంగా, ఆ వారసత్వ సంపద ఎక్కడ ఉంది, దానిని ఎలా స్వంతం చేసుకోవచ్చు అనే వివరాలు తెలియజేసే నివేదికను తెప్పించుకోవడానికి చాలామంది 30 అమెరికన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ రుసుము చెల్లించారు. వాళ్ళందరూ ఘోరంగా మోసపోయారు. వాళ్ళందరికి ఒకే నివేదిక అందింది, వాళ్ళల్లో ఎవరికీ ఎలాంటి సంపదా లభించలేదు.
దేనినైనా వారసత్వంగా పొందాలని ప్రజలకుండే సహజ కోరికను అలాంటి పథకాలు ఆకర్షిస్తాయి. అయితే వారసత్వంగా ఆస్తిని వదిలివెళ్ళేవారి గురించి బైబిలు ప్రశంసాత్మకంగా మాట్లాడుతూ ఇలా చెబుతోంది: “మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును.” (సామెతలు 13:22) వాస్తవానికి స్వయంగా యేసుక్రీస్తే తాను కొండపై ఇచ్చిన ప్రసంగంలో ఈ ప్రసిద్ధమైన, ప్రజాదరణ పొందిన వ్యాఖ్యానాన్ని చేశాడు: “సాత్వికులు ధన్యులు; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.”—మత్తయి 5:5.
యేసు మాటలు, ఎన్నో శతాబ్దాల క్రితం ప్రాచీన ఇశ్రాయేలు రాజైన దావీదు వ్రాసిన ప్రేరేపిత మాటలను మనకు గుర్తు చేస్తాయి: “దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహు క్షేమము కలిగి సుఖించెదరు.”—కీర్తన 37:11.
‘భూమిని స్వతంత్రించుకోవడం’ లేదా వారసత్వంగా పొందడం ఎంతటి ఉల్లాసకరమైన ఉత్తరాపేక్షో కదా! అయితే ఈ ఉత్తరాపేక్ష, ప్రజలను మోసం చేయడానికి రూపొందించబడిన మరో మోసకరమైన పథకం కాదని మనం నమ్మవచ్చా? ఖచ్చితంగా నమ్మవచ్చు. భూమి యెహోవా చేసిన అద్భుతమైన సృష్టిలో భాగం కాబట్టి, దాని సృష్టికర్తగా, యజమానిగా దానిని తాను ఎవరికి ఇవ్వాలనుకుంటే వారికి వారసత్వంగా ఇవ్వడానికి ఆయనకు చట్టబద్ధమైన అధికారం ఉంది. యెహోవా దావీదు రాజు ద్వారా, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుకు ఈ ప్రవచనాత్మక వాగ్దానాన్ని చేశాడు: “నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతములవరకు సొత్తుగాను ఇచ్చెదను.” (కీర్తన 2:8) ఆ కారణంగానే అపొస్తలుడైన పౌలు యేసును ‘[దేవుడు] సమస్తమునకు వారసునిగా నియమించిన’ వ్యక్తిగా వర్ణించాడు. (హెబ్రీయులు 1:2) కాబట్టి, యేసు ‘సాత్వికులు భూమిని స్వతంత్రించుకొందురు’ అని చెప్పినప్పుడు యథార్థమైన ఉద్దేశంతోనే అలా చెప్పాడని, ఆ వాగ్దానాన్ని నెరవేర్చే అధికారం ఆయనకు ఉందని మనం దృఢంగా నమ్మవచ్చు.—మత్తయి 28:18.
అయితే ఇప్పుడు తలెత్తే కీలకమైన ప్రశ్నేమిటంటే, ఆ వాగ్దానం ఎలా నెరవేరుతుంది? నేడు మనం ఎటువైపు చూసినా దౌర్జన్యపరులది అహంకారులదే పైచేయిగా ఉన్నట్లు, వాళ్ళు తమకు కావలసినది సాధించుకుంటున్నట్లు కనిపిస్తోంది. మరి సాత్వికులు వారసత్వంగా పొందడానికి ఏమి మిగులుతుంది? అంతేకాకుండా భూమి కాలుష్యం వంటి గంభీరమైన సమస్యలతో
పీడించబడుతోంది, అత్యాశగల దూరదృష్టిలేని ప్రజలు భూ వనరులను దోచుకుంటున్నారు. అసలు వారసత్వంగా పొందడానికి యోగ్యమైన భూమి అంటూ మిగులుతుందా? ఈ ప్రశ్నలకు, ఇతర ప్రాముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం పొందడానికి తర్వాతి ఆర్టికల్‌ను చదవమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.[3వ పేజీలోని చిత్రం]
మీకు నిజమైన వారసత్వ సంపద లభిస్తుందా?