కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘సాత్వికులు భూమిని స్వతంత్రించుకుంటారు’—ఎలా?

‘సాత్వికులు భూమిని స్వతంత్రించుకుంటారు’—ఎలా?

‘సాత్వికులు భూమిని స్వతంత్రించుకుంటారు’​—⁠ఎలా?

“‘సాత్వికులు భూమిని స్వతంత్రించుకుంటారు’ అని యేసు చెప్పిన హృదయానందకరమైన మాటలు మీకు తెలిసే ఉంటాయి. అయితే ప్రజలు ఒకరికొకరు హాని చేసుకుంటున్న విధానం, భూమికి హాని కలిగిస్తున్న విధానం చూస్తే, సాత్వికులు స్వతంత్రించుకోవడానికి లేదా వారసత్వంగా పొందడానికి ఏమి మిగిలి ఉంటుందంటారు?”​—⁠మత్తయి 5:⁠5; కీర్తన 37:​11.

యెహోవాసాక్షి అయిన మిరియమ్‌ ఒక బైబిలు చర్చ ప్రారంభించడానికి ఆ ప్రశ్న ఉపయోగించింది. ఆమె ఆ ప్రశ్న ఎవరినైతే అడిగిందో ఆ వ్యక్తి, యేసు అలా వాగ్దానం చేశాడు కాబట్టి భూమి నాశనం చేయబడిన లేదా నివాస యోగ్యంకాని వ్యర్థమైన స్థలంగా కాక వారసత్వంగా పొందడానికి యోగ్యమైనదిగానే ఉంటుందని సమాధానం చెప్పాడు.

అది ఎంతో ఆశాభావంతో ఇచ్చిన సమాధానం. అయితే మనం అలాంటి ఆశావహ దృక్పథంతో ఉండడానికి కారణం ఉందా? ఉంది, ఎందుకంటే యేసు చేసిన ఆ వాగ్దానం నెరవేరుతుందని నమ్మడానికి బైబిలు మనకు బలమైన కారణాలను ఇస్తుంది. నిజానికి ఆ వాగ్దాన నెరవేర్పుకు, మానవజాతిపట్ల భూమిపట్ల దేవునికున్న సంకల్పానికి దగ్గరి సంబంధం ఉంది. దేవుడు తాను సంకల్పించినదానిని తప్పకుండా నెరవేరుస్తాడని మనకు హామీ ఇవ్వబడింది. (యెషయా 55:​11) అయితే మరి మానవజాతిపట్ల దేవునికి మొదట ఉండిన సంకల్పమేమిటి, అదెలా నెరవేర్చబడుతుంది?

భూమిపట్ల దేవుని నిత్య సంకల్పం

యెహోవా దేవుడు భూమిని ఒక నిర్దిష్టమైన సంకల్పంతో సృష్టించాడు. “ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు; ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిరపరచెను. నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింపలేదు నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను. ఆయన సెలవిచ్చునదేమనగా​—⁠యెహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు.” (యెషయా 45:​18) కాబట్టి భూమి మానవులకు నివాస స్థలంగా ఉండడానికే సృష్టించబడింది. అంతేకాకుండా భూమి మానవులకు శాశ్వత నివాస స్థలంగా ఉండాలనేది దేవుని సంకల్పం. “భూమి యెన్నటికిని కదలకుండునట్లు ఆయన దానిని పునాదులమీద స్థిరపరచెను.”​—⁠కీర్తన 104:5; 119:90.

దేవుడు మొదటి మానవ జంటకు ఇచ్చిన పనిని చూస్తే కూడా భూమిపట్ల ఆయన సంకల్పమేమిటో స్పష్టంగా తెలుస్తోంది. ఆదాము హవ్వలకు యెహోవా ఇలా చెప్పాడు: “మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి.” (ఆదికాండము 1:​28) దేవుడు ఆదాము హవ్వలకు అప్పగించిన భూమి వాళ్ళకు, వాళ్ళ సంతానానికి శాశ్వతమైన గృహంగా ఉండాలని ఆయన ఉద్దేశించాడు. “ఆకాశములు యెహోవావశము, భూమిని ఆయన నరుల కిచ్చియున్నాడు” అని కీర్తనకర్త ఎన్నో శతాబ్దాల తర్వాత ప్రకటించాడు.​—⁠కీర్తన 115:16.

ఆ అద్భుతమైన ఉత్తరాపేక్ష నెరవేర్పును చూడాలంటే ఆదాము హవ్వలు, అలాగే వాళ్ళ సంతానం కూడా సృష్టికర్త మరియు జీవదాత అయిన యెహోవా దేవుణ్ణి తమ సర్వాధిపతిగా అంగీకరించి ఆయనకు విధేయులై ఉండడానికి సుముఖత చూపించాలి. యెహోవా ఆదాముకు ఈ ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆయన ఈ విషయంలో ఎలాంటి సందేహానికి తావివ్వలేదు: “ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు.” (ఆదికాండము 2:​16, 17) ఆదాము హవ్వలు ఏదెను తోటలో జీవించాలంటే వాళ్ళు ఆ సరళమైన స్పష్టమైన ఆజ్ఞకు విధేయత చూపించాలి. వాళ్ళు అలా విధేయత చూపిస్తే, తమ పరలోక తండ్రి తమకోసం చేసినవాటన్నింటి కోసం కృతజ్ఞత చూపించినట్లవుతుంది.

ఆదాము హవ్వలు తమకు ఇవ్వబడిన ఆజ్ఞను ఉల్లంఘించడం ద్వారా ఉద్దేశపూర్వకంగా దేవునికి అవిధేయత చూపించినప్పుడు, వాస్తవానికి వాళ్ళు తమకు సమస్తాన్ని దయచేసిన సృష్టికర్తను తృణీకరించారు. (ఆదికాండము 3:⁠6) అలా చేసినందుకు వాళ్ళు తమకే కాక తమ సంతానానికి కూడా అందమైన పరదైసులో ఉండే అవకాశం లేకుండా చేశారు. (రోమీయులు 5:​12) మొదటి దంపతులు చూపించిన అవిధేయత, భూమిని సృష్టించడం వెనుక ఉన్న దేవుని సంకల్పాన్ని ఆటంకపరచిందా?

మార్పులేని దేవుడు

దేవుడు తన ప్రవక్తయైన మలాకీ ద్వారా ఇలా ప్రకటించాడు: “యెహోవానైన నేను మార్పులేనివాడను.” (మలాకీ 3:⁠6) ఈ వచనంపై వ్యాఖ్యానిస్తూ ఫ్రెంచి బైబిలు విద్వాంసుడైన ఎల్‌. ఫీయాన్‌ ఈ ప్రకటనకు దైవిక వాగ్దానాల నెరవేర్పుతో చాలా దగ్గరి సంబంధం ఉందని చెప్పాడు. “తిరుగుబాటు చేసిన తన ప్రజలను యెహోవా నాశనం చేసివుండవచ్చు, కానీ ఆయన తన వాగ్దానాలను మార్చడు కాబట్టి, ఆయన ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే గతంలో తాను చేసిన వాగ్దానాలకు కట్టుబడి ఉంటాడు” అని ఫీయాన్‌ వ్రాశాడు. దేవుడు ఒక వ్యక్తికి, ఒక జనాంగానికి, లేదా మానవజాతి అంతటికి చేసిన వాగ్దానాలు మరువబడవు కానీ ఆయన నిర్ణీత కాలంలో అవి నెరవేర్చబడతాయి. “తాను సెలవిచ్చిన మాటను వెయ్యి తరములవరకు . . . తాను చేసిన నిబంధనను . . . నిత్యము ఆయన జ్ఞాపకము చేసికొనును.”​—⁠కీర్తన 105:8-9.

అయితే భూమిపట్ల తనకు మొదట ఉండిన సంకల్పాన్ని యెహోవా మార్చలేదని మనమెలా నమ్మకం కలిగివుండవచ్చు? దేవుని ప్రేరేపిత వాక్యమైన బైబిలంతటిలోను భూమి విధేయులైన మానవులకు ఇవ్వబడుతుంది అనే దైవిక వాగ్దానం ప్రస్తావించబడింది కాబట్టి మనం ఆ విషయంలో నమ్మకం కలిగివుండవచ్చు. (కీర్తన 25:13; 37:9, 22, 29, 34) అంతేకాకుండా యెహోవాచేత ఆశీర్వదించబడిన ప్రజలు “ఎవరి భయము లేకుండ” భద్రత కలిగి ప్రతి ఒక్కరు “తన ద్రాక్షచెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను” కూర్చొనివుంటారు అని లేఖనాలు వర్ణిస్తున్నాయి. (మీకా 4:4; యెహెజ్కేలు 34:​28) యెహోవాచేత ఎంపిక చేసుకోబడినవారు “ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు, ద్రాక్షతోటలు నాటించుకొని వాటి ఫలముల ననుభవింతురు.” వాళ్ళు జంతువులతో కూడా సమాధానంగా ఉంటారు.​—⁠యెషయా 11:6-9; 65:21, 25.

దేవుని వాగ్దానపు పూర్వఛాయను బైబిలు మరో విధంగా కూడా చూపిస్తోంది. సొలొమోను రాజు పరిపాలనలో ఇశ్రాయేలు జనాంగం శాంతి సౌభాగ్యాలతో జీవించారు. ఆయన పరిపాలనలో “సొలొమోను దినములన్నిటను ఇశ్రాయేలువారేమి యూదావారేమి దాను మొదలుకొని బెయేర్షెబా వరకును తమ తమ ద్రాక్షచెట్ల క్రిందను అంజూరపుచెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండిరి.” (1 రాజులు 4:​25) యేసు ‘సొలొమోనుకంటే గొప్పవాడు’ అని బైబిలు చెబుతోంది, ఆయన పరిపాలన గురించి మాట్లాడుతూ కీర్తనకర్త ప్రవచనాత్మకంగా ఇలా ప్రకటించాడు: “అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. చంద్రుడు లేకపోవువరకు క్షేమాభివృద్ధి కలుగును.” ఆ సమయంలో “దేశములోను పర్వత శిఖరములమీదను సస్య సమృద్ధి కలుగును.”​—⁠లూకా 11:31; కీర్తన 72:​7, 16.

యెహోవా దేవుడు తన మాటకు కట్టుబడి, వాగ్దానం చేయబడిన ఆ వారసత్వ సంపద మానవులకు లభించడమే కాక పూర్తి వైభవంతో పునరుద్ధరించబడేలా చూస్తాడు. వాగ్దానం చేయబడిన నూతనలోకంలో దేవుడు “వారి [ప్రజల] కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు” అని ప్రకటన 21:4లో దేవుని వాక్యం మనకు చెబుతోంది. మనకు వాగ్దానం చేయబడినది నిజంగా పరదైసే.​—⁠లూకా 23:43.

వాగ్దానం చేయబడిన వారసత్వ సంపదను ఎలా పొందాలి

పరలోకం నుండి పరిపాలించే ప్రభుత్వం క్రింద అంటే యేసుక్రీస్తు రాజుగా పరిపాలించే రాజ్యం క్రింద ఈ భూమి పరదైసుగా మార్చబడుతుంది. (మత్తయి 6:​9, 10) మొదటిగా ఆ రాజ్యం ‘భూమిని నశింపజేయువారిని నశింపజేస్తుంది.’ (ప్రకటన 11:18; దానియేలు 2:​44) ఆ తర్వాత యేసుక్రీస్తు ‘సమాధానకర్తయగు అధిపతిగా’ ఈ ప్రవచనాత్మక మాటలను నెరవేరుస్తాడు: “మితిలేకుండ దానికి [అధిపతి పాలనకు] వృద్ధియు క్షేమమును కలుగును.” (యెషయా 9:​6, 7) ఆ రాజ్యం క్రింద, పునరుత్థానం ద్వారా తిరిగి జీవానికి తీసుకురాబడే ప్రజలతోపాటు కోట్లాదిమంది మానవులకు భూమిని స్వతంత్రించుకునే లేదా దాన్ని వారసత్వంగా పొందే అవకాశం లభిస్తుంది.​—⁠యోహాను 5:28, 29; అపొస్తలుల కార్యములు 24:14.

ఆ అద్భుతమైన వారసత్వాన్ని ఎవరు పొందుతారు? యేసు మాటలను పరిశీలించండి: “సాత్వికులు ధన్యులు; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.” (మత్తయి 5:⁠5) సాత్వికులుగా లేదా దీనులుగా ఉండడమంటే అర్థమేమిటి? “సాత్వికులు” లేదా “దీనులు” సాధువైన, శాంతమైన, నెమ్మదియైన, మృదువైన, సమాధానపడే స్వభావం గలవారిగా ఉంటారని నిఘంటువులు నిర్వచిస్తున్నాయి. అయితే ఆ లేఖనంలో ఉపయోగించబడిన మూల గ్రీకు పదానికి ఇంకా లోతైన అర్థం ఉంది. ఆ పదంలో “మార్దవం ఉంది, అయితే ఆ మార్దవం వెనుక ఉక్కులాంటి బలం ఉంది” అని విలియమ్‌ బార్క్‌లే వ్రాసిన న్యూ టెస్ట్‌మెంట్‌ వర్డ్‌బుక్‌ చెబుతోంది. ఒక వ్యక్తి కోపం తెచ్చుకోకుండా లేదా ప్రతిక్రియ చేయాలనే ఆలోచన లేకుండా తనకు కలిగిన నష్టాన్ని సహించేందుకు సహాయపడే మానసిక వైఖరిని అది సూచిస్తోంది. అయితే ఆ వ్యక్తి అలా చేయగలిగేది దేవునితో మంచి సంబంధం ఉండడంవల్లనే, దేవునితో ఆయనకున్న సంబంధం ఆయనకు శక్తినిచ్చే మూలంగా తయారవుతుంది.​—⁠యెషయా 12:2; ఫిలిప్పీయులు 4:13.

సాత్వికుడైన లేదా దీనుడైన వ్యక్తి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అన్ని విషయాల్లోను వినయంగా దేవుని ప్రమాణాలను అంగీకరిస్తాడు; ఆయన తన స్వంత దృక్కోణాలకు అనుగుణంగా లేదా ఇతరుల అభిప్రాయాలకు తగినట్లుగా ప్రవర్తించాలని పట్టుబట్టడు. ఆయన బోధింపబడదగినవాడిగా ఉండి యెహోవాచేత బోధించబడడానికి సుముఖత చూపిస్తాడు. “న్యాయవిధులనుబట్టి ఆయన [యెహోవా] దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును” అని కీర్తనకర్త దావీదు వ్రాశాడు.​—⁠కీర్తన 25:9; సామెతలు 3:5, 6.

భూమిని స్వతంత్రించుకునే లేదా దాన్ని వారసత్వంగా పొందే ‘సాత్వికుల్లో’ మీరు కూడా ఉంటారా? దేవుని వాక్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేసి యెహోవా గురించి ఆయన చిత్తం గురించి తెలుసుకోవడం ద్వారా, మీరు నేర్చుకున్నదానిని అన్వయించుకోవడం ద్వారా మీరు కూడా భూపరదైసును వారసత్వంగా పొందడానికి, దానిలో నిరంతరం జీవించడానికి ఎదురు చూడవచ్చు.​—⁠యోహాను 17:⁠3.

[5వ పేజీలోని చిత్రం]

దేవుడు ఆదాము హవ్వలకు ఇచ్చిన పనినిబట్టి భూమిపట్ల ఆయనకున్న సంకల్పం స్పష్టమవుతోంది

[6, 7వ పేజీలోని చిత్రం]

సొలొమోను పరిపాలనలోని శాంతి భద్రతలు, వాగ్దానం చేయబడిన భూమి ఎలా ఉంటుందో చూపించాయి

[చిత్రసౌజన్యం]

గొర్రెలు, నేపథ్యంలో కనిపిస్తున్న కొండ: Pictorial Archive (Near Eastern History) Est.; అరేబియన్‌ దుప్పి: Hai-Bar, Yotvata, Israel; పొలం దున్నుతున్న రైతు: Garo Nalbandian

[7వ పేజీలోని చిత్రం]

నీతియుక్తమైన నూతనలోకం రాబోతుంది​—⁠మీరు దానిలో ఉంటారా?