కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆధ్యాత్మిక విలువలను అనుసరిస్తూ ప్రయోజనం పొందండి

ఆధ్యాత్మిక విలువలను అనుసరిస్తూ ప్రయోజనం పొందండి

ఆధ్యాత్మిక విలువలను అనుసరిస్తూ ప్రయోజనం పొందండి

“ద్రవ్యము నపేక్షించువాడు ద్రవ్యముచేత తృప్తినొందడు, ధనసమృద్ధి నపేక్షించువాడు దానిచేత తృప్తినొందడు.”​—⁠ప్రసంగి 5:​10.

అధికమైన పని ఒత్తిడికి గురి చేస్తుంది, ఒత్తిడి ఆరోగ్య సమస్యలకూ, కొన్నిసార్లు మరణానికీ దారి తీస్తుంది. అనేక దేశాల్లో, విడాకుల వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. భౌతిక సంపదల పట్ల ఉన్న అమితమైన కోరికే తరచూ అలాంటి విషాదకర పరిణామాలకు దారితీస్తోంది. ఉన్న వాటితో తృప్తిపడక సంపదల కోసం అర్రులు చాచే వ్యక్తి, తన సంక్షేమాన్ని గాలికి వదిలేసి ఇంకా ఎక్కువ సంపాదించాలనే యావలో పడిపోతాడు. స్వయం సహాయకారి పుస్తకం ఒకటి, ఇలా వ్యాఖ్యానిస్తోంది: “పొరుగింట్లో ఉన్నవన్నీ మనింట్లోనూ ఉండాలనే తలంపు సర్వవ్యాప్త ధోరణిగా మారింది. ఆ ఉబలాటాన్ని తీర్చుకోవడానికి ప్రజలు చిన్నవయస్సులోనే గుండె జబ్బురాగల ప్రమాదాన్ని కూడా లెక్కచేయకుండా విపరీతమైన పని పిచ్చిలో పడిపోతున్నారు.”

ఇంకా కావాలి అనే కోరిక, ఉన్న ఆనందాన్ని హరింపజేసి అసంతృప్తికి గురయ్యేలా చేస్తుంది. ఈ విషయంలో మానవ బలహీనతలు తరచూ ఒక బలమైన శక్తికి తలొగ్గుతున్నాయి, అదే వ్యాపార ప్రకటనా రంగం! దూరదర్శిని కార్యక్రమాల నిండా వ్యాపార సంబంధ ప్రకటనలే, బహుశా అవి మీకు అనవసరమైన వాటిని, మీరు కొనలేని వాటిని కూడా కొనిపించేలా మీపై ప్రభావం చూపిస్తాయి. అవన్నీ తీవ్రమైన హానికి దారి తీస్తాయి.

విపరీతమైన కోరికలు గమనించలేని విధంగా హాని చేస్తూ భౌతికంగా, మానసికంగా వినాశకరమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఉదాహరణకు జ్ఞాని అయిన సొలొమోను రాజు ఇలా వ్యాఖ్యానించాడు: “సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్లు.” (సామెతలు 14:​30) దానికి భిన్నంగా, భౌతిక సంపదలను కూడబెట్టుకోవాలనే తాపత్రయం, ఒత్తిడి మన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పాడుచేయవచ్చు. మన జీవితంలో భౌతికపరమైన లక్ష్యాలే మొదటి స్థానంలో ఉంటే బాంధవ్యాలు కూడా దెబ్బ తింటాయి. ఒక వ్యక్తి కుటుంబ, సామాజిక జీవనం క్షీణించిందంటే, అది అతని సాధారణ జీవితం మీద కూడా ప్రభావం చూపిస్తుంది.

ఆధ్యాత్మిక విలువల ఔన్నత్యం

“మీరు ఈ లోక మర్యాదను అనుసరింపకుడి” అని అపొస్తలుడైన పౌలు శతాబ్దాల క్రితమే ఉద్బోధించాడు. (రోమీయులు 12:⁠2) ఈ లోకము తన విలువలకు అనుగుణంగా నడిచేవారినే ప్రేమిస్తుంది. (యోహాను 15:​19) మీరు ఐశ్వర్యాసక్తి గల జీవన శైలిని అలవరచుకునేలా, మీ జ్ఞానేంద్రియాలకు అంటే చూపుకు, స్పర్శకు, రుచికి, వాసనకు, వినడానికి ఆకర్షణీయంగా ఉండేవాటిని అందించేందుకు ఈ లోకం ప్రయత్నిస్తుంది. మీరూ, ఇతరులూ భౌతిక సంపదల వెంట పడేలా చేసే, ‘నేత్రాశ’ తీవ్రంగా ఉంది.​—⁠1 యోహాను 2:​15-17.

అయితే డబ్బు, ఖ్యాతి, భౌతిక సంపదల కంటే ఎంతో ఉన్నతమైన విలువలు ఉన్నాయి. శతాబ్దాల క్రితం రాజైన సొలొమోను, ఈ లోకం భౌతికపరంగా ఇవ్వగల వాటన్నిటినీ సమకూర్చుకున్నాడు. ఆయన ఇండ్లు కట్టించాడు, పూతోటలు, పండ్లతోటలు నాటించాడు, దాసదాసీలను, పశుపక్ష్యాదులను, గాయనీగాయకులతోపాటు ఎనలేని వెండిబంగారాలనూ సమకూర్చుకున్నాడు. సొలొమోను, తన కంటే ముందున్న వారెవరి దగ్గరా లేనన్ని ఆస్తులను సంపాదించుకున్నాడు. మరోవిధంగా చెప్పాలంటే ఆయన కోట్లకు పడగెత్తాడు. సొలొమోను కోరుకున్నవన్నీ అనుభవించాడు. కానీ ఆయన తాను సాధించిన వాటిని చూసి, ఇలా అన్నాడు: “అవన్నియు వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను.”​—⁠ప్రసంగి 2:​1-11.

సొలొమోను తాను పొందిన ఉన్నతమైన జ్ఞానం వల్ల, ఆధ్యాత్మిక విలువలను అనుసరిస్తేనే గొప్ప ప్రయోజనం కలుగుతుందని గ్రహించాడు. ఆయనిలా వ్రాశాడు: “ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే; దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి.”​—⁠ప్రసంగి 12:​13.

దేవుని వాక్యమైన బైబిలులో లభించే సంపద వెండిబంగారాల కంటే ఎంతో అమూల్యమైనది. (సామెతలు 16:​16) పరిశోధించి కనుక్కోగల రత్నాల్లాంటి అపారమైన సత్యాలు అందులో మీ కోసం సిద్ధంగా ఉన్నాయి. మీరు వాటిని కనుగొనడానికి త్రవ్వుతారా? (సామెతలు 2:​1-6) అలా త్రవ్వమని నిజమైన విలువలకు మూలాధారమైన మన సృష్టికర్త మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాడు, అందుకాయన మీకు సహాయం కూడా చేస్తాడు. ఎలా చేస్తాడు?

యెహోవా తన వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, సంస్థ ద్వారా సత్యపు రత్నాలను అందిస్తున్నాడు. (కీర్తన 1:​1-3; యెషయా 48:​17, 18; మత్తయి 24:​45-47; 1 కొరింథీయులు 2:​10) అరుదైన ఈ రత్నాల అమూల్య విలువను పరీక్షించడం వల్ల అత్యంత ప్రయోజనకరమైన, శ్రేష్ఠమైన జీవిత విధానాన్ని ఎంపిక చేసుకునే అవకాశం మీకు లభిస్తుంది. అలా ఎంపిక చేసుకోవడం మీకు కష్టంగా ఉండదు, ఎందుకంటే మనం నిజంగా సంతోషంగా ఉండాలంటే మనకు ఏమి కావాలో మన సృష్టికర్త అయిన యెహోవాకు బాగా తెలుసు.

ఉన్నత విలువలను బైబిలు ప్రోత్సహిస్తోంది

బైబిలులో లభ్యమయ్యే మంచి హితవు లేదా సలహా ఆచరణాత్మకంగాను, సాటిలేనిదిగానూ ఉంటుంది. అది అందించే నైతిక ప్రమాణాలు అత్యున్నతమైనవి. దాని హితవు ఎల్లప్పుడూ ప్రయోజనకరంగానే ఉంటుంది. అది కాల పరీక్షకు తట్టుకొని నిలిచింది. కష్టపడి పని చేయాలి, నిజాయితీగా ఉండాలి, డబ్బును విజ్ఞతతో ఉపయోగించాలి, సోమరులుగా ఉండకూడదు వంటివి బైబిలు ఇచ్చే చక్కని సలహాలకు ఉదాహరణలు.​—⁠సామెతలు 6:​6-8; 20:​23; 31:​16.

అదే క్రమంలో యేసు ఇలా అన్నాడు: “భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరు. పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు.”​—⁠మత్తయి 6:​19, 20.

సమయోచితమైన ఆ ఉద్బోధ 2,000 సంవత్సరాల క్రితం ఎంత ఆచరణాత్మకంగా ఉందో ఇప్పుడూ అంతే ఆచరణాత్మకంగా ఉంది. భౌతిక సంపదల అన్వేషణలో మునిగిపోకుండా, ఇప్పుడే ఉన్నతమైన జీవన విధానాన్ని అనుసరించడం ద్వారా మనం ప్రయోజనం పొందవచ్చు. దానికి కీలకం ఆధ్యాత్మిక సంపదలను సమకూర్చుకోవడమే, అది నిజమైన సంతోషము, సంతృప్తీ గల జీవితానికి దారి తీస్తుంది. మనం ఆ లక్ష్యాన్ని ఎలా సాధించవచ్చు? దేవుని వాక్యమైన బైబిలు చదవడం ద్వారా, అది బోధిస్తున్న వాటిని అన్వయించుకోవడం ద్వారా సాధించవచ్చు.

ఆధ్యాత్మిక విలువలు ప్రతిఫలాలను తెస్తాయి

ఆధ్యాత్మిక విలువలను సరిగ్గా అన్వయించుకుంటే అవి మనకు శారీరకంగా, మానసికంగానేకాక ఆధ్యాత్మికంగా కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. భూమికి పైన ఉండే ఓజోన్‌ పొర, మనల్ని సూర్యుని హానికరమైన కిరణాల నుండి ఎలా కాపాడుతుందో, అదే విధంగా నైతిక సూత్రాలు, ధనాపేక్ష మూలంగా వచ్చే ప్రమాదకరమైన ప్రభావాల గురించి మనకు తెలియజేయడం ద్వారా మనల్ని కాపాడతాయి. క్రైస్తవ అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి.”​—⁠1 తిమోతి 6:​9, 10.

ప్రజలు గొప్ప ఆస్తులు, హోదా, అధికారం వంటి వాటి కోసం అర్రులు చాచేలా ధనాపేక్ష వారిని ప్రలోభంలో పడవేస్తుంది. దానితో వాటిని సాధించడానికి వారు తరచూ వక్రమైన, నిజాయితీలేని పెడదారులు త్రొక్కుతారు. భౌతిక సంపదల కోసం తాపత్రయపడడం ఒక వ్యక్తి సమయాన్ని, శక్తిసామర్థ్యాలను హరించివేస్తుంది. అతనికి సుఖనిద్ర కూడా లేకుండా చేస్తుంది. (ప్రసంగి 5:​12) ఇంకా కావాలనే తాపత్రయం నిస్సందేహంగా ఆధ్యాత్మిక అభివృద్ధిని ఆటంకపరుస్తుంది. జీవించిన వారిలోకెల్లా గొప్ప మనిషి అయిన యేసుక్రీస్తు, శ్రేష్ఠమైన మార్గాన్ని స్పష్టంగా చూపిస్తూ ఇలా అన్నాడు: ‘తమ ఆధ్యాత్మిక అవసరతను గుర్తించినవారు సంతోషంగా ఉంటారు.’ (మత్తయి 5:⁠3, NW) ఆధ్యాత్మిక సంపదలే శాశ్వత ప్రతిఫలాలను ఇస్తాయనీ, అవి అనిశ్చితమైన భౌతిక సంపదల కంటే చాలా చాలా ప్రాముఖ్యమైనవనీ ఆయనకు తెలుసు.​—⁠లూకా 12:​13-31.

అవి నిజంగా ప్రయోజనకరమైనవా?

“ఆధ్యాత్మిక విలువలు ఆచరణాత్మకమైనవి కావని నన్ను ఒప్పించడానికి మా తల్లిదండ్రులు విఫలయత్నం చేశారు. అయినా నేను ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకొని వాటిని అనుసరించడం వల్ల ఎంతో మనశ్శాంతి పొందాను, ఎందుకంటే అందులో ఐశ్వర్యం కోసం పోటీపడే ఒత్తిడి లేదు” అని గ్రేగ్‌ జ్ఞాపకం చేసుకుంటున్నాడు.

ఆధ్యాత్మిక విలువలు మంచి సంబంధాలను కూడా వృద్ధి చేస్తాయి. నిజమైన స్నేహితులు మీ వ్యక్తిత్వాన్ని బట్టి మీ పట్ల ఆకర్షితులవుతారు కానీ, మీ దగ్గర ఉన్న వాటిని చూసి కాదు. బైబిలు ఇలా ప్రోత్సహిస్తోంది: “జ్ఞానముగల వారితో స్నేహంగా ఉండు, అప్పుడు నీవు జ్ఞానివి అవుతావు.” (సామెతలు 13:​20, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) అంతేకాక విజయవంతమైన ఒక కుటుంబం జ్ఞానము, ప్రేమలపై నిర్మించబడుతుంది కానీ, భౌతిక ఆస్తులపై కాదు.​—⁠ఎఫెసీయులు 5:22-6:⁠4.

పుట్టుకతోనే మనకు విలువలు అంటే ఏమిటో తెలియవు. మనం వాటి గురించి మన తోటివారి నుండి లేదా ఉన్నత మూలం నుండి నేర్చుకోవాలి. బైబిలు ఆధారిత విద్య, భౌతిక విషయాల పట్ల మనకున్న మానసిక దృక్పథాన్నే మార్చివేస్తుంది. “నేను విలువైనవిగా ఎంచుతున్న వాటి గురించి మరోసారి ఆలోచించేందుకు అది నాకు తోడ్పడింది, నేను ఉన్నవాటితో తృప్తిపడడం నేర్చుకున్నాను” అని లోగడ బ్యాంకులో పని చేసిన డాన్‌ అంటున్నాడు.

శాశ్వతమైన ఆధ్యాత్మిక సంపదలను సంపాదించుకోండి

ఆధ్యాత్మిక విలువలు శాశ్వతమైన ప్రతిఫలాల గురించి నొక్కి చెబుతాయి, తాత్కాలిక ఆనందాన్నిచ్చే వాటి గురించి కాదు. పౌలు ఇలా వ్రాశాడు: “దృశ్యమైనవి [భౌతికమైనవి] అనిత్యములు; అదృశ్యమైనవి [ఆధ్యాత్మికమైనవి] నిత్యములు.” (2 కొరింథీయులు 4:​18) భౌతిక లక్ష్యాలు క్షణికమైన కోరికలను తృప్తిపరచవచ్చు, అయితే దురాశ శాశ్వతమైన ప్రయోజనాన్ని ఇవ్వదు. ఆధ్యాత్మిక విలువలే శాశ్వత ప్రయోజనాలను ఇస్తాయి.​—⁠సామెతలు 11:⁠4; 1 కొరింథీయులు 6:​9, 10.

జీవితంలో డబ్బు సంపాదనే ప్రాముఖ్యం అనే తలంపు ఈ కాలంలో అధికంగా ఉంది, బైబిలు దాన్ని ఖండిస్తోంది. అది మన కంటిని తేటగా ఉంచుకొని, శ్రేష్ఠమైన విషయాలైన ఆధ్యాత్మిక సంపదలపై దృష్టి పెడుతూ, మనలో కలిగే స్వార్థపు కోరికలకు ఎలా కళ్ళెం వేయాలో నేర్పిస్తుంది. (ఫిలిప్పీయులు 1:​9-10) అది స్వార్థం కూడా ఒక విధమైన విగ్రహారాధన వంటిదేననే విషయాన్ని వెల్లడి చేస్తుంది. మనం దేవుని వాక్యం నుండి నేర్చుకుంటున్న వాటిని పాటిస్తున్నట్లయితే, మనం గొప్ప సంతోషాన్ని అనుభవిస్తాం. మన ఆలోచనలు, పుచ్చుకునే దిశ నుండి ఇచ్చే దిశ వైపుకు మళ్ళుతాయి. సొంత కోరికలను తీర్చుకోవడం స్థానంలోకి ఆధ్యాత్మిక విలువలను చేర్చడం ఎంత శక్తిమంతమైన ప్రేరణో కదా!

డబ్బు కొంత మేరకు రక్షణగా ఉంటుందన్నది నిజమే. (ప్రసంగి 7:​12) అయితే బైబిలు వాస్తవికతను ఇలా స్పష్టంగా చెబుతోంది: “ధనం మీద చూపు నిలిపీ నిలపడంతోనే అది మాయమైపోతుంది. దానికి రెక్కలు మొలిచి . . . గరుడపక్షిలాగా గగన వీధికి ఎగిరిపోతుంది.” (సామెతలు 23:⁠5, పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం) ప్రజలు ఐశ్వర్యాసక్తి అనే బలిపీఠం మీద తమ ఆరోగ్యాన్ని, కుటుంబాలను, మంచి మనస్సాక్షిని సైతం ఆహుతి చేసుకున్నారు, ఫలితాలు వినాశనకరంగా ఉన్నాయి. మరోవైపున ఆధ్యాత్మికత కలిగి ఉండడం అత్యంత ప్రాముఖ్యమైన అవసరాలను, అంటే ప్రేమించడానికి, సంకల్పంతో ఉండడానికి, ప్రేమగల దేవుడైన యెహోవాను ఆరాధించడానికి కావలసిన అవసరాలను తీరుస్తుంది. అది దేవుడు మన కోసం ఉంచిన నిరీక్షణను అంటే, భూపరదైసులో పరిపూర్ణ మానవులుగా నిత్యం జీవించే నిరీక్షణను కూడా సూచిస్తుంది.

సుఖసంతోషాలతో జీవించాలనే మానవాళి స్వప్నం త్వరలోనే దేవుని నూతనలోకంలో సాకారం అవుతుంది. (కీర్తన 145:​16) ఆ సమయంలో భూమి అంతా “యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండి” ఉంటుంది. (యెషయా 11:⁠9) ఆధ్యాత్మిక విలువలు వెల్లివిరుస్తాయి. ఐశ్వర్యాసక్తి, దాని ప్రభావాలు పూర్తిగా అంతరించి పోతాయి. (2 పేతురు 3:​13) అప్పుడు పరిపూర్ణ ఆరోగ్యం, తృప్తికరమైన పని, ఆరోగ్యకరమైన కాలక్షేపం, స్నేహపూర్వకమైన కుటుంబ బాంధవ్యాలు, దేవునితో నిరంతరం నిలిచి ఉండే స్నేహం వంటివి జీవితాన్ని మరెంతో సంతృప్తికరంగా చేస్తాయి, అవి మానవాళికి శాశ్వతంగా నిజమైన సంతోషాన్ని తీసుకువస్తాయి.

[6వ పేజీలోని బాక్సు/చిత్రం]

మీ డబ్బును విజ్ఞతతో వినియోగించండి!

మీ అవసరాలను గుర్తించండి.యేసు ఇలా ప్రార్థించమని మనకు నేర్పించాడు: “మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయుము.” (ఇటాలిక్కులు మావి.) (లూకా 11:⁠3) నేటి కోరికలు రేపటి అవసరాలు కానీయకండి. మీరు సమకూర్చుకున్న వాటి మీదే మీ జీవం ఆధారపడి ఉండదన్న విషయం గుర్తుంచుకోండి.​—⁠లూకా 12:​16-21.

ఆదాయం, ఖర్చులు అంచనా వేసుకోండి.ముందుగా ఆలోచించని వాటిని కొనకండి. బైబిలు ఇలా చెబుతోంది: “శ్రద్ధగలవారి యోచనలు లాభకరములు తాలిమిలేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును.” (సామెతలు 21:⁠5) ఆర్థిక సంబంధ ప్రణాళిక ఏదైనా వేస్తున్నప్పుడు అందులో ఎదురుకాగల ఖర్చులను ముందుగానే అంచనా వేసుకొమ్మని యేసు తన శ్రోతలకు సలహా ఇచ్చాడు.​—⁠లూకా 14:​28-30.

అనవసరమైన అప్పులు చేయకండి.అప్పు చేసి కొనడానికి బదులు, కొనుగోలు కోసం సాధ్యమైనప్పుడల్లా పొదుపు చేయండి. అప్పు చేయడం గురించి ఒక సామెత ఇలా చెబుతోంది: “అప్పు చేయువాడు అప్పిచ్చినవానికి దాసుడు.” (సామెతలు 22:⁠7) నిగ్రహం చూపించడం ద్వారా, మీ ఆర్థిక పరిధిలోనే ఉండడం ద్వారా మీరు పెద్ద పెద్ద వాటిని కొనడానికి కూడా ప్రణాళిక వేసుకోవచ్చు.

వృథా చేయకండి.మీ దగ్గర ఉన్నవాటినే ఎక్కువ కాలం వినియోగించుకునేలా జాగ్రత్తగా కాపాడుకోండి, ఆ విధంగా డబ్బు వృథా కావడం తక్కువవుతుంది. యేసు తాను ఉపయోగించినవి పొదుపు చేయడంలో సరైన శ్రద్ధ చూపించాడు.​—⁠యోహాను 6:​10-13.

మొదటి విషయాలను మొదటే ఉంచండి.తెలివి గల వ్యక్తి ఎక్కువ ప్రాముఖ్యత గల లక్ష్యాల కోసం ‘సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు.’​—⁠ఎఫెసీయులు 5:​15, 16.

[7వ పేజీలోని బాక్సు/చిత్రం]

స్వీయానుభవంతో నేర్చుకోవడం కంటే​—⁠శ్రేష్ఠమైన మార్గం

అది మంచిదైనా, చెడ్డదైనా స్వీయానుభవం మనకు విలువైన పాఠాలు నేర్పిస్తుంది. అయితే అనుభవమే మంచి ఉపాధ్యాయుడు అనే మాట నిజమేనా? కాదు, మార్గదర్శకానికి ఉన్నతమైన మూలం ఒకటుంది. “నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది”అని ప్రార్థించినప్పుడు కీర్తనకర్త ఆ మూలాధారాన్ని గుర్తించాడు.​—⁠కీర్తన 119:​105.

స్వీయానుభవం నుండి నేర్చుకోవడం కంటే దైవోపదేశం నుండి నేర్చుకోవడమే ఎందుకు ఉత్తమం? ఒక కారణం ఏమిటంటే, స్వయంగా అనేక పద్ధతులను ఉపయోగించి సరైన దాన్ని తెలుసుకోవడం అంటే దానికి చాలా మూల్యం చెల్లించాల్సి రావచ్చు, అది ప్రయాసకరంగానూ ఉండవచ్చు. అదంతా అనవసరం కూడా. ప్రాచీన ఇశ్రాయేలీయులతో దేవుడు ఇలా అన్నాడు: “నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను ఆలకించినయెడల నీ క్షేమము నదివలెను నీ నీతి సముద్రతరంగములవలెను ఉండును.”​—⁠యెషయా 48:​18.

దేవుని వాక్యం అత్యుత్తమ ఉపదేశానికి మూలంగా ఉండడానికి ఒక కారణం ఏమిటంటే, అందులో అతి పురాతనమైన, ఎంతో ఖచ్చితమైన మానవ అనుభవాల చరిత్ర ఉంది. ఇతరులు చేసిన పొరపాట్లనే మీరూ చేయకుండా వాళ్ళ సాఫల్యాలు, వైఫల్యాల నుండి నేర్చుకోవడమే సునాయాసం అని మీరు గ్రహించవచ్చు. (1 కొరింథీయులు 10:​6-11) అంతకంటే ముఖ్యంగా, బైబిలులో దేవుడు అద్భుతమైన నియమాలను, సూత్రాలను మనకు అందిస్తున్నాడు. అవి పూర్తిగా నమ్మదగినవి. ‘యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది యెహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును.’ (కీర్తన 19:⁠7) నిస్సందేహంగా, ప్రేమగల మన సృష్టికర్త జ్ఞానం నుండి నేర్చుకోవడమే అత్యున్నత మార్గం.

[4వ పేజీలోని చిత్రాలు]

ఈ లోకం మీరు ఐశ్వర్యాసక్తి గల జీవన శైలిని అలవరచుకోవాలని కాంక్షిస్తోంది

[5వ పేజీలోని చిత్రం]

బైబిలులో లభించే సంపద వెండిబంగారాల కంటే ఎంతో విలువైనది