కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘నిజమైన దేవుడు, నిత్యజీవమునై యున్నవాడు’ ఎవరు?

‘నిజమైన దేవుడు, నిత్యజీవమునై యున్నవాడు’ ఎవరు?

‘నిజమైన దేవుడు, నిత్యజీవమునై యున్నవాడు’ ఎవరు?

మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన యెహోవాయే నిజమైన దేవుడు. ఆయనే సృష్టికర్త, తనను ప్రేమించే వారికి ఆయనే నిత్యజీవం ఇచ్చేవాడు. పైన శీర్షికలోని ప్రశ్నకు బైబిలు చదివేవారు, దాన్ని నమ్మేవారు అనేకమంది ఈ విధంగానే జవాబిస్తారు. నిజానికి యేసే స్వయంగా ఇలా అన్నాడు: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.” (ఇటాలిక్కులు మావి.)​—⁠యోహాను 17:⁠3.

అయితే, చర్చికి వెళ్ళే చాలామంది ఆ మాటకు మరో విధంగా అర్థం చెబుతారు. ఈ శీర్షికలోని మాటలు 1 యోహాను 5:⁠20 నుండి తీసుకోబడ్డాయి, అందులో కొంత భాగం ఇలా ఉంది: “మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తునందున్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునై యున్నాడు.”

త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మేవారు, ఈ లేఖనంలోని “ఆయనే” అనే సర్వనామం యేసును సూచిస్తోందనీ, కాబట్టి యేసే ‘నిజమైన దేవుడు, నిత్యజీవమునై యున్నాడు’ అనీ వివరిస్తారు. అయితే ఈ వివరణ, మిగతా లేఖనాలతో ఏకీభవించదు. అలాంటప్పుడు, అలాంటి వివరణ ఎందుకు ఇవ్వబడుతోంది? కారణం ఏమిటంటే వారు గ్రీకు వ్యాకరణాన్ని తప్పుగా అర్థం చేసుకోవడమే. ఆదిమ గ్రీకు మూలపాఠంలో, ముందరి వచనంలో యేసుక్రీస్తు చివర్లో ప్రస్తావించబడ్డాడు. గ్రీకు వ్యాకరణం ప్రకారంగా అనువదించబడిన ఆ తర్వాతి వచనంలో వెంటనే ప్రస్తావించబడిన “ఆయన” అనే సర్వనామం యేసునే సూచిస్తుందని త్రిత్వవాదులు అంటారు. అయితే, అధికారిక విద్వాంసులు అనేకమంది ఈ త్రిత్వవాదాన్ని అంగీకరించరు. కేంబ్రిడ్జి యూనివర్సిటీ విద్వాంసుడు బి. ఎఫ్‌. వెస్ట్‌కాట్‌ ఇచ్చిన వివరణ ప్రకారం, ‘నిజమైన దేవుడు, నిత్యజీవమునై యున్నవాడు’ అనే మాట యేసును కాదుగాని ఆయన తండ్రిని సూచిస్తోంది. అపొస్తలుడైన యోహాను మనస్సులో ఆ విషయమే సుస్పష్టంగా ఉంది. జర్మను వేదాంతి అయిన ఎరిక్‌ హాప్ట్‌ ఇలా వ్రాశాడు: “‘ఆయన’ అనే మాట యేసును సూచిస్తుందో లేక దేవుణ్ణి సూచిస్తుందో తేల్చుకోవడానికి 21వ వచనంలో, విగ్రహాల జోలికి పోకూడదని ఇచ్చిన హెచ్చరిక సహాయం చేస్తుంది. ఈ హెచ్చరికను పరిగణలోకి తీసుకున్నప్పుడు, ఆ తర్వాతి వచనం క్రీస్తు దైవత్వాన్ని నిరూపించడానికి బదులుగా, అది సత్యదేవుణ్ణి గురించి సాక్ష్యమిస్తోందనే నిర్ణయానికి రావడం న్యాయసమ్మతం.”

రోములోని పోంటిఫిషియల్‌ బిబ్లికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ వారు ప్రచురించిన ఎ గ్రామటికల్‌ అనాలిసిస్‌ ఆఫ్‌ ద గ్రీక్‌ న్యూ టెస్టమెంట్‌ కూడా ఇలా పేర్కొంటోంది: “18-20 [వచనాల] చివర్లో ప్రస్తావించబడిన ‘ఆయన’ అనే మాట ఖచ్చితంగా (21వ వచనంలోని) అన్యమత ఆచారానికి భిన్నంగా ఉండే నిజమైన, సత్య దేవుణ్ణే సూచిస్తోంది.”

గ్రీకులో “ఆయన” లేదా “ఈయన” అనే అర్థాన్నిచ్చే పదాలు, అన్ని సందర్భాల్లో ముందరి వాక్యంలో చివరగా ప్రస్తావించబడిన కర్తను సూచించవు.

దీనికి ఒక ఉదాహరణ, అపొస్తలుల కార్యములు 4:10, 11లో కనబడుతుంది. లూకా ఇలా చెబుతున్నాడు: “మీరు సిలువవేసినట్టియు, మృతులలోనుండి దేవుడు లేపినట్టియు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ యెదుట నిలుచుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే; ఆ రాయి మూలకు తలరాయి ఆయెను.” 11వ వచనంలో పేర్కొనబడిన ‘ఆయన’ స్వస్థపరచబడిన వ్యక్తిని సూచించడం లేదు. అక్కడ ప్రస్తావించబడిన ‘ఆయన’ నజరేయుడైన యేసుక్రీస్తు అని వేరే చెప్పనవసరం లేదు. “మూలకు తలరాయి” అయిన ఆయన మీదే క్రైస్తవ సంఘం నిర్మించబడింది.​—⁠ఎఫెసీయులు 2:​20; 1 పేతురు 2:​4-8.

కాబట్టి “మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తునందున్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునై యున్నాడు” అని అనువదించబడిన 1 యోహాను 5:20లోని “ఆయనే” అనే పదం తండ్రియైన దేవుణ్ణే సూచిస్తుంది.

‘సత్యవంతుడు’

అపొస్తలుడైన యోహాను వ్రాసినట్లుగా ‘సత్యవంతుడు’ యేసుక్రీస్తు తండ్రియైన యెహోవా. ఆయనే అద్వితీయ సత్యదేవుడు, సృష్టికర్త. అపొస్తలుడైన పౌలు ఇలా అంగీకరించాడు: “మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయన నుండి సమస్తమును కలిగెను.” (1 కొరింథీయులు 8:6; యెషయా 42:⁠8) 1 యోహాను 5:20లో యెహోవా ‘సత్యవంతుడు’ అని సూచింపబడడానికి మరో కారణం, ఆయనే సత్యానికి మూలాధారంగా ఉండడం. కీర్తనకర్త యెహోవాను “సత్యదేవా” అని పిలిచాడు, కారణం ఆయనే నమ్మకమైనవాడు, అబద్ధమాడనేరని దేవుడు. (కీర్తన 31:5; నిర్గమకాండము 34:6; తీతు 1:⁠2) తన పరలోకపు తండ్రిని సూచిస్తూ ఆ కుమారుడే ఈ విధంగా అన్నాడు: “నీ వాక్యమే సత్యము.” తన సొంత బోధను గురించి మాట్లాడుతూ ఆయన ఇలా అన్నాడు: “నేను చేయు బోధ నాది కాదు; నన్ను పంపినవానిదే.”​—⁠యోహాను 7:​16; 17:​17.

యెహోవా ‘నిత్యజీవమునై కూడా ఉన్నాడు.’ ఆయన జీవమునకు ఊటయే కాక, క్రీస్తు ద్వారా ఆయన దానిని కృపావరంగా దయచేస్తున్నాడు. (కీర్తన 36:9; రోమీయులు 6:​23) అందుకే అపొస్తలుడైన పౌలు దేవుని గురించి మాట్లాడుతూ ఆయన ‘తనను వెదకువారికి ఫలము దయచేయువాడని’ చెప్పాడు. (హెబ్రీయులు 11:⁠6) కుమారుణ్ణి మృతుల్లో నుండి లేపడం ద్వారా దేవుడాయనకు తగిన ప్రతిఫలం ఇచ్చాడు, అలాగే పూర్ణహృదయంతో తనను సేవించేవారికి ఆయన నిత్యజీవమనే ప్రతిఫలమిస్తాడు.​—⁠అపొస్తలుల కార్యములు 26:23; 2 కొరింథీయులు 1:⁠9.

కాబట్టి మనం ఏ నిర్ధారణకు రావాలి? యెహోవా తప్ప ‘నిజమైన దేవుడు, నిత్యజీవమునై యున్నవాడు’ మరెవ్వరూ లేరు. తాను సృష్టించిన వారి నుండి సంపూర్ణ ఆరాధనకు ఆయన మాత్రమే అర్హుడు.​—⁠ప్రకటన 4:​10, 11.