కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

యేసు తన అనుచరులకు, ‘మరల పుచ్చుకొనవలెనని నిరీక్షించకుండా, [వడ్డీ తీసుకోకుండానే] అప్పు ఇయ్యుడి’ అని చెప్పినప్పుడు, వారు మూలధనం కూడా తిరిగి అడగకూడదని ఆయన ఉద్దేశమా?

మోషే ధర్మశాస్త్రాన్ని దృష్టిలో ఉంచుకుంటే, లూకా 6:​34, 35, వచనాల్లోని యేసు మాటలను చక్కగా అర్థం చేసుకోవచ్చు. దేవుడు ఆ ధర్మశాస్త్రంలో, ఆర్థికంగా చితికిపోయిన లేదా సహాయం అవసరమైన తోటి ఇశ్రాయేలీయులకు వడ్డీ తీసుకోకుండా అప్పులు ఇవ్వాలని ఇశ్రాయేలీయులను ఆజ్ఞాపించాడు. (నిర్గమకాండము 22:25; లేవీయకాండము 25:35-37) ఈ విధమైన అప్పులు వాణిజ్యం లేదా వ్యాపారం కోసం ఇచ్చేవి కావు. బదులుగా, అలాంటి వడ్డీలేని అప్పులు, బీదరికం లేదా కష్టాల నుండి బయటపడడానికి సహాయం చేసేవి. నిజానికి, అలా ఆర్థికంగా చితికిపోయిన పొరుగువాని నుండి లాభం పొందాలనుకోవడం, ఏ మాత్రం ప్రేమ లేని చర్యగా ఉంటుంది. అయితే, అప్పిచ్చే వ్యక్తి తిరిగి తన మూలధనం పొందడం న్యాయమే, అలాంటి అప్పులు కొన్నిసార్లు హామీ (అప్పుపై పూచీ) తీసుకొని ఇవ్వబడేవి.​—⁠ద్వితీయోపదేశకాండము 15:⁠7, 8.

యేసు ధర్మశాస్త్రాన్ని సమర్థిస్తూ, దానిని మరింత విస్తృతంగా వర్తింపజేస్తూ అలా సహాయం చేసే వ్యక్తి, దానిని “మరల పుచ్చుకొనవలెనని” ఆశించవద్దని కూడా చెప్పాడు. ఇశ్రాయేలీయుల్లాగే క్రైస్తవులూ కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవచ్చు లేదా ఇతర పరిస్థితుల వల్ల పేదరికంలో పడవచ్చు, చివరకు నిరాధారులు కావచ్చు. క్రైస్తవ సహోదరుడు ఎవరైనా అలాంటి దుస్థితిలో ఉంటే, అతనికి సహాయం చేయడం దయాపూర్వక చర్య కాదా? ఒక సహోదరుడు తన తప్పు లేకుండానే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందిలో చిక్కుకుంటే, అతనికి సహాయం చేయడానికి తోటి క్రైస్తవుడ్ని నిజమైన ప్రేమ పురికొల్పుతుంది. (సామెతలు 3:​27) అలాంటి సహోదరునికి అవసరమైన మొత్తాన్ని అప్పుగా ఇవ్వడం సాధ్యం కాకపోయినా, కొంత డబ్బు బహుమతిగా ఇవ్వడం సాధ్యం కావచ్చు.​—⁠కీర్తన 37:​21.

సా.శ. మొదటి శతాబ్దంలో కరవు రావడం వల్ల యూదయలోని సహోదరులకు, ఆసియా మైనర్‌లోని సహోదరులు ఇచ్చిన కానుకలు తీసుకువెళ్ళమని అపొస్తలుడైన పౌలు, బర్నబాలకు ఆదేశించబడింది. (అపొస్తలుల కార్యములు 11:28-30) అదేవిధంగా నేడు కూడా క్రైస్తవులు, విపత్తులు సంభవించినప్పుడు అవసరంలో ఉన్న తమ సహోదరులకు అలాంటి బహుమతులు పంపిస్తారు. అలా చేయడం వలన వారు ఇతరులకు కూడా చక్కని సాక్ష్యమిచ్చిన వారవుతారు. (మత్తయి 5:​16) అయితే, సహాయం కోరే వ్యక్తి ఉద్దేశాన్ని, పరిస్థితిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఆయనకు అలాంటి అవసరం ఎందుకు ఏర్పడింది? ఇక్కడ పౌలు మాటలు గమనార్హమైనవి: “ఎవడైనను పనిచేయ నొల్లని యెడల వాడు భోజనము చేయకూడదు.”​—⁠2 థెస్సలొనీకయులు 3:10.

అప్పు అడిగే సహోదరుడు తీవ్ర అవసరంలో ఉన్నందువల్ల కాక, కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏర్పడిన పరిస్థితి నుండి మళ్ళీ నిలద్రొక్కుకోవడానికి తాత్కాలిక సహాయం మాత్రమే అడుగుతున్నట్లయితే, ఆయనకు వడ్డీ లేకుండానే అప్పు ఇవ్వడం సబబుగా ఉండవచ్చు. అలాంటి పరిస్థితుల్లో, పూర్తి మొత్తాన్ని తిరిగి పొందాలనే దృష్టితో అప్పు ఇవ్వడం లూకా 6:​34, 35లోని యేసు మాటలకు విరుద్ధం కాదు. దానికి సంబంధించిన ఒప్పందాన్ని వ్రాసిపెట్టుకోవడమే కాక, అప్పు తీసుకునే వ్యక్తి ఒప్పందం ప్రకారం డబ్బు తిరిగి చెల్లించడానికి శాయశక్తులా కృషి చేయాలి. అప్పిచ్చిన వ్యక్తి ఎంత ప్రేమతో దానిని ఇచ్చాడో అలాగే తిరిగి చెల్లించేలా అప్పు తీసుకున్న వ్యక్తిని క్రైస్తవ ప్రేమే పురికొల్పాలి.

అప్పు ఇవ్వాలని (లేదా బహుమతి ఇవ్వాలని) ఆలోచిస్తున్న వ్యక్తి తన సొంత కుటుంబ పరిస్థితిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఉదాహరణకు, ఒకవేళ తాను అలాంటి అప్పు లేదా బహుమానం ఇస్తే, లేఖనాధారితంగా ప్రధానమైన తన బాధ్యత అంటే తన కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చే తన బాధ్యత విషయంలో రాజీ పడినట్లవుతుందా? (2 కొరింథీయులు 8:12; 1 తిమోతి 5:8) అయినప్పటికీ, క్రైస్తవులు ఒకరికొకరు ప్రేమ చూపించుకునే అవకాశాల కోసం చూస్తారు, ఆ ప్రేమను బైబిలు సూత్రాలకు అనుగుణంగా, ఆచరణాత్మకంగా చూపిస్తారు.​—⁠యాకోబు 1:27; 1 యోహాను 3:18; 4:7-11.