కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు పరదైసు నిరీక్షణ ఉందా?

మీకు పరదైసు నిరీక్షణ ఉందా?

మీకు పరదైసు నిరీక్షణ ఉందా?

‘క్రీస్తునందున్న యొక మనుష్యుని నేనెరుగుదును. అతడు పరదైసులోనికి కొనిపోబడెను.’ ​—⁠2 కొరింథీయులు 12:​2-4.

పరదైసు. భూపరదైసు గురించిన దేవుని వాగ్దానం మొదటిసారి విన్నప్పుడు మీరెలా భావించారో మీకు గుర్తుందా? ‘గ్రుడ్డివారి కన్నులు తెరవబడతాయి, చెవిటివారి చెవులు విప్పబడతాయి, అరణ్యములో నీళ్లు ఉబికి’ సారవంతమైన ప్రాంతంగా వెల్లి విరుస్తుందని నేర్చుకోవడాన్ని మీరు గుర్తు తెచ్చుకోవచ్చు. లేదా తోడేళ్ళు గొఱ్ఱెపిల్లలతో, చిఱుతపులులు మేకపిల్లలతో కలిసి జీవిస్తాయనే ప్రవచనం గురించి నేర్చుకున్నప్పటి విషయం ఏమిటి? మరణించిన మీ ప్రియమైనవారు ఆ పరదైసులో నిత్యం జీవించే నిరీక్షణతో తిరిగి లేపబడతారని చదవడం మీకు పులకరింత కలిగించలేదా?​—⁠యెషయా 11:⁠6; 35:​5, 6; యోహాను 5:​28, 29.

2 మీ నిరీక్షణ నిరాధారమైనదేమీ కాదు. పరదైసు గురించిన బైబిలు వాగ్దానాలను మీరు నమ్మడం సహేతుకమైనదే. ఉదాహరణకు యేసు, “నీవు నాతోకూడ పరదైసులో ఉందువని” తనతోపాటు వ్రేలాడవేయబడిన నేరస్థులలో ఒకనితో అన్న మాటల్లో మీకు ప్రగాఢ విశ్వాసం ఉంది. (లూకా 23:​39-43) “మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టుచున్నాము; వాటియందు నీతి నివసించును” అనే వాగ్దానాన్ని మీరు నమ్ముతారు. దేవుడు మన కన్నీటిని తుడిచివేస్తాడు; మరణం ఇక ఉండదు; దుఃఖము, ఏడ్పు, వేదన ఇక ఉండవు అనే వాగ్దానాన్ని కూడా మీరు నమ్ముతారు. అంటే భూపరదైసు మళ్ళీ ఉనికిలోకి వస్తుందని అర్థం!​—⁠2 పేతురు 3:​13; ప్రకటన 21:⁠4.

3 ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకు, పరదైసు కోసం నిరీక్షించడానికి మరొక ఆధారం కూడా ఉంది. ఏమిటది? దేవుడు ఒక ఆధ్యాత్మిక పరదైసును రూపొందించి, తన ప్రజలను అందులోకి తీసుకువచ్చాడు. “ఆధ్యాత్మిక పరదైసు” అనే మాట సిద్ధాంతపరమైన మాటలాగా, అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉన్నట్లు అనిపించవచ్చు. కానీ అలాంటి పరదైసు గురించి ముందే చెప్పబడింది, అది నిజంగానే ఉనికిలో ఉంది.

పరదైసు గురించిన దర్శనం

4 దీనికి సంబంధించి, అపొస్తలుడైన పౌలు ఏమి వ్రాశాడో గమనించండి: ‘క్రీస్తునందున్న యొక మనుష్యుని నేనెరుగుదును. అతడు మూడవ ఆకాశమునకు కొనిపోబడెను; అతడు శరీరముతో కొనిపోబడెనో నేనెరుగను, శరీరములేక కొనిపోబడెనో నేనెరుగను, అది దేవునికే తెలియును. అట్టి మనుష్యుని నేనెరుగుదును. అతడు రదైసులోనికి కొనిపోబడి, వచింప శక్యము కాని మాటలు వినెను; ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు.’ (2 కొరింథీయులు 12:​2-4) ఈ మాటలు, పౌలు తన అపొస్తలత్వమును సమర్థించుకున్న వచనాల వెన్నంటే కనబడతాయి. అంతేకాదు, అలాంటి అనుభవం పొందిన వేరే ఎవరి గురించీ బైబిలు చెప్పడం లేదు, పౌలు మాత్రమే మనకు ఆ విషయం గురించి చెబుతున్నాడు. కాబట్టి అది పౌలు చూసిన దర్శనమే అనిపిస్తోంది. సహజత్వానికి అతీతమైన ఈ అనుభవంలో, ఆయన ఎలాంటి “పరదైసులోనికి” వెళ్ళాడు?​—⁠2 కొరింథీయులు 11:​5, 23-31.

5 ఆ దర్శనంలోని, “మూడవ ఆకాశము” అనే మాట మన భూగోళం చుట్టూ ఉన్న వాయుమండలాన్ని గానీ అంతరిక్షాన్ని గానీ లేదా ఖగోళ శాస్త్రజ్ఞులు భావిస్తున్నట్లు విశ్వంలోని మరో భాగాన్ని గానీ సూచించడం లేదు. బైబిలు మూడు అనే సంఖ్యను నొక్కిచెప్పడానికి, తీవ్రతకు, మరింత బలంగా చెప్పడాన్ని సూచించడానికి ఎక్కువగా ఉపయోగిస్తుంది. (ప్రసంగి 4:​12; యెషయా 6:⁠3; మత్తయి 26:​34, 75; ప్రకటన 4:⁠8) ఆ విధంగా, పౌలు దర్శనంలో చూసినది ఉన్నతంగా లేదా ఘనంగా చెప్పబడింది. అది ఆధ్యాత్మికమైనది.

6 గతంలోని బైబిలు ప్రవచనాలు మనకు సరైన అవగాహనను ఇస్తాయి. దేవుడు, ప్రాచీన కాలంలోని తన ప్రజలు తనకు విశ్వసనీయంగా లేరని తెలిశాక, యూదాపైకి, యెరూషలేముపైకి బబులోనీయులను రప్పించాలని తీర్మానించాడు. అది బైబిలు సంఘటనల కాలక్రమం ప్రకారం, సా.శ.పూ. 607లో నాశనం చేయబడింది. ఆ దేశం 70 సంవత్సరాల పాటు నిర్మానుష్యంగా ఉంటుందనీ, ఆ తర్వాత పశ్చాత్తాపపడిన యూదులు తిరిగి వచ్చి సత్యారాధనను మళ్ళీ నెలకొల్పేందుకు దేవుడు వారిని అనుమతిస్తాడనీ ప్రవచనం చెబుతోంది. ఇది సా.శ.పూ. 537 నుండి జరిగింది. (ద్వితీయోపదేశకాండము 28:​15, 62-68; 2 రాజులు 21:​10-15; 24:​12-16; 25:1-4; యిర్మీయా 29:​10-14) అయితే ఆ దేశానికి ఏమి జరిగింది? ఆ 70 సంవత్సరాల కాలంలో, అది అడవి మొక్కలతో, ఎడారి ప్రాంతంగా, నక్కల స్థావరంగా మారింది. (యిర్మీయా 4:​26; 10:​22) అయినప్పటికీ, దాని విషయంలో ఈ వాగ్దానం ఉంది: “యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్యస్థలములను ఏదెనువలె చేయుచున్నాడు దాని యెడారి భూములు యెహోవా తోటవలె [లేదా పరదైసువలె, సెప్టాజింట్‌] నగునట్లు చేయుచున్నాడు.”​—⁠యెషయా 51:⁠3.

7 అది 70 సంవత్సరాల తర్వాత సంభవించింది. దేవుని ఆశీర్వాదం వల్ల పరిస్థితులు మెరుగుపడ్డాయి. ఈ పరిస్థితిని ఊహించుకోండి: “అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరిపుష్పమువలె పూయును, అది బహుగా పూయుచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును, . . . కుంటివాడు దుప్పివలె గంతులువేయును మూగవాని నాలుక పాడును అరణ్యములో నీళ్లు ఉబుకును అడవిలో కాలువలు పారును. ఎండమావులు మడుగులగును ఎండిన భూమిలో నీటిబుగ్గలు పుట్టును నక్కలు పండుకొనినవాటి ఉనికిపట్టులో జమ్మును తుంగగడ్డియు మేతయు పుట్టును.”​—⁠యెషయా 35:​1-7.

పునరుద్ధరించబడిన, మార్పులు చేసుకున్న ప్రజలు

8 నిర్మానుష్య స్థితి నుండి పరదైసుగా మార్చబడడం నిజంగా ఎంత గొప్ప మార్పో కదా! అయితే, ఈ ప్రవచనంతో పాటు ఇతర నమ్మదగిన ప్రవచనాలు, నిస్సారమైన ప్రాంతం ఫలవంతంగా మారుతుందనీ, ప్రజల్లో కూడా మార్పు వస్తుందనీ తెలిపాయి. అలా జరుగుతుందని మనమెలా చెప్పవచ్చు? ఇక్కడ యెషయా, తమ దేశానికి “పాటలు పాడుచు,” “ఆనందసంతోషములు” పొందడానికి వచ్చే “యెహోవా విమోచించినవారి” మీద దృష్టి సారిస్తున్నాడు. (యెషయా 35:​9-10) అది ఆ నేలకు కాదు గానీ ప్రజలకే వర్తిస్తుంది. అంతేకాకుండా, సీయోనులో ప్రజలు పూర్వస్థితికి వస్తారని యెషయా మరోచోట కూడా ప్రవచించాడు: “నీతి అను మస్తకివృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. భూమి మొలకను మొలిపించునట్లుగా, . . . యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపజేయును.” దేవుని ప్రజల గురించి యెషయా ఇలా కూడా అన్నాడు: “యెహోవా నిన్ను నిత్యము నడిపించును . . . నీ యెముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోటవలె . . . ఉండెదవు.” (యెషయా 58:​11; 61:​3, 11; యిర్మీయా 31:​10-12) దీన్నిబట్టి, ఒక ప్రదేశంలోని పర్యావరణ పరిస్థితులు ఎలాగైతే మెరుగుపడతాయో, అలాగే పునరుద్ధరించబడిన యూదా ప్రజల్లోనూ మార్పులు జరుగుతాయి.

9 ఈ చారిత్రక ఉదాహరణ, పౌలు దర్శనంలో ఏమి చూశాడో అర్థం చేసుకోవడానికి మనకు తోడ్పడుతుంది. ఆ దర్శనంలో, ఆయన “దేవుని వ్యవసాయము” అని పిలిచిన ఫలవంతం కావలసిన క్రైస్తవ సంఘం ఇమిడి ఉంది. (1 కొరింథీయులు 3:⁠9) ఆ దర్శనం ఎప్పుడు నెరవేరుతుంది? పౌలు తాను చూసిన దానిని భవిష్యత్తులో జరుగనున్న ‘ప్రత్యక్షత’ అన్నాడు. ఆయనకు తన మరణం తర్వాత భ్రష్టత్వం విస్తరిస్తుందని తెలుసు. (2 కొరింథీయులు 12:⁠1; అపొస్తలుల కార్యములు 20:​29, 30; 2 థెస్సలొనీకయులు 2:​3, 7) మతభ్రష్టులు ప్రబలంగా విస్తరిస్తున్నప్పుడు, నిజ క్రైస్తవులను వెల్లి విరిసే తోటతో పోల్చలేము. అయినప్పటికీ, సత్యారాధన ఉన్నత స్థాయికి వచ్చే కాలం మళ్ళీ వస్తుంది. ‘నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యునివలె తేజరిల్లేలా,’ దేవుని ప్రజలు పునరుద్ధరించబడతారు. (మత్తయి 13:​24-30, 36-43) అది వాస్తవానికి, పరలోకంలో దేవుని రాజ్యం స్థాపించబడిన తర్వాత కొన్ని సంవత్సరాలకు జరిగింది. పౌలు ఆ దర్శనంలో ముందే చూసినట్లుగా, గత దశాబ్దాల కాలంలో, దేవుని ప్రజలు ఆధ్యాత్మిక పరదైసులో జీవిస్తున్నారనే విషయం సుస్పష్టమైంది.

10 నిజమే, మనం అపరిపూర్ణులమనీ, అప్పుడప్పుడు సమస్యలు వస్తాయనీ, పౌలు కాలంలోని క్రైస్తవుల మధ్య వచ్చిన సమస్యల్లాంటివి కూడా తలెత్తుతాయని మనకు తెలుసు. (1 కొరింథీయులు 1:​10-13; ఫిలిప్పీయులు 4:​2, 3; 2 థెస్సలొనీకయులు 3:​6-14) కానీ మనం ఇప్పుడు అనుభవిస్తున్న ఆధ్యాత్మిక పరదైసు గురించి ఆలోచించండి. ఒకప్పటి మన ఆధ్యాత్మిక అస్వస్థతా స్థితితో పోల్చిచూస్తే ఇప్పుడు మనం ఆధ్యాత్మికంగా స్వస్థపరచబడ్డాం. ఒకప్పుడు మనం ఆధ్యాత్మికంగా నకనకలాడిన పరిస్థితితో, ఆధ్యాత్మికంగా చక్కగా పోషించబడుతున్న నేటి పరిస్థితిని పోల్చి చూడండి. దేవుని ప్రజలు ఎండబారిన ఆధ్యాత్మిక ప్రాంతంలో తంటాలు పడినట్లు కాకుండా, వారికి దేవుని ఆమోదంతో పాటు ఆయన కుమ్మరిస్తున్న అనేక ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. (యెషయా 35:​1, 7) మనం చీకటి కుహరంలాంటి ఆధ్యాత్మిక అంధకారంతో గ్రుడ్డివాళ్ళుగా ఉండడానికి బదులు, స్వతంత్రపు వెలుగును, దేవుని అనుగ్రహాన్నీ చూస్తున్నాం. బైబిలు ప్రవచనాలను సరిగా వినలేని బధిరుల్లా ఉన్న అనేకులు, లేఖనాలు ఏమి చెబుతున్నాయో విని అర్థం చేసుకునే స్థితికి వచ్చారు. (యెషయా 35:⁠5) ఉదాహరణకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది యెహోవాసాక్షులు, దానియేలు ప్రవచనంలోని ఒక్కొక్క వచనాన్ని వివరణాత్మకంగా అధ్యయనం చేశారు. ఆ తర్వాత వాళ్ళు యెషయా పుస్తకంలోని ప్రతి అధ్యాయాన్ని నిశితంగా పరిశీలించారు. పునరుత్తేజపరిచే ఆ ఆధ్యాత్మిక ఆహారం, మన ఆధ్యాత్మిక పరదైసుకు నిదర్శనం ఇవ్వడం లేదా?

11 అన్ని రకాల నేపథ్యాల నుండి వచ్చిన యథార్థ హృదయులు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికీ, నేర్చుకున్నవాటిని అన్వయించుకోవడానికీ కృషి చేస్తూ తమ లక్షణాలను మార్చుకోవడాన్ని గురించి కూడా ఆలోచించండి. ముఖ్యంగా వారు తమలో అంతకు ముందు ప్రబలంగా ఉన్న పాశవిక లక్షణాలను వదిలేసేందుకు కృషి చేశారు. బహుశా మీరూ అలాగే చేసి మంచి ఫలితాలను పొందివుంటారు, మీ ఆధ్యాత్మిక సహోదర సహోదరీలు అలాగే చేశారు. (కొలొస్సయులు 3:​8-14) కాబట్టి మీరు ఒక యెహోవాసాక్షుల సంఘంతో సహవసిస్తున్నారంటే, మీరు ఎంతో శాంతికాముకులు, స్నేహశీలురుగా మారిన ప్రజలతో ఉంటున్నట్లే. అయితే వారు ఇప్పటికీ పరిపూర్ణులు కాదు, కానీ వారు భయంకరమైన సింహాలు లేదా క్రూర జంతువుల్లాంటి వారని వర్ణించబడరు. (యెషయా 35:⁠9) ప్రశాంతమైన, శాంతియుతమైన ఈ ఆధ్యాత్మిక సాంగత్యం ఏమి సూచిస్తోంది? నిస్సందేహంగా, మనం ఆధ్యాత్మిక స్థితిని అనుభవిస్తున్నాం, దాన్ని సముచితంగానే మనం ఆధ్యాత్మిక పరదైసు అని పిలుస్తున్నాం. అంతేగాక మన ఈ ఆధ్యాత్మిక పరదైసు, మనం దేవునికి విశ్వసనీయంగా ఉంటే అనుభవించబోయే భూపరదైసుకు ముందు ఛాయగా ఉంది.

12 అయితే మనం నిర్లక్ష్యం చేయకూడని విషయం కూడా ఒకటి ఉంది. దేవుడు ఇశ్రాయేలీయులతో ఇలా అన్నాడు: “మీరు బలముగలిగి స్వాధీనపరచుకొనుటకై నది దాటి వెళ్లుచున్న ఆ దేశమందు ప్రవేశించి దాని స్వాధీనపరచుకొనునట్లు . . . నేను ఈ దినమున మీకాజ్ఞాపించు ఆజ్ఞలనన్నిటిని మీరు గైకొనవలెను.” (ద్వితీయోపదేశకాండము 11:​8,9) లేవీయకాండము 20:​22, 24లో అదే దేశం గురించి ఇలా చెప్పబడింది: “మీరు నివసించునట్లు నేను ఏ దేశమునకు మిమ్మును తీసికొని పోవుచున్నానో ఆ దేశము మిమ్మును కక్కివేయకుండునట్లు మీరు నా కట్టడలన్నిటిని నా విధులన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను. నేను మీతో చెప్పినమాట యిదే​—⁠మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు; అది, అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము, మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు దాని మీకిచ్చెదను.” అవును వాగ్దాన దేశంలో నివసిస్తామా లేదా అనేది, యెహోవా దేవునితో ఉండే మంచి సంబంధం మీదే ఆధారపడి ఉంది. ఇశ్రాయేలీయులు ఆయనకు విధేయంగా ఉండకపోవడం వల్లనే, బబులోనీయులు వారిని ఓడించి, వారు నివసిస్తున్న స్థలం నుండి వారిని తీసివేసేందుకు అనుమతించాడు.

13 మనం మన ఆధ్యాత్మిక పరదైసు గురించి సంతోషించేందుకు ఇంకా ఎన్నో విషయాలు ఉండవచ్చు. దాని పర్యావరణ పరిస్థితులు మనకెంతో ఆహ్లాదాన్నీ, ప్రశాంతతనూ ఇస్తాయి. పాశవిక లక్షణాలను వదిలించుకోవడానికి కృషి చేసిన క్రైస్తవులతో మనకు శాంతి సంబంధాలున్నాయి. వారు దయగా, తోడ్పాటుగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే మనం ఆధ్యాత్మిక పరదైసులోనే ఉండాలంటే, ఈ ప్రజలతో సత్సంబంధాలు కలిగివుండడం మాత్రమే సరిపోదు. దానికి మనం యెహోవాతో మంచి సంబంధం కలిగి ఉండాలి, ఆయన చిత్తం చేస్తుండాలి. (మీకా 6:⁠8) మనం ఈ ఆధ్యాత్మిక పరదైసులోకి ఇష్టపూర్వకంగా వచ్చాం, కానీ దేవునితో మనకున్న సంబంధాన్ని మనం కాపాడుకోకపోతే, మనం కొట్టుకుపోవచ్చు లేదా బహిష్కరించబడవచ్చు.

14 మనకు సహాయపడే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనల్ని మనం దేవుని వాక్యంతో నిరంతరం బలపరచుకోవాలి. కీర్తన 1:​1-3 వచనాల్లోని సూచనార్థక భాషను గమనించండి: “దుష్టుల ఆలోచన చొప్పున నడువక . . . యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును అతడు చేయునదంతయు సఫలమగును.” దానితోపాటు, ఆధ్యాత్మిక పరదైసులో నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతి, ఆధ్యాత్మిక ఆహారంగా ఇస్తున్న బైబిలు ఆధారిత ప్రచురణలను చదవాలి.​—⁠మత్తయి 24:​45-47.

పరదైసుకు సంబంధించిన మీ దృక్పథాన్ని బలపరుచుకోవడం

15 పరదైసు యొక్క మరో ముందు ఛాయను పరిశీలించండి. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలపాటు అరణ్యంలో సంచరించిన తర్వాత, మోషే వారిని యొర్దాను నదికి తూర్పున ఉన్న మోయాబు మైదానాల్లోకి తీసుకువెళ్ళాడు. గతంలో మోషే చేసిన పొరపాటు కారణంగా, ఆయన ఇశ్రాయేలీయులను యొర్దాను నది దాటించకూడదని యెహోవా నిర్ణయించాడు. (సంఖ్యాకాండము 20:​7-12; 27:​12, 13) ‘నేను అద్దరికి వెళ్లి యొర్దాను అవతలనున్న మంచి దేశమును చూచునట్లు దయచేయుము’ అని మోషే దేవుణ్ణి వేడుకున్నాడు. ఆయన అందులో ప్రవేశించక పోయినా, పిస్గా కొండ మీదకు ఎక్కి ఆ దేశంలోని వివిధ ప్రాంతాలను చూసిన తర్వాత, అది “మంచి దేశము” అని మోషే ఖచ్చితంగా గ్రహించి ఉంటాడు. ఆ దేశము ఎలా ఉండేదని మీరు అనుకుంటున్నారు?​—⁠ద్వితీయోపదేశకాండము 3:​25-27.

16 మీరు ఆ దేశం ఇటీవలి కాలాల్లో ఎలా ఉందో దాన్నిబట్టి ఆలోచిస్తే, అది బీడుగా మారిన నేలతో, రాళ్ళురప్పలతో, మండే ఎండలతో ఉండే ప్రాంతంగా ఊహిస్తుండవచ్చు. కానీ అది బైబిలు కాలాల్లో పూర్తి భిన్నంగా ఉండేదని నమ్మేందుకు కారణముంది. సైంటిఫిక్‌ అమెరికన్‌ అనే పత్రికలో, వ్యవసాయ శాస్త్రవేత్త డా. వాల్టర్‌ సి. లాడర్‌మిల్క్‌, ఆ ప్రాంతంలోని భూమి “సహస్రాబ్దికాలం పాటు పాడు చేయబడింది” అని వివరించాడు. ఆ వ్యవసాయ శాస్త్రవేత్త ఇలా వ్రాశాడు: “ఒకప్పుడు సారవంతంగా ఉన్న భూమి, ‘ఎడారి’లా మారడానికి కారణం మానవుడే గాని, ప్రకృతి కాదు.” వాస్తవానికి, “ఆ ప్రాంతం ఒకప్పుడు పచ్చిక మైదానాల పరదైసుగా ఉండేది” అని ఆయన అధ్యయనాలు సూచించాయి. గతంలో “పచ్చిక మైదానాల పరదైసుగా” ఉన్నదాన్ని మానవులు పాడుచేశారని ఇది రుజువు చేస్తోంది. *

17 బైబిల్లో మీరు చదివినది ధ్యానించినప్పుడు, వాగ్దాన దేశం నిజంగానే ఒక పరదైసులా ఉండేదనే ఆ భావన ఎంత న్యాయసమ్మతమో గ్రహిస్తారు. యెహోవా, మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఏమని హామీ ఇచ్చాడో జ్ఞాపకం చేసుకోండి: “మీరు నది దాటి స్వాధీనపరచుకొనుటకు వెళ్లుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశవర్షజలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము.”​—⁠ద్వితీయోపదేశకాండము 11:​8-12.

18 వాగ్దాన దేశపు ప్రకృతి సౌందర్యం, ఫల సమృద్ధి ఎలా ఉండేవంటే, అందులోని కేవలం కొన్ని స్థలాలను పేర్కొంటే చాలు పరదైసు వంటి పరిస్థితులు మనసులోకి వస్తాయి. యెషయా 35వ అధ్యాయంలోని ప్రవచనం నుండి అది స్పష్టమవుతుంది, ఇశ్రాయేలీయులు బబులోను నుండి తిరిగి వచ్చినప్పుడు అది మొదటిసారి నెరవేరింది. యెషయా ఇలా ప్రవచించాడు: “అది బహుగా పూయుచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును లెబానోను సౌందర్యము దానికి కలుగును కర్మెలు షారోనులకున్న సొగసు దానికుండును అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును.” (యెషయా 35:⁠2) లెబానోను, కర్మెలు, షారోనులను ప్రస్తావించినప్పుడు ఇశ్రాయేలీయుల మనస్సుల్లో సంతృప్తికరమైన, మనోహరమైన ఊహా చిత్రం మెదిలి ఉండవచ్చు.

19 షారోనును పరిశీలించండి, అది సమరయ పర్వతాలకూ మహా సముద్రము లేదా మధ్యధరా సముద్రానికీ మధ్య ఉన్న సముద్రతీర మైదాన ప్రాంతం. (10వ పేజీలో ఫోటో చూడండి.) అది సౌందర్యానికీ ఫల సమృద్ధికి పేరుగాంచింది. సమృద్ధిగా నీరు ఉన్నందువల్ల అది పశుగ్రాసానికి అనువుగా ఉండేది, అయితే దాని ఉత్తర ప్రాంతంలో సింధూర వృక్షాల అడవులు కూడా ఉండేవి. (1 దినవృత్తాంతములు 27:​29; పరమగీతము 2:⁠1; యెషయా 65:​10) అందుకే యెషయా 35:2 పునరుద్ధరణ గురించి, శోభాయమానమైన పరదైసుగా మారే దేశం గురించి ప్రవచిస్తోంది. పౌలు ఆ తర్వాత చూసిన దర్శనానికి అనుగుణంగా, ఆ ప్రవచనం ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక పరదైసును కూడా సూచిస్తోంది. చివరిగా ఈ ప్రవచనంతోపాటు ఇతర ప్రవచనాలు, మానవాళి కోసం భూపరదైసు గురించిన మన నిరీక్షణను బలపరుస్తాయి.

20 మనం మన ఆధ్యాత్మిక పరదైసులో ఉంటూ, దానిపట్ల మనకున్న కృతజ్ఞతను, భూపరదైసు గురించిన మన నిరీక్షణను బలోపేతం చేసుకోవచ్చు. ఏ విధంగా? మనం బైబిలులో చదివిన దాని గురించిన అవగాహనను మరింత ప్రగాఢం చేసుకోవడం ద్వారా. బైబిలు వివరణలు, ప్రవచనాలు తరచుగా నిర్దిష్ట స్థలాలను పేర్కొంటాయి. అవి ఎక్కడుండేవో, వాటికి ఇతర ప్రాంతాలతో ఎలాంటి సంబంధముండేదో తెలుసుకోవాలని ఉందా? దీని తర్వాతి ఆర్టికల్‌లో, దాన్ని మీరు ప్రయోజనకరమైన రీతిలో ఎలా తెలుసుకోవచ్చో మనం పరిశీలిద్దాం.

[అధస్సూచి]

^ పేరా 21 ద జియోగ్రఫీ ఆఫ్‌ ద బైబిల్‌లో డెనిస్‌ బాలీ, “బైబిలు కాలాల నుండి ఇప్పటి వరకు వృక్ష జీవిత విధానంలో చాలా మార్పులు జరిగి ఉండవచ్చు” అని చెబుతున్నాడు. దానికి కారణమేమిటి? “మానవునికి వంట కోసం, నిర్మాణాల కోసం కలప అవసరమైంది, ఆ కారణంగా . . . అతను చెట్లను నరికెయ్యడం మొదలుపెట్టాడు, ఆ విధంగా భూమి వాతావరణపు భీకరమైన దాడులకు గురైంది. పర్యావరణం విషయంలో ఇలా జోక్యం చేసుకోవడం వల్ల . . . దానిని నాశనం చేయడంలో వాతావరణం క్రమేపి అత్యంత కీలక పాత్ర వహించింది.”

మీరు జ్ఞాపకం చేసుకోగలరా?

పౌలు ఏ “పరదైసు”ను దర్శనంలో చూశాడు?

యెషయా 35వ అధ్యాయం, తొలి నెరవేర్పు ఏమిటి, దానికీ పౌలు చూసిన దర్శనానికీ సంబంధం ఏమిటి?

మన ఆధ్యాత్మిక పరదైసు పట్ల కృతజ్ఞతను, భూపరదైసు గురించిన మన నిరీక్షణను ఎలా బలోపేతం చేసుకోవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1. ఏ బైబిలు వాగ్దానాలు చాలామందిని ఆకట్టుకునేలా ఉన్నాయి?

2, 3. (ఎ) బైబిలు ఆధారితమైన మీ నిరీక్షణ నిరాధారమైనది కాదని ఎందుకు చెప్పవచ్చు? (బి) మన నిరీక్షణకున్న అదనపు ఆధారం ఏమిటి?

4. రెండవ కొరింథీయులు 12:​2-4లో ఏ దర్శనం ప్రస్తావించబడింది, దానిని ఎవరు చూసి ఉండవచ్చు?

5. పౌలు ఏమి చూడలేదు, దాన్నిబట్టి ఆ “పరదైసు” ఎటువంటిది?

6. పౌలు చూసిన దర్శనాన్ని అర్థం చేసుకోవడానికి, ఏ చారిత్రక ఘటన దోహదపడుతుంది?

7. ఆ 70 సంవత్సరాల దుస్థితి తర్వాత ఏమి జరుగుతుంది?

8. యెషయా 35వ అధ్యాయం ప్రజల మీదికే దృష్టిసారించిందని మనకెలా తెలుసు?

9. పౌలు ఏ “పరదైసు”ను చూశాడు, అది ఎప్పుడు నెరవేరింది?

10, 11. మనం అపరిపూర్ణులం అయినప్పటికీ, మనం ఆధ్యాత్మిక పరదైసులో ఉన్నామని ఎందుకు చెప్పవచ్చు?

12, 13. మనం మన ఆధ్యాత్మిక పరదైసులోనే ఉండాలంటే ఏమి చేయాలి?

14. మనం ఆధ్యాత్మిక పరదైసులోనే ఉండేందుకు మనకు ఏది సహాయం చేస్తుంది?

15. మోషే ఇశ్రాయేలీయులను వాగ్దాన దేశంలోకి తీసుకుపోలేక పోవడానికి కారణమేమిటి, అయినా ఆయన ఏమి చూశాడు?

16, 17. (ఎ) ప్రాచీన కాలంలోని వాగ్దాన దేశానికీ, ఇటీవలి కాలంలోని దేశానికీ ఎంత తేడా ఉంది? (బి) వాగ్దాన దేశం ఒకప్పుడు పరదైసులా ఉండేదని మనం ఎందుకు నమ్మవచ్చు?

18. యెషయా 35:​2, పరవాసంలో ఉన్న ఇశ్రాయేలీయులకు వాగ్దాన దేశం గురించి ఎలాంటి తలంపును ఇచ్చి ఉండవచ్చు?

19, 20, (ఎ) ప్రాచీన షారోను ప్రాంతాన్ని వర్ణించండి. (బి) పరదైసు గురించిన మన నిరీక్షణను బలోపేతం చేసుకునే ఒక మార్గమేమిటి?

[10వ పేజీలోని చిత్రం]

షారోను మైదానం, వాగ్దాన దేశంలోని సారవంతమైన ఒక ప్రాంతం

[చిత్రసౌజన్యం]

Pictorial Archive (Near Eastern History) Est.

[12వ పేజీలోని చిత్రం]

అది “మంచి దేశము” అని మోషే గ్రహించాడు