కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యౌవనులారా మీ హృదయాన్ని కాపాడడానికి మీ తల్లిదండ్రులను సహాయం చేయనివ్వండి!

యౌవనులారా మీ హృదయాన్ని కాపాడడానికి మీ తల్లిదండ్రులను సహాయం చేయనివ్వండి!

యౌవనులారా మీ హృదయాన్ని కాపాడడానికి మీ తల్లిదండ్రులను సహాయం చేయనివ్వండి!

ఒక ఓడ కెప్టెన్‌కు ఎదురయ్యే అత్యంత కష్టమైన సవాలు ఏమిటని మీరనుకుంటున్నారు? మహాసముద్రాన్ని దాటడమా? కానేకాదు. ఓడ ప్రమాదాలు ఎక్కువగా తీర ప్రాంతంలోనే సంభవిస్తాయి, సముద్రంలో సంభవించవు. వాస్తవానికి, విమానాన్ని నేలపై దించడం కంటే ఓడను రేవుకు తీసుకురావడమే మరింత ప్రమాదకరం. ఎందుకు?

ఒక కెప్టెన్‌ తన ఓడను సురక్షితంగా రేవుకు చేర్చాలంటే, అతను సంబంధిత ఓడరేవులో తలెత్తగల ప్రమాదాలనన్నింటినీ తప్పించాలి. అతను వేరే ఓడలను ఢీకొనకుండా ఒక ప్రక్క నుండి తప్పిస్తూ నీటి ప్రవాహపు తీరును కూడా పరిగణలోకి తీసుకోవాలి. అతను నీటి అడుగున ఉండే ఇసుక తిన్నెలను, బండరాళ్లను, శిధిలాలను కూడా తప్పించాలి. ఒకవేళ అతను ఆ రేవుకు కొత్తగా వస్తున్నట్లయితే, పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉండవచ్చు.

తెలివైన కెప్టెన్‌, ఈ సమస్యలను అధిగమించడానికి స్థానిక ఓడరేవు గురించి క్షుణ్ణంగా తెలిసిన ఒక పైలట్‌ సహాయం తీసుకోవచ్చు. ఆ పైలట్‌, కెప్టెన్‌ కేబిన్‌లో అతని ప్రక్కనే నిలబడి అనుభవపూర్వక మార్గనిర్దేశాన్ని ఇస్తాడు. వారిద్దరూ ప్రమాదాలను పరిగణలోకి తీసుకుంటూ ఎలాంటి ఇరుకు దారుల నుండైనా ఓడను రేవుకు చేరుస్తారు.

ఆ పైలట్‌ చూపించే అమూల్యమైన నైపుణ్యత, కష్టభరితమైన జీవన పరిస్థితులు అనే జలాల్లో పయనించవలసిన క్రైస్తవ యౌవనులకు అందుబాటులో ఉన్న అమూల్యమైన సహాయం గురించి స్పష్టం చేస్తోంది. ఆ సహాయం ఏమిటి? కౌమార ప్రాయులకు అది ఎందుకు అవసరం?

మనం ఆ ఓడ ఉదాహరణనే ఇంకాసేపు పరిశీలిద్దాం. మీరు కౌమార దశలో ఉంటే, మీరు ఓడ కెప్టెన్‌లాగే ఉంటారు, ఎందుకంటే చివరకు మీరే మీ జీవిత బాధ్యతను చేపట్టవలసి ఉంటుంది. మీ తల్లిదండ్రులు, మీకు ఎదురయ్యే అత్యంత కష్టభరితమైన జీవన పరిస్థితుల్లో నుండి మిమ్మల్ని నడిపించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఆ ఓడలో ఉన్న పైలెట్‌ పాత్ర పోషిస్తారు. అయితే కౌమార ప్రాయంలో, మీ తల్లిదండ్రులు ఇచ్చే సలహాను అంగీకరించడం మీకు కష్టంగా అనిపించవచ్చు. ఎందుకలా అనిపించవచ్చు?

ఇది ఎక్కువగా హృదయానికి సంబంధించిన సమస్య. మీ అలంకారార్థ హృదయం, వద్దన్న దానిని కోరేందుకు లేదా స్వేచ్ఛకు భంగం కలిగిస్తుందన్న దానికి అసమ్మతి తెలిపేందుకు మిమ్మల్ని ప్రేరేపించవచ్చు. “నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది” అని బైబిలు చెబుతోంది. (ఆదికాండము 8:​21) భవిష్యత్తులో మీకు నిజమైన సవాలుందని యెహోవా స్పష్టం చేస్తున్నాడు. “హృదయము అన్నిటికంటె మోసకరమైనది” అని ఆయన హెచ్చరిస్తున్నాడు. (యిర్మీయా 17:⁠9) హృదయం చెడు కోరికలకు నెలవుగా ఉండడమే కాక, ఒక యౌవనుడు తన తల్లిదండ్రులకు ఎక్కువ అనుభవం ఉన్నప్పటికీ, వారికంటే తనకే ఎక్కువ తెలుసని తలంచేలా చేయగలదు. అయితే, కష్టభరితమైన కౌమార దశను ఈదుకు రావడానికి, తల్లిదండ్రుల సహాయం కోసం అర్థించేందుకు మీకు తగిన కారణాలున్నాయి.

మీ తల్లిదండ్రుల మాట ఎందుకు వినాలి?

అన్నిటికంటే మిన్నగా, కుటుంబాన్ని ఆరంభించిన యెహోవా, మీరు మీ తల్లిదండ్రుల మాట వినాలని చెబుతున్నాడు. (ఎఫెసీయులు 3:​15) మిమ్మల్ని చూసుకునే బాధ్యతను దేవుడు మీ తల్లిదండ్రులకు అప్పగించాడు కాబట్టి, ఆయన మీకు ఈ సలహా ఇస్తున్నాడు: “పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధేయులైయుండుడి; ఇది ధర్మమే.” (ఎఫెసీయులు 6:1-3; కీర్తన 78:⁠5) ఇప్పుడు మీరు కౌమార దశలో ఉన్నప్పటికీ, మిమ్మల్ని నడిపించే బాధ్యత మీ తల్లిదండ్రులపైనే ఉంది, వారి మాట వినే బాధ్యత మీపై ఉంది. అపొస్తలుడైన పౌలు, పిల్లలు తమ తల్లిదండ్రుల మాట వినాలని వ్రాసినప్పుడు, ఆయన ఏ వయస్సు పిల్లలకైనా వర్తించగల గ్రీకు పదాన్ని ఉపయోగించాడు. ఉదాహరణకు, మత్తయి 23:27లో నమోదు చేయబడినట్లుగా, యెరూషలేము నివాసుల్లో అత్యధికులు పెద్దవారే అయినప్పటికీ, యేసు వారిని “పిల్లలు” అనే సంబోధించాడు.

పూర్వకాలపు విశ్వాస పురుషుల్లో చాలామంది, యుక్త వయస్కులైన తర్వాత కూడా అనేక సంవత్సరాలు తమ తల్లిదండ్రుల మాట విన్నారు. యాకోబు పెరిగి పెద్దవాడైనప్పటికీ, యెహోవా ఆరాధకురాలు కాని స్త్రీని వివాహం చేసుకోవద్దనే తన తండ్రి మాట వినాలని అర్థం చేసుకున్నాడు. (ఆదికాండము 28:​1, 2) కనానీయ స్త్రీలను వివాహం చేసుకోవాలనే తన అన్న నిర్ణయం, తన తల్లిదండ్రులకు ఎంతో బాధ కలిగించిందని కూడా యాకోబు గమనించాడు.​—⁠ఆదికాండము 27:​46.

మీ క్రైస్తవ తల్లిదండ్రులు, మిమ్మల్ని నడిపించడానికి దేవుడు తమకు అప్పగించిన పని చేస్తూనే, మీకు అత్యంత అర్హతగల సలహాదారులుగా కూడా ఉంటారు. ప్రాథమికంగా ఇలా ఎందుకంటే, వారికి మీ గురించి బాగా తెలియడమే కాక, అనేక సంవత్సరాల నుండి వారు మీ పట్ల నిస్వార్థమైన ప్రేమ చూపించారు. ఓడ పైలట్‌లా వారు తమ అనుభవంతో మాట్లాడతారు. వారు వ్యక్తిగతంగా, “యౌవనేచ్ఛలు” ఎలా ఉంటాయో అనుభవించారు. నిజ క్రైస్తవులుగా, వారు బైబిలు సూత్రాలను అనుసరించడంలోని ఔచిత్యాన్ని వ్యక్తిగతంగా చవి చూశారు.​—⁠2 తిమోతి 2:​22.

అలాంటి అనుభవసిద్ధమైన సహాయం మీకు అందుబాటులో ఉంది కాబట్టి, అత్యంత కష్టభరితమైన పరిస్థితులను సైతం మీరు విజయవంతంగా అధిగమించగలరు. ఉదాహరణకు, వ్యతిరేక లింగ వ్యక్తులతో మీ సంబంధం గురించి ఆలోచించండి. ఈ సున్నితమైన విషయంలో మీ క్రైస్తవ తల్లిదండ్రులు మీకెలాంటి నిర్దేశం ఇవ్వగలరు?

వ్యతిరేక లింగ వ్యక్తుల పట్ల ఆకర్షణ

తీరంలో నీటి అడుగున ఉండే విశాలమైన ఇసుక తిన్నెలకు దూరంగా ఉండాలని పైలట్‌లు ఓడ కెప్టెన్‌కు చెబుతారు. ఇసుక తిన్నెలు మెత్తగానే ఉంటాయి కానీ అవి మోసకరమైనవి, ఎందుకంటే అవి ఎల్లప్పుడూ ఒక చోట నుండి మరో చోటకు మారుతుంటాయి. అదేవిధంగా మీ తల్లిదండ్రులు, మిమ్మల్ని భావావేశపు ఉరిలో చిక్కుకునే పరిస్థితులకు దూరంగా ఉంచాలని కోరుకుంటారు. ఉదాహరణకు, వ్యతిరేక లింగ వ్యక్తికి కలిగే భావాలు ప్రగాఢంగా, వర్ణించలేని విధంగా ఉంటాయని మీ తల్లిదండ్రులకు తెలుసు. అయితే ఆ భావాలు తీవ్రమైనప్పుడు, అవి మీరు ప్రమాదంలో కూరుకుపోయేలా చేస్తాయి.

ప్రమాదపుటంచులకు చేరుకున్న అపాయాన్ని దీనా ఉదాహరణ తెలియజేస్తోంది. బహుశా దీనాలోని కుతూహలం, సరదాగా గడపాలనే కోరికే, నైతికత విషయాల్లో విపరీత ధోరణిగల కనాను యువతుల సహవాసాన్ని ఇష్టపడేలా ఆమెను పురికొల్పి ఉండవచ్చు. మొదట ప్రమాదమేమీ లేనట్లు అనిపించిన సరదా, త్వరలోనే విషాదకరమైన అనుభవానికి, అంటే ఆ పట్టణపు ‘వారందరిలో ఘనుడైన’ యౌవనుడు ఆమెను బలాత్కరించే దుస్థితికి దారి తీసింది.​—⁠ఆదికాండము 34:​1, 2, 19.

అలాంటి ప్రమాదాలు, మనం జీవిస్తున్న లైంగికవాదపు కాలాల్లో మరింత తీవ్రమయ్యాయి. (హోషేయ 5:⁠4) వ్యతిరేక లింగ వ్యక్తులతో సరదాగా గడపడం అత్యంత ఉత్తేజకరమైన విషయం అనే భావాన్ని చాలామంది యౌవనులు వ్యక్తం చేస్తుండవచ్చు. మిమ్మల్ని భౌతికంగా ఆకర్షించిన వ్యక్తితో ఒంటరిగా గడపాలనే తలంపుతో మీ హృదయం ఉరకలు వేస్తుండవచ్చు. అయితే ప్రేమగల తల్లిదండ్రులు, దేవుని ప్రమాణాల పట్ల గౌరవం లేని యౌవనులతో సాంగత్యం చేయకుండా మిమ్మల్ని కాపాడేందుకు ప్రయత్నిస్తారు.

కుతూహలం, కౌమార ప్రాయంలో ఉన్నవారికి గుడ్డితనం కలిగించి ప్రమాదంలో పడవేస్తుందని లోర అనే అమ్మాయి అంగీకరిస్తోంది. “నా తరగతిలోని అమ్మాయిలు, ఆకర్షణీయంగా ఉన్న కొందరు యువకులతో రాత్రి పొద్దుపోయే వరకు తాము నాట్యం చేశామని నాతో చెబుతూ అదొక మరువలేని అనుభూతి అన్నట్లుగా మాట్లాడారు. వాళ్ళు ఎప్పుడూ గోరంతలు కొండంతలు చేసి చెబుతారని నాకు తెలుసు. అయినప్పటికీ, నాలో కుతూహలం పెరిగింది, నేను చాలా నష్టపోతున్నాను అనిపించింది. నా తల్లిదండ్రులు, నన్ను అలాంటి చోట్లకు వెళ్ళనివ్వకపోవడం సరైనదేనని నాకు తెలిసినా, నేను ఆకర్షణకు లోనవుతున్నట్లే అనిపించింది.”

ఓడకు బ్రేకులు ఉండవు, కాబట్టి అది ఆగడానికి చాలా సమయం తీసుకుంటుంది. మోహం ఆ విధంగానే ఉంటుందని తల్లిదండ్రులకు తెలుసు. సామెతల గ్రంథం, హద్దుల్లేని మోహంతో పురికొల్పబడిన వ్యక్తిని వధకు తీసుకెళ్ళబడే ఎద్దుతో పోలుస్తోంది. (సామెతలు 7:​21-23) మీరు అలాంటి పరిస్థితికి గురై భావోద్రేకంగా, ఆధ్యాత్మికంగా బ్రద్దలు కావాలని ఎట్టి పరిస్థితిలోనూ కోరుకోరు. ఈ విషయంలో మీ హృదయం మిమ్మల్ని తప్పుదోవ పట్టించడాన్ని మీ తల్లిదండ్రులు గుర్తించి, తదనుగుణంగా మీకు సలహా ఇవ్వవచ్చు. వారి మాటవిని, ప్రమాదం తప్పించుకునే విజ్ఞత మీకుందా?​—⁠సామెతలు 1:⁠8; 27:​12.

తోటివారి ఒత్తిడి తట్టుకోవడానికి కూడా మీకు మీ తల్లిదండ్రుల సహాయం అవసరం. వాళ్లు మీకు ఎలా సహాయం చేస్తారు?

మీ తోటివారి బలమైన ప్రభావం

బలమైన అల లేదా ప్రవాహపు వేగం ఓడను దారి మళ్ళిస్తుంది. ఆ తాకిడిని అదుపు చేయాలంటే ఓడను మరో దిశకు నడిపించాలి. అదే విధంగా, ఇతర యౌవనుల బలమైన ప్రభావాన్ని అదుపు చేయడానికి ఏ చర్యలూ తీసుకోకపోతే, అది మిమ్మల్ని ఆధ్యాత్మిక మార్గం నుండి పక్కకు నెట్టివేస్తుంది.

దీనా అనుభవం వివరిస్తున్నట్లుగా, “బుద్ధిహీనులను నీ స్నేహితులుగా నీవు ఎంచుకొంటే అప్పుడు నీవు కష్టాల్లో పడతావు.” (సామెతలు 13:​20, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) బైబిల్లో “బుద్ధిహీనుడు” అనే మాట, యెహోవాను ఎరుగని లేదా ఆయన మార్గాల్లో నడవడానికి ఇష్టపడని వ్యక్తిని సూచిస్తుందని గుర్తుంచుకోండి.

అయితే, మీ తోటి విద్యార్థుల దృక్కోణాలను లేదా అలవాట్లను తిరస్కరించడం అంత సులభం కాకపోవచ్చు. మేరీ హోసే ఇలా వివరిస్తోంది: “నన్ను ఇతర యౌవనులు చేర్చుకోవాలని కోరుకున్నాను. నేను వారికంటే భిన్నంగా ఉండే వ్యక్తిననే తలంపు వారికి కలిగించకూడదని అనుకున్నాను కాబట్టి, నేను సాధ్యమైనంత వరకు వాళ్ళనే అనుకరించాను.” మీకు తెలియకుండానే మీరు మీ తోటి వారి ఒత్తిడికి గురి కావచ్చు, అంటే మీరు సంగీతాన్ని ఎంచుకునే విషయంలో, ఎలాంటి దుస్తులు ధరించాలనే విషయంలో, చివరకు మీరెలా మాట్లాడాలనే విషయంలో కూడా వారి ప్రభావం మీపై ఉండవచ్చు. బహుశా మీరు మీ తోటివారితో హాయిగా ఉంటున్నట్లు భావించవచ్చు. అది సహజమే, కానీ వినాశకరం కాగల వారి బలమైన ప్రభావం, మిమ్మల్ని ప్రమాదపుటంచులకు తీసుకెళుతుంది.​—⁠సామెతలు 1:​10-16.

కారోలిన్‌ కొన్ని సంవత్సరాల క్రితం ఎదుర్కొన్న కష్టాన్ని ఇలా గుర్తు చేసుకుంటోంది: “నేను స్నేహం చేసిన బాలికల్లో చాలామందికి 13 సంవత్సరాల వయస్సులోనే మగ స్నేహితులు ఉండేవారు. వారిని అనుసరించాలనే ఒత్తిడి, చాలా సంవత్సరాల వరకు నాపై బలంగా ఉండేది. అయితే మా అమ్మ నేను ఈ క్లిష్ట పరిస్థితికి దూరంగా ఉండేలా నన్ను నడిపించింది. నేను చెప్పేది వినడానికి, నాతో తర్కించడానికి, నేను పరిణతి సాధించేంత వరకు అలాంటి సంబంధాలను వాయిదా వేయవలసిన అవసరాన్ని నేను అర్థం చేసుకొనేలా సహాయం చేయడానికి ఆమె నాతో అనేక గంటలు గడిపింది.”

కారోలిన్‌ వాళ్ళ అమ్మలాగే, మీ తల్లిదండ్రులు కూడా తోటివారి ఒత్తిడి గురించి లేదా కొన్ని రకాల కార్యక్రమాల విషయంలో లేదా కొంతమంది స్నేహితుల విషయంలో సైతం హద్దులు పెడుతూ మిమ్మల్ని హెచ్చరించే బాధ్యత తమకుందని భావించవచ్చు. నాథన్‌ అలాంటి విషయాల్లో తన తల్లిదండ్రులతో చాలాసార్లు గొడవ పడడాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. “నా స్నేహితులు అనేకసార్లు తమతో రమ్మని నన్ను ఆహ్వానించారు, అయితే నా తల్లితండ్రులు నేను అలాంటి పెద్ద గుంపులతో వెళ్ళి సమయం గడపడాన్ని లేదా పర్యవేక్షణ లేని పార్టీలకు వెళ్ళడాన్ని ఒప్పుకునే వారు కాదు. మా అమ్మానాన్నలకంటే వేరే పిల్లల తల్లిదండ్రులు ఎందుకు ఎక్కువ స్వేచ్ఛను ఇచ్చేవారో నేను ఆ సమయంలో అర్థం చేసుకోలేకపోయాను.”.

అయితే ఆ తర్వాత, నాథన్‌ విషయాన్ని అర్థం చేసుకున్నాడు. “‘బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుట్టినట్లే’ నా విషయంలోనూ జరిగింది. కుర్రాళ్ళు గుంపులుగా బయట సమయం గడిపినప్పుడు ఈ మూఢత్వం సులభంగా బయటపడుతున్నట్లు అనిపిస్తుంది. ఒకడు చెడ్డదేదో మొదలు పెడతాడు, మరొకడు దానిని కాస్త ఎక్కువ చేస్తాడు, మూడవ వ్యక్తి ఇంకా ఎక్కువ చేస్తాడు. వెంటనే మిగతా వాళ్ళందరూ దానిలో పాల్గొనేలా ప్రేరేపించబడతారు. యెహోవాను సేవిస్తున్నామని చెప్పుకునే యౌవనులు సైతం, ఆ ఉచ్చులో చిక్కుకుపోవచ్చు” అని ఆయన ఒప్పుకున్నాడు.​—⁠సామెతలు 22:​15.

నాథన్‌, మేరీ హోసేలు ఇద్దరూ తమ తోటివారు ప్రతిపాదించిన చేసిన పనులను చేయడానికి తమ తల్లిదండ్రులు ఒప్పుకోనప్పుడు తమ హృదయాలతో ఘర్షణపడ్డారు. అయితే వారు తమ తల్లిదండ్రుల మాట విన్నారు, అలా విన్నందుకు వారు తర్వాత చాలా సంతోషించారు. ఒక సామెత ఇలా చెబుతోంది: “చెవి యొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకింపుము నేను కలుగజేయు తెలివిని పొందుటకు మనస్సు నిమ్ము.”​—⁠సామెతలు 22:​17.

సన్మానానికి అర్హులు

ఒక ప్రక్కకు ఒరిగిన ఓడను నడిపించడం కష్టం, అది ఎక్కువగా ఒరిగితే సులభంగా తలక్రిందులవుతుంది. మన అసంపూర్ణత కారణంగా మనమందరం స్వార్థపరమైన, నిషేధితమైన వాటివైపు మొగ్గుచూపుతాం. ఈ స్వభావాలు ఉన్నప్పటికీ, యౌవనులు తమ తల్లిదండ్రుల మార్గనిర్దేశాన్ని జాగ్రత్తగా పాటిస్తే, రేవును చేరుకోవచ్చు.

ఉదాహరణకు, జీవానికి నడిపించే ఇరుకు మార్గానికీ, నాశనానికి నడిపించే విశాల మార్గానికీ మధ్య మరో మార్గం ఉందనే ఆలోచనను తిరస్కరించేందుకు మీ తల్లిదండ్రులు మీకు సహాయం చేయగలరు. (మత్తయి 7:​13, 14) మింగకుండా కేవలం “రుచి” చూడవచ్చనే తలంపు ఎంత అవాస్తవికమో, పూర్తిగా చెడులో మునిగిపోకుండా కాస్తంత అనుభవించవచ్చు అనే తలంపు కూడా అంతే అవాస్తవికం. అలాంటి స్వభావాన్ని అనుసరించేవారు “రెండు తలంపుల మధ్య తడబడు[చున్న]” వారిగా అంటే యెహోవాను కొంతవరకు సేవిస్తూ అదే సమయంలో లోకాన్ని, లోకంలో ఉన్నవాటిని ప్రేమిస్తున్న వాళ్ళలా ఉంటారు, అలాంటి వాళ్ళు సులభంగా, ఆధ్యాత్మికంగా తలక్రిందులయ్యే ప్రమాదముంది. (1 రాజులు 18:21; 1 యోహాను 2:​15) అలా ఎందుకు జరుగుతుంది? మన పాపభరిత స్వభావాల వల్లనే అలా జరుగుతుంది.

మనం అపరిపూర్ణ కోరికలకు తావిస్తే అవి మరింత బలపడతాయి. ‘మోసకరమైన’ మన హృదయం కేవలం రుచి చూడడంతో సరిపెట్టుకోదు. అది ఇంకా కావాలని పట్టుబడుతుంది. (యిర్మీయా 17:⁠9) మనం ఆధ్యాత్మికంగా కొట్టుకు పోవడం ఆరంభమైతే, లోకం మనపై అంతకంతకు ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. (హెబ్రీయులు 2:⁠1) మీరు ఆధ్యాత్మికంగా ఒక పక్కకు ఒరిగి పోతున్నట్లు, మీకు తెలియకపోవచ్చేమో గానీ మీ క్రైస్తవ తల్లిదండ్రులకు మాత్రం తెలుస్తుంది. వాళ్ళు మీరు నేర్చుకున్నంత వేగంగా కంప్యూటర్‌ గురించి నేర్చుకోలేక పోవచ్చు, కానీ చపలచిత్తమైన హృదయం గురించి వారికి మీకంటే బాగా తెలుసు. వారు మీకు జీవాన్నిచ్చే ‘త్రోవల్లో మీ హృదయాన్ని నడిపించుకోవడానికి’ సహాయం చేయాలని కోరుకుంటారు.​—⁠సామెతలు 23:​19.

సంగీతం, వినోదం, కేశాలంకరణ వంటి కష్ట భరితమైన రంగాల్లో మీకు మార్గనిర్దేశం ఇవ్వాల్సి వచ్చినప్పుడు, మీ తల్లిదండ్రులు విషయాలను పరిపూర్ణంగా అంచనా వేస్తారని ఆశించకండి. వారికి సొలొమోనుకు ఉన్నంత జ్ఞానం లేదా యోబుకు ఉన్నంత ఓపిక ఉండకపోవచ్చు. ఓడ పైలట్‌లాగే వారు కొన్నిసార్లు అతి జాగ్రత్త ప్రదర్శించవచ్చు. అయినప్పటికీ, మీరు ‘మీ తండ్రి ఉపదేశాన్ని, మీ తల్లి బోధను’ శ్రద్ధగా వింటే వారిచ్చే మార్గనిర్దేశం అమూల్యమైనదని రుజువవుతుంది.​—⁠సామెతలు 1:⁠8, 9.

ఇతర యౌవనులు తమ తల్లిదండ్రులను కించపరుస్తూ మాట్లాడుతుండవచ్చు. కానీ మీ తల్లిదండ్రులు లేఖనాలను అనుసరించడానికి కృషి చేస్తున్నప్పుడు, వారు అన్ని రకాల వాతావరణాల్లో, అన్ని సమయాల్లో, అన్ని విపత్తుల్లో మీ పక్కనే ఉంటారు. ఓడ కెప్టెన్‌కు అనుభవజ్ఞుడైన పైలట్‌ సలహా అవసరమైనట్లే, జ్ఞానయుక్తమైన మార్గంలో నడవడానికి మీకు మీ తల్లిదండ్రుల మార్గనిర్దేశం అవసరం అవుతుంది. తత్ఫలితంగా అమూల్యమైన ప్రతిఫలాలు లభిస్తాయి.

“జ్ఞానము నీ హృదయమున జొచ్చును తెలివి నీకు మనోహరముగా నుండును బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలికాయును. అది దుష్టుల మార్గమునుండియు మూర్ఖముగా మాటలాడువారి చేతిలోనుండియు నిన్ను రక్షించును. . . . యథార్థవంతులు దేశమందు నివసించుదురు లోపములేనివారు దానిలో నిలిచియుందురు.”​—⁠సామెతలు 2:​10-12, 21.

[22వ పేజీలోని చిత్రం]

ఇతర యౌవనుల ప్రభావం మిమ్మల్ని ఆధ్యాత్మిక మార్గం నుండి ప్రక్కకు నెట్టివేయగలదు

[23వ పేజీలోని చిత్రం]

దీనా అనుభవాన్ని గుర్తుపెట్టుకోండి

[24వ పేజీలోని చిత్రం]

ఒక ఓడ కెప్టెన్‌ అనుభవజ్ఞుడైన పైలట్‌ సలహా తీసుకున్నట్లే, యౌవనులు తమ తల్లిదండ్రుల మార్గనిర్దేశాన్ని తీసుకోవాలి

[24వ పేజీలోని చిత్రసౌజన్యం]

ఫోటో: www.comstock.com