ఈ కాలానికి తగిన నాయకుడు ఎవరు?
ఈ కాలానికి తగిన నాయకుడు ఎవరు?
1940లో బ్రిటీష్ పార్లమెంట్‌లో నాయకత్వానికి సంబంధించి వివాదం తలెత్తింది. అక్కడ జరిగిన చర్చను డెబ్భై ఏడు సంవత్సరాల డేవిడ్ లాయిడ్ జార్జ్ విన్నాడు. ఆయన మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ విజయం సాధించేలా చేశాడు, అంతేగాక రాజకీయాల్లో ఆయనకున్న అనేక సంవత్సరాల అనుభవంవల్ల ఆయన ఉన్నతాధికారుల పనిని జాగ్రత్తగా విశ్లేషించగలిగేవాడు. మే 8న కామన్స్ సభలో ఇచ్చిన ప్రసంగంలో ఆయన ఇలా అన్నాడు: “మంచి నాయకత్వం ఉన్నంతకాలం, ప్రభుత్వం తన లక్ష్యాలేమిటో స్పష్టంగా చూపించినంతకాలం, నాయకత్వం వహిస్తున్న వ్యక్తులు తమకు సాధ్యమైనదంతా చేస్తున్నారనే నమ్మకం ఉన్నంతకాలం దేశం ఏ త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉంటుంది.”
తమ నాయకులు సామర్థ్యంగలవారిగా ఉండాలని, పరిస్థితులను మెరుగుపరచడానికి యథార్థంగా ప్రయత్నించాలని ప్రజలు కోరుకుంటున్నారని లాయిడ్ జార్జ్ మాటలు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఎన్నికల కోసం ప్రచారం చేసే ఒక స్త్రీ ఇలా చెప్పింది: “ప్రజలు ఒక దేశాధ్యక్షునికి ఓటు వేసినప్పుడు, వాళ్ళు తమ జీవితాలను, భవిష్యత్తును, పిల్లలను ఆ వ్యక్తికి అప్పగిస్తున్నట్లు చూపిస్తున్నారు.” అంతటి నమ్మకాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద పని. ఎందుకు?
మన ప్రపంచం పరిష్కరించడానికి అసాధ్యంగా కనిపిస్తున్న సమస్యలతో నిండివుంది. ఉదాహరణకు నేరాలను, యుద్ధాలను నిర్మూలించడానికి కావలసినంత జ్ఞానం, శక్తి తనకు ఉన్నాయని ఏ నాయకుడు నిరూపించుకున్నాడు? ప్రతి మనిషికి ఆహారం, శుభ్రమైన నీరు, ఆరోగ్య సంరక్షణ ఏర్పాటు చేయడానికి కావలసిన వనరులు, ప్రజలపట్ల కనికరం నేటి నాయకుల్లో ఎవరికి ఉన్నాయి? వాతావరణాన్ని కాపాడడానికి, దానిని పూర్వస్థితికి తీసుకురావడానికి కావలసిన జ్ఞానం, పట్టుదల ఎవరికి ఉన్నాయి? మానవజాతి అంతా సుదీర్ఘమైన సంతోషకరమైన జీవితం జీవించేలా నిశ్చయపరచే సామర్థ్యం, శక్తి ఎవరికి ఉన్నాయి?
మానవులు చేయలేరు
కొంతమంది నాయకులు కొంత విజయాన్ని సాధించారన్నది నిజమే. అయితే వాళ్ళు మహా అయితే కొన్ని దశాబ్దాలు పని చేయగలరు, ఆ తర్వాత ఎవరు వస్తారు? జీవించినవారిలోకెల్లా అత్యంత సమర్థుడైన నాయకుడు ప్రాచీన ఇశ్రాయేలుకు చెందిన సొలొమోను రాజు ఆ ప్రశ్న గురించి ఆలోచించాడు. ఆయన చివరికిలా తేల్చి చెప్పాడు: “సూర్యునిక్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటిని నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలెనని తెలిసికొని నేను వాటియందు అసహ్యపడితిని. వాడు జ్ఞానము ప్రసంగి 2:18, 19.
గలవాడై యుండునో బుద్ధిహీనుడై యుండునో అది ఎవనికి తెలియును? అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానముచేత సంపాదించుకొన్న నా కష్టఫలమంతటి మీదను వాడు అధికారియై యుండును; ఇదియును వ్యర్థమే.”—తన తర్వాత వచ్చే వ్యక్తి తాను చేసిన మంచి పనులను కొనసాగిస్తాడా లేదా మొత్తం నాశనం చేస్తాడా అనే విషయం సొలొమోనుకు తెలియదు. పాత పరిపాలకుల స్థానాన్ని కొత్త పరిపాలకులు తీసుకోవడం సొలొమోనుకు “వ్యర్థం”గా అనిపించింది. ఇతర బైబిలు అనువాదాలు దానిని “పనికిమాలినది,” లేదా “అర్థంలేనిది” అని అనువదించాయి. ఒక అనువాదం, “అది నిష్ప్రయోజనమైనది” అని చెబుతోంది.
కొన్నిసార్లు పరిపాలకులను మార్చడానికి దౌర్జన్యమే సాధనంగా ఉపయోగించబడుతుంది. సమర్థులైన నాయకులు అధికారంలో ఉండగా చంపబడ్డారు. ఎంతో గౌరవించబడే అమెరికా అధ్యక్షుడు అబ్రహామ్ లింకన్ ఒకసారి ప్రేక్షకులతో ఇలా అన్నాడు: “కొంతకాలం వరకూ ఒక ప్రాముఖ్యమైన పదవిలో ఉండడానికి నేను ఎన్నుకోబడ్డాను, ఇప్పుడు నాకు ఎంతో అధికారం ఇవ్వబడింది, కానీ త్వరలోనే ఆ అధికారం నాకు ఉండదు.” ఆయన నిజంగానే కొంతకాలంపాటు మాత్రమే అధికారంలో ఉన్నాడు. రాష్ట్రపతిగా లింకన్ ఎంతో మంచి చేశాడు, ప్రజలకు ఇంకా ఎంతో చేయాలని కోరుకున్నాడు, అయినా కూడా ఆయన కేవలం నాలుగు సంవత్సరాలే తన దేశాన్ని నడిపించగలిగాడు. ఆయన తన పదవికి రెండవసారి ఎన్నుకోబడినప్పుడు, నాయకత్వంలో మార్పు కావాలని కోరుకున్న ఒక వ్యక్తి ఆయనను హతమార్చాడు.
ఉత్తమమైన మానవ నాయకులు కూడా తమ స్వంత భవిష్యత్తుకే హామీ ఇవ్వలేరు. అలాంటప్పుడు వాళ్ళు మీ భవిష్యత్తుకు హామీ ఇస్తారని నమ్మకం ఉంచవచ్చా? అందుకే బైబిలు ఇలా చెబుతోంది: “రాజులచేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి వారి ప్రాణము వెడలిపోవును వారు మంటిపాలగుదురు వారి సంకల్పములు నాడే నశించును.” బైంగ్టన్ అనువాదం నాలుగవ వచనంలోని చివరి భాగాన్ని ఇలా అనువదించింది: “ఆ రోజునే అతని మంచి ఉద్దేశాలన్నీ నశించిపోతాయి.”—కీర్తన 146:3, 4.
మానవ నాయకులపై నమ్మకం ఉంచవద్దనే సలహాను అంగీకరించడం కష్టంగా ఉండవచ్చు. అయితే మానవజాతికి మంచి, స్థిరమైన నాయకత్వం ఎన్నటికీ లభించదు అని బైబిలు చెప్పడం లేదు. “ఆలకించుడి, రాజు నీతినిబట్టి రాజ్యపరిపాలన చేయును” అని యెషయా 32:1 చెబుతోంది. మానవుని సృష్టికర్త అయిన యెహోవా దేవుడు ఒక “రాజు”ను అంటే ఒక నాయకుడిని సిద్ధం చేశాడు, ఆయన త్వరలోనే భూమికి సంబంధించిన వ్యవహారాలను తన ఆధీనంలోకి తీసుకుంటాడు. ఆయన ఎవరు? బైబిలు ప్రవచనం ఆయనను గుర్తించింది.
నాయకత్వం వహించడానికి నిజంగా అర్హుడైనవాడు
రెండు వేల సంవత్సరాల క్రితం ఒక దూత, మరియ అనే యూదురాలైన యువతికి ఇలా చెప్పాడు: “ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు; ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండును.” (లూకా 1:31-33) అవును నజరేతువాడైన యేసు బైబిలు ప్రవచించిన రాజు.
మతసంబంధమైన చిత్రాల్లో యేసు తరచూ ఒక శిశువుగా, పోషకాహారంలేని బలహీనమైన వ్యక్తిగా, తనకు ఏమి జరిగినా భరించే సన్యాసిగా చిత్రించబడతాడు. ఈ చిత్రాలు ఒక పరిపాలకునిగా ఆయనపై నమ్మకాన్ని కలిగించవు. అయితే బైబిల్లోని నిజమైన యేసు పెరిగి బలమైన, పరిణతి చెందిన వ్యక్తిగా ఉత్సాహంతో, ఉద్దేశాలతో నిండిన వ్యక్తిగా తయారయ్యాడు. అంతేకాక ఆయన నాయకుడిగా ఉండడానికి అర్హుణ్ణి చేసే ఇతర లక్షణాలను కూడా పెంపొందించుకున్నాడు. (లూకా 2:52) ఆయన అద్భుతమైన వ్యక్తిత్వంలోని కొన్ని అంశాలు క్రింద ఇవ్వబడ్డాయి.
యేసు పరిపూర్ణమైన యథార్థతను కాపాడుకున్నాడు. ఆయన ఎంత నిజాయితీపరుడైన నీతిమంతుడైన వ్యక్తి అంటే, తాను తప్పు చేసినట్లు నిరూపించమని తన శత్రువులను బహిరంగంగా సవాలు చేశాడు. కానీ వాళ్ళు అలా నిరూపించలేకపోయారు. (యోహాను 8:46) ఆయన నిష్కపటమైన బోధలు, ఎంతోమంది యథార్థమైన ప్రజలు తన శిష్యులయ్యేలా వారిని ఒప్పింపజేశాయి.—యోహాను 7:46; 8:28-30; 12:19.
యేసు తనను తాను సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నాడు. దేవుడు తనకు నియమించిన పనిని పూర్తిచేయాలని ఆయన ఎంత దృఢంగా తీర్మానించుకున్నాడంటే ఏ వ్యతిరేకి కూడా, అది మానవుడైనా లేదా దయ్యమైనా, ఆయనను అడ్డుకోలేకపోయారు. దౌర్జన్యపూరితమైన దాడులు ఆయనను భయపెట్టలేదు. (లూకా 4:28-30) అలసట, ఆకలి ఆయనను నిరుత్సాహపరచలేదు. (యోహాను 4:5-16, 31-34) ఆయన స్నేహితులు ఆయనను విడిచిపెట్టినప్పటికీ ఆయన తన లక్ష్యంనుండి పక్కకు మళ్ళలేదు.—మత్తయి 26:55, 56; యోహాను 18:3-9.
యేసుకు ప్రజలపట్ల ఎంతో శ్రద్ధ ఉండేది. ఆయన ఆకలితోవున్న ప్రజలకు ఆహారం పెట్టాడు. (యోహాను 6:10, 11) కృంగినవారికి ఓదార్పునిచ్చాడు. (లూకా 7:11-15) స్వస్థత అవసరమైనవారికి చూపును, వినికిడిని, ఆరోగ్యాన్ని దయచేశాడు. (మత్తయి 12:22; లూకా 8:43-48; యోహాను 9:1-6) ఎంతో కష్టపడి పనిచేసే తన అపొస్తలులను ప్రోత్సహించాడు. (యోహాను 13-17 అధ్యాయాలు) తాను తన గొర్రెలపట్ల శ్రద్ధగల “మంచి కాపరి”నని ఆయన నిరూపించుకున్నాడు.—యోహాను 10:11-14.
యేసు పనిచేయడానికి సుముఖత చూపించాడు. తన అపొస్తలులకు ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని నేర్పించడానికి ఆయన వాళ్ళ కాళ్ళు కడిగాడు. (యోహాను 13:4-15) ఆయన ఇశ్రాయేలులో దుమ్మునిండిన మట్టి రోడ్లపై ప్రయాణించి సువార్తను ప్రకటించాడు. (లూకా 8:1) తాను “ఏకాంతముగా అరణ్య ప్రదేశము”లో విశ్రాంతి తీసుకోవాలి అనుకున్నప్పటికీ జనసమూహాలు మరింత ఉపదేశం కోసం ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన వాళ్ళకు బోధించాడు. (మార్కు 6:30-34) ఆ విధంగా ఆయన కష్టపడి పనిచేసే విషయంలో క్రైస్తవులందరికీ మాదిరినుంచాడు.—1 యోహాను 2:5.
యేసు తన నియామకాన్ని పూర్తిచేసి భూమిని విడిచి వెళ్ళిపోయాడు. ఆయన నమ్మకస్థుడిగా ఉన్నందుకు ప్రతిఫలంగా యెహోవా దేవుడు ఆయనను రాజుగా చేసి పరలోకంలో అమర్త్యతను అనుగ్రహించాడు. పునరుత్థానం చేయబడిన యేసు గురించి బైబిలు ఇలా చెబుతోంది: ‘మృతులలోనుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడు, మరణమునకు ఇక ఆయనమీద ప్రభుత్వము లేదు.’ (రోమీయులు 6:8) ఆయన మానవజాతికి అత్యంత ఉత్తమమైన నాయకుడిగా ఉంటాడని మీరు నిశ్చయత కలిగి ఉండవచ్చు. యేసు భూమిని తన అధికారంలోకి తీసుకున్న తర్వాత, ఇంకొకరికి అధికారం ఇవ్వవలసిన అవసరం గానీ, నాయకత్వం మార్చవలసిన అవసరం గానీ ఉండదు. ఆయన అధికారంలో ఉండగా ఆయనను ఎవ్వరూ హతమార్చరు, ఆయన తర్వాత వచ్చే అసమర్థుడివల్ల ఆయన చేసిన పనంతా నాశనమవుతుందని చింతించవలసిన అవసరంలేదు. అయితే ఆయన మానవజాతి ప్రయోజనార్థం ఏమి చేస్తాడు?
ఈ కొత్త నాయకుడు చేసే పనులు
ఈ పరిపూర్ణమైన, అమర్త్యమైన నాయకుడు ఎలా పరిపాలిస్తాడు అనే విషయం గురించి కీర్తన 72 మనకు కొన్ని ప్రవచనాత్మకమైన వివరాలను ఇస్తోంది. 7, 8 వచనాల్లో మనం ఇలా చదువుతాము: “అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. చంద్రుడు లేకపోవువరకు క్షేమాభివృద్ధి కలుగును. సముద్రమునుండి సముద్రమువరకు యూఫ్రటీసునది మొదలుకొని భూదిగంతములవరకు అతడు రాజ్యము చేయును.” మానవులకు ప్రయోజనం చేకూర్చే ఆయన పరిపాలన క్రింద భూనివాసులు నిరంతరమైన శాశ్వతమైన భద్రతను అనుభవిస్తారు. ఆయన ఇప్పుడున్న ఆయుధాలన్నింటినీ నాశనం చేసి, పోరాడాలనే కోరికను మానవుని హృదయంలోనుండి తీసివేస్తాడు. నేడు భయంకరమైన సింహాల్లా ఇతరులపై దాడి చేసే వ్యక్తులు, తమ పొరుగువారిపట్ల జగడాలమారి ఎలుగుబంట్లలా ప్రవర్తించేవారు తమ వ్యక్తిత్వాలను పూర్తిగా మార్చుకుంటారు. (యెషయా 11:1-9) శాంతి సమృద్ధిగా ఉంటుంది.
కీర్తన 72వ అధ్యాయం 12 నుండి 14 వచనాలు ఇంకా ఇలా చెబుతున్నాయి: “దరిద్రులు మొఱ్ఱపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను నిరాధారులను అతడు విడిపించును. నిరుపేదలయందును బీదలయందును అతడు కనికరించును బీదల ప్రాణములను అతడు రక్షించును. కపట బలాత్కారములనుండి అతడు వారి ప్రాణమును విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును.” రాజైన యేసుక్రీస్తు నాయకత్వంలో దీనులు, నిరుపేదలు, నిరాధారులు ఐక్యమై ఒక సంతోషకరమైన మానవ కుటుంబంలో భాగంగా ఉంటారు. వాళ్ళ జీవితాల్లో కష్టాలు బాధలకు బదులు సంతోషం ఉంటుంది.—యెషయా 35:9.
16వ వచనం ఇలా వాగ్దానం చేస్తోంది: “దేశములోను పర్వత శిఖరములమీదను సస్య సమృద్ధి కలుగును దాని పంట లెబానోను వృక్షములవలె తాండవమాడుచుండును.” నేడు భూమిపై కోట్లాదిమంది ఆకలితో అలమటిస్తున్నారు. రాజకీయాలవల్లా దురాశవల్లా అందరికి ఆహారం న్యాయంగా పంచిపెట్టబడడంలేదు, కాబట్టి ఎంతోమంది ప్రత్యేకించి పిల్లలు ఆకలితో చనిపోతున్నారు. కానీ యేసుక్రీస్తు పరిపాలన క్రింద ఆ సమస్య ఉండదు. భూమి రుచికరమైన ఆహారాన్ని సమృద్ధిగా పండిస్తుంది. మానవులందరికీ సమృద్ధిగా ఆహారం లభిస్తుంది.
మంచి నాయకత్వం ద్వారా వచ్చే ఆ ఆశీర్వాదాలను మీరు అనుభవించాలనుకుంటున్నారా? అయితే త్వరలోనే భూమిపై పరిపాలించబోయే ఆ నాయకుడి గురించి నేర్చుకొమ్మని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. మీకు సహాయం చేయడానికి యెహోవాసాక్షులు సంతోషిస్తారు. ఆ నాయకుడు మిమ్మల్ని నిరాశపరచడు ఎందుకంటే యెహోవా దేవుడు స్వయంగా తన కుమారుడి గురించి ఇలా చెప్పాడు: “నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను.”—కీర్తన 2:6.
[5వ పేజీలోని బాక్సు]
అకస్మాత్తుగా అధికారంనుండి తొలగించబడడం
ఒక నాయకుడు సహేతుకమైన మోతాదులో శాంతిభద్రతలు ఉండేలా చేస్తే తన అధికారం క్రింద ఉన్నవారు తనను గౌరవించి, తనకు మద్దతునిస్తారని ఆశించవచ్చు. అయితే ఏ కారణం చేతనైనా ప్రజలకు ఆయనపై నమ్మకం పోతే త్వరలోనే ఆయన స్థానంలో మరొకరు ఉంటారు. శక్తివంతమైన పరిపాలకులు అకస్మాత్తుగా అధికారంనుండి తీసివేయబడడానికి కారణమైన పరిస్థితుల్లో కొన్ని క్రింద ఇవ్వబడ్డాయి.
అసంతృప్తికరమైన జీవన పరిస్థితులు. 18వ శతాబ్దానికల్లా చాలామంది ఫ్రెంచి పౌరులు ఎన్నో వస్తువులపై పన్నులు కడుతూ తగినంత ఆహారం లభించక దుర్భరమైన జీవితాలు గడపాల్సి వచ్చింది. ఈ పరిస్థితులవల్ల ఫ్రెంచి విప్లవం ప్రారంభమయ్యింది, తత్ఫలితంగా 1793లో లూయిస్ XVI రాజుకు శిరచ్ఛేదం చేయబడింది.
యుద్ధం. మొదటి ప్రపంచ యుద్ధం, చరిత్రలో అత్యంత శక్తిమంతులైన కొందరు చక్రవర్తుల పరిపాలనను అంతం చేసింది. ఉదాహరణకు 1917లో యుద్ధంవల్ల రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ఆహార కొరత ఏర్పడింది, అది ఫిబ్రవరి విప్లవానికి దారి తీసింది. ఈ విప్లవం నికొలస్ II చక్రవర్తి సింహాసనంనుండి దిగిపోవడానికి కారణమయ్యింది, కమ్యూనిస్టు పరిపాలనకు నడిపించింది. 1918 నవంబరులో జర్మనీ శాంతి కావాలనుకుంది, కానీ నాయకత్వం మారితే తప్ప యుద్ధం చేయడం ఆపేదిలేదని మిత్రపక్షాలు (ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా, అమెరికా) తెగేసి చెప్పడంతో, జర్మన్ చక్రవర్తి విల్హెమ్ II నెదర్లాండ్స్‌కు పారిపోక తప్పలేదు.
వేరే ప్రభుత్వాలు కావాలనే కోరిక. 1989లో ఇనుప తెర తీసివేయబడింది. ప్రజలు కమ్యూనిజమ్‌ను తిరస్కరించి ఇతర పరిపాలనా పద్ధతులను స్థాపించినప్పుడు అప్పటివరకూ పర్వతాల్లా శక్తిమంతంగా కనిపించిన పరిపాలనా విధానాలు పతనమయ్యాయి.
[7వ పేజీలోని చిత్రాలు]
యేసు ఆకలితోవున్న వారికి ఆహారం పెట్టాడు, రోగులను స్వస్థపరిచాడు, క్రైస్తవులందరికీ చక్కని మాదిరిని ఉంచాడు
[4వ పేజీలోని చిత్రసౌజన్యం]
లాయిడ్ జార్జ్: చిత్రసౌజన్యం Kurt Hutton/Picture Post/Getty Images