కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని పరిపాలన పక్షాన ఉండాలని మేము దృఢంగా నిర్ణయించుకున్నాము

దేవుని పరిపాలన పక్షాన ఉండాలని మేము దృఢంగా నిర్ణయించుకున్నాము

జీవిత కథ

దేవుని పరిపాలన పక్షాన ఉండాలని మేము దృఢంగా నిర్ణయించుకున్నాము

మైకల్‌ జోబ్రాక్‌ చెప్పినది

ఒక నెలపాటు ఏకాంత కారాగార శిక్ష అనుభవించిన తర్వాత నన్ను ఒక విచారణాధికారి దగ్గరకి ఈడ్చుకెళ్ళారు. కొంతసేపటికే కోపంతో అతని ముఖం ఎరుపెక్కింది. “మీరు గూఢచారులు! అమెరికా గూఢచారులు!” అని అతను అరిచాడు. అతనికి అంత కోపం ఎందుకు వచ్చింది? ఎందుకంటే అంతకుముందే అతను నేను ఏ మతానికి చెందినవాడనని అడిగాడు, “నేను యెహోవాసాక్షిని” అని సమాధానం ఇచ్చాను.

అది యాభైకంటే ఎక్కువ సంవత్సరాల క్రితం జరిగింది. ఆ సమయంలో నేను నివసిస్తున్న దేశం కమ్యూనిస్టు పరిపాలన క్రింద ఉండేది. అయితే అంతకంటే ముందే మేము మా క్రైస్తవ విద్యా పనికి భయంకరమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నాము.

యుద్ధం తెచ్చిన బాధాకరమైన పర్యవసానాలను అనుభవించాము

1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు నాకు ఎనిమిది సంవత్సరాలు. ఆ సమయంలో మా గ్రామమైన జాలుజిట్స్‌, ఆస్ట్రో-హంగేరియన్‌ సామ్రాజ్యపు రాజు అధికారం క్రింద ఉండేది. యుద్ధం లోక పరిస్థితులను తలక్రిందులు చేయడమే కాకుండా నా బాల్యాన్ని కూడా మధ్యలో త్రుంచేసింది. సైనికుడైన మా నాన్న యుద్ధం ప్రారంభమైన మొదటి సంవత్సరంలోనే మరణించాడు. ఆ కారణంగా నా తల్లి, ఇద్దరు చెల్లెళ్ళు, నేను నిరుపేదలుగా మారాము. మా ఇంట్లో మగ పిల్లవాణ్ణి నేనే కాబట్టి మా చిన్న పొలానికి, ఇంటికి సంబంధించిన అనేక బాధ్యతలను నేనే నెత్తిన వేసుకోవలసి వచ్చింది. చిన్నప్పటినుంచే నాకు మతాసక్తి ఎక్కువగా ఉండేది. మా రిఫార్మ్‌డ్‌ (కాల్వనిస్టు) చర్చీ ప్రీస్టు తాను లేని సమయంలో నా తోటి విద్యార్థులకు బోధించమని కూడా నాకు చెప్పేవాడు.

1918లో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది, దానితో మేమందరం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాము. ఆస్ట్రో-హంగేరియన్‌ సామ్రాజ్యం పతనమై, మేము రిపబ్లిక్‌ ఆఫ్‌ జెకోస్లోవేకియా పౌరులమయ్యాము. అనతికాలంలోనే, మా ప్రాంతంనుండి అమెరికాకు వలస వెళ్ళిన చాలామంది తిరిగి వచ్చేశారు. వాళ్ళలో ఒకరు మైకల్‌ పెట్రిక్‌, ఆయన 1922లో మా గ్రామానికి వచ్చాడు. ఆయన మా ఇంటికి దగ్గర్లో ఉండే ఒక కుటుంబాన్ని కలవడానికి వచ్చినప్పుడు వాళ్ళు నన్ను, మా అమ్మను కూడా ఆహ్వానించారు.

దేవుని పరిపాలన మాకు వాస్తవమైనదిగా కనిపించింది

మైకల్‌ ఒక బైబిలు విద్యార్థి, అప్పట్లో యెహోవాసాక్షులు అలా పిలువబడేవారు. ఆయన నా ఆసక్తిని రేకెత్తించిన ప్రాముఖ్యమైన బైబిలు అంశాల గురించి మాట్లాడాడు. వాటిలో అన్నింటికంటే ప్రాముఖ్యమైనది రాబోయే యెహోవా రాజ్యాన్ని గురించిన అంశం. (దానియేలు 2:​44) తర్వాతి ఆదివారం జాహోర్‌ గ్రామంలో ఒక క్రైస్తవ కూటం జరుగుతుందని ఆయన చెప్పినప్పుడు నేను అక్కడకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. నేను ఉదయం 4:⁠00 గంటలకు నిద్ర లేచి మా పెద్దనాన్న కొడుకు దగ్గరనుండి సైకిలు తెచ్చుకోవడానికి ఎనిమిది కిలోమీటర్లు నడిచి వెళ్ళాను. పంక్చరైన టైరును బాగు చేసుకున్న తర్వాత నేను మరో 24 కిలోమీటర్లు ప్రయాణించి జాహోర్‌కు చేరుకున్నాను. కూటం ఎక్కడ జరుగుతుందో నాకు తెలియదు కాబట్టి నేను వీధుల వెంబడి మెల్లగా సైకిలు నడిపించుకుంటూ వెళ్ళాను. అలా వెళుతున్న నాకు ఒక ఇంటిలోనుండి రాజ్య గీతం వినిపించింది. నా హృదయం ఆనందంతో ఉప్పొంగింది. నేను ఆ ఇంట్లోకి వెళ్ళి నేను ఎందుకు వచ్చానో వివరించాను. వాళ్ళు నన్ను తమతోపాటు అల్పాహారం చేయమని ఆహ్వానించి, ఆ తర్వాత నన్ను కూటానికి తీసుకువెళ్ళారు. నేను మళ్ళీ ఇంటికి చేరుకోవడానికి 32 కిలోమీటర్లు సైకిలు తొక్కుతూ, నడుస్తూ రావలసి వచ్చినా, నాకు అస్సలు అలసటే అనిపించలేదు.​—⁠యెషయా 40:31.

యెహోవాసాక్షులు అందించిన స్పష్టమైన బైబిలు ఆధారిత వివరణలు నన్ను ముగ్ధుణ్ణి చేశాయి. దేవుని పరిపాలన క్రింద సంపూర్ణమైన సంతృప్తికరమైన జీవితం అనుభవించవచ్చు అనే ఉత్తరాపేక్ష నా హృదయాన్ని పులకింపజేసింది. (కీర్తన 104:​28) మా చర్చికి రాజీనామా ఉత్తరం వ్రాసి ఇవ్వాలని నేను, అమ్మా నిర్ణయించుకున్నాము. అది మా గ్రామంలో పెద్ద కలకలమే రేపింది. కొందరు కొంతకాలంపాటు మాతో మాట్లాడడం మానేశారు, అయితే మా ప్రాంతంలోని అనేకమంది సాక్షులతో మేము చక్కని సహవాసాన్ని ఆనందించాము. (మత్తయి 5:​11, 12) ఎంతోకాలం గడవకముందే నేను ఊ అనే నదిలో బాప్తిస్మం పొందాను.

పరిచర్య మా జీవిత విధానమయ్యింది

మేము యెహోవా రాజ్యం గురించి ప్రకటించడానికి ప్రతీ అవకాశాన్ని వినియోగించుకున్నాము. (మత్తయి 24:​14) ఆదివారాలు చక్కగా వ్యవస్థీకరించబడిన ప్రకటనా కార్యక్రమాలను మేము ఎక్కువగా ఇష్టపడేవాళ్ళము. సాధారణంగా అప్పట్లో ప్రజలు పెందలాడే లేచేవారు, కాబట్టి మేము పెందలాడే ప్రకటించడం మొదలుపెట్టేవాళ్ళము. తర్వాత మధ్యాహ్నమో లేదా సాయంకాలమో బహిరంగ కూటం ఏర్పాటు చేయబడేది. బైబిలు బోధకులు చాలామట్టుకు సంక్షిప్త ప్రతి లేకుండానే ప్రసంగించేవారు. ఆసక్తిగలవారి సంఖ్యను, వాళ్ళ మత నేపథ్యాలను, వాళ్ళను ప్రభావితం చేయగల విషయాలను దృష్టిలో పెట్టుకొని ప్రసంగించేవారు.

మేము ప్రకటించిన బైబిలు సత్యాలు చాలామంది యథార్థవంతుల కళ్ళు తెరిపించాయి. నేను బాప్తిస్మం పొందిన తర్వాత కొద్దికాలానికి ట్లోవిష్టె గ్రామంలో ప్రకటించాను. ఒక ఇంట్లో నేను జూజానా మాస్కల్‌ అనే స్నేహపూర్వకమైన స్త్రీతో మాట్లాడాను. నేను ఒకప్పుడు ఉన్నట్లే ఆమె, ఆమె కుటుంబ సభ్యులు కాల్వనిస్టులు. ఆమెకు బైబిలు గురించి తెలిసినా, ఆమెకున్న అనేక బైబిలు ప్రశ్నలకు సమాధానాలు దొరకలేదు. నేను ఆమెతో ఒక గంటపాటు చర్చించాను, తర్వాత దేవుని వీణ (ఆంగ్లం) అనే పుస్తకాన్ని ఇచ్చాను. *

మాస్కల్‌ కుటుంబ సభ్యులు వెంటనే తాము బైబిలును చదివే సమయాల్లో దేవుని వీణ పుస్తకాన్ని కూడా చదవడం ప్రారంభించారు. ఆ గ్రామంలో మరిన్ని కుటుంబాలు ఆసక్తి చూపించి కూటాలకు హాజరవడం ప్రారంభించారు. వాళ్ళ కాల్వనిస్టు ప్రీస్టు మాకు, మా ప్రచురణలకు దూరంగా ఉండమని వాళ్ళను గట్టిగా హెచ్చరించాడు. అయితే ఆసక్తిగలవారు కొంతమంది, ప్రీస్టును మా కూటానికి వచ్చి మాతో బహిరంగంగా చర్చించి మా బోధలు తప్పని నిరూపించమని సలహా ఇచ్చారు.

ప్రీస్టు వచ్చాడు, అయితే అతను తన బోధలను సమర్థించుకోవడానికి బైబిలు నుండి ఒక్క అంశం కూడా చూపించలేకపోయాడు. తనను తాను సమర్థించుకోవడానికి అతను ఇలా అన్నాడు: “మనం బైబిల్లో ఉన్న ప్రతిదానిని నమ్మలేము. అది మానవుల ద్వారా వ్రాయబడింది, అంతేకాక మతానికి సంబంధించిన ప్రశ్నలకు వేర్వేరు విధాలుగా వివరణలు ఇవ్వవచ్చు.” అది చాలామందికి మలుపురాయిగా పనిచేసింది. ప్రీస్టు బైబిలును నమ్మకపోతే తాము ఆయన ప్రసంగాలను వినడానికి రామని కొందరు చెప్పారు. అలా వాళ్ళు కాల్వనిస్టు చర్చీతో తమకున్న సంబంధాన్ని తెంచేసుకున్నారు, ఆ గ్రామం నుండి దాదాపు 30 మంది బైబిలు సత్యం పక్షాన స్థిరంగా నిలబడ్డారు.

రాజ్య సువార్తను ప్రకటించడం మా జీవిత విధానంగా మారింది, కాబట్టి నేను ఆధ్యాత్మికంగా స్థిరంగా ఉన్న కుటుంబానికి చెందిన వ్యక్తిని నా భార్యగా చేసుకోవాలనుకున్నాను. పరిచర్యలో నాతోపాటు పనిచేసేవారిలో యాన్‌ పెట్రూస్కా ఒకరు, ఆయన అమెరికాలో సత్యం తెలుసుకున్నాడు. ఆయన కుమార్తె మరీయా తన తండ్రిలాగే ప్రతి ఒక్కరికి సాక్ష్యం ఇవ్వడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉండేది, ఆమెలోని ఆ లక్షణం నాకు ఎంతో నచ్చింది. 1936లో మేమిద్దరం పెళ్ళి చేసుకున్నాము. 1986లో మరీయా చనిపోయేంతవరకూ 50 సంవత్సరాలపాటు నాకు నమ్మకమైన సహచరిగా ఉండింది. 1938లో మా ఒక్కగానొక్క కుమారుడు ఎడ్వర్డ్‌ జన్మించాడు. అయితే ఆ సమయంలో యూరప్‌లో మరో యుద్ధం జరిగే సూచనలు కనిపించాయి. అది మా సేవపై ఎలాంటి ప్రభావం చూపింది?

మా క్రైస్తవ తటస్థత పరీక్షించబడింది

రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు, వేరే దేశంగా తయారైన స్లోవేకియా నాజీ పరిపాలన క్రింద ఉంది. అయితే అప్పటికింకా యెహోవాసాక్షులకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఎలాంటి చర్యా తీసుకోలేదు. మేము రహస్యంగా పని చేయవలసి వచ్చింది, మా సాహిత్యం పరిశీలించబడి కొన్ని భాగాలు తొలగించబడేవి. అయినా కూడా మేము వివేచనతో మా కార్యకలాపాలను కొనసాగించాము.​—⁠మత్తయి 10:16.

యుద్ధం తీవ్రతరమైనప్పుడు నా వయసు 35 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నా కూడా, సైన్యంలో చేరమని నాకు ఆజ్ఞాపించబడింది. నా క్రైస్తవ తటస్థత కారణంగా నేను యుద్ధంలో పాల్గొనడానికి నిరాకరించాను. (యెషయా 2:​2-4) సంతోషకరమైన విషయమేమిటంటే, అధికారులు నా విషయంలో ఏమి చేయాలో నిర్ణయం తీసుకోవడానికి ముందే, నా వయసు వాళ్ళందరూ విడుదల చేయబడ్డారు.

గ్రామీణ ప్రాంతాల్లో నివసించే సహోదరులకంటే నగరాల్లో నివసించే సహోదరులకు కనీస అవసరాలను సమకూర్చుకోవడం కష్టంగా ఉంటుందని మేము గ్రహించాము. మా దగ్గర ఉన్నవాటిని మేము పంచుకోవాలనుకున్నాము. (2 కొరింథీయులు 8:​14) కాబట్టి మేము తీసుకెళ్ళగలిగినన్ని ఆహార పదార్థాలను తీసుకొని 500 కిలోమీటర్లకంటే ఎక్కువ దూరం ప్రయాణించి బ్రటిస్లావాకు వెళ్ళేవాళ్ళము. యుద్ధం జరిగిన ఆ సంవత్సరాల్లో మేము క్రైస్తవులతో ఏర్పరచుకున్న స్నేహబంధాలు, ఆ తర్వాతి కష్టతరమైన సంవత్సరాల్లో స్థిరంగా నిలబడడానికి మాకు బలాన్నిచ్చాయి.

అవసరమైన ప్రోత్సాహాన్ని పొందడం

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత స్లొవేకియా మళ్ళీ జెకోస్లోవేకియాలో భాగమయ్యింది. 1946 నుండి 1948 వరకూ బ్రూయెన్‌ లేదా ప్రేగ్‌లో యెహోవాసాక్షుల దేశవ్యాప్త సమావేశాలు నిర్వహించబడ్డాయి. అప్పుడు తూర్పు స్లొవేకియాలోవున్న మేము సమావేశ ప్రతినిధుల కోసం ఏర్పాటు చేయబడిన ప్రత్యేక రైళ్లలో ప్రయాణించి వెళ్ళాము. ఆ రైళ్ళను పాటలు పాడే రైళ్ళు అని పిలువవచ్చు ఎందుకంటే మేము దారి పొడవునా పాటలు పాడుతూనే ఉన్నాము.​—⁠అపొస్తలుల కార్యములు 16:25.

బ్రూయెన్‌లో జరిగిన 1947 సమావేశం నాకు బాగా గుర్తుంది, అక్కడకు సహోదరుడు నేథన్‌ హెచ్‌. నార్‌తోపాటు ప్రపంచ ప్రధాన కార్యాలయం నుండి ముగ్గురు క్రైస్తవ పైవిచారణకర్తలు వచ్చారు. బహిరంగ ప్రసంగం గురించి తెలియజేయడానికి మాలో చాలామంది ప్రకటన అట్టలు (ప్లకార్డులు) ధరించి ప్రసంగ ముఖ్యాంశాన్ని ప్రకటిస్తూ నగరమంతా తిరిగాము. అప్పటికి తొమ్మిది సంవత్సరాలున్న మా కుమారుడు ఎడ్వర్డ్‌ తనకు ప్లకార్డు దొరకనందుకు ఎంతో బాధపడ్డాడు. కాబట్టి సహోదరులు ఎడ్వర్డ్‌కే కాకుండా చాలామంది చిన్న పిల్లల కోసం చిన్న ప్లకార్డులను తయారు చేశారు. ఈ చిన్న పిల్లల గుంపు బహిరంగ ప్రసంగం గురించి తెలియజేయడంలో చక్కగా పాల్గొన్నారు!

1948 ఫిబ్రవరిలో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారు. ప్రభుత్వం మా పరిచర్యను నిరోధించే చర్యలు తీసుకోవడానికి ఎంతోకాలం పట్టదు అని మేము గ్రహించాము. 1948 సెప్టెంబరులో ప్రేగ్‌లో ఒక సమావేశం నిర్వహించబడింది, అలా సమావేశమయ్యే స్వాతంత్ర్యం లభించి కేవలం మూడు సంవత్సరాలు గడిచాక మళ్ళీ మేము బహిరంగంగా కలుసుకోవడం నిషేధించబడుతుందని గ్రహించి మేము కలతచెందాము. సమావేశం ముగియక ముందు మేము ఒక తీర్మానం తీసుకున్నాము, దానిలో కొంతభాగం ఇలా ఉంది: “ఇక్కడ సమకూడిన యెహోవాసాక్షులమైన మేము . . . ఈ సంతృప్తికరమైన పరిచర్యను ఇంకా విస్తరింపజేయాలని, ప్రభువు కృపతో అనుకూల సమయంలోను కష్ట కాలాల్లోను పట్టుదలతో కొనసాగాలని, దేవుని రాజ్య సువార్తను అత్యంతాసక్తితో ప్రకటించాలని తీర్మానించుకున్నాము.”

“దేశానికి శత్రువులు”

ప్రేగ్‌ సమావేశం తర్వాత కేవలం రెండు నెలలకే రహస్య పోలీసులు ప్రేగ్‌కు దగ్గర్లోవున్న బెతెల్‌ గృహంపై దాడి చేశారు. వాళ్ళు కార్యాలయాలను స్వాధీనం చేసుకొని, అందిన సాహిత్యాన్నల్లా జప్తు చేసుకొని, బెతెల్‌ సభ్యులనందరిని, కొంతమంది ఇతర సహోదరులను అరెస్టు చేశారు. అయితే అది అంతటితో ఆగిపోలేదు.

1952 ఫిబ్రవరి 3-4 రాత్రుళ్ళు భద్రతా దళాలు దేశవ్యాప్తంగా 100 కంటే ఎక్కువమంది సాక్షులను అరెస్టు చేశాయి. వాళ్ళలో నేను కూడా ఒకడిని. ఉదయం మూడు గంటలకు పోలీసులు నా కుటుంబాన్ని నిద్రలేపారు. వివరణేమీ ఇవ్వకుండా నన్ను తమతోపాటు రమ్మన్నారు. నాకు సంకెళ్ళు వేసి కళ్ళకు గంతలుకట్టి ఇతరులతోపాటు ఒక ట్రక్కులో పడేశారు. ఆ తర్వాత నాకు ఏకాంత కారాగార శిక్ష విధించారు.

ఒక నెలంతా నాతో ఎవ్వరూ మాట్లాడలేదు. ఆ నెలంతటిలోను నేను చూసిన ఒకే ఒక్క వ్యక్తి, తలుపు సందులోంచి నాకు కొంచెం ఆహారాన్ని పడేసే గార్డు మాత్రమే. ఆ తర్వాత ఆర్టికల్‌ ప్రారంభంలో ప్రస్తావించబడిన విచారణాధికారి నన్ను పిలిపించాడు. అతను నన్ను గూఢచారి అని పిలిచిన తర్వాత ఇలా అన్నాడు: “మతం అజ్ఞానంతో కూడినది. దేవుడు లేడు! కాయకష్టం చేసే ప్రజలను తప్పుదారి పట్టించడానికి మేము నిన్ను అనుమతించము. నువ్వు ఉరికంభమైనా ఎక్కుతావు లేదా నువ్వు జైల్లోనే మగ్గి చస్తావు. ఒకవేళ నీ దేవుడు ఇక్కడకు వస్తే, మేము అతన్ని కూడా చంపుతాము!”

మా క్రైస్తవ కార్యకలాపాలను నిషేధించే నిర్దిష్టమైన చట్టమేదీ లేదని అధికారులకు తెలుసు కాబట్టి వాళ్ళు ఉన్న చట్టాలను ఉపయోగించి మా కార్యకలాపాలను తప్పుగా చూపించి మమ్మల్ని “దేశానికి శత్రువులుగా,” విదేశీ గూఢచారులుగా చిత్రీకరించాలనుకున్నారు. అలా చేయడానికి వాళ్ళు మా నిబ్బరాన్ని పాడుచేసి వాళ్ళు మాపై మోపిన తప్పుడు నిందలను “ఒప్పుకునేలా” చేయాలి. ఆ రాత్రి విచారణ జరిగిన తర్వాత వాళ్ళు నన్ను నిద్ర పోనివ్వలేదు. కొద్ది గంటల్లోపే నన్ను మళ్ళీ విచారణ చేశారు. ఈ సారి విచారణాధికారి నన్ను ఒక పత్రంపై సంతకం చేయమన్నాడు, దానిలో ఇలా ఉంది: “నేను ప్రజాస్వామ్య జెకోస్లోవేకియా శత్రువును కాబట్టి [సమిష్టి వ్యవసాయ క్షేత్రంలో పనికి] చేరలేదు, నేను అమెరికన్ల కోసం ఎదురు చూస్తున్నాను.” అలాంటి అబద్ధాన్ని ఒప్పుకుంటూ సంతకం చేయడానికి నిరాకరించినప్పుడు నన్ను శిక్షించే గదికి పంపించారు.

అక్కడ నన్ను నిద్రపోవడానికి గాని, నడుం వాల్చడానికి గాని, కనీసం కూర్చోవడానికి గాని అనుమతించలేదు. నేను నిలబడే ఉండాలి లేదా అటూ ఇటూ నడవాలి. నేను పూర్తిగా అలసిపోయినప్పుడు అక్కడే సిమెంటు నేలపై పడుకున్నాను. అప్పుడు గార్డులు నన్ను మళ్ళీ విచారణాధికారి ఆఫీసుకు తీసుకెళ్లారు. “నువ్వు ఇప్పుడు సంతకం చేస్తావా?” అని అతను అడిగాడు. నేను చేయనని చెప్పినప్పుడు అతను నా మొహంపై గుద్దాడు. రక్తం కారడం ప్రారంభించింది. అప్పుడు అతను గార్డులవైపు తిరిగి బిగ్గరగా ఇలా అన్నాడు: “ఇతను తనను తాను చంపుకోవాలనుకుంటున్నాడు. ఇతను ఆత్మహత్య చేసుకోకుండా కాపలా కాయండి!” నాకు మళ్లీ ఏకాంత కారాగార శిక్ష విధించబడింది. ఆరునెలలపాటు అనేక సందర్భాల్లో నన్ను ఇలా ప్రశ్నించడం జరిగింది. సైద్ధాంతికంగా ఒప్పించడానికి లేదా నేను దేశ శత్రువునని అంగీకరించేలా చేయడానికి జరిగిన ప్రయత్నాలు, యెహోవాకు యథార్థంగా ఉండాలనే నా తీర్మానాన్ని బలహీనపర్చలేకపోయాయి.

నన్ను కోర్టులో హాజరు పర్చడానికి ఒక నెల ముందు ప్రేగ్‌నుండి ఒక ప్రాసిక్యూటర్‌ వచ్చి మా గుంపులోని 12 మంది సహోదరులలో ప్రతి ఒక్కరిని ప్రశ్నించాడు. “పాశ్చాత్త్య దేశాల కూటమి మన దేశంపై దాడి చేస్తే నువ్వేమి చేస్తావు?” అని అతను అడిగాడు. దానికి నేను ఇలా సమాధానం ఇచ్చాను: “ఈ దేశం హిట్లర్‌తో కలిసి యు.ఎస్‌.ఎస్‌.ఆర్‌పై దాడి చేసినప్పుడు నేనేమి చేశానో అదే చేస్తాను. అప్పుడు నేను యుద్ధం చేయలేదు, ఇప్పుడు కూడా నేను యుద్ధం చేయను ఎందుకంటే నేను ఒక క్రైస్తవుణ్ణి, నేను తటస్థంగా ఉంటాను.” అప్పుడు అతను ఇలా అన్నాడు: “మేము యెహోవాసాక్షులను సహించలేము. ఒకవేళ పాశ్చాత్త్య దేశాల కూటమి దాడి చేస్తే వాళ్ళతో పోరాడడానికి మాకు సైనికులు కావాలి, పశ్చిమ దేశాల కార్మికులను విడిపించడానికి మాకు సైనికులు కావాలి.”

1953, జూలై 24న మమ్మల్ని కోర్టులో హాజరుపరిచారు. మాలోని 12 మందిని ఒకరి తర్వాత ఒకరు చొప్పున న్యాయమూర్తుల సభ విచారణ చేసింది. మా విశ్వాసం గురించి సాక్ష్యమివ్వడానికి మేము ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నాము. మాపై బలవంతంగా రుద్దబడిన తప్పుడు నిందలకు మేము ప్రతిస్పందించిన తర్వాత ఒక లాయరు నిలబడి ఇలా అన్నాడు: “నేను ఈ కోర్టు గదిలో చాలాసార్లు కూర్చున్నాను. సాధారణంగా నేరాలను ఒప్పుకోవడం, పశ్చాత్తాపపడడం, ఏడ్వడంవంటివి జరుగుతాయి. కానీ ఈ పురుషులు లోపలికి వచ్చినప్పటి కంటే బలమైన విశ్వాసంతో బయటకు వెళ్తారు.” ఆ తర్వాత మా 12 మందికి దేశానికి వ్యతిరేకంగా కుట్ర పన్నామన్న అభియోగంతో శిక్ష విధించబడింది. నాకు మూడు సంవత్సరాల జైలు శిక్షతోపాటు, నా సంపదనంతటిని జరిమానాగా దేశానికి చెల్లించమని ఆజ్ఞాపించబడింది.

వృద్ధాప్యం నన్ను ఆపలేదు

ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కూడా రహస్య పోలీసులు నాపై నిఘా వేసి ఉంచారు. అయినా కూడా నేను నా దైవపరిపాలనా కార్యకలాపాలను ప్రారంభించాను, మా సంఘంలో ఆధ్యాత్మిక పైవిచారణా పని నాకు అప్పగించబడింది. జప్తు చేసుకోబడిన మా ఇంట్లో నివసించడానికి మాకు అనుమతి లభించింది, అయితే దాదాపు 40 సంవత్సరాల తర్వాత కమ్యూనిజమ్‌ పడిపోయిన తర్వాత మాత్రమే చట్టబద్ధంగా అది మాకు తిరిగి ఇవ్వబడింది.

మా కుటుంబంలో జైలుకు వెళ్ళిన ఆఖరి వ్యక్తిని నేను కాదు. నేను ఇంటికి తిరిగి వచ్చిన మూడు సంవత్సరాలకే ఎడ్వర్డ్‌కు సైన్యంలో చేరమని ఆజ్ఞాపించబడింది. బైబిలు శిక్షిత మనస్సాక్షి కారణంగా ఎడ్వర్డ్‌ సైన్యంలో చేరడానికి నిరాకరించాడు, అందుకు జైల్లో వేయబడ్డాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత నా మనవడు అనారోగ్యంతో ఉన్నా కూడా సైన్యంలో చేరనందుకు అదే అనుభవించవలసి వచ్చింది.

1989లో జెకోస్లోవేకియాలోని కమ్యూనిస్టు పరిపాలన పతనమైంది. నాలుగు దశాబ్దాల నిషేధం తర్వాత మళ్ళీ స్వేచ్ఛగా ఇంటింటి పరిచర్య చేయగలిగినందుకు నేనెంత సంతోషించానో! (అపొస్తలుల కార్యములు 20:​20) నా ఆరోగ్యం అనుమతించినంత వరకూ నేను ఆ సేవ చేయడంలో ఆనందించాను. ఇప్పుడు నాకు 98 సంవత్సరాలు, నా ఆరోగ్యం మునుపటిలా లేదు, అయితే ఇప్పటికి కూడా నేను భవిష్యత్తు కోసం యెహోవా చేసిన అద్భుతమైన వాగ్దానాల గురించి ప్రజలకు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నందుకు సంతోషిస్తున్నాను.

మా గ్రామాన్ని ఐదు దేశాలకు చెందిన 12 మంది పరిపాలించారు. వాళ్ళలో నియంతలు, రాష్ట్రపతులు, ఒక రాజు ఉన్నారు. వాళ్ళ పరిపాలన క్రింద ప్రజలు అనుభవిస్తున్న కష్టాలకు, వాళ్ళలో ఎవ్వరూ ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని తీసుకురాలేకపోయారు. (కీర్తన 146:​3, 4) నేను యౌవనస్థుడిగా ఉన్నప్పుడే యెహోవా గురించి తెలుసుకునే అవకాశం ఇచ్చినందుకు నేను ఆయనకు కృతజ్ఞుడిని. ఆయన మెస్సీయా రాజ్యం ద్వారా తీసుకురాబోయే పరిష్కారాన్ని అర్థం చేసుకున్న నేను దేవుడు లేని వ్యర్థమైన జీవితాన్ని జీవించలేదు. నేను 75 కంటే ఎక్కువ సంవత్సరాలపాటు అత్యుత్తమమైన వార్తను చురుగ్గా ప్రకటించాను, అది నా జీవితానికి ఒక సంకల్పాన్ని, సంతృప్తిని, భూమ్మీద నిత్యం జీవించే అద్భుతమైన నిరీక్షణను ఇచ్చింది. నాకు ఇంకా ఏమి కావాలి? *

[అధస్సూచీలు]

^ పేరా 14 యెహోవాసాక్షులు ప్రచురించినది, ఇప్పుడు ముద్రించబడడంలేదు.

^ పేరా 38 విచారకరంగా సహోదరుడు మైకల్‌ జోబ్రాక్‌ శక్తి పూర్తిగా క్షీణించింది. ఈ ఆర్టికల్‌ను ముద్రించడానికి సిద్ధం చేస్తున్నప్పుడు ఆయన పునరుత్థాన నిరీక్షణలో బలమైన విశ్వాసంగల వ్యక్తిగా నమ్మకంగా మరణించాడు.

[26వ పేజీలోని చిత్రం]

మా పెళ్ళి తర్వాత

[26వ పేజీలోని చిత్రం]

1940ల తొలికాలంలో ఎడ్వర్డ్‌తోపాటు

[27వ పేజీలోని చిత్రం]

1947లో బ్రూనోలోని సమావేశం గురించి తెలియజేస్తూ