కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా సాత్వికము మనకెలా ప్రయోజనం చేకూరుస్తుంది?

యెహోవా సాత్వికము మనకెలా ప్రయోజనం చేకూరుస్తుంది?

యెహోవా సాత్వికము మనకెలా ప్రయోజనం చేకూరుస్తుంది?

దావీదు ఎన్నో కష్టాలు అనుభవించాడు. అసూయపరుడైన ఆయన మామ, రాజైన సౌలు ఆయనతో చెడ్డగా ప్రవర్తించాడు. సౌలు మూడుసార్లు ఈటెతో దావీదును చంపడానికి ప్రయత్నించాడు, ఎన్నో సంవత్సరాలపాటు దావీదును ఒక జంతువును వేటాడినట్లు వేటాడాడు, దావీదు అతనినుండి తప్పించుకొని పారిపోతూ నిరాశ్రయునిగా బ్రతకాల్సి వచ్చింది. (1 సమూయేలు 18:11; 19:10; 26:​20) కానీ యెహోవా దావీదుకు తోడుగా ఉన్నాడు. యెహోవా ఆయనను సౌలునుండే కాక ఇతర శత్రువులనుండి కూడా కాపాడాడు. కాబట్టి దావీదు ఒక పాటలో వ్యక్తం చేసిన తన భావాలను మనం అర్థం చేసుకోవచ్చు: “యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు. [యెహోవా] నీవు నీ రక్షణ కేడెమును నాకు అందించుదువు నీ సాత్వికము నన్ను గొప్పచేయును.” (2 సమూయేలు 22:​2, 36) దావీదు ఇశ్రాయేలులో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా తయారయ్యాడు. అయితే దానికి యెహోవా సాత్వికము లేదా వినయం ఎలా కారణమయ్యింది?

లేఖనాలు యెహోవా సాత్వికుడు అని చెప్పినప్పుడు, ఆయనకు పరిమితులు ఉన్నాయని లేదా ఆయన ఇతరులకు లోబడతాడని సూచించడం లేదు. దానికి బదులు యెహోవాకున్న ఈ చక్కని లక్షణం, తన ఆమోదం పొందడానికి యథార్థంగా ప్రయత్నించే మానవులపట్ల ఆయనకు సానుభూతి ఉందని, వారిపట్ల ఆయన కనికరం చూపిస్తాడని సూచిస్తుంది. కీర్తన 113:​6, 7లో మనం ఇలా చదువుతాము: “ఆయన [యెహోవా] భూమ్యాకాశములను వంగిచూడ ననుగ్రహించుచున్నాడు. . . . ఆయన నేలనుండి దరిద్రులను లేవనెత్తువాడు.” ఆయన ‘వంగి చూస్తున్నాడు’ అంటే ఆయన “చూడడానికి తనను తాను సాత్వికుడిగా చేసుకుంటున్నాడు” అని అర్థం. (యంగ్స్‌ లిటరల్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫ్‌ ద హోలీ బైబిల్‌) కాబట్టి దేవుణ్ణి సేవించాలని కోరుకున్న నమ్రతగల అపరిపూర్ణ మానవుడైన దావీదుకు అవధానమివ్వడానికి యెహోవా ఆకాశం నుండి ‘వంగి చూశాడు’ లేదా ‘తనను తాను సాత్వికుడిగా చేసుకున్నాడు.’ అందుకే దావీదు మనకు ఇలా హామీ ఇస్తున్నాడు: “యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును.” (కీర్తన 138:⁠6) యెహోవా దావీదుపట్ల దయతో, సహనంతో, కనికరంతో వ్యవహరించిన విధానం, దేవుని చిత్తం చేయడానికి ప్రయత్నించే వాళ్ళందరికీ ప్రోత్సాహకరంగా ఉండాలి.

సర్వాధిపతిగా యెహోవా ఈ విశ్వంలోనే అత్యున్నత స్థానంలో ఉన్నాడు, అయినా కూడా ఆయన మనలో ప్రతి ఒక్కరితో సంబంధం కలిగివుండడానికి సుముఖంగా ఉన్నాడు. మనం అత్యంత కష్టమైన పరిస్థితుల్లో కూడా సహాయం కోసం ఆయనపై ఆధారపడవచ్చు అనే నమ్మకాన్ని అది మనకు ఇస్తుంది. ఆయన మనల్ని మరచిపోతాడు అని భయపడవలసిన అవసరమే లేదు. ప్రాచీన ఇశ్రాయేలులోని యెహోవా ప్రజలు “దీనదశలోనున్నప్పుడు ఆయన [వారిని] జ్ఞాపకము చేసికొనెను ఆయన కృప నిరంతరముండును” అన్న మాటలు యెహోవాను సరిగ్గానే వర్ణిస్తున్నాయి.​—⁠కీర్తన 136:23.

యెహోవా ఆధునిక దిన సేవకులమైన మనం దావీదులాగే ఎన్నో కష్టాలు అనుభవించవచ్చు. దేవుడంటే ఎవరో తెలియనివారు మనల్ని ఎగతాళి చేయవచ్చు, మనం అనారోగ్యంతో బాధపడుతుండవచ్చు లేదా మన ప్రియమైనవారు మరణించినందుకు బాధతో ఉండవచ్చు. పరిస్థితి ఏదైనా సరే మన హృదయం యథార్థంగా ఉంటే మనం యెహోవాకు ప్రార్థన చేసి ఆయన కనికరం కోసం వేడుకోవచ్చు. మనల్ని చూడడానికి, మన ప్రార్థనలను వినడానికి యెహోవా ‘క్రిందికి వంగుతాడు.’ ప్రేరేపిత కీర్తనకర్త ఇలా వ్రాశాడు: “యెహోవా దృష్టి నీతిమంతులమీద నున్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి.” (కీర్తన 34:​15) యెహోవాకున్న సాత్వికము అనే ఈ చక్కని లక్షణం గురించి ధ్యానించడం మీ హృదయాన్ని కదిలించదా?

[30వ పేజీలోని చిత్రాలు]

యెహోవా దావీదు ప్రార్థనలను విన్నట్లే నేడు మన ప్రార్థనలను వినడానికి సుముఖంగా ఉన్నాడు