కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సంతోషంగా ఉండే యెహోవా సేవకులు

సంతోషంగా ఉండే యెహోవా సేవకులు

సంతోషంగా ఉండే యెహోవా సేవకులు

‘తమ ఆధ్యాత్మిక అవసరతను గుర్తించినవారు సంతోషంగా ఉంటారు.’​మత్తయి 5:​3.

సంతోషం యెహోవా ప్రజల అమూల్యమైన సంపద. ‘యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు’ అంటే సంతోషంగా ఉంటారు అని కీర్తనకర్త దావీదు అన్నాడు. (కీర్తన 144:​15) సంతోషంగా ఉండడం అంటే సంతృప్తిగా ఉన్నామనే భావన. ప్రగాఢమైన సంతోషం, అంటే మన హృదయాంతరాళాల్లోంచి వచ్చే సంతోషం మనం యెహోవా ద్వారా ఆశీర్వదించబడ్డాము అని తెలుసుకోవడం నుండి వస్తుంది. (సామెతలు 10:​22) అలాంటి సంతోషం మనకు మన పరలోక తండ్రితో ఉన్న సన్నిహిత సంబంధాన్ని, మనం ఆయన చిత్తం చేస్తున్నామనే వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంది. (కీర్తన 112:1; 119:​1, 2) ఆసక్తికరమైన విషయమేమంటే యేసు మనం సంతోషంగా ఉండడానికి కారణమయ్యే తొమ్మిది అంశాలను పేర్కొన్నాడు. ఈ ఆర్టికల్‌లోను, తర్వాతి ఆర్టికల్‌లోను ఆ సంతోషాలను లేదా ధన్యతలను పరిశీలించడం, మనం “శ్రీమంతుడగు దేవుడు” అంటే సంతోషంగా ఉండే దేవుడైన యెహోవాకు నమ్మకంగా చేసే సేవలో ఎంత సంతోషంగా ఉండగలమో గ్రహించడానికి సహాయం చేస్తుంది.​—⁠1 తిమోతి 1:⁠8.

మన ఆధ్యాత్మిక అవసరతను గుర్తించడం

2 సా.శ. 31లో యేసు చరిత్రలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన ప్రసంగాన్ని ఇచ్చాడు. యేసు ఆ ప్రసంగాన్ని గలిలయ సముద్రం దగ్గర ఒక కొండపై ఇచ్చాడు కాబట్టి అది కొండమీది ప్రసంగం అని పిలువబడింది. మత్తయి సువార్త ఇలా చెబుతోంది: “ఆయన [యేసు] ఆ జనసమూహములను చూచి కొండయెక్కి కూర్చుండగా ఆయన శిష్యు లాయనయొద్దకు వచ్చిరి. అప్పుడాయన నోరు తెరచి యీలాగు బోధింపసాగెను​—⁠‘తమ ఆధ్యాత్మిక అవసరతను గుర్తించినవారు సంతోషంగా ఉంటారు; పరలోక రాజ్యం వారిది.’” * యేసు మాటలను అక్షరార్థంగా అనువదిస్తే ఇలా ఉంటాయి: ‘ఆధ్యాత్మికంగా దీనులుగా ఉన్నవారు ధన్యులు.’ (మత్తయి 5:​1-3; ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) పవిత్ర గ్రంథం​—⁠వ్యాఖ్యాన సహితం ఇలా అనువదించింది: “తమ ఆధ్యాత్మిక దరిద్రతను గుర్తించినవారు ధన్యులు.”

3 యేసు కొండపై ఇచ్చిన ప్రసంగంలో, ఒక వ్యక్తి తన ఆధ్యాత్మిక అవసరతను గుర్తిస్తే చాలా సంతోషంగా ఉంటాడు అని సూచించాడు. వినయంగల క్రైస్తవులకు తమ పాపభరిత పరిస్థితి గురించి బాగా తెలుసు కాబట్టి వారు క్రీస్తు విమోచన క్రయధనం ఆధారంగా యెహోవాను క్షమాపణ కోరతారు. (1 యోహాను 1:⁠9) తత్ఫలితంగా వాళ్ళకు మనశ్శాంతి, నిజమైన సంతోషం లభిస్తాయి. “తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు” లేక సంతోషంగా ఉంటాడు.​—⁠కీర్తన 32:1; 119:165.

4 మనం మన ఆధ్యాత్మిక అవసరతను గుర్తిస్తే ప్రతిరోజూ బైబిలును చదవడానికి, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” “తగినవేళ”కు అందించే ఆధ్యాత్మిక ఆహారంనుండి పూర్తి ప్రయోజనం పొందడానికి, క్రైస్తవ కూటాలకు క్రమంగా హాజరవడానికి పురికొల్పబడతాము. (మత్తయి 24:45; కీర్తన 1:1, 2; 119:111; హెబ్రీయులు 10:​24, 25) పొరుగువారిపట్ల మనకున్న ప్రేమ ఇతరుల ఆధ్యాత్మిక అవసరాలను గుర్తించడానికి, రాజ్య సువార్తను ప్రకటించడంలోను బోధించడంలోను అత్యంతాసక్తితో పనిచేయడానికి తోడ్పడుతుంది. (మార్కు 13:10; రోమీయులు 1:​14-16) ఇతరులతో బైబిలు సత్యాలను పంచుకోవడం మనకు సంతోషాన్నిస్తుంది. (అపొస్తలుల కార్యములు 20:​20, 35) అద్భుతమైన రాజ్య నిరీక్షణ గురించి, ఆ రాజ్యం తీసుకువచ్చే ఆశీర్వాదాల గురించి ధ్యానించడంవల్ల మన సంతోషం రెట్టింపవుతుంది. అభిషిక్త క్రైస్తవుల “చిన్న మంద” క్రీస్తు రాజ్య ప్రభుత్వంలో భాగంగా పరలోకంలో అమర్త్యమైన జీవితం పొందాలని నిరీక్షిస్తారు. (లూకా 12:32; 1 కొరింథీయులు 15:​50, 54) “వేరే గొఱ్ఱెల”కు చెందినవారు ఆ రాజ్య ప్రభుత్వం క్రింద భూపరదైసులో నిత్యం జీవించాలని నిరీక్షిస్తారు.​—⁠యోహాను 10:16; కీర్తన 37:11; మత్తయి 25:34, 46.

దుఃఖించేవారు సంతోషంగా ఎలా ఉంటారు?

5 యేసు ప్రస్తావించిన తర్వాతి సంతోషానికి సంబంధించిన మాటలు పరస్పరం విరుద్ధంగా ఉన్నట్లు కనిపిస్తాయి. ఆయన ఇలా అన్నాడు: ‘దుఃఖించేవారు సంతోషంగా ఉంటారు; వారు ఓదార్చబడతారు.’ (మత్తయి 5:⁠4) ఒక వ్యక్తి దుఃఖిస్తూ సంతోషంగా ఎలా ఉండగలడు? మనం యేసు మాటలను అర్థం చేసుకోవడానికి ఆయన ఏ కారణాన్నిబట్టి దుఃఖించడం గురించి మాట్లాడుతున్నాడో పరిశీలించాలి. మన పాపభరిత పరిస్థితి దుఃఖించడానికి కారణంగా ఉండాలని శిష్యుడైన యాకోబు వివరించాడు. ఆయన ఇలా వ్రాశాడు: “పాపులారా, మీ చేతులను శుభ్రము చేసికొనుడి; ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, యేడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడాయన మిమ్మును హెచ్చించును.” (యాకోబు 4:​8-10) తమ పాపభరిత పరిస్థితినిబట్టి నిజంగా దుఃఖించేవారు, క్రీస్తు విమోచన క్రయధన బలిపై విశ్వాసముంచి యెహోవా చిత్తం చేయడం ద్వారా నిజమైన పశ్చాత్తాపం చూపిస్తే తమ పాపాలు క్షమించబడతాయని తెలుసుకున్నప్పుడు ఓదార్చబడతారు. (యోహాను 3:16; 2 కొరింథీయులు 7:​9, 10) ఆ విధంగా వారు యెహోవాతో అమూల్యమైన సంబంధాన్ని కలిగివుండి, ఆయనకు సేవచేయడానికి, ఆయనను స్తుతించడానికి నిరంతరం జీవించివుండే నిరీక్షణను కలిగివుంటారు. అది వాళ్ళకు అంతర్గత సంతోషాన్ని తెస్తుంది.​—⁠రోమీయులు 4:7, 8.

6 యేసు మాటలు భూమిపై ప్రబలుతున్న హేయమైన పరిస్థితుల కారణంగా దుఃఖించేవారికి కూడా అన్వయిస్తుంది. యెషయా 61:1, 2 వచనాల్లోని ప్రవచనాన్ని యేసు తనకు అన్వయించుకున్నాడు. ఆ ప్రవచనం ఇలా చెబుతోంది: “ప్రభువగు యెహోవా ఆత్మ నామీదికి వచ్చియున్నది దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను నలిగిన హృదయముగలవారిని దృఢపరచుటకును . . . దుఃఖాక్రాంతులందరిని ఓదార్చుటకును . . . ఆయన నన్ను పంపియున్నాడు.” ఆ నియామకం ఇంకా భూమిపైనే ఉన్న అభిషిక్త క్రైస్తవులకు కూడా వర్తిస్తుంది, వారు తమ సహవాసులైన “వేరే గొఱ్ఱెల” సహాయంతో దానిని నెరవేరుస్తారు. “దానిలో [క్రైస్తవమత సామ్రాజ్యాన్ని చిత్రీకరించే మతభ్రష్ట యెరూషలేములో] జరిగిన హేయకృత్యములనుగూర్చి మూల్గు లిడుచు ప్రలాపించుచున్నవారి” నొసళ్ళపై సూచనార్థకంగా గుర్తు వేయడంలో అందరూ భాగం వహిస్తారు. (యెహెజ్కేలు 9:⁠4) అలా దుఃఖించేవారు “రాజ్య సువార్త” ద్వారా ఓదార్చబడతారు. (మత్తయి 24:​14) సాతాను దుష్ట విధానం స్థానంలో త్వరలోనే యెహోవా నీతియుక్తమైన నూతనలోకం ఉంటుందని తెలుసుకొని వారు సంతోషిస్తారు.

సాత్వికులు సంతోషంగా ఉంటారు

7 యేసు కొండపై ఇచ్చిన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఇలా అన్నాడు: ‘సాత్వికులు సంతోషంగా ఉంటారు; వారు భూమిని స్వతంత్రించుకుంటారు.’ (మత్తయి 5:⁠5) సాత్వికముతో ఉండడం బలహీనతకు సూచన అని కొన్నిసార్లు తలంచబడుతుంది. కానీ అది తప్పు. “సాత్వికము” అని అనువదించబడిన పదం భావాన్ని వివరిస్తూ ఒక బైబిలు విద్వాంసుడు ఇలా వ్రాశాడు: “[సాత్వికముగల] వ్యక్తికి ఉండే అత్యున్నతమైన ప్రత్యేకత ఏమిటంటే అతను సంపూర్ణమైన ఆశానిగ్రహంతో ఉంటాడు. అది నిస్సారమైన మృదుత్వం, మానసిక అనురాగం, పట్టించుకోకుండా నిశ్శబ్దంగా ఉండడం కాదు. అది పూర్తిగా అదుపులో ఉండే శక్తి.” యేసు తన గురించి ఇలా అన్నాడు: “నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను.” (మత్తయి 11:​29) అయినా, యేసు ధైర్యంగా నీతియుక్త సూత్రాలను సమర్థిస్తూ మాట్లాడాడు.​—⁠మత్తయి 21:12, 13; 23:13-33.

8 కాబట్టి సాత్వికానికి ఆశానిగ్రహానికి దగ్గరి సంబంధం ఉంది. నిజానికి అపొస్తలుడైన పౌలు ‘ఆత్మ ఫలం’ గురించి చెప్పినప్పుడు సాత్వికమును, ఆశానిగ్రహాన్ని వెంటవెంటనే ప్రస్తావించాడు. (గలతీయులు 5:​22) సాత్వికమును పరిశుద్ధాత్మ సహాయంతో పెంపొందించుకోవాలి. అది బయటివారితోను, సంఘ సభ్యులతోను శాంతియుతంగా ఉండడానికి సహాయం చేసే క్రైస్తవ లక్షణం. పౌలు ఇలా వ్రాశాడు: “మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. . . . ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి.”​—⁠కొలొస్సయులు 3:12, 13.

9 అయితే సాత్వికము ఇతర మానవులతో మనకున్న సంబంధాలకే పరిమితం కాదు. మనం యెహోవా సర్వాధిపత్యానికి ఇష్టపూర్వకంగా లోబడడం ద్వారా సాత్వికాన్ని ప్రదర్శిస్తాము. ఈ విషయంలో మనకున్న ప్రధాన మాదిరి యేసుక్రీస్తే, ఆయన భూమ్మీద ఉన్నప్పుడు సాత్వికమును ప్రదర్శించి తన తండ్రి చిత్తానికి సంపూర్ణంగా లోబడ్డాడు. (యోహాను 5:​19, 30) భూమిని వారసత్వంగా పొందే మొదటి వ్యక్తి యేసే, ఎందుకంటే ఆయనే దాని నియమిత పరిపాలకుడు. (కీర్తన 2:6-8; దానియేలు 7:​13, 14) ఆయన తనకు లభించిన ఈ వారసత్వ సంపదను, ‘భూలోకమందు ఏలడానికి’ “మనుష్యులలోనుండి కొనబడిన” 1,44,000 మంది తోటి ‘వారసులతో’ పంచుకుంటాడు. (రోమీయులు 8:17; ప్రకటన 5:9, 10; 14:1, 3, 4; దానియేలు 7:​27) “దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు” అనే ప్రవచనార్థక కీర్తన నెరవేరినప్పుడు కోట్లాదిమంది గొర్రెలవంటి స్త్రీపురుషులను క్రీస్తు, ఆయన తోటి పరిపాలకులు పరిపాలిస్తారు.​—⁠కీర్తన 37:11; మత్తయి 25:33, 34, 46.

నీతికోసం ఆకలితో ఉన్నవారు సంతోషంగా ఉంటారు

10 యేసు గలిలయ కొండపై మాట్లాడుతున్నప్పుడు ప్రస్తావించిన మరో సంతోషం: ‘నీతికోసం ఆకలిదప్పులతో ఉన్నవారు సంతోషంగా ఉంటారు; వారు తృప్తిపరచబడతారు.’ (మత్తయి 5:⁠6) యెహోవాయే క్రైస్తవుల కోసం నీతి ప్రమాణాలను ఏర్పాటు చేస్తాడు. కాబట్టి నీతికోసం ఆకలిదప్పులతో ఉన్నవారు నిజానికి దైవిక నడిపింపు కోసం ఆకలిదప్పులతో ఉన్నారు. అలాంటివారికి తమ పాపభరిత పరిస్థితి గురించి అసంపూర్ణత గురించి తెలుసు కాబట్టి వారు యెహోవా ఎదుట అంగీకారయోగ్యమైన స్థానాన్ని పొందాలని పరితపిస్తారు. తాము పశ్చాత్తాపం చూపించి క్రీస్తు విమోచన క్రయధన బలి ఆధారంగా క్షమాపణ వేడుకుంటే దేవుని ఎదుట నీతియుక్తమైన స్థానం సంపాదించుకోవడం సాధ్యమేనని తెలుసుకున్నప్పుడు వారెంత సంతోషిస్తారో కదా!​—⁠అపొస్తలుల కార్యములు 2:38; 10:43; 13:38, 39; రోమీయులు 5:19.

11 అలాంటి వారు ‘తృప్తిపరచబడతారు’ కాబట్టి సంతోషంగా ఉంటారు అని యేసు చెప్పాడు. (మత్తయి 5:⁠6) క్రీస్తుతోపాటు పరలోకంలో ‘యేలడానికి’ పిలువబడిన అభిషిక్త క్రైస్తవులకు ‘జీవప్రదమైన నీతి విధింపబడింది.’ (రోమీయులు 5:​1, 9, 16-18) యెహోవా వారిని ఆధ్యాత్మిక కుమారులుగా స్వీకరిస్తాడు. వారు క్రీస్తు పరలోక రాజ్య ప్రభుత్వంలో రాజులుగా యాజకులుగా ఉండడానికి పిలువబడిన తోటి వారసులవుతారు.​—⁠యోహాను 3:3; 1 పేతురు 2:⁠9.

12 అభిషిక్తుల సహవాసులకు ఇంకా జీవప్రదమైన నీతి విధింపబడలేదు. అయితే వారు క్రీస్తు చిందించిన రక్తంలో విశ్వాసముంచారు కాబట్టి యెహోవా వాళ్ళను కొంతవరకూ నీతిమంతులుగా పరిగణిస్తాడు. (యాకోబు 2:22-25; ప్రకటన 7:​9, 10) “మహాశ్రమల” సమయంలో విడుదల పొందడానికి ఎదురుచూస్తున్న యెహోవా స్నేహితులుగా వారు నీతిమంతులుగా పరిగణించబడతారు. (ప్రకటన 7:​14) వారు “క్రొత్త ఆకాశముల” క్రింద “నీతి నివసించే” క్రొత్త భూమిలో భాగమైనప్పుడు నీతికోసం వారికున్న ఆకలిదప్పులు మరి ఎక్కువగా తృప్తిపరచబడతాయి.​—⁠2 పేతురు 3:13; కీర్తన 37:29.

కనికరంగలవారు సంతోషంగా ఉంటారు

13 కొండమీది ప్రసంగాన్ని కొనసాగిస్తూ యేసు ఇలా చెప్పాడు: ‘కనికరముగలవారు సంతోషంగా ఉంటారు; వాళ్ళకు కనికరము చూపించబడుతుంది.’ (మత్తయి 5:⁠7) చట్టపరంగా చూస్తే, ఒక న్యాయాధిపతి తప్పు చేసిన వ్యక్తికి చట్టం అనుమతించే పూర్తి శిక్షను విధించకుండా దయ చూపించడాన్ని కనికరముగా అర్థం చేసుకుంటారు. అయితే బైబిలులో ఉపయోగించబడినట్లుగా “కనికరము” అని అనువదించబడిన మూలభాషా పదాలు ఎక్కువగా నిస్సహాయులకు ఉపశమనం ఇచ్చే దయాపూర్వక శ్రద్ధను, జాలిని సూచించడానికి ఉపయోగించబడ్డాయి. అంటే కనికరముగలవారు తమ క్రియల ద్వారా సానుభూతిని ప్రదర్శిస్తారు. యేసు చెప్పిన మంచి సమరయుని ఉపమానం, అవసరంలోవున్న వ్యక్తిపై “జాలిపడిన” లేదా కనికరముతో వ్యవహరించిన వ్యక్తికి చక్కని ఉదాహరణగా ఉంది.​—⁠లూకా 10:29-37.

14 కనికరముగలవారిగా ఉండడంవల్ల కలిగే సంతోషాన్ని అనుభవించాలంటే మనం అవసరంలోవున్నవారికి సహాయం చేసే దయగల పనులు చేయాలి. (గలతీయులు 6:​10) యేసు తాను చూసిన ప్రజలపట్ల జాలిపడ్డాడు. ఆయన “వారు కాపరిలేని గొఱ్ఱెలవలె ఉన్నందున వారిమీద కనికరపడి, వారికి అనేక సంగతులను బోధింపసాగెను.” (మార్కు 6:​34) మానవజాతికి ఆధ్యాత్మిక అవసరత ఎక్కువగా ఉందని యేసు గ్రహించాడు. మనం కూడా ఇతరులకు ఎక్కువగా అవసరమైనదాన్ని అంటే “రాజ్య సువార్త”ను వాళ్ళతో పంచుకోవడం ద్వారా దయగలవారిగా, కనికరముగలవారిగా ఉన్నట్లు నిరూపించుకుంటాము. (మత్తయి 24:​14) మనం తోటి వృద్ధ క్రైస్తవులకు, విధవరాళ్ళకు, అనాథలకు అవసరమైన సహాయం అందజేసి, ‘ధైర్యము చెడినవారిని ధైర్యపరచాలి.’ (1 థెస్సలొనీకయులు 5:14; సామెతలు 12:25; యాకోబు 1:​27) ఇది మనకు సంతోషాన్ని తీసుకురావడమే కాకుండా మనం యెహోవా కనికరానికి పాత్రులమయ్యేలా చేస్తుంది.​—⁠అపొస్తలుల కార్యములు 20:35; యాకోబు 2:13.

పవిత్రమైన హృదయంగలవారు, శాంతియుతులు

15 యేసు ఆరవ, యేడవ సంతోషాల గురించి ఇలా చెప్పాడు: ‘పవిత్రమైన హృదయంగలవారు సంతోషంగా ఉంటారు; వారు దేవుణ్ణి చూస్తారు. శాంతియుతులు సంతోషంగా ఉంటారు; వారు దేవుని కుమారులు అని పిలువబడతారు.’ (మత్తయి 5:​8, 9) పవిత్రమైన హృదయం, నైతికంగా పరిశుద్ధంగా ఉండడమే కాకుండా ఆధ్యాత్మిక కళంకం లేకుండా, యెహోవాపట్ల సంపూర్ణ భక్తితో ఉంటుంది. (1 దినవృత్తాంతములు 28:9; కీర్తన 86:​11) ‘శాంతియుతులు’ అని అనువదించబడిన మూలభాషా పదానికి “శాంతిని నెలకొల్పేవారు” అనేది అక్షరార్థ భావం. శాంతి స్వభావులు తమ క్రైస్తవ సహోదరులతో, తమకు సాధ్యమైనంతవరకూ తమ పొరుగువారితో శాంతియుతంగా ఉంటారు. (రోమీయులు 12:​17-21) వారు “సమాధానమును” అంటే శాంతిని ‘వెదకి దాని వెంటాడతారు.’​—⁠1 పేతురు 3:11.

16 పవిత్రమైన హృదయంగల శాంతియుతులు “దేవుని కుమారులు అని పిలవబడతారు,” “వారు దేవుణ్ణి చూస్తారు” అని వాగ్దానం చేయబడింది. అభిషిక్త క్రైస్తవులు ఆత్మసంబంధ కుమారులుగా జన్మిస్తారు, వారింకా భూమిపై ఉన్నప్పుడే యెహోవా వారిని “కుమారులు”గా అంగీకరిస్తాడు. (రోమీయులు 8:​14-17) వారు క్రీస్తుతోపాటు పరలోకంలో ఉండడానికి పునరుత్థానం చేయబడినప్పుడు యెహోవా సన్నిధిలో సేవచేస్తూ ఆయనను నిజంగా చూస్తారు.​—⁠1 యోహాను 3:1, 2; ప్రకటన 4:9-11.

17 “వేరే గొఱ్ఱెల”కు చెందిన శాంతియుతులు మంచి కాపరియైన యేసుక్రీస్తు క్రింద యెహోవాకు సేవచేస్తారు, యేసు వాళ్ళకు “నిత్యుడగు తండ్రి” అవుతాడు. (యోహాను 10:14, 16; యెషయా 9:⁠6) క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలన తర్వాత పరీక్షలో సఫలమైనవారు యెహోవా భూసంబంధ కుమారులుగా అంగీకరించబడతారు, వారు ‘దేవుని పిల్లలు పొందే మహిమగల స్వాతంత్ర్యాన్ని’ పొందుతారు. (రోమీయులు 8:20; ప్రకటన 20:​7, 9) దానికోసం ఎదురుచూస్తూ వారు యెహోవాను తండ్రీ అని సంబోధిస్తారు ఎందుకంటే వారు ఆయనను తమ జీవదాతగా గుర్తిస్తూ తమ జీవితాలను ఆయనకు సమర్పించుకున్నారు. (యెషయా 64:⁠8) ప్రాచీనకాలానికి చెందిన యోబు మోషేలవలే వారు విశ్వాసపు కళ్ళతో దేవుణ్ణి ‘కన్నులార చూస్తారు.’ (యోబు 42:5; హెబ్రీయులు 11:​27) వారు తమ ‘మనోనేత్రములతో,’ దేవుని ఖచ్చితమైన జ్ఞానముతో యెహోవా అద్భుతమైన లక్షణాలను అర్థం చేసుకొని, ఆయన చిత్తం చేయడం ద్వారా ఆయనను అనుకరించడానికి కృషి చేస్తారు.​—⁠ఎఫెసీయులు 1:17; రోమీయులు 1:19, 20; 3 యోహాను 11.

18 తమ ఆధ్యాత్మిక అవసరతను గుర్తించినవారు, దుఃఖించేవారు, సాత్వికులు, నీతికోసం ఆకలిదప్పులతో ఉన్నవారు, కనికరముగలవారు, పవిత్రమైన హృదయంగలవారు, శాంతియుతులు యెహోవాకు సేవ చేయడంలో నిజమైన సంతోషాన్ని కనుగొంటారు అని మనం చూశాము. అయితే ఇలాంటి వారికి అన్ని సందర్భాల్లోనూ వ్యతిరేకత, హింస ఎదురైంది. అది వారి సంతోషాన్ని పాడు చేసిందా? ఆ ప్రశ్న తర్వాతి ఆర్టికల్‌లో చర్చించబడుతుంది.

[అధస్సూచి]

^ పేరా 5 మత్తయి 5:​3-11 వచనాల్లోని మకార్యోయి అనే గ్రీకు పదం తెలుగు బైబిలులో “ధన్యులు” అని అనువదించబడింది, అయితే నూతనలోక అనువాదం (ఆంగ్లం)లో ఆ పదం మరింత ఖచ్చితంగా “సంతోషంగా ఉంటారు” అని అనువదించబడింది. కాబట్టి ఈ ఆర్టికల్‌లోను, తర్వాతి ఆర్టికల్‌లోను ఆ వచనాలు నూతనలోక అనువాదంనుండి ఉల్లేఖించబడ్డాయి.

పునఃసమీక్షా ప్రశ్నలు

తమ ఆధ్యాత్మిక అవసరతను గుర్తించినవారు ఎలాంటి సంతోషం పొందుతారు?

దుఃఖించేవారు ఏయే విధాలుగా ఓదార్చబడతారు?

మనం సాత్వికమును ఎలా చూపించాలి?

మనం కనికరముగలవారిగా, పవిత్రమైన హృదయంగలవారిగా, శాంతియుతులుగా ఎందుకు ఉండాలి?

[అధ్యయన ప్రశ్నలు]

1. నిజమైన సంతోషం అంటే ఏమిటి, అది దేనిని ప్రతిబింబిస్తుంది?

2. యేసు సంతోషం గురించి ఎప్పుడు మాట్లాడాడు, ఆయన మొదటి వ్యాఖ్యానం ఏమిటి?

3. వినయం కలిగివుండడం సంతోషంగా ఉండడానికి ఎలా సహాయం చేస్తుంది?

4. (ఎ) మనం మన ఆధ్యాత్మిక అవసరతను, ఇతరుల ఆధ్యాత్మిక అవసరతను గుర్తించామని చూపించగల మార్గాలేమిటి? (బి) మనం మన ఆధ్యాత్మిక అవసరతను గుర్తించినప్పుడు మన సంతోషం ఎలా అధికమవుతుంది?

5. (ఎ) “దుఃఖించేవారు” అనే పదబంధానికి అర్థమేమిటి? (బి) అలా దుఃఖించేవారు ఎలా ఓదార్చబడతారు?

6. కొంతమంది ఏ భావంలో దుఃఖిస్తారు, వారెలా ఓదార్చబడతారు?

7. “సాత్వికము” అంటే దానర్థం ఏది కాదు?

8. సాత్వికానికి దేనితో దగ్గరి సంబంధం ఉంది, మనకు ఇతరులతో ఉన్న సంబంధాల్లో ఈ లక్షణం ఉండడం ఎందుకు ప్రాముఖ్యం?

9. (ఎ) సాత్వికము ఇతరులతో మనకున్న సంబంధాలకే ఎందుకు పరిమితం కాదు? (బి) సాత్వికులు ‘భూమిని ఎలా స్వతంత్రించుకుంటారు?’

10. ‘నీతికోసం ఆకలిదప్పులతో ఉన్నవారు’ తృప్తిపరచబడడానికి ఒక మార్గమేమిటి?

11, 12. (ఎ) అభిషిక్త క్రైస్తవులు నీతిమంతులుగా ఎలా ప్రకటించబడతారు? (బి) అభిషిక్తుల సహవాసులకు నీతికోసం ఉన్న ఆకలిదప్పులు ఎలా తృప్తిపరచబడతాయి?

13, 14. మనం కనికరముగలవారమని ఏయే విధాలుగా చూపించాలి, దానివల్ల మనమెలా ప్రయోజనం పొందుతాము?

15. మనం పవిత్రమైన హృదయంగలవారిగా, శాంతియుతులుగా ఎలా ఉండవచ్చు?

16, 17. (ఎ) అభిషిక్తులు “దేవుని కుమారులు” అని ఎందుకు పిలువబడుతున్నారు, వారెలా ‘దేవుణ్ణి చూస్తారు?’ (బి) “వేరే గొఱ్ఱెలు” ఎలా ‘దేవుణ్ణి చూస్తారు?’ (సి) “వేరే గొఱ్ఱెలు” సంపూర్ణ భావంలో “దేవుని కుమారులు” ఎలా అవుతారు, ఎప్పుడు అవుతారు?

18. యేసు తెలియజేసిన మొదటి యేడు సంతోషాల ప్రకారం, నేడు నిజమైన సంతోషాన్ని ఎవరు కనుగొంటారు?

[10వ పేజీలోని చిత్రం]

‘తమ ఆధ్యాత్మిక అవసరతను గుర్తించినవారు సంతోషంగా ఉంటారు’

[10వ పేజీలోని చిత్రాలు]

‘నీతికోసం ఆకలిదప్పులతో ఉన్నవారు సంతోషంగా ఉంటారు’

[10వ పేజీలోని చిత్రం]

‘కనికరముగలవారు సంతోషంగా ఉంటారు’