హింసించబడినా సంతోషంగా ఉండడం
హింసించబడినా సంతోషంగా ఉండడం
‘నా నిమిత్తము ప్రజలు మిమ్మల్ని నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెన్నో పలికినా మీరు సంతోషంగా ఉంటారు.’—మత్తయి 5:11.
యేసు తన అపొస్తలులను రాజ్యం గురించి ప్రకటించడానికి మొదటిసారిగా పంపించినప్పుడు, వాళ్ళకు వ్యతిరేకత ఎదురవుతుందని హెచ్చరించాడు. ఆయన వాళ్ళకిలా చెప్పాడు: “మీరు నా నామము నిమిత్తము అందరిచేత ద్వేషింపబడుదురు.” (మత్తయి 10:5-18, 22) అయితే అంతకుముందు యేసు కొండమీద ఇచ్చిన ప్రసంగంలో తన అపొస్తలులకూ అక్కడున్న ఇతరులకూ, ఎదురయ్యే వ్యతిరేకత వాళ్ళ అంతరంగ సంతోషాన్ని పాడుచేయదనే హామీ ఇచ్చాడు. నిజానికి యేసు సంతోషంగా ఉండడాన్ని, క్రైస్తవులుగా హింసించబడడానికి ముడిపెట్టాడు! హింస సంతోషాన్ని ఎలా తేగలదు?
నీతి నిమిత్తం బాధలనుభవించడం
2 యేసు నివేదించిన ఎనిమిదవ సంతోషం ఇలా మత్తయి 5:10) బాధలు అనుభవించడం ప్రశంసనీయం కాదు. అపొస్తలుడైన పేతురు ఇలా వ్రాశాడు: “తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించినయెడల మీకేమి ఘనము? మేలుచేసి బాధపడునప్పుడు మీరు సహించినయెడల అది దేవునికి హితమగును.” ఆయన ఇంకా ఇలా చెప్పాడు: “మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరులజోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినయెడల అతడు సిగ్గుపడక, ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను.” (1 పేతురు 2:20; 4:15, 16) యేసు మాటల ప్రకారం నీతి కోసం బాధలను సహించడం సంతోషాన్నిస్తుంది.
ఉంది: ‘నీతి నిమిత్తం హింసింపబడేవారు సంతోషంగా ఉంటారు; పరలోకరాజ్యము వారిది.’ (3 నిజమైన నీతి దేవుని చిత్తం చేయడం ద్వారా ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించడం ద్వారా ప్రదర్శించబడుతుంది. కాబట్టి నీతి కోసం బాధలు అనుభవించడం అంటే దేవుని ప్రమాణాలను లేదా కట్టడలను ఉల్లంఘించడానికి చేయబడే ఒత్తిడిని నిరోధించినందుకు బాధలు అనుభవించడం అని అర్థం. అపొస్తలులు యేసు నామాన్ని ప్రకటించడం ఆపుచేయడానికి నిరాకరించినందుకు యూదా మతనాయకులు వాళ్ళను హింసించారు. (అపొస్తలుల కార్యములు 4:18-20; 5:27-29, 40) అది వాళ్ళ సంతోషాన్ని పాడుచేసిందా లేక వాళ్ళ ప్రకటనా పనిని ఆపుచేసిందా? లేదు! “ఆ నామముకొరకు అవమానము పొందుటకు పాత్రులని యెంచబడినందున వారు సంతోషించుచు మహా సభయెదుటనుండి వెళ్లిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు, యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి.” (అపొస్తలుల కార్యములు 5:41, 42) ఆ హింస వాళ్ళకు సంతోషాన్నిచ్చింది, ప్రకటనా పని చేయడానికి వాళ్ళకున్న ఆసక్తికి కొత్త శక్తినిచ్చింది. ఆ తర్వాత తొలి క్రైస్తవులు చక్రవర్తి ఆరాధనలో పాల్గొనడానికి నిరాకరించినందుకు రోమా దేశస్థులు వాళ్ళను హింసించారు.
4 ఆధునిక కాలాల్లో యెహోవాసాక్షులు “ఈ రాజ్య సువార్త”ను ప్రకటించడం ఆపుచేయడానికి నిరాకరించినప్పుడు హింసించబడ్డారు. (మత్తయి 24:14) వాళ్ళ క్రైస్తవ కూటాలు నిషేధించబడినప్పుడు వాళ్ళు బైబిలు ఆదేశించినట్లు సమాజముగా కూడుకోవడం మానేయడానికి బదులు బాధలు అనుభవించడానికి సుముఖంగా ఉంటారు. (హెబ్రీయులు 10:24, 25) వాళ్ళు క్రైస్తవులుగా తటస్థంగా ఉన్నందుకు, రక్తాన్ని దుర్వినియోగపరచడానికి నిరాకరించినందుకు హింసించబడ్డారు. (యోహాను 17:14; అపొస్తలుల కార్యములు 15:28, 29) అయినా కూడా దేవుని ప్రజలు నీతి కోసం స్థిరంగా నిలబడడంవల్ల వాళ్ళకు ఎంతో మనశ్శాంతి, సంతోషం లభిస్తుంది.—1 పేతురు 3:14.
క్రీస్తు నిమిత్తం నిందించబడ్డారు
5 యేసు కొండమీది ప్రసంగంలో పరిశీలించిన తొమ్మిదవ సంతోషం కూడా హింసకు సంబంధించినదే. ఆయన ఇలా చెప్పాడు: ‘నా నిమిత్తం ప్రజలు మిమ్మల్ని నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెన్నో పలికినా మీరు సంతోషంగా ఉంటారు.’ (మత్తయి 5:11) యెహోవా ప్రజలు హింసించబడడానికి ప్రాథమిక కారణం, వాళ్ళు ఈ ప్రస్తుత దుష్ట విధానంలో భాగస్థులుగా ఉండకపోవడమే. యేసు తన శిష్యులకు ఇలా చెప్పాడు: “మీరు లోకసంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును; అయితే మీరు లోకసంబంధులు కారు; నేను మిమ్మును లోకములోనుండి ఏర్పరచుకొంటిని; అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది.” (యోహాను 15:19) అదేవిధంగా అపొస్తలుడైన పేతురు ఇలా చెప్పాడు: “అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతోకూడ మీరు పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు.”—1 పేతురు 4:4.
6 తొలి క్రైస్తవులు యేసు నామాన్ని ప్రకటించడం ఆపుచేయడానికి నిరాకరించినందుకు హింసించబడ్డారని మనం ఇప్పటికే చూశాము. క్రీస్తు తన అనుచరులకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు: “మీరు . . . భూదిగంతముల వరకును నాకు సాక్షులైయుందురు.” (అపొస్తలుల కార్యములు 1:8) క్రీస్తు సహోదరుల నమ్మకమైన శేషానికి చెందినవారు “గొప్పసమూహాము”లోని తమ విశ్వసనీయ సహచరుల సహాయంతో ఆ ఆజ్ఞను అత్యంతాసక్తితో నెరవేర్చారు. (ప్రకటన 7:9) కాబట్టి సాతాను “దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసునుగూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో [దేవుని సంస్థకు సంబంధించిన పరలోక భాగం అయిన “స్త్రీ” సంతానములో] శేషించిన వారితో” యుద్ధం చేస్తున్నాడు. (ప్రకటన 12:9, 17) యెహోవాసాక్షులుగా మనం, దేవుని నీతియుక్త నూతనలోకానికి అడ్డుగా నిలిచిన మానవ ప్రభుత్వాలను నాశనం చేయబోయే రాజ్య ప్రభుత్వానికి ఇప్పుడు రాజుగా ఉన్న యేసు గురించి సాక్ష్యమిస్తున్నాము. (దానియేలు 2:44; 2 పేతురు 3:13) దానికోసమే మనం నిందించబడి హింసించబడుతున్నాము, అయితే మనం క్రీస్తు నామము కోసం బాధలు అనుభవించడానికి సంతోషిస్తున్నాము.—1 పేతురు 4:14.
7 యేసు నిమిత్తం ప్రజలు తమకు వ్యతిరేకంగా ‘అబద్ధముగా చెట్టమాటలెన్నో పలికినా’ కూడా తన అనుచరులు సంతోషంగా ఉండాలని ఆయన చెప్పాడు. (మత్తయి 5:11) అది తొలి క్రైస్తవుల విషయంలో నిజమయ్యింది. సా.శ. 59-61 మధ్యకాలంలో అపొస్తలుడైన పౌలు రోములో నిర్బంధించబడినప్పుడు యూదా నాయకులు క్రైస్తవుల గురించి ఇలా అన్నారు: “ఈ మతభేదమునుగూర్చి అంతట ఆక్షేపణ చేయుచున్నారు ఇంతమట్టుకు మాకు తెలియును.” (అపొస్తలుల కార్యములు 28:22) పౌలు, సీలా “కైసరు చట్టములకు విరోధముగా” ‘భూలోకమును తలక్రిందలు’ చేస్తున్నారని నిందించబడ్డారు.—అపొస్తలుల కార్యములు 17:6, 7.
8 రోమా సామ్రాజ్యపు కాలానికి చెందిన క్రైస్తవుల గురించి వ్రాస్తూ చరిత్రకారుడైన కె. ఎస్. లాట్యురెట్ ఇలా నివేదించాడు: “వాళ్ళపై ఎన్నో విభిన్నమైన నిందలు మోపబడ్డాయి. క్రైస్తవులు అన్యమతాలకు చెందిన ఆచారాల్లో పాల్గొనడానికి నిరాకరించేవారు కాబట్టి వాళ్ళు నాస్తికులు అని పిలువబడ్డారు. వాళ్ళు సామాజిక జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలనుండి అంటే అన్యమత పండగలు, ప్రజా వినోద కార్యక్రమాలు . . . వంటివాటినుండి దూరంగా ఉండేవారు కాబట్టి వాళ్ళు మానవజాతిని ద్వేషించేవారు అని నిందించబడ్డారు. . . . స్త్రీపురుషులు రాత్రిపూట కలుసుకునేవారని . . . విచ్చలవిడిగా లైంగిక సంబంధాలు పెట్టుకునేవారని చెప్పబడింది. . . . [క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణ] కేవలం విశ్వాసుల సమక్షంలోనే ఆచరించబడేది కాబట్టి క్రైస్తవులు క్రమంగా ఒక శిశువును బలి అర్పించి ఆ శిశువు రక్తమాంసాలను భుజించేవారనే వదంతులు ప్రారంభమయ్యాయి.” అంతేకాకుండా తొలి క్రైస్తవులు చక్రవర్తి ఆరాధనలో పాల్గొనడానికి నిరాకరించారు కాబట్టి వాళ్ళు దేశద్రోహులని నిందించబడ్డారు.
9 ఆ అబద్ధ ఆరోపణవల్ల తొలి క్రైస్తవులు రాజ్య సువార్తను ప్రకటించే తమ నియామకాన్ని ఆపుచేయలేదు. సా.శ. 60-61లో పౌలు ‘సర్వలోకములో ఫలిస్తున్న,’ “సమస్తసృష్టికి ప్రకటింపబడిన” “సువార్త” గురించి మాట్లాడగలిగాడు. (కొలొస్సయులు 1:5, 6, 23) నేడు కూడా అదే జరుగుతోంది. మొదటి శతాబ్దపు క్రైస్తవుల విషయంలో జరిగినట్లే యెహోవాసాక్షులపై అబద్ధ ఆరోపణలు చేయబడుతున్నాయి. అయినా కూడా నేడు రాజ్య సందేశాన్ని ప్రకటించే పని వర్ధిల్లుతూనే ఉంది, దానిలో భాగం వహించేవారికి అది సంతోషాన్నిస్తూనే ఉంది.
ప్రవక్తల్లాగే హింసించబడుతున్నందుకు సంతోషించడం
10 తొమ్మిదవ సంతోషం గురించి మాట్లాడడాన్ని ముగిస్తూ యేసు ఇలా అన్నాడు: ‘సంతోషించండి . . . వారు ఇలాగే మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించారు.’ (మత్తయి 5:12) విశ్వాసంలేని ఇశ్రాయేలు జనాంగాన్ని హెచ్చరించడానికి యెహోవా పంపించిన ప్రవక్తలను ప్రజలు అంగీకరించకుండా వాళ్ళను తరచూ హింసించారు. (యిర్మీయా 7:25, 26) అపొస్తలుడైన పౌలు దానిని ధృవీకరిస్తూ ఇలా వ్రాశాడు: “ఇకను ఏమి చెప్పుదును? . . . ప్రవక్తలనుగూర్చి . . . వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసముద్వారా . . . తిరస్కారములను కొరడాదెబ్బలను, మరి బంధకములను ఖైదును అనుభవించిరి.”—హెబ్రీయులు 11:32-38.
1 రాజులు 18:4, 13; 19:10) యిర్మీయా ప్రవక్త బొండలో బంధించబడ్డాడు, ఆ తర్వాత బురదతో నిండిన గోతిలో పడవేయబడ్డాడు. (యిర్మీయా 20:1, 2; 38:6) దానియేలు ప్రవక్త సింహాల గుహలో వేయబడ్డాడు. (దానియేలు 6:16, 17) ఈ క్రైస్తవ పూర్వపు ప్రవక్తలందరూ యెహోవా పరిశుద్ధారాధనను సమర్థించారు కాబట్టి హింసించబడ్డారు. చాలామంది ప్రవక్తలు యూదా మతనాయకుల చేతుల్లో హింసలు అనుభవించారు. యేసు శాస్త్రులను, పరిసయ్యులను “ప్రవక్తలను చంపినవారి కుమారులు” అని పిలిచాడు.—మత్తయి 23:31.
11 దుష్ట రాజైన ఆహాబు, అతని భార్య యెజెబెలు పరిపాలనలో యెహోవా ప్రవక్తల్లో చాలామంది ఖడ్గముతో చంపబడ్డారు. (12 నేడు యెహోవాసాక్షులుగా మనం రాజ్య సువార్తను అత్యంతాసక్తితో ప్రకటిస్తున్నాము కాబట్టి హింసించబడుతున్నాము. మనం “బలవంతంగా మత మార్పిడి” చేస్తున్నాము అని మన శత్రువులు నిందిస్తున్నారు, అయితే యెహోవా నమ్మకమైన సేవకులు పూర్వం కూడా ఇలాగే విమర్శించబడ్డారు అని మనకు తెలుసు. (యిర్మీయా 11:21; 20:8, 11) పూర్వం నమ్మకమైన ప్రవక్తలు ఏ కారణాన్ని బట్టి బాధలు అనుభవించారో అదే కారణాన్ని బట్టి బాధలు అనుభవించడాన్ని మనం ఒక ఆధిక్యతగా పరిగణిస్తాము. శిష్యుడైన యాకోబు ఇలా వ్రాశాడు: “సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను, శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము గదా?”—యాకోబు 5:10, 11.
సంతోషంగా ఉండడానికి బలమైన కారణాలు
13 హింస కారణంగా నిరుత్సాహపడడానికి బదులు మనం ప్రవక్తల, తొలి క్రైస్తవుల, స్వయంగా యేసుక్రీస్తు అడుగుజాడల్లో నడుస్తున్నామనే తలంపు మనకు ఓదార్పునిస్తుంది. (1 పేతురు 2:21) మనం అపొస్తలుడైన పేతురు వ్రాసిన ఇటువంటి లేఖనాలనుండి ఎంతో సంతృప్తిని పొందుతాము: “ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్నివంటి మహాశ్రమనుగూర్చి మీకేదో యొక వింత సంభవించునట్లు ఆశ్చర్యపడకుడి క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైనయెడల మహిమాస్వరూపియైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ, మీమీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు” లేదా సంతోషంగా ఉంటారు. (1 పేతురు 4:12, 14) మనపై యెహోవా ఆత్మ నిలిచివుంటుంది కాబట్టి, అది మనల్ని బలపరుస్తుంది కాబట్టి మనం హింసించబడినప్పుడు స్థిరంగా నిలబడగలుగుతున్నాము అని మనకు అనుభవపూర్వకంగా తెలుసు. పరిశుద్ధాత్మ ఇచ్చే మద్దతు, యెహోవా ఆశీర్వాదం మనపై ఉందనడానికి రుజువుగా ఉంది, అది మనకు ఎంతో సంతోషాన్నిస్తుంది.—కీర్తన 5:12; ఫిలిప్పీయులు 1:27-29.
14 నీతికోసం వ్యతిరేకతను, హింసను అనుభవించడం మనల్ని సంతోషపరచడానికి మరొక కారణమేమిటంటే, అది మనం దైవభక్తిగల నిజ క్రైస్తవులుగా జీవిస్తున్నామని నిరూపిస్తుంది. అపొస్తలుడైన పౌలు 2 తిమోతి 3:12) మనం పరీక్షలను ఎదుర్కొన్నప్పుడు మన యథార్థతను కాపాడుకుంటే, యెహోవా సృష్టిప్రాణులందరూ ఆయనను స్వార్థపూరితమైన ఉద్దేశాలతోనే సేవిస్తున్నారు అని సాతాను చేసిన సవాలుకు అదనపు సమాధానం ఇచ్చినవారిగా ఉంటాము అనే తలంపు మనకు ఎంతో సంతోషాన్నిస్తుంది. (యోబు 1:9-11; 2:3, 4) యెహోవా నీతియుక్తమైన సర్వాధిపత్యాన్ని సమర్థించడంలో మనకు ఎంత చిన్న భాగమున్నా సరే, మనం సంతోషిస్తాము.—సామెతలు 27:11.
ఇలా వ్రాశాడు: “క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదుక నుద్దేశించువారందరు హింసపొందుదురు.” (ప్రతిఫలమునుబట్టి సంతోషించండి
15 పూర్వపు ప్రవక్తల్లాగే నిందించబడి హింసించబడినప్పుడు సంతోషించడానికి యేసు మరో కారణాన్ని కూడా ఇచ్చాడు. తొమ్మిదవ సంతోషాన్ని తెలియజేసేటప్పుడు చివర్లో ఆయన ఇలా అన్నాడు: ‘సంతోషించండి, ఆనందంతో గంతులు వేయండి, పరలోకములో మీ ప్రతిఫలము గొప్పగా ఉంటుంది.’ (మత్తయి 5:12) అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము.” (రోమీయులు 6:23) అవును మనకు లభించే ‘గొప్ప ప్రతిఫలము’ జీవం, దానిని జీతముగా మనం సంపాదించుకోలేము. అది ఉచితంగా ఇవ్వబడే బహుమానము. ఆ ప్రతిఫలము “పరలోకములో” ఉందని యేసు చెప్పాడు ఎందుకంటే అది యెహోవానుండి వస్తుంది.
16 అభిషిక్తులకు “జీవకిరీటము” ఇవ్వబడుతుంది, అంటే వాళ్ళకు పరలోకంలో క్రీస్తుతోపాటు ఉండేలా అమర్త్యమైన జీవం ఇవ్వబడుతుంది. (యాకోబు 1:12, 17) భూనిరీక్షణగలవారు అంటే “వేరే గొఱ్ఱెలు” భూపరదైసులో నిత్యం జీవించాలని ఎదురు చూస్తారు. (యోహాను 10:16; ప్రకటన 21:3-5) ఈ రెండు తరగతులవారికి లభించే “ప్రతిఫలము” వాళ్ళు సంపాదించుకున్నది కాదు. అభిషిక్తులు అలాగే “వేరే గొఱ్ఱెలు” యెహోవా “అత్యధికమైన కృప” కారణంగానే తమ ప్రతిఫలాన్ని పొందుతారు. దేవుని కృప గురించి అపొస్తలుడైన పౌలు ఇలా అనేందుకు పురికొల్పబడ్డాడు: “చెప్ప శక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము.”—2 కొరింథీయులు 9:14, 15.
17 క్రైస్తవులకు—వీళ్ళలో కొంతమంది ఆ తర్వాత నీరో చక్రవర్తి ద్వారా క్రూరంగా హింసించబడ్డారు—అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని యెరిగి శ్రమలయందును అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు.” ఆయన ఇంకా ఇలా వ్రాశాడు: “నిరీక్షణగలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పుగలవారై . . . యుండుడి.” (రోమీయులు 5:3-5; 12:12) మన నిరీక్షణ పరలోక సంబంధమైనదైనా లేదా భూసంబంధమైనదైనా, శ్రమలు ఎదురైనప్పుడు నమ్మకంగా ఉన్నందుకు మనకు లభించే ప్రతిఫలం ఎంతో గొప్పది. మన రాజైన యేసుక్రీస్తు పరిపాలన క్రింద మన ప్రేమపూర్వక తండ్రి అయిన యెహోవాను సేవించడానికి, ఆయనను స్తుతించడానికి నిరంతరం జీవించే ఉత్తరాపేక్ష లభించినందుకు మన సంతోషానికి హద్దులు లేవు. మనం సూచనార్థకంగా ‘ఆనందంతో గంతులు’ వేస్తాము.
18 కొన్ని దేశాల్లో యెహోవాసాక్షులు హింసించబడ్డారు, ఇంకా హింసించబడుతూనే ఉన్నారు. యుగసమాప్తికి సంబంధించిన ప్రవచనంలో యేసు నిజ క్రైస్తవులను ఇలా హెచ్చరించాడు: ‘అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలుచేసి చంపెదరు; మీరు నా నామము నిమిత్తము సకల జనములచేత ద్వేషింపబడుదురు.’ (మత్తయి 24:9) మనం అంతాన్ని సమీపిస్తుండగా జనాంగాలు యెహోవా ప్రజలకు వ్యతిరేకంగా తమ ద్వేషాన్ని ప్రదర్శించేలా సాతాను చేస్తాడు. (యెహెజ్కేలు 38:10-12, 14-16) అది యెహోవా చర్య తీసుకునే సమయం వచ్చిందని సూచిస్తుంది. “నేను యెహోవానై యున్నానని అన్యజనులు అనేకులు తెలిసికొనునట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరచుకొని వారి యెదుట నన్ను తెలియపరచుకొందును.” (యెహెజ్కేలు 38:23) ఆ విధంగా యెహోవా తన గొప్ప నామాన్ని పరిశుద్ధపరచి, తన ప్రజలను హింసనుండి విడుదల చేస్తాడు. కాబట్టి “శోధన సహించువాడు ధన్యుడు” లేదా సంతోషంగా ఉంటాడు.—యాకోబు 1:12.
19 యెహోవా గొప్ప “దినము” సమీపిస్తుండగా మనం సంతోషిద్దాము ఎందుకంటే మనం యేసు నామము కోసం ‘అవమానము పొందడానికి పాత్రులుగా ఎంచబడ్డాము.’ (2 పేతురు 3:10-13; అపొస్తలుల కార్యములు 5:41) మనం తొలి క్రైస్తవుల్లాగే యెహోవా నీతియుక్త నూతనలోకంలో మనకు లభించబోయే ప్రతిఫలం కోసం ఎదురు చూస్తూ క్రీస్తు గురించి ఆయన రాజ్య ప్రభుత్వము గురించి ‘మానక బోధించుచు ప్రకటిద్దాము.’—అపొస్తలుల కార్యములు 5:42; యాకోబు 5:11.
పునఃసమీక్షా ప్రశ్నలు
• నీతికోసం బాధలు అనుభవించడం అంటే ఏమిటి?
• తొలి క్రైస్తవులపై హింస ఎలాంటి ప్రభావం చూపించింది?
• యెహోవాసాక్షులు పూర్వపు ప్రవక్తలవలే హింసించబడుతున్నారని ఎందుకు చెప్పవచ్చు?
• మనం హింసించబడినందుకు ఎందుకు సంతోషించి ‘ఆనందంతో గంతులు వేయవచ్చు?’
[అధ్యయన ప్రశ్నలు]
1. సంతోషం, హింస గురించి యేసు తన అనుచరులకు ఎలాంటి హామీ ఇచ్చాడు?
2. యేసు మరియు అపొస్తలుడైన పేతురు చెప్పిన ప్రకారం, దేనికోసం బాధలు అనుభవించడం సంతోషాన్నిస్తుంది?
3. (ఎ) నీతికోసం హింసించబడడం అంటే ఏమిటి? (బి) తొలి క్రైస్తవులపై హింస ఎలాంటి ప్రభావం చూపించింది?
4. క్రైస్తవులు హింసించబడడానికి కొన్ని కారణాలేమిటి?
5. నేడు యెహోవా ప్రజలు ఏ ప్రాథమిక కారణాన్నిబట్టి హింసించబడుతున్నారు?
6. (ఎ) అభిషిక్త శేషానికి చెందినవారు, వారి సహవాసులు ఎందుకు నిందించబడి హింసించబడుతున్నారు? (బి) అలాంటి నింద మన సంతోషాన్ని తక్కువ చేస్తుందా?
7, 8. తొలి క్రైస్తవులకు విరుద్ధంగా వ్యతిరేకులు ఎలాంటి అబద్ధాలు చెప్పారు?
9. మొదటి శతాబ్దపు క్రైస్తవులు తమకు వ్యతిరేకంగా చేయబడిన అబద్ధ ఆరోపణలకు ఎలా ప్రతిస్పందించారు, నేడు పరిస్థితి ఎలా ఉంది?
10, 11. (ఎ) యేసు తొమ్మిదవ సంతోషం గురించి మాట్లాడడాన్ని ముగిస్తూ ఏమన్నాడు? (బి) ప్రవక్తలు ఎందుకు హింసించబడ్డారు? ఉదాహరణలు ఇవ్వండి.
12. యెహోవాసాక్షులుగా మనం పూర్వం ప్రవక్తలు హింసించబడినట్లే హింసించబడడాన్ని ఒక ఆధిక్యతగా ఎందుకు పరిగణిస్తాము?
13. (ఎ) మనం హింస కారణంగా ఎందుకు నిరుత్సాహపడము? (బి) మనం స్థిరంగా నిలబడడానికి ఏది సహాయం చేస్తుంది, అది దేనికి రుజువుగా ఉంది?
14. నీతికోసం హింసించబడినప్పుడు సంతోషించడానికి మనకు ఎలాంటి కారణాలు ఉన్నాయి?
15, 16. (ఎ) మనం ‘సంతోషించడానికి, ఆనందంతో గంతులు వేయడానికి’ యేసు ఏ కారణం చెప్పాడు? (బి) అభిషిక్త క్రైస్తవుల కోసం పరలోకంలో ఏ ప్రతిఫలం వేచివుంది, వాళ్ళ సహవాసులైన “వేరే గొఱ్ఱెలకు” కూడా ఏ ప్రతిఫలం లభిస్తుంది?
17. మనం హింసించబడినప్పుడు ఎందుకు సంతోషించవచ్చు, సూచనార్థకంగా ఎందుకు ‘ఆనందంతో గంతులు’ వేయవచ్చు?
18. అంతం సమీపిస్తున్న కొద్దీ జనాంగాలు ఏమి చేస్తాయని ఎదురు చూడవచ్చు, అప్పుడు యెహోవా ఏమి చేస్తాడు?
19. యెహోవా గొప్ప “దినము” కోసం ఎదురు చూస్తూ మనం ఏమి చేయాలి?
[16, 17వ పేజీలోని చిత్రాలు]
‘ప్రజలు మిమ్మల్ని నిందించి హింసించినా మీరు సంతోషంగా ఉంటారు’
[చిత్రసౌజన్యం]
చెరసాలలోని గుంపు: Chicago Herald-American