కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నిరంతరం జీవించాలని మీరు ఆశిస్తున్నారా?

నిరంతరం జీవించాలని మీరు ఆశిస్తున్నారా?

నిరంతరం జీవించాలని మీరు ఆశిస్తున్నారా?

“నాకు చావంటే భయంలేదు. కానీ ఈ పూలను విడిచి వెళ్ళాలనే తలంపు నన్ను బాధపెడుతోంది” అని జపాన్‌కు చెందిన ఒక వృద్ధురాలు చెప్పింది. ఆమెను సందర్శించిన క్రైస్తవ పరిచారకురాలు ఆమె బాధను అర్థం చేసుకుంది, ఆ వృద్ధురాలికి అందమైన తోట ఉంది. తమకు చావంటే భయం లేదని చెప్పే చాలామంది సృష్టిలోని అద్భుతాలను చూసి ఎంతో ఆనందిస్తారు, అలాంటివారు నిరంతరం జీవించాలని ఎంతగానో ఆశిస్తుండవచ్చు.

నిరంతరం జీవించడమా? చాలామంది ప్రజలు అలాంటిది సాధ్యం కాదని కొట్టిపారేస్తారు. తమకు నిరంతరం జీవించాలనే కోరిక లేదని కూడా కొందరు అనవచ్చు. ప్రజలు ఎందుకు అలా భావిస్తారు?

నిరంతర జీవితం​—⁠విసుగు పుట్టిస్తుందా?

నిరంతర జీవితం విసుగు పుట్టించేదిగా ఉంటుందని కొందరు అనుకుంటారు. ఊరికే కూర్చుని టీవీ చూడడం తప్ప మరే పని లేకుండా చాలామంది వృద్ధులు గడిపే యాంత్రికమైన జీవితాలను వారు ఉదాహరణగా చూపించవచ్చు. మీరు కూడా అలాగే భావిస్తుంటే, నిరంతర జీవితం ఒక ఆశీర్వాదమా లేక శాపమా అని ప్రశ్నించినప్పుడు వ్యోమగామి రాబర్ట్‌ జాస్ట్రో ఇచ్చిన సమాధానాన్ని పరిశీలించండి. ఆయన ఇలా అన్నాడు: “జిజ్ఞాసగల మనస్సు, నేర్చుకోవాలనే అంతులేని కోరిక ఉన్నవారికి అది ఒక ఆశీర్వాదంగానే ఉంటుంది. జ్ఞానం సంపాదించుకోవడానికి అంతులేని సమయం ఉందని తెలుసుకోవడం వారికి సంతోషకరంగా ఉంటుంది. కానీ కొత్త విషయాలు నేర్చుకోవడం ఇష్టంలేని వారికి, మనస్సులు మూతపడినవారికి అది ఘోరమైన శాపంగా ఉంటుంది. వారికి తమ సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు.”

నిరంతర జీవితం విసుగు పుట్టించేదిగా ఉంటుందా లేక ఆసక్తికరంగా ఉంటుందా అనేది చాలామట్టుకు మీ వైఖరిపైనే ఆధారపడి ఉంటుంది. మీకు ‘జిజ్ఞాసగల మనస్సు, నేర్చుకోవాలనే అంతులేని కోరిక’ ఉంటే కళలు, సంగీతం, భవన నిర్మాణ కళ, తోటపని వంటివాటిల్లో లేదా మీరు ఇష్టపడే ఇతర పనులు చేయడంలో మీరు సాధించగలవాటి గురించి ఆలోచించండి. భూమ్మీద నిరంతరం జీవించడం, అనేక క్షేత్రాల్లో మీ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి అద్భుతమైన అవకాశాలను కల్పిస్తుంది.

నిరంతరం ప్రేమ చూపించగలగడం, ప్రేమను పొందగలగడం నిత్యజీవాన్ని ఎంతో సంతృప్తికరంగా చేస్తాయి. మనం ప్రేమ చూపించే సామర్థ్యంతో సృష్టించబడ్డాము, ఇతరులు మనల్ని ప్రేమిస్తున్నారని గ్రహించినప్పుడు మనం సంతోషంగా ఉంటాము. ఒకరిపట్ల ఒకరు నిజమైన ప్రేమను చూపించడం లోతైన సంతృప్తినిస్తుంది, అలాంటి సంతృప్తి నిరంతరం నిలిచివుంటుంది. నిరంతరం జీవిస్తే తోటి మానవులపట్లే కాక ప్రత్యేకంగా దేవునిపట్ల కూడా ప్రేమను పెంపొందించుకోవడానికి అపరిమిత అవకాశాలు లభిస్తాయి. “ఒకడు దేవుని ప్రేమించిన యెడల అతడు దేవునికి ఎరుకైనవాడే” అని అపొస్తలుడైన పౌలు చెప్పాడు. (1 కొరింథీయులు 8:⁠3) విశ్వ సర్వాధిపతిని మనం తెలుసుకోవడం, ఆయనకు మనం తెలిసివుండడం ఎంత అద్భుతమైన ఉత్తరాపేక్షో కదా! అంతేకాకుండా మన ప్రేమగల సృష్టికర్త గురించి తెలుసుకోవడానికి అంతులేదు. అలాంటప్పుడు నిత్యజీవితం విసుగు పుట్టించేదిగా, నిష్ప్రయోజనమైనదిగా ఎలా ఉంటుంది?

జీవితం​—⁠క్షణికమైనది కాబట్టే అమూల్యమైనదా?

జీవితం క్షణికమైనది కాబట్టే అది అంత అమూల్యమైనది అని కొందరు భావిస్తారు. వారు జీవితాన్ని కేవలం పరిమిత పరిమాణంలోనే లభించే బంగారంతో పోల్చవచ్చు. ఒకవేళ బంగారం ప్రతిచోటా లభిస్తే దాని విలువ తగ్గిపోతుందని వారంటారు. అయినా కూడా బంగారం ఇంకా అందమైనదిగానే ఉంటుంది. జీవితం కూడా అంతే.

మనం నిరంతరం జీవించడాన్ని గాలి సమృద్ధిగా ఉండడంతో పోల్చవచ్చు. సరిగ్గా పనిచేయని జలాంతర్గామిలో చిక్కుకుపోయిన నావికులు గాలిని ఎంతో విలువైనదిగా పరిగణిస్తారు. వారు రక్షించబడిన తర్వాత పైకి వచ్చినప్పుడు గాలి సమృద్ధిగా ఉందని కృతజ్ఞత లేకుండా ఫిర్యాదు చేస్తారా? ఎంతమాత్రం చేయరు!

అలాంటి నావికుల్లాగే మనం నిరంతరం జీవించే మరింత గొప్ప ఉత్తరాపేక్షతో రక్షించబడే అవకాశం ఉంది. “పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (రోమీయులు 6:​23) యేసు విమోచనా క్రయధన బలి ద్వారా దేవుడు మానవుల అపరిపూర్ణతను, మరణాన్ని నిర్మూలించి విధేయులైనవారికి నిత్యజీవమనే బహుమానాన్ని అనుగ్రహిస్తాడు. అలాంటి ప్రేమపూర్వకమైన ఏర్పాటు చేసినందుకు మనమెంత కృతజ్ఞులమై ఉండాలో కదా!

మీ ప్రియమైనవారి సంగతేమిటి?

కొందరు ఇలా ఆలోచించవచ్చు: ‘నా ప్రియమైనవారి సంగతేమిటి? వారు నాతోపాటు లేకపోతే నిరంతరం జీవించడం అంత సంతృప్తికరంగా ఉండదు.’ బహుశా మీరు బైబిలు జ్ఞానాన్ని సంపాదించుకొని భూపరదైసులో నిత్యం జీవించే అవకాశముందని తెలుసుకొని ఉండవచ్చు. (లూకా 23:43; యోహాను 3:16; 17:⁠3) కాబట్టి సహజంగానే మీ కుటుంబ సభ్యులు, ప్రియమైనవారు, సన్నిహిత స్నేహితులు మీతోపాటు ఉండాలని, దేవుడు వాగ్దానం చేసిన నీతియుక్త నూతనలోకంలో మీరు అనుభవించాలని ఎదురుచూస్తున్న ఆనందాన్ని వారు కూడా అనుభవించాలని మీరు కోరుకుంటారు.​—⁠2 పేతురు 3:13.

కానీ మీ స్నేహితులు, ప్రియమైనవారు పరదైసు భూమిపై నిరంతరం జీవించడానికి ఆసక్తి చూపించకపోతే అప్పుడెలా? దానినిబట్టి నిరుత్సాహపడకండి. ఖచ్చితమైన లేఖనాధార జ్ఞానాన్ని సంపాదించుకుంటూ దాని అనుసారంగా నడుచుకోండి. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “ఓ స్త్రీ, నీ భర్తను రక్షించెదవో లేదో నీకేమి తెలియును? ఓ పురుషుడా, నీ భార్యను రక్షించెదవో లేదో నీకేమి తెలియును?” (1 కొరింథీయులు 7:​16) ప్రజలు మారే అవకాశం ఉంది. ఉదాహరణకు ఒకప్పుడు క్రైస్తవత్వాన్ని వ్యతిరేకించిన వ్యక్తి మారి ఆ తర్వాత క్రైస్తవ సంఘంలో పెద్దగా సేవ చేస్తున్నాడు. ఆయన ఇలా అంటున్నాడు: “నేను ఎంతో వ్యతిరేకించినా నా ప్రియమైన కుటుంబ సభ్యులు తమ బైబిలు సూత్రాలను అంటిపెట్టుకొని ఉన్నందుకు నేను ఎంతో కృతజ్ఞుడిని.”

మీ జీవితం గురించి, మీ ప్రియమైనవారి జీవితాల గురించి దేవుడు ఎంతో శ్రద్ధ కలిగివున్నాడు. నిజానికి యెహోవా “యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు[న్నాడు].” (2 పేతురు 3:⁠9) మీరు మీ ప్రియమైనవారు నిరంతరం జీవించాలని యెహోవా దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ప్రేమ అపరిపూర్ణ మానవుల ప్రేమకంటే గొప్పది. (యెషయా 49:​15) కాబట్టి దేవునితో మంచి సంబంధాన్ని ఎందుకు పెంపొందించుకోకూడదు? అప్పుడు మీ ప్రియమైనవారు కూడా అలాగే చేయడానికి మీరు సహాయం చేయవచ్చు. వారికి నిరంతరం జీవించే నిరీక్షణ ప్రస్తుతం లేకపోయినా, మీరు బైబిలుకు సంబంధించిన ఖచ్చితమైన జ్ఞానానికి అనుగుణంగా నడుచుకోవడాన్ని చూసినప్పుడు వారి వైఖరి మారవచ్చు.

మరి మరణించిన ప్రియమైనవారి సంగతేమిటి? మరణించిన కోట్లాదిమందికి బైబిలు అద్భుతమైన పునరుత్థాన నిరీక్షణను, అంటే మరణంనుండి తిరిగి లేపబడి భూపరదైసులో జీవించే నిరీక్షణను ఇస్తుంది. యేసుక్రీస్తు ఇలా వాగ్దానం చేశాడు: “ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు . . . బయటికి వచ్చెదరు.” (యోహాను 5:​28, 29) దేవుని గురించి తెలుసుకోకుండానే మరణించినవారు కూడా తిరిగి బ్రదికించబడతారు ఎందుకంటే బైబిలు ఇలా చెబుతోంది: “నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నది.” (అపొస్తలుల కార్యములు 24:​14-15) అలాంటి వారిని తిరిగి జీవానికి ఆహ్వానించడం ఎంత సంతోషకరమైనదిగా ఉంటుందో కదా!

నిరంతర జీవితం​—⁠ఒక సంతోషకరమైన ఉత్తరాపేక్ష

ఈ లోకంలోని కష్టాలన్నింటి మధ్య కూడా మీరు సంతోషాన్ని సంతృప్తిని అనుభవించగలిగితే, మీరు పరదైసు భూమిపై నిరంతర జీవితాన్ని తప్పకుండా ఆనందిస్తారు. అయితే ఒక యెహోవాసాక్షి నిరంతర జీవితపు ఆశీర్వాదాల గురించి చెప్పినప్పుడు ఒక స్త్రీ ఇలా అంది: “నాకు నిరంతరం జీవించడం ఇష్టంలేదు. 70 లేక 80 సంవత్సరాల ఈ జీవితం నాకు చాలు.” అక్కడే ఉన్న ఒక క్రైస్తవ పెద్ద ఆమెను ఇలా ప్రశ్నించాడు: “మీరు మరణిస్తే మీ పిల్లలు ఎలా భావిస్తారో ఎప్పుడైనా ఆలోచించారా?” తను చనిపోయినప్పుడు తన పిల్లలు అనుభవించే బాధను తలచుకున్నప్పుడు ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. “నేను ఎంత స్వార్థపూరితంగా ఆలోచించానో మొట్టమొదటిసారిగా గ్రహించాను. నిరంతర జీవితం ఒక స్వార్థపూరితమైన నిరీక్షణ కాదు, దానిలో ఇతరులతో మనకున్న సంబంధాలు ఇమిడివున్నాయి” అని ఆమె ఒప్పుకుంది.

తాము బ్రతికివున్నా, చనిపోయినా పట్టించుకునేవారు లేరని కొందరు భావించవచ్చు. అయితే మన జీవదాతకు పట్టింపు ఉంది, ఆయన ఇలా అంటున్నాడు: “నా జీవముతోడు దుర్మార్గుడు మరణము నొందుటవలన నాకు సంతోషము లేదు; దుర్మార్గుడు తన దుర్మార్గతనుండి మరలి బ్రదుకుటవలన నాకు సంతోషము కలుగును.” (యెహెజ్కేలు 33:​11) దేవుడు దుర్మార్గుల జీవితం గురించి కూడా అంత పట్టింపు కలిగివుంటే తనను ప్రేమించేవారి గురించి ఆయన అంతకంటే ఎక్కువ శ్రద్ధే కలిగి ఉంటాడు.

ప్రాచీన ఇశ్రాయేలు రాజైన దావీదుకు యెహోవా ప్రేమపూర్వకమైన శ్రద్ధపై దృఢమైన నమ్మకం ఉండేది. దావీదు ఒకసారి ఇలా అన్నాడు: “నా తలిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును.” (కీర్తన 27:⁠10) తన తల్లిదండ్రులు తనను ఎంతగా ప్రేమిస్తున్నారో దావీదుకు తెలిసే ఉండవచ్చు. కానీ తన తల్లిదండ్రులు, అంటే మానవుల్లో అత్యంత సన్నిహితులైనవారు తనను విడిచిపెట్టినా దేవుడు మాత్రం తనను విడిచిపెట్టడని ఆయనకు తెలుసు. యెహోవాకు మనపట్ల ప్రేమా శ్రద్ధా ఉన్నాయి కాబట్టే ఆయన మనకు నిరంతర జీవితాన్ని, తనతో నిరంతర స్నేహాన్ని అనుగ్రహిస్తున్నాడు. (యాకోబు 2:​23) ఈ అద్భుతమైన బహుమానాలను మనం కృజ్ఞతాపూర్వకంగా అంగీకరించవద్దా?

[7వ పేజీలోని చిత్రం]

దేవునిపట్ల, పొరుగువారిపట్ల ఉన్న ప్రేమ నిరంతర జీవితాన్ని సంతృప్తికరమైనదిగా చేస్తుంది