కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో దయ్యాలు ఎక్కడ ఉంటారు?

బైబిలు ఈ ప్రశ్నకు స్పష్టంగా జవాబు ఇవ్వడం లేదు. అయినప్పటికీ, క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో దయ్యాలు ఎక్కడ ఉంటారనే విషయంలో మనం సహేతుకంగా ఒక నిర్ధారణకు రావచ్చు.

ఈ వెయ్యేండ్ల పాలన ఆరంభంలో, అంతంలో జరగనున్న వాటి గురించి అపొస్తలుడైన యోహాను ఇలా వివరిస్తున్నాడు: “పెద్దసంకెళ్లను చేత పట్టుకొని అగాధముయొక్క తాళపుచెవిగల యొక దేవదూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆదిసర్పమును, అనగా అపవాదియు సాతానును అను ఆ ఘటసర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి, ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్రవేసెను; అటుపిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను.” (ప్రకటన 20:​1-3) ఈ లేఖనాలు సాతాను అగాధంలో బంధించబడడం, చివరిగా కొంతకాలం కోసం విడుదల చేయబడడం గురించి మాత్రమే చెబుతున్నాయి. అయితే ఇక్కడ దయ్యాల గురించి చెప్పకపోయినా, అగాధము యొక్క తాళపుచెవిగల దేవదూత అంటే మహిమపరచబడిన యేసుక్రీస్తు సాతానును బంధించి అగాధంలో వేసినప్పుడు అతని దయ్యాలకు కూడా అలాగే చేస్తాడనడం సహేతుకమే.​—⁠ప్రకటన 9:​11.

1914లో యేసుక్రీస్తు పరలోకంలో రాజైన తర్వాత ఒక చర్య తీసుకున్నాడు, అది సాతానుతోపాటు అతని దయ్యాలపై తీవ్ర ప్రభావం చూపించింది. ప్రకటన 12:​7-9 వచనాలు ఇలా చెబుతున్నాయి: “అంతట పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలును ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలెనని యుండగా ఆ ఘటసర్పమును దాని దూతలును [దయ్యాలు] యుద్ధము చేసిరి గాని గెలువ లేకపోయిరి గనుక పరలోకమందు వారికిక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోస పుచ్చుచు, అపవాదియనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘటసర్పము పడద్రోయబడెను. అది భూమిమీద పడద్రోయబడెను; దాని దూతలు దానితో కూడ పడద్రోయబడిరి.” అప్పటినుండి సాతాను అతని దయ్యాలు భూపరిసరాలకే పరిమితం చేయబడ్డారు. భూమిని దుష్ట ప్రభావం నుండి విడిపించడం కోసం సాతాను క్రియలను ఇంకా అదుపు చేయడానికి యేసుక్రీస్తు ఎలాంటి చర్యలు తీసుకుంటాడో అదే దయ్యాల విషయంలో కూడా జరుగుతుందని మనం సహేతుకంగా భావించవచ్చు.

బైబిలులోని మొట్టమొదటి ప్రవచనాన్ని కూడా గమనించండి. అదిలా చెబుతోంది: “నేను [దేవుడు] నీకును [సాతాను] స్త్రీకిని [యెహోవా పరలోక సంస్థ] నీ సంతానమునకును [సాతాను సంబంధీకులు] ఆమె సంతానమునకును [యేసుక్రీస్తు] వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువు.” (ఆదికాండము 3​15) సర్పము తలమీద కొట్టడంలో, క్రీస్తు వెయ్యేండ్ల పాలనా కాలంలో సాతాను అగాధంలో బంధించబడడం ఒక భాగం. సర్పము తలమీద కొట్టే వ్యక్తికీ సాతాను సంతానానికీ మధ్య శత్రుత్వం ఉంటుందని కూడా ఆ ప్రవచనం చెబుతోంది. ఆ సంతానంలో లేదా సంస్థలో, దుష్టదూతలతో లేదా దయ్యాలతో ఏర్పడిన ఒక అదృశ్య భాగం ఉంది. కాబట్టి యేసు సాతానును అగాధంలో బంధించేటప్పుడు, అతని దయ్యాలను కూడా బంధించి అగాధంలో వేస్తాడనే నిర్ధారణకు రావడం సహేతుకమే. దుష్టదూతలు పాతాళమనే సరికి చాలా భయపడడాన్ని బట్టి చూస్తే, రానున్న నిర్బంధం గురించి వాళ్ళకు ముందే తెలుసని అర్థమవుతోంది.​—⁠లూకా 8:​30, 31.

అయితే ప్రకటన 20:​1-3లో దయ్యాలు గురించి చెప్పబడలేదంటే, వాళ్ళు అర్మగిద్దోనులోనే సాతాను సంతానంలోని దృశ్య భాగంతోపాటు నాశనమయ్యారని దానర్థమా? అలాంటి సాధ్యత లేదని బైబిలు చెబుతోంది. అది సాతాను అవసాన దశ గురించి ఇలా చెబుతోంది: “వారిని మోసపరచిన అపవాది అగ్ని గంధకములుగల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూరమృగమును అబద్ధప్రవక్తయు ఉన్నారు; వారు యుగయుగములు రాత్రింబగళ్లు బాధింపబడుదురు.” (ప్రకటన 20:​10) ఆ క్రూరమృగము, అబద్ధప్రవక్తలు సాతాను దృశ్య సంస్థలో భాగమైన రాజకీయ శక్తులకు ప్రతీకలు. (ప్రకటన 13:​1, 2, 11-14; 16:​13, 14) దేవుని రాజ్యం ఈ లోక రాజ్యాలన్నింటినీ అర్మగిద్దోనులో నిర్మూలం చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా అంతమవుతారు. (దానియేలు 2:​44) బైబిలు “అపవాదికిని వాని దూతలకును” నిత్యాగ్ని సిద్ధపరచబడిందని సూచిస్తోంది. (ఇటాలిక్కులు మావి.) (మత్తయి 25:​41) క్రూరమృగము, అబద్ధప్రవక్త పడవేయబడిన “అగ్ని గంధకములుగల గుండములో”నే సాతానూ అతని దయ్యములూ పడవేయబడి నిత్య నాశనం చేయబడతారు. సాతాను సంతానంలోని అత్యంత శక్తివంతమైన అదృశ్య ఆత్మల భాగం అర్మగిద్దోనులోనే నాశనం చేయబడితే, ఆ సూచనార్థక గుండంలో క్రూరమృగము, అబద్ధప్రవక్తలతోపాటు దయ్యాలు కూడా పడవేయబడినట్లు తప్పకుండా చెప్పేదే. ప్రకటన 20:10లో దయ్యాల గురించి చెప్పబడలేదంటే వాళ్ళు అర్మగిద్దోనులో నాశనం చేయబడలేదనే సూచిస్తోంది.

దయ్యాలు అగాధంలో పడవేయబడ్డట్లు స్పష్టంగా ప్రస్తావించబడనట్లే, వాళ్ళు అక్కడి నుండి విడుదల చేయబడినట్లు కూడా స్పష్టంగా చెప్పబడలేదు. అయినా చివరకు వాళ్ళకు కూడా, అపవాదికి పట్టే గతే పడుతుంది. ఆ దయ్యాలు వెయ్యి సంవత్సరాల ముగింపులో మానవాళికి జరిగే అంతిమ పరీక్షా కాలంలో, అపవాదితోపాటు విడుదల చేయబడ్డాక అతనికి సహకరిస్తారు. చివరకు వాళ్ళు కూడా అగ్నిగుండంలో పడవేయబడి నిత్య నాశనానికి గురవుతారు.​—⁠ప్రకటన 20:​7-9.

దీన్నిబట్టి, ప్రకటన 20:​1-3 వచనాలు సాతాను మాత్రమే బంధించబడి నిష్క్రియమైన అగాధంలో పడవేయబడతాడన్నట్లు చెబుతున్నా, అతని దూతలు కూడా బంధించబడి అగాధంలో పడవేయబడతారనే నిర్ధారణకు మనం సహేతుకంగా రావచ్చు. సాతాను గానీ అతని దయ్యాల మూకగానీ, క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనలో ఈ భూమిని పరదైసుగా మార్చి మానవాళిని పరిపూర్ణతకు తీసుకురావాలనే దేవుని సంకల్ప నెరవేర్పులో జోక్యం చేసుకోవడానికి అనుమతించబడరు.