కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రజలు ఎంతకాలం జీవించగలరు?

ప్రజలు ఎంతకాలం జీవించగలరు?

ప్రజలు ఎంతకాలం జీవించగలరు?

స్పెయిన్‌ దేశానికి చెందిన క్వాన్‌ పాన్సే డే లేయాన్‌ అనే అన్వేషకుడు 1513, మార్చి 3వ తేదీన గమనార్హమైన సాహసకార్యానికి నడుం బిగించి ఓడ ప్రయాణం ప్రారంభించాడు. ఆయన బిమిని ద్వీపానికి చేరుకోవాలనే ఉద్దేశంతో ప్యూర్టోరికోనుండి బయలుదేరాడు. ఆయన ఒక అద్భుతమైన జలధార కోసం అంటే యౌవనపు జలధార కోసం అన్వేషించడానికి వెళ్ళాడని ప్రజలు నమ్ముతారు. కానీ ఆయన ప్రస్తుతం అమెరికాకు చెందిన ఫ్లోరిడాకు చేరుకున్నాడు. ఆయనకు ఆ జలధార దొరకలేదు, ఎందుకంటే అలాంటి జలధార ఉనికిలోనే లేదు.

నేడు ప్రజలు సాధారణంగా 70 లేక 80 సంవత్సరాలకంటే ఎక్కువకాలం జీవించడంలేదు. అంతకంటే ఎంతో ఎక్కువకాలంపాటు జీవించిన ప్రజల గురించి బైబిలు ప్రస్తావించినా, ఇప్పటివరకూ అందరికంటే ఎక్కువకాలం బ్రతికిన వ్యక్తి వయస్సు 122 సంవత్సరాల 164 రోజులు అని 2002 గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ చెబుతోంది. (ఆదికాండము 5:3-32) అయితే జీవనీతి శాస్త్రజ్ఞుడైన జాన్‌ హ్యారిస్‌ ఇలా అన్నాడు: “వృద్ధాప్యం, చివరికి మరణం కూడా ఇక ఎంతమాత్రం అనివార్యమైనవిగా ఉండని సమాజాన్ని నెలకొల్పడం సాధ్యం కావచ్చు అని కొత్త పరిశోధనలు చూపిస్తున్నాయి.” 21వ శతాబ్దానికి చెందిన పరిశోధకులు చాలామంది “నిజమైన అమర్త్యత,” “2099 కల్లా మానవుల ఆయుష్షుకు పరిమితులు ఉండవు,” “కణాలకు వృద్ధిచెందుతూనే ఉండే సామర్థ్యం” వంటి విషయాల గురించి మాట్లాడతారు.

ద డ్రీమ్‌ ఆఫ్‌ ఇటర్నల్‌ లైఫ్‌ అనే తన పుస్తకంలో మార్క్‌ బెనెకే ఇలా వ్రాశాడు: “ఒక జీవితకాలంలో చాలాసార్లు శరీర కణాలన్నీ కొత్తగా చేయబడతాయి. . . . దాదాపు ప్రతి ఏడు సంవత్సరాలకు ఒకసారి మనకు నిజంగానే కొత్త శరీరం ఉంటుంది.” అయితే ఆ ప్రక్రియ నిరంతరం జరగదు ఎందుకంటే ఒక నిర్దిష్టమైన సంఖ్య తర్వాత కణాలు వృద్ధి చెందడం ఆగిపోతుంది. ఒకవేళ అలా జరగకపోతే, “మానవ శరీరం ఎంతోకాలంపాటు, చివరకు నిరంతరం తనను తాను పునరుజ్జీవింపజేసుకోగలదు” అని బెనెకే చెప్పాడు.

అంతేకాకుండా మానవ మెదడుకున్న అసాధారణమైన సామర్థ్యం గురించి కూడా ఆలోచించండి, మనం మన స్వల్పకాలిక జీవితంలో ఉపయోగించగల దానితో పోలిస్తే అది ఎంతో ఎక్కువగా ఉంది. ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ప్రకారం మానవ మెదడుకు “ఒక వ్యక్తి జీవితకాలంలో ఉపయోగించగల దానికంటే ఎక్కువ శక్తి అనుగ్రహించబడింది.” (1976 సంచిక, 12వ సంపుటి, 998వ పేజీ) డేవిడ్‌ ఏ. సూసా వ్రాసిన హౌ ద బ్రెయిన్‌ లర్న్స్‌ అనే పుస్తకం ఇలా చెబుతోంది: “అన్ని రకాల పనుల కోసం సమాచారాన్ని భద్రపరిచేందుకు మెదడుకున్న సామర్థ్యానికి పరిమితులు లేవు.”​—⁠78వ పేజీ, రెండవ సంచిక, కాపీరైట్‌ 2001.

మనమెందుకు మరణిస్తున్నామనే దానికి ఒక భౌతిక కారణాన్ని పరిశోధకులు ఎందుకు కనుక్కోలేకపోతున్నారు? మానవ మెదడుకు అంత అసాధారణమైన సామర్థ్యం ఎందుకు ఉంది? మనం నిరంతరం జ్ఞానం సంపాదించుకుంటూనే ఉండేందుకు రూపొందించబడ్డామా? మనం నిత్యజీవితం గురించి ఎందుకు ఆలోచించగలుగుతున్నాము?

బైబిలు ఇలా చెబుతోంది: “ఆయన శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయమందుంచి యున్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలిసికొనుటకు అది చాలదు.” (ప్రసంగి 3:11) నిరంతరం జీవించాలనే కోరికను దేవుడు మనలో ఉంచాడని ఆ మాటలు సూచిస్తున్నాయి. ఎందుకంటే దేవుని గురించి, ఆయన కార్యాల గురించి మనం నేర్చుకోవడానికి ఎల్లప్పుడూ ఏదో ఒకటి ఉంటుంది. మనం లెక్కలేనన్ని కోట్ల సంవత్సరాలు, అంటే నిరంతరం జీవిస్తే దేవుని సృష్టి కార్యాల అద్భుతాల గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోగలుగుతాము.

మానవులు నిరంతరం జీవించడం సాధ్యమేనని యేసుక్రీస్తు మాటలు కూడా సూచిస్తున్నాయి. ఆయన ఇలా చెప్పాడు: ‘అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.’ (యోహాను 17:⁠3) మరి మీ సంగతేమిటి? నిరంతరం జీవించాలని మీరు ఆశిస్తున్నారా?

[3వ పేజీలోని చిత్రాలు]

క్వాన్‌ పాన్సే డే లేయాన్‌ యౌవనపు జలధార కోసం అన్వేషించాడు

[చిత్రసౌజన్యం]

పాన్సే డే లేయాన్‌: Harper’s Encyclopædia of United States History