కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“యథార్థవంతుల గుడారము వర్ధిల్లును”

“యథార్థవంతుల గుడారము వర్ధిల్లును”

“యథార్థవంతుల గుడారము వర్ధిల్లును”

అర్మగిద్దోను ఉప్పెనలా విరుచుకుపడి సాతాను దుష్ట విధానాన్ని అంతం చేసినప్పుడు, ‘భక్తిహీనుల ఇల్లు నిర్మూలమవుతుంది.’ మరి “యథార్థవంతుల గుడారము” విషయమేమిటి? అది దేవుని నూతనలోకంలో ‘వర్ధిల్లుతుంది.’​—⁠సామెతలు 14:11.

అయితే ‘భక్తిహీనులు దేశములో నుండకుండ నిర్మూలము చేయబడి, విశ్వాసఘాతకులు దానిలోనుండి పెరికివేయబడేంత’ వరకు లోపములేనివారు వారితో కలిసి జీవించాల్సిందే. (సామెతలు 2:​21, 22) మరి ఇలాంటి పరిస్థితుల్లో యథార్థవంతులు వర్ధిల్లగలరా? మన మాటలను, క్రియలను నిర్దేశించడానికి జ్ఞానాన్ని అనుమతించడం ద్వారా, మనం ఇప్పుడు కూడా కొంతమేరకు సమృద్ధిని, స్థిరత్వాన్ని అనుభవించవచ్చని బైబిల్లోని సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు చూపిస్తున్నాయి.

జ్ఞానం ఇల్లు కట్టినప్పుడు

కుటుంబ సంక్షేమంపై భార్య ప్రభావం గురించి వ్యాఖ్యానిస్తూ ప్రాచీన ఇశ్రాయేలు రాజైన సొలొమోను ఇలా అన్నాడు: “జ్ఞానవంతురాలు తన యిల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన యిల్లు ఊడ బెరుకును.” (సామెతలు 14:⁠1) జ్ఞానవంతురాలు తన ఇల్లు ఎలా కడుతుంది? జ్ఞానంగల స్త్రీ దేవుని శిరస్సత్వపు ఏర్పాటును గౌరవిస్తుంది. (1 కొరింథీయులు 11:⁠3) సాతాను లోకంలో ప్రబలివున్న స్వేచ్ఛా స్ఫూర్తి ప్రభావానికి ఆమె లోనుకాదు. (ఎఫెసీయులు 2:⁠2) ఆమె తన భర్తకు లోబడి, ఆయన గురించి ప్రశంసాపూర్వకంగా మాట్లాడుతూ ఇతరులకు ఆయనపట్ల ఉన్న గౌరవాన్ని ఇనుమడింపజేస్తుంది. జ్ఞానంగల స్త్రీ తన పిల్లల ఆధ్యాత్మిక, అభ్యాసకరమైన విద్య విషయంలో క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. కుటుంబానికి ఆహ్లాదకరంగా, సుఖవంతంగా ఉండేలా ఇంటిని తీర్చిదిద్దుతూ కుటుంబ సంక్షేమం కోసం ఆమె కష్టించి పనిచేస్తుంది. ఆమె నిర్వహణా విధానంలో వివేకం, పొదుపరితనం స్పష్టంగా కనబడుతుంది. నిజంగా జ్ఞానవంతురాలైన స్త్రీ తన కుటుంబ వికాసానికి, స్థిరత్వానికి తోడ్పడుతుంది.

మూఢురాలికి దేవుని శిరస్సత్వపు ఏర్పాటుపట్ల గౌరవం ఉండదు. ఆమె తన భర్తను తూలనాడడానికి వెనుకాడదు. పొదుపు తెలియని ఆ స్త్రీ కుటుంబ కష్టార్జితాన్ని దుబారా చేస్తుంది. ఆమె సమయాన్ని కూడా వృధా చేస్తుంది. ఫలితంగా, ఇల్లు పరిశుభ్రంగా ఉండదు, పిల్లలు శారీరకంగా, ఆధ్యాత్మికంగా బాధ అనుభవిస్తారు. అవును, మూఢురాలు తన ఇంటిని ఊడ బెరుకుతుంది.

అయితే ఒక వ్యక్తి జ్ఞానవంతుడా లేక మూఢుడా అనే విషయాన్ని ఏది నిర్ణయిస్తుంది? సామెతలు 14:2 ఇలా చెబుతోంది: “యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవాయందు భయభక్తులుగలవాడు, కుటిలచిత్తుడు ఆయనను తిరస్కరించువాడు.” యథార్థవంతుడు సత్యదేవునికి భయపడతాడు, “యెహోవాయందలి భయము జ్ఞానమునకు మూలము.” (కీర్తన 111:​10) “దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి” నడుచుకోవడం తన బాధ్యత అని నిజంగా జ్ఞానియైన వ్యక్తికి తెలుసు. (ప్రసంగి 12:​13) దానికి భిన్నంగా, మూఢుడు దేవుని యథార్థ కట్టడలకు అనుగుణమైన మార్గంలో నడవడు. అతని మార్గాలు కుటిలంగా ఉంటాయి. అలాంటి వ్యక్తి తన హృదయంలో “దేవుడు లేడని” చెప్పుకుంటూ యెహోవాను తిరస్కరిస్తాడు.​—⁠కీర్తన 14:1.

జ్ఞానంతో మాట్లాడినప్పుడు

యెహోవాకు భయపడే వ్యక్తి మాటల గురించి, ఆయనను తృణీకరించే వ్యక్తి మాటల గురించి ఏమి చెప్పవచ్చు? “మూఢుల నోట బెత్తమువంటి గర్వమున్నది. జ్ఞానుల పెదవులు వారిని కాపాడును” అని రాజు చెబుతున్నాడు. (సామెతలు 14:⁠3) పైనుండివచ్చు జ్ఞానంలేని మూఢుడు సమాధానపరునిగా గాని సహేతుకమైన వ్యక్తిగా గాని ఉండడు. అతణ్ణి నడిపించే జ్ఞానం భూసంబంధమైన, ప్రకృతి సంబంధమైన, దయ్యాల జ్ఞానమై ఉంటుంది. అతడు తగవులమారి, పొగరుబోతు మాటలు మాట్లాడతాడు. అతని నోటి దురుసుతనం అతనికీ, ఇతరులకూ కష్టాలు తెచ్చిపెడుతుంది.​—⁠యాకోబు 3:13-18.

జ్ఞాని పెదవులు ఆయనను కాపాడి లేదా సంరక్షించి అతనికి సంతృప్తిని, సంతోషాన్ని తెస్తాయి. ఎలా? లేఖనాలు ఇలా చెబుతున్నాయి: “కత్తిపోటువంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము.” (సామెతలు 12:​18) జ్ఞాని మాట్లాడే మాటలు ఆలోచనా రహితంగా లేదా ఎత్తిపొడిచేలా ఉండవు. ఆయన బాగా ఆలోచించి జవాబు చెబుతాడు. (సామెతలు 15:​28) బాగా ఆలోచించి మాట్లాడిన ఆయన మాటలు స్వస్థత చేకూరుస్తాయి అంటే కృంగినవారిని ప్రోత్సహిస్తాయి, పీడితులకు నూతనోత్తేజమిస్తాయి. ఇతరులకు కోపం కలిగించడానికి బదులు ఆయన పెదవులు సమాధానాన్ని, ప్రశాంతతను పురికొల్పుతాయి.

జ్ఞానం మానవ ప్రయత్నాలను నిర్దేశించినప్పుడు

తర్వాత సొలొమోను పూనుకున్న పనిలోని లాభనష్టాలను అంచనా వేసుకోవడానికి సంబంధించినదిగా అనిపించే ఆసక్తికరమైన సామెతను చెబుతున్నాడు. ఆయన ఇలా చెబుతున్నాడు: “ఎద్దులు లేని చోట గాదెయందు ధాన్యముండదు [‘మేతతొట్టి శుభ్రంగా ఉంటుంది,’ NW], ఎద్దుల బలముచేత విస్తారము వచ్చుబడి కలుగును.”​—⁠సామెతలు 14:⁠4.

ఈ సామెతపై వ్యాఖ్యానిస్తూ ఒక అధికారిక గ్రంథం ఇలా చెబుతోంది: “ఖాళీ మేతతొట్టి [గాదె] ఎద్దులు [పశువులు] లేవని సూచిస్తుంది, అందువల్ల, పశువులను శుభ్రం చేసే పనిగానీ, వాటిని చూసుకొనే పనిగానీ ఉండదు, కాబట్టి ఖర్చులు తగ్గుతాయి. అయితే ‘ఈ లాభానికి’ విరుద్ధంగా 4బి వ[చనం] మాట్లాడుతోంది: ఎలాగంటే, ఎద్దులు లేనప్పుడు పంట సమృద్ధిగా ఉండదు.” కాబట్టి రైతు జ్ఞానంతో నిర్ణయాలు తీసుకోవాలి.

ఈ సామెతలో దాగివున్న సూత్రం మనం ఉద్యోగం మారేటప్పుడు, ఇంటిని ఎంచుకునేటప్పుడు, కారు కొనేటప్పుడు, పెంపుడు జంతువును తెచ్చుకోవడం గురించి ఆలోచించేటప్పుడు కూడా అన్వయించదా? జ్ఞాని లాభనష్టాలను అంచనా వేసుకొని ఆ పని పూనుకోవడం, ఖర్చుకు తగినదేనా అని ఆలోచిస్తాడు.

సాక్షి జ్ఞానియైనప్పుడు

“నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు కూటసాక్షికి అబద్ధములు ప్రియములు” అని సొలొమోను చెబుతున్నాడు. (సామెతలు 14:⁠5) కూటసాక్షి అబద్ధాలు విపరీతమైన హాని కలిగించగలవు. పనికిమాలిన ఇద్దరు అబద్ధ సాక్ష్యం చెప్పిన కారణంగా యెజ్రెయేలీయుడైన నాబోతు రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. (1 రాజులు 21:​7-13) యేసు మరణానికి కారణమయ్యేలా ఆయనపై అబద్ధ సాక్షులు నింద మోపడం నిజం కాదా? (మత్తయి 26:​59-61) అబద్ధ సాక్షులు స్తెఫనుకు వ్యతిరేకంగా కూడా సాక్ష్యం పలికారు, ఆయన విశ్వాసం విషయంలో చంపబడిన యేసు మొదటి శిష్యుడు.​—⁠అపొస్తలుల కార్యములు 6:10, 11.

అబద్ధికుడు కొద్దికాలంపాటు బయటపడకపోవచ్చు, అయితే అతని భవిష్యత్తు గురించి ఆలోచించండి. “లేనివాటిని పలుకు అబద్ధసాక్షి” యెహోవాకు అసహ్యుడు అని బైబిలు చెబుతోంది. (సామెతలు 6:​16-19) అలాంటి వ్యక్తి చివరకు నరహంతకులు, వ్యభిచారులు, విగ్రహారాధకుల్లాంటి దోషులతోపాటు అగ్నిగంధకములతో మండే గుండములో పడవేయబడతాడు; అది రెండవ మరణం.​—⁠ప్రకటన 21:8.

నమ్మకమైన సాక్షి ప్రమాణం చేసి అబద్ధ సాక్ష్యం చెప్పడు. అతని సాక్ష్యంలో అబద్ధాల మాలిన్యం ఉండదు. అయితే, యెహోవా ప్రజలకు ఏదోక రీతిలో హాని తలపెట్టాలని కోరేవారికి పూర్తి సమాచారమిచ్చే బాధ్యత అతనిపై ఉందని దానర్థం కాదు. పితరులైన అబ్రాహాము, ఇస్సాకు యెహోవాను ఆరాధించని వారికి కొన్ని వాస్తవాలు చెప్పలేదు. (ఆదికాండము 12:​10-19; 20:1-18; 26:​1-10) యెరికోకు చెందిన రాహాబు, రాజు మనుష్యులను తప్పుదోవ పట్టించింది. (యెహోషువ 2:​1-7) అనవసరమైన హాని తీసుకొస్తుందనే ఉద్దేశంతో స్వయాన యేసుక్రీస్తే పూర్తి సమాచారాన్ని వెల్లడించలేదు. (యోహాను 7:​1-10) ఆయనిలా చెప్పాడు: “పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి.” ఎందుకు పెట్టవద్దు? ఆయన ఇలా చెప్పాడు: “అవి యొకవేళ . . . మీమీద పడి మిమ్మును చీల్చి వేయును.”​—⁠మత్తయి 7:6.

‘జ్ఞానము సులభమైనప్పుడు’

జ్ఞానాన్ని అందరూ సంపాదించుకోగలరా? సామెతలు 14:6 ఇలా చెబుతోంది: “అపహాసకుడు జ్ఞానము వెదకుట వ్యర్థము, తెలివిగలవానికి జ్ఞానము సులభము.” అపహాసకుడు లేదా ఎగతాళి చేసేవాడు జ్ఞానాన్వేషణ చేయవచ్చు, కానీ అతనికి జ్ఞానం లభించదు. అపహాసకుడు అహంభావంతో దేవుని సంగతులను ఎగతాళి చేస్తాడు కాబట్టి, జ్ఞానానికి అవసరమైన ప్రాథమిక విషయాన్ని అంటే సత్యదేవుని గురించిన ఖచ్చితమైన పరిజ్ఞానాన్ని పొందలేడు. అతని అహంకారం, అహంభావం దేవుని గురించి తెలుసుకొని జ్ఞానం సంపాదించుకోకుండా అతన్ని అడ్డగిస్తాయి. (సామెతలు 11:⁠2) కనీసం జ్ఞానం కోసం వెదకాలని కూడా అతను ఎందుకు అనుకోడు? సామెతలు గ్రంథం దానికి జవాబు చెప్పడం లేదు గానీ, అతడు తాను జ్ఞానినని ఇతరులు అనుకోవాలని బహుశా అలా చేస్తుండవచ్చు.

తెలివిగల వ్యక్తికి “జ్ఞానము సులభము.” తెలివి అనే పదం “మానసిక అవగాహన, గ్రహింపు,” “సాధారణ విషయాల సంబంధాలు గ్రహించగల సామర్థ్యం” అని నిర్వచించబడింది. అది ఒక విషయానికి సంబంధించిన వివిధ అంశాలను ముడిపెట్టి, అక్కడక్కడి భాగాలను కాదుగానీ విషయాన్నంతటినీ చూడగల సామర్థ్యం. ఈ సామర్థ్యమున్న వ్యక్తికి జ్ఞానము సులభమని ఈ సామెత చెబుతోంది.

ఈ విషయంలో, లేఖనాధార సత్యం గురించిన పరిజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి సంబంధించిన మీ సొంత అనుభవాన్నే పరిశీలించండి. మీరు బైబిలు అధ్యయనం ఆరంభించినప్పుడు, మీరు నేర్చుకున్న మొదటి సత్యాల్లో బహుశా దేవుని గురించిన, ఆయన వాగ్దానాల గురించిన, ఆయన కుమారుని గురించిన ప్రాథమిక బోధలు ఉన్నాయి. తొలుత ఆ వివరాలు వేరువేరుగా ఉన్నాయి. అయితే మీరు మీ అధ్యయనాన్ని కొనసాగిస్తుండగా, ఆ వివరాలు ఒకదానికొకటి అతకడం ఆరంభమై, ఆ వివిధ వివరాలు మానవులపట్ల, భూమిపట్ల యెహోవా సంకల్పానికి ఎలా సంబంధం కలిగివున్నాయో మీరు స్పష్టంగా చూడగలిగారు. బైబిల్లోని సత్యం సహేతుకమైనదిగా, పొందిక గలదిగా తయారైంది. అప్పుడు కొత్త సత్యాలను నేర్చుకొని, గుర్తుంచుకోవడం సులభమైంది, ఎందుకంటే మొత్తం విషయానికి అవెలా ముడిపడి ఉన్నాయో మీరు చూడగలుగుతున్నారు.

జ్ఞానం లభించని చోటు గురించి హెచ్చరిస్తూ జ్ఞానియైన రాజు ఇలా అంటున్నాడు. “బుద్ధిహీనుని యెదుటనుండి వెళ్లిపొమ్ము జ్ఞానవచనములు వానియందు కనబడవు.” (సామెతలు 14:⁠7) బుద్ధిహీనునికి నిజమైన పరిజ్ఞానం ఉండదు. అతని దగ్గర జ్ఞానవచనములు ఉండవు. అలాంటి వ్యక్తి ఎదుట నుండి వెళ్లిపొమ్మని సలహా ఇవ్వబడింది, అలాంటి వ్యక్తికి దూరంగా ఉండడం జ్ఞానయుక్తం. “మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.”​—⁠సామెతలు 13:20.

“తమ ప్రవర్తనను కనిపెట్టి యుండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము, మోసకృత్యములే బుద్ధిహీనులు కనుపరచు మూఢత” అని సొలొమోను చెబుతున్నాడు. (సామెతలు 14:⁠8) జ్ఞాని తన క్రియల గురించి ఆలోచిస్తాడు. అతడు తను ఎంపిక చేసుకునే విషయాలను పరిశీలించి, వాటిలోని ప్రతీ ఎంపిక పర్యవసానం గురించి జాగ్రత్తగా ఆలోచిస్తాడు. ఆయన తన మార్గాన్ని జ్ఞానయుక్తంగా ఎంచుకుంటాడు. మరి బుద్ధిహీనుని విషయమేమిటి? అతడు తానేమి చేస్తున్నానో తనకు తెలుసనీ, తాను శ్రేష్ఠమైన ఎంపికే చేసుకుంటున్నానని నమ్ముతూ అవివేక మార్గాన్ని ఎంచుకుంటాడు. అతని అవివేకం అతన్ని మోసగిస్తుంది.

జ్ఞానం సంబంధ బాంధవ్యాలను నిర్దేశించినప్పుడు

జ్ఞానంచేత నిర్దేశించబడే వ్యక్తికి ఇతరులతో సమాధానకరమైన సంబంధాలు ఉంటాయి. “మూఢులు చేయు అపరాధపరిహారార్థబలి వారిని అపహాస్యము చేయును, యథార్థవంతులు ఒకరియందు ఒకరు దయ చూపుదురు” అని ఇశ్రాయేలు రాజు చెబుతున్నాడు. (సామెతలు 14:⁠9) మూఢునికి అపరాధ భావం లేదా పరితాపం ఒక నవ్వులాటగా ఉంటుంది. అతడు “మార్పు చేసుకోని అహంభావిగా” ఉండి సమాధానం వెదకడు కాబట్టి అతనికి ఇంటిలోను, ఇంకెక్కడా కూడా మంచి సంబంధాలు ఉండవు. (ద న్యూ ఇంగ్లీష్‌ బైబిల్‌) యథార్థపరుడు ఇతరుల తప్పిదాలను సహించడానికి సుముఖంగా ఉంటాడు. ఆయన తప్పు చేసినప్పుడు క్షమాపణ అడిగి, సర్దుబాట్లు చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఆయన సమాధానం వెదికే వ్యక్తి కాబట్టి, ఇతరులతో సంతోషకరమైన, స్థిరమైన సంబంధాలు ఉంటాయి.​—⁠హెబ్రీయులు 12:14.

ఆ తర్వాత సొలొమోను మానవ సంబంధాలను పరిమితం చేసే ఒక విషయాన్ని సూచిస్తున్నాడు. ఆయన ఇలా అంటున్నాడు: “ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియును, ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు.” (సామెతలు 14:​10) మన అంతరంగ భావాలను అంటే మన విచారాన్ని, ఆనందాన్ని అన్ని సందర్భాల్లో ఇతరులకు వ్యక్తపరచి, మనం అనుభవిస్తున్నది ఖచ్చితంగా వారితో పంచుకోగలమా? వేరొక వ్యక్తి ఎలా భావిస్తున్నాడో ఎవరైనా అన్ని సందర్భాల్లో పూర్తిగా అర్థం చేసుకోగలరా? ఈ రెండు ప్రశ్నలకు లేదు అనేదే జవాబు.

ఉదాహరణకు, ఆత్మహత్య చేసుకోవాలని కలిగే భావాల గురించి ఆలోచించండి. అలాంటి భావాలున్న వ్యక్తి చాలావరకు వాటిని కుటుంబ సభ్యునికి లేదా స్నేహితునికి స్పష్టంగా చెప్పుకోలేడు. తమ సహవాసుల్లో అలాంటి భావాల సూచనలను ఇతరులు అన్ని సందర్భాల్లో గుర్తించలేరు. ఈ సూచనలు మనం చూడలేకపోతే సహాయకరమైన చర్య తీసుకోలేకపోతే అదొక అపరాధంగా మనం భావించనవసరం లేదు. భావావేశ మద్దతుకోసం సహానుభూతి చూపే స్నేహితుని దగ్గరకు వెళ్లడం ఓదార్పుకరంగా ఉన్నప్పటికీ, ఓదార్పునిచ్చే విషయంలో మానవులకు పరిమితులున్నాయని కూడా ఆ సామెత బోధిస్తోంది. కొన్ని కష్టాలు సహించాల్సి వచ్చినప్పుడు మనం యెహోవాను మాత్రమే ఆశ్రయించవలసి ఉంటుంది.

“కలిమియు సంపదయు వాని యింట నుండును”

“భక్తిహీనుల యిల్లు నిర్మూలమగును యథార్థవంతుల గుడారము వర్ధిల్లును” అని ఇశ్రాయేలు రాజు చెబుతున్నాడు. (సామెతలు 14:​11) ప్రస్తుత విధానంలో దుష్టుడైన వ్యక్తి వర్ధిల్లుతూ చక్కని ఇంటిలో నివసించవచ్చు, అయితే అతనే లేకపోయినప్పుడు అది అతనికేమి ప్రయోజనం చేకూరుస్తుంది? (కీర్తన 37:​10) దానికి భిన్నంగా, యథార్థవంతుని ఇల్లు సాదాసీదాగా ఉండవచ్చు. కానీ “కలిమియు సంపదయు వాని యింట నుండును” అని కీర్తన 112:3 చెబుతోంది. వీటి భావమేమిటి?

మన మాటలు, చేతలు జ్ఞానంచేత నిర్దేశించబడినప్పుడు, మనవద్ద జ్ఞానంతోపాటు ఉండే “ఐశ్వర్య ఘనతలు” ఉంటాయి. (సామెతలు 8:​18) వాటిలో దేవునితో, తోటి మనుష్యులతో సమాధానకరమైన సంబంధాలు, ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నామనే భావం, కొంతమేర స్థిరత్వం ఉండడం ఇమిడివున్నాయి. అవును, “యథార్థవంతుల గుడారము” ఇప్పుడు కూడా వర్ధిల్లగలదు.

[27వ పేజీలోని చిత్రం]

జ్ఞానవంతురాలు తన యిల్లు కట్టును

[28వ పేజీలోని చిత్రం]

“జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము”