కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి!”

“యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి!”

యెహోవా సృష్టి వైభవాలు

“యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి!”

మనం గ్రామాల్లో నివసించినా లేదా పట్టణాల్లో నివసించినా, ఎంతో ఎత్తున కొండలపై నివసించినా లేదా దిగువన సముద్రం దగ్గర నివసించినా మన చుట్టూ భక్తిపూర్వక సంభ్రమాన్ని కలిగించే అద్భుతమైన సృష్టి కనిపిస్తుంది. కాబట్టి యెహోవాసాక్షుల క్యాలెండర్‌​—⁠2004 యెహోవా దేవుని ఆశ్చర్యకరమైన కార్యాల అందమైన చిత్రాలతో ఉండడం తగినదే.

కృతజ్ఞతగల మానవులు ఎల్లప్పుడూ దేవుని సృష్టికార్యాల విషయంలో ఆసక్తి చూపించారు. ఉదాహరణకు, “తూర్పుదేశస్థుల జ్ఞానము కంటె” ఎక్కువ జ్ఞానముగల సొలొమోను విషయమే తీసుకోండి. “లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని గోడలోనుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసెను; మరియు మృగములు పక్షులు ప్రాకు జంతువులు జలచరములు అనువాటినన్నిటి గూర్చియు అతడు వ్రాసెను” అని బైబిలు చెబుతోంది. (1 రాజులు 4:​30, 33) సొలొమోను తండ్రి దావీదు రాజు కూడా దేవుని ఉత్కృష్టమైన సృష్టికార్యాల గురించి ధ్యానించేవాడు. ఆయన తనను సృష్టించిన దేవునితో ఇలా అనేందుకు కదిలించబడ్డాడు: “యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి! జ్ఞానముచేత నీవు వాటన్నిటిని నిర్మించితివి, నీవు కలుగజేసినవాటితో భూమి నిండియున్నది.”​—⁠కీర్తన 104:24. *

మనం కూడా సృష్టిని పరిశీలించి, దాని గురించి ధ్యానించాలి. ఉదాహరణకు మనం “[మన] కన్నులు పైకెత్తి” చూసి ఇలా అడగవచ్చు: “వీటిని ఎవడు సృజించెను?” వాటిని చేసింది యెహోవా దేవుడే, ఆయనకు “అధికశక్తి” ఉంది, ఆయన నిజంగానే “బలాతిశయము” కలవాడు!​—⁠యెషయా 40:26.

యెహోవా సృష్టికార్యాల గురించి ధ్యానించడం మనపై ఎలాంటి ప్రభావం చూపించాలి? కనీసం మూడు విధాలుగా ప్రభావం చూపించాలి. అది (1) మన జీవితాన్ని విలువైనదిగా ఎంచాలని గుర్తుచేయాలి, (2) సృష్టినుండి నేర్చుకోవడానికి ఇతరులకు సహాయం చేయడానికి మనల్ని పురికొల్పాలి, (3) మన సృష్టికర్త గురించి మరింత ఎక్కువగా తెలుసుకొని, ఆయనపట్ల మరింత కృతజ్ఞత కలిగివుండేలా మనల్ని ప్రేరేపించాలి.

మానవులుగా మనకు “వివేకశూన్యములగు మృగముల” కంటే ఎంతో ఉన్నతమైన జీవితం ఉంది, అందువల్ల మనం సృష్టికార్యాలను పరిశీలించి, వాటిని విలువైనవిగా ఎంచగలుగుతాము. (2 పేతురు 2:​12) మన కన్నులు ఆకర్షణీయమైన ప్రకృతి దృశ్యాలను చూడగలవు. మన చెవులు పక్షుల శ్రావ్యమైన పాటలను వినగలవు. సమయాలను, స్థలాలను గుర్తించగల మన సామర్థ్యం మనకు విషయాలు గుర్తుండేలా చేసి అవి మధుర స్మృతులుగా మిగిలిపోయేలా చేస్తుంది. మన ప్రస్తుత జీవితం పరిపూర్ణమైనది కాకపోయినా, అది ఖచ్చితంగా జీవించడానికి యోగ్యమైనదే!

పిల్లలు సహజంగానే సృష్టికి ఆకర్షితులవ్వడాన్ని చూసినప్పుడు తల్లిదండ్రులు సంతోషిస్తారు. పిల్లలు సముద్రం పక్కన గవ్వలు ఏరుకోవడం, జంతువులను పెంచడం, చెట్లు ఎక్కడం వంటివి చేయడానికి ఎంత ఇష్టపడతారో కదా! తల్లిదండ్రులు సృష్టికి, సృష్టికర్తకు మధ్య ఉన్న సంబంధాన్ని తమ పిల్లలు అర్థం చేసుకోవడానికి సహాయం చేయాలని కోరుకుంటారు. యెహోవా సృష్టిపట్ల పిల్లలు భక్తిపూర్వక ప్రశంసను, గౌరవాన్ని పెంపొందించుకుంటే అవి జీవితాంతం వారితోపాటు ఉంటాయి.​—⁠కీర్తన 111:2, 10.

మనం సృష్టిని చూసి ముగ్ధులమై సృష్టికర్తకు ఘనత ఇవ్వకపోతే అది ఎంతో అవివేకమైనది. ఈ విషయం గురించి ఆలోచించడానికి యెషయా ప్రవచనం మనకు సహాయం చేస్తుంది, ఆయన ఇలా వ్రాశాడు: “నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము.”​—⁠యెషయా 40:28.

యెహోవా సృష్టికార్యాలు ఆయనకున్న సాటిలేని జ్ఞానానికి, అసమాన శక్తికి, ఆయనకు మనపట్ల ఉన్న ప్రగాఢమైన ప్రేమకు నిదర్శనంగా ఉన్నాయి. మనం మన చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను చూసినప్పుడు, వాటన్నింటిని చేసిన వ్యక్తి లక్షణాలను గ్రహించినప్పుడు దావీదు అన్న మాటలను పలికేలా కదిలింపబడుదుము గాక: “దేవా [యెహోవా], నీవంటివారు మరొకరు లేరు. నీవు చేసిన వాటిని ఎవ్వరూ చేయలేరు.”​—⁠కీర్తన 86:⁠8, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

విధేయతగల మానవులు యెహోవా సృష్టికార్యాలకు ఆకర్షింపబడుతూనే ఉంటారని మనం నిశ్చయతతో ఉండవచ్చు. యుగయుగాలవరకు మనకు యెహోవా గురించి మరింత తెలుసుకోవడానికి లెక్కలేనన్ని అవకాశాలు లభిస్తాయి. (ప్రసంగి 3:​11) మనం మన సృష్టికర్త గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటే, ఆయనను అంత ఎక్కువగా ప్రేమిస్తాము.

[అధస్సూచి]

^ పేరా 4 యెహోవాసాక్షుల క్యాలెండర్‌​—⁠2004, నవంబరు/డిసెంబరు చూడండి.

[9వ పేజీలోని బాక్సు]

సృష్టికర్తకు స్తుతులు

ప్రశంసగల ఎంతోమంది శాస్త్రజ్ఞులు సృష్టిలో దేవుని పాత్రను గ్రహించారు. క్రింద కొన్ని ఉదాహరణలు ఇవ్వబడ్డాయి:

“నేను అప్పుడప్పుడు క్రొత్త విషయాలను కనుగొని ‘ఓహో దేవుడు దాన్ని అలా చేశాడన్నమాట’ అని అనుకున్నప్పుడు నా విద్య ప్రత్యేకతను సంతరించుకుంటుంది, నాకు ఆనందం కలుగుతుంది. దేవుని కార్యవిధానంలో ఒక చిన్న భాగాన్ని అర్థం చేసుకోవడమే నా లక్ష్యం.”​—⁠హెన్రీ షేఫర్‌, రసాయన శాస్త్ర ప్రొఫెసర్‌.

“విశ్వం విస్తరించడానికి కారణమేమిటి అనే విషయానికి సంబంధించి పాఠకుడు తన స్వంత ముగింపుకు రావాలి, అయితే ఆయన [దేవుని] ప్రమేయం లేకుండా విశ్వం ఉనికిలోకి వచ్చిందనడం సమంజసం కాదు.”​—⁠ఎడ్వర్డ్‌ మిల్న్‌, బ్రిటిష్‌ ఖగోళ శాస్త్రజ్ఞుడు

“ప్రకృతిలో అత్యున్నతమైన, అత్యంత ఖచ్చితమైన గణితశాస్త్రం కనిపిస్తుంది, ఎందుకంటే దేవుడు దానిని సృష్టించాడు.”​—⁠అలెగ్జాండర్‌ పాల్యాకోవ్‌, రష్యన్‌ గణిత శాస్త్రజ్ఞుడు.

“ప్రకృతిని అధ్యయనం చేసేటప్పుడు మనం సృష్టికర్త తలంపులను పరిశీలిస్తున్నాము, ఆయన ఆలోచనలతో పరిచయం పెంచుకుంటున్నాము, మన వ్యవస్థను కాదు ఆయన వ్యవస్థను అర్థం చేసుకుంటున్నాము.”​—⁠లూయిస్‌ అగస్సీ, అమెరికన్‌ జీవశాస్త్రవేత్త.

[8, 9వ పేజీలోని చిత్రం]

జెన్టూ పెంగ్విన్లు, అంటార్కిటిక్‌ ద్వీపకల్పం

[9వ పేజీలోని చిత్రం]

గ్రాండ్‌ టెటన్‌ నేషనల్‌ పార్క్‌, వ్యోమింగ్‌, అమెరికా

[చిత్రసౌజన్యం]

Jack Hoehn/Index Stock Photography