కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

హృదయ పరిశోధకుడైన యెహోవాను వెదకండి

హృదయ పరిశోధకుడైన యెహోవాను వెదకండి

హృదయ పరిశోధకుడైన యెహోవాను వెదకండి

“నన్నాశ్రయించినయెడల [‘వెదకినయెడల,’ Nw] మీరు బ్రదుకుదురు.”​ఆమోసు 5:⁠4.

యెహోవా దేవుడు సమూయేలు ప్రవక్తతో ఇలా అన్నాడు: “మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును.” (1 సమూయేలు 16:⁠7) యెహోవా ‘హృదయాన్ని ఎలా లక్ష్యపెడతాడు’?

2 లేఖనాల్లో హృదయం ఒక వ్యక్తి అంతరంగానికి అంటే అతని కోరికలకు, అతని తలంపులకు, అతని భావావేశాలకు, అతని ఆప్యాయతా అనురాగాలకు ప్రతీకగా ఉపయోగించబడింది. కాబట్టి, దేవుడు హృదయం చూస్తాడని బైబిలు చెప్పినప్పుడు, ఆయన బాహ్యరూపాన్ని కాక ఆ వ్యక్తి అంతరంగంలో నిజంగా ఎలాంటివాడో చూస్తాడని దాని భావం.

దేవుడు ఇశ్రాయేలును పరిశోధించడం

3 హృదయ పరిశోధకుడు, ఆమోసు కాలంలో పది గోత్రాల ఇశ్రాయేలు రాజ్యాన్ని గమనించినప్పుడు, ఆయనేమి చూశాడు? ‘దంతపు మంచములమీద పరుండుచు, పాన్పులమీద తమ్మును చాచుకొనుచున్న’ వారి గురించి ఆమోసు 6:​4-6 మాట్లాడుతోంది. వారు “మందలో శ్రేష్ఠమైన గొఱ్ఱెపిల్లలను సాలలోని క్రొవ్విన దూడలను వధించి భోజనము” చేయుచున్నారు. ఆ పురుషులు ‘వాయించు వాద్యములను కల్పించుకొనుచు, పాత్రలలో ద్రాక్షారసముపోసి పానము’ చేయుచున్నారు.

4 మొదట ఇది ఆహ్లాదకరమైన దృశ్యంగా అనిపించవచ్చు. సంపన్నులు అన్ని సౌకర్యాలుగల తమ ఇళ్లలో విలాసవంతమైన జీవితం గడుపుతూ, శ్రేష్ఠమైన భోజనపానీయాలు ఆరగిస్తూ, మేలురకమైన సంగీత వాద్యాలతో వినోదంలో మునిగితేలుతున్నారు. వారికి “దంతపు మంచములు” కూడా ఉన్నాయి. పురావస్తు శాస్త్రజ్ఞులు ఇశ్రాయేలు రాజ్యపు ముఖ్య పట్టణమైన షోమ్రోనులో నగిషీచెక్కిన దంతాలను కనుగొన్నారు. (1 రాజులు 10:​22) బహుశా ఆ దంతాలు కలపసామానుకు, లేదా గోడలకు అమర్చిన చెక్కలకు అలంకారంగా పొదగబడి ఉండవచ్చు.

5 ఇశ్రాయేలీయులు రుచికరమైన భోజనం తింటూ, మేలురకమైన ద్రాక్షారసం సేవిస్తూ, శ్రావ్యమైన సంగీతం వింటూ సుఖంగా జీవించడం యెహోవాకు అసంతోషం కలిగించిందా? ఎంతమాత్రం లేదు. నిజానికి ఆయన మానవుని ఆనందం కొరకే అలాంటివి సమృద్ధిగా దయచేస్తున్నాడు. (1 తిమోతి 6:17) అయితే ఆ ప్రజల తప్పుడు కోరికలు, వారి దుష్ట హృదయస్థితి, దేవునిపట్ల వారి భక్తిహీన దృక్పథం, తోటి ఇశ్రాయేలీయులపట్ల వారికి ప్రేమ లేకపోవడం యెహోవాను నొప్పించాయి.

6 ‘పాన్పులమీద తమ్మును చాచుకొనుచు, మందలో శ్రేష్ఠమైన గొఱ్ఱెపిల్లలను భోజనము చేయుచు, ద్రాక్షారసము పానము చేయుచు, వాయించు వాద్యములను కల్పించుకొనుచున్న’ ఆ పురుషులు విస్మయం చెందబోతున్నారు. వారిలా అడగబడ్డారు: ‘ఉపద్రవ దినము బహుదూరమున ఉన్నదనుకొనుచున్నారా?’ నిజానికి వారు ఇశ్రాయేలులోని పరిస్థితులనుబట్టి బహుగా దుఃఖించాలి, అయితే వారు ‘యోసేపు సంతతివారికి కలిగిన ఉపద్రవమును గురించి చింతించడమే లేదు.’ (ఆమోసు 6:​3-6) ఆ జనాంగం ఆర్థికంగా సుభిక్షంగా ఉన్నప్పటికీ, యోసేపు లేదా ఇశ్రాయేలు ఆధ్యాత్మిక విపత్కర పరిస్థితిలో ఉన్నట్లు దేవుడు గమనించాడు. అలా ఉన్నప్పటికీ, ప్రజలు ఏ మాత్రం చింతలేకుండా తమ దైనందిన వ్యవహారాల్లో మునిగిపోయారు. నేడు చాలామందికి అదే విధమైన దృక్పథం ఉంది. మనం కష్టకాలాల్లో జీవిస్తున్నామని వారు అంగీకరించవచ్చు, కానీ వారు వ్యక్తిగతంగా ప్రభావితం కానంతవరకు ఇతరుల అవస్థలను పట్టించుకోరు, ఆధ్యాత్మిక విషయాల్లో ఏమాత్రం ఆసక్తి కనబరచరు.

ఇశ్రాయేలు​—⁠కుళ్లుపట్టిన ఒక జనాంగం

7 బయటకు బాగానే కనిపించినా, లోలోపల కుళ్లిన జనాంగాన్ని ఆమోసు పుస్తకం చిత్రీకరిస్తోంది. ప్రజలు దేవుని హెచ్చరికలను లక్ష్యపెట్టి తమ దృక్కోణం సరిదిద్దుకోని కారణంగా, యెహోవా వారిని వారి శత్రువులకు వదిలేస్తాడు. అప్పుడు అష్షూరీయులు వచ్చి వారిని వైభవోపేతమైన దంతపు మంచాల మీదనుండి ఈడ్చి చెరగా పట్టుకుపోతారు. వారికి ఇక ఏమాత్రం సుఖం ఉండదు!

8 ఇశ్రాయేలీయులు అలాంటి దయనీయ స్థితికి ఎలా వచ్చారు? సా.శ.పూ. 997లో సొలొమోను కుమారుడైన రెహబాము అధికారానికి రావడం, ఇశ్రాయేలు పది గోత్రాలు యూదా, బెన్యామీను గోత్రాల నుండి వేరుకావడంతో పరిస్థితి మారింది. పది గోత్రాల ఇశ్రాయేలు రాజ్యానికి ‘నెబాతు కుమారుడైన’ యరొబాము I రాజయ్యాడు. (1 రాజులు 11:26) యెహోవాను ఆరాధించడానికి యెరూషలేముకు వెళ్లడం బహు ప్రయాసకరమని యరొబాము తన రాజ్యంలోని ప్రజలను ఒప్పించాడు. అయితే అతనికి ప్రజల సంక్షేమంపట్ల నిజమైన శ్రద్ధేమీ లేదు. బదులుగా, అతను తనకు సంబంధించిన విషయాలను కాపాడుకోవడానికే ప్రయత్నిస్తూ వచ్చాడు. (1 రాజులు 12:​26) యెహోవాను గౌరవిస్తూ ఇశ్రాయేలీయులు ఒకవేళ వార్షిక పండుగలకు యెరూషలేములోని ఆలయానికి వెళ్లడం కొనసాగిస్తే, వారు చివరకు యూదా రాజ్యంపట్ల విశ్వాస్యత ప్రదర్శిస్తారేమోనని యరొబాము భయపడ్డాడు. కాబట్టి అలా జరగకుండా అడ్డుకునేందుకు, యరొబాము రెండు బంగారు దూడలు చేయించి ఒకటి దానులో రెండవది బేతేలులో నిలబెట్టాడు. ఆ విధంగా, దూడ ఆరాధన ఇశ్రాయేలు రాజ్యంలో అధికార మతంగా తయారయ్యింది.​—2 దినవృత్తాంతములు 11:13-15.

9 క్రొత్త మతానికి స్వచ్ఛతను ఆపాదించడానికి యరొబాము ప్రయత్నించాడు. అతడు యెరూషలేములో జరిగే పండుగలను పోలిన ఆచరణలు ఏర్పాటుచేశాడు. 1 రాజులు 12:32లో మనం ఇలా చదువుతాము: “యరొబాము యూదాదేశమందు జరుగు ఉత్సవమువంటి ఉత్సవమును ఎనిమిదవ మాసము పదునైదవ దినమందు జరుప నిర్ణయించి, . . . బేతేలునందును తాను చేయించిన దూడలకు బలులు అర్పించుచుండెను.”

10 యెహోవా అలాంటి అబద్ధమత పండుగలను ఎన్నడూ ఆమోదించలేదు. ఒక శతాబ్దం కంటే ఎక్కువకాలం తర్వాత అంటే సా.శ.పూ. 844లో పది గోత్రాల ఇశ్రాయేలు రాజ్యానికి రాజైన యరొబాము II పరిపాలనా కాలంలో ఆయన ఆ విషయాన్ని ఆమోసు ద్వారా స్పష్టం చేశాడు. (ఆమోసు 1:⁠1) ఆమోసు 5:21-24 వచనాల ప్రకారం దేవుడు ఇలా చెప్పాడు: “మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను; వాటిని నీచముగా ఎంచుచున్నాను; మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆఘ్రాణింపనొల్లను. నాకు దహనబలులను నైవేద్యములను మీరర్పించినను నేను వాటిని అంగీకరింపను; సమాధాన బలులుగా మీరర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నాయొద్దనుండి తొలగనియ్యుడి, మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సులేదు. నీళ్లు పారినట్లుగా న్యాయము జరుగనియ్యుడి, గొప్ప ప్రవాహమువలె నీతిని ప్రవహింపనియ్యుడి.”

ఆధునిక దిన సమాంతరాలు

11 స్పష్టంగా, ఇశ్రాయేలు పండుగల్లో పాల్గొంటున్నవారి హృదయాలను యెహోవా పరిశోధించి, వారి ఉత్సవాలను దహనబలులను తిరస్కరించాడు. అదే విధంగా నేడు, క్రిస్మస్‌, ఈస్టర్‌లాంటి క్రైస్తవమత సామ్రాజ్య అన్యమత పండుగలను దేవుడు తిరస్కరిస్తున్నాడు. యెహోవా ఆరాధకుల విషయంలో నీతికి దుర్నీతికి సాంగత్యం ఉండకూడదు, వెలుగుతో చీకటికి పొత్తు ఉండకూడదు.​—⁠2 కొరింథీయులు 6:14-16.

12 దూడను ఆరాధిస్తున్న ఇశ్రాయేలీయుల ఆరాధనకు క్రైస్తవమత సామ్రాజ్యంలోని వారి ఆరాధనకు ఇతర పోలికలు కూడా ఉన్నాయి. నామకార్థ క్రైస్తవులు కొందరు దేవుని వాక్య సత్యాన్ని అంగీకరించినప్పటికీ, క్రైస్తవమత సామ్రాజ్యం చేసే ఆరాధన దేవునిపట్ల నిజమైన ప్రేమతో పురికొల్పబడింది కాదు. అదే నిజమైతే, “ఆత్మతోను సత్యముతోను” యెహోవాను ఆరాధించడాన్ని అది నొక్కిచెప్పేదే, ఎందుకంటే ఆయన అలాంటి ఆరాధననే ఇష్టపడతాడు. (యోహాను 4:24) అంతేకాక, క్రైస్తవమత సామ్రాజ్యం ‘నీళ్లు పారినట్లుగా న్యాయము జరుగనియ్యడం లేదు, గొప్ప ప్రవాహమువలె నీతిని ప్రవహింపనియ్యడం లేదు.’ బదులుగా, అది తరచూ దేవుని నియమాలను నీరుగారుస్తోంది. అది జారత్వాన్ని, ఇతర ఘోర పాపాలను చూడనట్టు ఊరుకోవడమే కాక, సలింగ వివాహాలను సహితం దీవిస్తోంది!

‘మేలును ప్రేమించుము’

13 ఆమోదకరమైన రీతిలో యెహోవాను ఆరాధించాలని కోరుకునే వారందరికి ఆయన ఇలా చెబుతున్నాడు: ‘కీడును ద్వేషించి మేలును ప్రేమించుడి.’ (ఆమోసు 5:​15) బలమైన భావావేశాలైన ప్రేమ, ద్వేషం అలంకారార్థ హృదయం నుండి పుట్టుకొస్తాయి. హృదయం మోసకరమైనది కాబట్టి, దానిని కాపాడుకోవడానికి మనం శాయశక్తులా ప్రయత్నించాలి. (సామెతలు 4:23; యిర్మీయా 17:9) చెడు కోరికలు పెంచుకోవడానికి మన హృదయాన్ని అనుమతిస్తే, మనం క్రమేపి చెడును ప్రేమిస్తూ, మేలును ద్వేషించే వారిగా తయారౌతాం. అలాంటి కోరికల ప్రకారం ప్రవర్తిస్తూ మనం పాపాన్ని అభ్యసిస్తూ ఉంటే, మనకు ఎంత ఆసక్తి ఉన్నా అది మనల్ని దేవుని అనుగ్రహానికి పాత్రులను చేయదు. కాబట్టి ‘కీడును ద్వేషించి మేలును ప్రేమించేలా’ దేవుని సహాయం కోసం మనం ప్రార్థిద్దాం.

14 అయితే ఇశ్రాయేలీయులు అందరూ యెహోవా దృష్టిలో చెడు చేయడం లేదు. ఉదాహరణకు, హోషేయ, ఆమోసులు ‘మేలును ప్రేమిస్తూ’ ప్రవక్తలుగా దేవునికి నమ్మకమైన సేవచేశారు. ఇంకా కొందరు నాజీరులుగా ప్రమాణ స్వీకారం చేశారు. నాజీరులుగా వారు తాము జీవించినంత కాలం, ద్రాక్షా ఉత్పత్తులను, ప్రత్యేకంగా ద్రాక్షారసాన్ని విసర్జించారు. (సంఖ్యాకాండము 6:​1-4) సత్క్రియలు చేసేవారి అలాంటి స్వయంత్యాగ స్ఫూర్తిని ఇతర ఇశ్రాయేలీయులు ఎలా దృష్టించారు? ఆ ప్రశ్నకు ఇవ్వబడిన దిగ్భ్రాంతికరమైన జవాబు ఆ జనాంగం ఆధ్యాత్మికంగా ఎంతగా చెడిపోయిందో వెల్లడిస్తోంది. ఆమోసు 2:⁠12 ఇలా చెబుతోంది: “నాజీరులకు మీరు ద్రాక్షారసము త్రాగించితిరి, ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చితిరి.”

15 నాజీరుల, ప్రవక్తల నమ్మకమైన ఆదర్శాన్ని చూసైనా, ఆ ఇశ్రాయేలీయులు సిగ్గుపడి తమ విధానాలు మార్చుకునేలా పురికొల్పబడవలసింది. బదులుగా, వారు దేవుణ్ణి మహిమపర్చకుండా ఆ యథార్థపరులను ప్రేమరహితంగా నిరుత్సాహపరిచేందుకు ప్రయత్నించారు. పయినీర్లుగా, మిషనరీలుగా, ప్రయాణ పైవిచారణకర్తలుగా, లేదా బెతెల్‌ కుటుంబ సభ్యులుగా ఉన్న మనతోటి క్రైస్తవులను సాధారణ జీవితంలోకి తిరిగిరమ్మని మనమెన్నటికీ బలవంతం చేయకుండా ఉందాం. బదులుగా, వారు చేస్తున్న మంచిపనిలో కొనసాగమని వారిని ప్రోత్సహిద్దాం!

16 ఆమోసు కాలంలో చాలామంది ఇశ్రాయేలీయులు భౌతికంగా సంతృప్తిదాయకమైన జీవితాలు గడుపుతున్నప్పటికీ, వారు ‘దేవునియెడల ధనవంతులుగా లేరు.’ (లూకా 12:​13-21) వారి పితరులు అరణ్యంలో 40 సంవత్సరాలపాటు కేవలం మన్నా భుజించారు. వారు క్రొవ్వినయెద్దు మాంసం తినలేదు లేదా దంతపు మంచాలమీద హాయిగా పడుకోలేదు. అయితే, మోషే సరిగానే వారితో ఇలా అన్నాడు: ‘నీ చేతుల పనులన్నిటిలోను నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ నలువది సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నీకు తోడైయున్నాడు, నీకేమియు తక్కువకాలేదు.’ (ద్వితీయోపదేశకాండము 2:⁠7) అవును, అరణ్యంలో ఏ సందర్భంలోనూ ఇశ్రాయేలీయులకు అవసరమైనదేదీ తక్కువ చేయబడలేదు. అన్నింటికంటే ముఖ్యంగా, వారు దేవుని ప్రేమను, సంరక్షణను, ఆశీర్వాదాన్ని అనుభవించారు!

17 ఇశ్రాయేలీయుల పితరులను తాను వాగ్దాన దేశంలోకి తెచ్చానని, దానిలో నుండి శత్రువులందరిని వెళ్ళగొట్టడంలో వారికి తాను సహాయపడ్డానని యెహోవా ఆమోసు సమకాలీనులకు గుర్తుచేశాడు. (ఆమోసు 2:​9, 10) అయితే దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి వాగ్దాన దేశానికి ఎందుకు నడిపించాడు? వారు తమ సృష్టికర్తను తిరస్కరించి భోగలాలస జీవితం గడిపేందుకా? కానేకాదు. బదులుగా, వారు స్వతంత్ర ప్రజలుగా, ఆధ్యాత్మికంగా పరిశుభ్రమైన ప్రజలుగా యెహోవాను ఆరాధించడానికే ఆయన వారిని తీసుకొచ్చాడు. అయితే పది గోత్రాల ఇశ్రాయేలు రాజ్య నివాసులు కీడును ద్వేషించి మేలును ప్రేమించలేదు. దానికి భిన్నంగా, వారు యెహోవా దేవుణ్ణి మహిమపరచడానికి బదులు తుచ్ఛమైన విగ్రహాలను మహిమపరుస్తున్నారు. ఎంత సిగ్గుచేటు!

యెహోవా శిక్షిస్తాడు

18 దేవుడు ఇశ్రాయేలీయుల అవమానకరమైన ప్రవర్తనను చూస్తూ ఊరుకోడు. ఆయన తన దృక్కోణమేమిటో ఇలా స్పష్టం చేశాడు: “మీరు చేసిన దోషక్రియలన్నిటినిబట్టి మిమ్మును శిక్షింతును.” (ఆమోసు 3:⁠2) ఆ మాటలు ఆధునిక దిన ఐగుప్తు నుండి, అంటే ప్రస్తుత దుష్ట విధానం నుండి మనకు లభించిన విడుదల గురించి ఆలోచింపజేయాలి. స్వార్థపూరిత లక్ష్యాలను వెంబడించడానికి యెహోవా మనకు ఆధ్యాత్మిక స్వేచ్ఛను అనుగ్రహించలేదు. బదులుగా, స్వచ్ఛారాధన చేసే స్వతంత్ర ప్రజలుగా మనం నిండు హృదయంతో ఆయనను స్తుతించడానికి ఆయన మనలను విడిపించాడు. మనలో ప్రతి ఒక్కరం దేవుడు మనకు అనుగ్రహించిన స్వాతంత్ర్యాన్ని ఎలా ఉపయోగిస్తున్నామనే విషయంలో లెక్క అప్పజెప్పాలి.​—⁠రోమీయులు 14:​11-12.

19 ఆమోసు ఇచ్చిన శక్తిమంతమైన సందేశాన్ని ఇశ్రాయేలులో అనేకులు పెడచెవినబెట్టడం శోచనీయం. ఆమోసు 4:​4, 5లో ఉన్న ప్రకారం, వారి ఆధ్యాత్మిక రోగగ్రస్థ హృదయ స్థితిని బహిర్గతంచేస్తూ ప్రవక్త ఇలా అన్నాడు: “బేతేలునకు వచ్చి తిరుగుబాటు చేయుడి, గిల్గాలునకు పోయి మరి యెక్కువగా తిరుగుబాటు చేయుడి, . . . ఇశ్రాయేలీయులారా, యీలాగున చేయుట మీకిష్టమై యున్నది.” ఇశ్రాయేలీయులు సరైన కోరికలు పెంపొందించుకోలేదు. వారు తమ హృదయాలను భద్రపరచుకోలేదు. దాని ఫలితంగా, వారిలో అనేకులు కీడును ప్రేమించి మేలును ద్వేషించారు. దూడను ఆరాధించే ఆ మూర్ఖులు మారలేదు. యెహోవా వారిని శిక్షిస్తాడు, వారు తమ పాపంలోనే మరణించాలి!

20 ఆ కాలంలో ఇశ్రాయేలులో జీవించిన ఎవరికైనా యెహోవాకు నమ్మకంగా ఉండడం అంత సులభంగా ఉండకపోవచ్చు. మన వయసు ఏదైనా క్రైస్తవులుగా నేడు మనకు, ఏటికి ఎదురీదడం కష్టమని బాగా తెలుసు. అయితే దేవునిపట్ల ప్రేమ, ఆయనను సంతోషపెట్టాలనే కోరిక సత్యారాధనను కొనసాగించేలా కొంతమంది ఇశ్రాయేలీయులను పురికొల్పింది. ఆమోసు 5:4లో వ్రాయబడినట్లుగా ఆప్యాయతతో యెహోవా వారికి ఈ ఆహ్వానం ఇచ్చాడు: “నన్నాశ్రయించినయెడల [‘వెదకినయెడల,’ NW] మీరు బ్రదుకుదురు.” అదే విధంగా నేడు దేవుడు, పశ్చాత్తాపం చూపించి, తన వాక్యపు ఖచ్చితమైన పరిజ్ఞానం సంపాదించుకోవడం ద్వారా తన చిత్తాన్ని తెలుసుకుని దాన్ని చేసే వారిని కనికరిస్తున్నాడు. ఈ మార్గం అవలంబించడం అంత సులభం కాదు, కానీ అలా చేయడం నిత్యజీవానికి నడిపిస్తుంది.​—⁠యోహాను 17:⁠3.

ఆధ్యాత్మిక కరవు ఉన్నా సుభిక్షంగా ఉండడం

21 సత్యారాధనకు మద్దతివ్వని వారికొరకు ఏమి వేచివుంది? అతి భయంకరమైన కరవు, ఆధ్యాత్మిక కరవు వేచి ఉంది! “రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును; అది అన్న పానములు లేకపోవుటచేత కలుగు క్షామముకాక యెహోవా మాటను వినకపోవుటవలన కలుగు క్షామముగా ఉండును; ఇదే యెహోవా వాక్కు.” (ఆమోసు 8:​11) క్రైస్తవమత సామ్రాజ్యం అలాంటి ఆధ్యాత్మిక కరవు కోరల్లో చిక్కుకుంది. అయితే, దాని సభ్యుల్లోని యథార్థ హృదయులు దేవుని ప్రజల ఆధ్యాత్మిక సమృద్ధిని చూసి, యెహోవా సంస్థకు తరలి వస్తున్నారు. క్రైస్తవమత సామ్రాజ్యంలోని పరిస్థితికి, నిజ క్రైస్తవుల్లోని పరిస్థితికిగల తారతమ్యం యెహోవా పలికిన ఈ మాటల్లో స్పష్టంగా చూపించబడింది: “ఆలకించుడి నా సేవకులు భోజనముచేయుదురు గాని మీరు ఆకలిగొనెదరు. నా సేవకులు పానము చేసెదరు గాని మీరు దప్పిగొనెదరు. నా సేవకులు హృదయానందముచేత కేకలు వేసెదరుగాని మీరు చింతాక్రాంతులై యేడ్చెదరు మనో దుఃఖముచేత ప్రలాపించెదరు.”​—⁠యెషయా 65:13-14.

22 యెహోవా సేవకులుగా మనకున్న ఆధ్యాత్మిక ఏర్పాట్లను, ఆశీర్వాదాలను మనం వ్యక్తిగతంగా విలువైనవిగా ఎంచుతున్నామా? మనం బైబిలును, క్రైస్తవ సాహిత్యాలను అధ్యయనం చేసినప్పుడు, మన కూటాలకు, సమావేశాలకు హాజరైనప్పుడు మనకున్న మంచి హృదయస్థితినిబట్టి సంతోషంతో కేకలు వేయాలనిపిస్తుంది! దైవ ప్రేరేపిత ఆమోసు ప్రవచనంతోపాటు దేవుని వాక్యంలోవున్న స్పష్టమైన అవగాహననుబట్టి మనమెంతో ఆనందిస్తాం.

23 దేవుని ప్రేమించి, ఆయనను మహిమపర్చాలని కోరుకునే మానవులందరికీ ఆమోసు ప్రవచనంలో నిరీక్షణా సందేశం ఉంది. మన ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఎలావున్నా లేక ఈ కష్టభరిత లోకంలో మనమెలాంటి పరీక్షలు ఎదుర్కొన్నా, దేవుని ప్రేమించే మనం దైవిక ఆశీర్వాదాలను శ్రేష్ఠమైన ఆధ్యాత్మిక ఆహారాన్ని ఆస్వాదిస్తున్నాం. (సామెతలు 10:22; మత్తయి 24:45-47) కాబట్టి, మన ప్రయోజనార్థం సమస్తాన్ని ధారాళంగా దయచేస్తున్న దేవునికే మహిమంతా చెందుతుంది! కాబట్టి, మనందరం ఆయనకు నిత్యం మన హృదయపూర్వక స్తుతి చెల్లించడానికే తీర్మానించుకొందుము గాక! మనం హృదయ పరిశోధకుడైన యెహోవాను వెదకితే, అది మనకు లభించిన ఆనందకరమైన గొప్ప ఆధిక్యతే అవుతుంది.

మీరెలా జవాబిస్తారు?

ఆమోసు కాలంలో ఇశ్రాయేలులో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి?

పది గోత్రాల ఇశ్రాయేలు రాజ్య పరిస్థితికి ప్రస్తుత పరిస్థితికి ఎలాంటి సమాంతరాలు ఉన్నాయి?

ప్రవచించబడిన ఏ కరవు నేడు ఉంది, అయితే దాని ప్రభావానికి ఎవరు గురికావడం లేదు?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. “యెహోవా హృదయమును లక్ష్యపెట్టును” అని లేఖనాలు చెప్పినప్పుడు దాని భావమేమిటి?

3, 4. ఆమోసు 6:4-6 ప్రకారం, పది గోత్రాల ఇశ్రాయేలు రాజ్యంలో ఎలాంటి పరిస్థితులున్నాయి?

5. ఆమోసు కాలంలోని ఇశ్రాయేలీయుల విషయంలో యెహోవా ఎందుకు నొచ్చుకున్నాడు?

6. ఆమోసు కాలంలో ఇశ్రాయేలీయుల ఆధ్యాత్మిక పరిస్థితి ఎలా ఉంది?

7. దేవుని హెచ్చరికలను లక్ష్యపెట్టకపోతే ఇశ్రాయేలు ప్రజలకు ఏమి సంభవిస్తుంది?

8. ఇశ్రాయేలు ఎలా ఆధ్యాత్మికంగా చెడు పరిస్థితిలోకి దిగజారింది?

9, 10. (ఎ) రాజైన యరొబాము I ఎలాంటి మత ఆచరణలు ఏర్పాటుచేశాడు? (బి) రాజైన యరొబాము II కాలంలో ఇశ్రాయేలులో ఆచరించబడిన పండుగలను దేవుడు ఎలా దృష్టించాడు?

11, 12. ప్రాచీన ఇశ్రాయేలు ఆరాధనకు, క్రైస్తవమత సామ్రాజ్యపు ఆరాధనకు ఎలాంటి పోలికలున్నాయి?

13. ఆమోసు 5:15లోని మాటలకు మనమెందుకు కట్టుబడివుండాలి?

14, 15. (ఎ) ఇశ్రాయేలులో ఎవరు మేలు చేస్తున్న వారిగా ఉన్నారు, అయితే వారిలో కొందరు ఎలా చూడబడుతున్నారు? (బి) నేడు పూర్తికాల సేవలో ఉన్నవారిని మనమెలా ప్రోత్సహించవచ్చు?

16. ఆమోసు కాలంలోకంటే మోషే కాలంలోనే ఇశ్రాయేలీయులు ఎందుకు ఆధ్యాత్మికంగా సుభిక్షంగా ఉన్నారు?

17. ప్రాచీన ఇశ్రాయేలీయులను యెహోవా వాగ్దాన దేశంలోకి ఎందుకు నడిపించాడు?

18. యెహోవా ఆధ్యాత్మికంగా మనకు ఎందుకు స్వాతంత్ర్యమిచ్చాడు?

19. ఆమోసు 4:4, 5 ప్రకారం, ఇశ్రాయేలీయుల్లో చాలామంది దేనిని ప్రేమించారు?

20. ఆమోసు 5:4కు అనుగుణంగా ఉన్న మార్గాన్ని ఎలా వెంబడించవచ్చు?

21. సత్యారాధనకు మద్దతివ్వనివారికి ఎలాంటి అధ్యాత్మిక కరవు సంభవిస్తుంది?

22. ఆనందించే కారణం మనకు ఎందుకుంది?

23. దేవుని మహిమపరిచే వారు ఏమి ఆస్వాదిస్తారు?

[21వ పేజీలోని చిత్రాలు]

చాలామంది ఇశ్రాయేలీయులు భోగలాలసంగా జీవించారు కానీ వారు ఆధ్యాత్మిక సమృద్ధిని అనుభవించలేదు

[23వ పేజీలోని చిత్రం]

పూర్తికాల సేవకులు చేస్తున్న మంచి పనిలో కొనసాగేలా వారిని ప్రోత్సహించండి

[24, 25వ పేజీలోని చిత్రాలు]

సంతోషభరితులైన యెహోవా ప్రజల్లో ఆధ్యాత్మిక కరవు లేదు