ఏది తప్పు ఏది ఒప్పు అనేది ఎలా నిర్ణయించుకోవాలి?
ఏది తప్పు ఏది ఒప్పు అనేది ఎలా నిర్ణయించుకోవాలి?
తప్పొప్పుల ప్రమాణాలను నిర్ణయించే అధికారం ఎవరికి ఉంది? ఈ ప్రశ్న మానవ చరిత్రారంభంలోనే లేవదీయబడింది. బైబిలు పుస్తకమైన ఆదికాండము ప్రకారం, దేవుడు ఏదెను తోటలో పెరుగుతున్న ఒక చెట్టును ఎంపిక చేసుకొని అది “మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము” అని నిర్ణయించాడు. (ఆదికాండము 2:9) ఆ చెట్టు పండ్లను తినవద్దని ఆయన మొదటి మానవ దంపతులకు చెప్పాడు. అయితే వారు ఆ చెట్టు పండు తింటే వారి ‘కన్నులు తెరవబడతాయి’ అని, వారు ‘మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉంటారు’ అని దేవుని శత్రువైన అపవాదియగు సాతాను చెప్పాడు.—ఆదికాండము 2:16, 17; 3:1, 5; ప్రకటన 12:9.
అప్పుడు ఆదాము హవ్వలు ఒక నిర్ణయం తీసుకోవలసి వచ్చింది—మంచి చెడులకు సంబంధించి దేవుడు నిర్ణయించిన ప్రమాణాలను అంగీకరించాలా లేక తమ సొంత ప్రమాణాలను అనుసరించాలా? (ఆదికాండము 3:6) వారు దేవుని మాట వినకుండా ఆ చెట్టు పండు తినాలని నిర్ణయించుకున్నారు. వారు చేసిన ఆ చిన్న పని ఏమి సూచించింది? వారు దేవుడు తమకు విధించిన పరిమితులకు అనుగుణంగా జీవించడానికి నిరాకరించడం ద్వారా తప్పొప్పులకు సంబంధించి తమ సొంత ప్రమాణాలను స్థాపించుకుంటేనే తమకు తమ పిల్లలకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నట్లు చూపించారు. తమ సొంత ప్రమాణాలను స్థాపించుకొని దేవునిలా ప్రవర్తించాలనుకున్న మానవులు ఎంతవరకు విజయం సాధించారు?
భిన్నాభిప్రాయాలు
శతాబ్దాలపాటు ఎంతోమంది ప్రఖ్యాత మేధావుల బోధనలను సమీక్షించిన తర్వాత, గ్రీకు తత్త్వవేత్త సోక్రటీసు కాలంనుండి 20వ శతాబ్దం వరకూ “మంచితనం అంటే ఏమిటి, తప్పొప్పుల ప్రమాణాలు ఎలా ఉండాలి అనే విషయాలపై ఎన్నో చర్చలు జరిగాయి” అని ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా నివేదిస్తోంది.
ఉదాహరణకు సా.శ.పూ. ఐదవ శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత గ్రీకు బోధకులు సోఫిస్టులు అని పిలువబడేవారు. ప్రజాదరణ పొందిన అభిప్రాయాల ఆధారంగా తప్పొప్పుల ప్రమాణాలను నిర్ణయించాలని వారు బోధించారు. అలాంటి ఒక బోధకుడు ఇలా చెప్పాడు: “ప్రతి నగరానికి ఏయే విషయాలు సరైనవిగా, అంగీకారయోగ్యంగా అనిపిస్తే ఆయా విషయాలు నైతికంగా సరైనవిగానే, అంగీకారయోగ్యమైనవిగానే ఉంటాయి.” ఈ ప్రమాణం ప్రకారం చూస్తే, ముందటి ఆర్టికల్‌లో ప్రస్తావించబడిన జోడీ ఆ డబ్బును ఉంచుకోవాలి ఎందుకంటే ఆయన వృత్తికి లేదా “నగరానికి” చెందినవారిలో చాలామంది అలాగే చేసుండేవారు.
ప్రసిద్ధికెక్కిన, 18వ శతాబ్దపు తత్త్వవేత్త ఇమ్మానుయెల్ కాంట్ దానికి భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇష్యూస్ ఇన్ ఎథిక్స్ అనే పత్రిక ఇలా చెబుతోంది: “ఇమ్మానుయెల్ కాంట్, అతనిలాంటి ఇతరులు . . . ఒక వ్యక్తికి తనకు తానుగా నిర్ణయించుకోవడానికిగల హక్కుపై ఎక్కువ అవధానం నిలిపారు.” కాంట్ వాదం ప్రకారం, జోడీ ఇతరుల హక్కులను ఉల్లంఘించనంత వరకు ఆయన ఏమి చేయాలి అనేది ఆయన వ్యక్తిగత నిర్ణయం. ఆయన ప్రజాదరణ పొందిన అభిప్రాయం ఆధారంగా తన ప్రమాణాలను మార్చుకోకూడదు.
అయితే జోడీ ఆ సందిగ్ధం నుండి ఎలా బయటపడ్డాడు? ఆయన మరో పద్ధతిని పాటించాలని నిర్ణయించుకున్నాడు. క్రైస్తవులు, క్రైస్తవేతరులు ఎంతగానో ప్రశంసించే నైతిక ప్రమాణాలను పాటించిన యేసుక్రీస్తు బోధను ఆయన అనుసరించాడు. యేసు ఇలా బోధించాడు: “మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి.” (మత్తయి 7:12) ఆ స్త్రీని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ జోడీ ఆమెకు ఆ 82,000 డాలర్లను ఇచ్చేశాడు! ఆ డబ్బును ఎందుకు ఉంచుకోలేదని జోడీని అడిగినప్పుడు ఆయన తానొక యెహోవాసాక్షినని వివరించి ఇలా చెప్పాడు: “నేను ఉంచుకోవడానికి ఆ డబ్బు నాది కాదు కదా.” “దొంగిలవద్దు” అని మత్తయి 19:18లో నమోదు చేయబడిన యేసు మాటలను జోడీ గంభీరంగా తీసుకున్నాడు.
ప్రజాదరణ పొందిన అభిప్రాయం నమ్మదగినదేనా?
జోడీ అంత నిజాయితీగా ఉండడం తెలివితక్కువతనమని కొందరు అనే అవకాశం ఉంది. అయితే ప్రజాదరణ పొందిన అభిప్రాయం ఆధారపడదగిన మార్గనిర్దేశాన్ని ఇవ్వదు. ఉదాహరణకు, పూర్వం కొన్ని సమాజాలు భావించినట్లు, పిల్లలను బలి ఇవ్వడం ఆమోదయోగ్యమైనదని భావించే సమాజంలో మీరు జీవిస్తున్నారనుకోండి, ప్రజలు అలా భావించినంత మాత్రాన అది సరైనదిగా మారుతుందా? (2 రాజులు 16:3) నరమాంసాన్ని భుజించడం నీతియుక్తమైన క్రియగా దృష్టించే సమాజంలో మీరు జన్మిస్తే అప్పుడెలా? అప్పుడు నరమాంసం భుజించడం తప్పు కాదని మీరు భావించేవారా? ఒక ఆచారం ప్రజాదరణ పొందినంత మాత్రాన అది సరైనది అని చెప్పలేము. ఎంతోకాలం క్రితం, బైబిలు అలాంటి ఉరి గురించి హెచ్చరిస్తూ ఇలా చెప్పింది: “దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు.”—నిర్గమకాండము 23:2.
యోహాను 14:30; లూకా 4:6) సాతాను “సర్వలోకమును” మోసగించడానికి తన స్థానాన్ని ఉపయోగించుకుంటున్నాడు. (ప్రకటన 12:9) కాబట్టి కేవలం ప్రజాదరణ పొందిన అభిప్రాయాలపై ఆధారపడి మీరు తప్పొప్పుల ప్రమాణాలను స్థాపించుకుంటే మీరు నైతికత విషయంలో సాతాను దృక్కోణాన్ని అలవర్చుకుంటుండవచ్చు, అది ఖచ్చితంగా వినాశనకరమైనది.
తప్పొప్పులను నిర్ణయించుకునేటప్పుడు ప్రజాదరణ పొందిన అభిప్రాయాన్ని అనుసరించే విషయంలో జాగ్రత్తగా ఉండడానికిగల మరో కారణాన్ని యేసుక్రీస్తు చూపించాడు. ఆయన “ఈ లోకాధికారి” సాతాను అని వెల్లడి చేశాడు. (మీరు మీ సొంత వివేచనపై ఆధారపడవచ్చా?
అలాగైతే ప్రతి వ్యక్తి ఏది తప్పు, ఏది ఒప్పు తనకు తానే నిర్ణయించుకోవాలా? బైబిలు ఇలా చెబుతోంది: ‘నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనవద్దు.’ (సామెతలు 3:5) ఎందుకు? ఎందుకంటే మానవులందరికీ తమ వివేచనను వక్రీకరించగల ఒక లోపం వారసత్వంగా లభించింది. ఆదాము హవ్వలు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు, వారు స్వార్థపూరిత మోసగాడైన సాతాను ప్రమాణాలను అంగీకరించి అతనిని తమ ఆధ్యాత్మిక తండ్రిగా ఎంపిక చేసుకున్నారు. ఆ తర్వాత వారు తమ పిల్లలకు ఒప్పేమిటో గుర్తించే సామర్థ్యమున్నా తప్పు చేయడంవైపే మొగ్గుచూపే మోసకరమైన హృదయాన్ని సంక్రమింపజేశారు.—ఆదికాండము 6:5; రోమీయులు 5:12; 7:21-24.
నైతిక సూత్రాల గురించి చర్చిస్తూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ఇలా చెబుతోంది: “ప్రజలకు నైతికంగా సరైనదేదో తెలిసినా తమకు ప్రయోజనకరమైన దానినే చేయడం ఆశ్చర్యం కలిగించదు. అలాంటి ప్రజలకు సరైనది చేయడానికిగల కారణాలను ఎలా చూపించాలనే విషయం పాశ్చాత్య నీతిశాస్త్రానికి ఒక పెద్ద సమస్యగా పరిణమించింది.” బైబిలు సరిగ్గానే ఇలా చెబుతోంది: “హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు?” (యిర్మీయా 17:9) మోసకరమైనవాడిగా, ఘోరమైన వ్యాధిగలవాడిగా అంటే ప్రమాదకరమైనవాడిగా పేరుపొందిన వ్యక్తిపై మీరు ఆధారపడతారా?
నిజమే దేవునిమీద నమ్మకంలేని ప్రజలకు కూడా నైతికంగా సరైన విధంగా ప్రవర్తించే సామర్థ్యం, ఉపయోగకరమైన మరియు గౌరవప్రదమైన నైతిక సూత్రాలను అలవర్చుకునే సామర్థ్యం ఉన్నాయి. అయితే వారు అనుసరించే నైతిక నియమాల్లోని ఉన్నతమైన సూత్రాలు బైబిల్లోని నైతిక సూత్రాలనే ప్రతిబింబిస్తాయి. అలాంటి ప్రజలు దేవుడు లేడని వాదించినా, వారికి దేవుని వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే సహజమైన సామర్థ్యం ఉందని వారి తలంపులు స్పష్టం చేస్తాయి. బైబిలు చెబుతున్నట్లుగా మానవులు ‘దేవుని స్వరూపమందు’ సృష్టించబడ్డారని అది రుజువు చేస్తోంది. (ఆదికాండము 1:27; అపొస్తలుల కార్యములు 17:26-28) అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు: “అట్టివారు . . . ధర్మశాస్త్రసారము తమ హృదయములయందు వ్రాయబడినట్టు చూపుచున్నారు.”—రోమీయులు 2:15.
సరైనదేమిటో తెలిసివుండడం ఒక విషయమైతే, సరైనదానినే చేయడానికి కావలసిన నైతిక బలం ఉండడం మరో విషయం. దానికి కావలసిన నైతిక బలాన్ని ఎలా సంపాదించుకోవచ్చు? క్రియలను హృదయం ప్రేరేపిస్తుంది కాబట్టి బైబిలు గ్రంథకర్త అయిన యెహోవా దేవునిపట్ల ప్రేమను పెంచుకుంటే, ఆ బలాన్ని పెంపొందించుకోవడానికి సహాయం లభిస్తుంది.—కీర్తన 25:4, 5.
మంచి చేయడానికి కావలసిన ధైర్యాన్ని కనుగొనడం
దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవడానికి తీసుకోవలసిన మొదటి చర్య, ఆయన ఆజ్ఞలు ఎంత సహేతుకమైనవో, ఎంత ఆచరణ యోగ్యమైనవో తెలుసుకోవడమే. “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు” అని అపొస్తలుడైన యోహాను చెప్పాడు. (1 యోహాను 5:3) ఉదాహరణకు, యౌవనస్థులు మద్యం సేవించాలా వద్దా, మాదకద్రవ్యాలను ఉపయోగించాలా వద్దా, పెళ్ళికి ముందు లైంగిక సంబంధాలు పెట్టుకోవాలా వద్దా అనే వాటిని నిర్ణయించుకునేటప్పుడు తప్పేదో ఒప్పేదో గ్రహించడానికి కావలసిన ఆచరణాత్మకమైన సలహాలు బైబిలులో ఉన్నాయి. వివాహిత దంపతులు తమ మధ్య విబేధాలను ఎలా పరిష్కరించుకోవాలో గ్రహించడానికి బైబిలు సహాయం చేస్తుంది, తల్లిదండ్రులకు పిల్లలను పెంచే విషయంలో మార్గనిర్దేశాలను కూడా ఇస్తుంది. * బైబిలు నైతిక ప్రమాణాలను అనుసరించినప్పుడు అవి సామాజిక స్థితి, విద్యాస్థాయి, సాంస్కృతిక నేపథ్యం ఏదైనా సరే పెద్దలకూ పిన్నలకూ ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.
పోషకాహారాన్ని తినడంవల్ల మీకు పని చేయడానికి కావలసిన శక్తి లభించినట్లే, దేవుని వాక్యాన్ని చదవడంవల్ల ఆయన ప్రమాణాలను అనుసరించి జీవించడానికి కావలసిన బలం లభిస్తుంది. యేసు, దేవుని నోటినుండి వచ్చే మాటలను జీవాన్ని కాపాడే రొట్టెలతో పోల్చాడు. (మత్తయి 4:4) ఆయన ఇలా కూడా అన్నాడు: “నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుట . . . నాకు ఆహారమై యున్నది.” (యోహాను 4:34) దేవుని వాక్యం నుండి ఆధ్యాత్మిక ఆహారాన్ని తీసుకోవడం, శోధనలను ఎదిరించడానికి, జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోవడానికి, సిద్ధంగా ఉండేందుకు యేసుకు సహాయం చేసింది.—లూకా 4:1-13.
మొదట్లో దేవుని వాక్యంనుండి ఆధ్యాత్మిక ఆహారాన్ని తీసుకోవడం, ఆయన ప్రమాణాలను అలవర్చుకోవడం మీకు కొంచెం కష్టంగా అనిపించవచ్చు. అయితే మీరు పిల్లలుగా ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన ఆహారం రుచి మీకు నచ్చి ఉండకపోవచ్చు. కానీ బలంగా తయారవ్వడానికి మీరు అలాంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం నేర్చుకోవలసి వచ్చింది. అదేవిధంగా దేవుని ప్రమాణాలపట్ల ఇష్టం పెంచుకోవడానికి మీకు కొంచెం సమయం పట్టవచ్చు. మీరు పట్టువిడవకుండా ముందుకు సాగితే వాటిని ప్రేమించడం నేర్చుకొని ఆధ్యాత్మికంగా బలంగా తయారవుతారు. (కీర్తన 34:8; 2 తిమోతి 3:15-17) మీరు యెహోవామీద నమ్మకముంచడం నేర్చుకొని ‘మేలు చేయడానికి’ ప్రేరేపించబడతారు.—కీర్తన 37:3.
జోడీకి ఎదురైన పరిస్థితి మీకు ఎన్నటికీ ఎదురుకాకపోవచ్చు. అయినా కూడా మీరు ప్రతిరోజూ నైతిక విలువలకు సంబంధించి చిన్న, పెద్ద నిర్ణయాలు తీసుకుంటుంటారు. అందుకే బైబిలు మీకు ఇలా ఉద్బోధిస్తోంది: “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.” (సామెతలు 3:5, 6) యెహోవామీద నమ్మకముంచడాన్ని నేర్చుకోవడం ప్రస్తుతం మీకు ప్రయోజనం చేకూర్చడమే కాక నిరంతరం జీవించే అవకాశాన్ని కల్పిస్తుంది, ఎందుకంటే యెహోవా దేవునికి విధేయత చూపించడం నిత్యజీవానికి నడిపిస్తుంది.—మత్తయి 7:13, 14.
[అధస్సూచి]
^ పేరా 18 ఈ విషయాలకు, ఇతర ప్రాముఖ్యమైన అంశాలకు సంబంధించి బైబిలు ఇచ్చే ఆచరణాత్మకమైన సలహాలు యెహోవాసాక్షులు ప్రచురించిన యువత అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మకమైన సమాధానాలు (ఆంగ్లం), కుటుంబ సంతోషానికిగల రహస్యం అనే పుస్తకాల్లో చర్చించబడ్డాయి.
[6వ పేజీలోని బ్లర్బ్]
ప్రజాదరణ పొందిన అభిప్రాయం అదృశ్య శక్తులచేత ప్రభావితం చేయబడి ఉండవచ్చు
[5వ పేజీలోని చిత్రాలు]
చరిత్రంతటిలోనూ మేధావులు తప్పొప్పుల విషయంలో చర్చలు జరిపారు
సోక్రటీసు
కాంట్
కన్‌ఫ్యూషియస్
[చిత్రసౌజన్యం]
కాంట్: From the book The Historian’s History of the World; సోక్రటీసు: From the book A General History for Colleges and High Schools; కన్‌ఫ్యూషియస్: Sung Kyun Kwan University, Seoul, Korea
[7వ పేజీలోని చిత్రాలు]
బైబిలు మనకు తప్పేదో ఒప్పేదో గుర్తించడానికి సహాయం చేయడమే కాక సరైన దానిని చేయడానికి మనల్ని ప్రేరేపిస్తుంది కూడా