కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పునరుత్థానం చేయబడిన యేసు, అంతక్రితమే తనను ముట్టుకోవద్దని మగ్దలేనే మరియతో చెప్పి ఆ తర్వాత తనను ముట్టుకొమ్మని తోమాను ఎందుకు ఆహ్వానించాడు?

కొన్ని పాత అనువాదాలు, యేసు మగ్దలేనే మరియకు తనను ముట్టుకోవద్దని చెప్పాడన్న భావాన్నిస్తున్నాయి. ఉదాహరణకు తెలుగు బైబిలులో యేసు మాటలు ఇలా అనువదించబడ్డాయి: “నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు.” (యోహాను 20:​17) కానీ సాధారణంగా “ముట్టుకొను” అని అనువదించబడే గ్రీకు మూలభాషా పదానికి “అంటిపెట్టుకొని ఉండు, వదలకుండా ఉండు, పట్టుకొను, స్పృశించు” అనే అర్థాలు కూడా ఉన్నాయి. మగ్దలేనే మరియ తనను ముట్టుకోవడానికి యేసు అభ్యంతరం చెప్పలేదనడం సహేతుకమైనదే ఎందుకంటే ఆయన ఇతర స్త్రీలు ‘తన పాదములు పట్టుకోవడానికి’ అనుమతించాడు.​—⁠మత్తయి 28:⁠9.

అయితే పరిశుద్ధ లేఖనముల నూతనలోక అనువాదము (ఆంగ్లం), ద న్యూ జెరూసలేమ్‌ బైబిల్‌, ద న్యూ ఇంగ్లీష్‌ బైబిల్‌ వంటి అనేక ఆధునిక భాషా అనువాదాలు యేసు మాటలను “నన్ను అంటిపెట్టుకొని ఉండవద్దు” అని అనువదించడం ద్వారా ఆయన మాటల నిజమైన భావాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తున్నాయి. సన్నిహితురాలైన మగ్దలేనే మరియతో యేసు అలా ఎందుకు అన్నాడు?​—⁠లూకా 8:1-3.

బహుశా మగ్దలేనే మరియ, యేసు తమను విడిచి పరలోకానికి ఆరోహణమవుతాడేమోనని భయపడి ఉండవచ్చు. ఆమె తన ప్రభువుతోనే ఉండాలనే బలమైన కోరికతో యేసును వెళ్ళనివ్వకుండా ఆయనను అంటిపెట్టుకొని ఉంది. అయితే తాను అప్పుడే వాళ్ళను విడిచి వెళ్ళడంలేదని ఆమెకు హామీ ఇవ్వడానికి యేసు తనను అంటిపెట్టుకొని ఉండవద్దని మరియకు చెప్పి, దానికి బదులు తన పునరుత్థానం గురించిన వార్తను తన శిష్యులకు ప్రకటించమని చెప్పాడు.​—⁠యోహాను 20:​17.

అయితే యేసుకు తోమాకు మధ్య జరిగిన సంభాషణ భిన్నమైనది. యేసు కొంతమంది శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు, అక్కడ తోమా లేడు. ఆ తర్వాత తోమా యేసు చేతుల్లో మేకులు దిగగొట్టబడిన గాయాలను చూసి ఆయనను ఈటెతో పొడిచిన పక్కలో చెయ్యి పెట్టి చూస్తే తప్ప తాను విశ్వసించను అంటూ యేసు పునరుత్థానం విషయంలో సందేహాన్ని వ్యక్తం చేశాడు. ఎనిమిది రోజుల తర్వాత యేసు శిష్యులకు మళ్ళీ కనిపించాడు. ఈ సారి అక్కడ తోమా కూడా ఉన్నాడు, తన గాయాలను తాకమని యేసు ఆయనను ఆహ్వానించాడు.​—⁠యోహాను 20:24-27.

కాబట్టి మగ్దలేనే మరియ విషయంలో యేసు తనను వెళ్ళనివ్వకుండా ఆపాలనే అనుచితమైన కోరికవున్న వ్యక్తితో వ్యవహరించాడు; తోమా విషయంలో యేసు సందేహాలుగల వ్యక్తికి సహాయం చేశాడు. రెండు సందర్భాల్లోను యేసు అలా ప్రవర్తించడానికి తగిన కారణాలు ఉన్నాయి.