కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మద్యం సేవించే విషయంలో సమతుల్యమైన దృక్కోణాన్ని కాపాడుకోండి

మద్యం సేవించే విషయంలో సమతుల్యమైన దృక్కోణాన్ని కాపాడుకోండి

మద్యం సేవించే విషయంలో సమతుల్యమైన దృక్కోణాన్ని కాపాడుకోండి

“ద్రాక్షారసము వెక్కిరింతల పాలుచేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైనవారందరు జ్ఞానములేనివారు.”​సామెతలు 20:⁠1.

“శ్రేష్ఠమైన ప్రతి యీవియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రియొద్దనుండి వచ్చును” అని శిష్యుడైన యాకోబు వ్రాశాడు. (యాకోబు 1:​17) దేవుడు ఎన్నో మంచి వరాలను దయచేసినందుకు కృతజ్ఞతతో కదిలించబడిన కీర్తనకర్త ఇలా పాడాడు: “పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూరమొక్కలను ఆయన మొలిపించుచున్నాడు, అందుమూలమున భూమిలోనుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి మొగములకు మెరుగు నిచ్చు తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు.” (కీర్తన 104:​14, 15) ద్రాక్షారసము, ఇతర మద్యపానీయాలు కూడా కూరమొక్కలు, ఆహారము, తైలములవలే దేవుడు ఇచ్చిన చక్కని కానుకలే. మనం వాటిని ఎలా ఉపయోగించుకోవాలి?

2 ఒక కానుకను సరిగ్గా ఉపయోగించుకుంటేనే అది ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదాహరణకు తేనె “రుచిగలది,” కానీ “తేనె నధికముగా త్రాగుట మంచిది కాదు.” (సామెతలు 24:13; 25:​27) “ద్రాక్షారసము కొంచెముగా” సేవించడం మంచిదే అయినా మద్యాన్ని మితిమీరి సేవించడం మాత్రం గంభీరమైన సమస్య. (1 తిమోతి 5:​23) బైబిలు ఇలా హెచ్చరిస్తోంది: “ద్రాక్షారసము వెక్కిరింతల పాలుచేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైనవారందరు జ్ఞానములేనివారు.” (సామెతలు 20:⁠1) మద్యానికి వశమవడం అంటే ఏమిటి? * ఎంత మద్యం త్రాగితే మితిమీరి త్రాగినట్లవుతుంది? దీనికి సంబంధించి సమతుల్య దృక్కోణం ఏమిటి?

మద్యానికి ‘వశమవడం’​—⁠ఎలా?

3 ప్రాచీన ఇశ్రాయేలులో, పశ్చాత్తాపపడని తిండిబోతుగా, త్రాగుబోతుగా మారిన కుమారుణ్ణి రాళ్ళతో కొట్టి చంపవలసి ఉండేది. (ద్వితీయోపదేశకాండము 21:​18-21) అపొస్తలుడైన పౌలు క్రైస్తవులకు ఇలా ఉద్బోధించాడు: “సహోదరుడనబడిన వాడెవడైనను జారుడుగాని లోభిగాని విగ్రహారాధకుడుగాని తిట్టుబోతుగాని త్రాగుబోతుగాని దోచుకొనువాడుగాని అయియున్న యెడల, అట్టివానితో సాంగత్యము చేయకూడదు భుజంపనుకూడదు.” కాబట్టి త్రాగుబోతులుగా మారేంతగా మద్యం సేవించడాన్ని లేఖనాలు ఖండిస్తున్నాయని స్పష్టమవుతోంది.​—⁠1 కొరింథీయులు 5:11; 6:9, 10.

4 త్రాగుబోతుతనాన్ని వర్ణిస్తూ బైబిలు ఇలా చెబుతోంది: “ద్రాక్షారసము మిక్కిలి ఎఱ్ఱబడగను గిన్నెలో తళతళలాడుచుండగను త్రాగుటకు రుచిగా నుండగను దానివైపు చూడకుము. పిమ్మట అది సర్పమువలె కరచును కట్లపామువలె కాటువేయును. విపరీతమైనవి నీ కన్నులకు కనబడును, నీవు వెఱ్ఱిమాటలు పలుకుదువు.” (సామెతలు 23:​31-33) మితిమీరి మద్యం సేవిస్తే అది విషసర్పములా కాటు వేస్తుంది, అది అనారోగ్యాన్ని, మానసిక గందరగోళాన్ని కలుగజేయడమే కాక స్పృహ తప్పడానికి కూడా కారణమవుతుంది. ఒక త్రాగుబోతుకు “విపరీతమైనవి” కనిపిస్తాయి అంటే అతను భ్రాంతికి గురై లేనివి ఉన్నట్లుగా ఊహించుకుంటాడు. అతను త్రాగి ఉన్నప్పుడు, సాధారణంగా అణచిపెట్టుకునే వక్రమైన తలంపులను కోరికలను వ్యక్తం చేయకుండా నిగ్రహించుకోలేడు.

5 ఒక వ్యక్తి అధికంగా మద్యం సేవిస్తూనే తాను బాగా త్రాగివున్నాడని ఇతరులు గుర్తించగలిగేంతగా త్రాగకుండా జాగ్రత్తపడితే ఫర్వాలేదా? కొంతమంది వ్యక్తులు ఎంతో మద్యాన్ని సేవించిన తర్వాత కూడా మత్తులై ఉన్నట్లు కనిపించరు. అంతమాత్రాన అలా చేయడం హానికరం కాదని తలంచితే అది ఆత్మవంచనే అవుతుంది. (యిర్మీయా 17:⁠9) ఒక వ్యక్తి నెమ్మది నెమ్మదిగా మద్యంపై మరింత ఎక్కువ ఆధారపడుతూ ‘మద్యపానము వలన వశపరచుకొనబడిన వానిగా’ తయారవుతాడు. (తీతు 2:⁠3, అధస్సూచి) త్రాగుబోతులుగా మారే ప్రకియకు సంబంధించి రచయిత్రి కారోలైన్‌ నాప్‌ ఇలా చెబుతోంది: “ఒక వ్యక్తి త్రాగుబోతుగా మారడం మెల్లగా, క్రమంగా, రహస్యంగా, మోసకరంగా జరుగుతుంది.” మితిమీరి మద్యం సేవించడం ఎంతటి ప్రాణాంతకమైన ఉరో కదా!

6 యేసు ఇచ్చిన హెచ్చరికను కూడా పరిగణించండి: “మీ హృదయములు ఒకవేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమియందంతట నివసించు వారందరిమీదికి అకస్మాత్తుగా వచ్చును.” (లూకా 21:​34, 35) మద్యపానం ఒక వ్యక్తిని శారీరకంగాను ఆధ్యాత్మికంగాను మందకొడిగా బద్ధకస్తుడిగా చేస్తుంది, అలా జరగడానికి అతను త్రాగుబోతు స్థాయికే చేరుకోనవసరం లేదు. అతను ఆ స్థితిలో ఉన్నప్పుడు యెహోవా దినం వస్తే ఏమి చేస్తాడు?

మితిమీరిన మద్యపానం దేనికి నడిపిస్తుంది?

7 మితిమీరిన మద్యపానం ఒక వ్యక్తిని శారీరక, ఆధ్యాత్మిక ప్రమాదాలకు గురి చేయవచ్చు. మితిమీరి మద్యం సేవించేవారికి కాలేయం గట్టిపడడం, కాలేయవాపు వంటి వ్యాధులే కాక మద్యోన్మాదంవంటి నరాల రుగ్మతలు వస్తాయి. ఎంతోకాలంనుండి మితిమీరి మద్యం సేవిస్తున్నవారికి క్యాన్సర్‌, మధుమేహంతోపాటు గుండెకు, ఉదరానికి సంబంధించిన వ్యాధులు వస్తాయి. అంతేకాకుండా మితిమీరిన మద్యపానం ఈ లేఖనాధార సలహాకు విరుద్ధమైనది: “దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసికొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసికొందము.”​—⁠2 కొరింథీయులు 7:⁠1.

8 మితిమీరి మద్యం సేవించడం ఆదాయం వృథా కావడానికే కాక ఉద్యోగం కోల్పోవడానికి కూడా కారణమవుతుంది. ప్రాచీన ఇశ్రాయేలు రాజైన సొలొమోను ఇలా హెచ్చరించాడు: “ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైను సహవాసము చేయకుము.” ఎందుకు? ఆయనిలా వివరించాడు: “త్రాగుబోతులును తిండిపోతులును దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును.”​—⁠సామెతలు 23:20, 21.

9 మరొక ప్రమాదాన్ని సూచిస్తూ ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ ఆల్కహాలిజమ్‌ ఇలా చెబుతోంది: “మద్యం సేవించడం వాహనాలు నడిపే నైపుణ్యం దెబ్బతినడానికి అంటే ప్రతిస్పందించే సమయం, సమన్వయం, అవధానం, చుట్టూ ఉన్నవాటిని గమనించగలగడం, వివేచనతో వ్యవహరించడం వంటివి దెబ్బతినడానికి కారణమవుతుందని అధ్యయనాలు చూపించాయి.” మద్యం సేవించి వాహనాలను నడపడం వినాశనకరం. ఒక్క భారతదేశంలోనే ప్రతి సంవత్సరం, మద్యం సేవించి వాహనాలు నడపడంవల్ల జరిగిన రోడ్డు ప్రమాదాల కారణంగా వేలాదిమంది మరణిస్తున్నారు, గాయపడుతున్నారు. ప్రత్యేకించి యౌవనస్థులు ఈ ప్రమాదానికి ఎక్కువగా గురవుతున్నారు ఎందుకంటే వారికి వాహనాలు నడపడం మద్యం సేవించడం ఈ రెండూ కొత్తే. ఒక వ్యక్తి అధికంగా మద్యం సేవించిన తర్వాత వాహనం నడుపుతూ తాను తన జీవితాన్ని యెహోవా దేవునినుండి వచ్చిన బహుమానంగా గౌరవిస్తున్నానని చెప్పుకోగలడా? (కీర్తన 36:⁠9) జీవానికున్న పవిత్రత దృష్టిలో ఉంచుకొని ఒక వ్యక్తి వాహనం నడపవలసి ఉన్నప్పుడు మద్యం సేవించకపోవడమే మంచిది.

10 మితిమీరి త్రాగడం శారీరకంగానే కాక ఆధ్యాత్మికంగా కూడా హానికరమైనది. ‘ద్రాక్షారసము పానముచేయుటచేతను మద్యపానముచేతను మతిచెడును’ అని బైబిలు చెబుతోంది. (హోషేయ 4:​11) మద్యం మెదడుపై ప్రభావం చూపిస్తుంది. “ఒక వ్యక్తి మద్యం సేవించినప్పుడు అది జీర్ణక్రియ వ్యవస్థనుండి రక్త ప్రవాహంలోకి వచ్చి వెంటనే మెదడుకు చేరుకుంటుంది. అది మెదడులో ఆలోచనను భావోద్వేగాలను నియంత్రించే భాగాలు మందగించేలా చేస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి తనకు నిర్బంధాలేమీ లేనట్లు తాను స్వేచ్ఛగా ఉన్నట్లు భావిస్తాడు” అని మాదకద్రవ్యాల ఉపయోగం గురించి అమెరికా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రచురించిన ఒక పత్రిక వివరిస్తోంది. అలాంటి స్థితిలో మనం మద్యానికి “వశమై” ఇతరులతో అనుచితంగా ప్రవర్తించి ఎన్నో శోధనలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.​—⁠సామెతలు 20:⁠1.

11 అంతేకాకుండా బైబిలు ఇలా ఆజ్ఞాపిస్తోంది: “మీరు భోజనముచేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి.” (1 కొరింథీయులు 10:​31) మితిమీరి మద్యం సేవించడం దేవునికి మహిమను తెస్తుందా? ప్రతి క్రైస్తవుడు, త్రాగుబోతు అనే ముద్ర పడకుండా జాగ్రత్తపడాలని ఖచ్చితంగా కోరుకుంటాడు. ఎందుకంటే అలాంటి ముద్రపడితే అది దేవుని నామానికి మహిమను కాదు కానీ అపనిందను తెస్తుంది.

12 ఒక క్రైస్తవుడు నిగ్రహం లేకుండా మద్యం సేవించడం తోటి విశ్వాసిని బహుశా ఒక క్రొత్త శిష్యుడిని అభ్యంతరపెడితే అప్పుడెలా? (రోమీయులు 14:​21) యేసు ఇలా హెచ్చరించాడు: “నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో, వాడు మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడినవాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచి వేయబడుట వానికి మేలు.” (మత్తయి 18:⁠6) మితిమీరి త్రాగడంవల్ల సంఘంలో ఆధిక్యతలను కోల్పోయే అవకాశం కూడా ఉంది. (1 తిమోతి 3:​1-3, 8) అంతేకాకుండా మితిమీరి మద్యం సేవించడంవల్ల కుటుంబంలో కూడా ఎన్నో సమస్యలు తలెత్తుతాయనే వాస్తవాన్ని మనం కాదనలేము.

ప్రమాదాలకు దూరంగా ఎలా ఉండవచ్చు?

13 మితిమీరి త్రాగడంవల్ల వచ్చే ప్రమాదాలకు దూరంగా ఉండడానికి ఒక కీలకం ఏమిటంటే, త్రాగుబోతుతనానికి మాత్రమే గాక అధికంగా త్రాగడానికి కూడా దూరంగా ఉండాలని లక్ష్యం పెట్టుకోవడం. ఎంత త్రాగితే మితిమీరి త్రాగినట్లు, ఎంత త్రాగితే మితంగా త్రాగినట్లు అనేది ఎవరు నిర్ణయించాలి? దీనిలో ఎన్నో అంశాలు ఇమిడివున్నాయి కాబట్టి ఇంత త్రాగితే మితిమీరి త్రాగినట్లవుతుంది అని ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా తమ హద్దులేమిటో తెలుసుకొని ఆ హద్దులు దాటకుండా ఉండాలి. ఎంత త్రాగితే మితిమీరి త్రాగినట్లవుతుందో నిర్ణయించుకోవడానికి మనకేమి సహాయం చేస్తుంది? మనకు మార్గదర్శకంగా పనిచేయగల సూత్రమేదైనా ఉందా?

14 బైబిలిలా చెబుతోంది: “లెస్సయైన జ్ఞానమును వివేచనను భద్రము చేసికొనుము, . . . అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును.” (సామెతలు 3:​21, 22) కాబట్టి మనం పాటించవలసిన సూత్రం ఇది: మీ వివేచనను బలహీనపరిచేంత, మీ ఆలోచనా సామర్థ్యాన్ని మందగింపజేసేంత మద్యం సేవిస్తే అది ఖచ్చితంగా అధికంగా త్రాగినట్లే. అయితే మీ వ్యక్తిగత హద్దులను నిర్ణయించుకునేటప్పుడు మీరు నిజాయితీగా ఉండాలి!

15 కొన్ని సందర్భాల్లో అసలు మద్యం సేవించకుండా ఉండడం కూడా జ్ఞానయుక్తమైనదే. గర్భిణీ స్త్రీ తన గర్భంలోని పిండానికి ప్రమాదం వాటిల్లకుండా అసలు మద్యమే సేవించకూడదని నిర్ణయించుకోవచ్చు. అంతేకాకుండా మద్యం సేవించడానికి సంబంధించి సమస్యను ఎదుర్కొన్న వ్యక్తి లేదా మద్యం సేవించడాన్ని తప్పుగా భావించే వ్యక్తి సమక్షంలో త్రాగకుండా ఉండడం దయగల పని కాదంటారా? మందిర గుడారమువద్ద యాజక విధులను నిర్వర్తించేవారికి యెహోవా ఇలా ఆజ్ఞాపించాడు: “మీరు ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చునప్పుడు మీరు చావకుండునట్లు . . . ద్రాక్షారసమునేగాని మద్యమునేగాని త్రాగకూడదు.” (లేవీయకాండము 10:⁠8) కాబట్టి క్రైస్తవ కూటాలకు హాజరయ్యే ముందు, పరిచర్యలో పాల్గొనేటప్పుడు లేదా ఇతర ఆధ్యాత్మిక బాధ్యతలను నెరవేర్చేటప్పుడు మద్యం సేవించకండి. అంతేకాకుండా మద్యపానం నిషేధించబడిన దేశాల్లో లేదా మద్యపానం నిర్దిష్ట వయసు దాటినవారికి మాత్రమే పరిమితం చేయబడిన దేశాల్లో ఆ దేశ నియమాలను గౌరవించాలి.​—⁠రోమీయులు 13:⁠1.

16 ఎవరైనా మిమ్మల్ని మద్యం సేవించమని కోరితే లేదా మీ ముందు ఉంచితే మీరు వేసుకోవలసిన మొదటి ప్రశ్న: ‘నేను దీనిని త్రాగాలా?’ ఒకవేళ త్రాగాలని నిర్ణయించుకుంటే, మీ వ్యక్తిగత హద్దులను స్పష్టంగా గుర్తుంచుకొని, ఆ హద్దులను దాటకండి. ఉదారంగా ఆతిథ్యమిచ్చేవారి ఒత్తిడికి లొంగిపోకండి. పార్టీలు వంటి సందర్భాల్లో అపరిమితంగా మద్యం అందుబాటులో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. చాలా ప్రాంతాల్లో పిల్లలు కూడా మద్యం సేవించడానికి చట్టపరమైన అనుమతి ఉంది. అలాంటప్పుడు మద్యాన్ని సేవించే విషయంలో పిల్లలకు ఉపదేశించి వాళ్ళను కనిపెట్టుకుని ఉండే బాధ్యత తల్లిదండ్రులదే.​—⁠సామెతలు 22:⁠6.

మీరు సమస్యను అధిగమించవచ్చు

17 మీకు ద్రాక్షారసాన్ని, మత్తుకలిగించే మద్యాన్ని అధికంగా సేవించే సమస్య ఉందా? మీరు రహస్యంగా మద్యాన్ని అధికంగా సేవిస్తుంటే అది చివరకు ఖచ్చితంగా బయటపడుతుంది. కాబట్టి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా నిజాయితీగా పరిశీలించుకోండి. ఇలాంటి స్వయం పరిశీలనా ప్రశ్నలు వేసుకోండి: ‘నేను ఇంతకుముందుకంటే ఎక్కువగా త్రాగుతున్నానా? నేను సేవించే మద్యం మరింత మత్తు కలిగించేదిగా ఉంటుందా? బాధలు, ఒత్తిడి, లేదా సమస్యలనుండి తప్పించుకోవడానికి నేను మద్యం సేవిస్తున్నానా? నేను మద్యం సేవించడం గురించి కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు చింతను వ్యక్తం చేశారా? నేను త్రాగడంవల్ల నా కుటుంబంలో సమస్యలు తలెత్తాయా? నేను మద్యం సేవించకుండా ఒక వారం, ఒక నెల, లేదా అనేక నెలలు ఉండడం కష్టంగా ఉన్నట్లు భావిస్తున్నానా? నేను ఎంత మద్యాన్ని సేవిస్తాను అనే విషయాన్ని ఇతరులనుండి దాస్తున్నానా?’ ఈ ప్రశ్నల్లో కొన్నింటి సమాధానం అవును అని వస్తే అప్పుడెలా? ‘తన సహజముఖమును అద్దములో చూచుకొని, అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరచిపోయే’ వ్యక్తిగా ఉండకండి. (యాకోబు 1:​22-24) సమస్యను సరిదిద్దుకునేందుకు చర్యలు తీసుకోండి. మీరేమి చేయవచ్చు?

18 అపొస్తలుడైన పౌలు క్రైస్తవులకు ఇలా ఉద్బోధించాడు: “మద్యముతో మత్తులైయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు; అయితే ఆత్మ పూర్ణులైయుండుడి.” (ఎఫెసీయులు 5:​18) మీరు ఎంత మద్యం సేవిస్తే అది మితిమీరి సేవించినట్లవుతుంది అనే విషయాన్ని నిర్ణయించుకొని, తగిన విధంగా హద్దులు ఏర్పరచుకోండి. ఆ హద్దులను దాటకూడదని తీర్మానించుకోండి; ఆశానిగ్రహాన్ని చూపించండి. (గలతీయులు 5:​22) మీకు అధికంగా త్రాగమని ఒత్తిడి చేసే స్నేహితులున్నారా? జాగ్రత్తగా ఉండండి. “జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును” అని బైబిలు చెబుతోంది.—సామెతలు 13:20.

19 ఒకానొక సమస్యనుండి తప్పించుకోవడానికి మీరు మద్యం సేవిస్తున్నట్లైతే, ఆ సమస్యను నేరుగా ఎదుర్కోండి. దేవుని వాక్యంలోని ఉపదేశాన్ని అన్వయించుకోవడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. (కీర్తన 119:​105) నమ్మదగిన క్రైస్తవ పెద్దనుండి సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి. మీ ఆధ్యాత్మికతను మెరుగుపరచుకోవడానికి యెహోవా చేసిన ఏర్పాట్లను సద్వినియోగం చేసుకోండి. దేవునితో మీ సంబంధాన్ని బలపరచుకోండి. ఆయనకు క్రమంగా ప్రార్థించండి, ప్రత్యేకించి మీ బలహీనతల గురించి ప్రార్థించండి. ‘మీ అంతరింద్రియములను మీ హృదయమును పరిశోధించమని’ దేవుణ్ణి వేడుకోండి. (కీర్తన 26:⁠2) ముందటి ఆర్టికల్‌లో చర్చించబడినట్లుగా యథార్థవంతులుగా నడుచుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించండి.

20 మీరు ఎంత కృషి చేసినా అధికంగా త్రాగే సమస్య అలానే ఉంటే అప్పుడెలా? అప్పుడు మీరు యేసు ఇచ్చిన ఈ సలహాను పాటించాలి: “నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన యెడల దానిని నరికివేయుము; నీవు రెండు చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుటకంటె అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు.” (మార్కు 9:​43-44) కాబట్టి పరిష్కారమేమిటంటే, మద్యం సేవించడం పూర్తిగా మానేయండి. ఒక స్త్రీ అలా చేయాలనే తీర్మానించుకుంది, ఆమెను మనం ఐరీన్‌ అని పిలుద్దాం. ఆమె ఇలా చెప్పింది: “దాదాపు రెండున్నర సంవత్సరాలపాటు మద్యానికి దూరంగా ఉన్న తర్వాత, కేవలం కొంచెం త్రాగితే ఫర్వాలేదు, దానిని నేను తట్టుకోగలనో లేదో చూడడానికి మాత్రమే కొంచెం త్రాగుదాము అని నాకు అనిపించింది. కానీ నాకు అలా అనిపించిన క్షణాన నేను వెంటనే యెహోవాకు ప్రార్థన చేశాను. నేను నూతన విధానం వచ్చే వరకూ అసలు త్రాగకూడదని నిర్ణయించుకున్నాను, బహుశా నూతన విధానంలో కూడా త్రాగనేమో.” దేవుని నీతియుక్తమైన నూతనలోకంలో జీవించడానికి మద్యాన్ని అసలు త్రాగకుండా ఉండడం అంత పెద్ద త్యాగమేమీ కాదు.​—⁠2 పేతురు 3:13.

“బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి”

21 ఒక క్రైస్తవుని జీవితాన్ని పరుగు పందెంతో పోలుస్తూ అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు: “పందెపు రంగమందు పరుగెత్తు వారందరు పరుగెత్తుదురు గాని యొక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలె మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడనివానివలె పరిగెత్తు వాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి, దానిని లోపరచుకొనుచున్నాను.”​—⁠1 కొరింథీయులు 9:24-27.

22 విజయవంతంగా పరుగు పందెం ముగించినవారికే బహుమానం లభిస్తుంది. జీవితపు పరుగుపందెంలో, అధికంగా మద్యం సేవించడం మనం చివరివరకూ చేరుకోకుండా ఆపగలదు. మనం ఆశానిగ్రహాన్ని చూపించాలి. మనం బలమైన తీర్మానంతో పరుగెత్తాలంటే అధికంగా “మద్యపానము” చేయకుండా ఉండాలి. (1 పేతురు 4:3) మనం అన్ని విషయాల్లోను ఆశానిగ్రహం చూపించాలి. మద్యం సేవించే విషయంలో, ‘మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రతకడం’ జ్ఞానయుక్తమైనది.—తీతు 2:​12, 13.

[అధస్సూచి]

^ పేరా 4 ఈ ఆర్టికల్‌లో ఉపయోగించబడినట్లుగా, “మద్యము” అనే పదం బీర్‌కు, వైన్‌కు, ఇతర మత్తుపానీయాలకు వర్తిస్తుంది.

మీకు గుర్తున్నాయా?

మితిమీరి మద్యం సేవించడం అని దేనిని అనవచ్చు?

మితిమీరి మద్యం సేవించడంవల్ల ఎలాంటి హాని కలుగుతుంది?

మద్యం అధికంగా సేవించడంవల్ల కలిగే ప్రమాదాలకు మీరు ఎలా దూరంగా ఉండవచ్చు?

అధికంగా మద్యం సేవించే సమస్యను ఎలా అధిగమించవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1.యెహోవా దయచేసిన కొన్ని మంచి కానుకల గురించి కీర్తనకర్త తన కృతజ్ఞతను ఎలా వ్యక్తం చేశాడు?

2.మద్యం సేవించడానికి సంబంధించి మనం ఏ ప్రశ్నలను చర్చించబోతున్నాము?

3,4.(ఎ)త్రాగుబోతులుగా మారేంతగా మద్యం సేవించడాన్ని బైబిలు ఖండిస్తుందని ఏది చూపిస్తోంది? (బి) త్రాగుబోతుతనాన్ని సూచించే కొన్ని విషయాలను పేర్కొనండి.

5.మితిమీరి మద్యం సేవించడం ఏ విధంగా హానికరమైనది?

6.ఒక వ్యక్తి మితిమీరి మద్యం సేవించడానికి, మితిమీరి ఆహారం భుజించడానికి ఎందుకు దూరంగా ఉండాలి?

7.మితిమీరి మద్యం సేవించడం 2 కొరింథీయులు 7:1లోని ఉపదేశానికి విరుద్ధంగా ఉందని ఎందుకు చెప్పవచ్చు?

8.సామెతలు 23:​20, 21 ప్రకారం మితిమీరి మద్యం సేవించడం దేనికి దారి తీయవచ్చు?

9.ఒక వ్యక్తి వాహనం నడపవలసి ఉన్నప్పుడు మద్యం సేవించకపోవడం ఎందుకు జ్ఞానయుక్తం?

10.మద్యం మన మెదడుపై ఎలాంటి ప్రభావం చూపించగలదు, అది ఎందుకు ప్రమాదకరమైనది?

11,12.మితిమీరి మద్యం సేవించడం ఎలాంటి ఆధ్యాత్మిక హానికి కారణమయ్యే అవకాశం ఉంది?

13.మితిమీరి మద్యం సేవించకుండా ఉండడానికి కీలకమేమిటి?

14.మితంగా త్రాగడానికి మితిమీరి త్రాగడానికి మధ్య హద్దులను నిర్ణయించుకోవడానికి మీకు ఏ మార్గనిర్దేశక సూత్రం సహాయపడుతుంది?

15.ఎలాంటి పరిస్థితుల్లో మద్యం సేవించకుండా ఉండడమే జ్ఞానయుక్తంగా ఉండవచ్చు?

16.ఎవరైనా మీకు మద్యం అందించినప్పుడు దానిని త్రాగాలా వద్దా అని మీరెలా నిర్ణయించుకోవాలి?

17.మీకు మితిమీరి మద్యం సేవించే సమస్య ఉందా లేదా అని మీరెలా తెలుసుకోవచ్చు?

18,19.మీరు మితిమీరి మద్యం సేవించడాన్ని ఎలా నివారించవచ్చు?

20.మితిమీరి మద్యం సేవించే సమస్య అలా కొనసాగుతూనే ఉంటే మీరు ఎలాంటి చర్యలు తీసుకోవలసి ఉంటుంది?

21,22.జీవితపు పరుగు పందెంలో మనం చివరికి చేరుకోకుండా ఏది అడ్డుకోగలదు, మనం దానిని ఎలా నివారించవచ్చు?

[19వ పేజీలోని చిత్రం]

ద్రాక్షారసము ‘నరుల హృదయమును సంతోషపరచును’

[20వ పేజీలోని చిత్రం]

మనం మన వ్యక్తిగత హద్దులు తెలుసుకొని, ఆ హద్దులను దాటకూడదు

[21వ పేజీలోని చిత్రం]

ఎప్పుడు ఆపుచేయాలో ముందుగానే నిర్ణయించుకోండి

[22వ పేజీలోని చిత్రం]

మీ బలహీనతల గురించి యెహోవాకు క్రమంగా ప్రార్థించండి

[23వ పేజీలోని చిత్రం]

మద్యాన్ని సేవించడం గురించి పిల్లలకు ఉపదేశించే బాధ్యత తల్లిదండ్రులదే