కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మానవులకు మాత్రమే ఉండే విశిష్టమైన లక్షణం

మానవులకు మాత్రమే ఉండే విశిష్టమైన లక్షణం

మానవులకు మాత్రమే ఉండే విశిష్టమైన లక్షణం

జోడీ ఎస్టేట్‌ సేల్స్‌ వ్యాపారం చేస్తాడు (ఈ వ్యాపారం చేసేవారు, మరణించిన వ్యక్తి ఆస్తుల, వస్తువుల పట్టికను తయారుచేసి ఆ వ్యక్తి వారసులకు ఏవి విలువైనవో అంచనావేసి చెబుతారు). ఆయన, ఒక స్త్రీకి, చనిపోయిన వాళ్ళ అక్క ఇంట్లోని వస్తువులను అమ్మడానికి సహాయం చేస్తున్నాడు. ఆయన ఆ ఇంట్లో ఒక పాత నిప్పుగూటి (ఫైర్‌ ప్లేస్‌) దగ్గర వెతుకుతున్నప్పుడు, చేపలు పట్టడానికి ఉపయోగించే సామగ్రి పెట్టుకునే రెండు పాత పెట్టెలు కనిపించాయి. వాటిలో ఒకదాన్ని తెరిచి చూసినప్పుడు, ఆయన తన కళ్ళను నమ్మలేకపోయాడు. పలచని తగరపు కాగితంలో చుట్టబడిన 100 డాలర్ల నోట్ల కట్టలు ఆయనకు కనిపించాయి​—⁠అవి మొత్తం 82,000 డాలర్లు! అప్పుడు ఆ గదిలో జోడీ ఒంటరిగా ఉన్నాడు. ఆయనేమి చేయాలి? చప్పుడు చేయకుండా ఆ పెట్టెను తీసుకెళ్ళాలా లేక తనకు ఆ డబ్బు దొరికిందని ఆ స్త్రీకి చెప్పాలా?

జోడీకి ఎదురైన సందిగ్ధావస్థ, మానవులుగా మనల్ని క్రూరమైన జంతువులనుండి వేరుచేసే ఒక లక్షణాన్ని స్పష్టం చేస్తోంది. ద వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా ఇలా నివేదిస్తోంది: “మానవులకు ఉన్న విశిష్టమైన లక్షణాల్లో ఒకటి, మనం ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనేది నిర్ణయించుకోవడానికి ఆలోచింపజేసే ప్రశ్నలు వేసుకోవడం.” ఆకలితోవున్న కుక్కకు బల్లమీద మాంసం ముక్క కనిపిస్తే, దానిని తినాలా వద్దా అని అది ఒక్క క్షణం కూడా ఆలోచించదు. అయితే జోడీకి మాత్రం తన నిర్ణయపు నైతిక విలువను అంచనా వేసే సామర్థ్యం ఉంది. ఆయన ఆ డబ్బును ఉంచుకుంటే అది దొంగతనం చేసినట్లవుతుంది, అయితే ఆయన పట్టుబడే అవకాశాలు చాలా తక్కువ. ఆ డబ్బు ఆయనది కాదు; ఆ డబ్బు గురించి ఆ స్త్రీకి తెలియదు. అంతేకాక జోడీ తనకు దొరికిన డబ్బును ఆ స్త్రీకి ఇచ్చేస్తే ఆయన చేసే వృత్తికి సంబంధించిన వాళ్ళందరూ ఆయననొక తెలివితక్కువ వాడిగా పరిగణిస్తారు.

మీరు జోడీ స్థానంలో ఉంటే ఏమి చేస్తారు? ఆ ప్రశ్నకు మీరిచ్చే సమాధానం, మీరు ఎలాంటి నీతి సూత్రాలను అనుసరించడానికి ఎంపిక చేసుకున్నారు అనేదానిపై ఆధారపడి ఉంటుంది.

నీతిసూత్రాలంటే ఏమిటి?

నైతికంగా ఏది తప్పు ఏది ఒప్పు అనేది నిర్ణయించుకోవడానికి వేసుకునే ప్రశ్నల అధ్యయనాన్ని నీతిశాస్త్రం అంటారు. “‘నీతిసూత్రాలు’ అని అనువదించబడిన ఎథిక్స్‌ అనే ఆంగ్లపదానికి, ‘నైతికత’ అని అనువదించబడిన మొరాలిటీ అనే ఆంగ్లపదానికి మూలభావం ఒకటే. ఎథిక్స్‌ అనే పదం గ్రీకు (ఎథికోస్‌) నుండి, మొరాలిటీ అనే పదం లాటిన్‌ (మొరాలిస్‌) నుండి వచ్చాయి. ఆ రెండు పదాలు మానవుని ప్రవర్తనపై ఆచారానికీ సాంప్రదాయానికీ ఉన్న అధికారాన్ని సూచిస్తాయి” అని ఎరిక్‌ జే. ఈస్టన్‌ అనే రచయిత చెప్పాడు.

ఎంతోకాలంగా, ప్రజలు ఎలాంటి నైతిక ప్రమాణాలను అనుసరించాలి అనే విషయాన్ని సాధారణంగా మతం నిర్ణయించింది. చాలా సమాజాల్లో దేవుని వాక్యమైన బైబిలు ప్రజలను ఎంతగానో ప్రభావితం చేసింది. అయితే ప్రపంచవ్యాప్తంగా అంతకంతకూ ఎక్కువమంది ప్రజలు మతపరమైన ప్రమాణాలు ఆచరణకు పనికిరానివని, బైబిలు నైతిక సూత్రాలు పాతవని వాటిని తిరస్కరిస్తున్నారు. మరి వాటి స్థానాన్ని ఏది ఆక్రమించింది? “పూర్వం మతానికి ఉన్న అధికారాన్ని . . . ఇప్పుడు లౌకిక జ్ఞానం కైవసం చేసుకుంది” అని ఎథిక్స్‌ ఇన్‌ బిజినెస్‌ లైఫ్‌ అనే పుస్తకం చెబుతోంది. చాలామంది మత బోధకులను ఆశ్రయించే బదులు నీతిశాస్త్ర నిపుణుల మార్గదర్శకాన్ని కోరుకుంటున్నారు. జీవనీతి శాస్త్రజ్ఞుడు పౌల్‌ మెక్నీల్‌ ఇలా చెప్పాడు: “నీతి శాస్త్రజ్ఞులే లౌకిక మతగురువులని నాకు అనిపిస్తోంది. . . . ప్రజలను ఒకప్పుడు మతం నిర్దేశించేది, ఇప్పుడు వారిని నీతిశాస్త్ర నియమాలు నడిపిస్తున్నాయి.”

మీరు కష్టమైన నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు, తప్పేదో ఒప్పేదో ఎలా గ్రహిస్తారు? మీరు అనుసరించే నైతిక సూత్రాలు దేవుడు నిర్ణయించినవా లేక మీరే నిర్ణయించుకున్నవా?