కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా ప్రేమపూర్వక శ్రద్ధ చూపిస్తాడని నమ్మకముంచడం

యెహోవా ప్రేమపూర్వక శ్రద్ధ చూపిస్తాడని నమ్మకముంచడం

జీవిత కథ

యెహోవా ప్రేమపూర్వక శ్రద్ధ చూపిస్తాడని నమ్మకముంచడం

అన్నా డెన్జ్‌ టర్పిన్‌ చెప్పినది

అమ్మ చిరునవ్వు చిందిస్తూ “నువ్వు ఒక పెద్ద ప్రశ్నల పుట్టవి!” అంది. చిన్నప్పుడు నేను నా తల్లిదండ్రులపై ప్రశ్నల వర్షం కురిపించేదాన్ని. కానీ అమ్మా నాన్నలు నా జిజ్ఞాస కారణంగా నన్ను ఎప్పుడు తిట్టలేదు. దానికి బదులుగా వారు నాకు తర్కించడాన్ని, బైబిలు శిక్షిత మనస్సాక్షి ఆధారంగా స్వంతగా నిర్ణయాలు తీసుకోవడాన్ని నేర్పించారు. ఆ శిక్షణ ఎంతో విలువైనది! నాకు 14 సంవత్సరాలున్నప్పుడు ఒకరోజు నాజీలు నా ప్రియమైన తల్లిదండ్రులను నా నుండి వేరుచేశారు, వారిని నేను మళ్ళీ చూడలేదు.

మా నాన్న ఆస్కర్‌ డెన్జ్‌, అమ్మ అన్నా మారియా స్విట్జర్లాండ్‌ సరిహద్దుకు దగ్గర్లోవున్న జర్మన్‌ నగరమైన లాయిరాక్‌లో నివసించేవారు. వారు యౌవనస్థులుగా ఉన్నప్పుడు రాజకీయ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనేవారు, సమాజంలోని ప్రజలకు వారు బాగా తెలుసు, అందరూ వారిని గౌరవించేవారు. అయితే 1922లో నా తల్లిదండ్రులు పెళ్ళి చేసుకున్న తర్వాత రాజకీయాలపట్ల తమ దృక్కోణాన్ని, జీవితంలో తమ లక్ష్యాలను మార్చుకున్నారు. అమ్మ బైబిలు విద్యార్థులతో (యెహోవాసాక్షులు అప్పట్లో అలా పిలువబడేవారు) బైబిలు అధ్యయనం చేయడం ప్రారంభించింది, దేవుని రాజ్యం భూమికి శాంతిని తెస్తుందని తెలుసుకొని ఆమె ఎంతో సంతోషించింది. త్వరలోనే నాన్న కూడా అమ్మతోపాటు అధ్యయనం చేయడం ప్రారంభించాడు, వారిద్దరూ బైబిలు విద్యార్థుల కూటాలకు హాజరవడం మొదలుపెట్టారు. ఆ సంవత్సరం క్రిస్మస్‌ రోజున నాన్న అమ్మకు బైబిలును అధ్యయనం చేయడానికి సహాయం చేసే దేవుని వీణ (ఆంగ్లం) అనే పుస్తకాన్ని కూడా బహూకరించారు. 1923 మార్చి 25న వారి ఒక్కగానొక్క కూతురునైన నేను జన్మించాను.

మా కుటుంబ జీవితపు మధురస్మృతులెన్నో నా హృదయంలో భద్రంగా ఉన్నాయి. వేసవిలో బ్లాక్‌ ఫారెస్ట్‌లో సుదీర్ఘమైన పాదయాత్రలు చేయడం, ఇంటిని ఎలా సర్దిపెట్టాలో అమ్మ నాకు పాఠాలు నేర్పించడం! ఆమె వంటగదిలో నిలబడి నాకు వంట నేర్పించడం ఇంకా నా కళ్ళెదుట మెదులుతుంది. అన్నింటికంటే ప్రాముఖ్యంగా నా తల్లిదండ్రులు నాకు యెహోవాను ప్రేమించడాన్ని, ఆయనపై నమ్మకముంచడాన్ని నేర్పించారు.

మా సంఘంలో దాదాపు 40 మంది చురుకైన రాజ్య ప్రచారకులు ఉండేవారు. రాజ్యం గురించి మాట్లాడేందుకు అవకాశాలను సృష్టించుకోవడంలో నా తల్లిదండ్రులు ఎంతో నైపుణ్యం గలవారు. వారు అంతకుముందు సామాజిక కార్యకలాపాల్లో పాల్గొన్నారు కాబట్టి ఇతరులతో సులభంగా మాట్లాడగలిగేవారు, వారు చెప్పేదాన్ని ప్రజలు చక్కగా వినేవారు. నాకు ఏడు సంవత్సరాలు వచ్చినప్పుడు నేను కూడా ఇంటింటికి వెళ్ళి ప్రకటించాలనుకున్నాను. మొదటి రోజున నాతోపాటు ఉన్న సహోదరి నా చేతికి కొన్ని ప్రచురణలు ఇచ్చి ఒక ఇంటిని చూపించి, “వెళ్ళి వాళ్ళకివి కావాలేమో చూడు” అని చెప్పింది. 1931లో మేము స్విట్జర్లాండ్‌లోని బాస్లేలో జరిగిన బైబిలు విద్యార్థుల సమావేశానికి హాజరయ్యాము. అక్కడ నా తల్లిదండ్రులు బాప్తిస్మం పొందారు.

సంక్షోభం నుండి నిరంకుశత్వానికి

అప్పట్లో జర్మనీ గొప్ప సంక్షోభానికి గురయ్యింది, వేర్వేరు రాజకీయ వర్గాలు వీధుల్లో దౌర్జన్యపూరితంగా పోరాడేవి. ఒక రాత్రి పక్కింటినుండి వస్తున్న అరుపులకు నాకు మెలకువ వచ్చింది. ఇద్దరు యౌవనస్థులు, తమ రాజకీయ విభేదాల కారణంగా తమ అన్నను పంగల కొయ్యతో పొడిచి చంపేశారు. యూదులపట్ల శత్రుత్వం కూడా బాగా పెరిగిపోయింది. స్కూల్లో ఒక అమ్మాయి యూదురాలైనందుకు ఒంటరిగా ఒక మూల నిలబడాల్సి వచ్చేది. ఆమెను చూసి నేను ఎంతో బాధపడేదాన్ని, అయితే ఆ తర్వాత నేను కూడా సమాజంనుండి వెలివేయబడిన వ్యక్తి భావాలను అనుభవపూర్వకంగా తెలుసుకుంటానని నాకు అప్పుడు తెలియదు.

1933 జనవరి 30వ తేదీన అడాల్ఫ్‌ హిట్లర్‌ జర్మనీకి ఛాన్సలర్‌ అయ్యాడు. నాజీలు విజయోత్సాహంతో పురపాలక భవనంపై స్వస్థిక్‌ జెండా ఎగరవేయడాన్ని మేము దూరంనుండి చూశాము. స్కూల్లో, ఉత్సాహవంతుడైన మా టీచరు “హేల్‌ హిట్లర్‌!” అని చెప్పడం నేర్పించాడు. ఆ మధ్యాహ్నం నేను దాని గురించి నాన్నకు చెప్పాను. ఆయన కలవరపడ్డాడు. “అది మంచిది కాదు” అని ఆయన అన్నాడు. “‘హేల్‌’ అంటే రక్షణ. మనం ‘హేల్‌ హిట్లర్‌’ అంటే దానర్థం మనం మన రక్షణను యెహోవాకు బదులు అతనికి ఆపాదిస్తున్నాము. అది సరైనది కాదని నాకనిపిస్తుంది, అయితే నువ్వేమి చేయాలో నువ్వే నిర్ణయించుకో” అని నాన్న అన్నాడు.

నేను హిట్లర్‌కు జై చెప్పకూడదని నిర్ణయించుకున్నందుకు నా తోటి విద్యార్థులు నన్ను వెలివేయబడిన వ్యక్తిగా చూడడం ప్రారంభించారు. కొంతమంది అబ్బాయిలు టీచర్లు లేనప్పుడు నన్ను కొట్టేవారు కూడా. కొంతకాలానికి వాళ్ళు నన్ను ఇబ్బందిపెట్టడం మానేశారు, అయితే నాతో ఆడుకోవద్దని తమ తండ్రులు చెప్పారని నా స్నేహితులు నాకు చెప్పారు. నేను వాళ్ళకు ఒక ప్రమాదకరమైన వ్యక్తిగా కనిపించాను.

జర్మనీని నాజీలు పరిపాలించడం ప్రారంభించిన రెండు నెలల తర్వాత, యెహోవాసాక్షులు దేశానికి ప్రమాదకరమైనవారని వారిని నిషేధించారు. నాజీ సైనికులు మాగ్డేబర్గ్‌లోని కార్యాలయాన్ని మూసేసి కూటాలను రద్దు చేశారు. అయితే మేము సరిహద్దు దగ్గర నివసించేవాళ్ళము కాబట్టి, మేము సరిహద్దును దాటి బాస్లేకు వెళ్ళేందుకు నాన్న అనుమతి సంపాదించాడు, అక్కడ మేము ఆదివారం కూటాలకు హాజరయ్యేవాళ్ళం. జర్మనీలోని సహోదరులు భవిష్యత్తును ధైర్యంగా ఎదుర్కోవడానికి సహాయం చేసేందుకు వాళ్ళకు కూడా అలాంటి ఆధ్యాత్మిక ఆహారం లభిస్తే బాగుంటుందని ఆయన ఎప్పుడూ అంటుండేవాడు.

ప్రమాదకరమైన వాహ్యాళులు

మాగ్డేబర్గ్‌లోని కార్యాలయం మూసివేయబడిన తర్వాత, పూర్వం అక్కడ పనిచేసిన యూలియస్‌ రైఫల్‌ రహస్యంగా ప్రకటించే పనిని వ్యవస్థీకరించడానికి తన స్వంత పట్టణమైన లాయిరాక్‌కు తిరిగివచ్చాడు. నాన్న వెంటనే ఆయనకు సహాయం చేయడానికి ముందుకెళ్ళాడు. నాన్న అమ్మను, నన్ను కూర్చోబెట్టి తాను స్విట్జర్లాండ్‌నుండి జర్మనీకి బైబిలు సాహిత్యాలను తీసుకురావడానికి సహాయం చేసేందుకు అంగీకరించినట్లు మాకు వివరించాడు. అది ఎంతో ప్రమాదకరమైన పని అని, తాను ఏ క్షణంలోనైనా అరెస్ట్‌ చేయబడే అవకాశం ఉందని చెప్పాడు. దానిలో మేము కూడా పాల్గొనాలనే బలవంతమేమీ లేదని, ఎందుకంటే అది మాకు కూడా చాలా ప్రమాదకరంగా ఉంటుందని చెప్పాడు. వెంటనే అమ్మ “నేను మీతోపాటు వస్తాను” అని చెప్పింది. అమ్మా, నాన్నా నావైపు చూశారు, “నేను కూడా మీతోపాటు వస్తాను” అని నేను చెప్పాను!

అమ్మ కావలికోట పత్రిక సైజు ఉండే సంచిని అల్లింది. ఆమె సాహిత్యాలను ఆ సంచిలోకి దూర్చి, తెరచివున్న పక్కను మళ్ళీ అల్లి మూసేసేది. ఆమె నాన్న బట్టలకు రహస్యమైన జేబులు కూడా కుట్టింది, నేను అమ్మా ఎవ్వరికి కనపడకుండా చిన్న బైబిలు అధ్యయన సహాయకాలను తీసుకెళ్ళడానికి నడుముకు కట్టుకునే దట్టీలను రెండింటిని తయారు చేసింది. మేము విలువైన సాహిత్యాలను రహస్యంగా ఇంటికి తీసుకురావడంలో సఫలమైన ప్రతిసారి, తేలికగా ఊపిరి పీల్చుకొని యెహోవాకు కృతజ్ఞతలు తెలియజేసేవాళ్ళము. మేము ఆ సాహిత్యాలను అటకపై భద్రపరిచేవాళ్ళము.

మొదట్లో నాజీలు మమ్మల్ని అనుమానించలేదు. వాళ్ళు మమ్మల్ని ప్రశ్నించలేదు, మా ఇంటిని వెదకలేదు. అయినా కూడా ప్రమాదం ఎదురైనప్పుడు ఆధ్యాత్మిక సహోదరులను హెచ్చరించడానికి మేము ఒక రహస్యమైన సంకేతాన్ని నిర్ణయించుకున్నాము, అది 4711 అనే సంఖ్య, అది ప్రసిద్ధిచెందిన పరిమళం పేరు. ఇంటికి రావడం ప్రమాదకరంగా మారితే మేము ఆ సంఖ్య ఉపయోగించి ఎలాగోలా వాళ్ళను హెచ్చరించాలి అనుకున్నాము. అంతేకాకుండా ఇంటికి వచ్చేముందు ముందుగది కిటీకీలను చూడమని కూడా నాన్న వాళ్ళకు చెప్పాడు. ఎడమవైపు కిటికీ తెరచివుంటే, సమస్య ఉందని వాళ్ళు లోనికి రాకూడదని అర్థం.

1936లోనూ 1937లోనూ రహస్య పోలీసులు సామూహిక అరెస్టులు చేసి వేలాదిమంది సాక్షులను చెరసాలల్లోను, నిర్బంధ శిబిరాల్లోను పడేశారు. అక్కడ సాక్షులు క్రూరాతిక్రూరంగా హింసించబడ్డారు. స్విట్జర్లాండ్‌లోని బెర్న్‌లోవున్న బ్రాంచి కార్యాలయం, నాజీ నేరాలను బట్టబయలు చేసే క్రోయిట్స్‌సూగ్‌ గేగన్‌ డాస్‌ క్రిస్టన్‌టూమ్‌ (క్రైస్తవత్వానికి వ్యతిరేకమైన మతయుద్ధం) అనే పుస్తకం కోసం నిర్బంధ శిబిరంలో జరుగుతున్న సంఘటనల వివరాలను సేకరించడం ప్రారంభించింది, ఆ వివరాలుగల కొన్ని నివేదికలు శిబిరాల్లోనుండి రహస్యంగా బయటకు పంపించబడేవి. ఆ రహస్య నివేదికలను బాస్లే సరిహద్దు దాటించే ప్రమాదకరమైన పనిని మేము చేపట్టాము. చట్టవిరుద్ధమైన ఆ నివేదికలతో నాజీలు మమ్మల్ని పట్టుకుంటే మేము వెంటనే చెరసాలలో వేయబడతాం. మన సహోదరులు అనుభవిస్తున్న హింసల గురించి చదివినప్పుడు నేను ఎంతో ఏడ్చాను. అయినా నేను భయపడలేదు. నా సన్నిహిత స్నేహితులైన నా తల్లిదండ్రులు, యెహోవా నన్ను కాపాడతారని నేను నమ్మకముంచాను.

14 సంవత్సరాలప్పుడు నేను స్కూలు విద్య పూర్తిచేశాను, వంటసామగ్రి మరియు పనిముట్లు అమ్మే దుకాణంలో గుమస్తా ఉద్యోగం చేయడం ప్రారంభించాను. మేము సాహిత్యాలను తీసుకువచ్చే పనిని శనివారం మధ్యాహ్నం లేదా ఆదివారం చేసేవాళ్ళం ఎందుకంటే నాన్నకు అప్పుడే సెలవు దొరికేది. సాధారణంగా మేము రెండు వారాలకు ఒకసారి వెళ్ళేవాళ్ళం. మేము వారాంతాల్లో వ్యాహ్యాళికి వెళ్ళే సాధారణ కుటుంబంలానే కనిపించేవాళ్ళం. దాదాపు నాలుగు సంవత్సరాలపాటు సరిహద్దు సైనికులు మమ్మల్ని ఆపలేదు, మమ్మల్ని వెదకడానికి ప్రయత్నించలేదు. కానీ 1938 ఫిబ్రవరిలో ఒకరోజు అలా జరగలేదు.

పట్టుబడ్డాము!

మేము సాహిత్యాలను తీసుకోవడానికి బాస్లేకు దగ్గర్లోని ప్రాంతానికి చేరుకున్న తర్వాత మా కోసం వేచివున్న సాహిత్యాల కుప్పను చూసినప్పుడు నాన్న ముఖంలో కనిపించిన భావాలను నేను ఎప్పటికీ మరచిపోలేను. రహస్యంగా సాహిత్యాలను తీసుకువెళ్ళే మరో కుటుంబం అరెస్టు చేయబడినందుకు మేము ఆ రోజు అదనపు పుస్తకాలు తీసుకు వెళ్ళాల్సి వచ్చింది. సరిహద్దు దగ్గర ఒక అధికారి మావైపు అనుమానంగా చూసి, మా దగ్గర వెదకమని ఆజ్ఞాపించాడు. మా దగ్గర ఉన్న పుస్తకాలు బయటపడినప్పుడు, మావైపు తుపాకి గురిపెట్టి మమ్మల్ని అక్కడే ఉన్న పోలీసు కార్లవైపు నడిపించాడు. అధికారులు మమ్మల్ని కార్లో కూర్చోపెట్టి తీసుకెళ్ళేటప్పుడు నాన్న నా చేతిని గట్టిగా పట్టుకొని “నువ్వు ద్రోహిగా మారొద్దు. వాళ్ళకు ఎవ్వరి పేర్లూ చెప్పొద్దు” అని మెల్లిగా చెప్పారు. “అలాగే నాన్నా” అని నేను ఆయనకు హామీ ఇచ్చాను. మేము లాయిరాక్‌కు చేరుకున్నప్పుడు వాళ్ళు నాన్నను మా నుండి వేరుచేశారు. ఆయనను చెరసాలలో వేసి తలుపు మూస్తున్నప్పుడు నేను ఆయనను ఆఖరిసారిగా చూశాను.

నలుగురు రహస్య పోలీసులు, ఇతర సాక్షుల పేర్లూ చిరునామాలూ చెప్పమని అడుగుతూ నన్ను నాలుగు గంటలపాటు ప్రశ్నించారు. నేను అందుకు అంగీకరించనప్పుడు ఒక అధికారికి కోపం వచ్చి “నిన్ను మాట్లాడించడానికి మా దగ్గర ఇతర పద్ధతులు కూడా ఉన్నాయి!” అని నన్ను బెదిరించాడు. అయినా నేను ఏమీ చెప్పలేదు. అప్పుడు వాళ్ళు అమ్మను, నన్ను మా ఇంటికి తీసుకువెళ్ళి మొదటిసారిగా మా ఇంటిని వెదికారు. వాళ్ళు అమ్మను తమతోపాటు తీసుకెళ్ళి నన్ను మా పెద్దమ్మ ఇంటికి పంపించారు, ఆమె కూడా ఒక సాక్షి అని తెలియక నా బాధ్యతను ఆమెకు అప్పగించారు. నాకు ఉద్యోగానికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వబడింది, అయితే నలుగురు రహస్య పోలీసులు నా ప్రతి కదలికను గమనించడానికి ఇంటిముందు కారులో కూర్చొని ఉండేవారు, ఒక పోలీసు ఇంటిముందు అటు ఇటూ నడుస్తూ ఉండేవాడు.

కొన్నిరోజుల తర్వాత మధ్యాహ్న భోజన సమయంలో నేను ఇంట్లోనుండి బయటకు వచ్చినప్పుడు ఒక యౌవన సహోదరి సైకిల్‌ తొక్కుకుంటూ నావైపు రావడం చూశాను. ఆమె దగ్గరకి వచ్చినప్పుడు నావైపు ఒక కాగితంముక్క విసరబోతుందని నేను గ్రహించాను. ఆమె అలా విసిరేసినప్పుడు నేను దానిని పట్టుకొని వెంటనే పోలీసులు నన్ను గమనించారేమో చూడడానికి వాళ్ళవైపు చూశాను. నాకు ఆశ్చర్యం కలిగించే విధంగా సరిగ్గా ఆ క్షణమే వాళ్ళు నలుగురూ దేని గురించో పెద్దగా నవ్వుతూ పైకి చూస్తున్నారు!

ఆ సహోదరి నాకు ఇచ్చిన చీటీలో నన్ను తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళమని వ్రాసి ఉంది. అయితే రహస్య పోలీసులు నన్ను చూస్తున్నప్పుడు నేను ఆమె తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళి వాళ్ళను ప్రమాదంలో పడవేసే సాహసం ఎలా చేయగలను? నేను కారులో కూర్చొనివున్న నలుగురు పోలీసులవైపు, వీధిలో అటూ ఇటూ తిరుగుతున్న పోలీసువైపు చూశాను. నాకు ఏమి చేయాలో తోచలేదు, నేను యెహోవా సహాయం కోసం తీవ్రంగా ప్రార్థించాను. అక్కడ నడుస్తున్న పోలీసు అకస్మాత్తుగా కార్లోని నలుగురి దగ్గరకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడాడు. ఆ తర్వాత అతను కూడా కార్లో ఎక్కి కూర్చున్నాడు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు!

అప్పుడే మా పెద్దమ్మ అటువైపుగా నడుచుకుంటూ వచ్చింది. అప్పటికే మధ్యాహ్నం దాటిపోయింది. ఆమె ఆ చీటీని చదివి దానిలో ఉన్నట్లే వాళ్ళ ఇంటికి వెళ్ళమని చెప్పింది, సహోదరులు నన్ను స్విట్జర్లాండ్‌కు తీసుకువెళ్ళే ఏర్పాట్లు చేసివుంటారని ఆమె అనుకుంది. మేము ఆ ఇంటికి చేరుకున్నప్పుడు, ఆ కుటుంబం నన్ను ఒక తెలియని వ్యక్తికి పరిచయం చేశారు, ఆయన పేరు హైన్రిక్‌ రైఫ్‌. నేను సురక్షితంగా అక్కడకు చేరుకున్నందుకు తనకు సంతోషంగా ఉందని, నేను స్విట్జర్లాండ్‌కు పారిపోవడానికి సహాయం చేయడానికి తాను వచ్చానని ఆయన చెప్పాడు. ఒక అరగంటలో అడవి దగ్గర తనను కలుసుకొమ్మని ఆయన చెప్పాడు.

దేశాంతరవాసిగా జీవితం

నా తల్లిదండ్రులను వదిలి వెళ్తున్నందుకు ఎంతో బాధపడుతూ కళ్ళనిండా నీళ్ళతో నేను సహోదరుడు రైఫ్‌ను కలిశాను. ఆ తర్వాత పనులన్నీ ఎంతో వేగంగా జరిగిపోయాయి. కొన్ని ఉత్కంఠభరితమైన నిమిషాల తర్వాత మేము ఒక సందర్శకుల గుంపుతో కలిసి క్షేమంగా సరిహద్దును దాటాము.

నేను బెర్న్‌లోని బ్రాంచి కార్యాలయానికి చేరుకున్నప్పుడు, అక్కడి సహోదరులే నేను తప్పించుకొని రావడానికి ఏర్పాట్లు చేశారని తెలిసింది. వాళ్ళు నేనుండడానికి ఒక గది చూపించారు. నేను అక్కడ కిచెన్‌లో పనిచేశాను, ఆ పని నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. అయితే చెరో రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించబడిన నా తల్లిదండ్రులకు ఏ క్షణాన ఏమవుతుందో తెలియకుండా ఒక దేశాంతరవాసిగా జీవించడం ఎంత కష్టమో! కొన్నిసార్లు ఆందోళన, దుఃఖం నన్ను ఎంత కలవరపెట్టేవంటే నేను బాత్‌రూములోకెళ్ళి ఏడ్చేదాన్ని. అయితే నేను క్రమంగా నా తల్లిదండ్రులకు ఉత్తరాలు వ్రాసేదాన్ని, వారు నన్ను నమ్మకంగా కొనసాగమని ప్రోత్సహించేవారు.

నా తల్లిదండ్రుల విశ్వాస మాదిరినిబట్టి ప్రేరేపించబడి నేను యెహోవాకు నా జీవితాన్ని సమర్పించుకొని 1938, జూలై 25న బాప్తిస్మం పొందాను. నేను బెతెల్‌లో ఒక సంవత్సరం ఉన్నాను. ఆ తర్వాత స్విట్జర్లాండ్‌ బ్రాంచి, బెతెల్‌ కుటుంబ సభ్యుల కోసం ఆహారం పండించడానికి మరియు హింసనుండి పారిపోయి వచ్చే సహోదరులకు ఆశ్రయం కల్పించడానికి షానెలాజ్‌లో కొనుగోలు చేసిన స్థలంలో పని చేయడానికి వెళ్ళాను.

1940లో నా తల్లిదండ్రులకు విధించబడిన జైలు శిక్ష ముగిసినప్పుడు, వారు తమ విశ్వాసాన్ని త్యజిస్తే విడుదల చేస్తామని నాజీలు చెప్పారు. వారు అలా చేయలేదు కాబట్టి నాన్నను డచావులోని నిర్బంధ శిబిరానికి, అమ్మను రావెన్స్‌బ్రూక్‌లోని నిర్బంధ శిబిరానికి పంపించారు. 1941 శీతాకాలంలో అమ్మా అలాగే ఆ శిబిరంలోని మరికొంతమంది స్త్రీ సాక్షులు సైనిక దళం కోసం పనిచేయడానికి నిరాకరించారు. వారికి 3 పగళ్ళు 3 రాత్రులు బయట చలిలో నిలబడే శిక్ష విధించారు, ఆ తర్వాత వారిని చీకటి కొట్లలో పెట్టి తాళం వేసి 40 రోజులపాటు సరైన ఆహారం ఇవ్వలేదు. ఆ తర్వాత వారిని కొరడాలతో కొట్టారు. మూడు వారాలపాటు విపరీతంగా కొట్టబడిన తర్వాత అమ్మ 1942, జనవరి 31న మరణించింది.

నాన్నను డచావు శిబిరం నుండి ఆస్ట్రియాలోని మౌథౌసెన్‌కు పంపించారు. ఆ శిబిరంలో నాజీలు ఖైదీలకు ఆహారం పెట్టకుండా తీవ్రమైన శారీరక పని చేయించి ఒక పద్ధతి ప్రకారం వారిని చంపేవారు. అయితే అమ్మ మరణించిన తర్వాత ఆరు నెలలకు నాజీలు నాన్నను మరో పద్ధతిలో చంపారు, వారు ఆయనపై వైద్య ప్రయోగాలు చేశారు. ఆ శిబిరంలోని వైద్యులు ప్రయోగాల కోసం ఉద్దేశపూరితంగా మనుష్యులకు టీబీ సంక్రమించేలా చేసేవారు. ఆ తర్వాత ఖైదీలకు గుండెలో ప్రాణాంతకమైన ఇంజెక్షన్‌ ఇచ్చేవారు. అధికారిక రికార్డుల్లో నాన్న “గుండె కండరాలు బలహీనంగావున్న కారణంగానే” మరణించాడని ఉంది. ఆయనకు అప్పుడు 43 సంవత్సరాలే. నాకు నా తల్లిదండ్రుల ఘోరమైన హత్యల గురించి కొన్ని నెలలు గడిచిన తర్వాతనే తెలిసింది. నా ప్రియమైన తల్లిదండ్రులు గుర్తు వచ్చినప్పుడల్లా నా కళ్ళు చెమ్మగిల్లుతాయి. అయితే గతంలోలాగే ఇప్పుడు కూడా, పరలోక నిరీక్షణ ఉన్న నా తల్లిదండ్రులు యెహోవా చేతుల్లో సురక్షితంగా ఉన్నారనే వాస్తవం నన్ను ఓదారుస్తుంది.

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత న్యూయార్క్‌లో వాచ్‌టవర్‌ బైబిలు స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌కు సంబంధించిన 11వ తరగతికి హాజరయ్యే ఆధిక్యత నాకు లభించింది. ఐదు నెలలపాటు లేఖనాలను అధ్యయనం చేయడంలో మునిగిపోవడం ఎంత ఆనందకరమైన అనుభవమో! 1948లో గ్రాడ్యుయేషన్‌ పొందిన తర్వాత నేను స్విట్జర్లాండ్‌లో మిషనరీగా సేవచేయడానికి పంపబడ్డాను. ఆ తర్వాత కొంతకాలానికి నేను గిలియడ్‌ ఐదవ తరగతినుండి గ్రాడ్యుయేషన్‌ పొందిన జేమ్స్‌ ఎల్‌. టర్పిన్‌ అనే నమ్మకమైన సహోదరుడిని కలిశాను. టర్కీలో మొదటి బ్రాంచి కార్యాలయం స్థాపించబడినప్పుడు ఆయన దానికి పైవిచారణకర్తగా పని చేశాడు. మేము 1951 మార్చిలో పెళ్ళి చేసుకున్నాము, ఆ తర్వాత కొద్దికాలానికే నేను తల్లిని కాబోతున్నానని తెలిసింది! మేము అమెరికా వెళ్ళి అక్కడ నివసించడం ప్రారంభించాము, డిసెంబరులో మా పాప మార్లిన్‌ జన్మించింది.

గడిచిన సంవత్సరాలన్నింటిలోను నేను జిమ్‌ రాజ్య సేవ చేయడంలో ఎంతో ఆనందించాము. నేను బైబిలు అధ్యయనం చేసిన పెన్ని అనే చైనీస్‌ యువతి నాకు ఇప్పటికీ గుర్తుంది, ఆమెకు బైబిలు అధ్యయనం చేయడమంటే చాలా ఇష్టం. ఆమె బాప్తిస్మం తీసుకొని ఆ తర్వాత గై పియర్స్‌ను పెళ్ళి చేసుకుంది, ఇప్పుడు ఆయన యెహోవాసాక్షుల పరిపాలక సభ సభ్యునిగా సేవ చేస్తున్నాడు. ఇలాంటి ప్రియమైన సహోదర సహోదరీలు నా తల్లిదండ్రులను పోగొట్టుకోవడంతో ఏర్పడిన లోటును పూరించారు.

2004 ఆరంభంలో నా తల్లిదండ్రుల స్వంత ఊరైన లాయిరాక్‌లోని సహోదరులు ష్టిక్‌ వీధిలో ఒక కొత్త రాజ్యమందిరాన్ని నిర్మించారు. యెహోవాసాక్షుల సేవను గుర్తిస్తూ ఆ పట్టణ సమితి నా తల్లిదండ్రుల గౌరవార్థం ఆ వీధి పేరును డెన్జ్‌ష్ట్రాసె (డెన్జ్‌ వీధి)గా మార్చాలని నిర్ణయించింది. స్థానిక వార్తా పత్రిక బాడిషె ట్సీటుంగ్‌, “హత్య చేయబడిన డెన్జ్‌ దంపతుల జ్ఞాపకార్థం: కొత్త వీధి పేరు” అనే శీర్షిక క్రింద, నా తల్లిదండ్రులు “తమ విశ్వాసం కారణంగా మూడవ నాజీ పరిపాలనలో నిర్బంధ శిబిరంలో చంపబడ్డారు” అని తెలియజేసింది. పట్టణ సమితి తీసుకున్న ఆ చర్య ఊహించనిది, అయితే అది నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది.

మనం భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసుకునేటప్పుడు అర్మగిద్దోను మన జీవితకాలంలో రాదు అన్నట్లుగా ప్రణాళిక వేసుకోవాలని, అయితే జీవించేటప్పుడు మాత్రం అర్మగిద్దోను రేపే వస్తుంది అన్నట్లుగా జీవించాలని నాన్న చెబుతుండేవాడు, ఆ అమూల్యమైన సలహాను నేను ఎల్లప్పుడూ పాటించడానికి ప్రయత్నించాను. ప్రత్యేకించి ఇప్పుడు వృద్ధాప్యంవల్ల ఎక్కువసేపు ఇంట్లోనే గడపవలసి వస్తున్న నాకు సహనాన్ని ఆత్రుతగా ఎదురుచూడడాన్ని సమతుల్యపరచడం అంత సులభం కాదు. అయినా కూడా యెహోవా తన నమ్మకమైన సేవకులందరికీ చేసిన ఈ వాగ్దానాన్ని నేను ఎన్నడూ సందేహించలేదు: “నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.”​—⁠సామెతలు 3:5, 6.

[29వ పేజీలోని బాక్సు/చిత్రం]

గతానికి చెందిన విలువైన మాటలు

1980లలో ఒక స్త్రీ కొంత దూరంనుండి లాయిరాక్‌ పట్టణాన్ని సందర్శించడానికి వచ్చింది. అప్పుడు ఆ పట్టణస్థులు తమకు అక్కర్లేని వస్తువులను ఒక బహిరంగ స్థలంలో వేశారు, ఇతరులు వాటిలోనుండి తమకు కావలసినవి తీసుకోవడానికి వీలుగా వారలా చేశారు. ఆ స్త్రీకి ఒక కుట్టు డబ్బా దొరికింది, ఆమె దానిని ఇంటికి తీసుకెళ్ళింది. తర్వాత ఆమెకు ఆ డబ్బా అడుగున ఒక అమ్మాయి ఫోటోలు, నిర్బంధ శిబిరం కాగితాలపై వ్రాయబడిన ఉత్తరాలు దొరికాయి. ఆ స్త్రీకి ఆ ఉత్తరాలంటే ఎంతో ఆసక్తి కలిగింది, రెండు జడలు వేసుకొనివున్న అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని ఆమె అనుకుంది.

2000వ సంవత్సరంలో ఒకరోజు ఆ స్త్రీ లాయిరాక్‌లో జరిగిన ఒక చారిత్రాత్మక ప్రదర్శన గురించి వార్తాపత్రికలో చదివింది. ఆ వార్తాపత్రిక నాజీ పరిపాలనలో యెహోవాసాక్షుల చరిత్ర గురించి వర్ణిస్తూ మా కుటుంబం గురించి కూడా తెలియజేసింది. దానిలో నేను యౌవనస్థురాలిగా ఉన్న ఫోటోలు కూడా వేశారు. ఆ స్త్రీ తన దగ్గర ఉన్న ఫోటోలకు వార్తాపత్రికలోని ఫోటోలకు పోలికలు కలుస్తున్నాయని గమనించి, ఆ వార్తాపత్రిక విలేఖరిని సంప్రదించి తన దగ్గర ఉన్న 42 ఉత్తరాల గురించి చెప్పింది! కొన్ని వారాల తర్వాత ఆ ఉత్తరాలు నా చేతికి అందాయి. నా తల్లిదండ్రుల వ్రాతలో ఉన్న ఆ ఉత్తరాలు నా యోగక్షేమాలను కనుక్కోవడానికి మా పెద్దమ్మకు వ్రాసినవి. నా తల్లిదండ్రులకు నా పట్ల ఉన్న ప్రేమపూర్వకమైన శ్రద్ధ ఎన్నటికీ తగ్గలేదు. ఆ ఉత్తరాలు భద్రంగా ఉండి 60 కంటే ఎక్కువ సంవత్సరాల తర్వాత కనుగొనబడడం నిజంగా ఒక అద్భుతమే!

[25వ పేజీలోని చిత్రాలు]

హిట్లర్‌ అధికారానికి వచ్చినప్పుడు మా ఆనందకరమైన కుటుంబం వేరుచేయబడింది

[చిత్రసౌజన్యం]

హిట్లర్‌: U.S. Army photo

[26వ పేజీలోని చిత్రాలు]

1. మాగ్డేబర్గ్‌లోని కార్యాలయం

2. రహస్య పోలీసులు వేలాదిమంది సాక్షులను అరెస్టు చేశారు

[28వ పేజీలోని చిత్రం]

నేను, జిమ్‌ రాజ్య సేవ చేయడంలో ఎంతో ఆనందాన్ని పొందాము