కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోషువ పుస్తకంలోని ముఖ్యాంశాలు

యెహోషువ పుస్తకంలోని ముఖ్యాంశాలు

యెహోవా వాక్యము సజీవమైనది

యెహోషువ పుస్తకంలోని ముఖ్యాంశాలు

సా.శ.పూ. 1473లో మోయాబు మైదానాలవద్ద నివసిస్తున్న ఇశ్రాయేలీయులు ఈ మాటలు విని పులకరించివుంటారు: “మీరు స్వాధీనపరచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనబోవుటకై మూడు దినములలోగా మీరు ఈ యొర్దానును దాటవలెను. గనుక ఆహారమును సిద్ధపరచుకొనుడి.” (యెహోషువ 1:​11) వారు 40 సంవత్సరాలపాటు చేసిన అరణ్యవాసం ముగిసే సమయం వచ్చింది.

రెండు దశాబ్దాలకంటే కాస్త ఎక్కువకాలం తర్వాత వారి నాయకుడైన యెహోషువ కనాను నడిబొడ్డున నిలబడి ఇశ్రాయేలు పెద్దలతో ఇలా అన్నాడు: “చూడుడి, యొర్దాను మొదలుకొని తూర్పుదిక్కున మహాసముద్రము వరకు నేను నిర్మూలముచేసిన సమస్త జనముల దేశమును, మీ గోత్రముల స్వాస్థ్యముమధ్య మిగిలియున్న యీ జనముల దేశమును మీకు వంతుచీట్లవలన పంచిపెట్టితిని. మీ దేవుడైన యెహోవాయే వారిని మీ యెదుట నిలువకుండ వెళ్లగొట్టిన తరువాత మీ దేవుడైన యెహోవా మీతో సెలవిచ్చినట్లు మీరు వారి దేశమును స్వాధీనపరచుకొందురు.”​—⁠యెహోషువ 23:4, 5.

సా.శ.పూ. 1450లో యెహోషువ వ్రాసిన ఈ యెహోషువ పుస్తకం, ఆ 22 సంవత్సరాల్లో జరిగిన సంఘటనల చారిత్రక నివేదిక. వాగ్దానం చేయబడిన నూతనలోకంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్న మన పరిస్థితిని, వాగ్దాన దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న ఇశ్రాయేలు కుమారుల పరిస్థితితో పోల్చవచ్చు. కాబట్టి మనం యెహోషువ పుస్తకాన్ని అత్యంతాసక్తితో పరిశీలిద్దాం.​—⁠హెబ్రీయులు 4:12.

‘యెరికో మైదానములకు’

(యెహోషువ 1:1-5:15)

“నా సేవకుడైన మోషే మృతినొందెను. కాబటి నీవు లేచి, నీవును ఈ జనులందరును ఈ యొర్దానునది దాటి నేను ఇశ్రాయేలీయుల కిచ్చుచున్న దేశమునకు వెళ్లుడి” అని యెహోవా చెప్పినప్పుడు యెహోషువకు నిజంగానే బరువైన బాధ్యత అప్పగించబడింది! (యెహోషువ 1:​1-2) యెహోషువ కొన్ని లక్షలమంది ప్రజలున్న జనాంగాన్ని వాగ్దాన దేశంలోకి నడిపించాలి. ఆ పనికి సిద్ధపడుతూ ఆయన తాము మొదట స్వాధీనపరచుకోవలసిన యెరికో పట్టణానికి ఇద్దరు వేగులవారిని పంపించాడు. ఆ పట్టణంలో రాహాబు అనే వేశ్య నివసించేది, ఆమె యెహోవా తన ప్రజల కోసం చేసిన అద్భుతాల గురించి విన్నది. ఆమె ఆ వేగులవారిని కాపాడి వారికి సహాయం చేసింది, యెరికో నాశనం చేయబడినప్పుడు ఆమె రక్షించబడుతుందని వారు వాగ్దానం చేశారు.

వేగులవారు తిరిగి వచ్చేటప్పటికి యెహోషువ, ప్రజలు యొర్దాను నదిని దాటడానికి సిద్ధంగా ఉన్నారు. వరదలు వచ్చేలా పొంగి పొర్లుతున్న యొర్దాను నది వారికి అడ్డంకు కాలేదు, ఎందుకంటే యెహోవా ఆ నదిలోకి ప్రవేశించే నీటిని ఒక ఆనకట్టలా నిలబడేలా చేసి, ఆ నదినుండి బయటకు ప్రవహించే నీరు మృత సముద్రంలోకి వెళ్ళేలా చేశాడు. ఇశ్రాయేలీయులు యొర్దాను నదిని దాటిన తర్వాత యెరికోకు దగ్గర్లోని గిల్గాలువద్ద బస చేశారు. నాలుగు రోజుల తర్వాత అబీబు నెలలో 14వ రోజున వారు యెరికో మైదానాల్లో పస్కా పండుగను ఆచరించారు. (యెహోషువ 5:10) ఆ తర్వాతి రోజు వారు పంటపొలాల్లో పండిన ధాన్యాన్ని తినడం ప్రారంభించారు, అప్పటినుండి మన్నా ఏర్పాటు ఆగిపోయింది. ఆ సమయంలోనే యెహోషువ అరణ్యంలో జన్మించిన పురుషులందరికి సున్నతి చేయించాడు.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

2:​4, 5​—⁠వేగులవారి కోసం వెదుకుతూ వచ్చిన రాజు మనుష్యులను రాహాబు ఎందుకు తప్పుదారి పట్టించింది? రాహాబు యెహోవామీద నమ్మకాన్ని పెంపొందించుకుంది కాబట్టే తన ప్రాణాలకు తెగించి ఆ వేగులవారిని కాపాడింది. ఆమె, దేవుని ప్రజలకు హాని తలపెట్టాలనుకుంటున్న మనుష్యులకు వేగులవారి గురించిన సమాచారం అందించవలసిన అవసరం లేదు. (మత్తయి 7:6; 21:23-27; యోహాను 7:​3-10) నిజానికి రాహాబు రాజు మనుష్యులను తప్పుదోవ పట్టించడంతోపాటు చేసిన ఇతర ‘క్రియల మూలముగా నీతిమంతురాలిగా ఎంచబడింది.’​—⁠యాకోబు 2:24-26.

5:​14, 15​—⁠“యెహోవా సేనాధిపతి” ఎవరు? వాగ్దాన దేశాన్ని స్వాధీనపరచుకునేటప్పుడు యెహోషువను బలపరచడానికి వచ్చిన ఆ సేనాధిపతి ఖచ్చితంగా “వాక్యము,” అంటే మానవునిగా రాక మునుపటి యేసుక్రీస్తే అయి ఉండాలి. (యోహాను 1:1; దానియేలు 10:​13) దేవుని ప్రజలు నేడు ఆధ్యాత్మిక యుద్ధం చేస్తుండగా మహిమాన్వితుడైన యేసుక్రీస్తు వారితోపాటు ఉన్నాడనే హామీ ఎంతటి ఓదార్పునిస్తుందో కదా!

మనకు పాఠాలు:

1:​7-9. మనం మన ఆధ్యాత్మిక కార్యకలాపాలను సమర్థవంతంగా చేయాలంటే బైబిలును ప్రతిరోజు చదవడం, దానిలోని విషయాల గురించి క్రమంగా ధ్యానించడం, మనం నేర్చుకునే విషయాలను ఆచరణలో పెట్టడం ప్రాముఖ్యం.

1:​11. దేవుడే అన్నీ దయచేస్తాడులే అని సోమరిగా కూర్చొని ఎదురుచూడకుండా ఆహారాన్ని ఇతర అవసరమైన వస్తువులను సిద్ధం చేసుకొమ్మని యెహోషువ ప్రజలకు చెప్పాడు. జీవితావసరాల గురించి చింతించకూడదని యేసు ఇచ్చిన మందలింపు, “అవన్నియు మీకనుగ్రహింపబడును” అని ఆయన చేసిన వాగ్దానం, మనం మన అవసరాలు తీర్చుకోవడానికి అస్సలు కృషి చేయకూడదని చెప్పడంలేదు.​—⁠మత్తయి 6:25, 33.

2:​4-13. యెహోవా గొప్ప కార్యముల గురించి విన్న తర్వాత, పరిస్థితి ప్రమాదకరంగా ఉందని గుర్తించిన తర్వాత రాహాబు యెహోవా ఆరాధకుల పక్షాన ఉండాలని నిర్ణయించుకుంది. మీరు కొంతకాలంగా బైబిలు అధ్యయనం చేస్తుంటే, మనం “అంత్యదినములలో” జీవిస్తున్నామని గుర్తిస్తే, మీరు దేవుణ్ణి సేవించాలని నిర్ణయించుకోవద్దా?​—⁠2 తిమోతి 3:⁠1.

3:​15. యెరికోకు పంపించబడిన వేగులవారు అనుకూలమైన సమాచారం తెచ్చారు కాబట్టి యెహోషువ యొర్దాను నదిలోని నీరు తగ్గేవరకూ ఆగకుండా వెంటనే చర్య తీసుకున్నాడు. సత్యారాధనకు సంబంధించిన పనుల విషయానికి వచ్చేసరికి మనం కూడా పరిస్థితులు మరింత అనుకూలంగా ఉన్నట్లు అనిపించేవరకూ వేచివుండే బదులు ధైర్యంగా చర్య తీసుకోవాలి.

4:​4-8, 20-24. యొర్దాను నదినుండి తీసుకోబడిన 12 రాళ్ళు ఇశ్రాయేలుకు ఒక జ్ఞాపికగా పనిచేశాయి. యెహోవా తన ఆధునిక దిన ప్రజలను తన శత్రువులనుండి కాపాడడానికి చేసే పనులు కూడా ఆయన వారితో ఉన్నాడు అని గుర్తు చేసే జ్ఞాపికగా పనిచేస్తాయి.

స్వాధీనపరచుకుంటూ ముందుకు సాగడం

(యెహోషువ 6:1-12:24)

“ఎవడును వెలుపలికి పోకుండను లోపలికి రాకుండను యెరికోపట్టణ ద్వారము గట్టిగా మూసి వేయబడెను.” (యెహోషువ 6:⁠1) యెహోషువ ఆ పట్టణాన్ని ఎలా స్వాధీనపరచుకున్నాడు? యెహోవాయే ఆయనకు యుద్ధప్రణాళికను ఇచ్చాడు. కొద్ది రోజులకే ఆ పట్టణపు గోడలు కూలిపోయాయి, ఆ పట్టణం నాశనం చేయబడింది. రాహాబు ఆమె ఇంటివారు మాత్రమే రక్షించబడ్డారు.

ఆ తర్వాత హాయి పట్టణం స్వాధీనం చేసుకోబడింది. అక్కడకు పంపించబడిన వేగులవారు ఆ పట్టణంలో కొంతమంది నివాసులే ఉన్నారని, దానిని ఆక్రమించుకోవడానికి ఎక్కువమంది అవసరం లేదని తెలిపారు. అయితే ఆ పట్టణంపై దాడి చేయడానికి పంపించబడిన దాదాపు 3,000 మంది సైనికులు హాయి పురుషులను చూసి పారిపోయి వచ్చేశారు. కారణమేమిటి? యెహోవా ఇశ్రాయేలీయులకు సహాయం చేయలేదు. యూదా గోత్రానికి చెందిన ఆకాను, యెరికోను స్వాధీనం చేసుకునేటప్పుడు పాపం చేశాడు. ఆ తప్పు సరిదిద్దిన తర్వాత యెహోషువ మళ్ళీ హాయిపై దాడి చేశాడు. ఇశ్రాయేలీయులను ఒకసారి ఓడించాడు కాబట్టి హాయి రాజు వారితో మళ్ళీ యుద్ధం చేయడానికి ఉత్సాహం చూపించాడు. యెహోషువ హాయి పురుషుల అమితమైన ఆత్మవిశ్వాసాన్ని తన ప్రయోజనానికి ఉపయోగించుకుంటూ ఒక ఖచ్చితమైన ప్రణాళికతో ఆ పట్టణాన్ని ఆక్రమించుకున్నాడు.

గిబియోను ‘ఒక గొప్ప పట్టణము, అది హాయికంటే గొప్పది, అక్కడి జనులందరు శూరులు.’ (యెహోషువ 10:⁠2) ఇశ్రాయేలీయులు యెరికోపై, హాయిపై సాధించిన విజయాల గురించి విన్నప్పుడు గిబియోనీయులు యెహోషువను మోసం చేసి తమతో శాంతియుతమైన నిబంధనను చేయించుకున్నారు. చుట్టుప్రక్కల రాజ్యాలు గిబియోనీయులు చేసిన పనిని తమకు ప్రమాదంగా దృష్టించాయి. ఆ రాజ్యాల రాజులు ఐదుగురు ఐక్యమై గిబియోనుపై దాడి చేశారు. ఇశ్రాయేలు గిబియోనీయులను కాపాడి, దాడి చేసినవారిని చిత్తుగా ఓడించింది. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులు దక్షిణంవైపు, పడమటివైపు ఉన్న పట్టణాలనే గాక ఉత్తరం నుండి ఐక్యమై వచ్చిన రాజులను కూడా జయించారు. యొర్దాను నదికి పడమటివైపున ఓడించబడిన రాజులు మొత్తం 31 మంది.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

10:​13​—⁠అది ఎలా సాధ్యమయ్యింది? భూమ్యాకాశాల సృష్టికర్తయైన “యెహోవాకు అసాధ్యమైనది ఏదైన నున్నదా?” (ఆదికాండము 18:​14) యెహోవా కావాలనుకుంటే భూమి చలనాన్ని మార్చగలడు, అప్పుడు భూమిపై నుండి చూసే వ్యక్తికి సూర్యుడు, చంద్రుడు నిలిచిపోయినట్లుగానే కనిపిస్తుంది. లేదా ఆయన భూమి చలనాన్ని, చంద్రుని చలనాన్ని అలాగే ఉంచి, సూర్యుని నుండి, చంద్రుని నుండి వచ్చే కిరణాలు వక్రీభవించేలా చేసి వాటి వెలుగు ప్రకాశిస్తూనే ఉండేలా చేయగలడు. ఆయన ఏ పద్ధతిని ఉపయోగించినా మానవ చరిత్రంతటిలోను “ఆ దినమువంటి దినము దానికి ముందేగాని దానికి తరువాతనేగాని యుండలేదు.”​—⁠యెహోషువ 10:14.

10:​12​—⁠యాషారు గ్రంథము అంటే ఏమిటి? ఇశ్రాయేలు రాజైన సౌలుకు, ఆయన కుమారుడు యోనాతానుకు సంబంధించి వ్రాయబడిన దుఃఖగీతము లేదా “ధనుర్గీతము” అని పిలువబడిన పద్యం గురించి మాట్లాడుతున్న 2 సమూయేలు 1:17లో కూడా ఆ గ్రంథము ప్రస్తావించబడింది. ఆ గ్రంథము బహుశా చారిత్రక పాటల, పద్యాల సంకలనమై ఉండవచ్చు, అది హెబ్రీయులందరికీ బాగా తెలిసి ఉండవచ్చు.

మనకు పాఠాలు:

6:​26; 9:​22, 23. యెరికో నాశనమప్పుడు యెహోషువ ప్రకటించిన శాపము దాదాపు 500 సంవత్సరాల తర్వాత నెరవేరింది. (1 రాజులు 16:​34) నోవహు తన మనవడైన కనానుపై ప్రకటించిన శాపము, గిబియోనీయులు దాసులైనప్పుడు నెరవేరింది. (ఆదికాండము 9:​25, 26) యెహోవా వాక్యం ఎల్లప్పుడూ నిజమవుతుంది.

7:​20-25. ఆకాను చేసిన దొంగతనం ఎవ్వరికీ హాని చేయలేదని తర్కిస్తూ కొందరు దానిని చిన్న పొరపాటుగా కొట్టి పారేయవచ్చు. వారు బైబిలు నియమాలకు వ్యతిరేకంగా చేయబడే చిన్న చిన్న దొంగతనాలను, తప్పులను కూడా అలాగే దృష్టించవచ్చు. అయితే మనం చట్టవిరుద్ధమైన లేక అనైతికమైన చర్యలకు పాల్పడడానికి వచ్చే ఒత్తిడిని నిరోధించడంలో యెహోషువలాగే దృఢంగా ఉండాలి.

9:​15, 26, 27. మనం చేసే ఒప్పందాలను గంభీరంగా తీసుకొని మన వాగ్దానాలను నెరవేర్చాలి.

యెహోషువ తన చివరి గొప్ప పనిని చేపట్టడం

(యెహోషువ 13:1-24:33)

బాగా వయస్సు పైబడిన యెహోషువకు 90 సంవత్సరాలున్నప్పుడు, దేశాన్ని పంచిపెట్టే పనిని ప్రారంభించాడు. అది నిజంగానే ఎంతో పెద్ద పని! రూబేనీయులకు, గాదీయులకు, మనష్షే అర్ధగోత్రపువారికి అప్పటికే యొర్దాను తూర్పువైపున స్వాస్థ్యము లభించింది. ఆ తర్వాత వంతుచీట్లు వేయడం ద్వారా, మిగిలిన గోత్రాలకు దక్షిణ భాగాన స్వాస్థ్యము ఇవ్వబడింది.

ఎఫ్రాయిము గోత్రానికి చెందిన భాగంలోని షిలోహులో మందిర గుడారము ఏర్పాటు చేయబడింది. కాలేబుకు హెబ్రోను పట్టణం, యెహోషువకు తిమ్నత్సెరహు స్వాస్థ్యముగా లభించాయి. లేవీయులకు 6 ఆశ్రయపురములతోపాటు 48 పట్టణాలు ఇవ్వబడ్డాయి. రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రపువారు యొర్దానుకు తూర్పువైపున ఇవ్వబడిన తమ స్వాస్థ్యానికి తిరిగివెళ్ళేటప్పుడు ‘చూపునకు గొప్పగా కనిపించే బలిపీఠమును’ కట్టారు. (యెహోషువ 22:​10) అయితే యొర్దానుకు పశ్చిమానవున్న గోత్రాలు దానిని మతభ్రష్ట చర్యగా పరిగణించాయి, దానితో ఆ గోత్రాల మధ్య యుద్ధం జరిగే పరిస్థితి వచ్చింది, అయితే వారు సమస్య గురించి చర్చలు జరిపి రక్తపాతాన్ని నిరోధించగలిగారు.

యెహోషువ తిమ్నత్సెరహులో కొంతకాలం నివసించిన తర్వాత, ఇశ్రాయేలు పెద్దలను, ముఖ్యులను, న్యాయాధిపతులను, నాయకులను పిలిపించి వారిని ధైర్యంగా ఉండమని, యెహోవాకు నమ్మకంగా ఉండమని ప్రోత్సహించాడు. ఆ తర్వాత యెహోషువ ఇశ్రాయేలు గోత్రాలన్నింటిని షెకెముకు పిలిపించాడు. అక్కడ ఆయన యెహోవా అబ్రాహాము కాలమునుండి తమతో ఎలా వ్యవహరించాడో వారికి గుర్తు చేశాడు, ఆ తర్వాత ఆయన ‘యెహోవాయందు భయభక్తులుగలవారై, ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించండి’ అని వారికి మరోసారి ఉద్బోధించాడు. ప్రజలు ఇలా ప్రతిస్పందించేందుకు కదిలించబడ్డారు: “మన దేవుడైన యెహోవానే సేవించెదము, ఆయన మాటయే విందుము.” (యెహోషువ 24:​14, 15, 24) ఈ సంఘటనలు జరిగిన తర్వాత చివరికి 110 సంవత్సరాల వయసులో యెహోషువ మరణించాడు.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

13:​1​—⁠ఇది యెహోషువ 11:23లోని మాటలకు విరుద్ధంగా లేదా? లేదు, ఎందుకంటే వాగ్దాన దేశాన్ని స్వాధీనపరచుకోవడంలో రెండు అంశాలు ఇమిడివున్నాయి: కనాను దేశానికి చెందిన 31 మంది రాజులను ఓడించి, కనానీయుల శక్తిని నాశనం చేయడానికి వారితో యుద్ధం చేయడం ఒకటి. గోత్రాలుగాను, విడివిడి వ్యక్తులుగాను చర్యలు తీసుకోవడం ద్వారా ఆ దేశాన్ని పూర్తిగా స్వాధీనపరచుకోవడం రెండవది. (యెహోషువ 17:14-18; 18:⁠3) ఇశ్రాయేలీయులు తమ మధ్యనుండి కనానీయులను పూర్తిగా వెళ్ళగొట్టలేకపోయారు, అయితే అలా మిగిలిన కనానీయులు ఇశ్రాయేలు భద్రతకు ప్రమాదకరంగా తయారవలేదు. (యెహోషువ 16:10; 17:​12) యెహోషువ 21:⁠44 ఇలా చెబుతోంది: “యెహోవా . . . అన్నిదిక్కులయందు వారికి విశ్రాంతి కలుగజేసెను.”

24:​2​—⁠అబ్రాహాము తండ్రియైన తెరహు విగ్రహాలను ఆరాధించేవాడా? మొదట్లో తెరహు యెహోవా దేవుణ్ణి ఆరాధించేవాడు కాదు. ఆయన బహుశా ఊరు పట్టణంలో ప్రఖ్యాతి గాంచిన సిన్‌ అనే పేరుగల చంద్ర దేవుణ్ణి ఆరాధించి ఉండవచ్చు. యూదుల సాంప్రదాయం తెలియజేస్తున్న దాని ప్రకారం, తెరహు విగ్రహాలను తయారు చేసేవాడిగా కూడా ఉండివుండవచ్చు. అయితే అబ్రాహాము దేవుని ఆజ్ఞకు విధేయత చూపిస్తూ ఊరు పట్టణాన్ని విడిచిపెట్టినప్పుడు తెరహు ఆయనతోపాటు హారానుకు వెళ్ళాడు.​—⁠ఆదికాండము 11:31.

మనకు పాఠాలు:

14:​10-13. కాలేబు 85 సంవత్సరాల వయసువాడైనా, హెబ్రోనునుండి ప్రజలను తరిమివేసే కష్టమైన పనిని తనకు అప్పగించమని కోరాడు. ఆ పట్టణంలో భారీకాయులైన అనాకీయులు ఉండేవారు. యెహోవా సహాయంతో ఈ అనుభవంగల యుద్ధశూరుడు ఆ పని చేయగలిగాడు, హెబ్రోను ఆశ్రయపురముగా మార్చబడింది. (యెహోషువ 15:13-19; 21:​11-13) కష్టమైన దైవపరిపాలనా నియామాలను అంగీకరించడానికి వెనుకంజ వేయకూడదని కాలేబు ఉదాహరణ మనల్ని ప్రోత్సహిస్తోంది.

22:​9-12, 21-33. ఇతరుల ఉద్దేశాల గురించి తప్పుడు అభిప్రాయాలు ఏర్పరచుకోకుండా ఉండడంలో మనం జాగ్రత్తగా ఉండాలి.

“ఒక్కటియైనను తప్పియుండలేదు”

ఎంతో వృద్ధుడైన యెహోషువ ఇశ్రాయేలులోని బాధ్యతగల పురుషులకు ఇలా చెప్పాడు: “మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటియైనను తప్పియుండలేదు . . . అవి అన్నియు మీకు కలిగెను, వాటిలో ఒక్కటియైనను తప్పియుండలేదు.” (యెహోషువ 23:​14) చారిత్రాత్మకమైన యెహోషువ వృత్తాంతం ఆ విషయాన్ని ఎంత స్పష్టంగా తెలియజేస్తుందో కదా!

“ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి యున్నవి” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (రోమీయులు 15:⁠4) మనం దేవుని వాగ్దానాలపై ఉంచిన నమ్మకం వమ్ము కాదనే నిశ్చయతతో ఉండవచ్చు. ఒక్క వాగ్దానం కూడా నెరవేరకుండా ఉండదు, అన్ని వాగ్దానాలు నెరవేరతాయి.

[10వ పేజీలోని మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

యెహోషువ నాయకత్వంలో స్వాధీనం చేసుకోబడిన దేశము

బాషాను

గిలాదు

అరాబా

నెగెబు

యొర్దాను నది

ఉప్పు సముద్రం

యబ్బోకు ఏటిలోయ

అర్నోను ఏరు

హాసోరు

మాదోను

లష్షారోను

షిమ్రోను

యొక్నెయాము

దోరు

మెగిద్దో

కెదెషు

తానాకు

హెపెరు

తిర్సా

ఆఫెకు

తప్పూయ

బేతేలు

హాయి

గిల్గాలు

యెరికో

గెజెరు

యెరూషలేము

మక్కేదా

యర్మూతు

అదుల్లాము

లిబ్నా

లాకీషు

ఎగ్లోను

హెబ్రోను

దెబీరు

అరాదు

[9వ పేజీలోని చిత్రం]

వేశ్యయైన రాహాబు నీతిమంతురాలిగా ఎందుకు ఎంచబడిందో మీకు తెలుసా?

[10వ పేజీలోని చిత్రం]

‘యెహోవాయందు భయభక్తులుగలవారై ఆయనను సేవించండి’ అని యెహోషువ ఇశ్రాయేలీయులకు ఉద్బోధించాడు

[12వ పేజీలోని చిత్రం]

ఆకాను చేసిన దొంగతనం చిన్న పొరపాటు కాదు​—⁠అది గంభీరమైన పర్యవసానాలకు దారితీసింది

[12వ పేజీలోని చిత్రం]

“విశ్వాసమునుబట్టి . . . యెరికో గోడలు కూలెను.”​—⁠హెబ్రీయులు 11:30