మీరు యెహోవా సహాయాన్ని అంగీకరిస్తారా?
మీరు యెహోవా సహాయాన్ని అంగీకరిస్తారా?
“ప్రభువు [“యెహోవా,” NW] నాకు సహాయుడు, నేను భయపడను.”—హెబ్రీయులు 13:6.
మీరొక కొండదారిలో నడుస్తున్నట్లు ఊహించుకోండి. మీరు ఒంటరిగా లేరు, మార్గం చూపేందుకు ఒక ఉదాత్తమైన మార్గదర్శి మీతోపాటు రావడానికి సిద్ధపడ్డాడు. ఆయనకు మీకంటే ఎక్కువ అనుభవం, శక్తి ఉన్నాయి, కానీ ఆయన ఓపికగా మీతోపాటు నడుస్తున్నాడు. మీరు అక్కడక్కడా తడబడడం ఆయన గమనించి, మీ క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ప్రమాదకరమైన స్థలంలో మీకు సహాయ హస్తం అందిస్తే, ఆ సహాయాన్ని నిరాకరిస్తారా? ఎంతమాత్రం నిరాకరించరు. ఎందుకంటే మీరు ప్రమాదంలో ఉన్నారు.
2 క్రైస్తవులుగా, మనమొక కష్టమైన దారిలో నడుస్తున్నాం. మనమా ఇరుకు దారిలో ఒంటరిగానే నడవాలా? (మత్తయి 7:13-14) లేదు, ఎందుకంటే సర్వోత్తమ మార్గదర్శియైన యెహోవా దేవుడు మానవులు తనతో నడవడానికి అనుమతిస్తున్నాడు. (ఆదికాండము 5:24; 6:9) యెహోవా తన సేవకులు నడుస్తుండగా వారికి సహాయం చేస్తాడా? ఆయన ఇలా చెబుతున్నాడు: “నీ దేవుడనైన యెహోవానగు నేను—భయపడకుము నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను.” (యెషయా 41:13) మన ఉపమానంలోని మార్గదర్శిలా, యెహోవా తనతో నడవాలనుకునే వారికి దయతో తన సహాయ హస్తాన్ని, స్నేహాన్ని అందిస్తున్నాడు. నిశ్చయంగా మనలో ఎవ్వరమూ ఆయన సహాయాన్ని తిరస్కరించాలని కోరుకోం!
3 ముందరి ఆర్టికల్‌లో, యెహోవా ప్రాచీన కాలాల్లోని తన ప్రజలకు సహాయం చేసిన నాలుగు విధానాలను పరిశీలించాం. నేడు కూడా ఆయన అదే రీతిలో తన ప్రజలకు సహాయం చేస్తున్నాడా? అలాంటి ఏ సహాయాన్నైనా మనం అంగీకరిస్తున్నామని మనమెలా రూఢీపరచుకోవచ్చు? ఈ ప్రశ్నలను మనం పరిశీలిద్దాం. అలా పరిశీలించడం ద్వారా మనం యెహోవాయే మన నిజమైన సహాయకుడని మరింత గట్టి నమ్మకంతో ఉండవచ్చు.—దేవదూతల సహాయం
4 ప్రస్తుత దిన యెహోవా సేవకులకు దేవదూతలు సహాయం చేస్తున్నారా? అవును, సహాయం చేస్తున్నారు. నిజమే, నేడు ప్రమాదంలో నుండి సత్యారాధకులను విడిపించడానికి ప్రత్యక్షంగా వారు కనిపించరు. బైబిలు కాలాల్లో కూడా వారలా అరుదుగానే కనిపించారు. నేటిలానే వారు చేసింది చాలావరకు మానవ నేత్రాలకు అదృశ్యంగానే ఉంది. అయినప్పటికీ, తమకు దేవదూతల మద్దతు ఉందని గ్రహించిన దేవుని సేవకులు ఎంతో ప్రోత్సహించబడ్డారు. (2 రాజులు 6:14-17) మనమూ అలాగే భావించడానికి మంచి కారణం మనకుంది.
5 మనం చేయవలసిన ఒక విశేషమైన పనిలో యెహోవా తన దూతలకు ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. ఏమిటా పని? దాని జవాబును మనం ప్రకటన 14:6లో చూడవచ్చు. అక్కడ ఇలా ఉంది: “అప్పుడు మరియొక దూతను చూచితిని. అతడు భూనివాసులకు, అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాటలాడువారికిని ప్రతి ప్రజకును ప్రకటించునట్లు నిత్యసువార్త తీసికొని ఆకాశమధ్యమున ఎగురుచుండెను.” ఈ ‘నిత్యసువార్తకు,’ ఈ విధానాంతానికి ముందు “సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను” ప్రకటించబడుతుందని యేసు ముందే చెప్పిన ‘రాజ్య సువార్తకు’ నిస్సందేహంగా సంబంధముంది. (మత్తయి 24:14) నిజమే, దేవదూతలు నేరుగా సువార్త ప్రకటించడం లేదు. యేసు ఆ ప్రాముఖ్యమైన పనిని మానవులకు అప్పగించాడు. (మత్తయి 28:19, 20) మనమా పనిని నెరవేరుస్తుండగా మనకు జ్ఞానం, శక్తిగల ఆత్మసంబంధ ప్రాణులైన పరిశుద్ధ దూతల సహాయం ఉందని తెలుసుకోవడం ప్రోత్సాహకరంగా లేదా?
6 మన పనికి దేవదూతల మద్దతు ఉందనేందుకు గణనీయమైన నిదర్శనముంది. ఉదాహరణకు, సత్యమేమిటో తెలుసుకోవడానికి సహాయం చేయమని అంతకు ముందే దేవుణ్ణి ప్రార్థించిన వ్యక్తిని యెహోవాసాక్షులు తమ పరిచర్యలో కలుసుకోవడం గురించి మనం తరచూ వింటుంటాం. కాకతాళీయంగా జరిగాయని కొట్టిపారవేయడానికి వీల్లేనంత తరచుగా అలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి. దేవదూతలు ఇస్తున్న అలాంటి సహాయం మూలంగా అంతకంతకు ఎక్కువమంది ప్రజలు, “దేవునికి ప్రకటన 14:7.
భయపడి ఆయనను మహిమపరచుడి” అని ‘ఆకాశమధ్యమున ఎగురుతున్న దూత’ ప్రకటిస్తున్నట్లే ప్రకటించడం నేర్చుకుంటున్నారు.—7 యెహోవా బలమైన తన దూతల మద్దతు కావాలని మీరు కోరుకుంటున్నారా? అలాగైతే మీ పరిచర్యలో మీరు శాయశక్తులా కృషి చేయండి. (1 కొరింథీయులు 15:58) యెహోవా ఇచ్చిన ఈ ప్రత్యేక నియామకంలో మనం శక్తివంచన లేకుండా ఆనందంగా సేవ చేసినప్పుడు, ఆయన దూతల సహాయం మనకుంటుందని గట్టిగా నమ్మవచ్చు.
దేవదూతల ప్రధాని ద్వారా సహాయం
8 యెహోవా మనకు ఇంకో విధంగా కూడా తన దూతల సహాయాన్ని అందిస్తున్నాడు. “ముఖము సూర్యబింబమువలె” ఉన్న అసాధారణమైన “బలిష్ఠుడైన వేరొక దూత” గురించి ప్రకటన 10:1 వర్ణిస్తోంది. దర్శనంలో కనబడిన ఆ దేవదూత, మహిమపరచబడి పరలోక అధికారంతో ఉన్న యేసుక్రీస్తును సూచిస్తున్నాడు. (ప్రకటన 1:13, 16) యేసు నిజంగా ఒక దేవదూతేనా? ఒక రకంగా చెప్పాలంటే, ఆయన కూడా ఒక దేవదూతే, ఎందుకంటే ఆయన ప్రధాన దూతగా ఉన్నాడు. (1 థెస్సలొనీకయులు 4:16) యెహోవా ఆత్మ సంబంధ కుమారులందరిలోకి యేసు అత్యంత బలిష్ఠుడు. దేవదూతల సైన్యమంతటిపై యెహోవా ఆయనను అధిపతిగా నియమించాడు. ఈ ప్రధానదూత, సహాయానికి నిజంగా శక్తిమంతమైన మూలాధారం. ఏయే విధాలుగా?
9 వృద్ధ అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “ఎవడైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు.” (1 యోహాను 2:1) ప్రత్యేకంగా మనం పాపం చేసినప్పుడు యేసు మన ‘ఉత్తరవాదిగా’ ఉంటాడని యోహాను ఎందుకు సూచించాడు? మనం ప్రతీ రోజు పాపం చేస్తాం, ఆ పాపం మరణానికి దారితీస్తుంది. (ప్రసంగి 7:20; రోమీయులు 6:23) అయితే, యేసు మన పాపాలకు బలిగా తన ప్రాణం అర్పించాడు. ఆయనిప్పుడు మన పక్షాన మాట్లాడేందుకు కనికరంగల మన తండ్రి దగ్గర ఉన్నాడు. మనలో ప్రతి ఒక్కరికీ అలాంటి సహాయం అవసరం. మనం దానిని ఎలా అంగీకరించవచ్చు? మనం మన పాపాల విషయమై పశ్చాత్తాపపడి యేసు బలి ఆధారంగా క్షమాపణ కోరాలి. అంతేకాక, మనం అవే పాపాలను తిరిగి చేయకుండా ఉండాలి.
10 యేసు మన పక్షాన ప్రాణాలు అర్పించడమే కాక, మనకొక పరిపూర్ణ మాదిరి కూడా ఉంచాడు. (1 పేతురు 2:21) ఆయన మాదిరి మనకు మార్గనిర్దేశమిస్తూ, గంభీరమైన పాపం చేయకుండా, యెహోవా దేవునికి సంతోషం కలిగించేలా నడుచుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. అలాంటి సహాయం ఉన్నందుకు మనం సంతోషించడం లేదా? యేసు తన అనుచరులకు ఆదరణకర్త అనుగ్రహించబడతాడని వాగ్దానం చేశాడు.
పరిశుద్ధాత్మ ద్వారా సహాయం
11 యేసు ఇలా వాగ్దానం చేశాడు: “నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును. లోకము ఆయనను . . . పొందనేరదు.” (యోహాను 14:16, 17) ఈ “సత్యస్వరూపియగు ఆత్మ” లేదా పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి కాదుగాని యెహోవాయొక్క చురుకైన శక్తి. దాని శక్తి అపరిమితం. విశ్వాన్ని సృష్టించడానికి, అద్భుతాలు జరిగించడానికి, ఆయన చిత్తం గురించిన దర్శనాలు ఇవ్వడానికి యెహోవా ఈ శక్తినే ఉపయోగించాడు. నేడు యెహోవా అలాంటి ప్రత్యేక రీతుల్లో తన ఆత్మను ఉపయోగించడం లేదు కాబట్టి, దాని అవసరం మనకు లేదని దానర్థమా?
12 ఎంతమాత్రం కాదు. ఈ ‘అపాయకరమైన కాలాల్లో’ మనకు ఇంకా ఎక్కువగా యెహోవా ఆత్మ సహాయం 2 తిమోతి 3:1) పరీక్షలను సహించేలా అది మనలను బలపరుస్తుంది. యెహోవాకు, మన ఆధ్యాత్మిక సహోదర సహోదరీలకు మనల్ని సన్నిహితం చేసే చక్కని లక్షణాలు అలవరచుకోవడానికి అది మనకు సహాయం చేస్తుంది. (గలతీయులు 5:22) కానీ యెహోవా అనుగ్రహించే ఈ అద్భుతమైన సహాయం నుండి మనమెలా ప్రయోజనం పొందవచ్చు?
అవసరం. (13 మొదట మనం పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించాలి. యేసు ఇలా చెప్పాడు: “మీరు చెడ్డవారైయుండియు, మీ పిల్లలకు మంచి యీవులనియ్య నెరిగియుండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును.” (లూకా 11:13) అవును, యెహోవా సర్వోత్తమ తండ్రి. మనం విశ్వాసంతో నిష్కపటంగా పరిశుద్ధాత్మ కోసం ఆయనను అర్థించినప్పుడు, ఆయన ఈ వరాన్ని మనకు తప్పకుండా ఇస్తాడు. కాబట్టి ప్రశ్నేమంటే, మనం దానికోసం అర్థిస్తున్నామా? మన దైనందిన ప్రార్థనల్లో మనమీ విన్నపం చేయాలి.
14 రెండవది, ఆ వరానికి అనుగుణంగా పని చేయడం ద్వారా మనం దానిని అంగీకరిస్తాం. ఉదాహరణకు: అశ్లీల దృశ్యాలు చూడాలనే దురలవాటుతో ఒక క్రైస్తవుడు పోరాడుతున్నాడనే అనుకుందాం. ఈ దురలవాటును మానుకోవాలని ఆయన పరిశుద్ధాత్మ సహాయం కోసం ప్రార్థించాడు. క్రైస్తవ పెద్దలను సలహా అడిగినప్పుడు, అలాంటి నీచమైన వాటి దరిదాపులకు కూడా పోకూడదనే నిర్ణయాత్మక చర్య తీసుకొమ్మని వారు సలహా ఇచ్చారు. (మత్తయి 5:29) అప్పుడాయన వారి సలహాను పెడచెవినబెట్టి, శోధన కలిగినప్పుడల్లా అలాంటి దృశ్యాలు చూస్తూవుంటే అప్పుడేమిటి? ఆయన పరిశుద్ధాత్మ సహాయం కోసం తాను చేసిన ప్రార్థనకు అనుగుణంగా పనిచేస్తున్నాడా? లేక దేవుని ఆత్మను దుఃఖపరుస్తూ, దానిని పోగొట్టుకునే సాహసం చేస్తున్నాడా? (ఎఫెసీయులు 4:30) యెహోవా నుండి ఈ అద్భుతమైన సహాయాన్ని ఎల్లప్పుడూ పొందడానికి మనమందరం నిజానికి శాయశక్తులా కృషి చేయాలి.
దేవుని వాక్యం ద్వారా సహాయం
15 ఎన్నో శతాబ్దాలుగా యెహోవా నమ్మకమైన సేవకులకు బైబిలు సహాయకరంగా ఉంది. పరిశుద్ధ లేఖనాలను తేలికగా తీసుకొనే బదులు, అవి ఎంత శక్తిమంతమైన సహాయకంగా ఉంటాయో మనం గుర్తుంచుకోవాలి. ఆ సహాయాన్ని అంగీకరించడంలో ప్రయత్నం ఇమిడివుంది. బైబిలు చదవడాన్ని మన దినచర్యలో భాగంగా చేసుకోవాలి.
16 దైవభక్తిగల వ్యక్తి ‘యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానిస్తాడు. అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును, అతడు చేయునదంతయు సఫలమగును’ అని కీర్తన 1:2, 3 చెబుతోంది. ఆ మాటల్లోని ముఖ్య భావాన్ని మీరు గ్రహించారా? ఆ మాటలను చదివి, అవి కేవలం ఒక ప్రశాంత దృశ్యాన్ని అంటే నది ఒడ్డున పెరుగుతున్న నీడనిచ్చే చెట్టును అందంగా వర్ణిస్తున్నాయని చెప్పడం తేలికే. అలాంటి ప్రదేశంలో మధ్యాహ్నం ఓ కునుకు తీయడం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో కదా! అయితే ఈ కీర్తన మనం విశ్రాంతి గురించి తలంచాలని కోరడం లేదు. బదులుగా అది కష్టపడి పనిచేయడాన్ని సూచించే విభిన్నమైన దృశ్యాన్ని చిత్రీకరిస్తోంది. ఏ విధంగా?
17 ఆ చెట్టు నది ఒడ్డున యాదృచ్ఛికంగా పెరుగుతున్న నీడనిచ్చే చెట్టు మాత్రమే కాదని గమనించండి. అది ఫలమిచ్చే చెట్టు, ఉద్దేశపూర్వకంగా ఎంచుకున్న ఆ ప్రదేశంలో అంటే “నీటికాలువల యోరను” ‘నాటబడింది.’ ఒకే చెట్టు అనేక నీటికాలువల దగ్గర ఎలా పెరగగలదు? ఒక పండ్లతోటలో తోటమాలి ఆ చెట్ల మొదళ్లకు నీరందేలా అనేక కాలువలు
త్రవ్వవచ్చు. ఇప్పుడు విషయం స్పష్టం! ఆధ్యాత్మిక భావంలో మనం కూడా ఆ చెట్టులా బలంగా పెరుగుతున్నామంటే, దానికి కారణం మన పక్షాన ఎవరో కష్టపడి పనిచేశారు. సత్యమనే స్వచ్ఛమైన నీటిని మన దగ్గరకే తీసుకొచ్చే సంస్థతో మనం సహవసిస్తున్నాం, అయితే మన వంతు మనం చేయాలి. ఈ ప్రశస్తమైన నీటిని పీల్చుకునే స్థానంలో మనలను మనం ఉంచుకొని, దేవుని వాక్య సత్యాలు మన మనస్సులోకి, హృదయాల్లోకి చేరేలా వాటిని ధ్యానిస్తూ, పరిశోధిస్తూ ఉండాలి. అలా, మనం కూడా చక్కని ఫలాలు ఫలిస్తాం.18 బైబిలును తెరవకుండా షెల్ఫులో పెడితే అది మనకెలాంటి మేలూ చేయదు. లేదా మనం కళ్లు మూసుకొని బైబిలు తెరిచి, ఎదురుగా కనబడిన పేజీలో మన ప్రశ్నకు జవాబు లభిస్తుందనుకోవడానికి అది తాయెత్తో లేక రక్షరేకో కాదు. మనం నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు, దాచిపెట్టబడిన ధనం కోసం వెదకినట్లు, “దేవుని గూర్చిన విజ్ఞానము” కోసం మనం వెదకాలి. (సామెతలు 2:1-5) మన నిర్దిష్టమైన అవసరాలకు తగిన లేఖన సలహాను కనుగొనేందుకు తరచూ పట్టుదలతో, శ్రద్ధతో పరిశోధించడం అవసరం. మన పరిశోధనకు సహాయం చేసే బైబిలు ఆధారిత సాహిత్యాలు మన దగ్గర చాలావున్నాయి. దేవుని వాక్యంలోని జ్ఞాన రత్నాలకోసం మనం ఆసక్తితో అన్వేషిస్తున్నప్పుడు, మనం యెహోవా సహాయం నుండి నిజంగా ప్రయోజనం పొందుతాం.
తోటి విశ్వాసుల ద్వారా సహాయం
19 యెహోవాకు చెందిన మానవ సేవకులు అన్ని సందర్భాల్లోనూ పరస్పర సహాయానికి మూలంగా ఉన్నారు. ఈ విషయంలో యెహోవాలో మార్పువచ్చిందా? ఎంత మాత్రం రాలేదు. తోటి విశ్వాసుల నుండి సరైన సమయంలో అవసరమైన సహాయం పొందిన సందర్భాలను మనలో ప్రతీ ఒక్కరం గుర్తుతెచ్చుకోగలం. ఉదాహరణకు, మీకు అవసరమైనప్పుడు ఓదార్పునిచ్చిన, లేదా ఒకానొక సమస్యను పరిష్కరించుకోవడానికో మీ విశ్వాసానికి ఎదురైన పరీక్షను ఎదుర్కోవడానికో మీకు కావలసిన సహాయాన్నిచ్చిన కావలికోట లేదా తేజరిల్లు! పత్రికలలోని ఏవైనా ఆర్టికల్‌లను మీరు గుర్తు తెచ్చుకోగలరా? యెహోవా మీకు ఆ సహాయాన్ని “తగినవేళ అన్నము పెట్టుటకు” నియమించబడిన “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు[ని]” ద్వారా అందించాడు.—మత్తయి 24:45-47.
20 అయితే సాధారణంగా తోటి విశ్వాసుల నుండి మనకు లభించే సహాయం సూటిగా ఉంటుంది. ఒక క్రైస్తవ పెద్ద మన హృదయాన్ని స్పృశించే ప్రసంగం ఇవ్వవచ్చు లేదా కష్ట సమయంలో మనకు సహాయపడేలా ఆయన కాపరి సందర్శనమే చేయవచ్చు లేదా ఒక బలహీనతను చూసి దానిని అధిగమించేందుకు సహాయకరమైన సలహాను ఆయన ప్రేమతో మనకు ఇవ్వవచ్చు. ఒక పెద్ద ఇచ్చిన సహాయం గురించి ఒక క్రైస్తవురాలు కృతజ్ఞతా పూర్వకంగా ఇలా వ్రాసింది: “క్షేత్ర సేవలో నా భావాలను వ్యక్తంచేసేలా ఎఫెసీయులు 4:8.
ఆయన నన్ను ప్రోత్సహించారు. దానికి ముందు రాత్రే నేను నా మనస్సులోని భావాలను చెప్పుకుంటే వినే మనిషి కోసం యెహోవాకు ప్రార్థించాను. మరుసటి రోజే, ఈ సహోదరుడు సానుభూతితో నాతో మాట్లాడాడు. అనేక సంవత్సరాలుగా యెహోవా నాకెలా సహాయం చేస్తున్నాడో అర్థం చేసుకోవడానికి ఆయన నాకు సహాయం చేశాడు. నా దగ్గరకు ఈ పెద్దను పంపినందుకు నేను యెహోవాకు కృతజ్ఞురాలిని.” అలా అనేక విధాలుగా క్రైస్తవ పెద్దలు, జీవమార్గంలో మనం కొనసాగేలా సహాయం చేయడానికి యేసుక్రీస్తు ద్వారా యెహోవా దయచేసిన ‘మనుష్యులకు అనుగ్రహించబడిన ఈవులుగా’ తమనుతాము నిరూపించుకుంటారు.—21 పెద్దలే కాక, నమ్మకమైన ప్రతీ క్రైస్తవుడు “తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను” అని ఇవ్వబడిన ప్రేరేపిత ఆజ్ఞను అన్వయించుకోవాలని కోరుకుంటాడు. (ఫిలిప్పీయులు 2:4) ఆ సలహాను క్రైస్తవ సంఘ సభ్యులు అన్వయించుకున్నప్పుడు, ఉత్తేజకరమైన దయగల క్రియలు కనబడతాయి. ఉదాహరణకు, ఒక కుటుంబం ఒక్కసారిగా అనేక విషాదకర సంఘటనలు ఎదుర్కొంది. తండ్రి కూతురును తీసుకొని బజారుకు వెళ్లాడు. ఇంటికి తిరిగి వస్తుండగా, కారు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో కూతురు చనిపోగా, తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన కొత్తలో తాను సొంతగా ఏ పనులూ చేసుకోలేని స్థితిలో ఉన్నాడు. ఆయన భార్య ఆయనకు సహాయం చేయలేనంతగా మానసికంగా కృంగిపోయింది. అందువల్ల సంఘంలోని ఒక జంట దుఃఖిస్తున్న వారిద్దరిని తమ ఇంటికి తీసుకెళ్లి వారికి అనేక వారాలపాటు సపర్యలు చేశారు.
22 దయాపూర్వక క్రియలన్నిటికి అలాంటి విషాదం, వ్యక్తిగత త్యాగం అవసరం కాకపోవచ్చు. మనకు అందే సహాయం కొన్నిసార్లు చాలా తక్కువ స్థాయిలో ఉండవచ్చు. ఆ దయ ఎంత కొద్దిపాటిదైనా మనం దానిని కృతజ్ఞతతో స్వీకరిస్తాం కదా? ఒక సహోదరుడో లేక సహోదరో మీకు సరిగ్గా అవసరమైనప్పుడు మీతో దయగా మాట్లాడిన లేదా దయాపూర్వకంగా సహాయపడిన సమయాలు మీరు గుర్తుచేసుకోగలరా? యెహోవా తరచూ మన విషయంలో ఆ విధంగా శ్రద్ధ తీసుకుంటాడు.—సామెతలు 17:17; 18:24.
23 ఇతరులకు సహాయపడేలా యెహోవా మిమ్మల్ని ఉపయోగించుకోవాలని మీరు కోరుకుంటారా? ఆ ప్రత్యేక అవకాశం మీకు అందుబాటులో ఉంది. వాస్తవానికి, మీరు చేసే అలాంటి ప్రయత్నాన్ని యెహోవా విలువైనవిగా పరిగణిస్తాడు. ఆయన వాక్యం ఇలా చెబుతోంది: “బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును.” (సామెతలు 19:17) మన సహోదర సహోదరీలకు సహాయం చేయడంవల్ల మనకు చెప్పలేనంత ఆనందం లభిస్తుంది. (అపొస్తలుల కార్యములు 20:35) ఉద్దేశపూర్వకంగా వేరుండే వారికి, ఇవ్వడంలోని ఆనందమూ పుచ్చుకోవడంలోని ప్రోత్సాహమూ లభించవు. (సామెతలు 18:1) కాబట్టి, పరస్పరం పురికొల్పుకొనేలా క్రైస్తవ కూటాలకు క్రమంగా, నమ్మకంగా హాజరవుదాం.—హెబ్రీయులు 10:24, 25.
24 యెహోవా మనకు సహాయం చేసే మార్గాలను ధ్యానించడం ఆహ్లాదకరం కాదా? యెహోవా తన సంకల్పాలు నెరవేర్చడానికి అద్భుతకార్యాలు చేస్తున్న కాలంలో మనం నివసించకపోయినా, మనకేదో కొదువైనట్లు మనం భావించనవసరం లేదు. మనం నమ్మకంగా ఉండేలా యెహోవా మనందరికీ అవసరమైన సహాయాన్ని అనుగ్రహిస్తున్నాడనేదే నిజంగా ప్రాముఖ్యం. విశ్వాసంలో మనం కలిసి సహించినప్పుడు, యెహోవా చేసే, చరిత్రంతటిలోకి మహాద్భుతమైన, మహిమగల క్రియలను చూడడానికి మనం సజీవులుగా ఉంటాం. కాబట్టి “యెహోవావలననే నాకు సహాయము కలుగును” అనే 2005వ సంవత్సరపు వార్షిక వచనంలోని మాటలను ప్రతిధ్వనింపజేసేలా, యెహోవా ప్రేమపూర్వక సహాయాన్ని అంగీకరించి, దాని నుండి పూర్తి ప్రయోజనం పొందడానికి కృతనిశ్చయంతో ఉందాం.—కీర్తన 121:2.
మీ అభిప్రాయమేమిటి?
యెహోవా నేడు మనకు అవసరమైన సహాయాన్ని
• తన దూతల ద్వారా ఎలా అందిస్తాడు?
• తన పరిశుద్ధాత్మ ద్వారా ఎలా అందిస్తాడు?
• తన ప్రేరేపిత వాక్యం ద్వారా ఎలా అందిస్తాడు?
• తోటి విశ్వాసుల ద్వారా ఎలా అందిస్తాడు?
[అధ్యయన ప్రశ్నలు]
1, 2. మనం జీవితంలో యెహోవా సహాయాన్ని, మార్గదర్శకాన్ని అంగీకరించడం ఎందుకు ప్రాముఖ్యం?
3. ఈ చర్చలో మనమే ప్రశ్నలు పరిశీలిస్తాం?
4. దేవుని సేవకులు నేడు దేవదూతల మద్దతు విషయంలో ఎందుకు నమ్మకంతో ఉండవచ్చు?
5. నేడు ప్రకటనా పనిలో దేవదూతలు కూడా భాగం వహిస్తున్నారని బైబిలు ఎలా వివరిస్తోంది?
6, 7. (ఎ) మన ప్రకటనా పనికి దేవదూతలు మద్దతిస్తున్నారని ఏది సూచిస్తోంది? (బి) మనకు యెహోవా దూతల మద్దతు లభిస్తుందని మనమెలా నిశ్చయతతో ఉండవచ్చు?
8. యేసుకు పరలోకంలో ఎలాంటి ఉన్నత స్థానముంది, ఇది మనకెందుకు ధైర్యాన్నిస్తుంది?
9, 10. (ఎ) మనం పాపం చేసినప్పుడు యేసు మన ‘ఉత్తరవాదిగా’ ఎలా సహాయం చేస్తాడు? (బి) యేసు మాదిరిద్వారా మనమెలాంటి సహాయం పొందవచ్చు?
11, 12. యెహోవా పరిశుద్ధాత్మ అంటే ఏమిటి, అది ఎంత శక్తివంతమైనది, నేడు మనకు అది ఎందుకు అవసరం?
13, 14. (ఎ) యెహోవా తన ప్రజలకు ఇష్టపూర్వకంగా తన పరిశుద్ధాత్మను ఇస్తాడని మనమెందుకు నిశ్చయతతో ఉండవచ్చు? (బి) పరిశుద్ధాత్మ వరాన్ని మనం అంగీకరించడం లేదని ఎలాంటి క్రియ ద్వారా చూపించే అవకాశముంది?
15. బైబిలును మనం తేలికగా తీసుకోవడం లేదని ఎలా చూపించవచ్చు?
16, 17. (ఎ) దేవుని ధర్మశాస్త్రాన్ని చదవడంవల్ల కలిగే ప్రతిఫలాలను కీర్తన 1:2, 3 ఎలా వర్ణిస్తోంది? (బి) కీర్తన 1:3 కష్టపడి పనిచేయడాన్ని ఎలా చిత్రీకరిస్తోంది?
18. మన ప్రశ్నలకు బైబిలు సమాధానాలు కనుగొనేందుకు ఏమి చేయాలి?
19. (ఎ) కావలికోట, తేజరిల్లు! పత్రికల్లోని ఆర్టికల్‌లను తోటి విశ్వాసుల ద్వారా అందజేయబడిన సహాయంగా ఎందుకు దృష్టించవచ్చు? (బి) మన పత్రికల్లోని ఒకదానిలో వచ్చిన ఒక నిర్దిష్టమైన ఆర్టికల్ ద్వారా మీరెలా సహాయం పొందారు?
20. క్రైస్తవ పెద్దలు ‘మనుష్యులకు అనుగ్రహించబడిన ఈవులుగా’ ఏయే విధాలుగా నిరూపించుకుంటారు?
21, 22. (ఎ) సంఘస్థులు ఫిలిప్పీయులు 2:4లోని సలహాను అన్వయించుకున్నప్పుడు దాని ఫలితమెలా ఉంటుంది? (బి) కొద్దిపాటి దయాపూర్వక క్రియలు కూడా ఎందుకు ప్రాముఖ్యం?
23. పరస్పరం సహాయం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు యెహోవా దానిని ఎలా దృష్టిస్తాడు?
24. యెహోవా గతకాలపు అద్భుత క్రియలను చూడని కారణాన్నిబట్టి మనకేదో కొదువైనట్టు ఎందుకు భావించకూడదు?
[18వ పేజీలోని చిత్రం]
ప్రకటనా పనికి దేవదూతలు మద్దతు ఇస్తున్నారని తెలుసుకోవడం ప్రోత్సాహకరం
[21వ పేజీలోని చిత్రం]
మనకు అవసరమైన ఓదార్పును ఇచ్చేందుకు యెహోవా మన తోటి విశ్వాసుల్లో ఒకరిని ఉపయోగించవచ్చు