కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుణ్ణి అసంతోషపరిచే ఆచారాల విషయంలో జాగ్రత్తగా ఉండండి

దేవుణ్ణి అసంతోషపరిచే ఆచారాల విషయంలో జాగ్రత్తగా ఉండండి

దేవుణ్ణి అసంతోషపరిచే ఆచారాల విషయంలో జాగ్రత్తగా ఉండండి

ఆఫ్రికాలోని ఒక ఇంటి ఆవరణలో ఒక శవం పడుకోబెట్టి ఉంది. ఒకరి తర్వాత ఒకరు వచ్చి తమ సంతాపం వ్యక్తం చేసి ముందుకు వెళ్తుంటే, ఒక వృద్ధుడు మాత్రం ఆ శవం పక్కన ఆగాడు. ఆయన ఎంతో దుఃఖంతో, మరణించిన వ్యక్తి ముఖం దగ్గర దాగా వంగి, “నువ్వు వెళ్ళిపోతున్నావని నాకెందుకు చెప్పలేదు? నన్ను ఇలా ఒంటరివాడిని చేసి ఎందుకు వెళ్ళిపోయావు? ఇక నువ్వు తిరిగి అక్కడికి చేరుకున్నావు కాబట్టి, నాకు సహాయం చేస్తూనే ఉంటావా?” అని మాట్లాడడం ప్రారంభించాడు.

ఆఫ్రికాలోని మరో ప్రాంతంలో ఒక బాబు జన్మించాడు. ఎవ్వరూ ఆ బాబును చూడడానికి వీల్లేదు. కొంతకాలం గడిచిన తర్వాతే, ఆ బాబును ఇతరుల ఎదుటకు తీసుకువచ్చి మతాచారం ప్రకారం పేరు పెడతారు.

మరణించినవారితో మాట్లాడడం లేదా నవజాత శిశువును ఇతరులకు కనబడకుండా దాచిపెట్టడం వంటివి కొంతమందికి వింతగా అనిపించవచ్చు. అయితే కొన్ని సాంప్రదాయాలకూ సమాజాలకూ చెందినవారికి జననమరణాలపట్ల ఉండే దృక్కోణాలు, ఆ సమయాల్లో వారి ప్రవర్తన, మరణించినవారు నిజంగా మరణించలేదు కానీ ఎక్కడో బ్రతికేవున్నారనే బలమైన నమ్మకంచేత ప్రభావితం చేయబడతాయి.

ఆ నమ్మకం ఎంత బలమైనదంటే, దాదాపు జీవితపు అన్ని అంశాలకు సంబంధించిన ఆచారాల్లోనూ మతకర్మల్లోనూ అదొక ముఖ్య భాగంగా తయారయ్యింది. ఉదాహరణకు ఒక వ్యక్తి జీవితంలో పుట్టుక, యౌవనం, వివాహం, పిల్లలను కనడం, మరణంలాంటి ముఖ్యమైన ఘట్టాలు ఆ వ్యక్తిని పూర్వీకుల ఆత్మ సంబంధ లోకానికి తీసుకువెళ్లే ప్రయాణంలోని మజిలీలని లక్షలాదిమంది నమ్ముతారు. ఆ పూర్వీకుల ఆత్మ సంబంధ లోకానికి చేరుకున్న మృతుడు తాను విడిచి వచ్చిన వారి జీవితాలను ప్రభావితం చేస్తూ ఇంకా ముఖ్యమైన పాత్ర వహిస్తూనే ఉంటాడని నమ్మబడుతుంది. ఆ వ్యక్తి పునర్జన్మ ద్వారా తన జీవితాన్ని అలాగే కొనసాగించవచ్చనేది వారి నమ్మకం.

ఒక వ్యక్తి తన జీవితంలో ఒక దశ నుండి మరో దశకు సులభంగా వెళ్ళేలా చూడడానికి అనేక ఆచారాలు మతకర్మలు పాటించబడతాయి. మనలో అదృశ్యంగా ఉన్నదేదో మరణాన్ని తప్పించుకుంటుందనే నమ్మకం కారణంగానే ఆ ఆచారాలు పాటించబడతాయి. ఆ నమ్మకంతో సంబంధం ఉన్న ఎటువంటి ఆచారాలకైనా నిజ క్రైస్తవులు దూరంగా ఉంటారు. ఎందుకు?

మరణించినవారి స్థితి ఏమిటి?

మరణించినవారి స్థితిని బైబిలు స్పష్టంగా వివరిస్తోంది. అదిలా చెబుతోంది: “బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు . . . వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు. . . . నీవు పోవు పాతాళమునందు [మానవజాతి సామాన్య సమాధిలో] పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.” (ప్రసంగి 9:​5, 6, 10) దేవుని సత్యారాధకులు ఈ ప్రాథమిక బైబిలు సత్యాన్ని ఎంతోకాలంగా విలువైనదిగా పరిగణిస్తున్నారు. మానవుల్లో అమర్త్యమైనదేదీ లేదని వారు అర్థం చేసుకున్నారు. మృతుల ఆత్మలు ఉనికిలో ఉండవని కూడా వారు తెలుసుకున్నారు. (కీర్తన 146:⁠4) మరణించినవారికి తమ చుట్టూ జరుగుతున్నవి తెలుస్తాయనే, వారు జీవించివున్నవారిని ప్రభావితం చేయగలరనే నమ్మకంతో ముడిపడివున్న ఎలాంటి ఆచారానికైనా మతకర్మకైనా దూరంగా ఉండమని యెహోవా ప్రాచీన కాలాల్లో తన ప్రజలకు ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు.​—⁠ద్వితీయోపదేశకాండము 14:1; 18:9-13; యెషయా 8:19, 20.

మొదటి శతాబ్దపు క్రైస్తవులు కూడా అబద్ధ మత బోధలతో ముడిపడివున్న సాంప్రదాయక ఆచారాలకూ మతకర్మలకూ దూరంగా ఉండేవారు. (2 కొరింథీయులు 6:​15-17) నేడు యెహోవాసాక్షులు ఏ జాతికి, తెగకు, లేదా నేపథ్యానికి చెందినవారైనా కూడా మానవుల్లో అదృశ్యంగా ఉన్నదేదో మరణాన్ని తప్పించుకుంటుందనే అబద్ధ బోధతో ముడిపడివున్న సాంప్రదాయాలను, ఆచారాలను తృణీకరిస్తారు.

ఒకానొక ఆచారాన్ని పాటించాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి క్రైస్తవులమైన మనకు ఏమి సహాయం చేయగలదు? ఏ ఆచారాన్నైనా పాటించేముందు, దానికి మృతుల ఆత్మలు జీవించివున్నవారిని ప్రభావితం చేయగలవనే నమ్మకంవంటి లేఖనవిరుద్ధమైన బోధతో సంబంధముండే అవకాశం ఉందా అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. అంతేకాక మనం అలాంటి ఆచారాన్ని గానీ మతకర్మను గానీ పాటించడం, యెహోవాసాక్షుల నమ్మకాల గురించి వారి బోధల గురించి తెలిసినవారినెవరినైనా అభ్యంతరపరిచే అవకాశం ఉందా అని కూడా మనం ఆలోచించాలి. ఆ విషయాలను మనస్సులో ఉంచుకొని మనం రెండు ప్రాముఖ్యమైన అంశాలను అంటే జననానికి, మరణానికి సంబంధించిన అంశాలను పరిశీలిద్దాం.

జననానికి, నామకరణానికి సంబంధించిన ఆచారాలు

పిల్లలు పుట్టినప్పుడు పాటించే చాలా ఆచారాలు తగినవే. అయితే జననాన్ని, పూర్వీకుల ఆత్మ సంబంధ లోకంనుండి మానవ సమాజానికి మారడం అని దృష్టించే ప్రాంతాల్లో నిజ క్రైస్తవులు జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకు, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో నవజాత శిశువును ఇంట్లోనే ఉంచి కొంతకాలం వరకూ ఆ శిశువుకు పేరు పెట్టరు. అలా ఎంతకాలం వేచివుండాలి అనేది ప్రాంతాన్నిబట్టి మారుతుంది, అయితే ఆ సమయం ముగిసినప్పుడు నామకరణ ఆచారం జరుగుతుంది, అప్పుడు శిశువును బయటకు తీసుకువచ్చి స్నేహితులకు బంధువులకు చూపిస్తారు. ఆ సమయంలోనే శిశువు పేరు అధికారికంగా అందరికీ తెలియజేయబడుతుంది.

ఆ ఆచారానికివున్న ప్రాముఖ్యతను వివరిస్తూ ఘానా​—⁠అండర్‌స్టాండింగ్‌ ద పీపుల్‌ అండ్‌ దెయిర్‌ కల్చర్‌ అనే పుస్తకం ఇలా చెబుతోంది: “శిశువు జీవితంలోని మొదటి ఏడు రోజులు అతను భూమిని ‘సందర్శించే’ సమయమని, అది శిశువు ఆత్మ సంబంధ లోకంనుండి భూజీవితానికి మారుతున్న సమయమని పరిగణించబడుతుంది. . . . శిశువును సాధారణంగా ఇంట్లోనే ఉంచి, కుటుంబ సభ్యులు కానివారినెవ్వరిని ఆ శిశువును చూడడానికి అనుమతించరు.”

లాంఛనప్రాయంగా శిశువుకు పేరు పెట్టడానికి ముందు ఎందుకు కొంతకాలం వేచివుంటారు? ఘానా ఇన్‌ రెట్రోస్పెక్ట్‌ అనే పుస్తకం ఇలా వివరిస్తోంది: “ఎనిమిదవ రోజుకు ముందు శిశువు మనిషిగా పరిగణించబడడు. ఆ శిశువు ఇంకా తాను వదిలి వచ్చిన లోకంతోనే ముడిపడి ఉంటాడు.” ఆ పుస్తకం ఇంకా ఇలా చెబుతోంది: “శిశువుకు పెట్టబోయే పేరే ఆ శిశువును ఒక మనిషిగా గుర్తిస్తుంది కాబట్టి, తమ బిడ్డ చనిపోతాడేమో అనే సందేహం ఉన్న తల్లిదండ్రులు తమ బిడ్డ బ్రతికి ఉంటాడనే నమ్మకం కుదిరేవరకూ అతనికి పేరు పెట్టరు. . . . కాబట్టి బిడ్డను ఇతరులకు చూపించడం అని కూడా పిలువబడే ఈ మతకర్మ ఆ బిడ్డపై అతని తల్లిదండ్రులపై గొప్ప ప్రభావం చూపించగలదని నమ్మబడుతుంది. అది బిడ్డను మానవ ప్రపంచానికి ఆహ్వానించే మతకర్మ.”

అలా బిడ్డకు లాంఛనప్రాయంగా పేరు పెట్టేటప్పుడు ఒక కుటుంబ పెద్ద ఆచారాలను నడిపిస్తాడు. నామకరణం ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరుగుతుంది, దానిలో భాగంగా సాధారణంగా జలాంజలి అర్పించబడుతుంది, శిశువు క్షేమంగా చేరుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ పూర్వీకుల ఆత్మలకు ప్రార్థనలు చేయబడతాయి, ఇతర మతకర్మలు ఆచరించబడతాయి.

అయితే ఆ ఆచారంలో ప్రధానాంశం మాత్రం శిశువు పేరును ప్రకటించడమే. నిజానికి తమ శిశువుకు పేరు పెట్టవలసిన బాధ్యత తల్లిదండ్రులదే అయినా ఆ శిశువు కోసం పేరు ఎంపిక చేసే విషయంలో ఇతర బంధువులు బలమైన ప్రభావం చూపిస్తారు. కొన్ని పేర్లకు స్థానిక భాషలో సూచనార్థక భావాలు ఉండవచ్చు. ఉదాహరణకు “వెళ్ళి తిరిగివచ్చినవాడు,” “అమ్మ రెండోసారి వచ్చింది,” “నాన్న మళ్ళీ వచ్చాడు” వంటి అర్థాలుగల పేర్లు ఉంటాయి. ఇతర పేర్లకు, నవజాత శిశువును మళ్ళీ మృతుల లోకానికి తీసుకెళ్ళకుండా పూర్వీకులను నిరుత్సాహపరిచేందుకు రూపొందించబడిన భావాలుంటాయి.

శిశువు జన్మించినప్పుడు ఆనందించడంలో తప్పేమీ లేదు. శిశువుకు బంధువుల పేర్లు పెట్టడం, ఆ శిశువు పుట్టినప్పుడు ఉన్న పరిస్థితులను సూచించే పేరును పెట్టడం అంగీకారయోగ్యమైన సాంప్రదాయాలే, అలాగే శిశువుకు ఎప్పుడు పేరు పెట్టాలనేది కూడా వ్యక్తిగత నిర్ణయమే. అయితే దేవుణ్ణి సంతోషపరచాలనుకునే క్రైస్తవులు, నవజాత శిశువు పూర్వీకుల ఆత్మ సంబంధ లోకంనుండి మానవుల సమాజానికి వచ్చిన “సందర్శకుడు” అనే నమ్మకంతో తాము ఏకీభవిస్తున్నామనే అభిప్రాయమిచ్చే ఎలాంటి ఆచారాల్లోను మతకర్మల్లోను పాల్గొనకుండా జాగ్రత్తపడతారు.

అంతేకాకుండా సమాజంలోని చాలామంది నామకరణాన్ని ఒక దశనుండి మరో దశకు వెళ్ళడంలో చాలా ప్రాముఖ్యమైన ఆచారంగా దృష్టిస్తారు, కాబట్టి క్రైస్తవులు ఇతరుల మనస్సాక్షి గురించి కూడా ఆలోచించి తాము అవిశ్వాసులకు ఎలాంటి అభిప్రాయాన్నిస్తున్నాము అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఉదాహరణకు, ఒక క్రైస్తవ కుటుంబం తమ నవజాత శిశువును నామకరణ ఆచారం వరకూ ఇతరులకు చూపించకుండా ఇంట్లోనే ఉంచితే కొందరు వారి గురించి ఏమి భావించవచ్చు? అలాగే బైబిలు సత్యాన్ని బోధించేవారము అని వారు చెప్పుకునే దానికి విరుద్ధమైన పేర్లను పిల్లలకు పెట్టుకుంటే ఇతరులు ఏమి ఆలోచిస్తారు?

కాబట్టి తమ పిల్లలకు ఎప్పుడు ఎలా పేరు పెట్టాలి అని నిర్ణయించుకునేటప్పుడు క్రైస్తవులు ఇతరులకు అభ్యంతరం కలిగించేవారిగా ఉండకుండా “సమస్తమును దేవుని మహిమకొరకు” చేయడానికి కృషి చేస్తారు. (1 కొరింథీయులు 10:​31-33) వారు మరణించినవారి గౌరవార్థం ఉద్దేశించబడిన ‘పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను నిరాకరించరు.’ బదులుగా, వారు సజీవుడైన యెహోవా దేవునికి మహిమను ఘనతను ఇస్తారు.​—⁠మార్కు 7:9, 13.

మరణంనుండి జీవానికి

జననంలాగే మరణాన్ని కూడా చాలామంది ఒక పరివర్తనగా పరిగణిస్తారు; మరణించిన వ్యక్తి దృశ్యమైన లోకంనుండి మృతుల ఆత్మ సంబంధ అదృశ్య లోకానికి వెళతాడని వారు నమ్ముతారు. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఖచ్చితమైన అంత్యక్రియల ఆచారాలూ మతకర్మలూ పాటించకపోతే, జీవించివున్నవారిని శిక్షించే లేదా ఆశీర్వదించే శక్తిగల పూర్వీకుల ఆత్మలకు కోపం వస్తుందని చాలామంది నమ్ముతారు. అంత్యక్రియలు ఏర్పాటు చేయబడి నిర్వహించబడే విధానంపై ఆ నమ్మకం ఎంతో ప్రభావం చూపిస్తుంది.

మరణించినవారిని శాంతింపజేయడానికి ఉద్దేశించబడిన అంత్యక్రియల ఆచారాల్లో శవంముందు అతిగా విలపించడం అరవడం వంటివి చేయడంతోపాటు శవాన్ని పూడ్చిపెట్టిన తర్వాత ఆనందోత్సవాలు జరుపుకోవడం వరకూ ఎన్నో భావోద్రేకాలు ప్రదర్శించబడతాయి. అలాంటి అంత్యక్రియల ఆచారాల్లో హద్దులు లేకుండా తినడం, త్రాగడం, పెద్ద ధ్వనిగల సంగీతంతో నాట్యం చేయడం వంటివి ఉంటాయి. అంత్యక్రియలకు ఎంత ప్రాముఖ్యత ఇవ్వబడుతుందంటే నిరుపేద కుటుంబాలు కూడా “తగిన అంత్యక్రియలు” చేయించడానికి తాము అప్పులు చేయాల్సి వచ్చినా వెనుకాడకుండా ఎంతో కష్టపడి డబ్బు సమకూర్చడానికి కృషి చేస్తారు.

గడిచిన సంవత్సరాలన్నింటిలోనూ యెహోవాసాక్షులు అలాంటి అంత్యక్రియల ఆచారాలు లేఖన విరుద్ధమైనవని వెల్లడి చేస్తూనే ఉన్నారు. * ఆ ఆచారాల్లో శవజాగరణలు, ద్రవపదార్థాలను అర్పించడం, మరణించినవారితో మాట్లాడి కోరికలు కోరడం, అంత్యక్రియల వార్షికోత్సవాలను ఘనంగా జరుపుకోవడం, మానవుల్లో అదృశ్యంగా ఉండేదేదో మరణాన్ని తప్పించుకుంటుందనే నమ్మకంపై ఆధారపడిన అనేక ఇతర ఆచారాలు ఉంటాయి. దేవుణ్ణి అగౌరవపరిచే అలాంటి ఆచారాలు ‘అపవిత్రమైనవి,’ అవి దేవుని వాక్య సత్యంపై కాక “మనుష్యుల పారంపర్యాచారము”పై ఆధారపడిన ‘నిరర్థక తత్వ జ్ఞానమే.’​—⁠యెషయా 52:11; కొలొస్సయులు 2:⁠8.

ఆచారాలను పాటించాలనే ఒత్తిడి

సాంప్రదాయకమైన ఆచారాలను పాటించకుండా ఉండడం కొంతమందికి సవాలుగా మారింది, ప్రత్యేకించి మరణించినవారిని గౌరవించడం చాలా ప్రాముఖ్యం అని పరిగణించబడే దేశాల్లో నివసించేవారికి అది సవాలుగా ఉంది. యెహోవాసాక్షులు అలాంటి ఆచారాలను పాటించరు కాబట్టి వారు అనుమానాస్పద ప్రజలుగా, సంఘ వ్యతిరేకులుగా, మృతులను గౌరవించనివారిగా దృష్టించబడుతున్నారు. కొందరు బైబిలు సత్యాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నా కూడా ఇతరులనుండి వచ్చే విమర్శలు ఒత్తిళ్ళ కారణంగా తాము ఇతరులనుండి వేరుగా ఉన్నామని చూపించడానికి భయపడుతున్నారు. (1 పేతురు 3:​14) మరికొందరు ఈ ఆచారాలు తమ సంస్కృతిలో భాగం కాబట్టి వాటిని అసలు చేయకుండా ఉండడం అసాధ్యమని భావించారు. ఇంకా కొందరైతే ఆ ఆచారాలను పాటించడానికి నిరాకరిస్తే సమాజంలోనివారు దేవుని ప్రజలకు వ్యతిరేకంగా విద్వేషం పెంచుకుంటారని కూడా తర్కించారు.

నిజమే మనం అనవసరంగా ఇతరులను అభ్యంతరపెట్టాలని కోరుకోము. అయితే సత్యం పక్షాన స్థిరంగా నిలబడినప్పుడు దేవునినుండి వేరైపోయిన లోకం మనల్ని అంగీకరించదని బైబిలు హెచ్చరిస్తోంది. (యోహాను 15:18, 19; 2 తిమోతి 3:12; 1 యోహాను 5:​19) ఆధ్యాత్మిక అంధకారంలో ఉన్నవారినుండి మనం వేరుగా ఉండాలని మనకు తెలుసు కాబట్టి మనం సుముఖంగానే సత్యం పక్షాన స్థిరంగా నిలబడతాము. (మలాకీ 3:18; గలతీయులు 6:​12) దేవుణ్ణి అసంతోషపరిచే పని చేయమని సాతాను శోధించినప్పుడు యేసు ఆ శోధనను నిరోధించినట్లే మనం కూడా దేవుణ్ణి అసంతోషపరిచే విధంగా ప్రవర్తించమని చేయబడే ఒత్తిడిని నిరోధిస్తాము. (మత్తయి 4:​3-7) మనుష్యుల భయంచేత ప్రభావితం చేయబడడం కంటే నిజ క్రైస్తవులు యెహోవా దేవుణ్ణి సంతోషపరచడానికి, సత్య దేవునిగా ఆయనను ఘనపరచడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. వారు ఇతరులనుండి వచ్చే ఒత్తిడి కారణంగా పరిశుద్ధ ఆరాధనకు సంబంధించిన బైబిలు ప్రమాణాల విషయంలో రాజీపడకుండా ఉండడం ద్వారా అలా చేస్తారు.​—⁠సామెతలు 29:25; అపొస్తలుల కార్యములు 5:29.

మృతులను మనం దృష్టించే విధానాన్నిబట్టి యెహోవాను ఘనపరచడం

మన ప్రియమైనవారు చనిపోతే తీవ్రంగా బాధపడడం దుఃఖించడం సహజమే. (యోహాను 11:​33, 35) చనిపోయినవారి జ్ఞాపకాలను విలువైనవాటిగా ఎంచడం, వారికి గౌరవప్రదమైన అంత్యక్రియలను జరిపించడం వారిపట్ల మనకున్న ప్రేమకు తగిన వ్యక్తీకరణలే. అయితే యెహోవాసాక్షులు తమ ప్రియమైన వారు మరణించడంవల్ల కలిగే తీవ్రమైన దుఃఖాన్ని, దేవుణ్ణి అసంతోషపరిచే సాంప్రదాయక ఆచారాలు చేయకుండానే సహిస్తారు. చనిపోయినవారు తమకు హాని తలపెట్టగలరని భయపడే సంస్కృతులలో పెరిగినవారికి అది కష్టంగానే ఉండవచ్చు. ప్రియమైనవారు చనిపోయినందుకు మనం భావోద్వేగపరంగా బాధపడుతున్నప్పుడు సమతుల్యతను కాపాడుకోవడం సవాలుగా ఉండవచ్చు. అయితే నమ్మకమైన క్రైస్తవులు “సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు” అయిన యెహోవా ద్వారా బలపర్చబడతారు, తోటి విశ్వాసుల ప్రేమపూర్వకమైన మద్దతునుండి ప్రయోజనం పొందుతారు. (2 కొరింథీయులు 1:​3, 4) దేవుని జ్ఞాపకంలో ఉన్న మృతులు ఒకరోజు తిరిగి బ్రదికించబడతారని బలంగా నమ్మడం, పునరుత్థానం వాస్తవమైన నిరీక్షణ కాదని చూపించే క్రైస్తవేతర అంత్యక్రియల ఆచారాలకు పూర్తిగా దూరంగా ఉండడానికి నిజ క్రైస్తవులకు సహాయం చేస్తుంది.

యెహోవా మనల్ని “చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి” పిలిచినందుకు మనం సంతోషంగా లేమా? (1 పేతురు 2:⁠9) పిల్లలు పుట్టినప్పుడు ఆనందాన్ని, ప్రియమైనవారు మరణించినప్పుడు దుఃఖాన్ని అనుభవించేటప్పుడు, సరైనదే చేయాలనే మన గాఢమైన కోరిక మరియు యెహోవా దేవునిపట్ల మనకున్న ప్రేమ ఎల్లప్పుడూ మనం “వెలుగు సంబంధులవలె నడుచుకొనడానికి” మనల్ని కదిలిస్తూ ఉండును గాక. దేవుణ్ణి అసంతోషపరిచే క్రైస్తవేతర ఆచారాల ద్వారా ఎన్నడూ ఆధ్యాత్మికంగా కలుషితం కాకుండా ఉందాము.​—⁠ఎఫెసీయులు 5:⁠8.

[అధస్సూచి]

^ పేరా 23 యెహోవాసాక్షులు ప్రచురించిన మృతుల ఆత్మలు—అవి మీకు సహాయపడగలవా లేక హాని తలపెట్టగలవా? అవి నిజంగా ఉనికిలో ఉన్నాయా? (ఆంగ్లం), నిత్యజీవానికి నడిపించే మార్గము​—⁠మీరు దానిని కనుగొన్నారా? (ఆంగ్లం) అనే బ్రోషుర్‌లను చూడండి.