దేవునిపట్ల ఉన్న ప్రేమతో ఐక్యమవడం
దేవునిపట్ల ఉన్న ప్రేమతో ఐక్యమవడం
మన సామాన్య శకంలోని మొదటి శతాబ్దంలో క్రైస్తవ సంఘం రూపొందించబడినప్పుడు దాని అసాధారణ లక్షణాల్లో ఒకటి ఐక్యత. దాని సభ్యులు విభిన్న సంస్కృతులకు చెందినవారైనా వారి మధ్య ఐక్యత ఉండేది. ఆ సత్యదేవుని ఆరాధకులు ఆసియా, యూరప్, ఆఫ్రికా ఖండాలలోని దేశాలనుండి వచ్చారు. వారు మతనాయకులు, సైనికులు, బానిసలు, శరణార్థులు, వర్తకులు, నిపుణులు, వ్యాపారస్థులు వంటి భిన్నమైన నేపథ్యాలకు చెందినవారు. వారిలో కొందరు యూదులైతే మిగతావారు అన్యమతస్థులు. వారిలో చాలామంది పూర్వం వ్యభిచారులుగా, స్వలింగ సంపర్కులుగా, త్రాగుబోతులుగా, దొంగలుగా, దోచుకునేవారిగా ఉండేవారు. అయితే వారు క్రైస్తవులుగా మారినప్పుడు తమ చెడు అలవాట్లు మానుకొని విశ్వాసంలో ఐక్యమయ్యారు.
మొదటి శతాబ్దపు క్రైస్తవత్వం ఈ ప్రజలందరినీ ఎలా ఐక్యపరచగలిగింది? వారు ఒకరితో ఒకరే కాక బయటి ప్రజలతో కూడా శాంతియుతంగా ఎలా ఉండగలిగారు? వారు తిరుగుబాట్లలో, పోరాటాల్లో ఎందుకు పాల్గొనలేదు? తొలి క్రైస్తవత్వం నేటి ప్రధాన మతాలకు ఎందుకు అంత భిన్నంగా ఉండేది?
సంఘ సభ్యులను సన్నిహితం చేసినదేమిటి?
మొదటి శతాబ్దంలో తోటి విశ్వాసులను ఐక్యపరచిన మొదటి అంశం, దేవునిపట్ల వారికున్న ప్రేమ. ఆ క్రైస్తవులు సత్య దేవుడైన యెహోవాను తమ పూర్ణ హృదయంతో, 1 కొరింథీయులు 1:10; మత్తయి 22:37; అపొస్తలుల కార్యములు 10:1-35.
ఆత్మతో, మనస్సుతో ప్రేమించవలసిన తమ ప్రాథమిక బాధ్యతను గుర్తించారు. ఉదాహరణకు యూదా మతస్థుడు, అపొస్తలుడు అయిన పేతురుకు, ఒక అన్య దేశస్థుడిని సందర్శించమని చెప్పబడింది, మామూలుగా అయితే పేతురు అలాంటి వ్యక్తితో సన్నిహితంగా సహవసించి ఉండేవాడు కాదు. తనకు చెప్పబడినదానిని చేసేందుకు యెహోవాపట్ల ఆయనకున్న ప్రేమే ఆయనను కదిలించింది. పేతురు, ఇతర తొలి క్రైస్తవులు దేవుని వ్యక్తిత్వం గురించిన, ఆయన ఇష్టాయిష్టాల గురించిన ఖచ్చితమైన జ్ఞానం ఆధారంగా దేవునితో సన్నిహిత సంబంధం ఏర్పరచుకున్నారు. ఆ ఆరాధకులందరూ తాము ‘యేక మనస్సుతో యేకతాత్పర్యముతో సన్నద్ధులై ఉండాలనేది’ యెహోవా చిత్తమని అర్థం చేసుకున్నారు.—ఆ విశ్వాసులు యేసుక్రీస్తుపై తమకున్న విశ్వాసం ద్వారా మరింత సన్నిహితమయ్యారు. వారు యేసు అడుగుజాడల్లో జాగ్రత్తగా నడుచుకోవాలని కోరుకున్నారు. ఆయన వారికిలా ఆజ్ఞాపించాడు: “నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను. మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు.” (యోహాను 13:34, 35) యేసు మాట్లాడింది పైపైన చూపించే ప్రేమ గురించి కాదుగానీ స్వయం త్యాగపూరిత ప్రేమ గురించి. అలాంటి ప్రేమ చూపించడంవల్ల కలిగే ఫలితమేమిటి? యేసు తనపై విశ్వాసముంచేవారి గురించి ఇలా ప్రార్థించాడు: “తండ్రీ, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున, వారును మనయందు ఏకమైయుండవలెనని . . . ప్రార్థించుచున్నాను.”—యోహాను 17:20, 21; 1 పేతురు 2:21.
యెహోవా తన నిజమైన సేవకులపై పరిశుద్ధాత్మను అంటే తన చురుకైన శక్తిని కుమ్మరించాడు. పరిశుద్ధాత్మ వారిని ఐక్యపరచింది. బైబిలు బోధలను అర్థం చేసుకోవడానికి అది వారికి సహాయం చేసింది, దాన్ని అన్ని సంఘాలకు చెందినవారు అంగీకరించారు. యెహోవా ఆరాధకులు ఒకే సందేశాన్ని అంటే మానవాళిపై పరిపాలించే పరలోక ప్రభుత్వమైన దేవుని మెస్సీయ రాజ్యం ద్వారా యెహోవా నామం పరిశుద్ధపరచబడుతుంది అనే సందేశాన్ని ప్రకటించారు. తాము ‘ఈ లోకసంబంధులుగా’ ఉండకూడదనే విషయాన్ని తొలి క్రైస్తవులు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇతర పౌరులు తిరుగుబాటు చేసినప్పుడు లేదా సైనిక పోరాటాలు జరిగినప్పుడు క్రైస్తవులు తటస్థంగా నిలబడ్డారు. వారు అందరితోనూ శాంతియుతంగా ఉన్నారు.—యోహాను 14:26; 18:36; మత్తయి 6:9, 10; అపొస్తలుల కార్యములు 2:1-4; రోమీయులు 12:17-21.
ఐక్యతను ప్రోత్సహించవలసిన తమ బాధ్యతను విశ్వాసులందరూ స్వీకరించారు. ఎలా? తమ ప్రవర్తన బైబిలుకు అనుగుణంగా ఉండేలా నిశ్చయపరచుకోవడం ద్వారా. అందుకే అపొస్తలుడైన పౌలు క్రైస్తవులకు ఇలా వ్రాశాడు: ‘మునుపటి ప్రవర్తన విషయములోనైతే మీ ప్రాచీనస్వభావమును వదులుకొని నవీనస్వభావమును ధరించుకొనండి.’—ఎఫెసీయులు 4:22-32.
ఐక్యతను కాపాడుకున్నారు
అయితే మొదటి శతాబ్దపు విశ్వాసులు కూడా అపరిపూర్ణులే, అందువల్ల వారి ఐక్యతను ప్రమాదంలో పడేసే పరిస్థితులు అప్పుడప్పుడు తలెత్తాయి. ఉదాహరణకు, గ్రీకు మాట్లాడే యూదా క్రైస్తవులకు హీబ్రూ మాట్లాడే యూదా క్రైస్తవులకు మధ్య విభేదం పుట్టిందని అపొస్తలుల కార్యములు 6:1-6 వచనాలు చెబుతున్నాయి. గ్రీకు మాట్లాడేవారు తాము వివక్షకు గురవుతున్నట్లు భావించారు. ఆ విషయం గురించి అపొస్తలులకు తెలియజేయబడినప్పుడు వారు వెంటనే దానిని నిష్పక్షపాతంగా పరిష్కరించారు. ఆ తర్వాత ఒక సిద్ధాంతానికి సంబంధించిన ప్రశ్న కారణంగా క్రైస్తవ సంఘంలోని యూదేతరుల బాధ్యతలకు సంబంధించిన వివాదం తలెత్తింది. బైబిలు సూత్రాల ఆధారంగా ఒక నిర్ణయం తీసుకోబడింది, ఆ నిర్ణయాన్ని అన్ని సంఘాలూ అంగీకరించాయి.—అపొస్తలుల కార్యములు 15:1-29.
మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘంలో తలెత్తిన అభిప్రాయభేదాలు జాతిపరమైన విభేదాలకు గానీ సిద్ధాంతపరమైన దృక్కోణాలను పట్టుకు వేలాడడం ద్వారా ఐక్యత
చెడిపోవడానికి గానీ దారితీయలేదని ఈ ఉదాహరణలు చూపిస్తున్నాయి. ఎందుకు అలా జరగలేదు? ఎందుకంటే యెహోవాపట్ల ప్రేమ, యేసుక్రీస్తుపై విశ్వాసం, ఒకరిపట్ల ఒకరికి స్వయం త్యాగపూరిత ప్రేమ ఉండడం, పరిశుద్ధాత్మ ఇచ్చే మార్గదర్శకాన్ని స్వీకరించడం, బైబిలు బోధలను ఒకేలా అర్థం చేసుకోవడం, తమ ప్రవర్తనను మార్చుకోవడానికి సుముఖంగా ఉండడం వంటి అంశాలు తొలి సంఘాన్ని ఐక్యంగాను శాంతియుతంగాను ఉంచడంలో సమర్థవంతంగా పనిచేశాయి.ఆధునిక కాలాల్లో ఆరాధనలో ఐక్యమవడం
నేడు కూడా అదేవిధంగా ఐక్యత సాధించవచ్చా? అవే సంగతులు ఇప్పుడు కూడా ఒకే విశ్వాసంగల ప్రజలను ఐక్యపరచి, ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు చెందిన అన్ని జాతులకు చెందిన ప్రజలతో శాంతియుతంగా ఉండడానికి సహాయం చేయగలవా? తప్పకుండా చేయగలవు! యెహోవాసాక్షులు 230 కంటే ఎక్కువ దేశాలు, ద్వీపాలు, ప్రాంతాలకు విస్తరించిన అంతర్జాతీయ సహోదరత్వంలో ఐక్యపరచబడివున్నారు. మొదటి శతాబ్దంలోని క్రైస్తవులను ఐక్యపరచిన అంశాలే వారిని కూడా ఐక్యపరిచాయి.
యెహోవాసాక్షులు అనుభవిస్తున్న ఐక్యతకు, యెహోవా దేవునిపట్ల వారికున్న భక్తే ముఖ్య కారణం. వారు అన్ని పరిస్థితుల్లోనూ ఆయనకు నమ్మకంగా ఉండడానికి కృషి చేస్తారు. యెహోవాసాక్షులు యేసుక్రీస్తుపై ఆయన బోధలపై కూడా విశ్వాసముంచుతారు. ఈ క్రైస్తవులు తోటి విశ్వాసులపట్ల స్వయం త్యాగపూరిత ప్రేమ చూపించి తాము ప్రకటిస్తున్న దేశాలన్నింటిలోనూ దేవుని రాజ్యానికి సంబంధించిన ఒకే సువార్తను అందజేస్తారు. వారు ఆ రాజ్యం గురించి అన్ని మతాలకు, జాతులకు, దేశాలకు, సామాజిక గుంపులకు చెందిన ప్రజలతో మాట్లాడడానికి సుముఖంగా ఉంటారు. యెహోవాసాక్షులు లౌకిక వ్యవహారాల్లో తటస్థంగా కూడా ఉంటారు, అది మానవాళిని విభజించే రాజకీయ, సాంస్కృతిక, సామాజిక, వాణిజ్యపరమైన ప్రభావాలకు లోనవకుండా ఉండేలా వారికి సహాయం చేస్తుంది. సాక్షులందరూ బైబిలు ప్రమాణాలకు అనుగుణంగా జీవించడం ద్వారా ఐక్యతను ప్రోత్సహించవలసిన తమ బాధ్యతను స్వీకరిస్తారు.
ఐక్యత ఇతరులను ఆకర్షిస్తుంది
అలాంటి ఐక్యత తరచూ సాక్షులు కాని ప్రజల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఉదాహరణకు, ఐల్జే * ఒకప్పుడు జర్మనీలోని ఒక కాన్వెంట్‌లో క్యాథలిక్కు మత సన్యాసినిగా ఉండేది. ఆమె యెహోవాసాక్షులవైపు ఎందుకు ఆకర్షించబడింది? ఐల్జే ఇలా చెబుతోంది: “వారు చాలా మంచి ప్రజలు. వారు యుద్ధం చేయరు; ఎవ్వరికీ ఎలాంటి హానీ చేయరు. దేవుని రాజ్యాధికారం క్రింద భూపరదైసుపై ప్రజలు సంతోషంగా జీవించేలా సహాయం చేయాలని వారు కోరుకుంటారు.”
రెండవ ప్రపంచ యుద్ధమప్పుడు ఫ్రాన్స్‌కు పంపించబడిన జర్మన్ సైనికుడు గుంటర్‌ది మరొక ఉదాహరణ. ఒకరోజు గుంటర్ విభాగంలోని సైనికుల కోసం ఒక ప్రొటస్టెంట్ ప్రీస్టు మతసంబంధమైన కూటాన్ని నిర్వహించాడు. ఆ ప్రీస్టు దేవుని సహాయం కోసం, రక్షణ కోసం, విజయం కోసం ప్రార్థించాడు. ఆ కూటం ముగిసిన తర్వాత గుంటర్ కాపలా కోసం తనకు నియమించబడిన స్థలానికి వెళ్ళి నిలబడ్డాడు. ఆయన తన దుర్భిణితో చూసినప్పుడు, యుద్ధరంగంలో ఆవలివైపున ఉన్న శత్రు సైనికులు కూడా ఒక ప్రీస్టు నిర్వహిస్తున్న మత కూటానికి హాజరవడం కనిపించింది. ఆ తర్వాత గుంటర్ ఇలా చెప్పాడు: “ఆ ప్రీస్టు కూడా దేవుని సహాయం కోసం, రక్షణ కోసం, విజయం కోసం ప్రార్థించివుంటాడు. క్రైస్తవ చర్చీలు ఒకే యుద్ధంలో వ్యతిరేక వర్గాల పక్షాన ఉండడం ఎలా సాధ్యం అని నేను ఆలోచించాను.” ఆ తలంపులు గుంటర్ మనస్సులో బలంగా నాటుకున్నాయి. ఆ తర్వాత, యుద్ధంలో పాలుపంచుకోని యెహోవాసాక్షులను కలుసుకున్నప్పుడు గుంటర్ కూడా వారి అంతర్జాతీయ సహోదరత్వంలో భాగమయ్యాడు.
అశోక్, ఫీమా తూర్పు దేశాల మతానికి చెందినవారు. వారి ఇంట్లోనే ఒక పూజా మందిరం ఉండేది. వారి కుటుంబం తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు వారు తమ మతాన్ని పునఃపరిశీలించుకున్నారు. అశోక్, ఫీమా యెహోవాసాక్షులతో మాట్లాడినప్పుడు, బైబిలు బోధించేవాటినిబట్టి, సాక్షుల మధ్య ఉన్న ప్రేమనుబట్టి ప్రభావితులయ్యారు. వారు ఇప్పుడు యెహోవా దేవుని రాజ్య సువార్తను అత్యంతాసక్తితో ప్రకటిస్తున్నారు.
ఐల్జే, గుంటర్, అశోక్, ఫీమా ఇప్పుడు లక్షలాదిమంది యెహోవాసాక్షుల అంతర్జాతీయ సహోదరత్వంలో ఐక్యమయ్యారు. ఆరాధనలో నేడు తమను ఐక్యపరచిన ఆయా సంగతులే త్వరలోనే విధేయులైన మానవులందరినీ ఐక్యపరుస్తాయనే బైబిలు వాగ్దానాన్ని వారు నమ్ముతున్నారు. ఆ వాగ్దానం నెరవేరినప్పుడు ఇక మతం పేరట దారుణకృత్యాలు, అనైక్యత, విభేదాలు ఉండనే ఉండవు. ప్రపంచమంతా సత్య దేవుడైన యెహోవా ఆరాధనలో ఐక్యమవుతుంది.—ప్రకటన 21:4, 5.
[అధస్సూచి]
^ పేరా 16 ఈ ఆర్టికల్‌లో ఉపయోగించబడిన కొన్ని పేర్లు మార్చబడ్డాయి.
[4, 5వ పేజీలోని చిత్రాలు]
తొలి క్రైస్తవులు విభిన్నమైన నేపథ్యాలనుండి వచ్చినా ఐక్యంగా ఉండేవారు