కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భోజన సమయం కేవలం తినే సమయం మాత్రమే కాదు!

భోజన సమయం కేవలం తినే సమయం మాత్రమే కాదు!

భోజన సమయం కేవలం తినే సమయం మాత్రమే కాదు!

అందరూ మంచి భోజనాన్ని ఆనందంగా ఆస్వాదిస్తారు. భోజనంతోపాటు మంచి సంభాషణ, మీ ప్రియమైనవారితో స్నేహపూర్వకమైన సహవాసం ఉంటే భోజన సమయం కేవలం మీ ఆకలిని తృప్తిపరిచే సమయంగా కాక ఆనందకరమైన సమయంగా మారుతుంది. చాలా కుటుంబాలు రోజులో కనీసం ఒకసారి కలిసి భోజనం చేయడాన్ని అలవాటు చేసుకుంటారు. భోజన సమయమప్పుడు కుటుంబ సభ్యులు ఆ రోజు సంఘటనల గురించి లేక తమ ప్రణాళికల గురించి చర్చించే అవకాశం లభిస్తుంది. తమ పిల్లల వ్యాఖ్యానాలను మాటలను వినే తల్లిదండ్రులకు వారి ఆలోచనల గురించి, వారి భావాల గురించి తెలుస్తుంది. కాలం గడిచే కొద్దీ భోజన సమయమప్పుడు ఉండే ఆనందకరమైన సహవాసం, కుటుంబ సభ్యుల మధ్య భద్రతా భావాన్ని, నమ్మకాన్ని, ప్రేమను పెంచి ఆ కుటుంబం స్థిరంగా ఉండడానికి సహాయపడుతుంది.

నేడు చాలామంది కుటుంబ సభ్యులు పని రద్దీతో ఉండి ఎప్పుడూ ప్రయాణిస్తూ ఉంటారు కాబట్టి ఇతర సభ్యులతో కలిసి భోజనం చేయడం వారికి కష్టమవుతుంది. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో కుటుంబమంతా కలిసి భోజనం చేయడాన్ని లేదా భోజనం చేసేటప్పుడు మాట్లాడడాన్ని స్థానిక సంస్కృతి ఆమోదించదు. ఇతర కుటుంబాలు భోజనం చేసేటప్పుడు టీవీ పెట్టుకుంటాయి, అప్పుడు అర్థవంతమైన సంభాషణ చేసే అవకాశమే లేకుండా పోతుంది.

అయితే క్రైస్తవ తల్లిదండ్రులు మాత్రం తమ కుటుంబాలను బలపరచడానికి ఎల్లప్పుడూ అవకాశాల కోసం చూస్తుంటారు. (సామెతలు 24:​27) పిల్లలతో ‘ఇంట్లో కూర్చున్నప్పుడు’ వారితో దేవుని వాక్యం గురించి మాట్లాడడానికి చక్కని అవకాశం లభిస్తుందని తల్లిదండ్రులకు ఎంతోకాలం క్రితం చెప్పబడింది. (ద్వితీయోపదేశకాండము 6:⁠7) క్రమంగా కలిసి కూర్చొని భోజనం చేయడంవల్ల తల్లిదండ్రులకు తమ పిల్లల్లో యెహోవాపట్ల ఆయన నీతియుక్తమైన సూత్రాలపట్ల మరింత గాఢమైన ప్రేమను పెంపొందించే విశేషమైన అవకాశం లభిస్తుంది. సంతోషకరమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించడం ద్వారా మీరు మీ కుటుంబంలో కూడా భోజన సమయాన్ని ఆనందకరమైన, ప్రోత్సాహకరమైన అనుభవంగా మార్చవచ్చు. అవును భోజన సమయం కేవలం తినే సమయం మాత్రమే కాకుండా చూసుకోండి!