కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మేము యెహోవాపై పూర్తి నమ్మకముంచడం నేర్చుకున్నాము

మేము యెహోవాపై పూర్తి నమ్మకముంచడం నేర్చుకున్నాము

జీవిత కథ

మేము యెహోవాపై పూర్తి నమ్మకముంచడం నేర్చుకున్నాము

నాటలీ హోల్టార్ఫ్‌ చెప్పినది

అది 1945 జూన్‌ నెల. ఒకరోజు బలహీనంగా, నిస్తేజంగా కనిపిస్తున్న ఒక వ్యక్తి వచ్చి మా ఇంటి గుమ్మం ముందు నిలబడ్డాడు. నా చిన్న కూతురు రూత్‌ ఆ వ్యక్తిని చూసి భయపడి, “అమ్మా, ఎవరో వచ్చారు!” అని అరిచింది. ఆ వచ్చిన వ్యక్తి స్వయాన తన తండ్రేనని, నా ప్రియమైన భర్త ఫెర్డినాండ్‌ అని రూత్‌కు తెలియదు. రెండు సంవత్సరాల క్రితం రూత్‌ పుట్టి మూడు రోజులు గడిచిన తర్వాత, ఇంటినుండి బయటకు వెళ్ళిన ఫెర్డినాండ్‌ అరెస్టు చేయబడి, నాజీ నిర్బంధ శిబిరంలో వేయబడ్డాడు. మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాతే రూత్‌ తన తండ్రిని చూసింది, మా కుటుంబం ఐక్యమయ్యింది. ఫెర్డినాండ్‌ నేను ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాము!

ఫెర్డినాండ్‌ 1909లో జర్మనీలోని కీల్‌ నగరంలో జన్మించాడు, నేను కూడా జర్మనీలోనే ఉన్న డ్రెస్డన్‌ నగరంలో 1907లో జన్మించాను. నాకు 12 సంవత్సరాలున్నప్పుడు మా కుటుంబం మొదటిసారిగా బైబిలు విద్యార్థులను (అప్పట్లో యెహోవాసాక్షులు అలా పిలువబడేవారు) కలిసింది. నాకు 19 సంవత్సరాలు వచ్చాక ఎవాంజలికల్‌ చర్చికి రాజీనామా చేసి నా జీవితాన్ని యెహోవాకు సమర్పించుకున్నాను.

ఆ సమయానికి ఫెర్డినాండ్‌ నౌకాయాన విద్యలో పట్టాపుచ్చుకొని నావికుడయ్యాడు. ఆయన సముద్ర ప్రయాణాలు చేసేటప్పుడు సృష్టికర్త ఉనికికి సంబంధించిన ప్రశ్నల గురించి ఆలోచించేవాడు. ఒకసారి తన ప్రయాణం ముగించుకుని జర్మనీకి తిరిగివచ్చిన ఫెర్డినాండ్‌, బైబిలు విద్యార్థిగా ఉన్న తన అన్నను కలుసుకోవడానికి వెళ్ళాడు. అక్కడ ఆయనకు తనను కలవరపరిచే ప్రశ్నలకు బైబిల్లో సమాధానాలు ఉన్నాయనే నమ్మకం కుదిరింది. దానితో ఆయన లూథరన్‌ చర్చిని వదిలి పెట్టడమే కాక, నావికుడిగా ఉద్యోగం చేయడం కూడా మానుకోవాలని నిర్ణయించుకున్నాడు. మొదటి రోజు ప్రకటనా పని చేసిన తర్వాత ఆయనకు తన జీవితమంతా ఆ సేవలోనే కొనసాగాలనే గాఢమైన కోరిక కలిగింది. ఆ రాత్రే ఫెర్డినాండ్‌ యెహోవాకు తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. ఆయన 1931 ఆగస్టులో బాప్తిస్మం తీసుకున్నాడు.

నావికుడు, ప్రచారకుడు

ప్రకటనా పనికి మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో, 1931 నవంబరులో ఫెర్డినాండ్‌ రైలులో నెదర్లాండ్స్‌కు వెళ్ళాడు. ఆ దేశంలో ప్రకటనా పనిని వ్యవస్థీకరించే సహోదరునికి ఫెర్డినాండ్‌ తాను నావికుడిగా ఉద్యోగం చేసేవాడినని చెప్పినప్పుడు, ఆ సహోదరుడు సంతోషం పట్టలేక, “మాకు కావాల్సింది నువ్వే!” అని బిగ్గరగా అరిచాడు. ఆ దేశపు ఉత్తర ప్రాంతంలో పడవలు ప్రయాణించే కాలువల ఒడ్డున నివసించేవారికి ప్రకటించడానికి వీలుగా పయినీర్ల (పూర్తికాల సేవకుల) కోసం అక్కడి సహోదరులు ఒక పడవను అద్దెకు తీసుకున్నారు. ఆ పడవలో వెళ్ళే ఐదుగురికి పడవ నడపడం తెలియదు. అందువల్ల ఫెర్డినాండ్‌ ఆ పడవ సరంగు అయ్యాడు.

ఆరు నెలల తర్వాత, దక్షిణ నెదర్లాండ్‌లోని టిల్‌బర్గ్‌లో పయినీరు సేవ చేయమని ఫెర్డినాండ్‌ను కోరారు. అదే సమయంలో నేను కూడా పయినీరు సేవ చేయడానికి టిల్‌బర్గ్‌కు చేరుకున్నాను, అక్కడే నేను ఫెర్డినాండ్‌ను కలిశాను. కానీ వెంటనే ఆ దేశపు ఉత్తర ప్రాంతంలోని గ్రోనిన్‌జెన్‌కు వెళ్ళమని మాకు చెప్పబడింది. అక్కడ 1932 అక్టోబరులో మేము పెళ్ళి చేసుకుని, చాలామంది పయినీర్లు కలిసివుండే ఇంట్లోనే మేము మా వైవాహిక జీవితాన్ని ప్రారంభించి అదే సమయంలో పయినీరు సేవ కొనసాగించాము!

1935లో మా కూతురు ఎస్తేర్‌ పుట్టింది. ఆర్థికంగా మాకు అంతంత మాత్రంగానే ఉన్నా పయినీరు సేవను కొనసాగించాలనే మేము తీర్మానించుకున్నాం. మేమొక గ్రామానికి వెళ్ళి అక్కడ ఒక చిన్న ఇంట్లో నివసించడం ప్రారంభించాం. నేను ఒకరోజు ఇంట్లో ఉండి పాపను చూసుకుంటే, నా భర్త రోజంతా పరిచర్యలో గడిపి వచ్చేవాడు. మరుసటి రోజు ఆయన పాపను చూసుకుంటే, నేను పరిచర్యకు వెళ్ళేదాన్ని. ఎస్తేర్‌ మాతోపాటు పరిచర్యకు వచ్చేంత పెద్ద పెరిగే వరకూ మేము అలాగే చేశాము.

ఆ తర్వాత కొద్దికాలానికే యూరప్‌ రాజకీయ పరిస్థితి భయంకరంగా మారింది. జర్మనీలో సాక్షులు హింసించబడుతున్నారని మాకు తెలిసింది, త్వరలోనే మా వంతు కూడా వస్తుందని మేము గ్రహించాము. తీవ్రమైన హింస ఎదురైనప్పుడు మేమెలా సహిస్తామో అని ఆలోచించేవాళ్ళం. 1938లో విదేశీయులు మతసంబంధ సాహిత్యాలను పంచిపెట్టే విక్రేతలుగా ఉండడాన్ని నిషేధిస్తూ నెదర్లాండ్స్‌ అధికారులు ఒక చట్టాన్ని జారీ చేశారు. అయితే మేము మా పరిచర్యలో కొనసాగడానికి సహాయం చేస్తూ నెదర్లాండ్స్‌ సాక్షులు అంతకుముందు మన సేవలో ఆసక్తి చూపించిన ప్రజల పేర్లు మాకిచ్చారు, వారిలో కొందరితో మేము బైబిలు అధ్యయనం చేయగలిగాము.

అదే సమయంలో యెహోవాసాక్షుల సమావేశానికి ఏర్పాట్లు జరిగాయి. ఆ సమావేశానికి వెళ్ళేందుకు రైలు టిక్కెట్లకు మా దగ్గర డబ్బు లేదు, అయినా మేము అక్కడకు వెళ్ళాలనే అనుకున్నాము. కాబట్టి మేము ఎస్తేర్‌ను సైకిలుకు ముందు బిగించిన చిన్న సీటులో కూర్చోబెట్టుకొని మూడు రోజుల సైకిలు ప్రయాణాన్ని ప్రారంభించాము. మేము వెళ్ళే దారిలో నివసించే సాక్షుల ఇళ్ళవద్ద రాత్రులు బస చేశాము. దేశవ్యాప్తంగా జరిగిన మొట్టమొదటి సమావేశానికి హాజరైనందుకు మేమెంత సంతోషించామో! మాకు ఎదురవబోయే కష్టాల కోసం మమ్మల్ని సిద్ధం చేస్తూ ఆ సమావేశ కార్యక్రమం మమ్మల్ని బలపరిచింది. అన్నింటికంటే ముఖ్యంగా దేవునిపై నమ్మకముంచమని మాకు గుర్తు చేయబడింది. కీర్తన 31:6లోని ఈ మాటలు మా జీవన సూక్తిగా తయారయ్యాయి: “నేను యెహోవాను నమ్ముకొని యున్నాను.”

నాజీలు మమ్మల్ని వెంటాడారు

1940 మేలో నాజీలు నెదర్లాండ్స్‌ను ఆక్రమించుకున్నారు. ఒకరోజు మేము అందుకున్న బైబిలు సాహిత్యాలను వేరు చేస్తున్నప్పుడు రహస్య పోలీసులు మా ఇంటిపై దాడి చేశారు. ఫెర్డినాండ్‌ను వాళ్ళ ముఖ్య కార్యాలయానికి తీసుకెళ్ళారు. నేను ఎస్తేర్‌ ఆయనను చూడడానికి క్రమంగా అక్కడికి వెళ్ళేవాళ్ళము, కొన్నిసార్లు పోలీసులు మా ముందే ఆయనను ప్రశ్నించి కొట్టేవారు. డిసెంబరులో అనుకోకుండా ఫెర్డినాండ్‌ విడుదల చేయబడ్డాడు, కానీ ఆయన స్వేచ్ఛ ఎంతోకాలం నిలవలేదు. ఒకరోజు సాయంత్రం మేము ఇంటికి వచ్చేసరికి, ఇంటి పక్కనే రహస్య పోలీసుల కారు నిలిపి ఉండడం మేము గమనించాము. ఫెర్డినాండ్‌ మెల్లిగా తప్పించుకొని వెళ్ళిపోయాడు, నేను ఎస్తేర్‌ మాత్రం ఇంట్లోకి వెళ్ళాము. రహస్య పోలీసులు మా కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఫెర్డినాండ్‌ కోసం అడిగారు. ఆ రోజు రాత్రి రహస్య పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత, నెదర్లాండ్స్‌ పోలీసులు వచ్చి ప్రశ్నించడానికని నన్ను తీసుకెళ్ళారు. ఆ మరుసటి రోజు నేను ఎస్తేర్‌ కొత్తగా బాప్తిస్మం తీసుకొని సాక్షులైన నార్డర్‌ దంపతుల ఇంట్లో దాక్కున్నాం, వారు మాకు ఆశ్రయాన్ని, రక్షణను కల్పించారు.

1941 జనవరి ఆఖరున, హౌస్‌బోట్‌లో నివసిస్తున్న ఒక పయినీరు జంట అరెస్టు చేయబడింది. ఆ మరుసటి రోజు ప్రాంతీయ పైవిచారణకర్త (ప్రయాణ కాపరి), నా భర్త కలిసి ఆ దంపతులకు చెందిన వస్తువులను తీసుకొని రావడానికి ఆ హౌస్‌బోట్‌లోకి వెళ్ళినప్పుడు రహస్య పోలీసుల సహకారులు వాళ్ళను పట్టుకోబోయారు. ఫెర్డినాండ్‌ వాళ్ళనుండి తప్పించుకొని తన సైకిలు మీద ఇంటికి వచ్చేయగలిగాడు. కానీ ప్రాంతీయ పైవిచారణకర్తను మాత్రం వారు జైలుకు తీసుకువెళ్ళారు.

ఆ తర్వాత, ఫెర్డినాండ్‌ను ప్రాంతీయ పైవిచారణకర్తగా ఉండమని బాధ్యతగల సహోదరులు అడిగారు. అంటే ఆయన నెలలో కేవలం మూడు రోజులు మాత్రమే ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది. అది మాకొక కొత్త సవాలుగా తయారయ్యింది, అయినా నేను పయినీరు సేవను కొనసాగించాను. రహస్య పోలీసులు సాక్షుల కోసం వెదకడాన్ని ముమ్మరం చేయడంతో మేము తరచూ ఇళ్ళూ మారుస్తూ వచ్చాం. 1942లో మేము మూడుసార్లు ఇళ్ళు మార్చాము. చివరకు మేము రాటర్‌డామ్‌ నగరానికి చేరుకున్నాము, అది ఫెర్డినాండ్‌ రహస్యంగా పరిచర్య చేస్తున్న ప్రాంతానికి చాలా దూరంలో ఉన్న నగరం. ఆ సమయానికి మేము మాకు పుట్టబోయే రెండవ బిడ్డ కోసం ఎదురుచూస్తున్నాం. కాంప్‌ కుటుంబం దయతో మమ్మల్ని తమతో ఉండనిచ్చారు, వారి ఇద్దరి కుమారులు ఆ మధ్యనే నిర్బంధ శిబిరాలకు పంపబడ్డారు.

రహస్య పోలీసులు మమ్మల్ని వెంటాడారు

మా రెండో అమ్మాయి రూత్‌ 1943 జూలైలో పుట్టింది. రూత్‌ పుట్టిన తర్వాత ఫెర్డినాండ్‌ మాతో కేవలం మూడు రోజులే గడపగలిగాడు, ఆ తర్వాత ఆయన చాలాకాలం మాకు కనిపించలేదు. ఫెర్డినాండ్‌ అలా వెళ్లిన దాదాపు మూడు వారాల తర్వాత ఆమ్‌స్టర్‌డామ్‌లో అరెస్ట్‌ చేయబడ్డాడు. ఆయనను రహస్య పోలీసుల స్టేషన్‌కు తీసుకువెళ్ళారు, అక్కడే ఆయన ఎవరో ధృవపరచబడింది. ఆయననుండి మన ప్రకటనా కార్యకలాపాల సమాచారం రాబట్టే ప్రయత్నంలో రహస్య పోలీసులు ఆయనను తీవ్రంగా ప్రశ్నించారు. కానీ ఫెర్డినాండ్‌ తానొక యెహోవాసాక్షినని, తనకూ రాజకీయ కార్యకలాపాలకూ ఎలాంటి సంబంధమూ లేదని చెప్పడానికి మాత్రమే సుముఖత చూపించాడు. జర్మన్‌ దేశస్థుడైన ఫెర్డినాండ్‌ సైనిక విధులు నిర్వహించలేదనే ఆగ్రహంతో ఆయననొక దేశద్రోహిగా కాల్చి చంపేస్తామని వారు బెదిరించారు.

తర్వాతి ఐదు నెలలు ఫెర్డినాండ్‌ను ఒక జైలు గదిలో ఉంచారు, కాల్చి చంపే సైనికదళం చేతుల్లో మరణం తప్పదనే బెదిరింపులను ఆయన ఎల్లప్పుడు ఎదుర్కోవలసి వచ్చింది. అయినా ఆయన యెహోవాపట్ల విశ్వసనీయంగా ఉండడంలో చలించలేదు. ఆధ్యాత్మికంగా బలంగా ఉండడానికి ఆయనకేమి సహాయం చేసింది? దేవుని వాక్యమైన బైబిలే. ఫెర్డినాండ్‌ ఒక సాక్షి కాబట్టి ఆయన దగ్గర బైబిలు ఉండడానికి అనుమతి ఇవ్వబడలేదు. కానీ ఇతర ఖైదీలు కావాలనుకుంటే బైబిలును తెప్పించుకోవచ్చు. దానితో ఫెర్డినాండ్‌ తన తోటి ఖైదీని, బైబిలు పంపించమని తన కుటుంబాన్ని అడిగేందుకు ఒప్పించాడు, ఆ ఖైదీ అలాగే చేశాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత ఫెర్డినాండ్‌ ఆ సంఘటన గురించి మాట్లాడినప్పుడల్లా ఆయన కళ్ళు మెరిసేవి, ఆయన ఇలా అనేవాడు: “ఆ బైబిలు నాకెంతో ఓదార్పునిచ్చింది!”

ఫెర్డినాండ్‌ను 1944 జనవరిలో అకస్మాత్తుగా నెదర్లాండ్స్‌లోని వ్యూయెక్ట్‌ నిర్బంధ శిబిరానికి తీసుకువెళ్ళారు. ఊహించని విధంగా ఆయనను అలా అక్కడకు తీసుకువెళ్ళడం ఒక ఆశీర్వాదంగా పరిణమించింది, ఎందుకంటే ఆయన అక్కడ మరో 46 మంది సాక్షులను కలుసుకోగలిగాడు. ఆయనను మరో శిబిరానికి మార్చారని తెలిసినప్పుడు, ఆయన బ్రతికే ఉన్నందుకు నేనెంతో సంతోషించాను!

నిర్బంధ శిబిరంలో పట్టువిడవక ప్రకటించడం

శిబిరంలో జీవితం చాలా కష్టంగా ఉండేది. అక్కడ విపరీతమైన ఆహార కొరత, స్వెట్టర్లు, రగ్గుల్లాంటివి లేకపోవడం, ఎముకలు కొరికే చలి సర్వసాధారణం. ఫెర్డినాండ్‌కి ఒకసారి టాన్సిలైటిస్‌ వచ్చింది. ఆయన హాజరు తీసుకునే వరకు ఎంతోసేపు చలిలో నిలబడి ఆ తర్వాత, అనారోగ్యంతో బాధపడేవారు ఉండే స్థలానికి వెళ్ళాడు. 104 డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువ జ్వరంవున్న వారినే అక్కడ ఉంచేవారు. అయితే ఫెర్డినాండ్‌కు అక్కడ ఉండే అవకాశం దొరకలేదు ఎందుకంటే ఆయనకు 102 డిగ్రీల జ్వరం మాత్రమే ఉంది! తిరిగివెళ్లి పని ప్రారంభించమని ఆయనకు చెప్పబడింది. సానుభూతిగల తోటి ఖైదీలు ఆయనను మధ్య మధ్యలో కొంతసేపు వెచ్చగా ఉండే స్థలంలో దాచిపెట్టి ఆయనకు సహాయం చేశారు. వాతావరణం వెచ్చబడినప్పుడు ఫెర్డినాండ్‌ పరిస్థితి కాస్త కుదుటపడింది. అంతేకాకుండా, కొందరు సహోదరులకు ఆహార పొట్లాలు లభించినప్పుడు వారు ఆ ఆహారాన్ని ఇతరులతో పంచుకునేవారు, అలా ఫెర్డినాండ్‌ మళ్ళీ కొంత బలం పుంజుకున్నాడు.

నా భర్త అరెస్ట్‌ కాకముందు ప్రకటనా పని ఆయన జీవితంలో అంతర్భాగంగా ఉండేది, నిర్బంధ శిబిరంలో కూడా ఆయన ఇతరులతో తన నమ్మకాలను పంచుకునేవాడు. ఆయన దుస్తులపై ఒక ఖైదీని సాక్షిగా గుర్తించే ఊదారంగు త్రికోణపు చిహ్నం చూసి శిబిరంలోని అధికారులు తరచూ ఆయనను ఎగతాళి చేసేవారు. ఫెర్డినాండ్‌ అలాంటి వ్యాఖ్యానాలను వారితో సంభాషణ ప్రారంభించే అవకాశంగా దృష్టించేవాడు. మొదట్లో సహోదరుల ప్రకటనా క్షేత్రం ముఖ్యంగా సాక్షులను ఉంచిన గదులకే పరిమితమయ్యింది. సహోదరులు ‘మనం ఇంకా ఎక్కువమంది ఖైదీలకు ఎలా ప్రకటించవచ్చు?’ అని తమలోతాము ప్రశ్నించుకునేవారు. అనుకోకుండా అక్కడి అధికారులే ఆ సమస్యను పరిష్కరించారు. ఎలా?

సహోదరులకు రహస్యంగా బైబిలు సాహిత్యాలు అందేవి, అలాగే వారి దగ్గర 12 బైబిళ్ళు కూడా ఉండేవి. ఒకరోజు కొన్ని సాహిత్యాలు సిపాయిల కంటబడ్డాయి, అయితే అవి ఎవరివో వారు కనిపెట్టలేకపోయారు. అందువల్ల సాక్షుల ఐక్యమత్యాన్ని భంగం చేయాలని అధికారులు తలంచారు. కాబట్టి, సహోదరులకు శిక్ష విధిస్తూ వారిని సాక్షులు కాని ఖైదీల గదుల మధ్యకు మార్చారు. అంతేకాక సహోదరులు ఆహారం తినేటప్పుడు కూడా సాక్షులు కానివారి పక్కనే కూర్చోవాలని ఆజ్ఞాపించారు. ఆ ఏర్పాటు సహోదరులకు ఒక ఆశీర్వాదంగా పరిణమించింది. అప్పటినుండి సహోదరులు తాము చేయాలని కోరుకున్న పనిని అంటే సాధ్యమైనంత ఎక్కువమంది ఖైదీలకు ప్రకటించే పనిని చేయగలిగారు.

ఇద్దరు ఆడపిల్లలను ఒంటరిగా పెంచడం

ఆ సమయంలో నేను నా ఇద్దరు కూతుర్లు ఇంకా రాటర్‌డామ్‌లోనే ఉన్నాము. 1943/44 శీతాకాలంలో చలి చాలా భయంకరంగా ఉంది. మా ఇంటి వెనుక విమాన విధ్వంసక శతఘ్నుల జర్మన్‌ సైనిక దళం ఉండేది. ఇంటి ముందు వాల్‌ హార్బర్‌ ఉండేది, అది మిత్రపక్షాల బాంబుదాడులకు ప్రధాన గురిగా ఉండేది. మేము దాక్కోవడానికి అది సురక్షితమైన స్థలం అని చెప్పలేము. అంతేకాకుండా ఆహార కొరత కూడా ఉండేది. మేము ముందుకంటే ఎక్కువగా మా పూర్తి నమ్మకాన్ని యెహోవాపై ఉంచడం నేర్చుకున్నాము.​—⁠సామెతలు 3:5, 6.

ఎనిమిది సంవత్సరాల ఎస్తేర్‌ సూప్‌ కిచెన్‌ (సూపు బ్రెడ్డు వంటి కనీస ఆహార అవసరాలు అందించే సంస్థ) దగ్గర లైన్‌లో నిలబడి మా చిన్న కుటుంబానికి సహాయం చేసేది. అయితే చాలాసార్లు దాని వంతు వచ్చేసరికి ఆహార సరఫరా అయిపోయేది. ఒకరోజు అది ఆహారం కోసం వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా విమానాలు బాంబు దాడులు చేయడం ప్రారంభించాయి. ఆ పేలుళ్ళ శబ్దాలు విన్నప్పుడు నేను హడలిపోయాను, అయితే కొంచెం సేపైన తర్వాత ఎస్తేర్‌ సురక్షితంగానే కాక, కొన్ని చెక్కర దుంపలు కూడా తీసుకొని రావడం చూసినప్పుడు నా కళ్ళు చెమర్చాయి. కంగారుగా “ఏమి జరిగింది?” అని నేను అడిగాను. అది మెల్లగా ఇలా సమాధానం చెప్పింది: “బాంబులు వేయబడినప్పుడు నేను నాన్న చెప్పినట్లే చేశాను. ‘నేలపై బోర్లా పడుకుని, ప్రార్థన చెయ్యి’ అని ఆయన చెప్పాడు. ఆ పద్ధతి పని చేసింది!”

నాది జర్మన్‌ యాస కాబట్టి ఎస్తేరే బయటకు వెళ్ళి కావలసినవి కొనుక్కు రావడం సురక్షితంగా ఉండేది. అది జర్మన్‌ సైనికులు గమనించారు, దానితో వాళ్ళు ఎస్తేర్‌ను ప్రశ్నించడం ప్రారంభించారు. కానీ అది వాళ్లకు ఏమీ చెప్పలేదు. ఇంటి దగ్గర నేను ఎస్తేర్‌కు బైబిలు విద్య నేర్పించేదాన్ని ఎందుకంటే దాన్ని స్కూలుకు పంపించడం వీలుకాలేదు, నేనే దానికి చదవడం, వ్రాయడం, ఇతర నైపుణ్యాలు నేర్పించాను.

ఎస్తేర్‌ నాకు పరిచర్యలో కూడా సహాయం చేసేది. నేను ఎవరితోనైనా బైబిలు అధ్యయనం చేయడానికి వెళ్ళేముందు, ఎస్తేర్‌ నాకంటే ముందు బయలుదేరి వెళ్ళి ప్రమాదమేమీ లేదని నిశ్చయపరచుకొని వచ్చేది. నేను బైబిలు విద్యార్థికి చెప్పిన చిహ్నాలు సరిగ్గా ఉన్నాయా లేదా అని చూసి వచ్చేది. ఉదాహరణకు, నేను సందర్శించబోయే వ్యక్తి ఒక పూల కుండిని కిటికీ దగ్గర ఒక నిర్దిష్టమైన స్థలంలో పెడితే నేను వెళ్ళవచ్చు అని అది సూచించేది. నేను లోపల బైబిలు అధ్యయనం చేస్తుంటే ఎస్తేర్‌ బయట రూత్‌ను చిన్న తోపుడు బండిలో కూర్చొబెట్టుకొని వీధిలో ఆ చివర నుండి ఈ చివర వరకూ తిరుగుతూ ప్రమాద సూచనలేమైనా ఉన్నాయా అని గమనించేది.

సాక్సెన్‌హవుసన్‌కు

ఫెర్డినాండ్‌ ఎలా ఉన్నాడు? 1944 సెప్టెంబరులో ఎంతోమంది ఇతర ఖైదీలతోపాటు ఆయనను బలవంతంగా ఒక రైల్వే స్టేషన్‌కు నడిపించి, అక్కడ ఒకొక్క బోగీలో 80 మంది ఖైదీల చొప్పున ఎక్కించారు. ప్రతి బోగీలో మరుగుదొడ్డిగా ఒక బక్కెటు, త్రాగే నీరుకోసం ఒక బక్కెటు ఉన్నాయి. ఆ ప్రయాణం మూడు పగళ్ళు మూడు రాత్రులు సాగింది, ఖైదీలకు నిలబబడానికి మాత్రమే స్థలం ఉండింది! గాలి లోనికి ప్రసరించే అవకాశం లేదు. బోగీలకు అక్కడక్కడా చిన్న రంధ్రాలు మాత్రమే ఉన్నాయి. లోపల వాళ్ళు భరించాల్సి వచ్చిన వేడి, ఆకలి, దప్పిక, దుర్గంధం వర్ణనాతీతం.

ఆ రైలు మెల్లిగా భయంకరమైన సాక్సెన్‌హవుసన్‌ నిర్బంధ శిబిరం వద్ద ఆగింది. ఖైదీల దగ్గరున్న వ్యక్తిగత వస్తువులు లాగేసుకోబడ్డాయి, సాక్షులు ప్రయాణంలో తమ దగ్గరుంచుకున్న 12 చిన్న బైబిళ్ళు మాత్రం వారి దగ్గరే ఉండిపోయాయి!

ఫెర్డినాండ్‌, ఇంకా ఎనిమిదిమంది సహోదరులు యుద్ధ సామగ్రిని తయారు చేయడంలో సహాయం చేయడానికి రాథెనౌలోని ఉపగ్రహ శిబిరానికి పంపించబడ్డారు. సహోదరులకు చావు తప్పదని బెదిరించినా వారలాంటి పని చేయడానికి ఒప్పుకోలేదు. స్థిరంగా నిలబడేందుకు ఒకరినొకరు ప్రోత్సహించుకునేందుకు రోజంతా ధ్యానించుకోవడానికి వారు ప్రతిరోజు ఉదయాన్నే కీర్తన 18:2 వంటి ఒక బైబిలు లేఖనాన్ని చర్చించేవారు. వారు ఆధ్యాత్మిక విషయాలను ధ్యానించడానికి అది సహాయం చేసింది.

చివరకు మిత్రపక్షాలు, రష్యా బలగాలు సమీపిస్తున్నాయని శతఘ్నుల ధ్వనులు సూచించాయి. ఫెర్డినాండ్‌ ఆయన సహచరులున్న శిబిరానికి రష్యన్లు మొదట చేరుకున్నారు. వారు ఖైదీలకు కొంత ఆహారాన్నిచ్చి, శిబిరాన్ని విడిచి వెళ్ళమని ఆజ్ఞాపించారు. 1945 ఏప్రిల్‌ ఆఖరుకల్లా రష్యన్‌ సైన్యం వారు ఇంటికి వెళ్ళడాన్ని అనుమతించింది.

చివరకు కుటుంబమంతా కలవడం

జూన్‌ 15న ఫెర్డినాండ్‌ నెదర్లాండ్స్‌కు చేరుకున్నాడు. గ్రోనిన్‌జెన్‌లోని సహోదరులు ఆయనను హృదయపూర్వకంగా ఆహ్వానించారు. మేము బ్రతికే ఉన్నామని, దేశంలో ఎక్కడో నివసిస్తున్నామని ఆయనకు తెలిసింది, ఆయన తిరిగి వచ్చాడని మాకు కబురు అందింది. ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నప్పుడు నాకు క్షణమొక యుగంలా అనిపించింది. కానీ చివరకు ఒక రోజు రూత్‌, “అమ్మా, ఎవరో వచ్చారు!” అని అరిచింది. నా ప్రియమైన భర్త, నా పిల్లల ప్రియమైన తండ్రి తిరిగి వచ్చాడు!

మేమొక సాధారణ కుటుంబంగా జీవితం పునఃప్రారంభించడానికి ముందు ఎన్నో సమస్యలు పరిష్కరించుకోవలసి వచ్చింది. మాకు ఉండడానికి స్థలం లేదు, స్థిర నివాసులుగా మా పూర్వస్థితిని సంపాదించుకోవడం కూడా ఒక పెద్ద సవాలుగా తయారయ్యింది. మేము జర్మన్లము కాబట్టి ఎన్నో సంవత్సరాల వరకు నెదర్లాండ్స్‌ అధికారులు మేము వెలివేయబడినవారమన్నట్లే మాతో ప్రవర్తించారు. అయితే చివరకు మేము స్థిరపడి మేమెంతగానో కోరుకున్న జీవితాన్ని అంటే ఒక కుటుంబంగా యెహోవాను కలిసి సేవించే జీవితాన్ని ప్రారంభించగలిగాము.

“నేను యెహోవాను నమ్ముకొని యున్నాను”

తర్వాతి సంవత్సరాల్లో ఫెర్డినాండ్‌ నేను, మాలాగే కష్టాలను అనుభవించిన కొంతమంది స్నేహితులతో సమయం గడిపినప్పుడు, ఆ కష్ట కాలాల్లో యెహోవా అందించిన ప్రేమపూర్వకమైన నడిపింపును గుర్తు చేసుకునేవాళ్ళము. (కీర్తన 7:⁠1) ఆ సంవత్సరాలన్నింటిలోను రాజ్యాభివృద్ధికి సంబంధించిన కార్యకలాపాల్లో పాల్గొనేందుకు యెహోవా మమ్మల్ని అనుమతించినందుకు మేము ఎంతో సంతోషించాము. మేము మా యౌవనాన్ని యెహోవా పవిత్రమైన సేవలో గడిపినందుకు ఎంత సంతోషంగా ఉన్నామో కూడా తరచూ చెప్పుకునేవాళ్ళము.​—⁠ప్రసంగి 2:⁠1, 2.

నాజీల హింస ముగిసిన తర్వాత ఫెర్డినాండ్‌ నేను 50 కంటే ఎక్కువ సంవత్సరాలు యెహోవా సేవ చేశాము, తర్వాత 1995 డిసెంబరు 20న ఫెర్డినాండ్‌ తన భూ జీవితం చాలించాడు. త్వరలో నాకు 98 సంవత్సరాలు వస్తాయి. ఆ కష్టకాలాల్లో మా పిల్లలు మాకు ఎంతో మద్దతునిచ్చినందుకు, యెహోవా నామం మహిమపరచబడేందుకు ఆయన సేవలో నేను ఇంకా చేయగలిగినంతా చేస్తున్నందుకు నేను ప్రతీరోజు యెహోవా కృతజ్ఞతలు తెలియజేస్తాను. యెహోవా నా కోసం చేసినవాటన్నింటికి నేను ఎంతో కృతజ్ఞురాలిని, “నేను యెహోవాను నమ్ముకొని యున్నాను” అనే నా జీవన సూక్తిని పాటిస్తూనే ఉండాలనేది నా హృదయపూర్వక కోరిక.​—⁠కీర్తన 31:⁠6.

[19వ పేజీలోని చిత్రం]

1932 అక్టోబరులో ఫెర్డినాండ్‌తో

[19వ పేజీలోని చిత్రం]

సువార్త ప్రకటించడానికి ఉపయోగించిన పడవ “ఆల్మీనా,” దాని సభ్యులు

[22వ పేజీలోని చిత్రం]

ఫెర్డినాండ్‌ మరియు పిల్లలతో