యేసు మాదిరిని అనుసరించండి
యేసు మాదిరిని అనుసరించండి
“నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని.”—యోహాను 13:15.
మానవజాతి చరిత్రంతటిలోనూ కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే తన జీవితమంతటిలో ఏ పాపమూ చేయలేదు. ఆ వ్యక్తి యేసు. యేసు తప్ప “పాపము చేయనివాడు ఒకడును లేడు.” (1 రాజులు 8:46; రోమీయులు 3:23) అందుకే యథార్థ క్రైస్తవులు తాము అనుసరించడానికి యేసును ఒక పరిపూర్ణమైన మాదిరిగా దృష్టిస్తారు. నిజానికి, యేసు తాను మరణించడానికి ముందు రాత్రి అంటే సా.శ. 33వ సంవత్సరం నీసాను 14వ తేదీన, తనను అనుకరించమని స్వయంగా తన అనుచరులకు చెప్పాడు. “నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని” అని ఆయన చెప్పాడు. (యోహాను 13:15) యేసు ఆ ఆఖరి రాత్రి, క్రైస్తవులు తనలా ఉండడానికి కృషి చేయవలసిన అనేక మార్గాలను పేర్కొన్నాడు. వాటిలో కొన్నింటిని మనం ఈ ఆర్టికల్‌లో పరిశీలిద్దాం.
వినయంగా ఉండవలసిన అవసరత
2 యేసు తాను ఉంచిన మాదిరిని అనుసరించమని తన శిష్యులను ప్రోత్సహించినప్పుడు ప్రత్యేకించి ఆయన వినయం గురించి మాట్లాడాడు. ఆయన చాలా సందర్భాల్లో, వినయంగా ఉండమని తన అనుచరులకు ఉపదేశించాడు. అయితే నీసాను 14వ తేదీ రాత్రి ఆయన తన అపొస్తలుల కాళ్ళు కడిగి తన వినయాన్ని ప్రదర్శించాడు. ఆ తర్వాత యేసు ఇలా చెప్పాడు: “ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన యెడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే.” (యోహాను 13:14) అలా చెప్పిన తర్వాత, ఆయన తాను ఉంచిన మాదిరిని అనుసరించమని తన అపొస్తలులకు చెప్పాడు. ఆయన వినయం విషయంలో ఎంత చక్కని మాదిరి ఉంచాడో కదా!
3 యేసు భూమ్మీదకు రాకముందు ‘దేవుని స్వరూపము కలిగినవాడై ఉండెను’ అని అపొస్తలుడైన పౌలు మనకు చెబుతున్నాడు. ఆయన దేవుని స్వరూపములో ఉన్నా, తనను తాను రిక్తునిగా చేసుకొని మానవుడిగా వచ్చాడు. అంతేకాక ఆయన “మరణము పొందునంతగా, అనగా సిలువ [“హింసాకొయ్యపై,” NW] మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్ను తాను తగ్గించుకొనెను.” (ఫిలిప్పీయులు 2:6-8) ఒక్కసారి దాని గురించి ఆలోచించండి. సమస్త విశ్వంలోనే రెండవ స్థానంలో ఉన్న యేసు దేవదూతలకంటే తక్కువ స్థానంలోకి రావడానికి, నిస్సహాయ శిశువుగా జన్మించడానికి, అపరిపూర్ణ తల్లిదండ్రులకు విధేయత చూపిస్తూ పెరగడానికి, చివరకు తృణీకరించబడిన నేరస్థుడిలా మరణించడానికి అంగీకరించాడు. (కొలొస్సయులు 1:15, 16; హెబ్రీయులు 2:6, 7) అది ఎంతటి వినయమో కదా! ఆ “మనస్సు”ను లేదా మానసిక వైఖరిని అనుకరించి ఆయనలాంటి “వినయమైన మనస్సు”ను పెంపొందించుకోవడం సాధ్యమేనా? (ఫిలిప్పీయులు 2:3-5) సాధ్యమే, కానీ అదంత సులభం కాదు.
4 వినయానికి వ్యతిరేకం అహంకారం. (సామెతలు 6:16-19) గర్వం సాతాను పతనానికి కారణమయ్యింది. (1 తిమోతి 3:6) అది మానవుల హృదయాల్లో సులభంగా నాటుకుపోతుంది, అలా ఒకసారి నాటుకుపోయిందంటే ఇక దాన్ని తొలగించడం చాలా కష్టం. ప్రజలు తమ దేశం, జాతి, ఆస్తిపాస్తులు, విద్య, లౌకికంగా సాధించినవి, సామాజిక స్థాయి, అందం, క్రీడా సామర్థ్యాలు, ఇలా ఎన్నో విషయాలను చూసుకొని గర్విస్తారు. అయితే వాటిలో ఏ ఒక్కటీ యెహోవాకు ప్రాముఖ్యమైనది కాదు. (1 కొరింథీయులు 4:7) అవి మనం అహంకారులవడానికి కారణమైతే, మనకు యెహోవాతో ఉన్న సంబంధం నాశనమవుతుంది. “యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరమునుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును.”—కీర్తన 138:6; సామెతలు 8:13.
మన సహోదరుల మధ్య వినయాన్ని ప్రదర్శించడం
5 యెహోవా సేవకు మనమిచ్చే మద్దతు, ఆయన సేవలో మనం సాధించినవి మనల్ని అహంకారులుగా చేయకూడదు; సంఘంలో మనకివ్వబడిన బాధ్యతలను చూసుకొని కూడా మనం గర్వపడకూడదు. (1 దినవృత్తాంతములు 29:14; 1 తిమోతి 6:17, 18) నిజానికి, మనకు ఎంత బరువైన బాధ్యతలు ఉంటే, మనం అంత వినయంగా ఉండాలి. ‘దేవుని మందపై ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండండి’ అని అపొస్తలుడైన పేతురు పెద్దలను ప్రోత్సహించాడు. (1 పేతురు 5:3) పెద్దలు సేవకులుగా, మాదిరికర్తలుగా ఉండడానికి నియమించబడ్డారు, అంతేగానీ ప్రభువులుగా యజమానులుగా ఉండడానికి కాదు.—లూకా 22:24-26; 2 కొరింథీయులు 1:24.
6 వినయాన్ని ప్రదర్శించవలసింది కేవలం పెద్దలు మాత్రమే కాదు. వయోధికులతో పోలిస్తే తమకు చురుకైన మనస్సు, బలమైన శరీరం ఉండడంవల్ల గర్వించే యువతకు పేతురు ఇలా వ్రాశాడు: “మీరందరు ఎదుటివానియెడల దీనమనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి; దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును.” (1 పేతురు 5:5) అవును క్రీస్తును పోలిన వినయం అందరికీ అవసరం. సువార్త ప్రకటించడానికి, ప్రత్యేకించి ఉదాసీనత, ప్రతికూలత ఎదురైనప్పుడు సువార్త ప్రకటించడానికి వినయం అవసరం. ఉపదేశాన్ని అంగీకరించడానికి, లేదా పరిచర్యలో మరింత ఎక్కువగా పాల్గొనేందుకు వీలుగా జీవితాన్ని సరళం చేసుకోవడానికి వినయం అవసరం. అంతేకాక చెడు ప్రచారాలను, చట్టపరమైన దాడులను, లేదా దౌర్జన్యపూరితమైన హింసను సహించేటప్పుడు మనకు వినయంతోపాటు ధైర్యం, విశ్వాసం కూడా అవసరం.—1 పేతురు 5:6.
7 ఒక వ్యక్తి అహంకారాన్ని అధిగమించి ‘వినయమైన మనస్సుగలవాడై, ఇతరులను తనకంటే యోగ్యులుగా ఎంచే’ వ్యక్తిగా ఎలా ఉండవచ్చు? (ఫిలిప్పీయులు 2:3) యెహోవా తనను దృష్టించినట్లే ఆయన తనను తాను దృష్టించుకోవాలి. యేసు సరైన వైఖరిని వివరిస్తూ ఇలా చెప్పాడు: “మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నియు చేసిన తరువాత—మేము నిష్‌ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసియున్నామని చెప్పుడి.” (లూకా 17:10) మనం చేసేవేవైనా యేసు చేసినదానికి సాటిరావని గుర్తుంచుకోండి. అయినా యేసు వినయం ప్రదర్శించాడు.
8 అంతేకాక, మన గురించి మనం సరైన దృక్కోణాన్ని అలవర్చుకోవడానికి యెహోవా సహాయాన్ని కోరవచ్చు. కీర్తనకర్తవలే మనం ఇలా ప్రార్థించవచ్చు: “నేను నీ ఆజ్ఞలయందు కీర్తన 119:66) మన గురించి మనం వివేచనగల సమతుల్యమైన దృక్కోణాన్ని అలవర్చుకోవడానికి యెహోవా మనకు సహాయం చేస్తాడు, మనం చూపించే వినయ స్వభావాన్నిబట్టి ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. (సామెతలు 18:12) యేసు ఇలా చెప్పాడు: “తన్నుతాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును.”—మత్తయి 23:12.
నమ్మిక యుంచియున్నాను మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము.” (మంచి చెడుల విషయంలో సరైన దృక్కోణం
9 యేసు అపరిపూర్ణ మానవుల మధ్య 33 సంవత్సరాలు జీవించినా “పాపము లేనివాడుగా” ఉన్నాడు. (హెబ్రీయులు 4:15) నిజానికి మెస్సీయా గురించి ప్రవచిస్తూ కీర్తనకర్త ఇలా చెప్పాడు: “నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు.” (కీర్తన 45:7; హెబ్రీయులు 1:9) ఈ విషయంలో కూడా క్రైస్తవులు యేసును అనుకరించడానికి కృషి చేస్తారు. వారు తప్పొప్పులను గుర్తించడమే కాకుండా తప్పును ద్వేషించి సరైనదానిని ప్రేమిస్తారు. (ఆమోసు 5:15) తమలో సహజసిద్ధంగా ఉన్న పాపభరితమైన కోరికలతో పోరాడడానికి అది వారికి సహాయం చేస్తుంది.—ఆదికాండము 8:21; రోమీయులు 7:21-25.
10 పరిసయుడైన నీకొదేముకు యేసు ఇలా చెప్పాడు: “దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్‌క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకురాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడియున్నవని ప్రత్యక్షపరచబడునట్లు వెలుగునొద్దకు వచ్చును.” (యోహాను 3:20, 21) దీని గురించి ఆలోచించండి: యోహాను, యేసును ‘ప్రతి మనుష్యుని వెలిగించే నిజమైన వెలుగుగా’ గుర్తించాడు. (యోహాను 1:9, 10) అయితే మనం ‘దుష్కార్యములు’ చేస్తే అంటే దేవునికి అనంగీకారమైన చెడు పనులు చేస్తే మనం వెలుగును ద్వేషించేవారిగా ఉంటాము. యేసును, ఆయన ప్రమాణాలను ద్వేషించడాన్ని మీరు ఊహించుకోగలరా? పశ్చాత్తాపపడకుండా పాపాలు చేసే వారందరూ అదే చేస్తున్నారు. బహుశా వాళ్ళు విషయాలను ఆ దృష్టితో చూడకపోవచ్చు కానీ యేసు మాత్రం అలాగే దృష్టిస్తాడు.
తప్పొప్పుల విషయంలో యేసు దృక్కోణాన్ని ఎలా పెంపొందించుకోవచ్చు?
11 యెహోవా దృష్టిలో ఏది సరైనది, ఏది సరైనది కాదు అనే విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మనం దేవుని వాక్యమైన బైబిలును అధ్యయనం చేయడం ద్వారానే ఆ విషయాన్ని అర్థం చేసుకుంటాము. మనం అలా బైబిలును అధ్యయనం చేసేటప్పుడు, కీర్తనకర్త ప్రార్థించినట్లే ఇలా ప్రార్థించడం అవసరం: “యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము, నీ త్రోవలను నాకు తేటపరచుము.” (కీర్తన 25:4) అయితే సాతాను మోసగాడు అని గుర్తుంచుకోండి. (2 కొరింథీయులు 11:14) అతను చెడును మరుగుచేసి, అప్రమత్తంగా లేని క్రైస్తవుడికి అది అంగీకారయోగ్యమైనదిగానే కనిపించేలా చేయగలడు. కాబట్టి మనం నేర్చుకున్నవాటి గురించి లోతుగా ధ్యానించి, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని” ఉపదేశాన్ని ఖచ్చితంగా అనుసరించాలి. (మత్తయి 24:45-47) అధ్యయనం చేయడం, ప్రార్థించడం, నేర్చుకున్నవాటిని ధ్యానించడం మనం పరిణతిగలవారిగా తయారవడానికి, ‘అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయబడిన జ్ఞానేంద్రియములు కలిగినవారిలో’ ఒకరిగా ఉండడానికి సహాయం చేస్తాయి. (హెబ్రీయులు 5:14) అప్పుడు మనం సరికానివాటిని ద్వేషించడానికి, సరైనవాటిని ప్రేమించడానికి మొగ్గు చూపిస్తాం.
12 మనం చెడును ద్వేషిస్తే మన హృదయాల్లో చెడు విషయాలకు సంబంధించిన కోరికలు పెరగడానికి అనుమతించము. యేసు మరణించిన తర్వాత ఎన్నో సంవత్సరాలకు అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “ఈ లోకమునైనను 1 యోహాను 2:15, 16.
లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే.”—13 లోకంలోని ప్రతీది చెడ్డది కాదు అని కొందరు తర్కించవచ్చు. అయితే, ఈ లోకమూ దాని ఆకర్షణలూ మనల్ని యెహోవా సేవనుండి సులభంగా పక్కకు మళ్ళించగలవు. అంతేకాక, లోకం అందించే ఏదీ కూడా మనల్ని దేవునికి సన్నిహితం చేయదు. కాబట్టి మనం లోకంలోని విషయాలను ప్రేమిస్తే, అవి చెడ్డవి కాకపోయినా, మనం ఒక ప్రమాదకరమైన మార్గంలో నడుస్తున్నట్లే లెక్క. (1 తిమోతి 6:9, 10) అలాగే లోకంలో అధికశాతం నిజంగా చెడు విషయాలే ఉన్నాయి, అవి మనల్ని భ్రష్టు పట్టించగలవు. మనం దౌర్జన్యాన్ని, ఐశ్వర్యాసక్తిని, లైంగిక దుర్నీతిని ప్రోత్సహించే సినిమాలను లేదా టీవీ కార్యక్రమాలను చూస్తే అవి మనకు మొదట అంగీకారయోగ్యంగా, ఆ తర్వాత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. తమ జీవన శైలిని మెరుగుపరచుకోవడమే లేదా వ్యాపార అవకాశాలను వృద్ధి చేసుకోవడమే లోకంగా బ్రతికే ప్రజలతో మనం సహవసిస్తే, అవే మనకు కూడా ప్రాముఖ్యమైన విషయాలుగా మారే అవకాశం ఉంది.—మత్తయి 6:24; 1 కొరింథీయులు 15:33.
14 మరోవైపున మనం యెహోవా వాక్యాన్నిబట్టి సంతోషిస్తే ‘శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును’ మనకు అంత ఆకర్షణీయంగా కనిపించవు. అంతేకాక, మనం దేవుని రాజ్యానికి సంబంధించిన కార్యకలాపాలను ముందుంచే ప్రజలతో సహవసిస్తే మనం కూడా వారిలానే తయారవుతాము, వారు ప్రేమించేవాటిని ప్రేమిస్తాం, వారు దూరంగా ఉండే వాటికి దూరంగా ఉంటాం.—కీర్తన 15:4; సామెతలు 13:20.
15 దుర్నీతిని ద్వేషించి నీతిని ప్రేమించడం, “తనయెదుట ఉంచబడిన ఆనందము”పై దృష్టి నిలపడానికి యేసుకు సహాయం చేసింది. (హెబ్రీయులు 12:1-2) మన విషయంలో కూడా అలాగే జరగవచ్చు. “లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి” అని మనకు తెలుసు. ఈ లోకం అందించే ఎలాంటి ఆనందమైనా తాత్కాలికమైనదే. అయితే “దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.” (1 యోహాను 2:17) యేసు, దేవుని చిత్తం చేశాడు కాబట్టే మానవులు నిత్యజీవం పొందే మార్గాన్ని సుగమం చేయగలిగాడు. (1 యోహాను 5:13) మనందరము ఆయనను అనుకరించి, ఆయన యథార్థతనుండి ప్రయోజనము పొందుదుము గాక.
హింసను ఎదుర్కోవడం
16 యేసు తన శిష్యులు తనను అనుకరించే మరో మార్గాన్ని సూచిస్తూ ఇలా చెప్పాడు: “నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము, మీరొకని నొకడు ప్రేమించవలెననుటయే నా ఆజ్ఞ.” (యోహాను 15:12, 13, 17) క్రైస్తవులు తమ సహోదరులను ప్రేమించడానికి అనేక కారణాలున్నాయి. అయితే యేసు ఈ సందర్భంలో, ప్రత్యేకంగా తన శిష్యులు ఈ లోకంలో ఎదుర్కొనే ద్వేషాన్ని మనస్సులో ఉంచుకుని మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు: “లోకము మిమ్మును ద్వేషించినయెడల మీకంటె ముందుగా నన్ను ద్వేషించెనని మీరెరుగుదురు. దాసుడు తన యజమానునికంటె గొప్పవాడు కాడు . . . లోకులు నన్ను హింసించినయెడల మిమ్మును కూడ హింసింతురు.” (యోహాను 15:18, 20) అవును హింసించబడే విషయంలో కూడా క్రైస్తవులు యేసులానే ఉంటారు. ఆ ద్వేషాగ్నిని తట్టుకోవాలంటే వారు తమ సహోదరులతో బలమైన ప్రేమపూర్వకమైన బంధాలను వృద్ధి చేసుకోవాలి.
17 లోకం క్రైస్తవులను ఎందుకు ద్వేషిస్తుంది? ఎందుకంటే యేసులాగే వారు కూడా “లోకసంబంధులు కారు.” (యోహాను 17:14, 16) వారు సైనిక, రాజకీయ వ్యవహారాల్లో తటస్థంగా ఉంటారు, వారు జీవపు పవిత్రతను గౌరవిస్తూ, ఉన్నతమైన నైతిక ప్రమాణాలకు అనుగుణంగా జీవిస్తూ బైబిలు సూత్రాలను పాటిస్తారు. (అపొస్తలుల కార్యములు 15:28, 29; 1 కొరింథీయులు 6:9-11) వారి ప్రాథమిక లక్ష్యాలు భౌతికమైనవి కాదుగాని ఆధ్యాత్మికమైనవి. వారు ఈ లోకంలోనే జీవించినా పౌలు వ్రాసినట్లు ‘ఈ లోకాన్ని అమితముగా అనుభవించరు.’ (1 కొరింథీయులు 7:31) నిజమే యెహోవాసాక్షుల ఉన్నతమైన ప్రమాణాలపట్ల కొందరు తమ ప్రశంసను వ్యక్తం చేశారు. అయితే యెహోవాసాక్షులు ప్రశంసలు పొందడానికి లేదా ఇతరుల అంగీకారం పొందడానికి రాజీధోరణి ప్రదర్శించరు. తత్ఫలితంగా లోకంలో చాలామంది వారిని అర్థం చేసుకోలేకపోతున్నారు, చాలామంది వారిని ద్వేషిస్తున్నారు.
18 యేసు బంధించబడి, చంపబడినప్పుడు యేసు అపొస్తలులు ఆయనపట్ల ఈ లోకానికున్న తీవ్రమైన ద్వేషాన్ని చూశారు, యేసు ఆ ద్వేషాన్ని ఎలా ఎదుర్కొన్నాడో కూడా వారు గమనించారు. గెత్సేమనే తోటలో యేసు వ్యతిరేకులు ఆయనను బంధించడానికి వచ్చినప్పుడు, పేతురు తన కత్తిదూసి ఆయనను రక్షించడానికి ప్రయత్నించాడు. అయితే యేసు పేతురుతో ఇలా అన్నాడు: “నీ కత్తి వరలో తిరిగి పెట్టుము; కత్తి పట్టుకొను వారందరు కత్తిచేతనే నశింతురు.” (మత్తయి 26:52; లూకా 22:50, 51) పూర్వం ఇశ్రాయేలీయులు ఖడ్గం ఉపయోగించి తమ శత్రువులను ఎదుర్కొనేవారు. అయితే ఆ తర్వాత పరిస్థితులు మారాయి. దేవుని రాజ్యం “ఈ లోకసంబంధమైనది కాదు,” కాబట్టి కాపాడవలసిన దేశ సరిహద్దులంటూ ఏమీ ఉండవు. (యోహాను 18:36) త్వరలోనే పేతురు ఒక ఆధ్యాత్మిక జనాంగంలో భాగమవబోతున్నాడు, ఆ జనాంగపు సభ్యులు పరలోక పౌరులుగా ఉంటారు. (గలతీయులు 6:16; ఫిలిప్పీయులు 3:20, 21) కాబట్టి ఆ సమయంనుండి యేసు అనుచరులు, ద్వేషాన్ని హింసను యేసు ఎదుర్కొన్నట్లే అంటే నిర్భయంగా శాంతియుతంగా ఎదుర్కొంటారు. వారు పర్యవసానాన్ని యెహోవాకే వదిలిపెట్టి, సహించడానికి కావలసిన బలం కోసం ఆయనపై ఆధారపడతారు.—లూకా 22:42.
19 కొన్ని సంవత్సరాల తర్వాత పేతురు ఇలా వ్రాశాడు: “క్రీస్తు . . . మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచిపోయెను. . . . ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను.” (1 పేతురు 2:21-23) యేసు హెచ్చరించినట్లుగానే క్రైస్తవులు ఆ తర్వాతి కాలంలో క్రూరమైన హింసను అనుభవించారు. మొదటి శతాబ్దంలోనూ మన కాలంలోనూ వారు యేసు మాదిరిని అనుసరించి, నమ్మకంగా సహించడంలో మంచి పేరు సంపాదించుకొని తాము శాంతియుతంగా తమ యథార్థతను కాపాడుకుంటామని చూపించారు. (ప్రకటన 2:9, 10) అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనందరం కూడా అలాగే చేద్దాము.—2 తిమోతి 3:12.
‘ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకోండి’
20 పౌలు రోమాలోని సంఘానికి ఇలా వ్రాశాడు: “ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనినవారై, శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసికొనకుడి.” (రోమీయులు 13:14) క్రైస్తవులు యేసును ఒక వస్త్రమువలే ధరిస్తారు. వారు ఆయన లక్షణాలను, చర్యలను ఎంత మేరకు అనుకరించడానికి కృషి చేస్తారంటే, అపరిపూర్ణంగానే అయినా, వారు తమ యజమానిని పోలి ఉంటారు.—1 థెస్సలొనీకయులు 1:6.
21 మనం మన యజమానియైన యేసు జీవితం గురించి సాధ్యమైనంత ఎక్కువగా తెలుసుకొని ఆయనలా జీవించడానికి కృషి చేస్తే మనం సమర్థవంతంగా ‘ప్రభువైన
యేసుక్రీస్తును ధరించుకోగలుగుతాము.’ మనం ఆయన వినయాన్ని, నీతిపట్ల ఆయనకున్న ప్రేమను, అక్రమముపట్ల ఆయనకున్న ద్వేషాన్ని, తన సహోదరులపట్ల ఆయనకున్న ప్రేమను, లోకసంబంధిగా ఉండకపోవడాన్ని, ఓర్పుతో కష్టాలను సహించడాన్ని అనుకరిస్తాము. మనం ‘శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసికొనము’ అంటే లౌకిక లక్ష్యాలను సాధించడం లేదా శారీరక కోరికలను తీర్చుకోవడం వంటివాటిని మన జీవితంలో ప్రధానమైనవాటిగా చేసుకోము. దానికి బదులు మనం ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు లేదా సమస్యను ఎదుర్కొనేటప్పుడు ఇలా ప్రశ్నించుకుంటాము: ‘ఈ పరిస్థితిలో యేసు ఏమి చేసేవాడు? నేనేమి చేయాలని ఆయన కోరుకుంటాడు?’22 చివరిగా మనం “రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించే” విషయంలో చురుగ్గా ఉండడంలో యేసును అనుకరిస్తాము. (మత్తయి 4:23; 1 కొరింథీయులు 15:58) ఆ విధంగా కూడా క్రైస్తవులు యేసు ఉంచిన మాదిరిని అనుసరిస్తారు, వారు ఎలా అనుసరిస్తారు అనేదాని గురించి తర్వాతి ఆర్టికల్ చర్చిస్తుంది.
మీరు వివరించగలరా?
• ఒక క్రైస్తవుడు వినయంతో ఉండడం ఎందుకు అవసరం?
• తప్పొప్పుల విషయంలో మనం సరైన దృక్కోణాన్ని ఎలా అలవర్చుకోవచ్చు?
• క్రైస్తవులు వ్యతిరేకతను హింసను ఎదుర్కొన్నప్పుడు ఏ విధంగా యేసును అనుకరిస్తారు?
• మనం ‘ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకోవడం’ ఎలా సాధ్యం?
[అధ్యయన ప్రశ్నలు]
1. క్రైస్తవులు అనుకరించడానికి యేసు ఎందుకు ఒక మంచి మాదిరిగా ఉన్నాడు?
2, 3. యేసు వినయం విషయంలో ఏయే విధాలుగా పరిపూర్ణమైన మాదిరిని ఉంచాడు?
4. ఏయే విషయాలు మానవులను గర్విష్ఠులుగా చేస్తాయి, గర్వం ఎందుకు ప్రమాదకరమైనది?
5. పెద్దలు వినయాన్ని ప్రదర్శించడం ఎందుకు ప్రాముఖ్యం?
6. క్రైస్తవ జీవితానికి సంబంధించిన ఏయే అంశాల్లో మనకు వినయం అవసరం?
7, 8. మనం వినయం పెంపొందించుకోగల కొన్ని మార్గాలు ఏవి?
9. యేసు తప్పొప్పులను ఎలా దృష్టించాడు?
10. మనం పశ్చాత్తాపపడకుండా ‘దుష్కార్యములు’ చేస్తూవుంటే, మనకు ఎలాంటి వైఖరి ఉందని చూపిస్తాము?
11. మనం తప్పొప్పుల విషయంలో యేసు దృక్కోణాన్ని పెంపొందించుకోవడానికి ఏది అవసరం?
12. బైబిల్లోని ఏ ఉపదేశము మనం చెడు పనులు చేయకుండా ఉండడానికి సహాయం చేస్తుంది?
13, 14. (ఎ) లోకంలోని విషయాలను ప్రేమించడం క్రైస్తవులకు ఎందుకు ప్రమాదకరమైనది? (బి) మనం లోకంలోని విషయాలను ప్రేమించకుండా ఎలా ఉండవచ్చు?
15. యేసులానే, నీతిని ప్రేమించి అక్రమమును ద్వేషించడం మనల్ని ఎలా బలపరుస్తుంది?
16. క్రైస్తవులు ఒకరినొకరు ప్రేమించుకోవాలని యేసు ఎందుకు ఉద్బోధించాడు?
17. లోకం నిజ క్రైస్తవులను ఎందుకు ద్వేషిస్తుంది?
18, 19. యేసు మాదిరిని అనుసరిస్తూ క్రైస్తవులు వ్యతిరేకతను హింసను ఎలా ఎదుర్కొంటారు?
20-22. క్రైస్తవులు ఏ విధంగా ‘ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుంటారు’?
[7వ పేజీలోని చిత్రం]
వినయం విషయంలో యేసు పరిపూర్ణమైన మాదిరినుంచాడు
[8వ పేజీలోని చిత్రం]
ప్రకటించడంతో సహా క్రైస్తవుల జీవితంలోని ప్రతీ అంశానికి వినయం అవసరం
[9వ పేజీలోని చిత్రం]
సాతాను అనుచితమైన వినోదాన్ని క్రైస్తవులకు అంగీకారయోగ్యమైనదిగా కనిపించేలా చేయగలడు
[10వ పేజీలోని చిత్రం]
మన సహోదరులపట్ల ఉన్న ప్రేమ మనం వ్యతిరేకతను ఎదుర్కోవడానికి మనల్ని బలపరుస్తుంది