కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సంపూర్ణంగా సాక్ష్యమివ్వడానికి శిక్షణ పొందడం

సంపూర్ణంగా సాక్ష్యమివ్వడానికి శిక్షణ పొందడం

సంపూర్ణంగా సాక్ష్యమివ్వడానికి శిక్షణ పొందడం

“మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురు.”​అపొస్తలుల కార్యములు 1:⁠8.

“నజరేయుడైన యేసు . . . దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించినవాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢసాక్ష్యమియ్యవలెనని మాకు ఆజ్ఞాపించెను.” (అపొస్తలుల కార్యములు 10:​38, 42) అపొస్తలుడైన పేతురు ఒక సువార్తికునిగా తనకు అప్పగించబడిన పని గురించి కొర్నేలీకి, ఆయన కుటుంబానికి పైవిధంగా వివరించాడు.

2 యేసు ఆ ఆజ్ఞ ఎప్పుడు ఇచ్చాడు? పేతురు బహుశా, పునరుత్థానం చేయబడిన యేసు పరలోకానికి ఆరోహణం కావడానికి ముందు చెప్పిన మాటల గురించి ఆలోచించి ఉండవచ్చు. ఆ సందర్భంలో యేసు తన నమ్మకమైన శిష్యులకు ఇలా చెప్పాడు: “మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురు.” (అపొస్తలుల కార్యములు 1:⁠8) అయితే ఆయన అలా చెప్పడానికి ముందే, యేసు శిష్యునిగా తనకు ఆయనపై ఉన్న విశ్వాసం గురించి ఇతరులతో మాట్లాడాలని పేతురుకు తెలుసు.

మూడు సంవత్సరాలపాటు శిక్షణ

3 సా.శ. 29వ సంవత్సరంలో బాప్తిస్మం తీసుకున్న కొన్ని నెలల తర్వాత యేసు, పేతురు ఆయన సహోదరుడు అంద్రెయ గలిలయ సముద్రంవద్ద జాలర్లుగా పనిచేస్తున్న ప్రాంతంలో ప్రకటించాడు. పేతురు అంద్రెయలు రాత్రంతా శ్రమపడినా ఫలితం పొందలేకపోయారు. అయినా యేసు వారికిలా చెప్పాడు: ‘దోనెను లోతునకు నడిపించి, చేపలు పట్టుటకు మీ వలలు వేయుడి.’ వారు యేసు చెప్పినట్లు చేసినప్పుడు, ‘విస్తారమైన చేపలు పట్టుకున్నారు, అందుచేత వారి వలలు పిగిలిపోవడం’ ప్రారంభించాయి. ఆ అద్భుతాన్ని చూసి పేతురు భయపడ్డాడు, అయితే యేసు ఆయనకు ధైర్యం చెబుతూ ఇలా అన్నాడు: “భయపడకుము, ఇప్పటినుండి నీవు మనుష్యులను పట్టువాడవై యుందువు.”​—⁠లూకా 5:4-10.

4 వెంటనే పేతురు అంద్రెయలతోపాటు జెబెదయి కుమారులైన యాకోబు యోహానులు తమ దోనెలను విడిచి యేసు శిష్యులుగా మారారు. వారు దాదాపు మూడు సంవత్సరాలపాటు ప్రకటనా యాత్రల్లో యేసుతో ప్రయాణించి, సువార్తికులుగా శిక్షణ పొందారు. (మత్తయి 10:7; మార్కు 1:16, 18, 20, 38; లూకా 4:43; 10:⁠9) ఆ శిక్షణాకాలం ముగిసినప్పుడు సా.శ. 33, నీసాను 14న యేసు వారికిలా చెప్పాడు: “నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటె మరి గొప్పవియు అతడు చేయును.” (యోహాను 14:​12) అంటే యేసు శిష్యులు యేసులాగే సంపూర్ణంగా సాక్ష్యమిస్తారు, అయితే వారు ఇంకా విస్తృత పరిధిలో సాక్ష్యమిస్తారు. వారు త్వరలోనే గ్రహించినట్లు, వారితోపాటు భవిష్యత్తులోని శిష్యులందరూ ‘సమస్త జనులకు యుగసమాప్తి వరకు’ సాక్ష్యమిస్తారు.​—⁠మత్తయి 28:19, 20.

5 మనం “యుగసమాప్తి”లో జీవిస్తున్నాము. (మత్తయి 24:⁠3) ఆ మొదటి శిష్యుల్లా మనం యేసుతోపాటు ఉండి ఆయన ప్రజలకు ఎలా ప్రకటిస్తున్నాడు అని గమనించలేము. అయినా మనం ఆయన ప్రకటించిన విధానం గురించి ఆయన తన అనుచరులకు ఇచ్చిన ఆదేశాల గురించి బైబిల్లో చదవడం ద్వారా ఆయనిచ్చిన శిక్షణనుండి ప్రయోజనం పొందవచ్చు. (లూకా 10:​1-11) అయితే ఈ ఆర్టికల్‌, యేసు తన శిష్యులకు చూపించిన మరొక ప్రాముఖ్యమైన విషయం గురించి అంటే ప్రకటనా పని విషయంలో కలిగివుండవలసిన సరైన వైఖరి గురించి చర్చిస్తుంది.

ప్రజల గురించిన చింత

6 యేసు అంత సమర్థవంతంగా ఎలా సాక్ష్యమివ్వగలిగాడు? ఒక కారణమేమిటంటే, ఆయనకు ప్రజలపట్ల ఎంతో శ్రద్ధ, చింత ఉండేవి. యేసు ‘నిరుపేదలయందును బీదలయందును కనికరించును’ అని కీర్తనకర్త ప్రవచించాడు. (కీర్తన 72:​13) నిజంగా ఆయన ఆ ప్రవచనాన్ని నెరవేర్చాడు. ఒక సందర్భాన్ని గురించి బైబిలు ఇలా చెబుతోంది: ‘ఆయన సమూహములను చూచి, వారు కాపరిలేని గొఱ్ఱెలవలె విసికి చెదరియున్నందున వారిమీద కనికరపడ్డాడు.’ (మత్తయి 9:​36) ఘోరమైన తప్పిదాలు చేసిన పాపులు కూడా ప్రజలపట్ల ఆయనకున్న శ్రద్ధను గ్రహించి ఆయనవైపు ఆకర్షించబడ్డారు.​—⁠మత్తయి 9:9-13; లూకా 7:36-38; 19:1-10.

7 నేడు ప్రజల విషయంలో మనం అదే చింతను ప్రదర్శిస్తే, మనం కూడా సమర్థవంతంగా సాక్ష్యమివ్వగలుగుతాము. పరిచర్యలో పాల్గొనే ముందు ఒక క్షణమాగి మనం ప్రజలకు చెప్పబోయే సమాచారం వారికి ఎంత ప్రాముఖ్యమైనది అనే విషయం గురించి ఎందుకు ఆలోచించకూడదు? కేవలం రాజ్యం మాత్రమే పరిష్కరించగల వారి సమస్యల గురించి ఆలోచించండి. మనమిచ్చే సందేశానికి ఎవరు అనుకూలంగా ప్రతిస్పందిస్తారో మనకు తెలియదు కాబట్టి, అందరి విషయంలోనూ అనుకూలమైన వైఖరితో ఉండాలని నిశ్చయించుకోండి. బహుశా మీరు కలవబోయే తర్వాతి వ్యక్తి మీలాంటి వారు ఎవరైనా వచ్చి తనకు సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాడేమో!

ప్రేమతో ప్రేరేపించబడడం

8 యేసు ప్రకటించిన సువార్త మానవజాతి ఎదుట ఉన్న అతి ప్రాముఖ్యమైన అంశాలకు అంటే యెహోవా చిత్తం నెరవేరడం, ఆయన నామము పరిశుద్ధపరచబడడం, ఆయన విశ్వసర్వాధిపత్యం నిరూపించబడడం అనే అంశాలకు సంబంధించినది. (మత్తయి 6:​9, 10) యేసు తన తండ్రిని ఎంతగానో ప్రేమించాడు, కాబట్టే ఆయన తన యథార్థతను చివరివరకూ కాపాడుకోవడానికి, పైన తెలపబడిన అంశాలను పరిష్కరించే దేవుని రాజ్యం గురించి సంపూర్ణంగా సాక్ష్యమివ్వడానికి ప్రేరేపించబడ్డాడు. (యోహాను 14:​31) నేడు యేసు అనుచరులు కూడా అదే విధంగా ప్రేరేపించబడ్డారు కాబట్టి వారు పరిచర్యలో అత్యంతాసక్తితో పాల్గొంటారు. అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట.” ఆ ఆజ్ఞల్లో సువార్తను ప్రకటించి శిష్యులను చేయమనే ఆజ్ఞ కూడా ఉంది.​—⁠1 యోహాను 5:3; మత్తయి 28:19, 20.

9 యేసు తన అనుచరులకు ఇలా చెప్పాడు: “మీరు నన్ను ప్రేమించినయెడల నా ఆజ్ఞలను గైకొందురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు.” (యోహాను 14:​15, 21) కాబట్టి యేసుపట్ల మనకున్న ప్రేమ సత్యం గురించి సాక్ష్యమివ్వడానికి, యేసు ఆజ్ఞాపించిన ఇతర విషయాలకు విధేయత చూపించడానికి మనల్ని ప్రేరేపించాలి. యేసు పునరుత్థానం చేయబడిన తర్వాత తన శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు పేతురును ఇలా ప్రోత్సహించాడు: “నా గొఱ్ఱె పిల్లలను మేపుము . . . నా గొఱ్ఱెలను కాయుము . . . నా గొఱ్ఱెలను మేపుము.” యేసు చెప్పిన పని చేయడానికి పేతురును ఏమి ప్రేరేపించాలి? యేసు పేతురును పదే పదే, “నన్ను ప్రేమించుచున్నావా? . . . నన్ను ప్రేమించుచున్నావా? . . . నన్ను ప్రేమించుచున్నావా?” అని అడిగినప్పుడు ఆ ప్రశ్నకు సమాధానమేమిటో సూచించాడు. అవును పేతురుకు యేసుపట్ల ఉన్న ప్రేమ, సత్యం గురించి సంపూర్ణంగా సాక్ష్యమివ్వడానికి, యేసు “గొఱ్ఱె పిల్లలను” వెదికి పట్టుకోవడానికి, ఆ తర్వాత వాటికి ఆధ్యాత్మిక కాపరిగా ఉండడానికి ఆయనను ప్రేరేపించాలి.​—⁠యోహాను 21:15-18.

10 నేడు మనకు పేతురులా యేసుతో వ్యక్తిగతంగా సహవసించే అవకాశం లేదు. అయినప్పటికీ యేసు మన కోసం చేసినవాటి గురించి మనకు లోతైన అవగాహన ఉంది. ఆయన “ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించునట్లు” చేసిన గొప్ప ప్రేమను తలచుకున్నప్పుడు మన హృదయాలు కదిలించబడతాయి. (హెబ్రీయులు 2:9; యోహాను 15:​13) పౌలు ఇలా వ్రాసినప్పుడు భావించినట్లే మనమూ భావిస్తాము: “క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది . . . జీవించువారికమీదట తమకొరకు కాక . . . [తన] కొరకే జీవించుటకు ఆయన అందరికొరకు మృతిపొందెను.” (2 కొరింథీయులు 5:​14, 15) మనం సంపూర్ణంగా సాక్ష్యమివ్వాలనే ఆజ్ఞను అత్యంతాసక్తితో నెరవేర్చడం ద్వారా యేసు మనపట్ల చూపించిన ప్రేమను మనం ఎంతో విలువైనదిగా ఎంచుతున్నామని, మనం కూడా ఆయనను ప్రేమిస్తున్నామని ప్రదర్శిస్తాము. (1 యోహాను 2:​3-5) యేసు బలిని ప్రాముఖ్యతలేని విషయంగా దృష్టిస్తున్నామని సూచించేలా మనం ప్రకటనా పనిపట్ల ఎన్నడూ ఉదాసీన వైఖరిని అలవర్చుకోవాలనుకోము.​—⁠హెబ్రీయులు 10:29.

సరైన దానిపై దృష్టి నిలపడం

11 పొంతి పిలాతు ఎదుటకు తీసుకురాబడినప్పుడు యేసు ఇలా అన్నాడు: “సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని.” (యోహాను 18:​37) యేసు తాను సత్యానికి సాక్ష్యమివ్వకుండా చేసేందుకు దేనినీ అనుమతించలేదు. ఆయన విషయంలో దేవుని చిత్తం అదే.

12 ఈ విషయంలో సాతాను యేసును పరీక్షించాడు. యేసు బాప్తిస్మం తీసుకున్న కొద్ది రోజులకే సాతాను ఆయనను ఈ లోకంలో ఒక గొప్ప వ్యక్తిగా చేస్తానని, ఆయనకు “లోకరాజ్యములన్నిటిని, వాటి మహిమను” ఇస్తానని ముందుకొచ్చాడు. (మత్తయి 4:​8, 9) ఆ తర్వాత యూదులు ఆయనను రాజుగా చేయాలని కోరుకున్నారు. (యోహాను 6:​15) కొందరు యేసు ఆ ప్రతిపాదనలను అంగీకరించడంవల్ల కలిగే ప్రయోజనాల గురించి ఆలోచిస్తూ, మానవ రాజుగా ఆయన కొనసాగివుంటే మానవాళికి మరింత మేలు చేసి ఉండేవాడు అని తర్కిస్తారు. అయితే యేసు అలాంటి ఆలోచనా విధానాన్ని తిరస్కరించాడు. ఆయన సత్యానికి సాక్ష్యమివ్వడంపైనే దృష్టి నిలిపాడు.

13 అంతేకాకుండా, యేసు ఆస్తులు సంపాదించుకొనే యావలో పక్కకు మళ్ళలేదు. అందువల్ల ఆయన సంపన్నుడిగా జీవించలేదు. ఆయనకు స్వంత ఇల్లు కూడా లేదు. ఒక సందర్భంలో ఆయన ఇలా అన్నాడు: “నక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్యకుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు.” (మత్తయి 8:​20) యేసు మరణించినప్పుడు, రోమా సైనికులు చీట్లు వేసుకున్న ఆయన వస్త్రం మాత్రమే ఆయనకున్న ఒకే ఒక్క విలువైన వస్తువుగా నమోదు చేయబడింది. (యోహాను 19:​23, 24) అలాగని యేసు జీవితం విఫలమైనట్లా? ఎంతమాత్రం కాదు!

14 అతి సంపన్నుడైన ఏ దాతైనా సాధించగల దానికంటే యేసు ఎంతో ఎక్కువ సాధించాడు. పౌలు ఇలా చెప్పాడు: “మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురుగదా? ఆయన ధనవంతుడై యుండియు మీరు తన దారిద్ర్యమువలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను.” (2 కొరింథీయులు 8:9; ఫిలిప్పీయులు 2:​5-8) యేసు వస్తుపరంగా పేదవాడే అయినా, వినయస్థులైన మానవులు పరిపూర్ణులుగా నిత్యజీవం పొందడానికి మార్గం సుగమం చేశాడు. మనం ఆయనకు ఎంత కృతజ్ఞులమై ఉన్నామో కదా! ఆయన దేవుని చిత్తం చేయడంపై దృష్టి నిలిపినందుకు ఆయనకు లభించిన బహుమానాన్నిబట్టి మనమెంత ఆనందిస్తున్నామో కదా!​—⁠కీర్తన 40:8; అపొస్తలుల కార్యములు 2:32, 33, 36.

15 నేడు యేసును అనుకరించాలని కృషి చేసే క్రైస్తవులు కూడా ధనార్జన తమను పక్కదారి పట్టించేందుకు అనుమతించరు. (1 తిమోతి 6:​9, 10) ఆస్తులు జీవితాన్ని సౌకర్యవంతంగా చేస్తాయని వారు ఒప్పుకుంటారు, అయితే ధనం తమ నిత్య భవిష్యత్తు విషయంలో ఏమీ చేయలేదని కూడా వారికి తెలుసు. యేసు మరణించినప్పుడు ఆయన వస్త్రం ఎలా ఆయనకు ఎందుకూ పనికిరాకుండా పోయిందో, అలాగే ఒక క్రైస్తవుడు మరణించినప్పుడు ఆయన ఆస్తులు కూడా ఆయనకు ఎందుకూ పనికిరావు. (ప్రసంగి 2:​10, 11, 17-19; 7:​12) ఒక క్రైస్తవుడు మరణించినప్పుడు, యెహోవాతోను యేసుక్రీస్తుతోను ఆయనకున్న సంబంధమే నిజమైన విలువగలదిగా ఉంటుంది.​—⁠మత్తయి 6:19-21; లూకా 16:⁠9.

వ్యతిరేకతనుబట్టి నిరుత్సాహపడలేదు

16 వ్యతిరేకత కారణంగా యేసు సత్యం గురించి సాక్ష్యమివ్వకుండా ఉండలేదు. తాను బలిగా మరణించడంతో తన భూపరిచర్య ముగిసిపోతుందని తెలిసి కూడా యేసు నిరుత్సాహపడలేదు. యేసు గురించి పౌలు ఇలా చెప్పాడు: “ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడిపార్శ్వమున ఆసీనుడైయున్నాడు.” (హెబ్రీయులు 12:​1-2) యేసు ‘అవమానమును నిర్లక్ష్యపెట్టాడు’ అని గమనించండి. వ్యతిరేకులు తన గురించి ఏమి భావిస్తున్నారనే విషయం గురించి ఆయన చింతించలేదు. ఆయన దేవుని చిత్తం చేయడంపైనే దృష్టి నిలిపాడు.

17 యేసు చూపించిన సహనంనుండి పాఠం నేర్చుకొమ్మని చెబుతూ పౌలు క్రైస్తవులను ఇలా ప్రోత్సహించాడు: “మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు, పాపాత్ములు తనకు వ్యతిరేకముగ చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి.” (హెబ్రీయులు 12:⁠3) ప్రతిరోజు వ్యతిరేకతను, అపహాస్యాన్ని ఎదుర్కోవడం కష్టంగానే ఉంటుంది. జీవితంలో “ఏదో ఒకటి సాధించాలి” అని ప్రోత్సహించే బంధువులను బహుశా నిరాశపరుస్తూ, ఈ లోకపు ఆకర్షణలను నిరోధిస్తూనే ఉండడం విసుగు పుట్టించవచ్చు. అయితే మనం యేసులాగే మన జీవితాల్లో రాజ్యసంబంధ విషయాలకు మొదటి స్థానమిస్తూ సహాయం కోసం యెహోవాపై ఆధారపడవచ్చు.​—⁠మత్తయి 6:33; రోమీయులు 15:13; 1 కొరింథీయులు 2:⁠4.

18 యేసు తన అవధానాన్ని పక్కకు మళ్ళించకూడదని నిర్ణయించుకున్నట్లు, ఆయన తన శిష్యులకు తాను మరణించబోతున్నానని చెప్పినప్పుడు స్పష్టమయ్యింది. పేతురు ‘నీకు అది దూరమగుగాక, అది నీ కెన్నడును కలుగదు’ అని ఆయనతో అన్నాడు. అయితే ఆయన, యెహోవా చిత్తం చేయాలనే తన తీర్మానాన్ని బలహీనపరచే ఎలాంటి మాటలనైనా వినడానికి ఇష్టపడలేదు. ఆయన పేతురుకు దూరంగా జరిగి “సాతానా, నా వెనుకకు పొమ్ము. నీవు నాకు అభ్యంతర కారణమైయున్నావు. నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక యున్నావు” అని గద్దించాడు. (మత్తయి 16:​21-23) మనం మనుష్యుల తలంపులను తిరస్కరించడంలో ఎల్లప్పుడూ అంతే బలంగా ఉందాము. అంతేగాక మనం ఎల్లప్పుడూ దేవుని తలంపులచేత నడిపించబడదాము.

నిజమైన ప్రయోజనాలను తెస్తుంది

19 యేసు తానే మెస్సీయానని చూపించడానికి ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆయన మృతులను కూడా లేపాడు. ఆ క్రియలు ప్రజలను ఆకర్షించాయి, అయితే యేసు కేవలం సమాజ సేవ చేయడానికి భూమికి రాలేదు. ఆయన సత్యానికి సాక్ష్యమివ్వడానికి వచ్చాడు. తాను అందించే భౌతిక ప్రయోజనాలు కేవలం తాత్కాలికమైనవని ఆయనకు తెలుసు. తాను పునరుత్థానం చేసినవారు కూడా మళ్ళీ మరణిస్తారని ఆయనకు తెలుసు. ఆయన సత్యానికి సాక్ష్యమివ్వడం ద్వారానే కొందరైనా నిత్యజీవం సంపాదించుకోవడానికి సహాయం చేయగలడు.​—⁠లూకా 18:28-30.

20 నేడు కొంతమంది ఆస్పత్రులను నిర్మించడం ద్వారా లేదా ప్రపంచంలోని పేద ప్రజలకు ఇతర సేవలు అందించడం ద్వారా యేసు చేసిన మంచి పనులను అనుకరించడానికి ప్రయత్నిస్తారు. కొన్ని సందర్భాల్లో తమకు వ్యక్తిగతంగా ఎంతో నష్టం వచ్చినా వారు అలాంటి మంచి పనులు చేస్తారు, వారి యథార్థత ప్రశంసనీయమైనది; కానీ వారు అందించే ఏ ఉపశమనమైనా కేవలం తాత్కాలికమైనదే. కేవలం రాజ్యం మాత్రమే శాశ్వతమైన ఉపశమనాన్ని తీసుకువస్తుంది. కాబట్టి యెహోవాసాక్షులు యేసులాగే ఆ రాజ్యం గురించిన సత్యానికి సాక్ష్యమివ్వడానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు.

21 అయితే నిజ క్రైస్తవులు మంచి పనులు కూడా చేస్తారు. పౌలు ఇలా వ్రాశాడు: “మనకు సమయము దొరకినకొలది అందరియెడలను, విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలు చేయుదము.” (గలతీయులు 6:​10) కష్ట సమయాల్లో లేదా ఎవరైనా అవసరంలో ఉన్నప్పుడు మనం మన పొరుగువారికి లేదా మన క్రైస్తవ సహోదరులకు ‘మేలు చేయడానికి’ వెనకాడము. అయినప్పటికీ మనం ప్రధానంగా దృష్టి నిలిపేది మాత్రం సత్యం గురించి సాక్ష్యమివ్వడంపైనే.

యేసు మాదిరినుండి నేర్చుకోండి

22 పౌలు ఇలా వ్రాశాడు: “అయ్యో, నేను సువార్తను ప్రకటింపక పోయినయెడల నాకు శ్రమ.” (1 కొరింథీయులు 9:​16) ఆయన సువార్త ప్రకటించే విషయంలో ఉదాసీనంగా ప్రవర్తించలేదు ఎందుకంటే అది తనకు, తాను చెప్పేది వినేవారికి జీవదాయకమైనది. (1 తిమోతి 4:​16) మనం కూడా మన పరిచర్యను అలాగే దృష్టిస్తాము. మనం మన పొరుగువారికి సహాయం చేయాలని కోరుకుంటాము. మనం యెహోవాపట్ల మనకున్న ప్రేమను ప్రదర్శించాలని కోరుకుంటాము. మనం యేసుపట్ల మనకున్న ప్రేమను, ఆయన మనపట్ల చూపించిన గొప్ప ప్రేమకు కృతజ్ఞతను చూపించాలని కోరుకుంటాము. కాబట్టి మనం సువార్తను ప్రకటించి ‘మనుజాశలను అనుసరించి నడుచుకొనక, దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొంటాము.’​—⁠1 పేతురు 4:1, 2.

23 ఇతరులు మనల్ని అపహసించినప్పుడు లేదా కోపంగా మన సందేశాన్ని తిరస్కరించినప్పుడు మనం యేసులాగే మన సేవనుండి పక్కకు తొలగము. యేసు తనను వెంబడించమని పేతురును, అంద్రెయను ఆహ్వానించినప్పుడు చేసిన అద్భుతంనుండి మనం ఒక పాఠం నేర్చుకుంటాము. మనం యేసుకు విధేయత చూపించి సూచనార్థకంగా మన వలలను ఫలవంతంకాని నీళ్ళలో వేసినప్పుడు, మనం మంచి ఫలితాలను సాధించే అవకాశం ఉందని అర్థం చేసుకుంటాము. చాలామంది క్రైస్తవ జాలరులు ఫలవంతంకాని నీటిలా కనిపించే నీటిలో ఎన్నో సంవత్సరాలపాటు వలలు వేసిన తర్వాత సమృద్ధిగా చేపలను పట్టుకున్నారు. ఇతరులు మరిన్ని చేపలు దొరికే అవకాశం ఉన్న ప్రాంతాలకు వెళ్ళి అక్కడ మరింత సమృద్ధిగా చేపలను పట్టుకోగలిగారు. మనమేమి చేసినా వలలు వేయడం మాత్రం ఆపుచేయము. భూమిపైనున్న ఏ ప్రాంతంలోను ప్రకటనా పని అయిపోయిందని యేసు ఇంకా ప్రకటించలేదని మనకు తెలుసు.​—⁠మత్తయి 24:14.

24 ప్రస్తుతం 60 లక్షలకంటే ఎక్కువమంది యెహోవాసాక్షులు 230 కంటే ఎక్కువ ప్రాంతాల్లో చురుగ్గా ప్రకటిస్తున్నారు. ఫిబ్రవరి 1, 2005, కావలికోట సంచికలో 2004వ సేవా సంవత్సరంలో యెహోవాసాక్షుల కార్యకలాపాలకు సంబంధించిన ప్రపంచవ్యాప్త వార్షిక నివేదిక ప్రచురించబడుతుంది. ప్రకటనా పనిని యెహోవా గొప్పగా ఆశీర్వదిస్తున్నాడని ఆ నివేదిక రుజువు చేస్తుంది. ఈ విధానానికి మిగిలివున్న సమయంలో మనం పౌలు అన్న ఈ ప్రేరణాత్మకమైన మాటలను లక్ష్యపెడుతూనే ఉందాము: “వాక్యమును ప్రకటించుము; . . . ప్రయాసపడుము.” (2 తిమోతి 4:⁠2) ప్రకటనా పని ముగిసింది అని యెహోవా చెప్పేంత వరకూ మనం సంపూర్ణంగా సాక్ష్యమిస్తూనే ఉందాము.

ఈ సంవత్సరం మొదలుకొని, ప్రపంచవ్యాప్త యెహోవాసాక్షుల సేవా సంవత్సరపు నివేదిక కావలికోట జనవరి 1వ సంచికలో ప్రచురించబడదు. అది ఫిబ్రవరి 1వ సంచికలో ప్రచురించబడుతుంది.

మీరు సమాధానం చెప్పగలరా?

యేసు తన శిష్యులకిచ్చిన శిక్షణనుండి మనమెలా ప్రయోజనం పొందవచ్చు?

యేసు తాను ప్రకటించిన ప్రజలపట్ల ఎలాంటి వైఖరిని ప్రదర్శించాడు?

సంపూర్ణంగా సాక్ష్యమివ్వడానికి మనల్ని ఏది ప్రేరేపిస్తుంది?

మనం యేసు చేసినట్లే, దేవుని చిత్తం చేయడంపైనే మన దృష్టిని ఏయే విధాలుగా నిలపవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. పేతురుకు అప్పగించబడిన పని ఏమిటి, ఆ పని చేయమని ఆయనకు ఎవరు ఆజ్ఞాపించారు?

3. యేసు ఏ అద్భుతం చేశాడు, ఆయన పేతురుకు, అంద్రెయకు ఏ ఆహ్వానమిచ్చాడు?

4. (ఎ) యేసు తన శిష్యులు సాక్ష్యమిచ్చేలా వారిని ఎలా సిద్ధం చేశాడు? (బి) యేసు పరిచర్యతో పోలిస్తే ఆయన శిష్యుల పరిచర్య ఎలా ఉంటుంది?

5. యేసు తన అనుచరులకిచ్చిన శిక్షణనుండి మనం ఏయే విధాలుగా ప్రయోజనం పొందవచ్చు?

6, 7. యేసుకున్న ఏ లక్షణం ఆయన పరిచర్యను ఫలవంతం చేసింది, ఈ విషయంలో మనం ఆయనను ఎలా అనుకరించవచ్చు?

8. యేసులాగే ఆయన అనుచరులు సువార్తను ప్రకటించడానికి వారిని ఏమి ప్రేరేపిస్తుంది?

9, 10. దేవునిపట్ల ప్రేమ ఉండడంతోపాటు ఇంకా ఎవరిపట్ల ప్రేమ ఉండడం మనం సంపూర్ణంగా సాక్ష్యమివ్వడానికి మనల్ని ప్రేరేపిస్తుంది?

11, 12. యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఆ పనిని తాను ఎంతో ప్రాముఖ్యమైనదిగా దృష్టిస్తున్నట్లు ఆయన ఎలా చూపించాడు?

13, 14. (ఎ) యేసును ఏది పక్కకు మళ్ళించలేకపోయింది? (బి) యేసు వస్తుపరంగా పేదవాడే అయినా, ఆయన ఏమి సాధించాడు?

15. ధనంకంటే విలువైనదేమిటి?

16. యేసు వ్యతిరేకతకు ఎలా ప్రతిస్పందించాడు?

17. యేసు సహనంనుండి మనమేమి నేర్చుకోవచ్చు?

18. యేసు పేతురుతో అన్న మాటలనుండి మనమే చక్కని పాఠం నేర్చుకోవచ్చు?

19. యేసు ఎన్నో అద్భుతాలు చేసినప్పటికీ, ఆయన పరిచర్యలో అత్యంత ప్రాముఖ్యమైన అంశం ఏమిటి?

20, 21. మంచి పనులు చేసే విషయంలో నిజ క్రైస్తవులు ఎలాంటి సమతుల్యాన్ని కాపాడుకుంటారు?

22. క్రైస్తవులు తమ పొరుగువారికి ఎందుకు ప్రకటిస్తారు?

23, 24. (ఎ) చేపలు పట్టడానికి సంబంధించిన అద్భుతం ద్వారా మనమే పాఠం నేర్చుకోవచ్చు? (బి) నేడు ఎవరు సంపూర్ణంగా సాక్ష్యమిస్తున్నారు?

[15వ పేజీలోని చిత్రం]

యేసు ప్రజలపట్ల చూపించిన శ్రద్ధను మనం కూడా చూపిస్తే మనం మన పరిచర్యలో సమర్థవంతంగా ఉంటాము

[16, 17వ పేజీలోని చిత్రం]

యేసు సత్యానికి సాక్ష్యమివ్వడానికే భూమికి వచ్చాడు

[17వ పేజీలోని చిత్రాలు]

యెహోవాసాక్షులు సంపూర్ణంగా సాక్ష్యమివ్వడానికే ఎక్కువ అవధానమిస్తారు