కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్రీస్తే ప్రవచనాల కేంద్ర బిందువు

క్రీస్తే ప్రవచనాల కేంద్ర బిందువు

క్రీస్తే ప్రవచనాల కేంద్ర బిందువు

“యేసునుగూర్చిన సాక్ష్యము ప్రవచనసారము.”​ప్రకటన 19:10.

అది సా.శ. 29వ సంవత్సరం. ఇశ్రాయేలులో ఎక్కడచూసినా వాగ్దానం చేయబడిన మెస్సీయను గురించిన వార్తలే వినబడుతున్నాయి. బాప్తిస్మమిచ్చు యోహాను పరిచర్య వారి అపేక్షలను మరింత పెంచింది. (లూకా 3:​15) అయితే యోహాను తాను క్రీస్తును కానని చెప్పాడు. బదులుగా ఆయన నజరేతుకు చెందిన యేసు గురించి చెబుతూ, “ఈయనే దేవుని కుమారుడని నేను తెలిసికొని సాక్ష్యమిచ్చితిని” అని అన్నాడు. (యోహాను 1:​20, 34) త్వరలోనే జనసమూహాలు యేసు బోధలను వినడానికి ఆయన ద్వారా స్వస్థత పొందడానికి ఆయనను వెంబడించడం ప్రారంభించాయి.

2 ఆ తర్వాతి నెలల్లో యెహోవా తన కుమారునికి సంబంధించి ఎన్నో రుజువులను ఇచ్చాడు. లేఖనాలను అధ్యయనం చేసినవారికి, యేసు కార్యాలను చూసినవారికి ఆయనపై విశ్వాసముంచేందుకు బలమైన ఆధారం లభించింది. అయితే దేవుని నిబంధనా ప్రజల్లో అధికశాతం మంది విశ్వాసం లేనివారిగా ప్రవర్తించారు. యేసే క్రీస్తని, ఆయన దేవుని కుమారుడని చాలా తక్కువమంది అంగీకరించారు. (యోహాను 6:​60-69) మీరు ఆ కాలంలో జీవించివుంటే ఏమి చేసి ఉండేవారు? యేసును మెస్సీయగా అంగీకరించి ఆయన నమ్మకమైన అనుచరుడయ్యేందుకు కదిలించబడేవారా? సబ్బాతును ఉల్లంఘించాడనే నింద తనపై మోపబడినప్పుడు యేసు తన గుర్తింపు గురించి స్వయంగా ఇచ్చిన రుజువులను పరిశీలించండి, తన నమ్మకమైన శిష్యుల విశ్వాసాన్ని బలపర్చడానికి ఆయన ఆ తర్వాత ఇచ్చిన రుజువులను కూడా గమనించండి.

యేసే స్వయంగా రుజువులు ఇచ్చాడు

3 అది సా.శ. 31వ సంవత్సరం పస్కా పండుగ సమయం. యేసు యెరూషలేములో ఉన్నాడు. ఆయన 38 సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తిని అప్పుడే స్వస్థపరిచాడు. అయితే యూదులు సబ్బాతు రోజున ఆ పని చేసినందుకు యేసును హింసించారు. ఆయన దైవదూషణ చేశాడని కూడా ఆరోపించి, దేవుణ్ణి తన తండ్రి అని పిలిచినందుకు ఆయనను చంపాలని చూశారు. (యోహాను 5:​1-9, 16-18) తన నిర్దోషత్వాన్ని నిరూపించుకోవడానికి యేసు మూడు బలమైన రుజువులను చూపించాడు, అవి యేసు నిజంగా ఎవరనే విషయంలో యథార్థవంతులైన యూదులనెవరినైనా ఒప్పించగలవు.

4 మొదటిగా యేసు తనకంటే ముందు వచ్చిన బాప్తిస్మమిచ్చు యోహాను సాక్ష్యాన్ని సూచిస్తూ ఇలా చెప్పాడు: “మీరు యోహాను నొద్దకు (కొందరిని) పంపితిరి; అతడు సత్యమునకు సాక్ష్యమిచ్చెను. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమైయుండెను, మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి.”​—⁠యోహాను 5:33, 35.

5 బాప్తిస్మమిచ్చు యోహాను “మండుచు ప్రకాశించుచున్న దీపము,” ఎందుకంటే హేరోదు ఆయనను అన్యాయంగా చెరసాలలో వేయకముందు ఆయన మెస్సీయ కోసం మార్గం సిద్ధం చేయమని దేవుడు తనకిచ్చిన పనిని నెరవేర్చాడు. యోహాను ఇలా చెప్పాడు: “ఆయన [మెస్సీయ] ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిస్మమిచ్చుచు వచ్చితిని. . . . ఆత్మ పావురమువలె ఆకాశమునుండి దిగివచ్చుట చూచితిని; ఆ ఆత్మ ఆయనమీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపినవాడు—నీవెవనిమీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చువాడని నాతో చెప్పెను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలిసికొని సాక్ష్యమిచ్చితిని.” * (యోహాను 1:​26-37) యేసు దేవుని కుమారుడని, వాగ్దానం చేయబడిన మెస్సీయ అని యోహాను ఖచ్చితంగా గుర్తించాడు. ఆయన సాక్ష్యం ఎంత స్పష్టంగా ఉండిందంటే ఆయన మరణించిన తర్వాత దాదాపు ఎనిమిది నెలలకు కొంతమంది యథార్థ హృదయులైన యూదులు ఇలా ఒప్పుకున్నారు: “ఈయననుగూర్చి యోహాను చెప్పిన సంగతులన్నియు సత్యమైనవి.”​—⁠యోహాను 10:41, 42.

6 తర్వాత యేసు తానే మెస్సీయనని ధృవపరచడానికి మరో రుజువును చూపించాడు. ఆయన తాను చేసిన మంచి పనులు తనకు దేవుని మద్దతు ఉందని రుజువు చేస్తున్నాయని చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు: “యోహాను సాక్ష్యముకంటె నా కెక్కువైన సాక్ష్యము కలదు; అదేమనిన, నేను నెరవేర్చుటకై తండ్రి యే క్రియలను నా కిచ్చియున్నాడో, నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి యున్నాడని నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి.” (యోహాను 5:​36) యేసు శత్రువులు కూడా ఆ రుజువును కాదనలేకపోయారు, ఆ రుజువులో భాగంగా యేసు ఎన్నో అద్భుతాలు చేశాడు. కొందరు “మనమేమి చేయుచున్నాము? ఈ మనుష్యుడు అనేకమైన సూచకక్రియలు చేయుచున్నాడే?” అని మాట్లాడుకున్నారు. (యోహాను 11:​47) కొందరు యేసు చేసిన అద్భుతాలను చూసి అనుకూలంగా ప్రతిస్పందించి ఇలా అన్నారు: “క్రీస్తు వచ్చునప్పుడు ఈయన చేసినవాటికంటె ఎక్కువైన సూచకక్రియలు చేయునా?” (యోహాను 7:​31) యేసును చూసినవారికి, తండ్రి లక్షణాలను ఆయన కుమారుడిలో గ్రహించే చక్కని అవకాశం లభించింది.​—⁠యోహాను 14:⁠9.

7 చివరిగా యేసు ఒక తిరుగులేని సాక్ష్యంవైపుకు అవధానం మళ్ళించాడు. “లేఖనములు . . . నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి” అంటూ, ఆయనింకా ఇలా అన్నాడు: “అతడు నన్ను గూర్చి వ్రాసెను గనుక మీరు మోషేను నమ్మినట్టయిన నన్నును నమ్ముదురు.” (యోహాను 5:​39, 46) క్రీస్తు గురించి వ్రాసిన చాలామంది క్రైస్తవపూర్వ సాక్షుల్లో మోషే కేవలం ఒకడు మాత్రమే. వారు వ్రాసినవాటిలో వందలాది ప్రవచనాలు, వివరణాత్మక వంశానుక్రమాలు ఉన్నాయి, అవన్నీ మెస్సీయను గుర్తించడానికి సహాయం చేస్తున్నాయి. (లూకా 3:23-38; 24:44-46; అపొస్తలుల కార్యములు 10:​43) మోషే ధర్మశాస్త్రం విషయమేమిటి? “క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయెను” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (గలతీయులు 3:​24) అవును “యేసునుగూర్చిన సాక్ష్యము ప్రవచనసారము [లేదా, దాని ఉద్దేశం, సంకల్పం].”​—⁠ప్రకటన 19:10.

8 ఈ రుజువులన్నీ, అంటే యోహాను ఇచ్చిన స్పష్టమైన సాక్ష్యము, యేసు చేసిన శక్తిమంతమైన కార్యాలు, ఆయనకున్న దైవిక లక్షణాలు, లేఖనాలు ఇచ్చే విస్తృతమైన సాక్ష్యము, ఇవన్నీ యేసే మెస్సీయ అని మిమ్మల్ని ఒప్పించడంలేదా? దేవునిపట్ల ఆయన వాక్యంపట్ల యథార్థమైన ప్రేమ ఉన్నవారు ఎవరైనా సరే ఈ రుజువులను ఇట్టే అర్థం చేసుకొని యేసే వాగ్దానం చేయబడిన మెస్సీయ అని ఆయనపై విశ్వాసం ఉంచుతారు. అయితే ఇశ్రాయేలు ప్రజల్లో అలాంటి ప్రేమ లోపించింది. యేసు తన వ్యతిరేకులతో ఇలా అన్నాడు: “నేను మిమ్మును ఎరుగుదును; దేవుని ప్రేమ మీలో లేదు.” (యోహాను 5:​42) వారు ‘అద్వితీయ దేవునివలన వచ్చు మెప్పును కోరుకునే’ బదులు ‘ఒకనివలన ఒకడు మెప్పుపొందుచున్నారు.’ వారు యేసుతో ఏకీభవించలేదంటే అందులో ఆశ్చర్యం లేదు ఎందుకంటే యేసు తన తండ్రిలాగే అలాంటి ఆలోచనా విధానాన్ని అసహ్యించుకుంటాడు!​—⁠యోహాను 5:43, 44; అపొస్తలుల కార్యములు 12:21-23.

ప్రవచనాత్మక దర్శనంతో బలపర్చబడ్డారు

9 యేసు తానే మెస్సీయనని నిరూపించుకోవడానికి పైన పేర్కొనబడిన రుజువులు ఇచ్చి ఒక సంవత్సరం గడిచింది. సా.శ. 32వ సంవత్సరపు పస్కా పండుగ వచ్చి వెళ్ళిపోయింది. యేసుపై విశ్వాసముంచిన చాలామంది హింస, ఐశ్వర్యాసక్తి, లేదా జీవిత చింతల కారణంగా ఆయనను వెంబడించడం మానుకున్నారు. ప్రజలు యేసును రాజుగా చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆయన నిరాకరించడం చూసి ఇతరులు తికమకపడి ఉండవచ్చు లేదా నిరుత్సాహపడి ఉండవచ్చు. యూదా మత నాయకులు ఆయనను సవాలు చేసినప్పుడు ఆయన తనను మహిమపరిచే సూచకక్రియ చేయడానికి నిరాకరించాడు. (మత్తయి 12:​38, 39) ఆయన అలా నిరాకరించడం కూడా కొందరిని తికమకపెట్టి ఉండవచ్చు. అంతేకాక, యేసు తన శిష్యులకు అర్థం చేసుకోవడం కష్టమనిపించిన సంగతులను వారికి చెప్పడం ప్రారంభించాడు, “తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దలచేతను ప్రధాన యాజకులచేతను శాస్త్రులచేతను అనేక హింసలు పొంది, చంపబడాలి” అని ఆయన చెప్పాడు.​—⁠మత్తయి 16:21-23.

10 మరో తొమ్మిది పది నెలల్లో “[యేసు] ఈ లోకమునుండి తండ్రియొద్దకు వెళ్లవలసిన గడియ” వస్తుంది. (యోహాను 13:⁠1) యేసు తన నమ్మకమైన శిష్యుల గురించి చింతిస్తూ, విశ్వాసరహిత యూదులకు ఏదైతే చేయనని చెప్పాడో దానినే చేస్తానని అంటే పరలోకంనుండి ఒక సూచకక్రియ చేసి చూపిస్తానని తన శిష్యులలో కొందరికి వాగ్దానం చేశాడు. “ఇక్కడ నిలిచియున్నవారిలో కొందరు, మనుష్యకుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచువరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను” అని యేసు చెప్పాడు. (మత్తయి 16:​28) ఆ మాటలు అన్నప్పుడు యేసు, తన శిష్యులలో కొందరు 1914లో మెస్సీయ రాజ్యము స్థాపించబడే వరకూ జీవించివుంటారని చెప్పడం లేదు. యేసు తనకు అత్యంత సన్నిహితులైన ముగ్గురు శిష్యులకు తన రాజ్యాధికార మహిమకు ముంగుర్తుగా ఉండే దర్శనం చూపించాలనుకున్నాడు. ముంగుర్తుగా చూపించబడిన ఆ దర్శనం రూపాంతరము అని పిలువబడుతోంది.

11 ఆరు రోజుల తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహానును ఒక ఎత్తైన పర్వతం పైకి, బహుశా హెర్మోను పర్వతం పైకి తీసుకెళ్ళాడు. అక్కడ ఆయన “వారి యెదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యునివలె ప్రకాశించెను; ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లనివాయెను.” ప్రవక్తలైన మోషే, ఏలీయా కూడా ఆయనతో మాటలాడుతూ కనిపించారు. ఈ అసాధారణ సంఘటన రాత్రిపూట జరిగి ఉంటుంది, అందుకే అది మరింత ప్రత్యేకంగా కనిపించింది. అది ఎంత వాస్తవమైనదిగా కనిపించిందంటే పేతురు వెంటనే మూడు పర్ణశాలలు​—⁠యేసుకు, మోషేకు, ఏలీయాకు ఒక్కొక్కటి చొప్పున​—⁠కడతానని ముందుకొచ్చాడు. పేతురు ఇంకా మాట్లాడుతుండగానే ఒక ప్రకాశవంతమైన మేఘము వారిని కమ్ముకుంది, ఆ మేఘమునుండి వినబడిన స్వరం ఇలా చెప్పింది: “ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నాను, ఈయన మాట వినుడి.”​—⁠మత్తయి 17:1-6.

12 పేతురు అంతకుముందే యేసు ‘సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు’ అని సాక్ష్యమిచ్చాడు. (మత్తయి 16:​16) అయితే దేవుడే స్వయంగా అలా సాక్ష్యమిచ్చి తన అభిషిక్త కుమారుని గుర్తింపును, ఆయన పాత్రను ధృవీకరించడాన్ని ఊహించుకోండి! రూపాంతర దర్శనం పేతురు, యాకోబు, యోహానుల విశ్వాసాన్ని ఎంతగా బలపరిచి ఉంటుందో కదా! వారి విశ్వాసం అంతగా బలపర్చబడింది కాబట్టి వారు జరగబోయే వాటిని ఎదుర్కోవడానికి, భవిష్యత్తు సంఘంలో ముఖ్యమైన పాత్ర వహించడానికి మరింత సంసిద్ధులయ్యారు.

13 రూపాంతరము శిష్యుల మనస్సులపై శాశ్వతమైన ముద్ర వేసింది. పేతురు 30 కంటే ఎక్కువ సంవత్సరాల తర్వాత ఇలా వ్రాశాడు: “ఈయన నా ప్రియకుమారుడు ఈయనయందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్యమహిమనుండి ఆయన [యేసు] యొద్దకు వచ్చినప్పుడు, తండ్రియైన దేవునివలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతముమీద ఆయనతోకూడ ఉండినవారమై, ఆ శబ్దము ఆకాశమునుండి రాగా వింటిమి.” (2 పేతురు 1:​17, 18) యోహాను కూడా ఆ సంఘటన చూసి అంతే కదిలించబడ్డాడు. అది జరిగిన 60 కంటే ఎక్కువ సంవత్సరాల తర్వాత ఆయన ఈ మాటలు వ్రాసినప్పుడు దానినే సూచిస్తున్నాడని స్పష్టమవుతోంది: “తండ్రివలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి.” (యోహాను 1:​14) అయితే రూపాంతరము యేసు అనుచరులకు అనుగ్రహించబడిన ఆఖరి దర్శనం కాదు.

దేవుని నమ్మకమైన సేవకులకు అదనపు జ్ఞానం

14 యేసు పునరుత్థానం చేయబడిన తర్వాత గలిలయ సముద్రంవద్ద తన శిష్యులకు కనిపించాడు. అక్కడ ఆయన పేతురుతో ఇలా అన్నాడు: “నేను వచ్చువరకు అతడు [యోహాను] ఉండుట నాకిష్టమైతే అది నీకేమి?” (యోహాను 21:​1, 20-22, 24) ఆ మాటలు, అపొస్తలుడైన యోహాను మిగతా అపొస్తలుల కంటే ఎక్కువ కాలం జీవిస్తాడని సూచిస్తున్నాయా? యేసు భావం అదే అయ్యుండవచ్చు, ఎందుకంటే యోహాను అప్పటినుండి దాదాపు మరో 70 సంవత్సరాలపాటు నమ్మకంగా యెహోవా సేవ చేశాడు. అయితే యేసు మాటలు మరో విషయాన్ని కూడా సూచించాయి.

15 “నేను వచ్చువరకు” అనే మాటలు, యేసు అంతకుముందు “మనుష్యకుమారుడు తన రాజ్యముతో వచ్చుట” గురించి ప్రస్తావించాడని మనకు గుర్తు చేస్తాయి. (మత్తయి 16:​28) యేసు వచ్చేవరకూ యోహాను ఉంటాడంటే, యేసు తన రాజ్యాధికారంతో రావడాన్ని యోహాను ఒక దర్శనంలో చూసే వరకు ఉంటాడని దాని భావం. యోహాను తన జీవితపు చరమాంకంలో పత్మాసు ద్వీపంపై దేశాంతరవాసిగా ఉన్నప్పుడు, “ప్రభువు దినమందు” జరగబోయే సంఘటనలకు సంబంధించిన అద్భుతమైన ప్రవచనాత్మక సూచనలుగల ప్రకటన గ్రంథంలోని వివరాలు ఆయనకు దర్శనాల్లా చూపించబడ్డాయి. ఆ మహిమాన్వితమైన దర్శనాలతో యోహాను ఎంతగా కదిలించబడ్డాడంటే, యేసు “అవును, త్వరగా వచ్చుచున్నాను,” అని చెప్పినప్పుడు వెంటనే యోహాను “ఆమేన్‌, ప్రభువైన యేసూ, రమ్ము” అని అన్నాడు.​—⁠ప్రకటన 1:1, 10; 22:20.

16 మొదటి శతాబ్దంలోని యథార్థ హృదయులు యేసును మెస్సీయగా స్వీకరించి ఆయనయందు విశ్వాసముంచారు. విశ్వాసులయ్యేవారి చుట్టూ విశ్వాసంలేని ప్రజలుంటారు కాబట్టి, వారు ఇంకా ఎంతో పని చేయవలసి ఉంది కాబట్టి, వారికి ఎన్నో పరీక్షలు ఎదురవబోతున్నాయి కాబట్టి వారిని బలపర్చడం అవసరమైంది. యేసు తన నమ్మకమైన అనుచరులను ప్రోత్సహించేందుకు తానే మెస్సీయనని నిరూపించడానికి ఎన్నో రుజువులనిచ్చాడు, అంతేకాక వారి జ్ఞానాన్ని పెంచే ప్రవచనాత్మకమైన దర్శనాలనిచ్చాడు. నేడు మనం “ప్రభువు దినము”లో చాలా ముందుకు వచ్చాము. త్వరలోనే క్రీస్తు సాతాను దుష్ట విధానాన్నంతటినీ నాశనం చేసి దేవుని ప్రజలను దానినుండి విడిపిస్తాడు. మనం కూడా యెహోవా మన ఆధ్యాత్మిక సంక్షేమం కోసం చేసిన ఏర్పాట్లన్నిటిని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ మన విశ్వాసాన్ని బలపర్చుకోవాలి.

అంధకారంనుండి, కష్టాలనుండి రక్షించబడ్డారు

17 యేసు మరణించిన తర్వాత ఆయన శిష్యులు, “యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును” తనకు సాక్షులైయుండమని ఆయన ఇచ్చిన ఆజ్ఞను ధైర్యంగా నెరవేర్చారు. (అపొస్తలుల కార్యములు 1:⁠8) తీవ్రమైన హింస ఎదురైనప్పటికీ, కొత్తగా రూపొందించబడిన క్రైస్తవ సంఘాన్ని యెహోవా ఆధ్యాత్మిక జ్ఞానంతోనూ ఎంతోమంది కొత్త శిష్యులతోనూ ఆశీర్వదించాడు.​—⁠అపొస్తలుల కార్యములు 2:​47; 4:1-31; 8:1-8.

18 మరోవైపున సువార్తను వ్యతిరేకించినవారి పరిస్థితి మరింత క్షీణించింది. “భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాము దేనిమీద పడునది వారికి తెలియదు” అని సామెతలు 4:⁠19 చెబుతోంది. సా.శ. 66లో రోమా సైన్యాలు యెరూషలేమును ఆక్రమించినప్పుడు ఆ “గాఢాంధకారము” మరింత ప్రగాఢమయ్యింది. ఒకసారి ఏ కారణం లేకుండానే తమ సైన్యాలను ఉపసంహరించుకున్న రోమన్‌లు తిరిగివచ్చి సా.శ. 70లో యెరూషలేమును నాశనం చేశారు. యూదా చరిత్రకారుడు జోసీఫస్‌ ప్రకారం అప్పుడు పది లక్షల కంటే ఎక్కువమంది యూదులు మరణించారు. అయితే నమ్మకమైన క్రైస్తవులు మాత్రం తప్పించుకున్నారు. ఎందుకు? ఎందుకంటే మొదటిసారి రోమా సైన్యం వెనక్కి వెళ్ళినప్పుడు, అక్కడినుండి పారిపొమ్మని యేసు ఇచ్చిన ఆజ్ఞకు వారు లోబడ్డారు.​—⁠లూకా 21:20-22.

19 మన పరిస్థితి కూడా అలాగే ఉంది. రానున్న మహాశ్రమలు సాతాను దుష్ట విధానమంతా నాశనమవుతుందని సూచిస్తాయి. కానీ దేవుని ప్రజలు భయపడనక్కర్లేదు ఎందుకంటే యేసు ఇలా వాగ్దానం చేశాడు: “ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నాను.” (మత్తయి 28:​20) యేసు తన తొలి శిష్యుల విశ్వాసాన్ని బలపర్చడానికీ, వారికి ఎదురవబోయేవాటి కోసం వారిని సిద్ధం చేయడానికీ మెస్సీయ రాజుగా తన పరలోక మహిమ ముంగుర్తును వారికి చూపించాడు? నేటి సంగతేమిటి? 1914లో ఆ ముంగుర్తు వాస్తవ రూపం దాల్చింది. అది దేవుని ప్రజల విశ్వాసాన్ని ఎంతగా బలపర్చిందో కదా! అది అద్భుతమైన భవిష్యత్తును వాగ్దానం చేస్తోంది, ఆ వాస్తవం గురించి యెహోవా సేవకులకు క్రమేణా మరింత అంతర్దృష్టి దయచేయబడింది! నేడు అంధకారం అంతకంతకూ ఎక్కువవుతున్న లోకంలో, ‘పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లుతోంది.’​—⁠సామెతలు 4:18.

20 అభిషిక్త క్రైస్తవుల చిన్న గుంపు 1914 కంటే ముందు నుంచే ప్రభువు రాకడకు సంబంధించిన ప్రాముఖ్యమైన సత్యాలను అర్థం చేసుకోవడం ప్రారంభించింది. ఉదాహరణకు, సా.శ. 33లో యేసు పరలోకానికి ఆరోహణమయ్యేటప్పుడు శిష్యులకు కనిపించిన ఇద్దరు దేవదూతలు సూచించినట్లు ఆయన రాకడ అదృశ్యంగా ఉంటుందని వారు గ్రహించారు. శిష్యులకు కనిపించకుండా ఒక మేఘము యేసును కమ్ముకున్నప్పుడు ఆ దేవదూతలు ఇలా చెప్పారు: “మీయొద్దనుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యీ యేసే, ఏ రీతిగా పరలోకమునకు వెళ్లుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును.”​—⁠అపొస్తలుల కార్యములు 1:9-11.

21 యేసు పరలోకానికి ఆరోహణమైనప్పుడు కేవలం ఆయన నమ్మకమైన అనుచరులు మాత్రమే దానిని చూశారు. రూపాంతరములాగే అది అందరికీ బహిరంగంగా కనిపించలేదు; సాధారణ ప్రజలకు దాని గురించి తెలియదు. క్రీస్తు రాజ్యాధికారంతో వచ్చినప్పుడు కూడా అదే జరుగుతుంది. (యోహాను 14:19) రాజుగా ఆయన ప్రత్యక్షతను కేవలం ఆయన నమ్మకమైన అభిషిక్త శిష్యులు మాత్రమే గ్రహించగలరు. అలా గ్రహించడం వారిపై ఎంత గొప్ప ప్రభావాన్ని చూపిస్తుందో, యేసు భూలోక నివాసులుగా ఉండేందుకు లక్షలాదిమంది సమకూర్చబడడానికి అది కారణమెలా అవుతుందో మనం తర్వాతి ఆర్టికల్‌లో చూద్దాము.​—⁠ప్రకటన 7:9, 14.

[అధస్సూచి]

^ పేరా 8 యేసు బాప్తిస్మమప్పుడు యోహాను మాత్రమే దేవుని స్వరం విన్నాడని స్పష్టమవుతోంది. యేసు ఎవరితో మాట్లాడుతున్నాడో ఆ యూదులు “ఏ కాలమందైనను ఆయన [దేవుని] స్వరము వినలేదు; ఆయన స్వరూపము చూడలేదు.”​—⁠యోహాను 5:37.

మీకు గుర్తున్నాయా?

సబ్బాతును ఉల్లంఘించాడని, దైవదూషణ చేశాడని నిందించబడినప్పుడు యేసు తానే మెస్సీయనని నిరూపించడానికి ఏ రుజువులను ఇచ్చాడు?

యేసు తొలి శిష్యులు రూపాంతర దర్శనంనుండి ఎలా ప్రయోజనం పొందారు?

తాను వచ్చేవరకూ యోహాను ఉంటాడని చెప్పినప్పుడు యేసు భావమేమిటి?

1914లో ఏ ముంగుర్తు వాస్తవ రూపం దాల్చింది?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. (ఎ) సా.శ. 29 మొదలుకొని ఇశ్రాయేలీయులకు ఎలాంటి నిర్ణయం తీసుకోవలసిన పరిస్థితి ఎదురైంది? (బి) ఈ ఆర్టికల్‌లో ఏమి పరిశీలించబడుతుంది?

3. యేసు ఏ పరిస్థితుల కారణంగా నిజంగా తానెవరనే విషయంలో రుజువులు ఇవ్వాల్సి వచ్చింది?

4, 5. యోహాను పరిచర్య సంకల్పమేమిటి, ఆయన దానిని ఎంత సమర్థవంతంగా నెరవేర్చాడు?

6. యేసు చేసిన పనులు ఆయనకు దేవుని మద్దతు ఉందని ప్రజలను ఎందుకు ఒప్పించి ఉండాల్సింది?

7. హీబ్రూ లేఖనాలు యేసు గురించి ఎలా సాక్ష్యమిస్తున్నాయి?

8. చాలామంది యూదులు మెస్సీయపై ఎందుకు విశ్వాసం ఉంచలేదు?

9, 10. (ఎ) యేసు తన శిష్యులకు సూచకక్రియ చేసి చూపించాలనుకోవడం ఎందుకు సరైన సమయానికి లభించిన సహాయంగా ఉంది? (బి) యేసు తన శిష్యులకు ఏ గమనార్హమైన వాగ్దానం చేశాడు?

11. రూపాంతర దర్శనాన్ని వర్ణించండి.

12, 13. రూపాంతర దర్శనం యేసు శిష్యులపై ఎలాంటి ప్రభావం చూపించింది, అది వారిని ఎందుకు ప్రభావితం చేసింది?

14, 15. అపొస్తలుడైన యోహాను ఏ విధంగా యేసు వచ్చే వరకూ ఉంటాడు?

16. మనం మన విశ్వాసాన్ని బలపర్చుకుంటూనే ఉండడం ఎందుకు ప్రాముఖ్యం?

17, 18. మొదటి శతాబ్దంలో యేసు అనుచరులకూ దేవుని సంకల్పాన్ని వ్యతిరేకించినవారికీ మధ్య ఎలాంటి తేడా ఉంది, ప్రతీ వర్గానికి చెందినవారికి ఎలాంటి ఫలితాలు లభించాయి?

19, 20. (ఎ) ప్రస్తుత దుష్ట విధానం అంతానికి దగ్గరవుతుండగా దేవుని ప్రజలు ఎందుకు భయపడనక్కర్లేదు? (బి) 1914కు ముందు దశాబ్దాల్లో జరగబోయే సంఘటనల గురించి యెహోవా తన ప్రజలకు ఎలాంటి అసాధారణమైన అంతర్దృష్టిని దయచేశాడు?

21. తర్వాతి ఆర్టికల్‌లో ఏమి చర్చించబడుతుంది?

[10వ పేజీలోని చిత్రాలు]

యేసు తానే మెస్సీయనని నిరూపించడానికి రుజువులను చూపించాడు

[12వ పేజీలోని చిత్రం]

రూపాంతర దర్శనం విశ్వాసాన్ని బలపర్చింది

[13వ పేజీలోని చిత్రాలు]

యేసు ‘వచ్చేవరకూ’ యోహాను ఉండవలసి వచ్చింది