కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

న్యాయాధిపతులు పుస్తకంలోని ముఖ్యాంశాలు

న్యాయాధిపతులు పుస్తకంలోని ముఖ్యాంశాలు

యెహోవా వాక్యము సజీవమైనది

న్యాయాధిపతులు పుస్తకంలోని ముఖ్యాంశాలు

తన సొంత ప్రజలు తనను విసర్జించి అబద్ధ దేవుళ్ళను పూజించడం ప్రారంభిస్తే యెహోవా ఎలా ప్రతిస్పందిస్తాడు? వారు పదే పదే తనకు అవిధేయత చూపిస్తూ, కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే తనను ఆశ్రయిస్తుంటే ఆయనేమి చేస్తాడు? అప్పుడు కూడా ఆయన వారికి తప్పించుకునే మార్గం చూపిస్తాడా? ఈ ప్రశ్నలకు, ఇతర ప్రాముఖ్యమైన ప్రశ్నలకు న్యాయాధిపతులు పుస్తకం సమాధానాలు ఇస్తోంది. సుమారు సా.శ.పూ. 1100 నాటికి సమూయేలు ప్రవక్త పూర్తి చేసిన ఈ పుస్తకం దాదాపు 330 సంవత్సరాల చరిత్రను అంటే యెహోషువ మరణం మొదలుకొని ఇశ్రాయేలు మొదటి రాజు అధికారానికి వచ్చేంత వరకు జరిగిన సంఘటనలను తెలియజేస్తోంది.

న్యాయాధిపతులు పుస్తకం దేవుని శక్తిమంతమైన వాక్యంలో లేదా సందేశంలో ఒక భాగం, కాబట్టి అది మనకు ఎంతో విలువైనది. (హెబ్రీయులు 4:​12) దానిలో వ్రాయబడిన ఉత్తేజకరమైన వృత్తాంతాలు మనం దేవుని వ్యక్తిత్వాన్ని మరింత ఎక్కువగా అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తాయి. వాటినుండి మనం నేర్చుకునే పాఠాలు మన విశ్వాసాన్ని బలపరిచి, మనం “వాస్తవమైన జీవమును,” అంటే దేవుడు వాగ్దానం చేసిన నూతనలోకంలో నిత్యజీవమును సంపాదించుకోవడానికి సహాయం చేస్తాయి. (1 తిమోతి 6:12, 18; 2 పేతురు 3:​13) యెహోవా తన ప్రజలను రక్షించడానికి చేసిన కార్యాలు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు భవిష్యత్తులో చేయబోయే మరింత గొప్ప విమోచనకు ముంగుర్తుగా ఉన్నాయి.

న్యాయాధిపతులు ఎందుకు అవసరమయ్యారు?

(న్యాయాధిపతులు 1:1-3:6)

యెహోషువ నాయకత్వం క్రింద కనాను దేశపు రాజులను ఓడించిన తర్వాత, ఇశ్రాయేలు ప్రజలు తమ తమ గోత్రాల చొప్పున తమకివ్వబడిన స్వాస్థ్యము ప్రకారము ఆ దేశాన్ని స్వాధీనపరచుకున్నారు. అయితే వారు ఆ దేశ నివాసులను అందులోనుండి వెళ్ళగొట్టలేదు. అది ఆ తర్వాత వారికి ప్రమాదకరంగా పరిణమించింది.

యెహోషువ కాలం తర్వాతి తరమువారికి ‘యెహోవా గురించి, ఆయన ఇశ్రాయేలీయుల కోసం చేసిన కార్యముల గురించి’ తెలియదు. (న్యాయాధిపతులు 2:​10) అంతేకాక, ప్రజలు కనానీయులను పెళ్ళి చేసుకొని వారి దేవుళ్ళను పూజించడం ప్రారంభించారు. కాబట్టి యెహోవా ఇశ్రాయేలీయులను వారి శత్రువుల చేతికి అప్పగించాడు. అయితే వారి శత్రువులు వారిని తీవ్రంగా అణచివేయడం ప్రారంభించినప్పుడు, ఇశ్రాయేలీయులు సహాయం కోసం సత్య దేవుణ్ణి వేడుకున్నారు. ఇశ్రాయేలు మతపరమైన, సామాజికపరమైన, రాజ్యాధికార సంబంధిత పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు, యెహోవా తన ప్రజలను వారి శత్రువులనుండి రక్షించడానికి వరుసగా న్యాయాధిపతులను నియమించడాన్ని గురించిన వృత్తాంతం ప్రారంభమయ్యింది.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

1:​2, 4​—⁠తమకివ్వబడిన ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే మొదటి గోత్రంగా యూదా ఎందుకు నియమించబడింది? నిజానికి ఆ ఆధిక్యత యాకోబు మొదటి కుమారుడైన రూబేను గోత్రంవారికి చెందాలి. అయితే యాకోబు మరణశయ్యపై ఉన్నప్పుడు, మొదటి కుమారునిగా రూబేను తన హక్కును కోల్పోయాడు కాబట్టి అతను అతిశయము పొందడు అని ప్రవచించాడు. నిర్దయగా ప్రవర్తించిన షిమ్యోను, లేవి ఇశ్రాయేలులో చెదరగొట్టబడతారు అని ఆయన చెప్పాడు. (ఆదికాండము 49:​3-5, 7) కాబట్టి ఆ ఆధిక్యత పొందడానికి అర్హతగల తర్వాతి వ్యక్తి యాకోబు నాల్గవ కుమారుడైన యూదా. యూదాతోపాటు వెళ్ళిన షిమ్యోనుకు, యూదా విస్తృతమైన క్షేత్రంలో అక్కడక్కడా చిన్న చిన్న ప్రాంతాలు ఇవ్వబడ్డాయి. *​—⁠యెహోషువ 19:⁠9.

1:​6, 7​—⁠ఓడిపోయిన రాజుల కాళ్ళు చేతుల బొట్టన వ్రేళ్ళు ఎందుకు కోయబడ్డాయి? కాళ్ళు చేతుల బొట్టన వ్రేళ్ళను పోగొట్టుకున్న వ్యక్తి సైనిక చర్యలకు పనికిరాడు. బొట్టన వ్రేళ్లు లేకుండా సైనికుడు ఖడ్గాన్ని లేదా ఈటెను ఎలా ఉపయోగించగలడు? కాళ్ళ బొట్టన వ్రేళ్ళు పోగొట్టుకున్న వ్యక్తికి సరైన సమతుల్యతను కాపాడుకుని స్థిరంగా నిలబడే సామర్థ్యం ఉండదు.

మనకు పాఠాలు:

2:​10-12. మనం ‘యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువకుండా’ ఉండాలంటే క్రమంగా బైబిలును అధ్యయనం చేయాలి. (కీర్తన 103:⁠2) తల్లిదండ్రులు దేవుని వాక్యపు సత్యాన్ని తమ పిల్లల హృదయాల్లో నాటాలి.​—⁠ద్వితీయోపదేశకాండము 6:6-9.

2:​14, 21, 22. యెహోవా అవిధేయులైన తన ప్రజలను దండించడానికి, వారిని సరిదిద్దడానికి, వారు తన వద్దకు తిరిగి వచ్చేలా వారిని కదిలించడానికి, వారు కష్టాలు అనుభవించేందుకు అనుమతిస్తాడు.

యెహోవా న్యాయాధిపతులను పుట్టించాడు

(న్యాయాధిపతులు 3:7-16:31)

న్యాయాధిపతులు సాధించిన గొప్ప విజయాలకు సంబంధించిన వృత్తాంతం, మెసొపొతమియ రాజుకు ఎనిమిది సంవత్సరాలపాటు దాసులుగా ఉన్న ఇశ్రాయేలీయులను ఒత్నీయేలు విడిపించడంతో ప్రారంభమవుతుంది. న్యాయాధిపతియైన ఏహూదు సాహసోపేతమైన యుద్ధ ప్రణాళికతో, స్థూలకాయుడైన మోయాబు రాజు ఎగ్లోనును చంపాడు. ధైర్యవంతుడైన షమ్గరు మునుకోల కఱ్ఱను ఉపయోగించి ఒంటి చేత్తో 600 మంది ఫిలిష్తీయులను హతమార్చాడు. ప్రవక్త్రినిగా సేవచేస్తున్న దెబోరా ప్రోత్సాహముతో, యెహోవా మద్దతుతో బారాకు చాలా తక్కువ ఆయుధాలతో ఉన్న పదివేలమంది పురుషులతో వెళ్ళి శక్తిమంతమైన సీసెరా సైన్యాన్ని ఓడించి తరిమివేశాడు. ఆ తర్వాత యెహోవా గిద్యోనును న్యాయాధిపతిగా నియమించి, ఆయనకూ 300 మంది పురుషులుగల ఆయన సైన్యానికి మిద్యానీయులపై విజయాన్ని అందించాడు.

యెఫ్తా ద్వారా యెహోవా ఇశ్రాయేలీయులను అమ్మోనీయులనుండి విడిపించాడు. ఇశ్రాయేలుకు న్యాయాధిపతులుగా పనిచేసిన 12 మంది పురుషుల్లో తోలా, యాయీరు, ఇబ్సాను, ఏలోను, అబ్దోను కూడా ఉన్నారు. ఫిలిష్తీయులతో పోరాడిన సమ్సోనుతో న్యాయాధిపతుల కాలము ముగిసింది.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

4:⁠8​—⁠దెబోరా ప్రవక్త్రిని తనతోపాటు యుద్ధరంగానికి రావాలని బారాకు ఎందుకు పట్టుపట్టాడు? సీసెరా సైన్యంతో పోరాడడానికి తాను ఒక్కడే వెళితే సరిపోదని బారాకు భావించినట్లు స్పష్టమవుతోంది. ప్రవక్త్రిని తమతో కూడా ఉంటే, తమకు దేవుని నడిపింపు ఉంటుందని తనూ తన మనుష్యులూ నిశ్చింతగా ఉండడమే కాక తమకు ఆత్మవిశ్వాసం కూడా కలుగుతుందని ఆయన భావించాడు. కాబట్టి దెబోరా తనతో రావాలని పట్టుపట్టడం బారాకు బలహీనతను సూచించలేదు కానీ ఆయనకున్న బలమైన విశ్వాసాన్ని సూచించింది.

5:​20​—⁠బారాకు తరఫున ఆకాశమునుండి నక్షత్రాలు ఎలా యుద్ధం చేశాయి? నక్షత్రాలు యుద్ధం చేయడమంటే దేవదూతల సహాయం లభించిందా, ఉల్కలు పడితే వాటిని సీసెరా మనుష్యులు అపశకునంగా భావించారా, లేదా సీసెరా విషయంలో చెప్పబడిన జ్యోతిష్యం విఫలమయ్యిందా అనే విషయం బైబిలు చెప్పడం లేదు. అయితే ఈ విషయంలో దేవుడు ఏదో విధంగా జోక్యం చేసుకున్నాడు అనేది మాత్రం నిస్సంశయం.

7:​1-3; 8:​10​—⁠శత్రు సైన్యంలోని 1,35,000 మందితో యుద్ధం చేయడానికి గిద్యోను సైన్యంలోని 32,000 మంది ఎక్కువవుతారని యెహోవా ఎందుకు అన్నాడు? ఎందుకంటే గిద్యోనుకు ఆయన పురుషులకు విజయం ఇచ్చేది యెహోవా. వారు మిద్యానీయులను తమ సొంత శక్తితో ఓడించామని తలంచకూడదని దేవుడు కోరుకున్నాడు.

11:​30, 31​—⁠యెఫ్తా యెహోవాకు మ్రొక్కుకున్నప్పుడు, మానవ బలి అర్పించాలని తలంచాడా? యెఫ్తా అలా ఆలోచించివుండడు ఎందుకంటే ధర్మశాస్త్రం ఇలా నిర్దేశించింది: “తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానిని . . . మీ మధ్య ఉండనియ్యకూడదు.” (ద్వితీయోపదేశకాండము 18:​10, 11) అయితే యెఫ్తా ఒక జంతువును కాక ఒక వ్యక్తినే మనస్సులో ఉంచుకొని అలా మ్రొక్కుకున్నాడు. ఎందుకంటే బలి అర్పించదగ్గ జంతువులను ఇశ్రాయేలీయులు ఇళ్ళలో ఉంచుకునేవారు కాదు. అంతేకాక ఒక జంతువును అర్పించడం అసాధారణమైన విషయమేమీ కాదు. తనను కలుసుకోవడానికి తన ఇంటినుండి వచ్చే వ్యక్తి తన కూతురే కావచ్చని కూడా యెఫ్తాకు తెలుసు. యెఫ్తా తన ఇంటినుండి వచ్చిన వ్యక్తిని ‘దహనబలిగా అర్పిస్తాను’ అన్నప్పుడు, ఆ వ్యక్తిని యెహోవా గుడారములో ఆయనకు అవిభాగిత సేవ చేయడానికి అంకితం చేస్తానని ఆయన భావం.

మనకు పాఠాలు:

3:​10. ఆధ్యాత్మిక లక్ష్యాలను చేరుకోవాలంటే మానవ వివేచన కాదు కాని యెహోవా పరిశుద్ధాత్మ అవసరం.​—⁠కీర్తన 127:⁠1.

3:​21. ఏహూదు తన ఖడ్గాన్ని నైపుణ్యవంతంగా ధైర్యంగా ఉపయోగించాడు. మనం “దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గమును” నైపుణ్యవంతంగా ఉపయోగించడం నేర్చుకోవాలి. అంటే మనం మన పరిచర్యలో లేఖనాలను ధైర్యంగా ఉపయోగించాలి.​—⁠ఎఫెసీయులు 6:17; 2 తిమోతి 2:15.

6:​11-15; 8:​1-3, 22, 23. గిద్యోను వినయం మనకు మూడు ముఖ్యమైన పాఠాలను నేర్పిస్తుంది: (1) మనకు ఒక సేవాధిక్యత ఇవ్వబడినప్పుడు, మనం దానితోపాటు మనకు వచ్చే బాధ్యత గురించి ఆలోచించాలి కానీ దానితోపాటు హోదా, ప్రతిష్ఠ వస్తుందని కాదు. (2) గొడవలు పెట్టుకోవడానికి మొగ్గు చూపేవారితో వ్యవహరించేటప్పుడు వినయం ప్రదర్శించడమే జ్ఞానయుక్తమైనది. (3) హోదా కోసం ప్రాకులాడేవారిగా ఉండకుండా వినయం మనల్ని కాపాడుతుంది.

6:​17-22, 36-40. మనం కూడా జాగ్రత్తగా ఉండి ‘ప్రతి ఆత్మను నమ్మకూడదు, ఆ యా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించాలి.’ (1 యోహాను 4:1) కొత్తగా పెద్ద అయిన క్రైస్తవుడు తాను ఇవ్వాలనుకుంటున్న ఉపదేశం దేవుని వాక్యంపై బలంగా ఆధారపడి ఉందని నిశ్చయపర్చుకోవడానికి మరింత అనుభవజ్ఞుడైన పెద్దను సంప్రదించడం జ్ఞానయుక్తం.

6:​25-27. గిద్యోను తన వ్యతిరేకులకు అనవసరంగా కోపం కలిగించకుండా ఉండడానికి విచక్షణా జ్ఞానాన్ని ఉపయోగించాడు. సువార్తను ప్రకటించేటప్పుడు మనం మాట్లాడే పద్ధతితో అనవసరంగా ఇతరులకు కోపం తెప్పించకుండా జాగ్రత్తగా ఉండాలి.

7:⁠6. యెహోవాకు సేవ చేసే విషయంలో మనం గిద్యోను 300 మంది పురుషుల్లాగే చురుగ్గా, అప్రమత్తంగా ఉండాలి.

9:​8-15. అహంకారంతో ప్రవర్తించడం, హోదా లేదా అధికారం కావాలని వాంఛించడం ఎంత అవివేకమైనది!

11:​35-37. యెఫ్తా ఉంచిన మంచి మాదిరి, ఆయన కూతురు బలమైన విశ్వాసాన్ని స్వయంత్యాగ స్ఫూర్తిని పెంపొందించుకోవడానికి సహాయం చేసి ఉంటుందనడంలో సందేహం లేదు. నేడు తల్లిదండ్రులు తమ పిల్లల కోసం అలాంటి మాదిరి ఉంచవచ్చు.

11:​40. యెహోవా సేవ చేయడానికి సుముఖత చూపించిన వ్యక్తిని ప్రశంసిస్తే, అది ఆ వ్యక్తిని ప్రోత్సహిస్తుంది.

13:⁠8. తల్లిదండ్రులు తమ పిల్లలకు బోధించేటప్పుడు నడిపింపు కోసం యెహోవాకు ప్రార్థించి, ఆయనిచ్చే మార్గనిర్దేశాన్ని అనుసరించాలి.​—⁠2 తిమోతి 3:16.

14:​16, 17; 16:​16. ఏడ్చి పోరుపెట్టడం ద్వారా ఒక వ్యక్తిని ఒత్తిడి చేయడంవల్ల సంబంధం పాడవుతుంది.​—⁠సామెతలు 19:13; 21:19.

ఇశ్రాయేలులో జరిగిన ఇతర తప్పులు

(న్యాయాధిపతులు 17:1-21:25)

న్యాయాధిపతులు పుస్తకంలోని ఆఖరి భాగంలో రెండు అసాధారణమైన వృత్తాంతాలు ఉన్నాయి. మొదటి వృత్తాంతం మీకా అనే వ్యక్తి గురించి చెబుతోంది, అతను తన ఇంట్లో ఒక విగ్రహాన్ని నిలబెట్టి తన కోసం యాజకుడిగా ఉండడానికి ఒక లేవీయుడిని నియమించుకున్నాడు. దానీయులు లాయిషు లేదా లెషెము పట్టణాన్ని నాశనం చేసిన తర్వాత తమ సొంత పట్టణాన్ని నిర్మించుకొని దానికి దాను అని పేరు పెట్టుకున్నారు. వారు మీకా విగ్రహాన్ని, అతని యాజకుడిని ఉపయోగించి దాను పట్టణంలో మరో విధమైన ఆరాధనను ప్రారంభించారు. లాయిషు యెహోషువ మరణానికి ముందు స్వాధీనం చేసుకోబడినట్లు స్పష్టమవుతోంది.​—⁠యెహోషువ 19:47.

రెండవ సంఘటన యెహోషువ మరణం తర్వాత కొద్దికాలానికే జరిగింది. బెన్యామీను నగరమైన గిబియాకు చెందిన కొంతమంది పురుషులు కలిసి చేసిన సామూహిక లైంగిక నేరం కారణంగా దాదాపు బెన్యామీను గోత్రమంతా నశించింది, కేవలం 600 మంది పురుషులు బ్రతికి బయటపడ్డారు. అయితే ఆ తర్వాత వారు ఒక పద్ధతి ప్రకారం తమకు భార్యలను తెచ్చుకున్నారు, దావీదు పరిపాలనా కాలానికి వారి సంఖ్య దాదాపు 60,000 మంది యోధులకు పెరిగింది.​—⁠1 దినవృత్తాంతములు 7:6-11.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

17:⁠6; 21:​25​—⁠‘ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించడం’ అల్లకల్లోలాన్ని సృష్టించిందా? లేదు, ఎందుకంటే యెహోవా తన ప్రజలకు మార్గనిర్దేశం ఇవ్వడానికి ఎన్నో ఏర్పాట్లు చేశాడు. ఆయన వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, తన మార్గాలను నేర్పించడానికి యాజకులను ఏర్పాటు చేశాడు. ప్రధాన యాజకుడు ఊరీము తుమ్మీముల సహాయంతో ప్రాముఖ్యమైన విషయాల గురించి దేవుణ్ణి సంప్రదించగలిగేవాడు. (నిర్గమకాండము 28:30) అంతేకాక ప్రతి పట్టణంలోను ఆధారపడదగిన ఉపదేశం ఇచ్చే సామర్థ్యంగల పెద్దలు ఉండేవారు. ఒక ఇశ్రాయేలీయుడు ఆ ఏర్పాట్లను సద్వినియోగం చేసుకుంటే, అతని మనస్సాక్షికి ఆధారపడదగిన మార్గనిర్దేశం లభించేది. అతడు ఆ విధంగా ‘తన ఇష్టానుసారముగా ప్రవర్తించినప్పుడు’ మంచి ఫలితాలు వచ్చేవి. మరోవైపున ఒక వ్యక్తి ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేసి ప్రవర్తన విషయంలో ఆరాధన విషయంలో తన సొంత నిర్ణయాలు తీసుకుంటే పర్యవసానాలు చెడుగా ఉండేవి.

20:​17-48​—⁠బెన్యామీనీయులు శిక్షించబడవలసి ఉన్నా వారు ఇతర గోత్రాలపై రెండుసార్లు విజయం సాధించేందుకు యెహోవా ఎందుకు అనుమతించాడు? నమ్మకమైన గోత్రాలు మొదట ఘోరంగా నష్టపోయేందుకు అనుమతించడం ద్వారా యెహోవా, ఇశ్రాయేలునుండి చెడుతనాన్ని పూర్తిగా నిర్మూలించే విషయంలో వారికున్న పట్టుదలను పరీక్షించాడు.

మనకు పాఠాలు:

19:​14, 15. గిబియాలోని ప్రజలు ఆతిథ్యం ఇవ్వడానికి సుముఖత చూపించకపోవడం, ఒక గంభీరమైన నైతిక లోపాన్ని సూచించింది. క్రైస్తవులు ‘ఆతిథ్యము ఇవ్వాలి’ అని ప్రోత్సహించబడ్డారు.​—⁠రోమీయులు 12:13.

ముందున్న విడుదల

త్వరలోనే దేవుని రాజ్యం క్రీస్తు యేసు అధికారంలో ఈ దుష్ట లోకాన్ని నాశనం చేసి నీతిమంతులను, నిర్దోషులను విడిపిస్తుంది. (సామెతలు 2:21, 22; దానియేలు 2:44) ‘అప్పుడు యెహోవా శత్రువులందరూ నశిస్తారు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యునివలె ఉంటారు.’ (న్యాయాధిపతులు 5:31) మనం న్యాయాధిపతులు పుస్తకంలోనుండి నేర్చుకున్న విషయాలను అన్వయించుకోవడం ద్వారా యెహోవాను ప్రేమించేవారమని నిరూపించుకుందాము.

న్యాయాధిపతుల వృత్తాంతంలో పదేపదే సూచించబడిన ప్రాథమిక సత్యం ఇదే: యెహోవాకు విధేయత చూపించడం గొప్ప ఆశీర్వాదాలకు, అవిధేయత చూపించడం ఘోరమైన పర్యవసానాలకు దారితీస్తుంది. (ద్వితీయోపదేశకాండము 11:26-28) మనకు వెల్లడి చేయబడిన దేవుని చిత్తానికి ‘హృదయపూర్వకముగా లోబడడం’ ఎంత ప్రాముఖ్యమో కదా!​—⁠రోమీయులు 6:17; 1 యోహాను 2:17.

[అధస్సూచి]

^ పేరా 10 లేవీయులకు వాగ్దాన దేశంలో స్వాస్థ్యము ఇవ్వబడలేదు గానీ ఇశ్రాయేలంతటిలో అక్కడక్కడా 48 పట్టణాలు మాత్రం ఇవ్వబడ్డాయి.

[25వ పేజీలోని మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

“యెహోవా వారికొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకొనువారి చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షించిరి.”​—⁠న్యాయాధిపతులు 2:16

న్యాయాధిపతులు

1. ఒత్నీయేలు

2. ఏహూదు

3. షమ్గరు

4. బారాకు

5. గిద్యోను

6. తోలా

7. యాయీరు

8. యెఫ్తా

9. ఇబ్సాను

10. ఏలోను

11. అబ్దోను

12. సమ్సోను

దాను

మనష్షే

నఫ్తాలి

ఆషేరు

జెబూలును

ఇశ్శాఖారు

మనష్షే

గాదు

ఎఫ్రాయిము

దాను

బెన్యామీను

రూబేను

యూదా

[26వ పేజీలోని చిత్రం]

దెబోరా తనతోపాటు యుద్ధరంగానికి రావాలని బారాకు పట్టుపట్టడం నుండి మీరే పాఠం నేర్చుకున్నారు?