కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ భవితవ్యాన్ని మీరు నియంత్రించుకోగలరా?

మీ భవితవ్యాన్ని మీరు నియంత్రించుకోగలరా?

మీ భవితవ్యాన్ని మీరు నియంత్రించుకోగలరా?

మనకు చివరకు ఏమి సంభవించనుందో ముందే నిర్ధారించబడిందా? మనం మన జీవితంలో చేసే ఎంపికలు మన భవిష్యత్తు మీద ఎలాంటి ప్రభావం చూపించవా?

మనిషి తన తలరాతని స్వయంగా మార్చుకోగలడే అనుకుందాం. అలాగైతే, ఫలానా పని చేయడానికి లేదా బాధ్యతగల ఒక స్థానంలో ఉండడానికి ఎవరినైనా ముందుగానే నిర్ణయించే అవకాశం ఉందా? తమ భవితవ్యాన్ని స్వయంగా తీర్చిదిద్దుకునే స్వేచ్ఛ మానవులకే ఉన్నట్లయితే, భూమి విషయంలో దేవుడు తన చిత్తాన్ని ఎలా నెరవేర్చగలడు? ఈ ప్రశ్నలకు బైబిలు సంతృప్తికరమైన జవాబులు ఇస్తోంది.

విధి నిర్ణయం, స్వతంత్రంగా నిర్ణయించుకునే శక్తి—⁠ఈ రెండూ సరైనవేనా?

యెహోవా మనల్ని ఎలా సృష్టించాడో పరిశీలించండి. “దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను” అని బైబిలు చెబుతోంది. (ఆదికాండము 1:​27) దేవుని స్వరూపంలో సృష్టించబడిన మనకు ప్రేమ, న్యాయం, జ్ఞానం, శక్తి వంటి ఆయన లక్షణాలను ప్రతిబింబించే సామర్థ్యం ఉంది. దేవుడు మనకు స్వతంత్రంగా నిర్ణయించుకునే శక్తిని లేదా ఎంపిక చేసుకునే స్వేచ్ఛను కూడా ఇచ్చాడు. ఆ స్వేచ్ఛ భూమ్మీద ఆయన సృష్టించినవాటిలో మనల్ని ప్రత్యేకమైన వారిగా చేస్తుంది. దేవుని నైతిక మార్గదర్శకాన్ని అనుసరించాలా వద్దా అనేది మనం ఎంపిక చేసుకోవచ్చు. అందుకే మోషే ప్రవక్త ఇలా చెప్పగలిగాడు: ‘నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ యెదుటను ఉంచి, భూమ్యాకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీవును నీ సంతానమును బ్రదుకుచు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనునట్లును జీవమును కోరుకొనుడి.’​—⁠ద్వితీయోపదేశకాండము 30:​19, 20.

అయితే ఎంపిక చేసుకునే స్వేచ్ఛ అంటే సంపూర్ణ స్వేచ్ఛ అని అర్థం కాదు. ఈ విశ్వ స్థిరత్వం కోసం, శాంతి కోసం దేవుడు ఏర్పాటు చేసిన భౌతిక, నైతిక నియమాల నుండి ఆ స్వేచ్ఛ మనల్ని స్వతంత్రులను చేయదు. ఆ నియమాలు మన మంచి కోసమే, వాటిని ఏ మాత్రం అతిక్రమించినా అది తీవ్ర పరిణామాలకు దారితీయగలదు. మనం గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని పెడచెవినపెట్టి, ఎత్తైన ఒక భవనం మీద నుండి దూకితే ఏమవుతుందో ఊహించండి!​—⁠గలతీయులు 6:⁠7.

ఎంపిక చేసుకునే స్వేచ్ఛ, మన మీద కొన్ని బాధ్యతలను కూడా పెడుతుంది. ఈ బాధ్యతలు స్వేచ్ఛ లేని ప్రాణులకు లేవు. కార్లిస్‌ లామోంట్‌ అనే రచయిత ఇలా ప్రశ్నిస్తున్నాడు: “మానవుని ఎంపికలూ చర్యలూ ముందే నిర్ధారించబడ్డాయి అని మనం నమ్ముతున్నట్లయితే . . . వారికి నైతిక బాధ్యతను అంటగట్టి వారి చెడు ప్రవర్తన విషయంలో వారిని ఎలా శిక్షించగలం?” అలా ఎంతమాత్రం శిక్షించలేం. సహజ ప్రవృత్తితో జీవించే జంతువుల మీద వాటి క్రియలకు సంబంధించిన నైతిక బాధ్యత మోపరు, లేదా ప్రోగ్రామ్‌ చేసిన ప్రకారం పనిచేసే కంప్యూటర్లకు బాధ్యత ఉన్నట్లు పరిగణించరు. కాబట్టి ఎంపిక చేసుకునే స్వేచ్ఛ, మన మీద గొప్ప బాధ్యతను ఉంచుతూ మనం చేసే పనులకు మనల్ని జవాబుదారులుగా చేస్తుంది.

యెహోవా దేవుడు మనం చేపట్టాల్సిన విధానాన్ని మనం పుట్టక ముందే నిర్ధారించి, మనం చేసే పనులకు మనల్ని బాధ్యులుగా ఎంచితే, ఆయనెంతటి ప్రేమరహితుడిగా, అన్యాయస్థుడిగా దృష్టించబడతాడో కదా! కానీ ఆయన అలా చేయడు, ఎందుకంటే “దేవుడు ప్రేమాస్వరూపి,” “ఆయన చర్యలన్నియు న్యాయములు.” (1 యోహాను 4:⁠8; ద్వితీయోపదేశకాండము 32:⁠4) ఆయన మనకు ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఇచ్చి, అదే సమయంలో విధి నిర్ణయాన్ని నమ్మేవారు వాదించినట్లు ఆయన ‘భవిష్యత్తులో ఎవరిని రక్షించాలి ఎవరిని నాశనం చేయాలి’ అని ముందెప్పుడో నిర్ణయించడు. ఎంపిక చేసుకునే స్వేచ్ఛ విధి నిర్ణయం అనే సిద్ధాంతాన్ని అర్థరహితమని రుజువు చేస్తోంది.

మనం చేసుకునే ఎంపికలు మన భవితవ్యాన్ని మారుస్తాయని బైబిలు స్పష్టంగా చూపిస్తోంది. ఉదాహరణకు, దేవుడు తప్పిదస్థులను ఇలా కోరుతున్నాడు: ‘నేను మీకు ఏ బాధయు కలుగజేయకుండునట్లు మీరందరు మీ చెడ్డమార్గమును మీ దుష్టక్రియలను విడిచిపెట్టి తిరుగుడి.’ (యిర్మీయా 25:​4-6) దేవుడు ప్రతీ వ్యక్తి భవితవ్యాన్ని ముందే నిర్ణయించేవుంటే, ఆయన ఇలా కోరడం అర్థరహితం అవుతుంది. అంతేకాదు, దేవుని వాక్యం ఇలా చెబుతోంది: “ప్రభువు సముఖమునుండి విశ్రాంతికాలములు వచ్చునట్లును . . . మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారుమనస్సునొంది తిరుగుడి.” (అపొస్తలుల కార్యములు 3:​19, 20) ఒకవేళ ప్రజలు తమ భవితవ్యాన్ని ఏ మాత్రం మార్చుకోలేరని యెహోవాకు ముందే తెలిసి ఉంటే, ఆయన వారిని మారుమనస్సు పొంది తిరుగుడి అని ఎందుకు కోరతాడు?

లేఖనాలు, పరలోకంలో యేసుక్రీస్తుతోపాటు రాజులుగా పరిపాలించడానికి దేవుడు పిలిచిన కొందరి గురించి చెబుతున్నాయి. (మత్తయి 22:​14; లూకా 12:​32) కానీ, అంతం వరకు సహించకపోతే వారు ఆ ప్రత్యేక అవకాశాన్ని కోల్పోతారని బైబిలు చెబుతోంది. (ప్రకటన 2:​10) వారు ఎంపిక చేసుకోబడరని దేవుడు ముందే నిర్ణయించివుంటే, ఆయన వారిని ఎందుకు ఆహ్వానిస్తాడు? అపొస్తలుడైన పౌలు తన తోటి విశ్వాసులకు వ్రాసిన మాటలను కూడా పరిశీలించండి. ఆయన ఇలా వ్రాశాడు: “మనము సత్యమునుగూర్చి అనుభవజ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినయెడల పాపములకు బలి యికను ఉండదు.” (హెబ్రీయులు 10:​26) దేవుడు వారి భవితవ్యాన్ని ముందే నిర్ణయించివుంటే, అలాంటి హెచ్చరిక విలువ లేనిదిగా ఉంటుంది. అయితే యేసుక్రీస్తుతో పరిపాలించేందుకు దేవుడు కనీసం కొందరినైనా ముందుగా నిర్ణయించుకోలేదా?

ముందుగా నిర్ణయించుకున్నది​—⁠ఆయా వ్యక్తులనా లేక ఒక గుంపునా?

“ఆయన [దేవుడు] క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను. ఎట్లనగా . . . యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, . . . జగత్తు పునాది వేయబడకమునుపే, . . . మనలను ఏర్పరచుకొనెను.” (ఎఫెసీయులు 1:​3-5) దేవుడు ముందుగా నిర్ణయించుకున్నది ఏమిటి, “జగత్తు పునాది వేయబడకమునుపే” ఎంపిక చేసుకోవడం అంటే ఏమిటి?

ఈ వృత్తాంతం, పరలోకంలో క్రీస్తుతో పరిపాలించేందుకు, మొదటి మానవుడైన ఆదాము సంతానంలోని కొందరిని దేవుడు ఎంపిక చేసుకున్నాడని చెబుతోంది. (రోమీయులు 8:​14-17, 28-30; ప్రకటన 5:​9, 10) అయితే, వారు పుట్టడానికి వేల సంవత్సరాల ముందే ఆ ప్రత్యేక అవకాశం ఎవరెవరు పొందాలో యెహోవా దేవుడు నిర్ణయించుకున్నాడు అనే తలంపు, మానవులకు ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంది అనే వాస్తవానికి విరుద్ధంగా ఉంటుంది. దేవుడు నిర్ణయించుకున్నది ఒక గుంపును లేదా ఒక తరగతి ప్రజలనే కానీ, ఆయా వ్యక్తులను కాదు.

ఉదాహరణకు, ఒక ప్రభుత్వం ఒకానొక సేవా సంస్థను స్థాపించాలని నిర్ణయించింది అనుకుందాం. ఆ సేవా సంస్థ చేయవలసిన పనులను, దానికి ఉండే అధికారాలను, దాని పరిమాణాన్ని ఆ ప్రభుత్వం ముందే నిర్ధారిస్తుంది. ఆ తర్వాత కొన్నాళ్ళకు ఆ సేవా సంస్థ పని చేయడం ప్రారంభిస్తుంది, అప్పుడు దాని సభ్యులు ఇలా ఒక ప్రకటనను జారీ చేస్తారు: “మేము చేయవలసిన పనేమిటో ప్రభుత్వం కొన్ని సంవత్సరాల క్రితమే నిర్ణయించింది. ఇప్పుడు మాకు అప్పగించిన పనిని మేము ఆరంభించాం.” ఆ సేవా సంస్థలో ఎవరెవరు ఉండాలో ఆ ప్రభుత్వం కొన్ని సంవత్సరాల క్రితమే నిర్ధారించి ఉండవచ్చని మీరు అనుకుంటారా? ఎంతమాత్రం అలా అనుకోరు. అదే విధంగా, ఆదాము పాపపు పరిణామాలను చక్కదిద్దడానికి ఒక ప్రత్యేక సేవా వ్యవస్థను స్థాపించాలని యెహోవా ముందుగా నిర్ణయించాడు. ఆ సేవా వ్యవస్థలో ఎలాంటి వారు పని చేయాలో ఆయన ముందుగా నిర్ణయించాడే తప్ప ఎవరెవరు పని చేయాలో ముందుగా నిర్ణయించలేదు. వారి ఎంపిక తరువాత జరుగుతుంది, వారు తమ జీవితంలో చేసుకునే ఎంపికలను బట్టి వారు చివరకు ఆమోదం పొందుతారా లేదా అన్నది ఆధారపడి ఉంటుంది.

అపొస్తలుడైన పౌలు, “జగత్తు పునాది వేయబడకమునుపే . . . [దేవుడు] మనలను ఏర్పరచుకొనెను” అన్నప్పుడు ఆయన మనస్సులో ఏ జగత్తు ఉంది? ఇక్కడ పౌలు సూచిస్తున్నది, దేవుడు ఆదాము హవ్వలను సృష్టించడంతో ప్రారంభమైన జగత్తును కాదు. ఆ జగత్తు “చాలమంచిగా” ఉంది. అందులో పాపం, దుష్ప్రవర్తన ఏ మాత్రం లేవు. (ఆదికాండము 1:​31) దానికి పాపం నుండి “విమోచన” అవసరం లేదు.​—⁠ఎఫెసీయులు 1:⁠7.

పౌలు చెప్పిన ఆ జగత్తు ఏదెను తోటలో ఆదాము, హవ్వలు తిరుగుబాటు చేసిన తర్వాత ఉనికిలోకి వచ్చింది. అది దేవుడు మొట్టమొదట సంకల్పించిన జగత్తుకు పూర్తి భిన్నమైన జగత్తు. అది ఆదాము, హవ్వల పిల్లలతో ఆరంభమైన జగత్తు. ఆ జగత్తులో దేవునికి దూరమై పాపానికీ, దుష్ప్రవర్తనకూ బానిసలుగా మారిన ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలు విమోచింపదగినవారు, వారు ఇష్టపూర్వకంగా పాపం చేసిన ఆదాము, హవ్వల వంటివారు కాదు.​—⁠రోమీయులు 5:​12; 8:​18-21.

ఏదెనులో జరిగిన తిరుగుబాటు కారణంగా ఏర్పడిన పరిస్థితిని యెహోవా దేవుడు తక్షణమే పరిష్కరించగలిగాడు. ఆ అవసరం తలెత్తిన వెంటనే, ఆదాము పాపం నుండి మానవజాతిని విమోచించడానికి సంబంధించి ఒక ప్రత్యేక సేవా వ్యవస్థను అంటే యేసుక్రీస్తు ఆధ్వర్యంలోని మెస్సీయ రాజ్యాన్ని ఉపయోగించాలని ఆయన ముందుగానే నిర్ధారించాడు. (మత్తయి 6:​9, 10) విమోచింపదగిన మానవుల “జగత్తు పునాది వేయబడకమునుపే” అంటే తిరుగుబాటుదారులైన ఆదాము, హవ్వలకు సంతానం కలగకముందే దేవుడు ఆ రాజ్యాన్ని నిర్ధారించాడు.

తాము చేయాలనుకున్న కార్యాన్ని పూర్తి చేయడానికి సాధారణంగా మానవులకు ఒక ప్రణాళిక అవసరం అవుతుంది. అదే విధంగా దేవుని దగ్గర విశ్వానికి సంబంధించిన వివరణాత్మక ప్రణాళిక ఉందనీ, అందులోని ప్రతీ విషయాన్ని దేవుడు ముందే నిర్ణయించాడు అనే తలంపుకు విధి నిర్ణయం అనే సిద్ధాంతంతో ముడిపెట్టారు. “సంపూర్ణ వివరణ లేకుండా జరిగే ప్రతీ ఘటన, దేవుని సర్వశక్తికే విరుద్ధమని అనేకమంది తత్త్వవేత్తలకు అనిపిస్తున్నట్లుంది” అని రచయిత రాయ్‌ వెదర్‌ఫోర్డ్‌ వ్రాశాడు. అసలు దేవుడు ప్రతీ సంఘటనను ముందుగానే వివరంగా చెప్పాల్సిన అవసరం ఉందా?

అపారమైన శక్తీ సాటిలేని జ్ఞానమూ గల యెహోవా, తాను సృష్టించిన ప్రజలు స్వతంత్రంగా నిర్ణయించుకునే శక్తిని వినియోగించుకోవడం మూలంగా ఏర్పడే ఏ అత్యవసర లేక యాదృచ్ఛిక పరిస్థితినైనా విజయవంతంగా ఎదుర్కోగలడు. (యెషయా 40:​25, 26; రోమీయులు 11:​33) తక్షణమే, ఎలాంటి వివరణాత్మక ప్రణాళిక లేకుండానే ఆయన దానిని ఎదుర్కోగలడు. పరిమిత శక్తిసామర్థ్యాలున్న అపరిపూర్ణ మానవులకు అవసరమైనట్లుగా, సర్వశక్తిమంతుడైన దేవునికి, భూమ్మీది ప్రతి వ్యక్తి భవితవ్యాన్ని ముందుగా తెలిపే వివరణాత్మకమైన, నిర్దిష్టమైన ప్రణాళిక అవసరం లేదు. (సామెతలు 19:​21) అనేక బైబిలు అనువాదాలు ఎఫెసీయులు 3:⁠11లో, దేవుని దగ్గర ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉందని చెప్పడానికి బదులు, ఆయనకు ఒక “నిత్యసంకల్పము” ఉందని చెబుతున్నాయి.

మీ భవిష్యత్తును మీరు ప్రభావితం చేసుకునే విధానం

భూమి విషయంలో దేవునికి ఒక సంకల్పం ఉంది, ఆ సంకల్పం ముందే నిర్ధారించబడింది. ప్రకటన 21:​3,4 ఇలా చెబుతోంది: “ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను.” అవును, యెహోవా ప్రారంభంలో ఉద్దేశించినట్లే ఈ భూమి ఒక పరదైసుగా మారుతుంది. (ఆదికాండము 1:​27, 28) ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, మీరు అందులో ఉంటారా? మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయాల మీద అది ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే యెహోవా మీ భవితవ్యాన్ని ముందే నిర్ధారించలేదు.

దేవుని కుమారుడైన యేసుక్రీస్తు విమోచన క్రయధన బలి, ఆయనను విశ్వసించేవారు ఎవరైనా నిత్యజీవం పొందేలా సాధ్యం చేస్తోంది. (యోహాను 3:​16, 17; అపొస్తలుల కార్యములు 10:​34, 35) “కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు” అని బైబిలు చెబుతోంది. (యోహాను 3:​36) మీరు బైబిలు నుండి దేవుని గురించీ ఆయన కుమారుని గురించీ ఆయన చిత్తం గురించీ తెలుసుకొని, తెలుసుకున్నవాటిని పాటించడం ద్వారా జీవాన్ని ఎంపిక చేసుకోవచ్చు. దేవుని వాక్యంలోని సత్య జ్ఞానం ప్రకారం ప్రవర్తించే వ్యక్తి “సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును” అన్న హామీతో ఉండవచ్చు.​—⁠సామెతలు 1:​20, 33.

[5వ పేజీలోని చిత్రాలు]

మానవులకు తమ క్రియల విషయంలో నైతిక బాధ్యత ఉంది, జంతువులకు లేదు

[చిత్రసౌజన్యం]

గరుడపక్షి: ఫోటో: Cortesía de GREFA